ఆపన్న హస్తం

0
2

[శ్రీపతి లలిత గారు రాసిన ‘ఆపన్న హస్తం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“న[/dropcap]మస్కారమండీ” గేట్ తీసుకుని లోపలికి వచ్చిన వ్యక్తిని ప్రశ్నార్థకంగా చూసాడు జగన్నాథం.

“నా పేరు ప్రసాదరావు, వాసు స్నేహితుడిని” అనగానే “ఓ! రండి, రండి, మా మేనల్లుడు వాసు ఫోన్ చేసాడు, మీరు చూసుకోండి, ఇల్లు చిన్నది సరిపోతుందా లేదా అని” అంటుంటే “పర్వాలేదండి, నాకు సడన్ ట్రాన్స్‌ఫర్ వచ్చింది, అబ్బాయి రవి పదోక్లాస్, అమ్మాయి శిరీష ఇంటర్, పిల్లల చదువులు ముఖ్యమైన మలుపులో ఉన్నాయి, రెండు సంసారాలు తప్పవు, సర్దుకుంటాము.” అన్నాడు ప్రసాదరావు.

జగన్నాథం కాలేజీ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైర్ అయ్యారు. భార్య స్వరాజ్యం. ఆయన ఇద్దరు కొడుకులు చెరో దేశం.

భార్య శాంతిని, పిల్లల్ని ఈ ఇంట్లో చేర్చి వెళ్ళిపోయాడు ప్రసాదరావు.

శాంతి స్వరాజ్యానికి దేవుడిచ్చిన కూతురైంది.

పిల్లలు స్కూల్‌కి వెళ్ళగానే కిందికి వచ్చి ఏదో ఒక సాయం చేసేది. సాయంత్రం తమకి చేసిన టిఫిన్ తీసుకెళ్లి ఇచ్చేది “ఎందుకమ్మా?” అంటే “మీకు ప్రత్యేకంగా చెయ్యట్లేదుగా పిన్నిగారు” అనేది.

తనకి ఇంట్లోకి తెచ్చినప్పుడు వీళ్ళకి కూరలో, పండ్లో తెచ్చేది.

ఆఖరికి శిరీష, రవి కూడా బయటికి వెళ్తూ ఇంట్లోకి తొంగిచూసి “అమ్మమ్మగారు! ఏమన్నా కావాలా? షాప్‌కి వెళ్తున్నాము” అని అడిగేవారు.

అందరూ పెద్దవాళ్ళకి మంచి ఆసరాగా ఉండేవారు.

శిరీషకి చదువుతున్న కాలేజిలోనే ఇంజినీరింగ్ ఎంట్రన్సుకి కోచింగ్.

రవి పదోక్లాస్. ఇద్దరూ ఒకే రూంలో చదువుకోవడం ఇబ్బంది అని స్వరాజ్యం రవిని తమ ఇంట్లో ఖాళీగా ఉన్న రూంలో కూర్చుని చదుకోమనేది. రాత్రి మేలుకొని చదువుతుంటే మధ్యలో వేడిగా పాలు కానీ అరటిపండు ఇచ్చేది.

“చదువుకుంటుంటే ఆకలి బాగా వేస్తుంది, మొహమాటపడకు తిను” అని పెట్టేది.

అలా వీళ్ళు జగన్నాథంగారికి ఇంట్లో పిల్లలలాగా అయిపోయారు.

ఒకసారి మాటల్లో శాంతి స్వరాజ్యంతో “ఇక్కడ దగ్గర్లో రామారావు మాస్టర్ గారు ఉన్నారట. ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే మంచి కాలేజీలో ఇంజినీరింగ్ సీట్ వస్తుంది అంటారు. ఫీజు కూడా ఎక్కువ, పైగా మునుపు ఉన్న ఇంటికి దూరం. ఇప్పుడు దగ్గరగా వచ్చాము, పోనీ రవిని అయినా చేర్పిద్దామన్నా టైం అయిపోయిందిట” అంది.

విన్న స్వరాజ్యం ఏమి మాట్లాడలేదు కానీ జగన్నాథం గారితో చెప్పి “ఆ రామారావు మీ శిష్యుడేగా! ఏమన్నా సాయం చెయ్యగలరేమో చూడండి?” అంది.

జగన్నాథంగారు వెంటనే రామారావుకి ఫోన్ చేసారు.

“గురువు గారు ఎలా ఉన్నారు? ఏమిటి సంగతి?” అడిగాడు రామారావు.

“నువ్వు నాకో సాయం చెయ్యాలి రామారావు” అంటూ విషయం చెప్పారు.

“సార్! పిల్లలని పంపండి, అమ్మాయి రెండో సంవత్సరం అంటున్నారు కనక కొన్ని టిప్స్ చెప్పగలను కానీ చేర్చుకోలేను. అబ్బాయి పదోక్లాస్ కనక స్టాండర్డ్ బానే ఉంటే చూద్దాము.” అన్నాడు.

“ఫీజు ఎక్కువ ఇవ్వలేరు రామారావు.”

అన్న జగన్నాథంతో “ముందు పంపండి సార్! అవన్నీ తరవాత.” అన్నాడు రామారావు.

మర్నాడు ఇద్దరు పిల్లలు వెళ్లి పరీక్ష వ్రాసారు.

సాయంత్రం రామారావు ఫోన్ చేసాడు.

“శిరీషకి సలహాలు చెప్తాను, అలా చేస్తే మంచి కాలేజీలో వస్తుంది. కానీ ఆ రవి ఉన్నాడే, వాడు వజ్రం సార్. వాడిని సాన పెడితే IIT టాప్ రాంక్‌లో వస్తాడు. నాకు ఫీజు వద్దు. కానీ నేను పెట్టే రాపిడికి తట్టుకుంటే చాలు” అన్నాడు రామారావు.

శాంతి, ప్రసాదరావు చాలా సంతోషించారు. జగన్నాథానికి, స్వరాజ్యానికి కృతజ్ఞతలు చెప్తే ఆయన రవితో “నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుని మా మాట నిలపెట్టు, మాకు అదే చాలు” అన్నారు.

రవి మర్నాటి నుంచే రామారావు దగ్గర చదవడం మొదలు పెట్టాడు. పొద్దున్న 5 గంటలనుంచి ఏడు దాకా ట్యూషన్, తరవాత స్కూల్, మళ్ళీ సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది దాకా రామారావు దగ్గర.

సాయంత్రం ఒక గంట అన్నా చదువు తప్ప వేరే ఏదైనా చేసుకోమనేవాడు రామారావు, కొంచెమైనా బుర్రకి రెస్ట్ ఉండాలి అంటూ.

శిరీషకి హైదరాబాద్ లోనే మంచి చోట సీట్ వచ్చింది.

రవి కోచింగ్ మాత్రం మూడేళ్లపాటు జరిగింది. రవి కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చదివే వాడు.

ప్రసాదరావుకి మళ్ళీ సిటీలో పోస్టింగ్ ఇచ్చినా రవి కోసం ఇల్లు మారలేదు.

IIT ఎంట్రన్స్ పరీక్షలు అన్నీ బాగా వ్రాసాను అన్నాడు రవి. రామారావు లెక్క ప్రకారం 10 లోపు రాంక్ వస్తుంది అన్నాడు.

రిజల్ట్స్ వచ్చే ముందు రోజు ఎవరికీ నిద్ర లేదు. వీళ్ళతో పాటు స్వరాజ్యం, జగన్నాధం కూడా జాగరణ చేసారు.

టీవీలో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అని చెప్పగానే స్వరాజ్యం, జగన్నాథం టీవీ ముందు, మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ ముందు కూర్చున్నారు.

కంప్యూటర్లో చూద్దామంటే నెమ్మదిగా ఓపెన్ అవుతోంది.

టీవిలో చెప్పిన వార్తకి ఒక్కసారి జగన్నాథం, స్వరాజ్యం షాక్ అయ్యారు.

ఆయన రవి దగ్గరికి వెళ్లి ఏదో చెప్దామన్నా మాట రావడం లేదు. “ఏమిటి తాతగారు!” కంగారుగా రవి అడిగేలోగా రామారావు కూడా వచ్చాడు.

రవిని ఎత్తుకుని గిరగిరా తిప్పి “నా పేరు నిలపెట్టావురా! శభాష్! నీకు మొదటి రాంక్.” ఉద్వేగంగా అన్నాడు.

రాంక్ వస్తుంది అనుకున్నా, మొదటి రాంక్ ఊహించనిది. దానితో అందరూ ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నారు.

మొదటి రాంక్ వచ్చిన తెలుగు అబ్బాయి, అందునా మన ఊరినుంచి అని, అక్కడ ఉన్న అన్ని పేపరు వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు.

టీవీ వాళ్లతో రామారావు మాట్లాడి “మీ ఫోటోలు తీస్తారు అందరు తయారయ్యి రండి” అని చెప్పాడు.

శాంతి వాళ్ళు అందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే రవి మాత్రం జగన్నాథం గారికి “అమ్మమ్మగారు, తాతయ్యగారు మీరు కూడా తయారవ్వండి” అని చెప్పి వెళ్లాడు.

అందరూ వస్తారు, కింద తమ ఇంటి ముందే ఫొటోలు తీస్తారు కనక తాముకూడా కాస్త శుభ్రంగా తయారవుదాము అని వాళ్ళు తయారయ్యారు.

రవి కిందకి వచ్చేప్పుడు తన ఆలోచన తల్లి, తండ్రికి చెప్తే తమకి అటువంటి ఆలోచన రానందుకు వాళ్ళు సిగ్గుపడి “అలాగే చెప్పు నాన్నా” అన్నారు.

ముందు రవికి ఫోటోలు తీశారు, రవితో రామారావు, ఆ తరవాత కాలేజీ వాళ్ళు తీయించుకున్నాక, రవి కుటుంబానికి తీస్తామన్నారు.

జగన్నాథం, స్వరాజ్యంని పిలిచాడు రవి.

“మేము ఎందుకు?” అంటున్నా వినకుండా అందరికి కలిపి, రవి కుటుంబంకి కొన్ని ఫోటోలు తీశారు.

రవిని మాట్లాడమంటే “అందరికి నమస్కారాలు, నేను పదిలోగా రాంక్ వస్తుంది అనుకున్నాను కానీ మొదటి రాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ముందు దీనికి కారణమైన నా గురువుగారు రామారావు గారికి నా కృతఙ్ఞతలు, మా కాలేజీలో నన్ను తీర్చిదిద్దిన మా ప్రిన్సిపాల్ గారికి, మా లెక్చెరర్స్ అందరికి నా ధన్యవాదాలు. నా తోటి విద్యార్ధులకి నా థాంక్స్. అందరి గురించి చెప్పి అమ్మా, నాన్నా గురించి చెప్పకపోతే ఎలా? వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. ఎంత చదివిన ఇంకా చాలదు అని తిట్టి చదివించిన మా అక్కకి థాంక్స్. వీళ్లందరికంటే ముఖ్యమైన వాళ్ళు మా అమ్మమ్మ, తాతయ్యగారు. వీళ్ళ ఆపన్న హస్తం లేకపోతే నేను రామారావు మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అందుకే వాళ్ళకి నా మొదటి నమస్కారం.” అంటూ వాళ్ళకి నమస్కారం చేస్తే వస్తున్న కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు జగన్నాథం, స్వరాజ్యం.

నమస్కరిస్తున్న రవిని ఆపి “ఆయుష్మాన్ భవ” అని ఆశీర్వదించి కౌగలించుకున్నారు.

చిన్న విత్తనానికి కాసిన్ని నీళ్లు పోస్తే అది పెరిగి మంచి పండ్లు ఇస్తున్నంత ఆనందం కలిగింది వాళ్ళకి రవి భవిష్యత్తు ఊహిస్తే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here