ఆమని-5

0
2

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 5వ భాగం. [/box]

[dropcap]”ను[/dropcap]వ్వలా దిగులు పడకే. నారు పోసినవాడు నీరు పొయ్యక మానతాడా! ఏదో ఒక దారి దొరుకుతుంది. వాళ్ళతో మామయ్యను మాట్లాడమందాం. కాస్త తక్కువ కట్నానికి వాళ్ళు ఒప్పుకునేటట్లు మామయ్య విషయాన్ని సరిజేయగలడు” అన్నది ఈశ్వరమ్మ.

“వాళ్ళనీ, వీళ్ళనీ బతిమాలడం ఎందుకు? ఒకటి రెండేళ్ళాగి మధుర పెళ్ళి చేద్దాం. అప్పటికి కిషోర్ ఉద్యోగం చేస్తూ వుంటాడు. ఖర్చులు సర్దుకుంటాడు. ఈ సంబంధం మనకొద్దని మీ అన్నయ్యతో చెప్పు.”

“అలా చెప్పటానికి మా అన్నయ్య ఇష్టపడతాడా? తన మాట పోతుందని గింజుకుంటాడు. పోనీ మా అన్నయ్య దగ్గర అప్పు చేద్దాం. మీరన్నట్లు కిషోర్ సంపాదించిన తర్వాత తీర్చుకుందాం.”

“వ్యవసాయ ఖర్చులకు బ్యాంక్‍లో పంట ఋణాలు తీసుకోవడం తప్పిస్తే బయట అప్పులు చేయడం నాకు అలవాటు లేదని నీకు తెలుసు. మీ అన్నయ్యని మాత్రం నేను అడగను. అప్పు తీసుకోను” అంటూ గట్టి పట్టు పట్టాడు ప్రకాశరావు.

“ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం పంట చేతికొచ్చిన తర్వాత మధుర పెళ్ళి చేద్దామంటున్నారన్నయ్యా మీ బావ.”

“వాళ్ళక్కట్నం కాస్త ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని బావ వెనుకాడుతున్నాడు. నాకర్థమయిందేలే” అన్నాడు లోకేశం.

“బావే కాదు, కిషోర్ కూడా అదే అంటున్నాడు. తన కుద్యోగం వచ్చిన తర్వాతనే పూనుకుని చేస్తానంటున్నాడన్నయ్యా.”

“అనుకున్నప్పుడల్లా మంచి సంబంధం దొరకద్దూ? బావతో నేను మాట్లాడతాను. రోట్లో తలకాయ పెట్టాక, రోకటిపోటుకు వెరుస్తానా?” అంటూ తనే నెక్కల్లు వచ్చాడు బావ దగ్గరకు.

“పెళ్ళి చేద్దామనుకున్నాకా వెనక్కి తగ్గటమేంటి బావా?” అనడిగాడు.

“ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా బావా? అవతలి వాళ్ళకు తగ్గట్టుగా మర్యాదలు చేసి పంపాలి. అడిగిన కట్నకానుకలిచ్చుకోవాలి. ఒక ఏడాది, రెండేళ్ళు ఆగితే కాస్త వెసులుబాటు వుంటుంది. అందుకే ఇప్పుడు వద్దంటున్నాను.”

“కాని మంచి సంబంధం. పిల్లవాడు గుణవంతుడు. స్థితిపరుల కుటుంబం. ఒక పని చేద్దాం. నీ పెళ్ళి జరిగినప్పుడు మా చెల్లెలికి పెద్దగా ఇవ్వలేకపొయ్యాం. రెండెకరాలు మాత్రమే యిచ్చి సరిపెట్టాడు మా నాన్న. నాకు బాగా కలిసి వచ్చిన తర్వాత ఈశ్వరమ్మకు మరో రెండెకరాలు ఇద్దామని నా మనసులో వున్నది. దాని తాలూకు పంటలూ విడిగా అట్టిపెట్టాను. మధుర పెళ్ళి నాటికి అవి అందజెయ్యాలని అనుకున్నాను. ఇందులో నువ్వు కాదనటానికీ ఏం లేదు. నా చెల్లెలి పసుపు కుంకుమల కింద నేనిచ్చుకునేది. నిరభ్యంతరంగా వాడుకోండి” అంటూ పని కాగల ఉపాయాన్ని చెప్పాడు. మధుర ముఖంలో వెలుగొచ్చింది.

***

“అన్నయ్యకు తన కూతుళ్ళెంతో, మధురా అంతే. అందుకే కట్నకానుకల్లో సగభాగం తనే భరించి, మధుర పెళ్ళి ఘనంగా జరిగేట్టు చూశాడు. మా అన్నయ్య తీరే అంత. ఆయన చలువ వల్లే నా కూతురుకు మంచి సంబంధం వచ్చింది. నా బిడ్డ సుఖపడిపోతుంది. ఈ రోజుల్లో ఎంతమంది మేనమామలు ఈ విధంగా పట్టించుకుంటున్నారు? మేనమామంటే తండ్రి తరువాత తండ్రి అంతటి వాడంటారు. ఆ మాట మా అన్నయ్య లాంటి వాళ్ళకు అక్షరాలా సరిపోతుంది” అంటూ కనిపించిన వాళ్ళందరి దగ్గరా, తన పుట్టింటిని పొగడ్తలతో ముంచెత్తి వేస్తున్నది ఈశ్వరమ్మ.

మేనమామ తన చుట్టూ ఉచ్చు మరింత బిగిస్తున్నాడంటూ కిషోర్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. తండ్రి కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు.

కిషోర్‍కు కర్నాటకలో పోస్టింగ్ వచ్చింది. వెళ్ళి జాయినయ్యాడు. రెండు నెలలు గడిచాయి. కొంచెం స్తిమితపడ్డాకా ఒక రోజు తండ్రికి ఫోన్ చేశాడు. తరచూ ఫోన్లు చేసుకుంటున్నా ఈ రోజు మాత్రం తన పెళ్ళి వివరాలు కనుక్కోవాలనే ఉద్దేశానికొచ్చాడు.

“ఇంటి దగ్గర సంగతులేంటి నాన్నా? అమ్మకూ, నీకూ ఆరోగ్యం బాగానే వుందిగా? మధురా వాళ్ళు ఎలా వున్నారు?”

“మేమంతా బాగానే వున్నాం. నువ్వు వేళకు తింటున్నావో లేదోనని మీ అమ్మ బెంగపెట్టుకుంటున్నది. మధుర కాపురం బాగానే వుంది. అల్లుడు కూడా ఫర్వాలేదు. మధురను బాగానే చూసుకుంటున్నాడు. ఈ లగ్నాలకే నీకూ సౌందర్యకూ పెళ్ళి చేయాలని మీ మేనమామ అంటున్నాడు. మీ అమ్మ గాల్లో తేలిపోతున్నది. మధుర పెళ్ళి దగ్గర నుంచి మధురకూ, సౌందర్యకూ మధ్య పరిచయం ఎక్కువయింది. ఫోన్ చేసి మధురను నీ విషయాలు, మా విషయాలు అన్నీ అడుగుతున్నదట. ‘సౌందర్య చాలా మంచిది. కిషోరన్నయ్య అదృష్టవంతుడ’ని మధుర చెప్తున్నది. సౌందర్యక్కూడా నీతో పెళ్ళి జరగటం బాగా ఇష్టంగానే వున్నదట.”

“ఈ రోజుల్లో మేనిరికాలు చేసుకోవటానికి డాక్టర్లు ఒప్పుకోవటం లేదు నాన్నా!”

“మీ మామయ్య అదీ చర్చకు తెచ్చాడు. మీలో ఎవరూ ఇంతకు ముందు మేనరికాలు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీ మేనల్లుడికి పిల్లనిచ్చి చేయవచ్చని ఆయనకూ ఎవరో పెద్ద డాక్టరే చెప్పాడట. నీవు శెలవు ఎప్పుడు పెట్టడానికి వీలవుతుందో ఆలోచించు. కొత్తగా చేరిన ఉద్యోగం. ఆలోచించుకుని మరీ శెలవు పెట్టు.”

“ఏ పెద్ద డాక్టరు చెప్పినా నా మనసుకు అంత ఇష్టంగా లేదు నాన్నా. నేను ఐ.ఎఫ్.ఎస్. పూర్తి చేశాననే ఒక్క కారణంతోనే మామయ్య మనింటి గడప తొక్కాడు, కూతుర్ని ఇంటి కోడల్ని చేస్తానంటూ. నేను మామూలు డిగ్రీయే చదివుంటే మామయ్య ఇలాగడిగేవాడా? వట్టి అవకాశవాది!”

“పోనీలే కిషోర్! గతం గతః అన్నారు. ఆయన తత్వమే అంత. నువ్వు చేసుకోబోయే సౌందర్య చాలా మంచిదనిపిస్తున్నది. మనక్కావలసింది ఆ అమ్మాయే.”

“ఆ అమ్మాయికే వేరే సంబంధం చూసుకోమని చెప్పాలని వుంది నాన్నా…” కిషోర్ మాటలు పూర్తి కాకుండానే, “ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు కిషోర్. ఇప్పుడు మనం సౌందర్యను కాదంటే అందరి దృష్టిలో ఏరు దాటి తెప్పతగలేసిన వాళ్ళమవుతాం. మీ అమ్మ మంచం పడుతుంది. ఈ పెళ్ళి ఆగదు కిషోర్. నీకు వేరే ఆలోచనలేమీ వద్దు. నా మాట విను.”

“అది కాదు నాన్నా. నా చదువు పూర్తి కాక ముందు అసలు మనమొకళ్ళము వున్నామన్న ఆలోచనే వాళ్ళకున్నట్లు లేదు. మేనమామ ప్రేమ, ఆప్యాయత మేమెరగం. ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న చూపు. లెఖ్ఖ లేనితనం. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా మనింటికొచ్చి పిల్లనిస్తామని చెప్పారు. ఒకప్పటి తిరస్కారాన్ని చిన్న చూపుని నేనేలా మర్చిపోతాను నాన్నా! నాకెప్పుడూ అవే  గుర్తుకొస్తాయి. ఇప్పుడు అల్లుడి హోదాలో వాళ్ళింటికెళ్ళి తెచ్చి పెట్టుకున్న మర్యాదలూ, గౌరవాలూ పొందడం అంత తేలికవుతుందా? హోదాని బట్టి, స్థితిని బట్టి స్వంత చెల్లెల్నీ, చెల్లిలి కుటుంబాన్ని ఇన్నాళ్ళు దూరం పెట్టిన మనుషులు నాన్నా వాళ్ళు. అలా ఉంచడం అత్తయ్య ఆలోచనైనా, మామయ్య ఆలోచనైనా నా మనసుకు ఇదేమీ నచ్చటం లేదు. నన్ను నేను సరిపెట్టుకోలేకపోతున్నాను. సౌందర్య కూడా అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లే. మీరేదో తను చాలా ఇష్టంగా ఉంది అని భ్రమ పడుతున్నారు.”

“ఒక్క మీ మామయ్య కుటుంబమనేముంది? లోకం తీరే అలాగుంటుంది. మధురకు మంచి సంబంధం చేయటం వలనా, నీకు పెద్ద ఉద్యోగం రావటం వలనా మన నెక్కల్లులో కూడా ఇది వరకటి కంటే, ఇప్పుడెక్కువగా మీ అమ్మనీ, నన్నూ తెగ గౌరవిస్తున్నారు. ఇలాంటి మనస్తత్వాలకు మీ అత్తయ్య, మామయ్యలేం అతీతులు కాదు. నా మాట విను. సౌందర్యనిమ్మని మనమేం అడగలేదు, తానే ఇంటికొచ్చి అడిగాడు. ఆయన తలచుకుంటే పెద్ద కూతురిలాగా, ఈ కూతుర్నీ ఏ అమెరికా వాడికో, ఆస్ట్రేలియా వాడికో ఇచ్చి చేసేవాడు. నిజంగా మేనల్లుడనే అభిమానంతోనే వచ్చాడనుకుందాం. మీ అమ్మకు పసుపు కుంకుమకంటూ ఇంకో రెండెకరాలూ, దాని తాలూకు పంటంతా ఇచ్చి మధుర పెళ్ళిలో ఆదుకుంటాడని మనమేమన్నా ఊహించామా ఏనాడైనా? కాలం గడిచే కొద్దీ ఎలాంటివారిలోనైనా మార్పు వస్తుంది కిషోర్. మీ మేనమామ అలా మారుతున్నాడనే అనుకుందాం. బాగా చదువుకున్నావు. ఉద్యోగాన్ని తెచ్చుకున్నావు. పెళ్ళి కూడా చేసుకుంటే మాకూ ఒక బాధ్యత తీరినట్లుంది. చూసి ఆనందిస్తాం. ఇవన్నీ మరిచిపోయి ముహూర్తాలు ఎప్పుడు పెట్టమంటావో అది చెప్పు చాలు.”

“ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా మనసులోని ఉద్దేశాలు. మరొక ముఖ్యమైన కారణం కూడా వుంది నాన్న! అకాడెమీలో ట్రయినింగ్ అయ్యేటప్పుడు నాకొక స్నేహితురాలున్నది. చాలా మంచిదీ, తెలివిగలదీ కూడా. పుట్టి పెరిగింది ఝార్కండ్ అయినా వాళ్ళ నాన్నగారు మన ఆంధ్రా యూనివర్సిటీలోనే ఉద్యోగం చేసేవారు. దాంతో మన సంప్రదాయాలన్నీ తెలుసు. బి.సి. తెగకి చెందినదే గాని తెలివితేటల్లో, అందచందాల్లో నన్ను మించిపోతుంది. మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. వాళ్ళింట్లో వాళ్ళకు ఏ అభ్యంతరమూ  వుండదని చెప్పింది. మీరూ ఒప్పుకుంటారనే నమ్మకంతోనే ఆమెకు నేను మాట ఇచ్చాను.”

“ఇంక ఆపు కిషోర్. నువ్వేదో తెలివిగలవాడివి, కుటుంబాన్ని పైకి తీసుకొస్తావనే నమ్మకంతో మేమున్నాం. ఆ ఉద్దేశంతోనే కష్టపడి చదువు చెప్పించాం. చదువుకుని పెద్ద ఉద్యోగమే తెచ్చుకున్నావు. ఉద్యోగం వచ్చీ రాగానే నీకు నచ్చిన అమ్మాయితో నీ ఇష్టమొచ్చినట్లు పెళ్ళి చేసుకుంటానంటున్నావు. నువ్విలా మాట్లాడతావని మేం కలలో కూడా ఊహించలేదు. ఆ పిల్ల ఎవరో నీకు ఎర వేస్తే ఆ గాలంలో చిక్కుకుని పెళ్ళి దాకా వెళ్తానని చెప్పటానికి నీకు నోరెలా వచ్చింది? ఈ ప్రపంచంలో ఎంతో మంది మాయగాళ్ళుంటారు.అట్లాంటి మాయలో నువ్వే చిక్కుకుపోతావని మేం కలలో గూడా అనుకోలేదు. మామయ్య కూతుర్ని గాకుండా ఈ బీసీ పిల్ల, ఝార్ఖండ్ పిల్లను పెళ్ళి చేసుకుంటానని నాతో అన్నావు గనుక సరిపోయింది. ఇంకెప్పుడూ, ఎవరి దగ్గరా అనబాకు. మీ అమ్మగాని విన్నదంటే, ఆమె గుండె బద్దలయి ఏమవుతుందో చెప్పలేం. మీ మేనమామతో సంబంధాలు మెరుగుపడుతున్నాయని మీ అమ్మ ఎంత సంబరపడుతున్నదో మాటల్లో చెప్పలేను. తమకూ మంచి రోజులు వచ్చాయయి గదా అని, వీటిని ఇలాగే ఉండనివ్వమని ఆ దేముణ్ణి వేడుకుంటున్నది. ఇప్పుడిలాంటిదేదయినా జరిగితే ఆమె ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేను. అటు మీ మామ పంతం పట్టి నన్ను బజారుకీడ్చి ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తాడు. నువ్విదంతా గుర్తుపెట్టుకో. నువ్వు కోరుకున్నవు, అదీ ఆ పిల్లను పెళ్ళి చేసుకోవాలని మాత్రమే. ఆ పెళ్ళి జరగకపొతే నువ్వు తాత్కాలికంగా బాధపడతావు. కాలక్రమంలో మర్చిపోతావు.  మేమంతా ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటాం. ఇది రెండు కుటుంబాలతో ముడిపడి వున్నది. నేనేమయినా మనసు మార్చుకుంటానని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ నా మనసు మారినా, జరిగే అన్ని అనర్థాలను నేను ఆపలేను. ఇప్పుడంతా నీ చేతుల్లోనే వున్నది. మమ్మల్ని ప్రాణాలతో బతకనిస్తావో? లేదో? నువ్వే ఆలోచించుకో” అంటూ ఫోన్ పెట్టేశాడు.

తండ్రి అంత ఖచ్చితంగా, నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడని తానూహించలా. కేవలం తల్లీ,దండ్రీనయితే తను ఒప్పించుకోగలిగేవాడు. అనుకోకుండా మధ్యలో మేనమామ ప్రవేశించి తామందర్నీ అష్టదిగ్బంధనం చేసేశాడు. చేసే ఉద్యోగం పట్ల తానెంతో నిబద్ధతతో వుంటున్నాడు. కానీ జీవితంలొ అదే నిబద్ధతను కొనసాగనివ్వకుండా పరిస్థితులు తన్ను అశక్తుడిని చేసేస్తున్నాయి అంటూ ఎంతో ఆవేదన చెందాడు కిషోర్. ఆ ఆవేదననే స్నేహలతకు తెలియజేసాడు. “నేను నీకు తగను స్నేహలతా. ఎన్నో ఉన్నతాశయాలున్న గొప్ప స్త్రీవి నువ్వు. నీ తోడు తీసుకుని కొత్త జీవితం మొదలుపెడదామనుకున్నాను. ఇద్దరం అటవీశాఖ అధికారులుగా చేస్తూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఎన్ని కలలు కన్నాం? గిరిజనుల స్థితిగతుల్ని మెరుగుపర్చాలని ఉవ్విళ్ళూరాం. అడవికి అమ్మానాన్నలుగా ఉండి సాకుదామని ఎన్నో ఊహల్ని పేర్చుకున్నాం. ఆ ఊహాల్ని చెదరగొడుతూ, మన కలల్ని విరగ్గొడుతూ, అచేతనావస్థలోకి వెళ్ళిపోతున్నాను. నీవైనా జాగృతి పొంది తగిన వ్యక్తిని పెళ్ళాడి ఇటు జీవితాన్ని అటు ఉద్యోగాన్నీ పండించుకుంటావని ఆశిస్తాను” అంటూ మెయిల్ పెట్టాడు.

***

ఈ విషయాలన్నీ తెలుసుకుని స్నేహలత మ్రాన్పడిపోయింది. వినీలాకాశంలో స్వేచ్ఛగా, అవధుల్లేని ప్రేమతో ఆనంద పారావతాల్లాగా ఎగిసిపోదామనుకున్న తనకు రెక్కలు విరిచేసినట్లుగా కూలబడిపోయింది. కిషోర్‌తో మాట్లాడుదామని ఎన్నిసార్లు ట్రై చేసినా ‘సారీ! ఐయామ్ ఎక్స్‌ట్రీమ్లీ సారీ’ అన్న మెసేజ్ తప్పితే మరో సమాధానం లేదు. మరీ ఇంత పిరికితనమా? బాధ్యతా రాహిత్యమా? నిర్లక్ష్యమా? ఏదీ తేల్చుకోలేక కొన్నాళ్ళు స్తబ్దుగా వుండిపోయింది. తనెరిగిన కిషోర్ అలాంటివాడు కానే కాదు. ఇంత పెద్ద మార్పేంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయింది. తనెరిగిన కిషోర్ బాధ్యతలకు కట్టుబడే వ్యక్తి. తన స్నేహితుడు కిషోర్ స్నేహానికి విలువిచ్చే మనిషి. తను ప్రేమించిన కిషోర్ ప్రేమ మాధుర్యాన్ని పంచే మంచి ప్రేమికుడు. ఇవన్నీ మాయమయిపోయి కేవలం ఒక్క స్వార్థపరుడు, పిరికివాడే కనబడుతున్నాడు. ప్రేమిస్తే ఇంత వికటిస్తుందా? పెళ్ళాడాలనుకుంటే ఇంత చేదు అనుభవం మిగులుతుందా? ఇంత చేదు అనుభవాలు తనకు మళ్ళీ వద్దే వద్దు. ప్రేమా, పెళ్ళి అంటేనే వెగటు పుట్టింది. మరో వ్యక్తితో పెళ్ళి చేసుకోవాలనీ అనిపించటం లేదు. మనసు అసలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడి సమయమూ అటవీ సంరక్షణకే సరిపోవడం లేదు. తనే వృత్తితో బిజీగా వుంటూ పెళ్ళీ, సంసారం అనే విషయాల మీదకు ధ్యాసను మరల్చుకోలేదు. ఇంట్లో అమ్మా, నాన్నా పోరుబెడుతూనే వున్నారు. అక్కడ సంబంధం, ఇక్కడ సంబంధం ఉన్నాయి, మనకి అన్ని విధాలుగా తగినవాళ్ళు అంటూ తనకి చెప్పి చెప్పి విసిగిపోయారు. కిషోర్‌తో పరిచయం, ప్రేమా, హాయిగా మధురంగా అనిపించేది. ఆ స్మృతిని అలాగే పదిలంగా దాచుకోవాలనుకున్నది. ఆ స్మృతిని చెరిపేసి మరొకరి గుర్తును అందులో ప్రతిష్ఠించాలని లేదు. పెళ్ళంటే కిషోర్‌తోనే, ప్రేమంటే కిషోర్‌తోనే. ఇప్పుడా కిషోర్‍ మరో స్త్రీకి భర్త. కానీ తన అంతరంగంలో వున్న కిషోర్ ప్రేమా, జ్ఞాపకాలతో ఎవరికీ నష్టం లేదు. అది తన వరకే పరిమితం. అవి పచ్చపచ్చగా వున్నంత కాలం తనలో అలా వుండిపోతాయి. కాలం గడిచేకొద్దీ కిషోర్ అంతే కోపం తగ్గింది. అభిమానం మాత్రం అలాగే పదిలంగా వున్నది. కిషోర్ పట్ల అభిమానాన్ని గుండె నిండా వుంచుకొని మరొక వ్యక్తితో పెళ్ళేమిటి? మనసు ఖాళీ అయ్యి దాంట్లోకి ఎవరినైనా ఆహ్వానించగలిగినప్పుడు పెళ్ళి, కాపురాల గురించి ఆలోచించవచ్చులే అనుకుంటున్నది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here