Site icon Sanchika

ఆమె గెలిచి ఓడింది!

(‘బిల్కిస్ బానో’ సుప్రీంకోర్టులో విజయం సాధించిన సందర్భంగా ఈ కవిత అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు.)

[dropcap]ఆ[/dropcap]మె గెలిచింది!
న్యాయం బ్రతికింది!!
రెండు దశాబ్దాల పోరాటం
విజయ తీరాలను చేరింది!
ఈ దేశంలోని వామపక్ష లౌకిక
మానవ సమూహాలు..
పండగ చేసుకుంటున్నాయి!
కానీ.. ఆమె మాత్రం దుఃఖ సముద్రాన్ని..
కడుపులో దాచుకున్న సాగర మాతలా
తొణకని నిండు కుండలా
గాజు కళ్ళను శూన్యం వైపు సారించి..
ఎండి బీటలు వారిన పెదాలపై
నిర్లిప్తతతో కూడిన చిరునవ్వును ప్రదర్శిస్తూ..
అంతరంగంలోని భావోద్వేగాలను
బైటకు రాకుండా బలంగా నిరోధిస్తోంది!
ఆమె మది లోయలతో
సమాధానం లేని ప్రశ్నలెన్నో
శ్మశానంలో సమాధులయ్యాయి!
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతం
ఆధునికతను అందిపుచ్చుకున్నది!
భారత జాతీయ పతాకం
విను వీధులలో విహారిస్తూ
గ్రహాంతర యానానికి
పయనమై పోయింది!
అయినా.. ఈ లౌకిక రాజ్యంలో
ఛాందస భావనా వీచికలు
మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ
మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోన్న వేళ..
ఈ పవిత్ర భూమిపై ‘లౌకికం’ పదం
నేతి బీరకాయ చందమైంది!
పోరుబాటలో గెలుపు తీరాలు చేరినా..
మతం ముసుగులో
ముష్కరులు చేసిన గాయం మానిపోయినా..
గుండె గాయం మాత్రం అలాగే వుంది!
రక్తం పంచుకు పుట్టిన బిడ్డ..
సప్త వర్ణాలను పోలిన
రక్త సంబంధాల ఆత్మబంధువులు..
రక్కసి మూకల దారుణ మారణకాండకు
బలియైన చేదు నిజాన్ని మరచిపోలేక
నిరంతర వేదనతో
అలమటిస్తోన్న మనసు..
ఈ గెలుపును మాత్రం
ఓటమి గానే పరిగణిస్తోంది!

Exit mobile version