ఆమని-15

0
2

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 15వ భాగం. [/box]

[dropcap]”ష్యూ[/dropcap]ర్” అంటూ నవ్వాడు మహంతి. “మన కబుర్లతో, మన ప్రాజెక్టుల వివరాలతో సుమబాలగారికి బోర్ కొట్టేస్తది. అందుకని మా ఏజన్సీ వివరాలు కొద్దిగా చెప్తాను. మాకు కొంత ప్రాంతంలో దట్టమైన కారడువులు వుంటే, మరికొంత ప్రాంతంలో మెత్తని కలపనిచ్చే చెట్లున్నాయి. గిరిజనులు చేసే పోడు వ్యవసాయంలో పసుపు, అల్లం, అనాస వంటివి పండిస్తారు సుమబాల గారూ. వీళ్ళ మండలాల పేర్లూ, వీళ్ళు పిలుచుకునే నెలల పేర్లు వినడానికి చాలా గమ్మత్తుగా వుంటాయి. మీ వైపు నెక్కువ చిట్టడవులు వుంటాయి. మాకేమో కారడవులు ఎక్కువ. మా మన్యం ప్రాంతం వాళ్ళ పొడుపు కథలు వినసొంపుగా వుంటాయి” అని చెప్తుండగా రంజిత తిరిగి వచ్చింది.

“ఏంటన్నయ్యా అడవుల నొదిలేసి పొడుపు కథల దగ్గరకొచ్చావు? ఇదివరకటి రోజుల్లో లాగానే పుస్తకాల పురుగ్గా వుంటున్నావా? సరే, ఆ పొడుపు కథేదో వేయి. జవాబు చెప్పేసి బయలుదేరుదాం” అంది.

“అడవికి ఆటగాడెవరో చెప్పుకో చూద్దాం! చేనుకు చేటుగాడేవరో కూడా చెప్పుకోవాలి. ముచ్చటగా మూడోది మేడ మీద రాచపాప ఎవరో కనుక్కోవాలి. బస్. అంతే”

“ఆగాగన్నయ్యా… ఓ చెప్పుకుంటూ పోతున్నావు.”

“అడవికి ఆటగాడు నెమలి” అన్నది స్నేహలత.

“కరెక్ట్. వాళ్ళు నెమలిని అలాగే పిలుస్తారు” అన్నాడు మహంతి.

“చేనుకు చేటుగాడంటే పంటల్ని కొట్టేసే జంతువయ్యుంటుంది” అన్నారు.

“ఇదీ కరెక్టే. కుందేలను వాళ్ళలా పిలుచుకుంటారు. ఇంక మూడోది మేడ మీద రాచపాప ఎవరో కనుక్కోవాలి.”

“చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలాగా ఈ మేడ మీద రాచపాప అంటే ఏ చెట్టుకొమ్మ మీద వున్న పిట్టనో అలా అంటారు” అన్నది సుమబాల.

“అవునవును. మైనా పిట్టను అలా పిలుచుకుంటారు.”

“ఎంత పూర్వ విద్యార్థులమైనా మరీ ఇలాంటి ప్రశ్నలా అన్నాయ్యా వేసేది? మమ్మల్ని మరీ చిన్న పిల్లల్ని చేస్తున్నావు!”

“మనసుకి కాస్త మార్పూ, సరదా వుండాలి గదా రంజితా! సరే, మా గిరిజన ప్రాంతం గురించి రెండు ముక్కలు చెప్పి వదిలేస్తాను. గిరిజన ప్రాంతాలలో ‘శక్తి’ అనే స్వచ్ఛంద సంస్థ, గిరిజనాభివృద్ధి సంస్థతో కలిసి బాగా పని చేస్తుంది. అటవీ హక్కుల చట్టం అమలుకు కూడా కృషి చేస్తున్నది. వారికి నా సలహాలు, సహకారాలు కూడా బాగా అందిస్తున్నాను. ఈ సంస్థే ప్రచురించిన చెంచుల పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. అప్పుడప్పుడూ  నేనూ బాత్‌రూమ్ సాంగ్స్‌గా వాటిని హమ్ చేస్తూ వుంటాను.”

“బాగా పాడతావుగా అన్నయ్యా. ఒక చరణం పాడి వినిపించు.”

అనటం ఆలస్యం ఎత్తుకున్నాడు.

“రే రేల రేల రేరేల… అల్లూరి నడిచిన నేల గోగి పువ్వా… వీరులదీ గడ్డ గోగి పువ్వా” అని పాడి ఆపాడు. సుమబాలా, స్నేహలతా చిన్నగా చప్పట్లు కొట్టారు.

ఈ ఐఎఎస్ ఆఫీసర్‌లో ఎంత భావుకత్వం దాగి వుంది అనిపించింది స్నేహలతకు.

“మా ఏరియాలో కోయవాళ్ళ పెళ్ళి విషయాలు గమ్మత్తుగా వుంటాయి. నేను దగ్గర్నుంచి చూశాను. నీ పెళ్ళికి బావగారికి బోలెడు కట్న కానుకలు గుమ్మరించి ఆడంబరంగా చేయాల్సి వచ్చింది, రంజితా! వీళ్ళైతే ఎంత సింపుల్‌గా చేసుకుంటారో తెలుసా! పెళ్ళికూతురు తండ్రికి పెళ్ళికొడుకు పన్నెండు రూపాయలు తనే ఇస్తాడు. వాటిల్లో మామగారు మూడు రూపాయలూ, అత్తగారు అయిదు రూపాయలు తీసుకుంటారు. పెళ్ళి కుమార్తెకు రెండు రూపాయలు ఇచ్చి, ఆమె అమ్మమ్మకూ రెండు రూపాయలు ఇస్తారు. అంటే పెండ్లికూతుర్ని ఇంతకాలం పెంచి తనకప్పగించినందుకు కృతజ్ఞత అన్నమాట.”

ఆ మాటలకు అందరూ నవ్వారు.

“అడవినీ, అడవిలోని జనాన్నీ, వాళ్ళ ఆచార వ్యవహారాల్ని పరిశీలిస్తూ ఏమైనా థీసిస్ రాస్తున్నారా ఏమిటీ?” అన్నది సుమబాల.

“థీసిస్సే రాయనక్కర్లేదు. అన్నయ్య ఆల్‌రౌండర్ సుమబాలా. ఆ బుద్ధి కంప్యూటర్ కంటే ఫాస్ట్‌గా వుంటుంది. మనకు వినే ఓపిక వుండాలే గాని ఆవగింజ నుండి అంతరిక్షం వరకూ అన్నీ నూరిపోస్తాడు.”

టైమే తెలియకుండా ఎంత హాయిగా మాట్లాడాడనిపించింది ముగ్గురికీ.

ఆడిటోరియం నుంచి బయటకు వస్తుంటే పాత స్మృతులని గుర్తుకు తెచ్చుకుంటూ, పాత మిత్రుల్ని కలుసుకున్న సంతోషం ఒక వైపున వున్నది, తమ తమ గురువుల సందేశాలు, ఆశీస్సులూ అందుకున్న తృప్తీ మరొక వైపున వున్నది. వీటికి తోడు మహంతి లాంటి మంచి మనిషితో కాసేపు గడిపే అవకాశమూ కలిగింది. అతను చాలా నిష్కల్మషమైన మనిషని అనిపించింది సుమబాలకు, స్నేహలతకూ. అటు ఆత్మీయ సమ్మేళనం, ఇటు మహంతితో పరిచయం రెండూ ఆనందాన్నే కలిగించాయి.

“రేపుదయం వరకూ మీకు ఫ్లయిట్ లేదు. ఈ రాత్రికి నా ఆతిథ్యం తీసుకోండి స్నేహలతా. రంజిత కూడా ఎలాగూ ఈ రాత్రి కుంటున్నది” అన్నాడు మహంతి.

“లేదు, లేదు సర్. దసపల్లాలో రూమ్ తీసుకున్నాంగా. ఈ రాత్రి కక్కడే రెస్ట్ తీసుకుంటాం. హోటల్ దగ్గర డ్రాప్ చెయ్యండి చాలు.”

అలాగేనంటూ వాళ్ళను హోటల్ దగ్గర దింపేసి మహంతీ, రంజితా వెళ్ళిపోయారు.

***

ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయారు. ఒకరోజు రంజిత ఫోన్ చేసింది “ఏం చేస్తున్నావు?” అంటూ.

కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక, “స్నేహలతా! నేను నీకొక సంబంధం చూశాను. కులమతాల పట్టింపులు నీకుంటాయని నేననుకోను. నేను చెప్పేదానికి నీవొప్పుకోవాలి. కావాలంటే సుమబాలా, నేనూ, మీ అమ్మా నాన్నగారితో మాట్లాడతాం” అంటూ మొదలెట్టింది.

“కొంచెం స్పీడ్ తగ్గించు రంజితా. కులమతాల పట్టింపులు నాకెప్పుడూ వుండవు. కాని ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? నన్ను కొంచెం ఆలోచించుకోనీ.”

“ఎంత టైమ్ కావాలి?”

“కొంచెం టైమివ్వు. ఆలోచించి చెప్తాను.”

“ఇంతకీ పెళ్ళి కొడుకు ఎవరని అడగవా?”

“పెళ్ళి చేసుకోవాలని నిర్ణయానికొచ్చినప్పుడు ఎవరతను, ఏం చేస్తాడు? ఎలాంటి వాడు అని అప్పుడడుగుతాను. సరేనా. వుంటా” అంటూ ఫోన్ పెట్టేయబోయింది.

“ఆగాగు. ఫోన్ పెట్టేయ్యకు. ఇంకా మీనమేషాలు లెక్కించే వయసు కాదు నీది. త్వరగా ఆలోచించి స్టెప్ తీసుకో.”

“తప్పకుండా, నీ సలహా పాటిస్తాను. వుంటా. బై” అంటూ ఫోన్ పెట్టేసింది.

***

కిషోర్, సౌందర్య ఎలా వున్నారో? తను మాట్లాడి చాలా రోజులైంది అనుకుంటూ, సౌందర్యకు ఫోన్ చేసింది.

“అమ్మయ్యా, మీరే చేశారా! నేనే తప్పకుండా ఫోన్ చేయ్యాలి ఈ రోజైనా అనుకుంటున్నాను. నిన్ననే హైదరాబాదు నుంచి వచ్చాను. నాకు కీమో, రేడియేషన్ ఇవ్వటం పూర్తయ్యింది. ఆ తర్వాత రెండుసార్లుగా టెస్ట్ చేసి చూసారు. ‘కేన్సర్ కణాలేమీ మిగల్లేదు, మీరు పూర్తిగా సేఫ్’ అని చెప్పారు డాక్టర్లు. ఎంత సంతోషంగా వుందో చెప్పలేను. మీరు కలిసిన వేళా విశేషం స్నేహలత గారూ. నాకెంత ధైర్యం చెప్పారు? ఎన్ని జాగ్రత్తలు చెప్పారు? నిజంగా మనం క్రిందటి జన్మలో ఒక తల్లి కడుపున పుట్టి వుంటాం. నాకంటే బావ ఇంకా సంతోషపడుతున్నాడు. ఎప్పుడైనా మీ ప్రస్తావన వస్తే ‘స్నేహలత నిజంగా దేవత’ అంటాడు. ఈసారి మీరు తప్పకుండా బెంగళూరు రావల్సిందే. ఎప్పుడొస్తారు చెప్పండి” అంది సౌందర్య.

“నిజంగా ఎంత మంచి వార్త చెప్పారు సౌందర్యా! ఈ వార్త కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మీకు పూర్తిగా నయమవుతుందన్న నమ్మకం నాకున్నది. ఆ నమ్మకమే గెలిచింది. ఎంత ఒత్తిడి పనిలో ఉన్నా అప్పుడప్పుడూ మీ వాడిపోయిన ముఖమే గుర్తుకొచ్చేది. మిమ్మల్ని ఎప్పుడు మామూలుగా చూస్తానా అని చాలా ఆరాటపడ్డాను. ఇంకెవరికీ ఏ భయమూ వుండదు. కిషోర్‌కి కూడా కంగ్రాట్స్ చెప్తాను. కేన్సర్‌తో ధైర్యంగా పోరాడి గెలిచారు సౌందర్యా. మిమ్మల్ని అభినందిస్తున్నాను. నిజంగా మీ ధైర్యం, డాక్టర్ల చికిత్సా కలిసి మిమ్మల్ని గెలిపించాయి. పిల్లలతో ఇక హ్యాపీగా వుండండి” అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహలత.

కిషోర్‌కి చేసింది. “కంగ్రాట్స్ కిషోర్! మనసులో ఏ మూలనన్నా కొంచెం అలజడి వుంటే దాన్నీ తీసేయండి. ఇంక సౌందర్యతో, పిల్లలతో హ్యాపీగా వుండండి. ఈ పెద్ద వయసులో మీ పేరెంట్స్‌కూ, సౌందర్య గారి పేరెంట్స్‌కూ బాగా మనశ్శాంతిగా వుండి వుంటుంది. నాకు మాత్రం చాలా సంతోషంగా వున్నది” అంది.

“నిజంగా నీది పసిపిల్లల మనస్తత్వం స్నేహలతా. ఏ కల్మషం లేకుండా వుంటావు. అది నీకే సాధ్యం. నీకన్యాం చేసి, నీ జీవితంలో సంతోషం లేకుండా చేసినవాడినని శపించాలి గాని, ఇలా క్షమించేసి, మమ్మల్నందరినీ హ్యాపీగా వుండమని చెప్తున్నావు. ఇలా ఎలా వుండగలుగుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. మనసు మార్చుకుని ఇప్పటికైనా నీకు తగినవాణ్ణి చేసుకో. అప్పడే నాకు నిజంగా సంతోషం కలుగుతుంది. నీవు గుర్తొచ్చినప్పుడల్లా నేనెంత క్షోభ పడుతున్నానో తెలుసా? మాటల్లో ఎలా చెప్పమంటావు? సౌందర్య సేవ్ అయిందన్న వార్త సంతోషం కలిగించినా, నీ విషయం అంతకన్నా బాధ పెడుతున్నది. ప్లీజ్! స్నేహలతా ఆలోచించు…” అన్నాడు కిషోర్.

“తప్పకుండా అలోచిస్తాను. నా మనసిప్పుడు చాలా సంతోషంగా వున్నది. ఎవరి మీదా ఏ కోపతాపాలు లేవు. ఎవరికీ శాపాలు పెట్టను. నా గురించి నేను ఆలోచించేదాని కంటే అమ్మానాన్నలతో సహా మిగతావాళ్ళే నన్ను గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పిల్లలు బావున్నారుగా, వుంటాను. బై” అంటూ ఫోన్ పెట్టేసింది

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here