Site icon Sanchika

ఆనందమానందమాయనే..!!

[dropcap]గుం[/dropcap]టూరు మెడికల్ కాలేజీలో యం.బి.బి.యస్. కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నాడు మనోహర్. అతని క్లాస్‌మేట్స్‌లో, మొదటి నుండీ, అందరికంటే ఎక్కువగా తనకు దగ్గరైంది, అరవింద్. మాచర్ల నుండి వచ్చిన మనోహర్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుండగా, గుంటూరు వాస్తవ్యుడైన అరవింద్, డే స్కాలర్‌గా చదువుకునేవాడు. వాళ్లిద్దరూ మొదట్లో.. అండి.. అండి.. అని సంబోధించుకునేవాళ్ళు. రాను రాను, వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం మరింతగా పెనవేసుకుంది. ఎంతగా అంటే.. అండి.. అండి.. అని పిలుచుకునేవాళ్ళు కాస్త.. అరేయ్.. ఒరేయ్.. వరకు వెళ్లారు. ప్రతి ఆదివారం, అరవింద్, తన మిత్రుడు మనోహర్‌ని, భోజనానికి తన ఇంటికి ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేసేవాడు. ఒక్కోసారి, అరవింద్ కూడా శలవు రోజుల్లో, మనోహర్‌తో కలిసి మాచర్ల వెళుతుండేవాడు. అరవింద్ మనోహర్ వాళ్ళ కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. ఆ క్రమంలో, బాపట్ల హోమ్ సైన్సు కాలేజీలో, బి.యస్.సి. హోమ్ సైన్సు కోర్స్ చదువుతున్న అరవింద్ చెల్లెలు అమృత కూడా మనోహర్‌కి మంచి స్నేహితురాలైంది. అప్పుడప్పుడు, అరవింద్ మనోహర్‍లు కలిసి, బాపట్ల వెళ్ళి, అమృత బాగోగులు చూసుకుంటుండేవారు. అమృత కూడా మనోహర్‌తో చాలా అభిమానంగా, ఆప్యాయతగా మాట్లాడుతుండేది. మనోహర్ కూడా అమృతను కలిసేందుకు, మాట్లాడేందుకు చాలా ఉత్సాహపడుతుండేవాడు. అలా, వాళ్ళిద్దరి మధ్య స్నేహలత అల్లుకుంది. ఎప్పుడైనా, మనోహర్‌కి కుదరనప్పుడు, అరవింద్ ఒక్కడే అమృతను చూసేందుకు బాపట్ల వస్తే, “మనోహర్‌ని కూడా తీసుకొస్తే బాగుండేదికదా అన్నయ్య!” అంటుండేది అమృత అమాయకంగా.

***

ఇక్కడ, మనోహర్ అరవింద్‌లు, గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో హౌస్ సర్జెన్‌లుగా, విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ, అమృత డిగ్రీ పూర్తి చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదివేందుకు సమాయత్తమౌతుంది. మరోవైపు, మనోహర్ అమృతల స్నేహబంధం బాగా బలపడింది. తరచుగా కలుసుకుంటూ, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగారు.

అప్పుడే, మనోహర్ మదిలో మథనం మొదలైంది.

‘ఏంటిది? అమృతను కలుసుకుంటుంటే, మాట్లాడుతుంటే, నాకెందుకింత సంతోషంగా ఉంటుంది? తను కూడా, నన్ను కలుసుకున్నప్పుడూ, నాతో మాట్లాడుతున్నప్పుడూ, ఎంతో ఆనందంగా ఉంటున్నట్లు, నాకు కనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? చూడబోతే, నేను అమృత, ఇద్దరం, ప్రేమలో పడ్డావేమోననే అనుమానం నన్ను కలవరపెడుతుంది. చూడగా చూడగా, అది కేవలం అనుమానం కాదు, అక్షరాలా నిజమేననిపిస్తుంది. ప్రేమ.. ప్రేమ.. సరే! ఆ తరువాతేంటి? సహజంగా ప్రేమ తరువాత జరిగేది పెళ్ళే కదా! మరి, తన మనసులో కూడా, ఇలాంటి ఆలోచనలే నడుస్తుంటాయా? ఏమో! మరి, తెలుసుకునేదెలా?’

‘ఈసారి కలుసుకున్నప్పుడు, ‘ఐ లవ్ యూ’ చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో!! ఒకవేళ తనకలాంటి ఉద్దేశం లేదని చెప్తే!!! మొదటికే మోసం వస్తుందేమో!?? మా స్నేహానికి అవరోధం ఏర్పడుతుందేమో!! అమ్మో! వద్దు !! అంత సాహసం నేను చేయకూడదు. ప్రస్తుతానికి, మరి కొంతకాలం వేచిచూడడం అన్నివిధాలా శ్రేయస్కరం అనిపిస్తుంది. ఔను! అదే కరెక్టు!!’ అనుకుంటూ, మనసుని మరో విషయం వైపు బలవంతంగా మలుపు తిప్పాడు మనోహర్.

***

ఆ రోజు.. ఉదయాన్నే అనుకోని ఒక సంఘటన, మనోహర్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది. రోజూ ఒరేయ్, అరేయ్ అని పిలిచే అరవింద్, “అరేయ్ బావా!” అని సంబోధించాడు మనోహర్‌ని. ఊహించని ఆ పిలుపుతో ఉక్కిరిబిక్కిరయ్యాడు మనోహర్. తేరుకున్న మనోహర్, ఆ పిలుపుకు ఏ విధంగా స్పందించాలో అర్థం కాక, తప్పదన్నట్లు తాను కూడా “ఏంట్రా బావా!” అన్నాడు. తరువాత వారిద్దరి మధ్యన సంభాషణ సాదా సీదా గానే జరిగింది. సరికొత్త సంబోధన గురించి, మనోహర్ కొంచెం లోతుగా ఆలోచించడం మొదలెట్టాడు.

‘ఏంటిది!? నన్ను ఒరే, అరే అని పిలిచే అరవింద్, స్వరం మార్చి, అరే బావా..! అంటున్నాడేంటి? ఆ పిలుపు కొంచెం కొత్తగా అనిపించినా, నాకైతే వినడానికి చాలా బాగుంది. అరవింద్ నాకు మరింత దగ్గరయ్యాడనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే, నాకు ఇంకో సందేహం కలుగుతుంది. నేను అమృతను ఇష్టపడుతున్నట్లు, ప్రేమిస్తున్నట్లు, అరవింద్ పసిగట్టాడా? ఆ తరువాతే నన్ను.. బావా!.. అని పిలవడం మొదలెట్టాడా? అయ్యుండొచ్చు! అంటే, అమృతతో నా ప్రేమను అరవింద్ ఆమోదిస్తున్నట్లేనా? అయ్యుండొచ్చనే అనిపిస్తుంది!! సరే చూద్దాం!!’ అని ప్రస్తుతానికి సరిపెట్టుకొని తన దినచర్యలో నిమగ్నమయ్యాడు మనోహర్.

మరో విచిత్రమేమిటంటే, తదుపరి రోజుల్లో, అమృత కూడా, మనోహర్‌ని “బావా!” అనే పిలుస్తోంది ప్రేమగా. అప్పుడు కూడా, అవే ఆలోచనలు మనోహర్ మదిలో మరింత వేగంగా పరిగెడుతున్నాయి.

‘అమృత కూడా నన్ను బావా! అని పిలుస్తుందంటే, తాను కూడా నన్ను ప్రేమిస్తుందని అనుకోవచ్చా? ఏమో మరి? మరి తెలుసుకోవడం ఎలా? నేను నా మనసు విప్పి, నోరు తెరిచి, నా ప్రేమ విషయం, అమృతతో చెప్పేందుకు ధైర్యం చేయలేకపోతున్నాను. నేను చెప్పలేక పోతున్నాను సరే.., మరి.. తనైనా చెప్పొచ్చుగా! హు!! ఇది మరీ బాగుంది! మగాడినైనా నేనే చెప్పేందుకు వెనకాడుతుంటే, పాపం.. ఆడపిల్ల.. అంత తొందరగా తన మనసులోని భావాలను బయటపెట్టేందుకు సాహసిస్తుందా? చెయ్యనే చెయ్యదు! మరి ఇప్పుడేం చెయ్యాలి? ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం ఎలా? చూద్దాం! కాలమే ఒక దారి చూపిస్తుందేమో! వేచిచూడడం వినా, మరో మార్గం లేదనిపిస్తుంది! దేవుడా! అంతా అగమ్యగోచరంగా వుంది! నువ్వే నన్ను అమృతను ఒకటిగా చెయ్యాలి దేవుడా!’ అనుకుంటూ ఆకాశం వైపు ఆశగా చూశాడు మనోహర్.

***

ఆ రోజు.. మనోహర్‌కు అమృత నుండి, ఒక ఇన్లాండ్ లెటర్ వచ్చింది. ఆదుర్దాగా తెరిచి చదివాడు.

ఆ ఉత్తరంలో..

“డియర్ మనోహర్ బావా! ఎలా ఉన్నావ్? ఇప్పుడీ ఉత్తరం వ్రాయడంలోని ముఖ్యోద్దేశం నీకు ముందుగా తెలియజేస్తాను. నా భావి జీవితం గురించి, నేనొక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విషయం గురించి నీతో ముచ్చటించాల్సిన అవసరం ఎంతైనా వుంది. నేను చెప్పబోయే విషయాలు విన్న తరువాత, నీ స్పందన తోనే నా భవిష్యత్తు ముడిపడి వుంది. అందుకోసం, నువ్వు వచ్చే ఆదివారం. మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా బాపట్ల వచ్చి నన్ను కలుసుకోవాలి. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాము. తప్పక వస్తావుగా! రావాలి మరి!!

మరో ముఖ్యమైన సంగతి బావా..!! ఆ రోజు నువ్వు ఒక్కడివే ఒంటరిగా రావాలి. మా అన్నయ్యకు మనం కలుసుకోబోతున్నట్లు అస్సలు తెలియకూడదు! ఎందుకంటే, మనిద్దరం కలిసి మాత్రమే మాట్లాడుకోవాలి కాబట్టి!! అర్థమైందనుకుంటానూ!!!

నీ రాక కోసం ఎదురుచూస్తూ..

అమృత.”

..అని వ్రాసి వుంది.

మనోహర్ ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకుని, అందులో అమృత వ్రాసిన విషయాలపై విశ్లేషణ మెదలెట్టాడు, మనసులోనే..

‘అమృత నాకు ఉత్తరం వ్రాయడం ఇదే తొలిసారి. తన భవిష్యత్తుకు సంబంధించిన విషయమట! ఆ విషయాన్ని నాతోనే చర్చించాలట!! మేము కలుసుకోబోతున్నట్లు, వాళ్ళన్నయ్యకి తెలియకూడదట!!! లోతుగా పరిశీలిస్తే, ఏదో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోడానికి నాతో మాట్లాడాలనుకుంటుంది అమృత. బహుశా, తను కూడా నన్ను ప్రేమిస్తుందేమో! ఆ విషయాన్ని నాకు చెప్పి, అందుకు నేను.. ఓ కే.. చెప్తే, పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన చేస్తుందేమో! అవును…అదే జరగడానికి ఆస్కారం వుంది! దేవుడా! నా మొర ఆలకించావా! ఇంత త్వరగా నన్ను కరుణిస్తావని అనుకోలేదు! ఏది ఏమైనా, నువ్వున్నావు దేవుడా! ఉన్నావు !! నీకు కోటి దండాలు! సరే.. ఇక ఆదివారం బాపట్ల వెళ్లేందుకు, ఇప్పట్నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి!’ అనుకుంటూ, ఆనందాతిశయంతో, ఆ ఉత్తరాన్ని ఒక్కసారి గుండెకు గట్టిగా హత్తుకున్నాడు మనోహర్.

***

అనుకున్నట్లే, ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు, బాపట్లలో, అమృతను కలిశాడు మనోహర్.

“ఆ.. వచ్చావా మనోహర్! రా.. కూర్చో !” స్వాగతించింది అమృత.

“ఏంటి అమృత? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు? ఏంటా విషయం?” కుతూహలంగా అడిగాడు మనోహర్.

“ఆగు మనోహర్! ఏంటా తొందర? చెప్తానుగా!”

‘నాకు తెలుసులే! నువ్వేం చెప్పదల్చుకున్నావో!.. అయినా.. అదేదో నీ నోటినుండి వినాలని కోరుకుంటున్నాను.. అంతే!’ అని మనసులోనే మురిసిపోతూ, మౌనం దాల్చాడు మనోహర్.

“బావా! నాకో మేనబావ వున్నాడు. పేరు సందీప్. చిన్నపుడు మొగుడు పెళ్ళాలాట ఆడుకునే వాళ్ళం. ఆ ఆటలో వాడు మొగుడు, నేను పెళ్ళాం. అప్పట్నుంచే వాడంటే నాకిష్టం. వాడిక్కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ, నిజం చెప్పాలంటే, వాడు నేను కలుసుకుని చాలా సంవత్సరాలైంది. అందుకు కారణం లేకపోలేదు. మా రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కొన్ని అపోహాల వల్ల, కలహాలు ఏర్పడ్డాయి, ఫలితంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ, నాకెందుకో సందీప్‌ని పెళ్లి చేసుకోవాలని, వాడితో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలనిపిస్తుంది. అందుకు మావాళ్లు ఒప్పుకుంటారనే ఆశ లేదు. కాకపోతే, ఒకే ఒక మార్గం ఉంది.. అదే.. మా అన్నయ్య!! మా అన్నయ్య చెప్తే, మావాళ్లు తప్పక ఒప్పుకుంటారు. కానీ, ముందు మా అన్నయ్య అందుకు ఒప్పుకోవాలికదా! ఈ విషయంలోనే, నాకు నీ సహాయం కావాలి బావా! మా అన్నయ్య నీ మాట వింటాడు. నువ్వు చెప్తే కాదనడు. కాబట్టి.. సందీప్‌తో నా పెళ్ళికి, మా అన్నయ్యను ఒప్పించే బాధ్యతను నువ్వే తీసుకోవాలి! నువ్వు నాకీ సాయం చెయ్యాలి! ప్లీజ్ బావా!!” అంటూ మనోహర్ రెండు చేతులు పట్టుకుని, ప్రాధేయపూర్వకంగా అడిగింది అమృత.

అమృత మాటలు విన్న మనోహర్ నిర్ఘాంతపోయాడు. గుండె ఆగినంతపనైంది మనోహర్‍కి. తన కాళ్ళ క్రింద భూమి కంపిస్తున్నట్లనిపించింది. ఏం మాట్లాడాలో తెలియక నిశ్చేష్టుడయ్యాడు మనోహర్. మనసులోని ఆలోచనలు పరిపరివిధాల పరుగులిడుతున్నాయి.

‘తానొకటి తలిస్తే దైవమొకటి తలవడమంటే.. ఇదేనేమో! లేకపోతే ఏంటి? తను నాకు.. ఐ లవ్ యూ.. చెప్తుందనుకుంటే, సందీప్‌ని పెళ్లిచేసుకుంటానని చెప్తుందేంటి? పైగా, అందుకు వాళ్ళన్నయ్య ను నేనే ఒప్పించాలట!! మరీ విడ్డూరం కాకపోతేనూ!!! అసలెందుకిలా జరిగింది? బహుశా, తనపై నాకున్న ప్రేమను, ఇంతవరకు నేను తనకు చెప్పకపోవడం వలన ఇలా జరిగిందనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే.. అది మూర్ఖత్వమే అవుతుంది. చెప్పేస్తాను! ఏదైతే అదవుతుంది! అయినా, అవని పెళ్లి కోసం ఆరాటపడటం కన్నా, అనుకుంటే అయ్యే పెళ్ళికి తొందరపడటం, అమృతకు అన్నివిధాలా మంచిదికదా! అందుకే, ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. చెప్పేస్తాను!’ తిరుగులేని నిర్ణయం తీసుకున్నాడు మనోహర్.

“అమృతా! ముందుగా నేను నీకో అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలి! శ్రద్ధగా విను! నిన్ను చూసిన మొట్టమొదటి క్షణంనుండే, నీ మీద నాకున్న ఇష్టం పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టం కాస్తా, ప్రేమగా మారిందని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. అనంతరం, నిన్ను పెళ్ళి చేసుకోవాలని, నీతో కలిసి ఆనందంగా, సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. కానీ, ఆ సంగతి ఇప్పటివరకు నీతో చెప్పలేకపోయాను. అది నేను చేసిన పెద్ద తప్పు. మరి, ఇప్పుడు కూడా చెప్పకపోతే, అది ఘోర తప్పిదం అవుతుంది. మంచి మనసుతో, నా అభిప్రాయాన్ని గౌరవిస్తావని విశ్వసిస్తున్నాను.. ఐ లవ్ యూ అమృతా! ఐ లవ్ యూ!!” అంటూ తన అంతరంగంలోని భావాలను బహిర్గతం చేశాడు మనోహర్.

అప్పటివరకు, చాటుగా ఉండి, అమృత మనోహర్‌ల మధ్య సాగిన సంభాషణను ఆసక్తిగా వింటున్న అరవింద్, హఠాత్తుగా, వాళ్ళిద్దరి మధ్యన ప్రత్యక్షమయ్యాడు.

అరవింద్‌ని చూసి అవాక్కయ్యాడు మనోహర్..!!

“ఏరా బావా! నా చెల్లెలి పట్ల నీకున్న ప్రేమను బయటపెట్టించేందుకు, మేము ఇంత నాటకం ఆడాల్సి వచ్చిందిరా బావా!” నవ్వుతూ అన్నాడు అరవింద్.

“నాటకమేంటి బావా!” ఆశ్చర్యంగా అడిగాడు మనోహర్.

“నిజానికి, సందీప్ లేడు.. మేనబావ లేడు..! మాకుందల్లా మా మంచి బావ.. మనోహర్ బావ ఒక్కడే! ఇక మీ ఇద్దరి పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను!” అంటూ నాటకానికి తెరదించాడు అరవింద్.

అమృత మనోహర్‌లు, అరవింద్‌ని ఆలింగనం చేసుకుని, ఆనందబాష్పాలతో నిండిన కళ్ళతో కృతజ్ఞతలు తెలియజేశారు, అరవింద్‌కి.

Exit mobile version