Site icon Sanchika

ఆమె అందంతో నడుస్తున్నది

[జార్జ్ గార్డన్ బైరన్ రచించిన ‘షి వాక్స్ ఇన్ బ్యూటీ’ కవితని అనే అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of George Gordon Byron’s poem ‘She Walks In Beauty’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ఇం[/dropcap]తకీ ఆమె ఎలా నడుస్తుందనుకుంటున్నారు??
రాత్రిలా ఆమె అందంతో నడుస్తుంది.
మేఘాలు లేని.. కేవలం నక్షత్రాలు మాత్రమే నిండిన ఆకాశంలా..
వెలుతురూ చీకటీ సమంగా అమరిపోయిన శీతోష్ణ వాతావరణంలో.,
మృదువైన కాంతి పుంజాలు
ఆమె కళ్ళల్లో కలిసిపోయి ఉన్నప్పుడు.. ఆమె అందంతో నడుస్తుంది.
నిజానికి చంచలమైన ఆ రోజుల్ని ఏ స్వర్గం తిరస్కరిస్తుందో చెప్పండి?
ఒక ఛాయ ఎక్కువ.. ఒక వెలుగు రేఖ తక్కువైనా..
పేరు తెలియని ఆమె దర్పాన్ని కొద్దిగా క్షీణింప చేస్తే ఏం?
అది కూడా కాకిలా నల్లగా ఉండే ఆమె జడ పాయలను ఒక అలలా వూపి పోతుంది.
మరోసారి మెత్తగా ఆమె మొఖాన్ని వెలిగిస్తుంది.
ఆ క్షణాలలో తన హృదయంలోని ఆలోచనలను
ఆమె తన మొఖంలో స్పష్టంగా.. మధురంగా పలికిస్తుంది.
అలాంటి మృదువైన మనసున్న ఆమె నివసించే స్థలం ఎంత ప్రియమైనది..
మరెంత పవిత్రమైంది అయి ఉండొచ్చొ కదా..?
ఆమె కోమల మైన చెక్కిళ్ళు..
ఆమె కనుబొమల మీద చర్మం ఓహ్హ్..
ఎంత మృదువుగా.. మరెంత శాంతంగా ఉంటుందో తెలుసా?
అలాగని ఆమె మాట్లాడదనుకున్నారా ఏంటి?
ఆమెది ఎంతటి అనర్గళమైన వాక్పటిమ అనుకున్నారు ?
ఆ నవ్వు ఉంది చూసారూ?
గొప్ప విజయానందంతో..
ఆమె మొఖంలోని లేత రంగులతో కలిసిపోయి మెరిసిపోతుంది.
అందుకే మరి.. పరమాద్భుతంగా గడిచిన ఆ రోజుల గురించే మీకు చెప్పాలిప్పుడు.
ప్రశాంతమైన ఆమె మనసు గురించి..
అమాయకమైన ఆమె హృదయం గురించే చెప్పాలిప్పుడు.. వినండి!

~

మూలం: జార్జ్ గార్డన్ బైరన్

అనుసృజన: గీతాంజలి


జాన్ బైరన్ సుప్రసిద్ధులైన ఆంగ్లకవులలో ఒకరు. రొమాంటిక్ మూవ్‍మెంట్‌కి చెందినవారు. Hours of Idleness, The Bride of Abydos, Hebrew Melodies, The Prisoner of Chillon, The Vision of Judgment, Heaven and Earth, The Island వీరి ప్రసిద్ధ రచనలు.

Exit mobile version