ఆమని-9

0
1

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 9వ భాగం. [/box]

[dropcap]వృ[/dropcap]క్షశాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ తమ పరిశోధనా రిపోర్టుల నందించారు. వీరి పరిశోధనల ఆధారంగానే దేశీయ వైద్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఎక్కడ, ఎలా పెరిగేదీ తెలుస్తుంది. స్వతసిద్ధంగా ఏర్పడే అరణ్యల సమీపంలోనే గిరిజనుల సహాయంతో, ఈ ఓషధుల, మూలికల వనాలను పెంచవచ్చు. అన్ని జిల్లాలలో ఇది అమలు చేస్తే ఎక్కువమంది వృక్షశాస్త్రవేత్తలు అవసరమవుతారు. గిరిజనులకు చేతినిండా పని దొరుకుతుంది. ఫార్మసీలకు, దేశీయ ఔషధాలకు కల్తీ లేని ముడిసరుకు దొరుకుతుంది ప్రజలకు నాణ్యమైన మందులు లభిస్తాయి. ఇలా ఒక దాని వెంబడి ఒకటి అనేక పనులు జరుగుతాయి. ఆసక్తి వున్న రీసెర్చ్ విద్యార్థులూ ఎన్నో పరిశోధనలు చేయవచ్చు. ఇవన్నీ ఆలోచిస్తూ స్నేహలత శాస్త్రవేత్తలందించిన రిపోర్టులు చదవసాగింది.

మొక్క పెరిగే వాతావరణమూ, భూసారాన్ని బట్టి ఔషధ గుణాలకు సంబంధించిన ఆల్కలాయిడ్‌ల శాతం మారుతూ వుంటుంది. ముందుగా ఆ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త సూచించారు.

“దేశం నలుమూలల జరిగే ఔషధీ పరిశోధనల వివరాలు బాగా తెలుసుకున్నాను. వాటి సహాయంతో పరిశోధన చేశాను. మనం పెంచే మొక్కలు ఆయుర్వేద వైద్యంలోనే కాకుండా, హోమియోపతి, అలోపతి ఔషధాల తయారీలోనూ వుపయోగపడతాయని భావిస్తున్నాను. చెట్టు బెరడు, ఆకులు, పువ్వుల్ని సమూలంగా మూలికలుగా వాడతారు. చెట్ల నుండి కారే పాలు, విత్తనాలు కూడా ఓషధులే. ఓషధులో తయారైన వాటిని ఔషధమని పిలుస్తారు. కొన్ని మందు మొక్కల్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఒకటి అంకుడుచెట్లు. దీనిని ‘తెడ్లపాల’, ‘రెప్పాల’ అని కూడా అంటారు. సంస్కృతంలో ‘అసిత కుటజా’ అని, లాటిన్ భాషలో ‘రైటియాటిన్క్ టోరియా రాబర్ట్ బ్రౌన్’ అనీ పిలుస్తారు. ఇది అమాసైనేసీ కుటుంబానికి చెందినది. ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చెట్లను గిల్లితే పాలు వస్తాయి. తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పొడవైన విత్తనాలు దూదితో కలిసి వుంటాయి. ఈ విత్తనాలను నవంబరు నుండి ఫిబ్రవరి వరకు సేకరించుకోవచ్చు. ఇందులోనే మరొక రకం మొక్క కూడా వుంటుంది. దాని ఆకులు వత్తుగా నూగు వుంటుంది. దీనిని ‘వరైటి రాధి హుకర్ ఫిలియస్’ అని అనీ అంటారు. ఆకు నూగు లేని రకాన్ని ‘వరైటి టిన్క్‌టోరియా’ అంటారు. పువ్వులూ, విత్తనాలు ఏ తేడా వుండవు. రెండూ పని చేసే గుణ మొక్కటే. దీని ఆకులతో వాత రోగాన్ని అరికట్టవచ్చు. వీటి విత్తనాలకు సాధారణ విరేచనాలు, రక్తపు విరేచనాలు కూడా తగ్గుతాయి. ఈ మొక్క పెరగటానికి మన జిల్లా నేలలు అనుకూలంగా వుంటాయి.”

‘ఈ మొక్కను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సీజన్ మారగానే ప్రజల కొచ్చే వ్యాధుల్లో విరేచనలు ప్రధానంగా వుంటాయి’ అనుకున్నది స్నేహలత. వీరి రిపోర్ట్ చాలా విస్తృతంగా వున్నదనుకుంటూ మరొక మొక్కను గురించి చదివడం మొదలుపెట్టింది.

“రెండవ మొక్క ‘అంకోల’, దీన్నే ‘ఊడుగ’ అనీ అంటారు. సంస్కృతంలో ‘అంకోల’ అనీ, లాటిన్‌లో ‘అలాంజియాం సాల్వ్ ఫోలియమ్ వేంగర్ట్’ అనీ పిలుస్తారు. ఇది అలాంజియేసే కుటుంబానికి చెందింది. ఈ మొక్క మూడు మీటర్ల నుండి ఏడు మీటర్ల వరకూ ఎత్తు పెరుగుతుంది. చెట్ల నిండా చిన్న చిన్న కొమ్మలు బాగానే వస్తాయి. కణుపులు కణుపులుగా వుంటుంది. ప్రతి కణుపుకూ ఒక్కో ఆకు చొప్పున వస్తాయి. ఆ ఆకుల మొదట్లోనే పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు తెల్లగా వుండి సువాసనలిస్తాయి. కాయలు నల్లగా, కోలగా కాస్తాయి. ఈ కాయల్ని మే నెల నుండి జూలై వరకూ సేకరించుకోవచ్చు. ఈ చెట్టు వేళ్ళు, బెరడు, ఆకులు, విత్తనాలు అన్నీ ఉపయోగపడతాయి. ఇవి వాత రోగానికి, చర్మసంబంధిత రోగాలను నయం చేయడంలో బాగా పనిచేస్తాయి. ఇంకొక వుపయోగమేమింటంటే ఈ విత్తనాలుంచిన చోట పురుగులు చేరవు” అని చదివింది.

క్రిములు పట్టనివ్వదంటే తప్పకుండా పెంచచ్చు. పైగా చర్మవ్యాధుల్ని నయం చేసే గుణమున్నది కాబట్టి బాగా వుపయోగపడుతుందని అనుకున్నది.

మరొక మొక్క ఎర్రచందనం గురించి పూర్తి వివరాలనిచ్చారు. ఈ చెట్టు కెలాగూ మార్కెట్లో ప్రస్తుతం మంచి ధర పలుకుతున్నది. వ్యాపార లక్షణాన్ని పక్కన పెడితే ఔషధ గుణాలేమిటో తెలుసుకుందామనుకుని చదవసాగింది. “ఇది పదిహేను మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ, గుండ్రని పత్రాలతో పసుపు పచ్చని పూలతో వుంటాయి. పత్రాల మొదట్లోనే పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గింజలు తప్పడిగా చూట్టానికి అచ్చం వేగిన కాయల్లా వుంటాయి. ఆరోగ్య రీత్యా చూస్తే ఈ చెట్టు బెరడుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం, పైగా శరీరానికి చలువచేసే గుణమూ వున్నాయి. కానీ, ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మిగతా జిల్లాలలో పెరిగినంత ఏపుగా ఈ చెట్లు మన జిల్లాలో పెరగడం లేదు. అటవీ శాఖ వారు ఇరవై సంవత్సరాల క్రితమే గుంటూరు దగ్గరలోనే ప్రయోగాత్మకంగా పెంచి చూశారు. ఆశించిన ఫలితాలు రాలేదు. కాని నా అభిప్రాయమేమిటంటే మన జిల్లాలో కొన్ని నేలలు ఈ చెట్ల పెంపకానికి అనుకూలంగానే వున్నాయి. మరలా మనం ప్రయత్నం చెయ్యొచ్చు. ప్రస్తుత మార్కెట్‌లో ఎర్ర చందనానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక్కడి నేలలో పెరిగితే మాత్రం బాగా లాభసాటిగా వుంటుంది.”

మన వృక్షశాస్త్రవేత్త గారి సూచనల మేరకు వాటిని నాటించి చూడాలనుకున్నది స్నేహలత.

ఇంకా టేకు, తక్కల, యూకలిక్టస్, కరక చెట్ల గురించీ విపులంగా వ్రాశారు. మరికొన్ని లతల్నీ, చిన్న మొక్కల్ని గురించి తెలియజేస్తానంటూ, ‘తుమ్మమొక్క’ గురించీ, ‘తెల్ల ఉప్పి’ పొదల గురించీ, ‘దూసర’ తీగ గురించీ, వాతి ఆకార వివరాలు, ఉపయోగాలు వివరంగా వ్రాశారు. ‘నోట్’ అంటూ మరికొన్ని పంక్తులున్నాయి. “నల్లమల అడవులు ఔషధులు, మూలికలకు ప్రసిద్ధి. ఆ అడవులు, చాలా జిల్లాలకు విస్తరించాయి. మన జిల్లా పరిధిలో కూడా కొంత భూభాగామున్నది కాబట్టి అక్కడ కూడా మనం ఏదైనా పెంచడానికి ప్రయత్నం చెయ్యచ్చు” అంటూ వృక్షశాస్త్రవేత్త చాలా వివరాలు సేకరించి రిపోర్ట్ పంపారు.

ప్రముఖంగా దొరికే కలపంతా నల్లమల అడవుల్లోనే కదా దొరికేది అనుకున్నది స్నేహలత.

ఈ రిపోర్టుల ఆధారంగా తమ పనులు మొదలుపెట్టించాలి. ఔషధ ఫార్మసీలను అంటే మందుల తయారీదార్లను కూడా సంప్రదించాలి. అన్నిటి కంటే ముందుగా డిపార్ట్‌మెంటు పరంగా చర్యలు తీసుకోవాలి. ఆయా ప్రాంతాలల్లో వుంటున్న గిరిజనులను కూడగట్టగలగాలి. అపుడే ఇదంతా సాధ్యపడుతుంది అనుకుంటూ ఆఫీసు నుండి బయటపడింది.

మర్నాడుదయం ఆఫీసుకు బయలుదేరింది స్నేహలత. గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్ పోతున్నది. సిగ్నల్ లైట్ పడటంతో వెహికల్ ఆగింది. చేతిలో వున్న పుస్తకాన్ని తిరగేస్తు కూర్చున్నది. ఇంతలో ‘స్నేహలత గారూ, స్నేహలత గారూ’ అన్న కేక వినిపించింది. తలపైకెత్తి చూసింది. తన వెహికల్ పక్కనే ఆగిన కారులో నుంచి అద్దాలు దించుకుని సౌందర్య పిలుస్తున్నది. నవ్వి పలకరింపుగా చెయ్యెత్తింది. ఈ లోగా గ్రీన్ సిగ్నల్ పడగానే వెహికల్స్ అన్నీ ముందుకుసాగాయి. సౌందర్య కారు తమ వెనకే వస్తున్నట్లు గమనించి డ్రైవరును పక్కకు తీసి స్లో చెయ్యమన్నది. సౌందర్య వాళ్ళ కారు కూడా ఆగింది. రోడ్డు మీద కారు ఆపుకుని మాట్లాడుకునే అవకాశం లేదు. దగ్గర్లోనే కళామందిర్ బట్టల షాపు కనబడింది. కొంచెం సేపు గడపటానికి బాగానే వుంటుందనుకుని అటువేపు వెళ్ళి అక్కడ సౌందర్య కోసం ఆగింది. పోయినసారి చూసినప్పటికన్నా ఇంకా బలహీనంగా కనబడింది.

“మీరెందుకొచ్చారు సౌందర్యా! పనేంటి?” అంటు షాపు వైపు నడిచింది స్నేహలత. వున్న పది మెట్లు ఎక్కి, షాప్ లోపలికి రావటానికి ఆయాసపడుతుంటే తన చెయ్యి అందించి పైకి తీసుకెళ్ళింది స్నేహలత.

“మాటి మాటికీ కలుసుకుంటున్నాం. మనల్ని తరచూ కలిసి మాట్లాడుకోమని ఆ దేముడు కోరుకుంటున్నాడేమో!” అంది సౌందర్య.

“అదేం లేదు. నేనుండేది ఇక్కడే. మీరూ ఈ దగ్గర ఊళ్ళోనే వుంటున్నారు కాబట్టి కలుస్తున్నాం. ఒక పావుగంట మాత్రం వుండగలుగుతాను. ఆఫీసు టైమవుతోంది. మీరు కనబడి పిలవగానే నవ్వేసి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోయాను” అంటూ సౌందర్యను లోపల కూర్చోబెట్టింది. ఆ వింగ్ అంతా చిన్న పిల్లల బట్టలు అద్దాల్లో నుంచి కనబడతున్నాయి.

“మీ పిల్లల వయస్సెంత సౌందర్యా?”అంటూ అడిగి సౌందర్య ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా ఆ అద్దాల రాక్‌ల్ కేసి నడిచింది. ఏడెనిమిది నిమిషాలలోనే రెండు జతల బట్టల్ని సెలెక్ట్ చేసి ఇచ్చి వచ్చింది. సౌందర్య పక్కన కూర్చుంటు “షాప్‌లో మరీ ఏం తీసుకోకుండా, ఊరికే కూర్చుంటే బాగోదు. అందుకే పిల్లలకు తీసుకున్నాను” అంటూ లేచి వెళ్ళి మనీ పే జేసి వచ్చింది.

“మీకొక చీరె తీసుకుంటాను స్నేహలతా. ఇంకాసేపు కూర్చోవచ్చు.”

“వద్దొద్దు. అలాంటిదేమీ ఇప్పుడొద్దు. బెంగళూరు వెళ్ళినప్పుడు ఇవి పిల్లలకివ్వండి” అంటూ బట్టల్ని సౌందర్య కందించింది.

“భలేవారే స్నేహలతా! కాసేపు మాట్లాడుకోకుండా మీరీ షాపింగ్ చేశారు. ఏదో మీరు కనిపించారన్న సంతోషంతో కేకపెట్టి పిలిచాను. మీరేమో షాపింగ్ పని పెట్టుకున్నారు. ఇంతకీ నేను ఇక్కడికెందుకు వచ్చానంటే మా నాన్నగారికి ఏక్సిడెంట్ అయింది. మోకాలి దగ్గర గాయం బాగానే అయింది. ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో వున్నారు. కాలికి సర్జరీ అయింది. రాగలిగిన పూట వచ్చి చూచి వెడుతున్నాను. అలా వస్తుంటేనే మీరు కనిపించారు. నాన్నగారి దగ్గర అమ్మతో పాటు ఒక పిన్నీ, పిన్ని భర్తా వున్నారు. నాకు సాయంగా ఇంట్లో మరొక బంధువు వున్నది. పదండి స్నేహలతా, ఒక్క చీర కొందాం ప్లీజ్” అంది సౌందర్య.

“ఇప్పుడలాంటివేం వద్దు. ముందు మీ హెల్త్ సంగతి చూడండి. త్రిఫల చూర్ణం రోజూ తినడమో, మజ్జిగలాంటి దాంట్లో కలుపుకుని తాగడమో చెయ్యండి. ఆ చూర్ణం కేన్సర్‌ను నిరోధించే యాంటీ-ఆక్సీడెంట్‌గా పని చేస్తుందని ‘బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్’ వాళ్ళే ప్రకటించారు. అలాగే పసుపులో వున్న ‘కర్క్యుమిన్’ అనే పదార్థం కూడా కేన్సర్ నివారణకు పని చేస్తుందని అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల పరిశోధనలు చెప్తున్నాయి. మీరెక్కడుంటే అక్కడ తులసి, బిళ్ళగన్నేరు మొక్కలు ఎక్కువగా పెరిగేటట్టు చూచుకోండి. ఆ చెట్లనుంచి వచ్చే గాలి చాలా మంచింది. పెద్ద పెద్ద కేన్సర్ హాస్పటల్స్‌లో ఈ మొక్కల్ని బాగా ఎక్కువగా తోటల్లాగా వేసి పెంచుతున్నారు. ఇవన్నీ కిషోర్ గారు చెప్పరనీ, మీరు చేయరనీ కాదు. తోటి మనిషిగా నాకు తెల్సింది చెప్తున్నాను. ఇక వెళ్దాం పదండి. మీ ఫాదర్ గురించి వర్రీ అవకండి. సర్జరీ అయిందన్నారుగా, త్వరగానే రికవరీ అవుతారు. కాని నడవటానికి కాస్త టైం పడుతుంది. రండి. వెళ్దాం. చెయ్యి ఇటివ్వండి” అంటూ కారు దాకా తీసుకొచ్చి బై చెప్పి తన ఆఫీసు వైపుకు వెళ్ళిపోయింది.

ఆఫీసుకొచ్చి కూర్చున్నది స్నేహలత. ‘మరలా ఈ రోజు సౌందర్య కనబడి పిలిచింది. తనకు దక్కాల్సిన స్థానంలో ఆమె తిష్ట వేసుకుని కూర్చుంది. ఇన్నేళ్ళ తరువాత పరిచయమై, మాటిమాటికీ తటస్థపడుతుంది. చిత్రంగా తనకు కోపంగానీ, బాధ కానీ కలగడం లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి జాలి పడతుందా లేక తనే కోపాన్నీ, బాధను అధిగమించే స్థితిలో కొచ్చిందా? నిజంగానే తనకు కిషోర్ మీద కోపాన్ని అధిగమించేసింది. సౌందర్య అన్నట్టుగా ఎందుకో మాటిమాటికీ తామిద్దరూ కలుసుకుంటున్నారు. ఆమె స్థితికి మరీ మరీ జాలిపడుతూ, ఏ మూలో కాస్త బాధ వున్నా అది కూడా పోయేటట్టు చేస్తున్నది. ఇప్పుడీ పరిచయమూ, మాట్లాడుకోవటం వలన తనకే నష్టమూ లేదు, లాభమూ లేదు’ అనుకుంటూ గుంటురు జిల్లా అటవీ ప్రాంత మ్యాప్ నొకసారి మళ్ళీ పరీక్షగా చూడసాగింది. ఈ జిల్లాలో 8,563.77 చదరపు కిలోమీటర్లలో ఫారెస్ట్ ఏరియా వున్నది. అందులో 8,504,500 చ.కి.మీ. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, 54.77 చ.కి.మీ. రక్షిత ఫారెస్ట్ ఏరియా వున్నది. మిగిలిన 4.90 చ.కి.మీ. అన్-క్లాసిఫైడ్‌గా వున్నది. ఈ ప్రాంతంలోని 2,083 హెక్టార్లలో టేకు చెట్లు, 19,623 హెక్టేర్లలో యూకలిక్టస్, 8,256 హెక్టేర్లలో సర్వీ చెట్లు, 6,454 హెక్టార్లలో జీడిమామిడి, 468 హెక్టారులలో వెదురు, 11,418 హెక్టారులలో గానుగ; ఇతర జాతులు 14,115 హెక్టారులలోను’ ఎవెన్యూ ప్లాంటెడ్ ఏరియా 94 కిమీలలోనూ వున్నది. గిరిజనులు మాత్రం ఎక్కువగానే లక్షల సంఖ్యలో వున్నారు. అటవీ పరిధిని, గిరిజనులను పరిగణలోనికి తీసుకుని సంరక్షణా బాధ్యతను చూసుకోవాలి. ఇవన్నీ చూసుక్ంటునే దేన్నీ సమస్యాత్మకం చేయకూడదు. అలా సమస్యాత్మకం కాకుండా తన పూర్తి ఆలోచనల్ని, ఉద్యోగ బాధ్యతలకే కేటాయిస్తూ వున్నది. తన ఏరియాలోని గిరిజనులకు ఎంతో చేయాలని వున్నది. తాననుకున్నవన్నీ సాధించాలంటే తను పూర్తిగా అటవీ బాధ్యతలకే అంకితమైపోవాలి. ఈ ఉద్దేశాలు తనలో బలంగా వుండబట్టే తను వివాహం జోలికి పోకుండా ఇలా మిగిలిపోయిందేమో. కిషోర్ పెళ్ళి జరిగిపోయిన కొత్తలో తను చాలా నిరుత్సాహంగా వుండేది. ఏ పనీ చేయబుద్ధి అయేది కాదు. తాననుకున్న చదువే అవలీలగా చదివేయగలిగింది. జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో తనెందుకు ఘోరంగా విఫలమయిందోనన్న కారణమే తననెక్కువగా బాధించింది. ఆ ఓటమి నుండి కోలుకోవటమే తనకు కష్టమయింది. జీవితమమ్తా నిస్సారంగా అనిపించింది. కాని కొన్ని రోజుల తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకున్నది. ఒక విధంగా తన్ను తానే రీ-ఛార్జ్ చేసుకున్నది. పెళ్ళే జీవిత పరమావధి కాదు. జీవితంలో ఆనందాన్నిచ్చే విషయాలు చాలా వున్నాయి. ఉద్యోగ బాధ్యతలని నిబద్ధతతో చేసి, ఇటు గిరిజనుల సంక్షేమంలోనూ, అటు అటవీ సంరక్షణ బాధ్యతల్లోనూ తనిప్పుడు ఎంతో సంతృప్తిని పొందుతున్నది. తన ఏరియాలోని గిరిజనులందరూ తనవాళ్ళే అనిపిస్తున్నారు. ప్రతి కుటుంబపు కష్టాన్ని తీర్చగలిగితే అంతకన్నా కావలసిందేదీ లేదని అన్పిస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here