ఆమని-16

0
2

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 16వ భాగం. [/box]

[dropcap]వ్య[/dropcap]వసాయ శాస్త్రవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు అందించిన సమాచారం అన్ని డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్లకు చేరింది. ఆయా డివిజన్లలోని గిరిజనులందరికీ శిక్షణ ఇవ్వటమూ పూర్తయింది. ఎంపిక జేసిన ఔషధ మొక్కల విత్తనాలతో సహా కావలసినవన్నీ అన్ని డివిజన్‌లకూ చేరిపోయాయి. ఉత్పత్తుల ఫలితాలు కొద్ది మాసాల్లో కొన్ని, కొద్ది సంవత్సరాలలో కొన్ని లభిస్తాయి. అనుకున్న లక్ష్యం చేరుకునేటప్పటికి స్నేహలతకు సంతృప్తిగా వున్నది.

చెఱువుజుమ్మలపాలెంలో విలువిద్య నేర్చుకునే కుర్రవాడి విషయం ఆరా తీసింది. ఆ ఏరియా ఎం.ఎస్.డి.వో. ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. “స్కూల్ విద్యార్థులకు నిర్వహించే ఈవెంట్స్‌లో ఈ కన్నప్పను కూడా చేర్చుకుని పోటీ నిర్వహిస్తారట. గెలుపొందితే ‘గాండీవం’ కార్యక్రమం ద్వారా నాగార్జున యూనివర్సిటీలో అర్హత పొందిన క్రీడాకారుల చేత శిక్షణ ఇప్పిస్తారట. వీరిని 2020లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సిద్ధం చేయటం జరుగుతోంది” అని చెప్పారు. “మన రాష్ట్రం తరఫున వీరు గనక ఎన్నికయితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తారు” అని ఆ ఎం.ఎస్.డి.వో. వివరంగా చెప్పారు.

కన్నప్ప శిక్షణ పొందడానికి ఒక దారి ఏర్పడిందని తెలిసి సంతోషించింది స్నేహలత. అవసరం పడితే తన డిపార్ట్‌మెంట్‌ను కూడా గిరిజనాభివృద్ధి శిక్షణా కార్యక్రమం క్రింద కొంత నిధిని కేటాయించాలని నిర్ణయించుకున్నది.

***

వీలు దొరికినప్పుడల్లా కుంజలత ఝార్ఖండ్ ఐ.జి. అశోక్ గురించి ప్రస్తావిస్తునే వున్నది. తండ్రి కూడా హెచ్చరిస్తే కొన్ని వారాల గడువడిగింది స్నేహలత.

కొద్ది వారాల గడువూ పూర్తయ్యింది. ఈలోగా రంజిత మరలా ఫోన్ చేసింది.

“ఏమాలోచించావు? నువ్వేమో తాబేలు నడకలు నడుస్తూ అడుగులు లెక్కపెట్టుకుంటున్నావు. అంత డిగ్నిఫైడ్‌గా వుండే మా అన్నయ్య చిన్నపిల్లవాడిలాగా ‘స్నేహలత ఏమాలోచిస్తారో? మరల ఒకసారి కదిలించి చూడు’ అంటుంతే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత లేటు వయసులో అన్నయ్య ఇంత ఘాటు ప్రేమలో పడ్డాడేమిటాని ఒకటే యాంగ్జైటీగా వున్నది. మీరిద్దరూ కనక పెళ్ళి చేసుకుంటే ఇద్దరికిద్దరు అదృష్టవంతులవుతారు” అంటూ అట్నుంచి స్నేహలత ఏం చెప్తుందో విన్పించుకోకుండా తన ధోరణిలో తాను మాట్లాడుతూ పోతున్నది రంజిత.

“ప్లీజ్ స్టాపిట్ రంజితా. ఏంటి నువ్వు చెప్పేది? మహంతి గారి గురించా?”

“మరింకెవరనుకున్నావు పెళ్ళికొడుకంటే? నేను చెప్పేది అతిశయోక్తి ఏ మాత్రం కాదు. తను నిన్నెంత కావాలనుకుంటున్నాడో? అలా మనల్ని కావాలనుకునేవాళ్ళు దొరకటం ఎంత అదృష్టం? అలాంటి వాళ్ళను మనం చేపట్టగలిగితే వాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. నా మాట కాదనవనే నమ్మకంతోనే వున్నాను. ఇందులో కాదనడానికి ఏం లేదు. మీరిద్దరికీ ఇద్దరు పెద్ద హోదాల్లో వున్నారు. కాని పెళ్ళి విషయం వచ్చేసరికి మాలాంటి వాళ్ళం తల దూర్చాల్సి వస్తుంది. ఉద్యోగ రీత్యా అన్నయ్యను చూస్తున్నావు. వ్యక్తిత్వరీత్యా అన్నయ్యకు వంక పెట్టడానికి లేదు. అంత మంచివాళ్ళు, అంత సమర్థులు నూటికో కోటికో వుంటారు. అన్నయ్య నాకు ఆప్తుడు. నువ్వేమో నా క్లాస్‌మేట్‌వీ, ఫ్రెండువి. ఇంకా అన్నయ్య గురించి ఏ డౌట్స్ వున్నా అడుగు. నిన్ను గురించి అన్నయ్య ఒక్కమాట కూడా నన్నడగలేదు. నీ మీద తనంత నమ్మక మేర్పర్చుకున్నాడు. మేమంతా పెళ్ళి చేసుకుని, కాపురాలు చేసుకుంటూ పిల్లాపాపల్తో సుఖంగా వున్నాం. మీరిద్దరూ కూడా అలా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు సరేనంటే  నేనూ, సుమబాలా గుంటూరొస్తాం. మీ పేరెంట్స్‌తో  మాట్లాడతాం.”

“మహంతి గారిని మా అమ్మావాళ్ళు ఒక ఫంక్షన్‌లో చూశారు. నేనైతే మూడు నాలుగు సార్లు దగ్గర నుండి చూసి మాట్లాడాను. మంచి రెస్పెక్టబుల్ పర్సన్, మంచి మనసునున్న మనిషీ అనిపించింది. పైగా మీ అన్నయ్య తరఫున బాగా వకాల్తా పుచ్చుకున్నావు. వాళ్ళమ్మ గారి ఫోన్ నెంబరివ్వు. అమ్మా, నాన్నా మాట్లాడుతారు” అన్నది స్నేహలత చిన్నగా.

“అమ్మయ్య, ఇప్పటికి దారిలో కొచ్చావా పెళ్ళికూతురా? చాలా సంతోషం లతమ్మా తల్లీ. నా మాటలకు విలువిచ్చినందుకు చాలా థాంక్స్. ఒక్కసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు. క్లుప్తంగా విషయం చెప్తాను.”

‘నీ మాటలే కాదు. మహంతిగారి వ్యక్తిత్వానికి ముచ్చటేసింది. నేను కావాలనుకున్న చాలా లక్షణాలు ఆయనలో కనబడ్డాయి. అందుకే మొగ్గు చూపాను. కిషోర్ తర్వాత మళ్ళీ మహంతి గారి వ్యక్తిత్వమే నన్నాకట్టుకున్నది. కాని వెనుకటి అనుభవంతో బయటపడటానికి సంకోచించాను. ఇంతలో నీవే ఆ ప్రపోజల్ తెచ్చావు. రంజితా, థాంక్యూ. ఈ విషయాలన్నీ త్వరలో నీకు చెప్తాను’ అనుకుంటూ ఫోన్ తన తండ్రికి ఇచ్చింది. “నా ఫ్రెండ్ నాన్నా, బరంపురంలో వుంటుంది. మీతో మాట్లాడుతుందట..” అంది.

మాజీ వి.సి.గారు ఫోన్ తీసుకుని ‘హలో’ అన్నారు.

“నేను స్నేహలతకు యమ్మెస్సీ క్లాస్‌మేట్‌ను, ఫ్రెండ్‌ను కూడానండీ. నా పేరు రంజిత. బరంపురం యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. విశాఖ ఏజన్సీలో పనిచేసే మహంతి నాకు కజినే. ఏదో ఫంక్షన్‌లో మీరంతా తనని చూశారని స్నేహలత అంటున్నది. అన్నయ్య స్నేహలతను బాగా ఇష్టపడుతున్నాడు. పెళ్ళి కూడా వెంటనే చేసుకుంటానంటున్నాడు. కుటుంబ బాధ్యతల మూలంగా తన పెళ్ళిని వాయిదా వేసుకున్నాడు. అన్నయ్యను గురించి ఎంత చెప్పినా తక్కువే. తనేంటో స్నేహలతకు తెలుసు. తనిష్టపడింది. వాళ్ళ ఫోన్ నెంబరిస్తే వాళ్ళతో మీరు మాట్లాడతారని అంటున్నది. నెంబరు ఇవ్వమంటరా?” అన్నది.

తను వింటున్నది కలో నిజమో ముందు ఆయనకు అర్థం కాలేదు. ఇంత హఠాత్తుగా ఈ విషయం, అందునా స్నేహలత పెళ్ళి ప్రస్తావన, తనంత తాను ఒప్పుకుని నాకు నెంబరివ్వమన్నదా! ఆనందాతిరేకంతో గభాల్న ఆయనకు నోట మాట రాలేదు. తర్వాత గొంతు పెగుల్చుకున్నాడు.

“అమ్మా! రంజితా! నువ్వు మాట్లాడే మాటలు నా చెవుల్లో అమృతం పోసినట్లుగా వున్నాయి. ఇన్ని రోజుల తర్వాత నువ్వైనా మా అమ్మాయిని ఒప్పించగలిగావు. చాలా సంతోషం తల్లీ! ఈ రోజు కోసమే వాళ్ళమ్మా, నేనూ ఎదురుచూస్తున్నాం. స్నేహలతకి ఇష్టమైతే మాదేం లేదు. మహంతిగారు నాకు బాగా గుర్తున్నారు. చక్కని హుందా అయిన ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. అలాగే ఫోన్ నెంబరివ్వమ్మా. అమ్మాయితోనూ, వాళ్ళమ్మతోను సంప్రదించి వెంటనే ఫోన్ చేస్తాను” అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.

కాని కుంజలత మాత్రం ససేమిరా అన్నది. “మన కులం కాదు, మన సంప్రదాయం కాదు. మన రాష్ట్రం కాదు. అంతగా ఏముంది ఆ మహంతిలో? రెండో పెళ్ళి అన్న మాటే కానీ అశోక్‌కు ఏమంత వయసు మీరలేదు. మన ఏరియాలోనే ఐజిగా పని చేస్తున్నాదు. అతనికయితేనే, బాగుంటుంది” అంటూ పేచీకి దిగింది.

“ఊరికే మొండి పట్టు పట్టకు. ఇన్నాళ్ళకు అమ్మాయి మనసు మార్చుకున్నది. సంతోషంగా, ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సింది పోయి ‘కులం గాదు, మన వాళ్ళు కాదు’ అంటూ వంకలు పెట్టకు” అంటూ మందలించారు.

కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పారు.

“అక్క పెళ్ళి చేసుకోవడమే కావలసింది. పైగా అతను ఐ.ఎ.ఎస్. కాడర్‌కి చెందిన మనిషి. అక్కతో సమాన హోదాతో పని చేస్తున్నాడు. మేం చెప్పామనీ, మన వాదనీ ఐజీ అనీ అశోక్‌గారిని ఒప్పుకోవాల్సిన పని లేదు. అమ్మతో నేను మాట్లాడి ఒప్పిస్తాను” అంటూ ఫోన్ చేసి తల్లికి నచ్చజెప్పాడు.

చివరకు ఆమె రాజీ పడింది.

మహంతి తల్లితో మాట్లాడారు. కొడుకు ఇష్టమే తన ఇష్టమన్నది. “కొడుకు మెచ్చినామె తప్పకుండా మా ఇంటి మహాలక్ష్మి అవుతుందని నాకు గట్టి నమ్మకం” అన్నారావిడ.

సుమబాల సంతోషపడుతూ రంజితకు ఫోన్ చేసింది. “పూర్వ విద్యార్థుల సమ్మేళనం మన స్నేహలత పెళ్ళి కోసమే జరిగినట్లుంది రంజితా” అన్నది

***

ఫోన్ రింగయ్యింది. ఎవరిదో కొత్త నంబరు. ఫోన్ ఆన్ చేసి ‘హలో’ అన్నది స్నేహలత.

మహంతి మార్దవమైన గొంతు వినబడుతున్నది. “హలో స్నేహలతా! ఎలా ధన్యవాదాలు చెప్పాలి మీకు? మీ పెద్ద మనసును చూసి పొంగిపోతున్నాను నేను. నా అదృష్టాన్ని తలచుకుని మురిసిపోతున్నాను. ఎడారిలో వెళ్ళేవాడికి ఒయాసిస్సు కనబడిందని చెప్పనా? గ్రీష్మతాపంలో అల్లాడేవాడికి వేయి వింజామరలు వీచిన అనుభూతి కలిగిందని చెప్పనా? ఎన్ని చెప్పినా తక్కువే స్నేహలతా.”

“ఆగండాగండి. నేను ఒయాసిస్సును కాదు, వింజామరనూ కాదు. మనసులో మనసై మెలగటానికి, మన ఇరు జీవితాలను పెనవేయటానికి వచ్చే స్నేహలతను మాత్రమే” అన్నది.

“గాడ్ ఈజ్ గ్రేట్ స్నేహలతా! ఇది రెండు రాష్ట్రాల మధ్య కలిసే బంధుత్వం మూడో రాష్ట్రంలో ముడిపడింది. పీటల మీద కూర్చుని పెళ్ళీ చేసుకోవటానికి మనమేం చిన్నవాళ్ళం కాదు. రిజిస్టర్ మారేజ్ చేసుకుందాం.”

“నా మనసులోని మాటే మీరు చెప్పారు. తప్పకుండా అలాగే చేద్దాం.”

“ఇదే కదు స్నేహలతా, ఇక ముందు కూడా మనిద్దరి అభిప్రాయాలు ఇలాగే కలిసిపోతాయని నాకు గట్టి నమ్మకమున్నది.”

“బాధ్యతాయుతంగా ప్రవర్తించే వారి మనస్సులూ, అభిప్రాయాలు ఒకే రకంగా వుంటాయి మహంతి గారూ!”

***

అభిమానుల సమక్షంలో స్నేహలతా, మహంతి లిరువురూ రిజిస్ట్రారు ఆఫీసులో దంపతులయ్యారు. ఆలస్యంగానైనా స్నేహలతా, మహంతుల జీవితాలలో అసలైన ‘ఆమని’ అరుదెంచిందని అందరూ ఎంతో సంతోషించారు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here