[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[సీని మరణ వార్త విన్న ఈవీ దిగ్భ్రాంతి చెందుతుంది. నమ్మలేకపోతుంది. గత వారమే – ఇరానా హబ్‍లో ఆసక్తికరమైన మాడ్యూల్ గురించి తాను సీనిని ట్యాగ్ చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. టియోనిని తలచుకుని, సీని గురించి తనకేమైనా తెలుసునేమోనని ఆమెకు అత్యవసరం సందేశం పంపుతుంది. చాలా ఏళ్ళుగా ఎలోన్‍లో మరణాలు లేకపోవడంతో – చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారో తెలుసుకోవాలనుకుంది. ఎన్నో ఆలోచనలతో నిద్రపోతుంది. మెలకువ వచ్చేసరికి నగరం ఇంకా చీకట్లోనే ఉంటుంది. ట్యాగ్ చూసుకుంటే, టియోని నుంచి ఏ సందేశమూ కనబడదు. ఈ గందరగోళం ఎప్పుడు సర్దుమణుగుతుందా అని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. ప్రామ్‍లీ తన పొలంలో కోతకి సిద్ధంగా ఉన్న అమర్ పంటను చూస్తూ ఉంటుంది. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆమె శరీరావయవాలను మార్చుకుంది. పని చేస్తున్న టోబాక్‍లను జాగ్రత్తగా పరిశీలించి, ఇంట్లోకి వస్తుంది. గోడపై ఉన్న తెర మీద సీని మరణ వార్త కనబడుతుంది. ఉల్తూర్ తనతో మాట్లాడడానికి అనేకసార్లు ప్రయత్నించినట్టు తన ట్యాగ్ ద్వారా గ్రహిస్తుంది ప్రామ్‍లీ. సీనితో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకుని, ఆమె మరణానికి బాధపడుతుంది. ట్యాగ్ ద్వారా ఉల్తూర్‍ని సంప్రదిస్తుంది. సీనీ మరణం గురించి ఉల్తూర్ ఏదో చెప్పబోతే, ముందు మనం ఎన్‍క్రిప్టెడ్ ఛానల్‍కి మారదాం అని – ఆ ఛానల్‍కి మార్పిస్తుంది. అప్పుడు – ఫెన్స్‌కి అవతలి వైపు వాళ్ళు చేసిన విషప్రయోగం వల్ల సీని చనిపోయినట్టు కౌన్సిల్ భావిస్తోందని, ఇదెలా సాధ్యమని అంటూ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు అనిపిస్తోందంటుంది ఉల్తూర్. కౌన్సిల్ నిర్ధారించిందా అని ప్రామ్‍లీ అడిగితే, ఓ వారంలో నిర్ధారణ కావచ్చని చెప్పి, ఒకవేళ అది కనుక నిజమైతే, ఏం చేయాలో నీకు తెలుసు అని ప్రామ్‌లీతో అంటుంది ఉల్తూర్. అప్పటిదాకా వేచి ఉందామని, ఈ లోపు పంట కోతలు అయిపోతాయి, తర్వాత సిటీకి వస్తాను అని చెబితే, ఉల్తూర్‌కి కాస్త కోపం వచ్చి సెక్యూర్డ్ లైన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ సంఘటన ఎలోన్‍లో ఎన్నో నిద్రలేని రాత్రులను మిగులుస్తుందని ప్రామ్‍లీకి తెలుసు. నిద్ర లేవగానే ఈవీ తన ట్యాగ్‍ని చూసుకుంటుంది, కానీ టియోని నుంచి ఏ సందేశమూ కనబడదు. ఆమె వర్క్ స్టేషన్‍లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఈవీ. కానీ కుదరదు. తను నిర్వహించే వాల్ట్‌ని స్క్రోల్ చేస్తుంది. వాల్ట్ అనేది ఎలోన్ గ్రహపు వారసత్వ సంపదని భద్రపరిచే డిజిటల్ భాండాగారం. ఆఫీసు పనులకు కోసం తయారవుతుండగా ఆమె సిస్టమ్‍లో ఓ మ్యూజిక్ ఫైల్ ప్లే అవుతుంది. అది అత్యంత మధురంగా ఉంటుంది. దాన్ని సీని ఇచ్చింది. ఎక్కడితో చెప్పమంటే, సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటుంది. ఇలా సీని జ్ఞాపకాలలో మునుగుతుంది ఈవీ. సీని బలవంతం మీదే తాను క్రానికల్ చదివిన సంగతి గుర్తు చేసుకుంటుంది. టియోని ఎందుకు అందుబాటులో లేదో అని మళ్లీ అనుకుంటుంది. సీని తనకు పంపినట్టే ఆ మ్యూజిక్ ఫైల్‍ని టియోనికి కూడా పంపినట్టు గ్రహిస్తుంది. తన ఇంట్లో టియోని కూతురు తారతో తీరిక లేకుండా ఉంటుంది. పసిపాప స్పర్శని అనుభూతి చెందుతూ, తన ఏడుపులకి స్పందిస్తూ – క్లారెంట్‍గా కొత్త అనుభూతులను స్వంతం చేసుకుంటుంది టియోని. ట్యాగ్‍తో ఒకసారి కనెక్ట్ అవనా అని ఆలోచించి, మళ్ళీ వద్దనుకుంటుంది. పాపని నిద్రబుచ్చి, అసలు తానెందుకు పాపని కావాలనుకుందో గుర్తు చేసుకుంటుంది టియోని. కాసేపయ్యాక, తార మళ్ళీ ఏడవడంతో, పాపని ఎత్తుకుని పచార్లు చేసి మళ్ళీ నిద్రబుచ్చుతుంది. బయట అంతా చీకటి, నిశ్శబ్దం ఆవరిస్తాయి. ఇక చదవండి.]
అధ్యాయం-1 – ఒక మరణం – మూడవ భాగం
[dropcap]సీ[/dropcap]ని ఎప్పుడూ కూర్చునే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న కుర్చీని చూస్తూ నిశబ్దంగా టేబుల్ దగ్గర కూర్చుంది ఉల్తూర్. దాదాపు ఐదు రోజులు గడిచాయి, కానీ ఆమె మరణం వెనుక కారణం గురించి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. ఫెన్స్ (1) దగ్గరకి వెళ్ళొచ్చాకా, ఉల్తూర్ ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టలేదు. సీని మరణం, ఇక ఎన్నడూ ఆమెనిచూడలేనన్న వేదన – ఉల్తూర్ మనసుని ఆవరించి, క్రుంగదీస్తోంది. కడుపుకోత అనే దుఃఖం ఆమెను వెల్లువలా ముంచెత్తింది. ఆమె చెంపల మీదుగా కన్నీళ్ళు జారాయి.
ప్రామ్‌లీ వెంటనే నగరానికి వస్తుందని ఖచ్చితంగా భావించింది ఉల్తూర్. కానీ, ప్రామ్‌లీ తన పంటకే ప్రాధాన్యతనీయడం ఉల్తూర్‍ని ఆశ్చర్యపరిచింది. కన్నీళ్లు తుడుచుకుని, టేబుల్ పై తల ఉంచి, చేతులు జాపుకుని విశ్రాంతిగా కూర్చుంది ఉల్తూర్.
ఇది చేసింది ‘వాళ్ళే’ అనడం నిజమేనా? అదే నిజమైతే, అప్పుడు, ఎందుకు చేశారు? గత కొన్ని జాక్‌లుగా ఏర్పడిన శాంతి, ప్రశాంతత మళ్లీ చెదిరిపోబోతున్నాయా?
సీని మరణం నుండి ఉత్పన్నమవుతున్న ఎన్నో ప్రశ్నలు – ఉల్తూర్ మనసులో ఎడతెగకుండా తిరుగుతున్నాయి. వాటి నుండి ఎటువంటి ఉపశమనమూ ఉండడం లేదు.
తలుపు వద్ద సెన్సార్ స్పందించింది. ఉల్తూర్ ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు చాలా అరుదు, పైగా ట్యాగ్‌లో ముందుగా నిర్ధారించకుండా ఎప్పుడూ ఎవరూ రారు. బయట నిలబడిన వ్యక్తిని ఆమె గుర్తించలేదు. తెలిసినవారిలానే అనిపిస్తున్నా, ఉల్తూర్ వెంటనే పోల్చుకోలేకపోయింది. ట్యాగ్ ద్వారా, విసుగ్గా, “ఎవరది?” అని అడిగింది.
బయట నిలుచుని ఉన్న ఈవీ తలుపు తెరపై ఆ ప్రశ్నను చదివింది. ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. తాను ఎందుకు వచ్చింది? ఈవీ ఇంతకు ముందెప్పుడూ ఉల్తూర్‌ని కలవలేదు. కానీ ఇతర క్లారెంట్‌లు (2), వారి క్రియేషన్‌ల (3) వలె కాకుండా; సీని, ఉల్తూర్ కలిసే ఉండేవారని ఈవీకి తెలుసు. తన కంటే ఉల్తూర్ ఎక్కువ బాధని అనుభవిస్తూంటుందని ఈవీకి తెలుసు. బహుశా ఆ ఆలోచనే ఈవీని ఇక్కడికి తీసుకొచ్చింది.
“నేను ఈవీ. వాల్ట్ మేనేజర్‍ని. నాకు సీని తెలుసు” అంటూ స్క్రీన్‌పై చెప్పింది. వెంటనే తలుపు తెరుచుకుంది. లోపల, పెద్ద గదంతా పరచుకున్న రంగులు ఈవీని ఆకర్షించాయి. గోడలు ప్రకాశవంతమైన పరదాగుడ్డలు, స్పష్టమైన చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి. చుట్టూ తళతళలాడుతున్న రంగులెన్నో ఉన్నా, ఉల్తూర్ ఉదాశీనంగా, ఒంటరిగా, వివర్ణంగా, అలసిపోయినట్టుగా టేబుల్ వద్ద కూర్చుని ఉంది.
ఈవీ ఆమెకు ఎదురుగా కూర్చుని మాటల కోసం వెతుక్కుంది. ఏం చెప్పాలో ఆమెకు తోచలేదు. ఉల్తూర్ కూడా తన మౌనాన్ని కొనసాగించింది.
“కొద్ది రోజుల క్రితం సీని నాకేదో పంపింది. దాన్ని నేను మీ సిస్టమ్‌కి పంపవచ్చా, ఉల్తూర్?” అంటూ ఈవీ భారీ నిశ్శబ్దాన్ని ఛేదించింది.
“ఏంటది?” ఆశ్చర్యంగా అడిగింది ఉల్తూర్.
‘ఏదో సంగీతం. చాలా మధురంగా ఉంది.”
ఉల్తూర్ అవాక్కయ్యింది. సీనికి సంగీతంపై ఆసక్తి ఉందా? ఈ విషయం ఆమెకు కూడా తెలియదు.
‘నీకు సీనీ ఎలా తెలుసు, ఈవీ?”
సీని వాల్ట్‌ని సందర్శించడం గురించి, క్రానికల్‌ని చదవమని ఆమె తనని ఎలా ప్రోత్సహించిందో ఈవీ ఉల్తూర్‌కి చెప్పింది. ఈవీ మాట్లాడుతున్నప్పుడు, ఆమె చెంపలపై కన్నీళ్లు జారుతున్నట్లు అనిపించింది. ఉల్తూర్ రెప్పవేయకుండా ఆమెనే చూస్తూండిపోయింది. చనిపోయిన వారి కోసం పడే బాధ ఎలా ఉంటుందో ఎలోన్ (4) ప్రజలకు అర్థం కాదు. వారు దానిని మళ్లీ తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైందా?
ఈవీ మాట్లాడటం పూర్తయ్యేసరికి, ఆమె కన్నీళ్ళు ఎండిపోయాయి. ఆమె లోని బాధ కొంత మేర తగ్గినట్లు తేలికగా అనిపించింది. ఈవీ మళ్ళీ గది చుట్టూ చూసింది. ఈ అపార్ట్మెంట్ ఆమె ఇంటి కంటే చాలా పెద్దది. ఎదురుగా ఉన్న గోడకు జటిలంగా, మనోహరంగా అల్లిన ఓ వస్త్రం వ్రేలాడదీసి ఉంది. ఆమెకు సీని గుర్తుకొచ్చింది. ఈవీ ఈ గదిలో సీనిని చూడగలింది. ఈ వాతావరణం – సీనీ దుస్తులకు, ఆమె పొడవాటి ముదురు ఎరుపు జుట్టుకు, ఇంకా ఆమె వ్యక్తిత్వంలోని లాలిత్యానికి సరిపోలింది. కానీ, ప్రస్తుతం, ఆ గదిలో అనేక వర్ణాల చిత్రదర్శిని ఉన్నప్పటికీ, అక్కడంతా ఖేదమూ, వ్యాకులత నిండి ఉన్న అనుభూతి కలుగుతోంది. తాను ధరించిన ఎరుపు దుస్తులు ఆ గది వాతావరణానికి అంతగా నప్పలేదని ఈవీ అనుకుంది.
కొద్ది సేపటి తర్వాత, “ఆ మ్యూజిక్ ఫైల్ నాకు పంపించు. సంతోషంగా వింటాను” చెప్పింది ఉల్తూర్.
దాన్ని ఆమెకు పంపింది ఈవీ. వారిద్దరి మధ్యా మళ్ళీ నిశ్శబ్దం అలముకుంది. ఈవీ మనసులో ఒక ప్రశ్న తలెత్తింది, కానీ ఉల్తూర్‌ని ఎలా అడగాలో అర్థం కాలేదు. ఆమె నోరు తెరిచింది కానీ తడబడింది. చివరగా, ఇంక ఆపుకోలేక గొంతు పెగల్చుకుని, “సీనీకి ఏమైంది? ఏం జరిగిందో ఎవరికీ తెలిసినట్లు లేదు.”
“కౌన్సిల్ వాళ్ళేం చెప్తారో అని నేను కూడా ఎదురుచూస్తున్నాను” ఉల్తూర్ బదులిచ్చింది.
తను బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైందని ఈవీకి అర్థమైంది. లేచి తలుపు వైపు నడిచింది.
“సీని గురించి ఏదైనా తెలిస్తే, నేను నీకు తెలియజేస్తాను” ఉల్తూర్ టేబుల్ దగ్గర నుండే చెప్పింది. ఈవీ తల వూపి, తలుపు మూసి వెళ్ళిపోయింది.
ఆ మ్యూజిక్ ఫైల్ ఇప్పుడు ఉల్తూర్ సిస్టమ్‌లో ఉంది. ఆమె దానిని ప్లే చేసింది. ఓ మధురమైన శ్రావ్యత గది అంతటా పరుచుకుంది. స్వరాలు పై స్థాయికి వెళ్తుంటే, ఉల్తూర్ ఉలిక్కిపడింది. ఆ సంగీతంలో వినిపిస్తున్న అనేక వాయిద్యాలను ఆమె ఎప్పుడూ వినలేదు. పదేపదే విన్నప్పటికీ, ఆమె వాయిద్యాలను గుర్తించలేకపోయింది. సిస్టమ్ కూడా వాయిద్యాల గురించి లేదా ఆ సంగీతం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. అది ఎలోన్‌లో (4) స్వరపరచబడలేదని స్పష్టంగా తెలుస్తోంది.
“సీనికి ఈ మ్యూజిక్ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా?” అని ఉల్తూర్ టాగ్‍లో ఈవీని అడిగింది.
“నాకు తెలియదు. నేను తనని అడిగాను. తగిన సమయం వచ్చినప్పుడు చెప్తానని మాత్రమే సీనీ చెప్పింది” అంటూ వెంటనే జవాబిచ్చింది ఈవీ.
ఉల్తూర్ స్తబ్ధత నుండి బయటపడింది. సీనీకి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఈ మ్యూజిక్ ఫైల్ కీలకమేమో అని ఉల్తూర్ ఆలోచిస్తుండగా, నేపథ్యంలో, సిస్టమ్ ఆ మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంది.
🚀
ఉల్తూర్‌ని కలిసిన తర్వాత, ఈవీకి ఉపశమనం కలిగింది. ఆమె వాల్ట్‌కి తీసుకువెళ్ళే షటిల్ ఎక్కింది. సీని మరణం వంటి అసాధారణమైన సంఘటన తర్వాత, విషయాలు ఎప్పటికీ సాధారణ స్థితికి రావని అనిపించింది. కానీ అంతా మామూలుగానే ఉంది. షటిల్ కిక్కిరిసిపోయి నడక మార్గాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఉల్తూర్, ఈవీ, బహుశా టియోని వంటి కొందరిని మినహాయించి, అందరి కోసం జీవితం ముందుకు సాగుతున్నట్లే ఉంది.
వాల్ట్‌కు కూడా మామూలుగా కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. తనకి కాస్త తీరిక దొరికాకా, ఈవీ టియోనిని మళ్లీ ట్యాగ్ చేయడానికి ప్రయత్నించింది, కానీ నిరాశే ఎదురైంది. అసహనంతో, ఈవీ క్రానికల్ చదవాలని అనుకుంది. సీని ఎప్పుడూ వాటిని చదవమని ఎందుకు పట్టుబట్టిందోనని ఆశ్చర్యపోయింది ఈవీ. వాటిని పరిశీలిస్తేనే తెలుస్తుందని ఆమె గ్రహించింది.
“క్రానికల్-ii, పేజీ nz23
మనకి, ఇదంతా పునఃప్రారంభం వంటిది, భూమి నుంచి గ్రేట్ ఎస్కేప్ సమయంలో లాగా! పునర్నిర్మాణం అంత సులభం కాదు. మన సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది; నగరాలను, పట్టణాలను మళ్లీ నిర్మించడానికి మన సంఖ్య సరిపోదు. క్లాష్-ii తర్వాత, మనం రెండు ప్రాధాన్యతలను కలిగి ఉన్నాము: మన సంఖ్యను పెంచుకోవడం, మరొక ఘర్షణ సంభవించే అవకాశాన్ని ముందస్తుగా నిరోధించడానికి – అటువైపు వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. పదేపదే జరుగుతున్న పోరాటాలు, దొమ్మీలు – మనం స్థిరపడటానికి; మనదైన ప్రపంచాన్ని సృష్టించే అవకాశాన్ని కల్పించడం లేదు.
సృష్టి కోసం సౌకర్యాలు ఏర్పాటయ్యాయి, క్రమపద్ధతిలో, అన్ని రికార్డులతో, జననాలు ప్రారంభయ్యాయి. ప్రతి ఒక్కరూ క్లారెంట్‌గా (2) మారారు; వారు కావాలనుకున్నంత మంది సంతానాన్ని పొందవచ్చు. ఈ ప్రక్రియ జరుగుతుండగానే మరో వైపు చర్చలు కొనసాగుతున్నాయి. అటువైపు వారి పరిస్థితి కూడా అలాగే ఉండడంతో గొడవలకు శాశ్వత పరిష్కారం వెతుకుతున్నారు. అప్పుడే మన వైపు నుంచి ఫెన్స్‌కి సంబంధించిన బ్లూప్రింట్‌తో నాంటీ వచ్చారు. ఇది మనం ఎలోన్‌లోకి వచ్చినప్పటి నుండి ఇరుపక్షాలను పీడిస్తున్న కనికరం లేని కలహాలు, సంఘర్షణల నుండి ఉపశమనం కలిగించడం కోసం సిద్ధమైంది.
ఫెన్స్ అనేది ఎలోన్ మెసోస్పియర్ వరకు విస్తరించి ఉన్న ఎలక్ట్రానిక్ షీల్డ్. ఇది ఒక అపారదర్శక అవరోధాన్ని సృష్టిస్తుంది, ఫెన్స్ వెనుక మనం గ్రహం మీద మనం మాత్రమే ఉన్నామన్న భరోసాని కల్పిస్తుంది. అది అభేద్యమైనది. రెండు వైపుల నుండి ఒకేసారి ఇవ్వబడే కమాండ్ ద్వారానో లేదా నానోఎలెక్ట్రిక్ సర్జ్‌తో పేల్చినట్లయితేనే ఫెన్స్ విచ్ఛిన్నమవుతుంది. అది సంఘర్షణకు – హేతుబద్ధమైన, ఉపయుక్తమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని అందించిది. గ్రేట్ ఎస్కేప్ తర్వాత మనమందరం కలిసి ఇక్కడికి చేరుకున్నందున మనం ఈ గ్రహాన్ని పంచుకోవాలి, కానీ ఫెన్స్‌తో. మనం దానిని విద్యుద్బంధన పద్ధతిలో నిర్మించాం. ఫెన్స్ ఒక కవచంలా ఉంటుంది, దాని నీడలో మనలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందవచ్చు, ఎదగవచ్చు.
ఫెన్స్ ఏర్పడిన తర్వాత, మనం మన సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెట్టాము. క్లారెంట్‌లు తమ సంతానం భౌతిక లక్షణాలు, రూపానికి సంబంధించిన ప్రాధాన్యతలను మాత్రమే ఇవ్వాలని కౌన్సిల్ ఒక డిక్రీ ద్వారా నిర్ణయించింది. సంతానం మానసిక సామర్థ్యాలకు ఎటువంటి మార్పులు అనుమతించబడవు. ఈ డిక్రీ భూమిపై ఉద్భవించిన విధానాన్ని, గ్రేట్ ఎస్కేప్‌కు ముందు ఉన్న పద్ధతిని అనుసరించింది.
జాక్‌లు (5) గడిచేకొద్దీ, రీప్లేస్‌మెంట్‌లలో కూడా మనం చాలా పురోగతి సాధించాము. తొలుత, మనం ఎలోన్ భూగర్భంలో ‘నెపో’ (6) ను కనుగొన్నాము. ఇది సున్నితమైన పదార్థం, అవయవాలకు అనువైనది. కానీ, నెపో తరిగిపోయే ఖనిజం కాబట్టి, మనం పునరుత్పాదక వనరుని అభివృద్ధి చేయడానికి కృషి చేశాం. ఎన్నో జాక్‌ల పాటు పరిశోధించిన తర్వాత, మనం అమర్‌ను (7) అభివృద్ధి చేశాం. దీనిని ప్రస్తుతం పర్వత శ్రేణుల పాదాల వద్ద భారీ పొలాలలో సాగు చేస్తున్నారు. పంటను సంవత్సరానికి రెండుసార్లు పండిస్తారు, తరువాత ఆర్గాన్ రా మెటీరియల్ గా ప్రాసెస్ చేస్తారు. మనం అమర్‌ని ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి, రీప్లేస్‍మెంట్స్ సగటున యాభై జాక్‌ల వరకు పనిచేస్తున్నాయి. ఈ మెరుగైన రీప్లేస్‌మెంట్‌ల నాణ్యత వల్ల క్రియేషన్ (సంతానోత్పత్తి) ఒకప్పటిలా లేకుండా పోయింది. పైగా గత కొద్ది జాక్‌లుగా క్షీణించడాన్ని కూడా మనం నిర్ధారించవచ్చు.”
ఈవీ చదవడం ఆపేసింది. లేచి నిలబడి శరీరాన్ని సాగదీసింది. గోడమీద అద్దంలో ఆమె ప్రతిబింబం కనబడింది. పొడుగ్గా, సన్నగా, చిన్న రొమ్ములు, గుండ్రని తుంటితో ఉంది. ఎర్రటి దుస్తులలో ఆమె చాలా అందంగా ఉంది. రాగి రంగు వెంట్రుకలు ఆమె భుజాల వరకు పెరిగాయి. నల్లని కళ్ళు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. తన క్లారెంట్ ఈ లక్షణాల కోసం అడిగిందా? ఈవీ తన క్లారెంట్ గురించి ఆలోచించక – ఇప్పటికి చాలా జాక్‌లు గడిచిపోయాయి. చాలా మందిలాగే, ఆమె కూడా పదహారు జాక్‌ల తర్వాత తన క్లారెంట్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది.
ఈవీ అద్దం నుండి పక్కకి జరిగింది, ఆమె వర్క్‌స్టేషన్‌లో క్రానికల్ ఇంకా తెరిచే ఉంది. క్రియేషన్స్ సంబంధించిన డిక్రీ – గ్రేట్ ఎస్కేప్‌కు ముందు ఉన్న ఏదో విషయాన్ని ప్రస్తావించింది. భూమి – ఆ గ్రహం కథ ఏమిటి? వారు దాన్ని వీడాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? భూమిపై నివసించిన వారు ఎలా ఉండేవారు? వారు ఎలా జీవించేవారు? వాల్ట్ సిస్టమ్‌ను మూస్తేస్తుంటే ఆమెలో ఎన్నో ప్రశ్నలు!
వాల్ట్ నుంచి బయటకొచ్చి ఈవీ తన అపార్ట్మెంట్ వైపు వెళ్ళింది. నగరం మెల్లగా సువాసనతో కూడిన సాయంత్రంలోకి జారుతోంది. రోడ్డు మూలన ఉన్న వృత్తాకార భవనంలో లైట్లు వెలుగుతున్నాయి. అది ఈవీ హాజరైన వాయునం (8). వాయునంలు ప్రాథమిక విద్యా పాఠశాలలు, వీటికి అందరూ హాజరవుతారు. అయితే, కొందరు మాత్రమే ఉన్నత విద్యా కేంద్రాలకు వెళ్లాలని ఎంచుకున్నారు, అతి తక్కువ మంది అంతకన్నా ఉన్నతమైన ఇరానా హబ్‌కు వెళ్తారు. వాయునం లో, నమోదు చేసుకున్న ముగ్గురు విద్యార్థుల కోసం అమర్చిన బోధక యంత్రాలు ఖచ్చితమైనవి, కఠినమైనవి. ఈవీ డాక్యుమెంటేషన్‌లో స్పెషలైజేషన్ చేసి, తరువాత వాల్ట్‌లో చేరింది.
ఆమె షటిల్ కోసం ఎదురుచూస్తోంది, వీధి దీపాలు ప్రకాశవంతం అవుతున్నందు వల్ల నీడలు పొడవుగా సాగుతున్నాయి. క్రానికల్ చదవడానికి ముందు గ్రేట్ ఎస్కేప్ గురించి తానెందుకు వినలేదా అని ఈవీ ఆశ్చర్యపోయింది. వాయునం లో కూడా, గతం గురించి ఎప్పుడూ చెప్పలేదని ఆమె గుర్తుచేసుకుంది.
🚀
అమర్ పంట పక్వానికి వచ్చింది. తదుపరి పంటకి నేల సిద్ధమవుతోంది. ప్రామ్‌లీ తన ఇంటి బయట నిలబడి, పంట కోసిన ఖాళీ నేలలో- టోబాక్స్ (9) చేస్తున్న పనిని గమనించింది. పర్వతపు గాలి ఆమె ముంగురులను సవరించింది. ప్రామ్‌లీ తన ట్యాగ్‌ని చూసుకుంది. సీనీ మరణానికి సంబంధించిన కారణాలపై కౌన్సిల్ ఇప్పటికీ మౌనంగా ఉంది. ఈ ప్రక్రియ ప్రామ్‌లీ ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. దాదాపు పది రోజుల క్రితం, పంట కోయక ముందు జరిగిన చివరి సంభాషణ తర్వాత, ఉల్తూర్‌తో మాటామంతీ లేదు. నగరానికి చేరుకున్న వెంటనే, ఉల్తూర్‌ను కలవాలని ప్రామ్‌లీ నిర్ణయించుకుంది.
ప్రామ్‌లీ లోపలికి వెళ్లి మ్యూజిక్ ఆన్ చేసింది. సంగీతం ఆమెను స్తిమితపడేలా చేసింది. వివిధ ట్యాగ్ ఛానెల్‌లలోని ఏదైనా కొత్త సంగీతం చేరితే, అది ఆమె కలెక్షన్ లోనూ చేరుతుంది.
ఆమె తన ట్యాగ్ సందేశాలను చూడసాగింది. క్లెపో ఏదో పంపింది. ఆసక్తిగా ఆ సందేశాన్ని తెరిచింది.
‘ఇది ముగింపు దశకు చేరుకుంది. ఈ జాక్ చివరకల్లా మనం సిద్ధంగా ఉండాలి.’
నేపథ్యంలో ఉల్లాసమైన సంగీతం వినిపిస్తుండగా, ప్రామ్‍లీ కళ్ళు మూసుకుని, కుర్చీలో వెనుకకు వాలిపోయింది. సుదీర్ఘ ప్రయాణం, అన్వేషణ ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రామ్‌లీ సంగీతపు ఝరిలో తడిసి ముద్దయింది. ఒక దాని తరువాత మరొకటి మ్యూజిక్ ఫైల్స్ ప్లే అవుతున్నాయి. స్వరాలు ఉత్సాహంగా, ప్రశాంతగా సాగుతున్నాయి. ఈ మ్యూజిక్ ఫైల్ ఆమె ఇంతకు ముందు విన్నదానికి భిన్నంగా ఉంది. వాయిద్యాలు, మధ్యస్వరం – సాధారణ మ్యూజిక్ ఫైల్స్‌కి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
ప్రామ్‍లీ డిస్‌ప్లే చెక్ చేసింది. టైటిల్‌లో ‘సీని’ అని ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోలేదు. సీని మాత్రమే తన ప్రైవేట్ కలెక్షన్‌లో చోటు సంపాదించి, కొన్ని మ్యూజిక్ ఫైల్స్ జోడించగలిగింది. సీని చనిపోవడానికి రెండు రోజుల ముందు – ప్రామ్‍లీ – కలెక్షన్‌లో ఈ ఫైల్ వచ్చి చేరింది. అప్పుడు ప్రామ్‍లీ పంట పనులతో తీరిక లేకుండా ఉంది, దాంతో ఆ ఫైల్‍ని పట్టించుకోలేదు. ఇప్పుడే వింటోంది. మ్యూజి ప్లే అవుతూనే ఉంది. ఇంత అద్భుతమైన, ప్రత్యేకమైన మ్యూజిక్ ఫైల్‍ని సీని ఎక్కడ నుంచి సంపాదించిందో అని ప్రామ్‍లీ ఆశ్చర్యపోయింది. స్వరాలు ఆరోహణలో ఉన్నప్పుడు, ఆ వాయిద్యాలు తనకు తెలియనివనీ, ముందెప్పుడూ విననివని అని ప్రామ్‍లీ గ్రహించింది.
ఆమె స్వరకర్తని గుర్తించాలని ప్రయత్నించింది, కానీ సిస్టమ్ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఆ సింఫనీ గురించి ఎక్కడా సమాచారం లేదు.
దీని ద్వారా సీని తనకు ఏదైనా చెప్పదలచిందా? ఆ సంగీతం వింటూ ప్రామ్‍లీ నిట్టూర్చింది.
‘సీనీ, ఎంత చురుకైనదానివి, ఎంత ఉత్సాహంగా ఉండేదానివి, నీకే ఎందుకిలా జరగాలి’ అనుకుంది.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Fence ఫెన్స్= సరిహద్దు
(2) Clarent, క్లారెంట్ = క్లోనింగ్ పేరెంట్
(3) Creation = సంతానం
(4) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(5) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(6) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(7) Amar = శరీర అవయవాల రీప్లేస్‍మెంట్‍లో ఉపయోగపడే ఒక మొక్క
(8) Vayunum, వాయునం = విద్యాకేంద్రం
(9) Tobok, టోబోక్ = యంత్ర సహకారి
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.