ఆమె నీ ప్రేయసి కాదు!

0
2

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఆమె నీ ప్రేయసి కాదు!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నసు ఊయల వూగింది చాలిక..
ఊయల తాళ్లను నువ్వే కత్తిరించేయి..
ఇది నీ వర్షం కాదు..
నీ ఆకాశం కాదు.
నీ తోట కాదు
ఆమె నీ ప్రేయసి కాదు.
~
వర్షించి వెళ్లిపోయావు..
వెనక్కి తిరిగి కూడా చూడవా?
కన్నీరు మున్నీరు అయ్యానో..
నదిని అయ్యానో.. వరద అయ్యానో..
సముద్రమే అయి పొంగానో
ఒక్కసారైనా చూడవా?
~
ఇక నిద్రపో..
ఎటూ తేల్చని రాత్రి ఇది
చీకటి తప్ప! ఎవరూ రాని రేయి ఇది
నీలో నువ్వు తప్ప!
అద్దంలో చూసుకో..
మరో నీకోసం..
ఇక ఏమి చేస్తావు..
నీ తల నువ్వే నిమురుకో!
~
నాకో వర్షాన్నివ్వు
లేదా నువ్వే నా వాకిలిలో
కురిసి ఖాళీ మబ్బువయిపో.
నాలోపలి వర్షానికి..
నీ జ్ఞాపకం తోడు.
ఈ బయటి వర్షానికీ
నువ్వే ఒక జ్ఞాపకం!
~
ఏమోలే..
సరేలే.,
దొరికినవే చాలు
నీతో ఈ క్షణాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here