ఆమె నన్నే చూస్తోంది

2
54

[శ్రీ పి. దినకర్ రెడ్డి రచించిన ‘ఆమె నన్నే చూస్తోంది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆమె నన్నే చూస్తోంది
రెస్టారెంట్లో అందరూ ఉండగా
తెల్ల జుట్టు ముఖం మీద పడుతున్నా
దాన్ని వెనక్కు నెట్టకుండా
ఆమె నన్నే చూస్తోంది

ఏమీ పట్టనట్లు సింకులో గిన్నెలు వేసినప్పుడు
ఎందుకు ఉదయమే లేచి
నన్ను సావగొడతావ్ అన్నప్పుడు
నాన్న జేబులో డబ్బులు తీసి
నా స్నేహితులతో మందు పార్టీ కోసం ఇమ్మన్నప్పుడు
అమ్మ కూడా అలాగే చూసేది
ఆ చూపులో కోపం కనిపించదు
అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదేమో

ఒక రకమైన నిస్సహాయత
అర్థం లేని మాటలు విన్నప్పుడు
మన పెదాలు ఇచ్చే పేలవమైన నవ్వు
ఆమె అమ్మను గుర్తుకు తెస్తూ
నన్ను ఇబ్బంది పెడుతోంది

బిర్యానీ ఘుమఘుమలు డోకు తెప్పించేలా
నా మనసు మారిపోయింది
టిష్యూ పేపర్తో ముఖం తుడుచుకున్నట్టు నటిస్తూ
ఆమె వైపు మళ్లీ చూసాను
ఎవరో ఆమెకు నల్ల కళ్ళజోడు పెట్టి
జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకెళ్లారు

ఆమెకేమీ కనిపించదు అని
నేనొక దీర్ఘ శ్వాస తీసుకున్నాను
ఒకవేళ కనిపించినా
నేనెవరో
అమ్మతో గతంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించానో
చులకన చేసి మాట్లాడుతూ ఎలా అవమానించానో
ఈమెకెలా తెలుస్తుంది
హమ్మయ్య
ఎవరికీ తెలియదు
ఎవరూ అడగరు
ఇంకెందుకు ఈ కంగారు
ఒకవేళ తెలిసినా
పిల్లలన్నాక తల్లితో అలానే ప్రవర్తిస్తారు
అంతేగా అని కొట్టిపారేస్తారు

కానీ
ఎప్పుడో మర్చిపోయాననుకున్న జ్ఞాపకాలని
ఇంత తాజాగా ఎవరు చేస్తున్నారు
సగం తిన్న తరువాత చెయ్యి కడిగేసాను
ఎన్నో పనులను సగంలో ఆపేసిన నేను
కారు అద్దంలో చాలా హుందాగా కనిపించాను
ప్రయోజకత్వానికి పర్యాయపదంలా ఇప్పుడు కనిపించే నేను
కోటు వెనుక కోట్ల వ్యసనాల్ని దాచిపెట్టేసాను.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here