ఆమెకు తప్పలేదు.. అయినా తప్పూ లేదు!

0
2

[శ్రీ పైడిముక్కల వెంకటేశ్వరరావు రచించిన ‘ఆమెకు తప్పలేదు.. అయినా తప్పూ లేదు!’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]మ్మా! కానిస్టేబులమ్మా.. నా పేరు సెంద్రమ్మ తల్లీ.. మాది కొత్తగూడెం.”

“అయితే ఏంటి?” టేబుల్ పై కాళ్ళు పెట్టుకుని తీరిగ్గా ప్రశ్నించింది, లేడీ కానిస్టేబుల్ వరలక్ష్మి.

“కాదమ్మా.. మా వూరు కొత్తగూడెం.. నా పేరు..”

“ఊఁ.. ఇందాక చెప్పావ్‌గా.. నాకేమన్నా చెవుడనుకున్నావా? వచ్చిన పనేంటో చెప్పు.”

చంద్రమ్మ చీర కొంగుతో నుదుటి మీద చెమట తుడుచుకుంది.

“కాదమ్మా.. నా మొగుడు మంచోడు కాడు. రోజూ తాగొచ్చి నన్ను కొడతాడు. అడ్డొచ్చి న పిల్లల్నీ కొడతండాడు. ‘ఇదేటి ఇలా చేత్తన్నావ్’ అని అడిగే దిక్కు కూడా లేదు.”

“ఓహో! మీ మొగుడూ పెళ్ళాల సరసమా?” కానిస్టేబుల్ వరలక్ష్మి తన జోక్‌కి తనే కాసేపు నవ్వుకుంది.

చంద్రమ్మ తరువాత ఏం చెప్పాలో తెలవక మ్రాన్పడి నిలుచుండి పోయింది.

వరలక్ష్మి టేబుల్ మీద కాళ్ళు క్రిందకు తీసి కుడికాలి బూటుతో సిమెంట్ గచ్చు నేలని తన్ని “ఊఁ.. తర్వాత!” అని అడిగింది.

అప్పటికే సగం ఆశ చచ్చిన చంద్రమ్మ “ఏముందమ్మా.. నన్నూ, పిల్లల్ని కొట్టడమే కాకుండా ఇంట్లో ఉండే సామానంతా తాగుడికి అమ్మేత్తన్నాడు. నేను కూలికి బోయి తెచ్చే ఆ నాలుగు రాళ్ళు మాకు మిగల్చట్లేదు. రెండు రోజుల కాడ నుంచీ పిల్లలిద్దరూ.. నేనూ.. పత్తేనమ్మా!” అంది.

“అయితే.. ఏం చెయ్యమంటావ్? మీ ఇంటికొచ్చి నన్ను వంట చేసి పెట్టమంటావా?” వరలక్ష్మి జోక్‌కి అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధప్ప అనే కానిస్టేబుల్ కూడా వరలక్ష్మి నవ్వుతో శృతి కలిపాడు.

చంద్రమ్మకిక మాట పెగల్లేదు.

“ఇదిగో చూడు, పోలీసులు ఖాళీగా స్టేషన్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారని అనుకుంటున్నావేమో.. మాకు నెత్తి మీద సవాలక్ష పనులు.. సవాలక్ష కేసులు.. మీ మొగుడూ పెళ్ళాల గిల్లికజ్జాలు, ముద్దుమురిపాలు మా మీద రుద్దకండి.. అసలే ఈ రోజు మండలానికి మంత్రి గారొస్తున్నారు. వెళ్ళెళ్ళు.. మాకు బోలెడు పనులున్నాయ్.”

చంద్రమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. వెంటనే పాదాలు కూడా వెనక్కు తిరిగాయ్.

***

“అయ్యా! హెడ్డు కానిస్టేబుల్ గారూ.. దిక్కులేనిదాన్ని కరుణిచ్చండి.”

“ఆఁ.. ఆఁ.. కరుణిస్తాలే గానీ, ఏంటి విషయం?” అడిగాడు హెడ్ కానిస్టేబుల్ సింహచలం.

“నా పేరు సెంద్రమ్మండి.. మాది కొత్తగూడెం. ఇంతకు ముందు ఓ పాలి ఇక్కడికొచ్చానండి.”

“ఏ ఎదవ పని చేసి..” అన్నాడు హెడ్ సింహాచలం.

“ఏమీ చేసి కాదండి! నా మొగుడు గురించి చెప్పుకుందుకు. అప్పుడు కానిస్టేబులమ్మ ఉన్నారండి. సెప్పిందంతా ఇని మీ మొగుడూ పెళ్ళాల సొద ఇనేదేంటి ఫో.. అన్నారండి.”

“ఓహో! ఆవిడ విన్లేదని.. వెర్రిబాగులోడిని నేనైతే వింటానని నాకు చెప్పటానికి వచ్చావా?”

చంద్రమ్మ చెంపలేసుకుంది.

సింహాచలం సిగరెట్టు వెలిగించుకుని రెండు దమ్ములు లాగి “ఊఁ.. చెప్పు! పోలీసులున్నది అందుకే.. ఎవరేం చెప్పినా వినేందుకు.. ఊఁ చెప్పు” అన్నాడు.

‘చెప్పాలా! మానాలా?’ అని సందేహపడుతూనే కాస్సేపటికి నెమ్మదిగా నోరు తెరిచింది చంద్రమ్మ.

“రెండు రోజుల కితమండీ! నా మొగుడు ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడండి. పిల్లల్నీ, నన్నూ ఇల్లొదిలి పొమ్మంటున్నాడండి. ఏడకు పోతామండి? రెండు రోజుల్నించీ గుడిసే బయటే పిల్లలూ, నేనూ వండుకు తింఉన్నామండి. ఆ ఈగల్లో, దోమల్లో అట్టనే పడుకుంటున్నామండి. ‘నాయం చెయ్యండయ్యా!’ అని ఊళ్ళో అందరి దగ్గరికీ బోయినా, ఎవరూ పట్టిచ్చుకోవట్లే.. బళ్ళో మేష్టారు గారు ‘దాని మీదా, నీ మొగడి మీదా కేసు పెట్టొచ్చు. ఎల్లి పెట్టు’ అన్నారయ్యా! అందుకే ఇలా వచ్చానయ్యా ! మొన్న కానిస్టేబులమ్మ గారు పట్టిచ్చుకోలేదు. మీరైనా కాసింత కనికరించి ఆడికి భయం సెప్పండయ్యా! ఇల్లు వదిలి పోకపోతే నన్నూ, పిల్లల్నీ కూడా సంపేత్తా నంటున్నాడయ్యా! నా సయితి ఆడికి బాగా పురెక్కిత్తాంది. మీరే ఎట్టాగైనా నాయం సేయండయ్యా!”

“అంత ఏడిపించుకు తినేవాడితో కాపురం చేయకపోతే మీ పుట్టింటికి పోరాదా!” అని తీరుబడిగా ఉపాయం చెప్పాడు సింహచలం.

“ఎక్కడ పుట్టిల్లు బాబూ.. ఎప్పుడో పాడడ్డాది. అమ్మా, అయ్యా పోయాక తమ్ముడు మరదలితో ఎక్కడికో ఉత్తర దేశం పోయాడు. ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో తెలవదు. ఆడున్నా బతికిపోదుమేమో!..” కళ్ళనీళ్ళు ఒత్తుకుంది చంద్రమ్మ.

“సర్లే ఇదొకటా.. ఇదిగో నీ పేరు చంద్రమ్మన్నావ్ కదూ!”

“ఆయ్.. సెంద్రమ్మే బాబుగారు.”

“ఊఁ, ఇలాంటి గొడవలకి పోలీసులేం జేస్తారు చెప్పు. మేం వచ్చి నాలుగు దెబ్బలేస్తే మాత్రం.. తాగుబోతు చచ్చినోడు.. వాడిలో మార్పేమొస్తది. మారతాడా! చస్తాడా? నాలుగు రోజులాగితే వాడి మోజు తీరిపోద్ది – నా పెళ్ళాం, నా పిల్లలంటూ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు. అప్పటిదాకా ఊళ్ళో ఎవరో ఒకళ్ళని బతిమాలుకుని వాళ్ళ పంచన పడుండండి. అసలే చాలా దూరం నుండి వచ్చావ్. తొందరగా బయలుదేరు. పొద్దుపోతోంది.” అనేసి హెడ్డు, “సిద్ధప్పా.. ఏడప్పా.. ఇవ్వాళ పార్టీ ఏదో అన్నావ్.. ఏదప్పా!” అంటూ లోపలికి నడిచాడు హెడ్ కానిస్టేబుల్ సింహాచలం.

***

రేగిపోయిన జుట్టు, దుమ్ముకొట్టుకుపోయిన ఒళ్ళు, అక్కడక్కడా చిరుగులు పడి మాసిపోయున్న చీరా జాకెట్టు.. దాదాపు పూనకం వచ్చినదానిలా పోలీసు స్టేషన్లోనికి జొరబడి తూలిపడబోయి వణుకుతా నిల్చుంది చంద్రమ్మ ఎస్.ఐ. ప్రతాప్ ముందు. ఆ సమయానికి అక్కడే ఉన్నారు లేడీ కానిస్టేబుల్ వరలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సింహాచలం.

“వచ్చావా?” అంది వరలక్ష్మి

“ఇదొకటి మనకు రెగ్యులర్ కస్టమర్” అన్నాడు సింహచలం, వరలక్ష్మి వైపుకి చూస్తూ.

“ఏంటి విషయం?” చంద్రమ్మను చూస్తూ హెడ్డునడిగాడు ఎస్.ఐ. ప్రతాప్.

“ఏముంది సార్! మన పోలీసులు ఏ కేసులూ, గొడవలూ లేకుండా ఖాళీగా ఉన్నామని ఈవిడ గారు కేసులు పట్టుకొస్తా వుంటదండీ మన కోసం.”

సింహాచలానికి కొనసాగింపుగా “అవునండీ సార్ అవును. ఈవిడ గారూ, ఈమె భర్త గారూ దెబ్బలాడుకున్న ప్రతిసారీ ఆ చిలిపి తగాదా పట్టుకుని కేసు పెట్టడానికి వస్తదండి. మనం చాలా ఖాళీగా ఈమె కేసులు కొసమే పోలీన్ స్టేషన్ నడపుతున్నట్టు” అని గొల్లున నవ్వింది వరలక్ష్మి. హెడ్డు, ఎస్.ఐ. ప్రతాప్ బిగ్గరగా వంత కలిపారు వరలక్ష్మీతో.

నవ్వు నుండి తేరుకున్నాక “ఏమ్మా! ఏం కేసు తీసుకొచ్చావ్. ముఖ్యమంత్రి గారు జిల్లా కొస్తున్నారు. నువ్వేదో రెగ్యులర్ కస్టమర్‌వి అంటున్నారు మనోళ్ళు. పోన్లే సి.యమ్. గారితో మాట్లాడి ఎల్లుండి నుండి ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో నీ విషయం చర్చకు పెడదాం” అన్నాడు ఎస్.ఐ. ప్రతాప్ వెటకారంగా. మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరూ నవ్వుకున్నారు.

వాళ్ళు నవ్వడం పూర్తి అయ్యేవరకు అయోమయంగా చూసి నోరు విప్పింది చంద్రమ్మ, శరీరమంతా సన్నగా వణికి పోతుంటే.

“నేను.. నాను.. నా మొగుడ్ని.. నా మొగుడ్ని సంపేసా బాబు” అంది.

అదిరి పడ్డాయి ఖాకీ డ్రస్సులు. ఎస్.ఐ. ప్రతాప్ ఐతే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.

“ఏంటి? నీ మొగుడ్ని చంపేశావా!” కాస్త ముందుగా తేరుకుని కీచుగొంతుతో అడిగాడు ఎస్.ఐ ప్రతాప్.

పోలీసుల కంగారుజూసి, నెమ్మదిగా శరీరం వణుకు తగ్గి, మరెందుకో ధైర్యం కలిగి నెమ్మదిగా జరిగింది చెప్పడం మొదలు పెట్టుంది చంద్రమ్మ.

“అవును బాబూ.. నా మొగుడ్ని సంపేసా. పదేను సంవత్సరాల నుండి ఆడి చెర పడతన్నా. ఎప్పటికైనా మారకపోతాడా! అని ఎదురు సూశా. కాని ఏం నాభం? నా కూలి డబ్బులన్నీ పట్టుకెల్లి పిల్లలు పత్తులతో మాడిపోతన్నా పట్టిచ్చుకోకండా తాగేటోడు. మన కర్మలింతేలే అని సరిపెట్టుకుని కల్లో, గంజో తాగి బతుకీడ్చేటోళ్ళం. ఈ మద్దెన ఆడి యవ్వారం మరీ ముదిరిపోయింది. దాన్నెవతెనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పిల్లల్నీ, నన్నూ ఇల్లొదిలి పొమ్మన్నాడు. అయిునా ఇంటినే పట్టుకుని ఏలాడుతున్నామని మా ముగ్గురినే పట్టుకుని ఆ శని ముండతో కలిసి సావగొట్టాడు. ఇల్లు అమ్మేసుకుని ఆడు, అదీ గలిసి ఏడకో పోతారంట – పోతే పోనీయ్ అనుకున్నా. కాని నా పెద్ద కూతుర్ని కూడా ఆళ్ళతో పాటు తీసుకెళ్తారంట. ‘వయసొచ్చింది. దానికి మంచి మంచి బేరాలొత్తాయ’ని ఆ శని ముండ నా మొగుడితో సెప్తుంటే ఇన్నా. అప్పటి నుండీ నా రక్తం మరిగి పోవడం మొదలెట్టింది. ‘ఎల్లడానికి ఏర్పాట్లు నేసుకొత్తా’ అని ఆ ముండ ఏడకో బోయింది. మొన్నా, నిన్నా నన్ను సావసితక కొట్టి, మా పెద్ద పిల్లని ఆళ్ళ ఎనకాల ఎల్లేలా ఒప్పిచ్చాడు. పిల్ల ఒప్పుకుందన్న సంతోసమో ఏమో.. రాతిరి తప్ప తాగొచ్చి మగతగా నిదరోయాడు. ఆళ్ళిద్దరూ నా కూతుర్ని ఏం చేస్తారో అన్న భయంతో నాకు నిదరట్టింది లేదు. నా పిల్లలిద్దరి కోసమే నేను బతుకుతున్నా. అళ్ళే లేకపోతే నాకింక బతుకేటి? ఎప్పుడా కడుపు నిండా తిండెడ్డని ఎదవకు నా బిడ్డల మీద అధికారమేటి? కడుపున పుట్టిన బిడ్డని లేకుండా ఆ ముండతో కలిసి బేరాలు పెడతాకి సూత్తాడా? నా కడుపు రగిలిపోయింది. ఆడు బతికుంటే నా బిడ్డలు నాకు దక్కరనిపిచ్చింది. మంచి నిద్దట్లో ఉన్నాడు. దగ్గరే రోకలి కనపడ్డాది. ఆడ్ని సంపైనా నా బిడ్డని కాపాడుకోవాలనుకున్నా. నా పుట్టింటి నుండి తెచ్చుకున్నానది. ఆడి దయవల్ల ఎప్పుడూ ఏమీ దంచుకున్ని వండుకుని తిని ఎరగం దానితో.. అదిగో.. దాన్ని పట్టుకొన్నా. కసిదీరా తల మీదా బాదాను సాలా సేపు. నిద్దట్లోనే గిలగిలా కొట్టుకు సచ్చాడు. ఆడ చచ్చి తర్వాత గానీ నాకు తెల్వలేదు, ‘నా పిల్లలు అనాదలై పోతన్నారని’. అందుకే పరుగు పరుగున ఎల్లి మేస్టారి గారి కాళ్ళ మీద పడ్డా, చేసిన పని చెప్పి ‘నా బిడ్డల్ని కాపాడమ’ని. నీ బిడ్డల కేం భయంలేదు. నువ్వొచ్చే వరకు ఆళ్ళ బాధ్యత నాది అన్నాడు మగానుభావుడు. ‘నువ్ సేసిన పని తప్పు. ఎల్లి పోలీసులకి లొంగిపో’ అని సెప్తే.. ఇలా వచ్చాను బాబు! నన్ను ఏం చేస్తారో మీ ఇష్టం. మీ పోలీసులికి చాలా పనులుంటాయని, గొడవలుంటాయని ఇంతకు ముందు ఈ అమ్మా.. అయ్యా… సెప్పారు బాబు. అందుకే మీకు ఖాళీ ఉండి నా కోసం వత్తారో రారో అని నేనే మా వూరు నుంచి నడిసొచ్చాను బాబు – రాతిరి నుండి పచ్చి గంగైనా ముట్టలేదు. కాసిని తాగడానికి నీళ్ళిప్పిచ్చండి బాబూ!” అంటూనే చంద్రమ్మ కళ్ళు తిరిగి అక్కడే కూలబడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here