[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. ఈ నవల పరిచయాన్ని ఇక్కడ చదవండి.]
అధ్యాయం-1 – ఒక మరణం – మొదటి భాగం
క్రానికల్-ii, పేజీ nz23
..మన రెండు ప్రపంచాల మధ్య నిర్దుష్టమైన హద్దులు ఏర్పరిచిన క్లాష్-ii తర్వాత ఇది ఉనికిలోకి వచ్చింది. ఫెన్స్(1) మన పునరావాసానికి, పునర్నిర్మాణానికి హామీ ఇచ్చింది. క్లాష్-ii ఎలోన్ (2) భూదృశ్యాన్ని మార్చింది. చాలా మంది చనిపోయారు. మనం మన సంఖ్యని పెంచుకోవాలి, మన నగరాలను పునర్నిర్మించుకోవాలి.
క్రానికల్ లోని పై వ్యాక్యాలను ప్రాసెస్ చేస్తుండగా (కళ్ళతో చదువుతుండగా), తన ట్యాగ్ నుండి ఒక ఫ్లాష్ వస్తున్నట్లు ఈవీ గ్రహించిది. కానీ దాన్ని పట్టించుకోలేదు, చదవడం కొనసాగించింది.
మనకి, ఇది – గ్రేట్ ఎస్కేప్ కాలం నుండి – మళ్లీ మొదలుపెట్టినట్లుగా ఉంది..
మళ్ళీ ఫ్లాష్ వచ్చింది. ఈసారి ఎమర్జెన్సీ ఫ్లాష్. ముందెన్నడూ జరగని, అనూహ్యమైన సంఘటన జరిగింది. క్రానికల్ నుంచి దృష్టి మరల్చి ఈవీ కళ్ళు తెరిచింది. ఆమె ముందున్న స్క్రీన్‌పై మెసేజ్ మెరుస్తోంది:
ఎవరో చనిపోయారు. సరిహద్దు సమీపంలో మృతదేహం.
ఈవీ నిర్ఘాంతపోయింది. వాల్ట్‌ని నిర్వహిస్తున్న ఇన్ని జాక్ (3) లలో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదు. మరణమా? ఎవరు చనిపోయారు? సరిహద్దు దగ్గర! ఏదో పొరపాటయి ఉంటుంది.
సరిహద్దు ప్రాంతపు ఫోటోలను స్కాన్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఆమె వర్క్‌స్టేషన్‌లోని ఛానెల్ బ్లాక్ అయింది. ఈవీ వెంటనే వాల్ట్ ఛానెల్‌కి మారింది. అది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఖాళీగా ఉంది. ఆమె తన వర్క్‌స్టేషన్‌లోని సిస్టమ్ అంతా క్షుణ్ణంగా చూసింది. కౌన్సిల్ ఛానెల్‌లు నిశ్శబ్దంగా ఉన్నాయి, అలాగే అన్ని ఇతర ముఖ్యమైన ఛానెల్‌లు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఫ్లాష్ సందేశం తప్ప, ఇతర సమాచారం అందుబాటులో లేదు.
వాల్ట్ బయట, ఎలోన్‌లో చీకటి పడి రాత్రి అయింది, దాని మూడు చందమామలు (ఉపగ్రహాలు) ఈవీ ట్యాగ్‌లో ప్రసారమైన అన్యూహ్యమైన సంఘటన నిజం కాదన్నట్టు, ప్రశాంతంగా ఒక వంపు లాగా ఆకాశంలో విస్తరించి ఉన్నాయి.
🚀
నగరంలోని మరొక భాగంలో, క్రియేషన్ ఫెసిలిటీలో టియోని అస్థిమితంగా పైకి కిందకి తిరుగుతోంది. క్రియేషన్ ఫెసిలిటీ అనేది చక్కటి నాలుగు అంతస్తుల భవనం. లేత నీలం రంగు వేసిన గోడలతో, పొడవైన గాజు పలకల కిటికీలతో చాలా శుభ్రంగా ఉంది. కొంచెం సేపటికి టియోని గ్లాస్ ప్యానల్స్ దగ్గర నిలబడి బయటకి చూసింది. వీధి దీపాలు మసకగా వెలుగుతున్నాయి, ఒక షటిల్ అప్పుడే ఆ వీధిని దాటి వెళ్ళింది. ఆకాశంలోని మూడు చందమామలు వెండి వెలుగులా అన్నిటిపై కాంతిని ప్రసరిస్తున్నాయి. చిరుగాలికి దూరంగా ఓ చెట్టు ఆకులు మెల్లగా ఊగడం కనిపించింది. కాలంటే (4) లో ఈ దశలో, ఆ మూడు చందమామలు భూదృశ్యాన్ని వెన్నెలలో ప్రకాశింపజేస్తాయి.
గాజు అద్దాల కిటికీలో టియోని తనను తాను చూసుకుంది, గోళాకారంలోని ముఖం, లేత గోధుమరంగు కళ్ళు, ఎరుపు గోధుమ రంగు కల్సినట్టున వర్ణంలోని మృదువైన కేశాలు అద్దంలో ప్రతిబింబించాయి. మోకాళ్ల వరకు ఉన్న ఆమె గోధుమరంగు కుర్తీ కొద్దిగా నలిగింది. వదులుగా ఉన్న నల్లటి ప్యాంటుపై ఒక మచ్చను గుర్తించి దానిని తుడవడానికి క్రిందికి వంగింది. తాను కోరుకున్నట్టుగా తారకు గిరజాల జుట్టు, నీలికళ్ళు వస్తాయో లేదో అని అనుకుంది. టియోని చాలా ఆలోచించి, సీని సహాయంతో తార కోసం తన కోరికల జాబితాను రూపొందించింది. వారిద్దరూ ఆమె ఎత్తు, ఆమె పెద్దయ్యాక సరైన శరీర బరువు, ఆమె చూపు మరియు వినికిడి పరిధి, ఇతర విషయాల గురించి చాలాసేపు చర్చించుకున్నారు. క్రియేషన్ (సంతానం) కోసం తన అభ్యర్థనను ఆమోదించినప్పటి నుంచి ‘తార’ అనే పేరు, టియోని చిన్న అపార్ట్‌మెంట్ – పాపని ఆహ్వానించడానికి సిద్ధమయ్యాయి.
కానీ, ఇందు కోసం టియోని చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ఎలోన్‌లో అనేక జాక్‌లుగా క్రియేషన్ జరగనందున సంతానం కోసం ఆమె చేసిన అభ్యర్థన క్రియేషన్ ఫెసిలిటీలో నిలిచిపోయింది. టియోని చాలా గట్టిగా సంతానాన్ని కోరుకోవడంతో ఆ కేంద్రాన్ని మళ్లీ తెరిచి, కార్యక్రమాలని పునరుద్ధరించారు. నిపుణులు, టోబోక్‌లు (5) – సృష్టి ప్రక్రియలలో మళ్లీ శిక్షణ పొందారు, చాలా కాలంగా సృష్టి జరగకపోవడంతో వాళ్ళు ఆ పక్రియని దాదాపుగా మరచిపోయారు. తరువాత, టియోని శరీరం నుండి ఒక కణాన్ని బయటకు తీశారు, ఆమె కోరిన లక్షణాల ప్రకారం పాపకి రూపకల్పన చేశారు, ఇన్‍క్యుబేటర్‍లో ఉంచారు. ఈ రాత్రి, టియోనికి ఆమె పాప ‘తార’ను అప్పగిస్తారు.
క్రియేషన్ చాంబర్ వెలుపల నిశ్శబ్దంగా ఉన్న వెయిటింగ్ రూమ్‍లో టియోని ఒంటరిగా, బయట ప్రకాశవంతంగా వెలుగుస్తున్న కాంతిని చూస్తూ ఉంది. తారతో తన మొదటి కలయికకి అంతరాయం కలిగకూడదని, ఈ కేంద్రంలోకి అడుగుపెడుతున్నప్పుడే, తన ట్యాగ్‌ని షట్ డౌన్ చేసింది, లేదంటే దాన్నుంచి వచ్చే ఎడతెగని సందేశాలు విసిగిస్తాయి. చిన్న చతురస్రాకార పరికరమైన ఆ ట్యాగ్ వారికి లైఫ్‌లైన్ వంటిది. అది వారిని ఎలోన్ నెట్‌వర్క్‌ల చుట్టూ ఉండే సిస్టమ్ తోనూ, ఒకరితో ఒకరిని కనెక్ట్ చేస్తుంది. చాలా మంది తమ చేతుల్లోపల ట్యాగ్‌ను అమర్చుకున్నారు, అయితే టియోని వంటి కొందరు మాత్రం దానిని విడిగా ఉంచుకున్నారు.
ఎట్టకేలకు ఛాంబర్ బయట లైట్ ఆఫ్ అయి, తలుపు తెరుచుకునేసరికి, రాత్రి తప్పుకుని – వేకువ తొలి కిరణాలకు దారి ఇచ్చింది. లేత నీలిరంగు యూనిఫారం ధరించిన నిపుణురాలు, చక్రాలున్న దీర్ఘచతురస్రాకార టోబోక్‌తో బయటకు వచ్చింది. ఆ యంత్రంలో ఉన్న చిన్న ఖాళీలో ఓ చిన్న బుట్ట లాంటిది ఉంది. నిపుణురాలు ఆ బుట్టను టియోని చేతుల్లో పెట్టింది. లోపల చిన్నారి తార! పాప జుట్టు గిరజాలుగా ఉంది, టియోని కోరుకున్నట్లుగానే తార తన నీలి కళ్ళతో చుట్టూ చూసింది.
టియోని వెయిటింగ్ ఏరియాలో ఒకపక్కగా ఉన్న సోఫాలో కూర్చుని తన చేతుల్లోని తారని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. టోబోక్ జాగ్రత్తగా ఛాంబర్‌లోకి తిరిగి వెళ్ళింది. నిపుణురాలు, “పాప శ్రేయస్సు కోసం అన్ని సూచనలు మీ ట్యాగ్‌కి పంపాము. వాటిని పాటించండి. పాప కల్చర్ చేయబడిన సెల్ స్ట్రక్చర్ వివరాలు కూడా అప్‌లోడ్ చేశాము. మీరు ఇప్పుడు పాపను మీతో తీసుకెళ్లవచ్చు. మీరు బాగానే ఉన్నారా? నాకు తెలిసినంత వరకూ, పాపని చూసుకోవడం ఎంతో శ్రమతో కూడినది, చాలా కృషి అవసరం. కాబట్టి, వెంటనే మీరు పాప అంగాలేవీ మార్చుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అవయవాల మార్పిడి గురించి మీకు నా నుండి ఎలాంటి సలహా అవసరం లేదు!” అంది. టియోని తార వైపు చూస్తూ మెల్లగా గుసగుసలాడుతూ, “నేను బాగున్నాను” అంది.
“అయితే సరే, ఎలోన్‌కి సరికొత్తగా ప్రవేశించిన పాపతో మీ సమయాన్ని ఆస్వాదించండి” అని చెప్పి నిపుణురాలు ఛాంబర్ వైపు వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుంది. టియోని వెయిటింగ్ రూమ్‌లో తన చేతుల్లో కొత్త ప్రాణితో కాస్త వణుకుతూ కూర్చుంది. అకస్మాత్తుగా, ఈ క్షణం కోసం తాను చేసుకున్న సన్నాహాలు సరిపోవేమో అనుకుంది. క్రియేషన్ విషయంలో అందరు క్లారెంట్‌లు (6) తనలాగే అనిశ్చితంగా, అనిశ్చయంగా ఉండి ఉంటారా అని ఆమె ఆశ్చర్యపోయింది. తారను పదిలంగా పట్టుకొని, టియోని తన మొదటి అడుగులు జాగ్రత్తగా వేసి, లిఫ్ట్ వైపు నడిచింది. ఆమె భవనం నుండి బయటికి వచ్చి రోడ్డుపైకి వచ్చింది. షటిల్ స్టాప్ వద్ద నిలబడి, పాప ఉన్న బుట్టని శరీరానికి దగ్గరికి పట్టుకుంది. అరుణ కిరణాలు నగరాన్ని స్నానం చేయిస్తున్నాయి. వాళ్ళు బయటకి రాగానే తార అప్రయత్నంగా కళ్ళు మూసుకుంది. ఆమె టియోని చేతుల్లో నిశ్శబ్దంగా పడుకుంది. వీధి ఖాళీగా ఉంది; తెల్లవారుజామున ఉండే నిశ్చలత, నిశ్శబ్దత చుట్టూ ఆవరించి ఉన్నాయి. టియోని షటిల్ కోసం ఎదురు చూస్తోంది. తార రాకతో తన జీవితం ఎలా మారుతుందోనని అనుకుంది. సంతానాన్ని చూసుకోవడం గురించిన సూచనల మాన్యువల్ దీన్నొక సాధారణ పనిగా మార్చింది, అయితే దీనికి శ్రమ, సమయం అవసరమని నిపుణురాలు చెప్పింది. తను అందుకు తగినట్లు ఉందా?
షటిల్ వచ్చింది. సొగసైన, లోతైన గోధుమ రంగు చెక్క తయారైన ఆ షటిల్ సౌరశక్తితో నడుస్తూ కారిడార్‌లను దాటింది, సౌరశక్తి నగరానికి దూరంగా యూనిట్లలో నిల్వచేయబడుతుంది.
ఆ తెల్లవారుజామున షటిల్‌లో ఎవరూ లేరు. టియోని తన ట్యాగ్‌ని స్వైప్ చేయగానే, షటిల్ ఆమె అపార్ట్‌మెంట్ వైపు పరుగులు తీసింది.
🚀
ఎలోన్‍లో అత్యున్నత నిర్ణయాధికార బృందమైన ‘కౌన్సిల్’ అత్యవసరంగా సమావేశమైంది. సభ్యులు ఏడుగురిని తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు. గత పది జాక్‌లలో ఎన్నడూ ఇలా జరగలేదు. కౌన్సిల్ సభ్యులు సాధారణంగా తమ ట్యాగ్‌ల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు, భౌతికంగా కలిసేది తక్కువ. అయితే, నిన్న రాత్రి జరిగిన దారుణ సంఘటన వారందరిని భౌతికంగా సమావేశమయ్యేలా చేసింది.
క్రిస్-క్రాసింగ్ స్కైవాక్‌ల ద్వారా అనుసంధానించబడిన ఎత్తైన, అందమైన భవనాల మధ్య, కౌన్సిల్ భవనం మధ్యస్థ పరిమాణంలో, పసుపు రంగులో, చిన్న చతురస్రాకార స్థలంలో ఉంది, చుట్టూ చెట్లు. సభ్యులు సమావేశమైన ప్రధాన గదిలో ఒక రౌండ్ టేబుల్ ఉంది, దాని మీద మసకబారిన రంగు బట్ట ఏదో కప్పి ఉంది. పారదర్శక పైకప్పు గుండా ఆ గదిలో సూర్యకాంతి ప్రసరిస్తోంది.
రౌండ్ టేబుల్ వద్ద తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుంది క్రేటీ. ఆమెవి పొడవాటి నల్లటి కేశాలు, వాటిని ఓ బన్‍లో చుట్టింది. ఆమెది గంభీరమైన వదనం, శ్రావ్యమైన స్వరం. వంతుల ప్రకారం – ఆమె ప్రస్తుతం కౌన్సిల్‌కు అధిపతి. కౌన్సిల్ నియమాలు సరళంగా ఉంటాయి. పురాతన నివాసి శాశ్వత సభ్యులవుతారు, ఏ నిర్ణయాన్నైనా వీటో చేయగల ఏకైక వ్యక్తి అవుతారు. ప్రతి ఐదు జాక్‌లకు కౌన్సిల్ నాయకత్వం – ఇతర ఆరుగురు సభ్యుల మధ్య మారుతూంటుంది. ఒక సభ్యురాలు ముప్పై జాక్‌లకు నామినేట్ అవుతుంది. ఖాళీ ఏర్పడినప్పుడు, మిగిలిన సభ్యుల ఏకాభిప్రాయంతో కొత్త సభ్యురాలిని నామినేట్ చేస్తారు.
టేబుల్ చుట్టూ కూర్చున్న సభ్యులు క్రేటీ సమావేశాన్ని ప్రారంభించడం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె గొంతు సవరించుకుని, “ఈ సమావేశం ఎందుకో, బహుశా, మీకు తెలిసే ఉంటుంది. నిన్న రాత్రి ఓ మరణం సంభవించింది. ఇది గత వందల జాక్‌లలో జరిగిన మొదటి సంఘటన మాత్రమే కాదు, మరొక కారణం వల్ల కూడా ముఖ్యమైనది.”
మిగతావాళ్లు కాస్త తికమకకి లోనయ్యారు. కానీ కౌన్సిల్‌లోని అతి పురాతన నివాసి అయిన ఉల్తూర్ మాత్రం తన వీపుని నిటారుగా చేసి కూర్చుంది.
ఉల్తూర్ ముదురు ఎరుపు రంగు కేశాలు ఆమె భుజాల క్రింద వరకూ వేలాడుతున్నాయి. ఆమె ఎత్తు మధ్యస్థంగా ఉంది, దృఢమైన శరీరం. ముదురు గోధుమ రంగు కళ్ళు, సుదీర్ఘ కాలం జీవించడం వల్ల కలిగిన జ్ఞానం, వివేకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం, అవి తమ కాంతిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. కన్నీళ్లు కార్చినట్లుగా, ఆమె కళ్ళు శూన్యంగా ఉన్నాయి.
క్రేటీ మరోసారి గొంతు సవరించుకుని, ఉల్తూర్ వైపు చూసింది, కానీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం స్పష్టంగా అడిగితే తప్ప ఎవరూ జోక్యం చేసుకోరు లేదా సలహా ఇవ్వరు. ఉల్తూర్ ఏమీ మాట్లాడకపోవడంతో, క్రేటీ కొనసాగించింది, “చనిపోయింది సీని అని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను, తను ఉల్తూర్ కూతురు, ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగినది కాదని నమ్మేందుకు కారణాలు ఉన్నాయి.”
అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిట్టూర్చారు. వాళ్లందరికీ సీని తెలుసు. అందం, తెలివి కలగలిసినట్లుండే సీని ఎలోన్‌లోని అత్యున్నత విద్య మరియు పరిశోధనా కేంద్రంగా ఉన్న ఇరానా హబ్‌లో బోధనా కార్యక్రమాలలో పాల్గొనేది.
“అది ప్రమాదం కాదని అనడంలో నీ ఉద్దేశం ఏమిటి? మరి ఇలా ఎలా జరిగింది?” ఉల్తూర్ అడిగింది, ఆమె గొంతు కొద్దిగా వణికింది.
క్రేటీ నెమ్మదిగా బదులిస్తూ, “మన ప్రాథమిక నివేదికలో సీనీకి విషం ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది. ఆమె మెడ మీద ఒక అస్పష్టమైన తూటు ఉంది. మనందరికీ తెలిసినట్లుగా, ఆమె శవం సరిహద్దు దగ్గర పడి ఉంది. సమగ్రమైన దర్యాప్తు జరుగుతోంది, ఈ విహాన్ (7) ముగిసే లోపు మనకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. అనేక జాక్‌ల క్రితమే మనం అన్ని విష్ (8) దుకాణాలను నాశనం చేశాం కాబట్టి, సరిహద్దుకు అవతలి వైపు ఉన్నవారు బాధ్యులు కావచ్చనే అభిప్రాయం ఉంది” అని అంది.
“అది అసాధ్యం!”
“ఎప్పుడూ వినలేదు!”
“ఏదో పొరపాటు జరిగి ఉండాలి..”
“వాళ్ళెందుకు చేస్తారు?”
“వాళ్ళు శాంతికి భంగం కలిగించరు. శాంతి పరస్పరం ప్రయోజనం!”
బల్లకి రెండు వైపులా కూర్చున్న వారు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉల్తూర్ ఒక్కర్తే మౌనంగా ఉండిపోయింది.
ఆమె ఏదైనా చెబుతుందేమోనని క్రేటీ ఎదురుచూస్తోంది. అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమెకి గుర్తున్నంత వరకూ ఎవరూ చనిపోలేదు. ఈ సంఘటన ఓ విపత్తు, అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగినది కాదని అనడం నమ్మడానికి కష్టంగా ఉంది. రిపోర్ట్ చూసినప్పుడు, క్రేటీ ఆశ్చర్యపోయింది. ఫెన్స్ ఏర్పర్చినప్పటి నుంచి ఎలాంటి ఆక్రమణలు జరగలేదు. క్లాష్-ii వందల జాక్‌ల క్రితం జరిగింది. ఆ సమయంలో, ఇరు వైపులా చాలా మంది చనిపోయారు. క్లాష్-ii నుండి బయటపడిన కొద్దిమందిలో ఉల్తూర్ ఒకరు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆమె సహాయం చేస్తుందని క్రేటీ ఆశించింది, కాని ఉల్తూర్ మౌనంగా ఉంది.
“అయితే, ఇప్పుడు మనమేం చేయాలి? మనకి ప్రతిస్పందన అవసరం” అంది సభ్యులలో ఒకరైన గేలా స్పష్టంగా. సభ్యులు క్రేటీ వైపు చూశారు, ఆమె ఉల్తూర్ వైపు చూసింది. ఉల్తూర్ తన ముందున్న స్క్రీన్ వైపు చూస్తూ, దీర్ఘాలోచనలో లీనమైంది.
“ఫైనల్ రిపోర్ట్ రాగానే మళ్లీ కలుద్దాం. జరిగిన దానికి సంబంధించిన ఊహ సరైనదేనా కాదా అని నిర్ధారించుకుందాం. మనం మన ప్రతిస్పందనను అప్పుడు నిర్ణయిద్దాం” అని ప్రకటించింది, క్రేటీ. సమావేశం ముగిసినట్లు అనిపించినప్పటికీ, అనిశ్చితి వల్ల, ఏం చేయాలో తెలియక, సభ్యులు కూర్చునే ఉన్నారు. కాసేపటి తర్వాత అందరూ ఒక్కొక్కరుగా బయటికి నడిచారు. ఆ గదిలో ఇప్పుడు ఉల్తూర్, క్రేటీ మాత్రమే మిగిలారు.
“విషమే కారణమని నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు?” తన మౌనాన్ని భగ్నం చేస్తూ అడిగింది ఉల్తూర్.
“ఉల్తూర్, ప్రాథమిక నివేదికలో పేర్కొన్నది అదే. నేను ముందే చెప్పినట్లు, మనం యాభై జాక్‌ల క్రితమే విష్ దుకాణాలని తొలగించాం. కానీ అవతలి వైపు అలా లేదని కూడా మనకు తెలుసు.”
“హ్మ్.. ఫైనల్ రిపోర్టు కోసం వేచి ఉండాలన్న నీ నిర్ణయం సరైనదే” అని చెప్పి ఉల్తూర్ వెళ్లిపోయింది. ఆమె భుజాలు కుంగిపోవడం, నడక నెమ్మదిగా ఉండటం క్రేటీ గమనించింది. బహుశా ఈ షాక్‌ని తట్టుకోవడానికి ఉల్తూర్ కొన్ని అవయవాలను కొత్తవాటితో మార్చుకోవాల్సి వస్తుందేమో అని క్రేటీ అనుకుంది.
కౌన్సిల్ భవనం నుండి బయటకు వచ్చాక, ఉల్తూర్ తన అపార్ట్‌మెంట్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంది. రహదారి పొడవుగా, అంతులేనిదిగా, ఖాళీగా కనిపించింది, ఆమె జీవితం లానే. ఎన్నడో మరచిపోయిన వేదన – ఇప్పుడు తనను చుట్టుముట్టినట్లు ఆమె భావించింది. ఇకపై ఇల్లు కూడా ఖాళీగానే ఉంటుంది. మధ్యలో, ఉల్తూర్ తన మార్గాన్ని మార్చుకుంది, ఇంటి వైపు కాకుండా ఫెన్స్ వైపు నడిచింది. సీని గురించిన ఆలోచనలు ఆమె మదిలో మెదులుతున్నాయి. ఇక సీని ఇంటికి తిరిగొచ్చి తనని పిలవదు. సీని వెళ్ళిపోయింది. ఆమె చనిపోయింది.
ఉల్తూర్ – మరణాన్ని చూసి చాలా కాలం గడిచిపోయింది. చివరిసారిగా క్లాష్-ii సమయంలో మరణాలు సంభవించాయి, అది చాలా జాక్‌ల క్రితం జరిగింది. క్లాష్-ii అనంతరం ఎలోన్ చాలా మారిపోయింది. ఇది ఇప్పుడు పెద్ద నగరాలను కలిగి ఉంది, ఎత్తైన, సొగసైన భవనాలు, అనేక చెట్లు, ఇంకా ఉద్యానవనాలు ఉన్నాయి. ఆకాశాన్ని తాకే నడక మార్గాలు – భవనాల మధ్య సున్నితమైన జాలీగా ఏర్పడ్డాయి. రహదారులు విశాలంగా ఉన్నాయి. ఎనర్జీ కారిడార్‌ల ద్వారా నగరాల మధ్య తిరిగే షటిల్స్ ఉన్నాయి. ఒకప్పుడు సొగసుతో నిండి హొయలొలికిన, ఎలోన్ నగరాలు ప్రస్తుతం కాస్త ఉదాసీనమైన సౌందర్యాన్ని కనబరుస్తున్నాయి.
స్కైవాక్‌లు, రోడ్లు దాటుకుంటూ ఉల్తూర్ ఎట్టకేలకు ఫెన్స్ వద్దకు చేరుకుంది. ఒక మార్గం ఫెన్స్‌కి సమాంతరంగా ఉంది, ఆ బాటకి రెండు వైపులా అనేక వృక్షాలున్నాయి. చుట్టూ పచ్చదనం, మధ్యలో రంగురంగుల పువ్వులు, ఇంకా రకరకాల ఆకృతలలో ఆకులు. సీని శవం పడి ఉందని అన్న చోటికి ఆమె నడిచింది. ఫెన్స్ అని పిలవబడుతున్న అపారదర్శక ప్రాంతం వైపు చూసింది ఉల్తూర్. క్లాష్-ii అనంతరం సృష్టించబడినప్పటి నుండి ఈ సరిహద్దులని ఎవరూ ఉల్లంఘించలేదు. ఫెన్స్‌కి అవతలివైపు ఉన్నవారు తన సంతానం సీనిని చంపేశారంటే ఉల్తూర్‌కి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఉల్తూర్ తల విదిలించి, ఫెన్స్ వెంబడి ఉన్న మార్గంలో నడవడం ప్రారంభించింది. మున్ముందు పెను విపత్తు రానున్నదన్న భావన ఆమెలో నెలకొంది. ఇతరులకు గుర్తురాని ఎన్నో విషయాలను గుర్తు చేసుకుందామె.
~
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Fence ఫెన్స్= సరిహద్దు
(2) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(4) Calante, కాలంటే = ఎలోన్ గ్రహంలో ఒక నెల
(5) Tobok, టోబోక్ = యంత్ర సహకారి
(6) Clarent, క్లారెంట్ = క్లోనింగ్ పేరెంట్
(7) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం
(8) Vish, విష్ = విషమయమైన పదార్థం
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.