అరుదైన వ్యక్తి కథ ‘ఆనంద హేల’

2
2

[శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ రచించిన ‘ఆనంద హేల’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రచయిత శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మగారి తొలి నవల ‘ఆనంద హేల’. ఈ నవల తొలుత స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా మార్చి 2020లో ప్రచురితమైంది.

“జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా చలించక, ఎల్లప్పుడూ ఆనందంగా జీవించే మనిషి గురించి వ్రాయాలన్న ఆలోచనతో ఈ నవలకి అంకురార్పణ చేయటం జరిగింది” అని రచయిత తమ ముందుమాటలో తెలిపారు. స్థూలంగా కథ అర్థమైపోతుంది. కానీ అలాంటి మనుషులు ఇప్పుడు చాలా అరుదు కాబట్టి ఆ వ్యక్తి గురించి చదవాలనిపిస్తుంది.

కటిక పేదరికంలో పుట్టి, పరిస్థితులకు ఎదురీది, నేర్చుకునే స్వభావాన్ని వదలక, తన పరిశీలనా శక్తితో సమాజాన్ని అర్థం చేసుకుంటూ తాను ఎదగడమే కాకుండా తనతో పాటు మరికొందరిని జీవితంలో పైకి తెచ్చిన ‘వాల్మీకి’ జీవితం ఈ నవల సారం.

ఎలా అలవడిందో రచయిత సూచించలేదు గానీ బాల్యంనుంచే వాల్మీకికి ఆత్మాభిమానం ఆభరణమైంది. విశ్వనాథం మాస్టారి దృష్టిలో పడి, ఆయన ఆదరాభిమానాలను పొంది, ఏకసంథాగ్రాహి అయిన వాల్మీకి చదువులో రాణిస్తాడు. ఓ ప్రమాదంలో తండ్రిని కోల్పోయినా, తల్లికి లభించాల్సిన నష్టపరిహారం ఇవ్వకపోయినా, నిబ్బరంగానే ఉంటాడు. తల్లిని ఓదార్చి ఆమె తెరిపినపడేలా చేస్తాడు. పదవ తరగతిలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. ప్రైవేటు కాలేజీలు ఎంతగా ప్రలోభపెట్టినా లెక్కచేయక, ఇంటర్మీడియట్ కోసం ప్రభుత్వ కాలేజీలో చదువుతాడు. చదువుకుంటూనే పార్ట్ టైమ్‍గా ఓ హోటల్లో పని చేస్తాడు – ఎమ్‌సెట్ రాసి మంచి ర్యాంకుతో పాసవుతాడు. అతని ర్యాంకు కంప్యూటర్స్, ఎలెక్ట్రానిక్స్‌లలో ఏదో ఒకటి వచ్చేది, కానీ వాల్మీకి అనూహ్యంగా సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకుంటాడు. ఇంజనీరింగ్‍ పూర్తి చేసాకా, గిరిధర్ అనే ఇంజనీర్ దగ్గర కొన్నాళ్ళు ఉండి ఇళ్ళ ప్లాన్‍లు గీయడంలో మెళకువలను ఆకళింపు చేసుకుంటాడు. బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేసే పాషా అనే అతనితో తిరిగి మార్కెట్‍ని అధ్యయనం చేస్తాడు. మదన్ అనే సైట్ ఇంజనీరు అహాన్ని తృప్తి పరిచి భవన నిర్మాణంలోని ప్రాక్టికల్ అంశాల్ని తెలుసుకుంటాడు. అతని సైట్‍లోని తాపీ మేస్త్రీలతో కలిసి పనిచేస్తూ, ఆరు నెలల్లో, ఇల్లు కట్టడంలోని మెళకువలు నేర్చుకుంటాడు. యూనివర్సిటీ పరీక్షలలో సివిల్ ఇంజనీరింగ్‍లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. తల్లి పేరు మీద ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ స్థాపిస్తాడు. వృత్తిలో నిజాయితీగా ఉంటూనే ఎదుగుతాడు. తనపై ఆకర్షణని పెంచుకున్న, ఒకప్పుడు తను పాఠాలు చెప్పిన వీణని సరైన దారిలో పెడతాడు. తనని ఇష్టపడిన, తాను కోరుకున్న తన కాలేజీమేట్ అమృతని పెళ్ళి చేసుకుంటాడు. ఓ ఏడాదికి కొడుకు పుడతాడు. ఆనంద్ అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుతారా దంపతులు. తల్లిదండ్రులు నేర్పుతున్న క్రమశిక్షణని మొదట అర్థం చేసుకోలేక పోయినా, తండ్రి తన జీవితాన్ని విడమర్చి చెప్పేసరికి అర్థం చేసుకుంటాడు. అక్కడ్నించి ఆనంద్ కూడా ఉన్నత శిఖరాల అధిరోహణకి ఉద్యుక్తుడవుతాడు. ఆనంద్ బికాం, ఎంబిఎ పూర్తి చేసి ఉద్యోగానికి సిద్ధమయినప్పుడు – ఒక సంవత్సరం పాటు – తన పేరు ఉపయోగించకుండా – స్వతంత్రంగా బతికి రమ్మని చెప్తాడు వాల్మీకి. సినిమాల్లోనే ఇలా ఉంటుంది, నిజ జీవితంలో ఇలా జరగదు అని అనుకోనక్కరలేదు. సూరత్ లోని వజ్రాల వ్యాపారుల కొడుకులు హైదరాబాదులో ఏడాది పాటు అజ్ఞాతంగా ఉండి చిన్నా చితాకా పనులు చేసుకుని – విలువైన అనుభవాలతో ఇంటికి తిరిగివెళ్ళిన వార్తలు మనం దినపత్రికల్లో చదివాం. అలా ఆనంద్ ఏడాది పాటు అజ్ఞాతంగా ఉంది జీవితంలో రాటుదేలి ఇంటికి వచ్చాకా, అతనికి వాల్మీకి తన కంపెనీ బాధ్యతలు అప్పగించి తాను తన గ్రామానికి వెళ్ళిపోయి శేషజీవితాన్ని ఓ రైతుగా, ప్రకృతి మధ్యన గడుపుతాడు.

***

చాలా స్ట్రయిట్ నెరేషన్.. సస్పెన్స్, థ్రిల్లింగ్ విషయాలు ఏమీ లేవీ నవలలో. అయినా ఆపకుండా చదివింపజేస్తుంది. నవల చదువుతున్నంత సేపూ ఒక విధమైన positivity పాఠకులలో చోటు చేసుకుంటుంది. అలా అని నవల అంతా మంచివాళ్ళే ఉన్నారనుకోకూడదు. చెడ్డవాళ్ళు అని అనలేం గానీ, చెడు ఉద్దేశాలున్న మనుషులు ఉన్నారు, కానీ వాల్మీకి తన స్వభావంతో వాళ్ళలో కూడా మారేందుకు ఆలోచనలు కల్పిస్తాడు. నవలలోని కొన్ని సన్నివేశాలలో రచయిత మనసుని తాకే వాక్యాలు రాశారు. ఉదాహరణకి కొన్ని పేర్కొంటాను:

“విజయం అనేది మత్తుమందు లాంటిది. ఆ మత్తు తలకెక్కిందంటే అది తిరిగి మనని అధఃపాతాళానికి తొక్కేస్తుంది.”

“పాపాయి అడిగింది కదాని పచ్చిమిరపకాయ ఆమెకివ్వలేం కదా.”

“అట్లా ఎందుకనుకోవాలి? ఆమెకేం సమస్యలున్నాయో. ఒక్కొక్క అనుభవం మనిషిని ఒక్కొక్క రకంగా మారుస్తుంది.”

“ఒకరి ఆలోచనల్లో ఒకరున్నారు. ఒకరి మనసులో ఒకరున్నారు. కానీ ఇద్దరూ తమంతట తాము బయటపడితే ఎదుటివారేమనుకుంటారో అనే సంశయంలో, సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.”

“మనం సిద్ధంగా ఉండాలేకానీ, మనకు ఎదురయ్యే ప్రతీ వ్యక్తి నుంచీ, ప్రతి సంఘటన నుంచీ ఒక పాఠం నేర్చుకోవచ్చు.”

***

చదవడం పూర్తిచేశాకా, ఓ మంచి నవల చదివిన తృప్తి పాఠకులలో తప్పక కలుగుతుంది.

***

ఆనంద హేల (నవల)
రచన: గండ్రకోట సూర్యనారాయణ శర్మ
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 120
ధర: ₹ 150
ప్రతులకు:
అచ్చంగా తెలుగు WhatsApp: +91 855 8899 478
ఆన్‍లైన్‍లో
https://books.acchamgatelugu.com/product/ananda-hela/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here