ఆర్జవం

0
1

[box type=’note’ fontsize=’16’] మెగాస్టార్ సినిమాలో గాంధీగిరీ పేరుతో తప్పు చేసిన వాళ్ళకి పువ్వులిచ్చి మార్పు తెప్పించినట్టుగా ఈనాటి మన అవినీతి తిమింగలాలకి వాళ్ళు, వాళ్ళ వారి కోసం పోగేసిన వస్తువులే ఇంకా ఇంకా ఇచ్చి – వారిలోనూ, వారి కుటుంబీకులలోను మార్పు కోసం ప్రయతించాలని అంటున్నారు అనిల్ ప్రసాద్ ఈ “ఆర్జవం”లో. [/box]

[dropcap]ఆ[/dropcap]యీ! దండాలండే అమ్మగోరూ ! నాను సిమ్మాదండే, ఆకీడు నుండొచ్చానుండే. ఆయీ! నన్ను మీరెరుగరు. నాను టౌన్లో రోడ్డు మీద సెప్పులు కుడతా ఉంటానుండే. మొన్నాతవరి తండ్రిగోరిని అయినీతి నిరోధక శాకోళ్లు అట్టుకొన్నారుగదుండే, నిన్నటిలా మరి పత్రికలో మీగురించి శానా రాసారుండే… ఆయీ! మీకాడేదో 700 సెప్పుల జతలున్నాయని రాసారుండే. అయ్యిబాబోయి మరి 700 అంటే సామానమేటండే? గొప్పే… మడిసికి ఏడాదికి మూడో నాలుగో జతలు సరిపోతాయుండే. ఆయీ ! మా అల్లుడుగోరు ఉన్నాడు గదుండే మా బడాయి మడిసండే బాబూ, ఇశాఖపట్నంలో అపార్టమెంటులో ఉంటా పోర్టులో పంజేత్తాడుండే. ఆయనగోరు దొడ్లోకెళ్లడానికి ఒక జత, బయట కెళ్లడానికో జత ఇంకా ఇడ్డురం ఇంట్లో గూడా చెప్పులేసుకొనే తిరగతోడుండే ఆయీ! అట్టా ఆయనగోరి కాడా కూడా ఎప్పుడు జూసినా నాలుగు జతలుంటాయుండే. అయినా గూడా పెతీది తెగే దాకా యేసుకుంటాడుండే. కానీ మీ కాడ 700 అంటే……. అమ్మో శానా గొప్పేనుండే ఆయీ ! మీ తండ్రిగోరు గూడా నాకెర్క కాదు తల్లే. ఆయనగోరెప్పుడూ నాకన్నాయం సేయ్యనేదు కాపోతే ఆరు ఇంత పోగెయ్యడానికి ఎవురి కడుపో కొట్టేఉంటాడు కదమ్మా? ఆ మీది తమరికి ఇన్ని చెప్పులు కొనిపెయ్యాలంటే ఎంతగావాల్నో గందా……. ఆయీ! అందుకేనమ్మా నాను నీకు రెండు చెప్పుల జతలు కుట్టిసి అట్టుకొచ్చేసినా. తీస్కోమ్మా మా యమ్మ గదూ. ఇగ నుండీ పెతీ ఏడాది కనీసం ఒక జత అంపుతానమ్మా, కానీ తవరి నాన్న గోరిని మాత్రం అడగబాకుండే. అయినా ఇయ్యన్నీ ఎక్కడెట్టుకుంటారమ్మా? సరే నాకెందుకు గానీ… మరి నాను ఎళ్ళత్తానమ్మో.

***

ఆంటీ! అంతా బాగేనా… అరే… ఏం సూరత్ పెట్టినావ్‌లే… తీ. సూసినానాంటి రాతిరి టీవీల జూసినా, చిచ్చాని గా పోలీసలు తీసుకెల్లుడూ. నేనుభీ శానా పరేషాన్ అయినా. నేనెవళో నీకు తెల్వాది గదా. నా పేరు భానుమతి. మాది ఆదిలాబాదన్నట్టు. మా ఆయనకి గోదావరి గనిలో కొలువు, నీకు తెల్సు గదాంటీ చిన్న జీతాలు – ఖర్సులేమో మస్తాయే. గందుకే నేనుభీ ఏదో పనిజెయ్యాలని షురూజేసినా. ఇక్కడ కోఠిలో మనకి తెల్సిన షాపున్న దన్నట్టు, ఆడికెళ్ళి చీరలు దీసుకెళ్లి ఊళ్ళో అమ్మాలే. కమీషను మిగులుద్దిలే ఒక్కో చీరకీ – ఇగో వర్కూ సారీలైతే సౌ రూపై ఎక్కువే మిగల్తాది: మనకీ ఖర్చులకి రావాల్నా గదాంటీ. అదీ గాక మందికి కిస్తీల లెక్క ఇయ్యాలే, తీసుకెళ్లిన సరుకంతా అమ్ముడవాల్నా – బతుకమ్మకీ, బోనస్సులచ్చినప్పుడు బాగానే పోతాయనుకో, ఏదో గడసిపోతాందిలే ఆంటీ. గా ముచ్చట్లెందుకులేగానీ, మీ సారూ 500 చీరలు ఇంట్లో పోగేసిండని టీవీలల్లా రంది జేస్తుండిరిగందా మరి గందుకే ఇగో నేనూ నీకో చీర దెచ్చినా. నాతోని ఇదే అయితది. అసలైతే ఇది నేనే ఉంచేసికుందామనుకున్నా – మరిల్లా ఎప్పుడూ అనుకొనుడేగానీ ఫుర్సత్‌లో సొచ్చాయిస్తే ఎవురికన్నా అమ్మితే రూపాయోస్తాది గందా అని దీమాఖి సంజాయించుకొనుడు. అయినా అమ్మోళ్ళు ఒడి బియ్యంబోసి పెడ్తరు, ఇయ్యన బోనాలకి కొంటడు, సరి పొతాయాంటీ. దిన్‌భర్ మనకి నైటీలే గదా యేసుకొనుడు – నీకు తెల్వంది గాదులే. ఫిర్భీ దీస్కో – దీస్కొని చిచ్చాని ఇంగా చీరలు తేవద్దను. నిజంగా జరూరత్ పడితే అమ్మోల్లో, అన్నోల్లో పెట్టేవి, మీదికెళ్ళి అచ్చే సే పూచేతో ఏ మరద్ కాదంటాడు బీబీ? అయ్యి సరిపోతాయి కదాంటీ. నియ్యత్ కీ కమాయిల శానా ఇజ్జత్ ఉంటాదాంటీ. మరి నే పోయెస్తానే, సరకు తీస్కుపోవాలే.

అనిల్ ప్రసాద్ లింగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here