ఆమె స్వప్నం

0
2

[dropcap]”అ[/dropcap]ది సుందర యమునాతీరము-అది రమణీయ బృందావనము!” అన్నట్లుగా ఓ అందమైన పూల తోట…! తన కన్నులకు బృందావనాన్ని దర్శింప చేస్తోంది. కవి వర్ణనలో ఆస్వాదించడం తప్ప ఆ బృందావనాన్ని చూడలేదు తానెప్పుడూ. వందలాది మొక్కలకు విరబూసిన వేలాది పువ్వులు.. తనను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. “అందమంటే నాదే” అంటున్న ఈ పూలతోటను పెంచి పోషిస్తున్న ప్రేమమూర్తి ఎవరో? సుందరమైన చిట్టడవి లాగా కనిపించే ఈ తోటను నియంత్రించాలి అంటే ఎంత కృషి చేయవలసి ఉంటుందో కదా!” అనుకుంటూ లోపలికి నడిచింది తను. లోపల వనమాలి కాబోలు పసిపాపను తల్లి లాలించి, సంరక్షించినట్లు ప్రతి మొక్క తన ప్రాణం అన్నట్లు ఎంతో జాగ్రత్తగా సంచరిస్తున్నాడు. కలుపు మొక్కలను శ్రధ్ధగా తొలగిస్తున్నాడు. మంచి మొక్కకు ఏ హానీ జరగకుండా. గాలికి ఒరిగిన మొక్కలు నిలవడానికి పుల్లలు కడుతున్నాడు. అదుపు తప్పి పెరిగిన కొమ్మలను సున్నితంగా తొలగిస్తున్నాడు. అతడు ఎంతో శ్రమపడి ప్రతి మొక్కకు నీరు అందిస్తున్నాడు. (తల్లి తన బిడ్డల కొరకు శ్రమ పడినట్లుగా) పోసిన నీరు వృధా కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎదుగుదల లేని మొక్కలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ తోటే తన ప్రపంచం అన్నట్లు అతడు బ్రతుకుతున్నాడు. అతడి నిరంతర కృషి ఫలితంగా తోట స్వర్గధామం అవుతుంది. తన రెండు కళ్ళు చాలడం లేదు ఆ అద్భుత సౌందర్యాన్ని వీక్షించడానికి.

“స్వప్నా!” అమ్మ పిలుపుతో మెలకువ వచ్చింది తనకు. ఎదురుగా నిల్చుని ఉన్న అమ్మను, ఇంటిని చూసిన తర్వాత అర్థమైంది స్వప్నకు ఇంతసేపు తాను కల కన్నదని. వచ్చిన కలను తలచుకుంటూ మంచుకు తడిచిన మల్లెమొగ్గల వికసించింది.. బొండుమల్లె లాంటి ఆమె ముఖం. “పగటి కలలు కంటున్నావా? పగలు నిద్ర పోవద్దని ఎన్ని సార్లు చెప్పాను!” అంది అమ్మ తన స్వరాన్ని పెంచుతూ. అమ్మ గర్జనతో వర్తమానంలోకి వచ్చింది స్వప్న కల తలపును పక్కనపెట్టి. “నీకు డిఎస్సీ నుంచి లెటర్ వచ్చింది” చెప్పింది అమ్మ అదేదో నేరమో ఘోరమో అయినట్లుగా ముఖం పెట్టి. తనలోని ఉత్సాహం ఉరకలు వేసింది. ఎంతో ఆత్రంగా తెరచి చూసింది. తాను ఉపాధ్యాయురాలిగా ఎంపికయినట్లు, తనను కౌన్సిలింగ్‌కు ఆహ్వానిస్తున్నట్లు ఆ లెటర్ చూసి తెలుసుకుంది. ఆనందంతో ఉప్పొంగిపోయింది తీరాన్ని చేరిన నావలా. తన కోరిక తీరుతున్నందుకు మనసులోనే భగవంతుడ్ని స్తుతించింది.

తన వాళ్ళు ఎవరు తన ఆనందంలో పాలు పంచుకోరు. వాళ్లందరికీ తాను టీచర్‌గా స్థిరపడటం ఇష్టం లేదు. ఇప్పుడేమీ కొత్త కాదు.. తన బాల్యం నుండి అలవాటైన విషయమే. తాను కోరుకున్నది ఏదైనా తన వాళ్లు హర్షించరు. బహుశ.. అందుకేనేమో! స్వప్నకు అంతగా బాధ అనిపించలేదు. ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది వర్షించే మేఘంలా.

గడియాపుడి అనే పల్లెటూరి లోని ఉన్నత పాఠశాల నందు తెలుగు పండితురాలుగా చేరడానికి వెళ్ళింది స్వప్న. తండ్రి కూడా ఆమె వెంట వెళ్ళాడు. ఆ ఊరిలో ఓ చిన్న ఇల్లు మాట్లాడి ఇరుగుపొరుగు వారికి స్వప్నను పరిచయం చేసి జాగ్రత్తలు చెప్పి తను ఇంటికి వెళ్లిపోయాడు. స్వప్నకు ఆ వూరి వారి పరిచయ పలకరింపులతో ఆ సాయంత్రం అంతా చాలా సంతోషంగా గడిచింది. తాను రేపే స్కూల్లో చేరబోతోంది. అనిర్వచనీయమైన ఆనందం అంతు తెలియని విచారం తనను వెంటాడుతున్నాయి. తన వారెవరు లేకుండా తను ఇక్కడ ఉండగలదా? తాను ఉపాధ్యాయురాలిగా రాణించగలదా? తన జీవితాశయం నెరవేర్చగలదా? అనేక ప్రశ్నలు మనస్సులో మెదులుతున్నాయి. కోట్ల ఖరీదు చేసే తన బంగళా కన్నా అతి సామాన్యమైన ఈ చిన్న అద్దె ఇల్లు తనకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. తన వారి కన్నా ఇక్కడి వారు ఎంతో అభిమానంగా పలకరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పక్షి పంజరాన్ని విడిచి తాను కట్టుకున్న గూటికి చేరినట్లుగా ఉంది. తన మనస్సులో తనకే తెలియని ఏదో సందిగ్ధత…

తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపన్న కుటుంబంలో ముగ్గురు అక్కలకు ముద్దుల చెల్లిగా జన్మించింది స్వప్న. వరుసగా ముగ్గురు ఆడపిల్లలతో విసిగిపోయిన అమ్మ నాన్నలకు నిరాశను మిగిల్చింది స్వప్న పుట్టుక. (కరువు లో వచ్చే అధికమాసం లా) వంశాంకురం లేకుండా పోయిందనే వారి బాధ స్వప్నపై ప్రేమకు అడ్డు వచ్చింది. తరగని సంపద ఉన్న సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతాడు స్వప్న తండ్రి.

సాధించగలిగింది ఏమీ లేకపోయినా సంతృప్తికి సాధ్యమైనంత దూరంలో ఉంటుంది స్వప్న తల్లి. అమ్మానాన్నల మనస్తత్వాలకు అనుగుణంగా పుట్టారు స్వప్న అక్కయ్యలు. వాళ్ళందరి లోనూ స్వప్న ప్రత్యేకం.. ఈమె ఆలోచనలు వారికి గిట్టవు, వాళ్ళ పద్ధతులు ఈమెకు నచ్చవు. తన పిల్లలు భూమి మీద కాదు అందరి కన్నా ఎత్తుగా ఆకాశంలో పెరగాలి అన్నట్లుంటుంది స్వప్న తల్లి ధోరణి. తినే తిండి, కట్టే బట్ట, చదివే చదువు అన్ని తన ఇష్టప్రకారం జరగాలంటుంది. స్వప్నది అతి సున్నితమైన మనసు. ఆమెకు స్వతంత్ర భావాలు ఎక్కువ. పసి వయసులోనే తను ఇంట్లో పొందలేని ప్రేమను తరగతిలో పొందాలని ఆశించేది. స్నేహితులతో ప్రాణంగా మెలిగేది. స్వప్న చదువుతో పాటు ఆటపాటల్లోను చురుకుగా పాల్గొనేది. చాలా బహుమతులు వచ్చాయి తనకు. ‘పైసాయే పరమాత్మ’ అన్నట్లుగా! “ఇవేం బహుమతులే? చదువు మీద శ్రద్ధ పెట్టి లక్షలు సంపాదించి ఉద్యోగం చేయాలి.” అనేవాడు నాన్న. “విదేశాలు వెళ్లే చదువు చదవాలి” అంటుండేది అమ్మ. ఓ స్వాతంత్ర దినోత్సవం నాడు స్వప్న పాట విని ఓ మాస్టారు “అమ్మాయికి సంగీతం నేర్పిస్తానండీ.. మంచి గాయని అవుతుంది” అంటే ససేమిరా అన్నారు తల్లిదండ్రులు. అలా జారిపోయిన అవకాశాలు కోకొల్లలు. ఈ విధంగా ఎందరూ కళామూర్తులను దేశం కోల్పోతోందో కదా!.

స్వప్న ఉన్నత విద్య విషయంలో పెద్ద వివాదమే జరిగింది. అక్కయ్యలు ముగ్గురు సైన్స్ కోర్సెస్ చదువుతున్నారు. ప్రపంచమంతా ఇంగ్లీష్ భాష చుట్టూ పరిభ్రమిస్తుంది. నువ్వు తెలుగు చదివి ఎవరిని ఉద్ధరించాలి? అంటూ అమ్మ నాన్న స్వప్నపై మాటల యుద్ధాన్ని ప్రకటించారు. మౌనమే సమాధానంగా తనకిష్టమైన కోర్సులోనే చేరింది స్వప్న. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటు ధైర్యంగా ముందుకు నడిచింది. తల్లిదండ్రుల కోరిక ప్రకారం ముగ్గురు అక్కయ్యలకు ప్రవాస భారతీయులతో వివాహాలు జరిగి విదేశాలు వెళ్లిపోయారు. వారు దూరంగా ఉన్నారన్న బాధ కన్నా కూతుళ్లు ఫారిన్‌లో ఉన్నారన్న సంతోషమే ఎక్కువగా ఉంది స్వప్న తల్లికి. తాను తన కుటుంబంలో తేలేని మార్పులను చుట్టూ ఉన్న సమాజంలోనైనా తీసుకురాగలగాలి. దీనికి సరైన మార్గం తను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటమే. అని స్థిరమైన నిర్ణయం తీసుకుంది. సంకల్పం కార్యరూపం దాల్చి ఇలా గడియపూడి ప్రభుత్వ పాఠశాల కు వచ్చింది స్వప్న. రూపాంతరం చెందిన సీతాకోకచిలుక లాగా స్వేచ్ఛగా!

ఇలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి ఓ శుభముహూర్తాన తన ఉద్యోగ ఉత్తర్వులతో సహా పాఠశాలకు వెళ్ళింది. పెళ్లి పందిరిలో ప్రవేశిస్తున్న కన్నె వధువు లాగా. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆమె తనువు పులకరించింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి అత్యంత ఉత్సాహంగా ఉద్యోగంలో జాయిన్ అయింది. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ తెలుగు పండితురాలినీ తీయగా పలకరించారు. ఎంతో వినయంగా సరస్వతీ దేవిని ప్రార్థించి మొదట తొమ్మిదవ తరగతిలో ప్రవేశించింది స్వప్న. చీకటిని తొలగించి వెలుగును ఆనందించే సూర్యబింబంలా. విద్యార్థులు అందరూ లేచి నిలబడి ఆమెకు నమస్కరించారు.

చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి తనను తాను పరిచయం చేసుకుంది. తొలిసారిగా విద్యార్థులతో సంభాషిస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది తన పగటి కల. ఆశ్చర్యపోయింది. ఆ అందాల బృందావనం లోని పసి మొక్కలే కదా నా విద్యార్థులు. ఈ మొక్కలు అన్నీ చక్కగా పుష్పించే చాలంటే కృషీవలుడు అయిన ఆ తోటమాలిని ఆదర్శంగా మలచుకోవాలి. అనుకుంటూ ప్రేరణగా నిలిచిన తన కలకు కృతజ్ఞతలు చెప్పుకుంది.

శిశిర వసంతంలా కాలం కౌగిలిలో ఐదు సంవత్సరాలు కరగిపోయాయి.

స్వప్నకు మరో వూరు బదిలీ అయింది. గడియపుడి పాఠశాలలోని ఉపాధ్యాయులంతా కలసి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. గ్రామమంతా పాఠశాలకు తరలి వచ్చింది. ఆనందమో విచారమో తెలియని వింత స్థితి. స్వప్నం లోని వనమునందు వికసించిన పుష్పాలు ఆ వీడ్కోలు సభకు అతిథులు. వేలాది నక్షత్రాల మధ్య చంద్రబింబం వలే ప్రకాశిస్తోంది స్వప్న. ఆ వెలుగు వెనక ఎన్నో చీకటి కోణాలు విస్తరిస్తున్న కాంతిలో కనిపించకుండా దాక్కుంటున్నాయి.

వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక ప్రభుత్వ పాఠశాల. పదవ తరగతిలో రాష్ట్రంలో ప్రథమ స్థానం. ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఎంపికైన ఇద్దరు పాఠశాల విద్యార్థులు, రాష్ట్రస్థాయి నాట్య ప్రదర్శనలో ప్రథమ బహుమతి. ఏ.ఐ.ఆర్ నిర్వహించిన సంగీత పోటీలో ప్రథమ స్థానం.

జిల్లా నిర్వహించే ప్రతి పోటీలోను పాఠశాలదే పై చేయి. ఆ గ్రామంలోనే కాదు చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా బడి మానేసిన పిల్లలు కనిపించరు. ఇది గడియపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రస్తుత ప్రత్యేకత. ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ సంభవించిన పరిణామం.

స్వప్న విద్యార్థులలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విజ్ఞాన వేత్తవలె తమ గురువును ప్రశంసిస్తున్నారు. తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు స్వప్న బదిలీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. స్వప్న కళ్ళనిండా కన్నీటి బిందువులు కదులుతున్నాయి. తన పగటికల పదే పదే జ్ఞాపకం వస్తోంది వాస్తవ చిత్రం లాగా. అందుకేనేమో భారతరత్న ప్రియతమ రాష్ట్రపతి కలాం గారు

“కలలు కనండి సాకారం చేసుకోండి” అంటూ పిలుపునిచ్చారు. సన్మానం ముగిసిన తర్వాత స్వప్న ప్రసంగిస్తోంది.. శ్రీకారం చుట్టుకున్న పుస్తకం లాగా.

“అందరికీ నమస్కారములు. అరుదైన అద్భుతమైన ఈ అనుభూతిని హృదయంలో పదిలంగా దాచుకుంటాను. మన పాఠశాల సమిష్టి విజయం సాధించింది. కల వంటి ఈ విజయం మన అందరిదీ. చీకటి గదిలో వెలిగించిన చిరుదీపం ఆ గదంతా కాంతిని ప్రసరింపజేసేస్తుంది. ఆ దీపం సాయంతో మరో చీకటి గదిని కాంతిమయం చేయవచ్చును. మనమంతా కలిసి వెలిగించిన ఈ దీపాన్ని ఇలాగే చిరకాలం వెలిగించుదాము. కావలసిన చమురును అందిద్దాము. ఈ వెలుగు దీపాన్ని మరో పాఠశాలలో వెలిగించడానికి వెళుతున్నాను. ప్రతి దీపానికి కిరణాన్నై మిగిలివుండాలని ఆశిస్తున్నాను.” అంటూ ముగించింది స్వప్న. కరతాళధ్వనులు ఆకాశాన్నంటుతున్నాయి.

‘”కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు” అన్న ఓ కవి మాటలు సార్ధకమైనట్లు అనిపిస్తోంది.. అక్కడి వారందరికీ… స్వప్నాన్ని సాకారం చేసిన స్వప్నను చూస్తుంటే…!

ఆఖరిగా విద్యార్థులు కొందరు ‘దీపంతో దీపం వెలిగించు, తిమిరంతో సమరం సాగించు’. అంటూ సందేశాత్మక గేయాన్ని ఆలపిస్తున్నారు. …

ఎన్ని సార్లు విన్నా తనివితీరని ఆ శ్రవ్య గీతాన్ని ఆలకిస్తూ వేదిక దిగుతున్న స్వప్నకు మరో స్వప్నం లాంటి సత్యం కనులముందు మెరిసింది.. విస్తుపోయీ, విచిత్రంగా చూస్తూ నిలబడిపోయిందామె.

“అవునన్నా! వెలుగు లేని హృదయానికి ఉదయం కనపడదు”

“భయపడితే బ్రతుకులోని నాదం వినపడదు”

పిల్లలు పాడుతున్న పాటలోని మాటలు ఉచ్చరిస్తూ తనదరికి వస్తున్న తన తల్లిదండ్రులను, తోబుట్టువులను చూస్తూ పరమానంద భరితురాలయింది స్వప్న…..!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here