ఆమె ప్రయాణం

3
2

[dropcap]ఆ[/dropcap]మె యశోద.

ఆడుకుంటున్న ఆ పిల్లలిద్దరినీ గమనిస్తోంది, లోకల్ ట్రైన్ స్టేషన్లో బెంచి మీద కూర్చుని, తన ట్రైన్ రావడానికి కొంత సమయముంది… పెద్దవాడు బెంచి మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి తమ్ముడి మీద ఫిర్యాదు చేసాడు. వాళ్ళ అమ్మ చిన్న వాడిని ఒడిలో కూర్చోపెట్టుకుని జుట్టు సవరిస్తూ నచ్చచెపుతోంది. మరాఠిలో వున్నా యశోదకి ఆ సంభాషణ అర్థమయింది. “అన్నతో దెబ్బలాడకు, ఇద్దరు కలిసి చక్కగా ఆడుకోవాలి” అని చెపుతోంది ఆ అమ్మ. ఈ లోగా వాళ్ళు ఎక్కవలసిన ట్రైన్ రావడం, అన్న తమ్ముడి చేయి పట్టుకుని, వారి అమ్మ బేగులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కారు.

అది తాను ఎక్కవలసిన ట్రైన్ కూడా, అయినా యశోద విశ్రాంతిగా బెంచి మీద వెనక్కి వాలి కూచుని ఆలోచనలో పడింది. ఒంటరి మనిషి, ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది అనే అలసత్వం, ఏవో ముసిరిన ఆలోచనలు ఆమెను అలా కూచోబెట్టేసాయి.

***

యశోదకి, తను తన పిల్లలు తన జీవితము కళ్ళ ముందుకు వచ్చాయి. ఇల్లాగే ఉండేవారు తన పిల్లలిద్దరూ. తన భర్త తనని వదిలి వెళ్ళిపోయాక వాళ్ళే తనకు దిక్కయ్యారు. ఏ వర్షపు కాళరాత్రో తన భర్త, ఇదే నగరంలో రాత్రి పని ముగించుకుని తిరిగి వస్తూ ఉంటే, ఈ మహనగరమే మింగేసింది తెరచి ఉంచిన మురికికాలువ మూత రూపంలో. ఎవరిని తప్పు పడుతుంది తన దురదృస్టానికి బాధపడటం తప్ప. గట్టిగా చప్పుడు చేస్తూ దూసుకుపోయింది రైలు, ఆ కాళరాత్రి ని గుర్తు చేస్తు గుండెలమీంచి పోయినట్టు. అది తను ఎక్కవలసినదే, కాని వదిలేసింది చూసుకోకుండా ఆలోచనలో పడి.

భర్త పని చేసే కంపనీ లోనే ఉద్యోగం ఇచ్చారు, పిల్లలని పెట్టుకు బతుకు ధైర్యంగానే మొదలుపెట్టింది. బంధువులు, ఆత్మీయులనబడేవాళ్ళు వచ్చేయమన్నారు తమ దగ్గరకు. ఎందుకో తన మనసుకు తెలిసింది, అందులో నిజం లేదని, తాను వారి దగ్గర ఆత్మాభిమానం చంపుకుని వారి దయా ధర్మాలతో జీవించలేనని. దృఢంగా గట్టి నిర్ణయమే తీసుకుంది, తన బతుకు తనదని. వారందరకూ కోపాలు వచ్చాయి, దూరం అయ్యారు.

పిల్లలు ముత్యాలు రతనాలే, పోటీలు పడి చదివారు, అమ్మకి అన్నివిధాలా తోడు నీడగా ఉన్నారు. బుద్ధిమంతులు, చెడ్ద అలవాట్లేమీ పట్టుపడలేదు. కాని ఉన్నత చదువులు చదవగలిగారు, యశోద కషార్జితంతో పాటు, తమ కష్టానికి తగిన ఉపకారవేతనాలు కూడా పొంది. పోటాపోటీల మీద ఉద్యోగాలు వచ్చాయి ఇద్దరికీ.

అంతా బాగానే ఉంది, ఇంతలో పెద్దాడికి విదేశాలలో ఉద్యోగం వచ్చింది. కాదనలేకపొయింది. దూరం వెళ్ళినా, అభివృద్ధిని కాదనలేక పొయింది. కొద్దికాలములోనే చిన్నవాడు కూడా అన్నని అనుసరించి పయనమయ్యాడు విదేశాలకి. ఏమనగలదు, మంచి భవిష్యత్ వారిని పిలుస్తుంటేనూ. అక్కడకు చేరాక వారిద్దరూ తనని పిలిచారు తమ దగ్గరకు వచ్చేయ్యమని. చేస్తున్న ఉద్యోగం బానే ఉంది, అలవాటైపొయిన చోటు మనుషులూ, తన కాళ్లు చేతులు పెట్టుకు బతుకుతున్న బతుకు.. కాదని వెళ్ళిపోలేకపొయింది. ముందు మీరు స్థిరపడండంటూ వాయిదాలు వేస్తోంది.

పక్కన వినిపించిన గాజుల చప్పుడుకి ఉలిక్కిపడింది, యశోద. ఒక అమ్మయి వచ్చి కూచుంది బెంచీ మీద, చక్కనిపిల్ల, ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెడుతున్నట్టుంది. నల్లని పొడుగాటి జుత్తు, పెద్ద కళ్ళు, నీలిరంగులో ఉన్నాయి. తీర్చిదిద్దిన కాటుక. మెడలో నల్లపూసలు పెళ్ళైన అమ్మాయని చెపుతున్నాయి. యశోదని చూడగానే పలకరింపుగా నవ్వింది.

“ఇంటికి వెళ్లి డిన్నర్ తయారు చేయాలా” ప్రశ్నించింది యశోద. తర్వాత కొంత సంకోచపడింది అలా వెంటనే అడిగినందుకు ఆ అమ్మాయి ఏమనుకుంటుందోనని.

ఆ అమ్మయి “మా అత్తగారు చేసి ఉంచుతారు” అని చెప్పింది.

అంటే వీళ్ళ దగ్గరే ఉంటోందన మాట అత్తగారు, అనుకుంది యశోద. ఏదో తెలుసుకోవాలని కూతూహలం, అలవాటు లేకపోయినా అలా కొత్తవారితో మాటాడటం, అడిగించేసింది యశోదని వెంటనే.

“మీ అత్తగారు నీవు సఖ్యంగా ఉంటారామ్మా?”

అడిగింది గాని, గబుక్కున తల వంచుకుంది. ఆ అమ్మయి ఒక నిముషం ఉలిక్కిపడి చూసినా, మెల్లగా అర్థం చేసుకున్నట్టు నవ్వింది.

“ఆంటీ! మొదట కొంత గందరగోళంగానే సాగింది. ఆవిడకి నా భర్త ఒక్కడే అబ్బాయి, వేరే పిల్లలు లేరు. కొంత పొసెస్సివ్‌నెస్ ఉండేది, అది నేను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆవిడకి నా అలవాట్లు అభిప్రాయాలు తెలుసుకొవడానికి కొంత టైము పట్టింది. మెల్ల మెల్లగా ఒకరిని ఒకరు తెలుసుకున్నాము, ఆంటీ! ఇప్పుడు అంతా బానే ఉంది.”

ఆ అమ్మాయి మాటలకి ఎందుకోగాని చాలా తేలికగా అనిపించింది యశోదకి. ఈ లోగా కూత వేస్తూ ఇంకో ట్రైన్ వచ్చింది, ఆ అమ్మాయి బాగ్ భుజాన తగిలించుకు వెడుతూ, తానూ ఎక్కడానికి లేచిన యశోదతో,

“ఆంటీ! మా అత్తగారు మీలాగే తెలివిగా కనిపిస్తారు, ఉంటారు. నిజానికి ఆవిడ వివేకంతో మెలగడం వల్లనే నాకూ ఆవిడకి మధ్య సఖ్యం కుదిరింది” అంటూ రైలుకి పరుగెత్తింది.

తానూ వెళ్ళబోయిన యశోద ఆ మాటలు వింటూ వెళ్ళకుండా మళ్ళీ కూలబడింది. తన కోడళ్ళు గుర్తు వచ్చారు యశోదకి. ఇద్దరు కొడుకులూ తమతో ఉద్యోగం చేసే అమ్మయిలను ఆ దేశములో స్థిరపడినవారినే భార్యలుగా ఎన్నుకున్నారు. చక్కనివారు, మంచి కుటుంబం లోనుంచి వచ్చినవారు, తనకి వద్దనడానికి ఏమీ కారణం లేదు, వారి తల్లితండ్రులు కూడా తనకి గౌరవం ఇచ్చారు. అయినా ఏదో అనుమానం, న్యూనత తనకు, అవమానాలూ మోసాలు పడి పడి ఉన్నదేమో.. ఏదో ఒక భావము తనని వారితో కలవనివ్వలేదు. పెళ్లిలో గడపడమే కొడళ్లు ఇద్దరితో.. మళ్ళీ కలిసింది లేదు గడిపింది లేదు. రమ్మని అడిగి అడిగి కొడుకులు అలిసిపొయారు. కాని తను ఆ విదేశాలు ఆ కోడళ్ళ మధ్యకి వెళ్ళి జీవించే చొరవ, ధైర్యం చేయలేకపోతోంది. కొడుకుల దగ్గరకు వెళ్ళి ఉండాలని మనసు పీకినా, మనసుని జోకొట్టెస్తోంది. తనకి కోడళ్ళతో సద్దుకునే, సఖ్యంగా ఉండే వివేకం ఉందా… లేదా… తృళ్ళిపడింది యశోద, దూసుకువెళ్ళిన రైలు చప్పుడుకు.

***

“అమ్మా!” ఏదో పిలుపు వినబడి మెల్లిగా చుట్టూ పరికించి చూసింది యశోద. దాదాపు ఖాళీ అయ్యింది స్టేషను, బాగ పలచబడ్డారు జనం, దీపాలు వెలుగుతున్నాయి.

“అమ్మా! ఇలా ఎన్ని ట్రైన్స్ వదిలేస్తావు ఇక్కడే ఊండిపోయి.. బయలుదేరవా..” పరిచితమైన గొంతుక విని చివ్వున తలతిప్పి చూసింది యశోద.

పెద్దకొడుకు వెనుకగా చేతులు కట్టుకుని తననే చూస్తూ నిల్చుని ఉన్నాడు. ఉద్వేగంతో సంతోషంతో కంగారుతో చుట్టుకుపోయింది కొడుకుని యశోద, అడవిలో తప్పిపొయి దొరికిన దూడని పట్టుకున్న ఆవు లాగ.

ఆనందంతో గొంతుక రుద్ధమవుతుండగా “ఎప్పుడొచ్చావు పెద్దబ్బాయ్” అంది, చేతిలో బాగ్ జారిపోయినా పట్టించుకోక, అతనిని పట్టుకు భుజం మీద వాలి.

”అమ్మా ! పొద్దున్నే వచ్చాను, మా మామగారింటిలో దిగాను, నువ్వు ఎలాగూ అప్పటికి ఆఫీసుకి వెళ్లిపోయి ఉంటావని” అన్నాడు అతను, మెల్లిగా తల్లిని కూచోబెట్టి.

“ఇప్పుడే వస్తాను, టీ తెస్తాను” అని వెళ్ళాడు అతను.

మెల్లిగా స్తిమితపడింది యశోద ఉద్వేగం నించి తేరుకుని. ఇద్దరకీ టీ, తనకి పావ్ బాజి తెచుకున్నాడు అబ్బాయి. ఒక ముక్క విరచి తల్లిని “నోరు తెరు అమ్మా” అంటూ నోటిలో పెట్టబోయాడు. యశొదకి చిన్నకొడుకు గుర్తు వచ్చాడు, వాడు చిన్నప్పుడు తన వళ్ళో కూచుని ఎక్కి తొక్కుతూ, ఇల్లాగే తన నోట్లొ తినేవి కూరేసేవాడు. కొడుకు చెయ్యి పట్టుకుని, కళ్లనీళ్లు కారుతుండగా అడిగింది యశోద, “తమ్ముడు ఎలా ఉన్నాడు?” అని.

తల్లి మొహంలోకి చూసి నవ్వుతూ “తమ్ముడు బావున్నాడు, నీ కోడళ్ళు కూడా కులాసాయే” అని మెల్లిగా నవ్వుతూ.

“చిన్నపిల్లవేమిటమ్మా ఆ కన్నీరేమిటి, ఇంత ప్రేమ ఉన్నదానివి, మమ్మలని చూడకుండా ఇక్కడ ఎందుకమ్మా ఒక్క దానివే ఉండటం?” మెత్తగా అడిగేడు.

“మీ ఆఫీసర్ని కలసి వస్తున్నానమ్మా, నువ్వు లాంగ్ లీవ్ తీసుకోవచ్చని చెప్పారు, ముందు చెపితే ఒప్పుకోవని టికెట్స్ కొని తెచ్చానమ్మా. బయలుదేరు నాతో, లోకం తెలియనిదానివా అమ్మా! నీ కోడళ్ళు ఏదో ఒక మాటంటే సద్దుకోలేవా? వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, చిన్నవాళ్లు అంతే. నువ్వు ఏమిటో తెలిస్తే నిన్నూ వాళ్ళు, అమ్మనే అనుకుంటారు. అవమానాలుంటాయేమో అనే అనుమానంతో మా అందరి ప్రేమాభిమానాలు ఒదిలేసుకుంటావా? తమ్ముడు నా దగ్గర అమ్మ కావాలి అని ఏడిచాడు, నేను ఎవరి దగ్గర ఏడవను అమ్మా!” అన్నాడు.

తల దించి మాటాడుతున్న కొడుకు మాటలలో తడికి చలించిపోయింది యశోద. గడ్దం పట్టుకు తలెత్తింది,వాడి కళ్ళు పెద్దవిగా దయతో వాళ్ళ నాన్న కళ్ళలాగా ఉంటాయి.

నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్న కొడుకుని చూసి ఆమె మాతృహృదయం తల్లడిల్లింది. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం కదా నేను బతికాను, ఇప్పుడేమిటి సంశయం నాకు, అందరూ నావాళ్ళే, వసుధైక కుటుంబం కాదూ, జీవితాన్ని ఎంతో పట్టుదల ధైర్యంతో ఇప్పటిదాక జీవించిన తను దేనికి భయపడి వెనుకంజ వేసేది.

చప్పున మొహం తుడుచుకుంది యశోద, జుట్టు వెనక్కి సద్దుకుంది చేతులతో. ఈలోగా కొడుకు తమాయించుకుని, లేచి టీకప్పులు డస్ట్ బిన్‌లో పడేసి వచ్చాడు.

కొడుకు కళ్ళు తుడిచి చెంపలు దువ్వి దగ్గరకు తీసుకుని చిరునవ్వు నవ్వుతూ చెయ్యి పట్టుకు అంది, ”జీవితప్రయాణానికి నేను ఎప్పుడూ భయపడలేదు, ఏదైనా కలత లొస్తాయన్న సంకోచం తప్ప, అమ్మ ఉండగా మీరు ఏడ్వడం ఏమిటి, ఆ వచ్చే ట్రైన్ ఎక్కుదాము నడు, ఈసారి వదిలేయను ఎక్కడం. రేపు నీతో విమానం ఎక్కడం కూడా, అమ్మ మీ కోసమే ఎప్పుడూ.”

“మా అమ్మ అంటే ఇల్లాగే ఉంటుంది, శక్తి.. నడు పోదాం అమ్మా” అని హుషారుగా బాగు చేత్తో పట్టుకుని, ఇంకో చెయ్యి తల్లి భుజాల చుట్టూ వేసి నడిపిస్తూ తీసుకెళ్ళాడు కొడుకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here