Site icon Sanchika

ఆరు కథలు – కొన్ని జీవితాలు-1

[కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు అపార్థాలకి కారణమవుతాయి. ఆత్మీయులనుకున్న వారిలో కలతలు రేపుతాయి. కొందరికి సరైనదనిపించినది మరికొందరికి ఆమోదం కాకపోవచ్చు. కొందరికి సహేతుకమనిపించినది కొందరికి బరితెగింపులా అనిపించవచ్చు. చిన్న వయసులో జరిగితే ఏమాత్రం ఆక్షేపణ చెప్పని ఘటన మలివయసులో జరిగితే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. సంఘం, కుటుంబ సభ్యులు, బంధువులు నానా రకాల మాటలు అంటారు. మరి ఆసరా అవసరమైనప్పుడు తోడు నిలవని వారి మాటలకు విలువివ్వాలా, లేక అంతరాత్మ ప్రబోధాన్ని గౌరవించాలా – ఇలా కొన్ని కుటుంబాలలో చెలరేగిన ఉద్విగ్నతలను ఆరు కథలుగా అందిస్తున్నారు శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి.]

మంచి స్నేహితుడు

[dropcap]సూ[/dropcap]ర్యానికి గుండెపోటు వచ్చింది. ఆరోగ్యమైన మనిషి. యోగా చేస్తాడు. జాగింగ్‌కి వెళ్తాడు. అయినా ఇలా గుండెపోటు రావడమేంటి అని అనుకుంటాడు సుధాకర్. వాళ్ళిద్దరూ ఒకే హైస్కూల్లో విద్యాబోధన చేస్తున్నారు. సూర్యం ఇంగ్లీషు, సోషలు సబ్జక్ట్‌లు బోధిస్తే సుధాకర్ లెక్కలు బోధిస్తాడు.

ఇద్దరూ మంచి స్నేహితులు. సుధాకర్ సూర్యాన్ని అన్నా.. అన్నా.. అని పిలుస్తాడు.. సూర్యం కూడా సుధాకర్ యడల అదే ఆప్యాయత కనబరుస్తూ అతనికి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు.

సూర్యం – ప్రేమమయ సమాజంలో పెరగడం వలన మంచి, మానవత్వం మెండుగా ఉన్న మనిషి. కల్మషం అంటే ఎరగడు. కపటం తెలియదు. ఎదుటి వాళ్ళను ప్రేమించడం. వారితో స్నేహంగా ఉండటమే సూర్యానికి తెలుసు. స్నేహం విషయంలో అతనికి కొన్ని భావాలున్నాయి. వాటిని తలుచుకుంటూ ఆలోచనల్లోకి జారుకున్నాడు.

***

స్నేహ బంధం చాలా గొప్పది. సరియైన స్నేహం బహు ముఖ ప్రయోజనాలను అందించే జీవన సోపానంగా నిలుస్తుంది. పరిచయం చెలిమిగా అది స్నేహంగా మారుతుంది. స్నేహం చేసేవారు తాత్కాలిక ప్రయోజనాల కోసం నటించడం కాకుండా హృదయ పూర్వకంగా కలిసిపోయేదే స్నేహం.

ఎవరైతే మాధుర్యాన్ని అందిస్తూ, మానవత్వం, సున్నితత్వం, కృతజ్ఞత, సంస్కారం, సహకార గుణం ఉన్నవారు మాత్రమే మంచి స్నేహితులుగా రాణిస్తారు. తమ భావాలని నిలుపుకుని ఎదుటి వారిని గౌరవిస్తూ అరమరికలు లేని స్నేహంతో అందిరికీ ఆనందాన్ని పంచగలరు నిజమైన స్నేహితులు.

పిల్లలకి కూడా మంచి స్నేహితులు ఉండాలి. చెడు భావాలుగల వారి ప్రభావం పిల్లల మీద పడ్తుంది కాబట్టి పిల్లలు మంచి వాళ్ళతో స్నేహం చేసేలా చుడడం తల్లిదండ్రుల బాధ్యత. తల్లి దండ్రులకి మంచి స్నేహితులు ఉంటే ఆ మంచి ప్రబావం పిల్లల మీద పడ్తుంది.

మనిషి సంఘజీవి. అందిరతో కలిసి మెలిసి స్నేహంగా ఉండటం ఎంతో అవసరం. స్నేహం కన్నా గొప్పది ఏదీ లేదు. ఎంతటి వారికైనా సాంఘికంగా స్నేహం అవసరం. ఆపద నుండి రక్షించేవాడే నిజమైన స్నేహితుడు. ఉపకారం స్నేహితుడు లక్షణం. అపకారం మాత్రం చేయకూడదు. స్నేహం ద్వారా సహకారం లభిస్తుంది. స్నేహాన్ని పెంచుకోడానికి శత్రుత్వాన్ని విడిటి పెట్టాలి.

ఇంకా స్నేహం ఉదయపు ఎండలా కాకుండా సాయంకాలం ఎండలా పెరగాలి. స్నేహం శాంతి మనః ప్రశాంతతను చేకూర్చే బృందావనం. పరస్పరాశ్రితమైన ప్రేమనే స్నేహం అంటారు. ఇది జీవితాంతం ఉండేలా చూసుకోవాలి. స్నేహం సుఖదుఃఖాలలో ప్రతిఫలిస్తుంది. స్నేహం ఎల్లప్పుడూ సుగంధంలా పరిమళించాలి. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఇది దారం లాంటిది. దారం ఒక మూలగా గుచ్చినట్లు పరస్పర స్నేహాన్ని కుదుతుంది. విడిపోకుండా భద్రంగా ఉంచుంతుంది.

మనం మంచి వారితో స్నేహం చేయాలి. వారి స్నేహం బలాన్ని కలిమిని చేకూరిస్తుంది. వారి స్నేహం మనలో జడత్వాన్ని దూరం చేసి చైతన్యాన్ని కలిగిస్తుంది. మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే మనం చెడు స్నేహాన్ని వదిలి పెట్టి మంచి స్నేహాన్ని చేయాలి.

***

“ఏంటన్నా! నిన్ను డాక్టర్లు ఏ ఆలోచనలు లేకుండా ఆందోళన పడకూండా ప్రశాంతంగా నిద్రపొమ్మని చెప్తే అలా ఆలోచనల్తో కాలక్షేపం చేస్తున్నావు?” సుధాకర్ – సూర్యం కోసం టిఫిను తీసుకొచ్చి అన్నాడు.

ఇంత వరకు స్నేహం నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహం గురించి ఆలోచిస్తున్న సూర్యం ఆ ప్రపంచం నుండి బాహ్య జగత్తులోకి అడుగు పెట్టాడు.

“నీ గురించే! మన స్నేహం గురించే, మనిద్దరి మద్యా ఏ రక్త సంబంధం లేదు స్నేహం తప్ప. పగలూ రాత్రి నన్ను అంటి పెట్టుకుని, నిద్రా ఆహారం కూడా తినకుండా నాకు నీవు నీ సేవలు అందిస్తున్నావంటే మనది పూర్వ జన్మ ఋణానుబంధమేమో అని అనిపిస్తోంది” అన్నాడు సూర్యం నవ్వుతూ.

“నీవు మా కుటుంబానికి చేసిందాంట్లో నేను చేస్తున్నది ఎంత అన్నా!” సుధాకర్ అన్నాడు.

“ఏదో ఉడతా భక్తిగా ఆర్థికంగా మీ కుటుంబానికి నా సహకారం అందించగానే ఎవరూ గొప్పవారయిపోరు సుధా!”

“ఇది నీ గొప్పతనం. గోరంత చేసి కొండతలుగా చెప్పుకుంటారు కొందరు. అయితే నీవు మాత్రం నీవు చేసిన దాన్ని చెప్పుకోడానికి ఇష్టపడటం లేదు. ఇది నీ మంచితనం, ఉదారస్వభావం.”

“పొగడ్తల్తో నన్ను ములగ చెట్టు ఎక్కించకు.”

“ఇది పొగడ్త కాదు. నిజం అన్నా!”

“స్కూలుకి కూడా సెలవు పెట్టి నాకు సేవ చేస్తున్నావు. తిరిగి అంటున్నాను. మనది జన్మ జన్మల సంబంధం అని అనిపిస్తోంది.”

“నీవు నాకు చేసిన ఉపకారంలో నేను చేస్తుంది గడ్డిపోచన్నా. అవన్నీ ఎందుకు? నన్ను నీవు పొగడం. నేను నిన్ను పొడడం కాని. టిఫిను చేసి విశ్రాంతి తీసుకో అన్నా” అంటూ సుధాకర్ అక్కడి నుండి భోజనం తేవడానికి వెళ్ళాడు.

విశ్రాంతి తీసుకోమని సూర్యానికి సలహా ఇచ్చి సుధాకర్ వెళ్ళాడు. కాని అతని మనస్సు ఊరుకుంటుందా? రకరకాల ఆలోచన్లు మది నిండా మనస్సు రెక్కలు జాచుకుని పరుగులు తీస్తోంది.

***

“సుధా! ఏ వయస్సుకి ఆ ముచ్చట తీరాలి. నీకూ పెళ్ళీడు వచ్చింది. నాకూ పెళ్ళీడు వచ్చింది. ఈ వయసులో పెళ్ళి చేసుకోబోతే ముదర బ్రహ్మచారులుగా మిగిలిపోతాము. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో, నేను కూడా ఆ వేటలోనే ఉంటాను” అన్నాడు సూర్యం ఒక పర్యాయం.

“అన్నా! నా కుటుంబ పరిస్థితులు, చూస్తున్నావు కదా. ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళి చేయాలి. తమ్మడ్ని చదివించి ప్రయోజకుడ్ని చేయాలి. ఏదో నీవు ఆ మాత్రం సహయపడ్తున్నావు ఆర్థికంగా కాబట్టి ఈ మాత్రమేనా సాగగలుగుతున్నాం.”

“ఇవన్నీ తీరే సరికి నీ జుత్తు పండిపోయి ముసలాడివయిపోతావు.”

“అయితే అవనీ అన్నా. నన్ను నమ్ముకున్న వారిని ఓ దారి వారికి చూపించి ప్రయోజకుల్ని చేయాలి.”

“ప్రయోజకుల్ని చేయవచ్చు. కాని నీవు కూడా స్థిరపడాలి. అంత త్యాగం పనికి రాదు. ఆ తరువాత నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మొండి చెయ్యి చూపిస్తే, మిగిలేది మనస్తాపం. “

“నేను చేస్తున్నది త్యాగం అని నేను అనుకోవటం లేదు. బాధ్యతగా భావిస్తున్నాను. అయినా నా విషయం అలా ఉంచు, నీ సంగతి చెప్పన్నా. నీవు ఎవరినైనా ఇష్టపడ్తున్నావా? పెళ్ళి చేసుకుందామనుకుంటున్నావా? “

“అవును.” అన్నాడు సూర్యం.

ఆ మాటకి సుధాకర్ వదనంలో ఆశ్చర్యం. కళ్ళు చిట్లించాడు.

“ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? నేను కూడా మానవమాత్రుడ్నే కదా! నాకూ భావోద్రేకాలు, భావ మనోవికారాలు ఉంటాయి కదా!”

“ఎవరు అన్నా?”

“సుమిత్ర.”

“సుమిత్రా!!!?”

“అవును ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? ఆమె ప్రవర్తన, నడవడిక నాకు నచ్చాయి. అయితే ఆ ఇష్టం ప్రేమ ఒక వేపే ఉంటే సరిపోదు. రెండు వేపులా ఉండాలి. ఆనాడు నలమహారాజు హంస ద్వారా దమయంతికి రాయబారం పంపినట్టు నీ ద్వారా సుమిత్రకి రాయబారం పంపిస్తాను” గలగల నవ్వుతూ అన్నాడు సూర్యం,

“తప్పకుండా అన్నా! నేను మన స్కూలు సంగీతం మేడమ్ సుమిత్రగారి గురించి ఎవరితోనే చెప్తుంటే విన్నాను.”

“ఏమని?”

“అదే సుమిత్ర మేడమ్ తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే కాలం చేసారుట. మేనమామ తీసుకు వచ్చి ఆమెకి చదువు చెప్పించాడట. మేనమామ భార్య ఆమెను ఎన్నో ఇబ్బందులకి గురి చేసిందట. ఆమె చేత అన్ని పనలూ చేయించుకునేదట. చివరికి పాచి పని కూడా, ఎంతో సహనంతో అన్నీ ఓర్చుకుని చదివి ప్రయోజకురాలయింది.”

“అన్ని కష్టాల్ని సహనంతో ఓర్చుకుందంటే ఆమె సహనపరురాలు. అలాంటి అమ్మాయే కుటుంబంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన సహనంతో నెట్టుకురాగలదు. అలాంటి అమ్మాయే నాకు కావాలి.” అన్నాడు సూర్యం.

“మనం అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు సుమిత్రగారు ఉద్యోగస్థురాలయ్యేప్పటికి ఆమె వాళ్ళకి బంగారు గుడ్డు పెట్టే బాతు అయింది. ఇప్పుడు ఆమెను మేనమామ భార్య అపురూపంగా చూసుకుంటుందిట. ఇప్పుడు వాళ్ళలో ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే సుమిత్రగారికి పెళ్ళి చేయడానికి వాళ్ళు ఇష్టపడటం లేదట.”

“ఎంత స్వార్థం? అయినా మన ప్రయత్నం మనం చేద్దాం” అన్నాడు సూర్యం.

ఆ తరువాత ఎన్నో మార్పులు. ఎన్నో అవరోధాలు. సంగీతం మేడమ్ ద్వారా సుమిత్రను సంప్రదించడం. సుమిత్ర కూడా రోజూ సూర్యం నడవడికను గమనించడం వల్ల ఆమెకి నచ్చాడు. ఆ తరువాత సుమిత్ర మేనమామ, అతని భర్యా – ఆమె పెళ్ళికి ఆటంకాలు కలగచేసినా సుమిత్ర ధైర్యంగా ఓ స్థిరనిర్ణయం తీసుకుంది. సూర్యం, సుమిత్రల పెళ్ళి చకచకా జరిగిపోయింది. రవి పుట్టాడు. ఇవన్నీ ఒక దాని తరువాత ఒకటి జరిగిపోయాయి. అదంతా ఇప్పుడు ఓ కలలా అనిపిస్తుంది.

***

“అన్నా నేను చెప్పింది ఏంటి? నీవు చేస్తున్నదేంటి?” అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్ అన్నాడు.

“ఇంతకు పూర్వం మనిద్దరి స్నేహం గురించి ఆలోచించాను. ఇప్పుడు సుమిత్రతో నా పెళ్ళి అయిన తీరు గురించి ఆలోచిస్తున్నాను.”

“భలేవాడివి అన్నా. ఆలోచన్లతోనే కడుపు నింపుకుంటావా? లేక తిండి తినడానికి లేస్తావా?” భోజనం కేరియర్ తెరుస్తూ అన్నాడు సుధాకర్.

“అప్పుడే భోజన సమయం అయిందా? సమయమే తెలియలేదు” అనుకున్నాడు సూర్యం.

భోజనం చేసిన తరువాత కేరియర్ సర్దుతున్నాడు సుధాకర్. అతన్ని చూస్తూనే నాకు ఓ వేపు జాలి, బాధ. తలపై వెంట్రుకలు కొన్ని తెల్లబడుతున్నాయి. వయస్సు ప్రభావం వల్ల ముఖంలో ఆకర్షణ కాంతి తగ్గి నిస్తేజంగా పొడిబారిపోయినట్టంది. ముదర బ్రహ్మచారి అయ్యాడు. పెళ్ళి కాని ప్రసాదులా మిగిపోయాడు. తన బాధ్యతలు తీరేప్పటికి పెళ్ళి వయస్సు దాటిపోయింది. ఏ అమ్మాయి అతడ్ని పెళ్ళి చేసుకోడానికి ముందుకు రావటం లేదు.

“ఏంటన్నా నా వేపు అలా చూస్తున్నావు?”

“నీ జీవితం గురించే ఆలోచిస్తూ నిన్నే అలా చూస్తున్నాను.”

“నా గురించి ఆలోచించడం మానేసి, నీ ఆరోగ్యం గురించి చూసుకో అన్నా” అన్నాడు సుధాకర్.

తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే సూర్యంలో ఏదో అందోళన. ఆభద్రతాభావం. మరోసారి గుండెపోటు వస్తే ప్రాణానికే ముప్పు అని డాక్టర్లు హెచ్చరిక! ఇవన్నీ అతని చెవిలో గింగుర్లాడుతున్నాయి.

ఒక్కసారిగా అతనిలో ఆందోళన. బాధ. విచారం.

“ఏంటయింది అన్నా? ఒక్కసారిగా నీ ముఖంలో దిగులు కనిపిస్తోంది” సుధాకర్ ఆత్రుతగా అన్నాడు.

“సుధా! మనిషి జీవితం నీటి బుడగ. అది ఎప్పుడు పేలిపోతుందో తెలియనట్టు మన ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతాయో తెలియదు. అందుకే అంటారు – వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదని. నీవు నాకు ఒక్క మాట ఇవ్వాలి” అన్నాడు సూర్యం.

“ఏంటి?”

“రేపు నేను ఏం అయినా? నేను లేకపోయినా సుమిత్రా రవి బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. వాళ్ళు చాలా అమాయకులు..” భావోద్వేగంతో అన్నాడు.

“ఛ..ఛ..! అలా అంటావేంటి అన్నా? నీవు పరిపూర్ణ ఆయుష్షుతో ఆరోగ్యంగా ఉంటావు” సూర్యం చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు సుధాకర్.

అయితే సూర్యానికి నమ్మకం లేదు. అభద్రతా భావం అతన్ని వెంటాడుతోంది.

(మరో కథ వచ్చే వారం)

Exit mobile version