Site icon Sanchika

ఆమె ఎవరు..

[డా. సి. భవానీదేవి రచించిన ‘ఆమె ఎవరు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అనాది అపరిచిత ముహూర్తంలో
ఎవరో శిల్పి అటుగాపోతూ
అందమైన శిలను ‘ఆమె’గా మలిచాడు
పేరేమిటో ఇద్దరికీ తెలీదు
ఎండకూ వానకూ ఎదురీదుతున్నప్పుడు
రాతిచర్మం కమిలిపోయింది
గాలికి శిల్పశిరోజాలు అల్లల్లాడుతుంటే
సూర్యతాపాన్నీ.. చంద్రుని చల్లదనాన్నీ
చీకటి వెలుగుల క్షితిజరేఖలుగా ధరించింది

రాతిప్రకంపనల ఆలోచనలతో
జీవమున్నా లేనట్లుగా
గాఢనిద్రిత చైతన్య మూర్తిమత్వంతో
భూమ్యాకాశాల ప్రతిస్పందనే లేకుండా
చిన్నరూపంలోనే విశాలప్రపంచం దాచుకుంది

సంగీతస్వరాల శబ్దలయలతో
సంతోషాభిరుచిని గళంలో నింపుకున్నది
కేవలం ఒక రాతిబొమ్మా?
ఏదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోయినా
అన్నీ గుర్తుంచుకుంటుంది

శిలలా.. కంపించినా.. స్వప్నించినా
నులివెచ్చని ప్రభాతకిరణాల గుసగుసలన్నీ
రాతిశ్రవణాలకు సుతిమెత్తగా వినిపిస్తుంటాయి
గాలి వేలికొసల్లోంచి జారే వానముత్యాలు
చెక్కిళ్ళపై ప్రతిబింబాలను చూసుకుంటాయి

ఎంతటి సుకుమార సౌందర్య భువన భాగస్వామిని!
ఎవరో ఎవ్వరికీ తెలియకపోతేనేం?
కాలం ఆమెలోకి ప్రవహిస్తోంది
జీవితం ఆమెలోంచి ప్రయాణిస్తోంది!

Exit mobile version