Site icon Sanchika

ఆమని గీతం

కొమ్మని కోసుకుంటూ
బయటకొచ్చే చిగురుదొక్కటే లక్ష్యం
తనను తాను సృష్టించుకుంటూ
చీకటిని బద్దలు కొట్టటం

కిరణాలను పీలుస్తూ
సంకెళ్లను కరిగిస్తున్న మంచుదొక్కటే కసి
ప్రవాహమై కాలాల్ని తాకుతూ
నీ కాలం చెల్లిందని కాలానికి చెప్పాలని

తనువంతా గొంతై కూసే
కోయిలది స్వాగత గీతం మాత్రమే కాదు
కరిగిన కాలానికి, వొంటరి జీవితానికి
అది చరమ గీతం కూడా

మరో విప్లవ రూపమో.. కుట్రల ఫలితమో..
పాత ఆకులను కోస్తూ కొత్త చిగుళ్లు

నది ఆవాసాల్ని తాకింది ఆకల్ని చూసింది
మంచై మళ్ళీ ఆకాశాన్ని చూస్తుంది

పిట్టకి గూట్లో గుడ్డు ప్రపంచమైంది
ప్రపంచమెగిరిపోయి, మళ్ళీ తనువు గొంతౌతోంది

ప్రతి విప్లవమూ ఎప్పటికోప్పటికి శీతాకాలమే
మరో కొత్త విప్లవ వసంత పూతకు విత్తనమే

Exit mobile version