[కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు అపార్థాలకి కారణమవుతాయి. ఆత్మీయులనుకున్న వారిలో కలతలు రేపుతాయి. కొందరికి సరైనదనిపించినది మరికొందరికి ఆమోదం కాకపోవచ్చు. కొందరికి సహేతుకమనిపించినది కొందరికి బరితెగింపులా అనిపించవచ్చు. చిన్న వయసులో జరిగితే ఏమాత్రం ఆక్షేపణ చెప్పని ఘటన మలివయసులో జరిగితే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. సంఘం, కుటుంబ సభ్యులు, బంధువులు నానా రకాల మాటలు అంటారు. మరి ఆసరా అవసరమైనప్పుడు తోడు నిలవని వారి మాటలకు విలువివ్వాలా, లేక అంతరాత్మ ప్రబోధాన్ని గౌరవించాలా – ఇలా కొన్ని కుటుంబాలలో చెలరేగిన ఉద్విగ్నతలను ఆరు కథలుగా అందిస్తున్నారు శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి. ఇది మూడవ కథ. ఒకటవ కథ లింక్. రెండవ కథ లింక్.]
ముగింపు తెలియని జీవన ప్రయాణం
“సుధాకర్ అంకుల్! నాన్నగారు చనిపోయినప్పటి నుండి, నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మీరు మా కుటుంబానికి ఎంతో చేశారు. చేస్తున్నారు. మీ ఋణం తీర్చుకోలేము. ఇక నా విషయానికి వస్తే ఇప్పుడు నేను పెద్దవాడ్ని అయ్యాను. మీరు వయస్సలో పెద్దవారయ్యారు. ఇక నేను మిమ్మల్ని బాధ పెట్టదల్చుకోలేదు. ఇక మా కుటుంబ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను” అన్నాడు రవి.
అతని మాటలకి మ్రాన్పడిపోయాను నేను. గుండెలు బాధతో బరువెక్కాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంటి బాగోగులు చూస్తున్న నేను ఇప్పుడు ఆ కుటుంబానికి పరాయి వాడ్ని అయిపోయాను. సూర్యానికి ఇచ్చిన మాట నిర్వర్తిస్తూ వచ్చాను ఇంత వరకూ. పొమ్మన లేక పొగ పెట్టినట్టు ‘ఇప్పుడు మాకు మీ అవసరం లేదు మా వ్యవహారాలు మేము చూసుకూంటాము’ అని చెప్పకనే చెప్పినట్టు ఉన్నాయి రవి మాటలు.
ఆ అబ్బాయిని నేను ఎంత ప్రేమించాను? అతని తండ్రి చనిపోయిన తరువాత కన్న కొడుకులా నా వాత్యల్యాన్ని రవికి పంచి ఇచ్చాను. రవికి చిన్నప్పడు భయంకరమైన రోగం వస్తే డాక్టర్లే ఆశ వదులుకున్నారు. అటువంటి సమయంలో రాత్రి పగలూ నేను రవి దగ్గరే ఉండి సేవ చేస్తూ బ్రతికించుకున్నాను. “మీ వల్లే ఆ అబ్బాయి బ్రతికాడు” అని డాక్టర్లు అన్నారు. నేను పొంగిపోలేదు. సుమిత్ర ముఖం చూసి, సూర్యానికి ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకుని నేను నా కర్తవ్యాన్ని, బాధ్యతని నెరవేర్చాను అని అనుకున్నాను.
అలాంటి ఇప్పుడు రవి అలా మాట్లాడగానే నేను తట్టుకోలేకపోయాను.
“నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగాయా రవి?” అన్నాను బాధగా.
“ఛ.. ఛ..! నా ఉద్దేశం అది కాదు అంకుల్. మీరు మా పాలిట దేవుడు. చాలా మంచి వాళ్ళు. కడిగిన ముత్యం. మీరు ఉత్తములు. మీరు మా కుటుంబానికి చేసిన సేవలు మేము మా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మీ ఋణం తీర్చుకోలేనిది మరో పర్యాయం చెప్తున్నాను.”
“నా మీద మీకున్న ఆ భావాలకి చాలా సంతోషం. అయితే ఒక్క పర్యాయం నీవు అలా మాట్లాడేసరికి షాకయ్యను. మీ నాన్నగారు నాకు ఆప్త మిత్రుడు. అతను నాకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నాను. అంతే తప్ప నేను ఏం పొరపాటు చేయలేదని నేను అనుకుంటున్నాను.”
“అంకుల్ మీరన్నది నిజమే. మీలో ఏ తప్పు లేదు. పొరపాట్లూ లేవు. అయితే ఒక్క విషయం. మనం ఏ అడవిలోనూ ఉండటం లేదు. మానవ సమాజంలో ఉంటున్నాం. సమాజంలో ఉన్న అందరూ మంచివాళ్ళు ఉంటారు అని నేను అనుకోవటం లేదు. రకరకాల మనుష్యులు, రకరకాల భావాలు గల మనుష్యులు. వాళ్ళలో కొందరు మంచి భావాలు కలవారున్నా; తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నట్టు చెడు భావాలు గల వాళ్ళూ ఉన్నారు.”
రవి మాటలకు నేను అవాక్కయ్యాను. విస్తుపోయాను. ‘నా చిటికిన వేలు పట్టుకుని పెరిగిన రవిలో ఇంత విచక్ష జ్ఞానమా. సమాజం తీరు తెన్నులు ఎంత చక్కగా విశ్లేషిస్తున్నాడు’ అనుకున్నాను.
రవి తిరిగి చెప్పడం మొదలు పెట్టాడు.
“అమ్మ తప్పు చేయదు. మీరు తప్పు చేయరు. ఇదీ మనం అనుకుంటున్నాం. అయితే సమాజంలో తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న మనుష్యులు అదే ఇరుగుపొరుగు వారు మీ సంబంధాన్ని, మీ ప్రవర్తనలని తప్పుబడ్తున్నారు. మీరిద్దరూ సహజీవనం చేస్తున్నరని పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. అయితే నిజం నాకు తెలుసు.
అయితే నిప్పు లేనిదే పొగ ఎందుకు వస్తుంది అని కొంతమంది వాదన. వాళ్ళు అలా అనడానికి మనం అవకాశం ఎందుకు ఇయ్యాలి? అందుకే మిమ్మల్ని అలా అన్నాను. తప్పుంటే నన్ను క్షమించండి అంకుల్. అమ్మని, మిమ్మల్ని అందరూ చెడుగా అనుకుంటూ ఉంటే నాకెంతో బాధ కలుగుతోంది” అన్నాడు రవి భావోద్వేగంగా.
సుమిత్రని అదే రవి తల్లిని నన్ను మా సంబంధాన్ని ఇరుగు పొరుగు వారు ఇలా అక్రమసంబంధం ఉంది అన్నా మేమిద్దరం పట్టించుకోలేదు. మనలో ఏ పొరపాటు లేనప్పుడు లోకులకి ఎందుకు భయపడాలని అనుకునే వాళ్ళము. అయితే రవి పెద్ద వాడయ్యాడు. వాస్తవిక పరిస్థితులు తెలిసినా లోకుల మాటలకి బాధపడుతున్నాడు.
నన్ను ఇంద్రుడు, చంద్రుడు అని ములగ చెట్టు ఎక్కించిన రవి సుతిమెత్తగా తన మాటలతో నాకు వాతలు పెట్టాడు అనిపించింది. నా కళ్ళ ముందు ఎదిగిన రవి ఇలా మాట్లాడుతాడనుకోలేదు నేను. బరువెక్కిన హృదయం బాధతో భారమైన అడుగులు వేస్తూ వెనుతిరిగాను. అలా అడుగులు వేస్తున్న నాలో అనేక ఆలోచనలు. ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను.
మనిషి తనని తాను తెలుసుకునేటట్టు చేసేదే ఆత్మవిమర్శ. ఇతరులను అర్థం చేసుకున్ననాడు విజ్ఞాని అవుతాడు. వివేకి అవుతాడు. మనం ఒకలా జీవించాలనుకుంటాం. ఇంకోకటి జరుగుతుంది. మరోలా బ్రతుకుతాం. వాస్తవాల మధ్య దూరం పెరిగే కొద్దీ జీవితం పట్ల మమకారం తగ్గుతుంది. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని పరాయిగా భావిస్తే ఆ బాధే గుండెల్ని పిండేస్తుంది.
జీవితం మనల్ని అప్పుడు మట్టి కరిపిస్తుంది. అయినా లేచి నిలబడి ముందుకు అడుగులు వేయాలి. పడ్తూ, లేస్తూ ముందుకు సాగాలి. ఒక వేళ పడినా ధైర్యంగా లేవడానికి ప్రయత్నం చేయాలే తప్ప అక్కడే ఆగిపోకూడదు.
మనిషి జీవితంలో ఆశలుంటాయి. మమకారాలుంటాయి. కోరికలు, ఆనందాలు, ఆవేదనలు, ఆవేశాలు, అవమానాలూ, ఆక్రందనలు ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి.
ఈ రోజు జరిగిన సంఘటన నాకు ఓ గుణపాఠం. మనం ఏది చేసినా అతిగా ఉండకూడదు. ప్రతీది మితంగా ఉండాలి. మితమే మనిషికి హితమవుతుంది. అతిగా ప్రేమానురాగాలు పెంచుకుంటే, కరుణ జాలి చూపిస్తే, అతిగా మాట్లాడితే, చనువు పెంచుకుంటే అది మంచిది కాదు. మనం అలా అతిగా ప్రవర్తించడం వల్ల విమర్శలు వస్తాయి. అవమానాలు ఎదురవుతాయి. అప్పుడు మన మనస్సులో అంతులేని బాధ కలుగుతుంది. మన జీవితం సాఫీగా సాగాలంటే కోపతాపాలు, భేదాభిప్రాయాలు, అసంతృప్తి, అసహనం, పంతాలు పట్టింపులు విడిచిపెట్టి మితంగా కలిసి ఉండాలి. అప్పుడే జీవితం సుఖంగా సాఫీగా ఆనందంగా సాగుతుంది.
మానసికంగా కొద్దిగా సతమతమవుతున్న నాలో ఏవో అంతూ పొంతూ లేని ఆలోచనలు. ఆ ఆలోచనలలో కూడా వాస్తవికత ఉన్నవి కొన్ని, ఆ ఆలోచనల్లోనే నా ఇంటికి నేను చేరుకున్నాను.
ఇంట్లో ఏంటుంది కనుక? శూన్యం తప్ప. నాకు ప్రపంచం అతా శూన్యంలా అనిపించింది. నా జీవితమే శూన్యమనిపించింది. ఒకానొక సమయంలో నా ఇల్లు నా కుటుంబం సభ్యులతో ఎంత సందడిగా ఉండేది? ఏరి వాళ్ళంతా? నా కోసం వాళ్ళు ఎందుకు ఉంటారు? ఎవరి కుటుంబాల్తో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేకుండా పెళ్ళి కాని ప్రసాదులా మిగిలిపోయాను.
అలా మిగిలిపోవడానికి కారణం ఏంటి? ఇంటి పెద్ద కొడుకుగా ఆ మధ్య తరగతి కుటుంబంలో పుట్టటం నా తప్పా. తండ్రి అకాల మృత్యువాత పడ్డం వల్ల పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతల్ని నా మీద తీసుకున్నాను. ఇద్దరి చెల్లెళ్లకి చదువులు చెప్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాను. తమ్ముడ్ని చదివించి ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్ళి జరిపించాను.
ఇన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకుని వాటిని నెరవేర్చి నా జీవితం వేపు దృష్టి నిలిపే సరికి పెళ్ళీడు దాటిపోయి ముదర బ్రహ్మచారిగా మిగిలిపోయాను. ఏ అమ్మాయి అంత వయస్సున్న నన్ను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడలేదు. బంధాలు బాంధవ్యాలు బాధ్యతలు అని ప్రాకులాడుతే జీవితాలు ఇలాగే తయారవుతాయి.
నాకని చెప్పుకునే వాళ్ళు నా వాళ్ళు ఎవరు ఉన్నారు? నా తోబుట్టువులు కూడా ఏదో చుట్టం చూపుగా వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఇక ఆ ఇంటిలో ఉండేదెవరు? నేను తప్ప. అలా శూన్యం లోకి చూస్తూ రోజులు గడిపెయ్యడమే. సూర్యం కుటుంబానికి నాకు చేతనయినంత సహాయ సహకారాలు అందిస్తూ, అతనికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇంత వరకూ వచ్చాను. రవి నన్ను దూరం బెట్టటం వలన వాళ్ళింటికి వెళ్ళడానికి కూడా బ్రేకు పడింది.
సూర్యం గుర్తుకు రాగానే నా కళ్ళు చెమర్చాయి. నీకు నేను ఇచ్చిన మాటను పూర్తిగా నెరవేర్తలేకపోయాను అని వాపోయాను. అనాథ ఆశ్రమంలో పెరగడం వల్ల అనుకుంటాను, సూర్యంలో మంచితనం మానవత్వం మెండుగా ఉన్నాయి. ఆ గుణాలు వల్లనే మా కాలేజీలో అందరూ ఈర్ష్య పడే విధంగా ఆప్తమిత్రులయయ్యాము.
మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. నా వాళ్ళకి కూడా సూర్యం అంటే ఎంతో గౌరవం. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి, తమ్ముడు చదువుకి ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు. ఆ మేలు జన్మలో నేను మరిచిపోను. అందుకే అతను ఇష్టపడి పెళ్ళి చేసుకుందామనుకున్న సుమిత్రతో రిజిష్టారు ఆఫీసులో దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాను.
అంత ఆరోగ్యంగా ఉన్న సూర్యానికి మొదటి పర్యాయం గుండె పోటు వచ్చినప్పుడు ఎంతో భయపడిపోయాడు. “సుధాకర్, వ్యాయామం చేస్తాను. నడుస్తాను. నాకేంటిరా ఈ గుండెపోటు” అని వాపోయాడు. నేను అతనికి ధైర్యం చెప్పాను. సుమిత్రతో ఎంతో గౌరవంగా నడుచుకునేవాణ్ణి.
సూర్యానికి మొదటి సారిగా గుండెపోటు వచ్చినప్పుడు రవికి నాలుగు సంవత్సరాలు. “ఒరే సుధాకర్, డాక్టర్లు రెండోసారి గుండెపోటు రాకుండా టెన్షన్‌కు దూరంగా ఉండమంటున్నారు. నాకు ఏ టెన్షన్స్ లేవు. అయినా ఏదీ మన చేతిలో లేదు. ఏది ఏమైనా రెండోసారి గుండెపోటు వస్తే నేను బ్రతికి ఉంటానన్న నమ్మకం నాకు లేదు. నేను ఏమైనా, సుమిత్రా, రవి బాధ్యతలు నీవు తీసుకోవాలి” అన్నాడు సూర్యం. అప్పుడే అతనికి తన జీవితం మీద అపనమ్మకం ఏర్పడిపోయింది.
“ఛ.. ఛ..! అవేం మాటలురా. తప్పకుండా నీవు ఆరోగ్యంగా ఉంటావు” అన్నాను నేను.
ఏదీ మన చేతిలో లేదు. వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు. విధి ఆడిన వింత నాటకంలో మనిషి పావులు అవడమే. విధి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు సూర్యం. అతను పోయిన తరువాత సూర్యానికి ఇచ్చిన మాట ప్రకరాం ఆ కుటుంబం బాగోగులు చూస్తూ వస్తున్నాను.
దానికే ఎన్నో అపవాదులు, సుమిత్రకి నాకు అక్రమ సంబంధం ఆపాదిస్తూ ఎన్నో పుకార్లు. ఎన్నో గాలి కబుర్లు. సుమిత్ర, నేను అలాంటి అపవాదులు పట్టించుకోలేదు. మనం పవిత్రంగా ఉన్నప్పుడు సమాజానికి ఎందుకు జడవాలి? అనుకున్నాం.
“అందరి నోళ్ళూ మూత పడాలంటే మనిద్దరు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందేమో!” అన్నాను ఓ పర్యాయం. వెంటనే సుమిత్రకి కోపం వచ్చింది. రోషం వచ్చింది. తీక్షణంగా నా వంక చూసింది.
“నేను తప్పుగా మాట్లాడితే క్షమాపణ కోరుతున్నాను. నాలో ఏ చెడు ఉద్దేశం లేదు. అందరి నోళ్ళూ మూతపడ్తాయని నేనలా అన్నాను” అన్నాను నేను బాధగా. సుమిత్ర కోపం చప్పున చల్లారింది. తిరిగి ఆమె వదనంలో సౌమ్యత చోటు చేసుకుంది.
“మనం భయపడ్తూ ఉంటే కొంతమంది మనల్ని భయపెడ్తూనే ఉంటారు. నానా మాటలూ అంటూనే ఉంటారు. మనం దేనికీ చలించకూడదు” అంది సుమిత్ర.
“నేను ఇప్పుడు పెళ్ళి చెసుకుంటే తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానం ఉన్న రవి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పటి వరకు తండ్రి స్థానంలో అతన్ని చూసినవాడు ఆ స్థానంలో మిమ్మల్ని చూస్తే తట్టుకోగలడా? వాడిలో విపరీత ఆలోచనలు చోటు చేసుకుని వాడి జీవితం అస్తవ్యస్తమవుతుంది. వాడు పెద్దవాడయి మనిద్దరిని అర్థం చోసుకుని, మనిద్దరిని తన తల్లిదండ్రులుగా అంగీకరించే సమయం వచ్చినప్పుడు అప్పుడు మీ ప్రస్తావన అంగీకరిస్తాను” అంది సుమిత్ర,.
అయితే సుమిత్రకి కూడా నేను అన్నది అంగీకారమే అన్న మాట. ఆలోచన నాకు సంతోషాన్ని కలిగించింది.
ఆ తరువాత జీవితంలో ఎన్నో మార్పులు. ప్రస్తుతం రవిలో వచ్చిన ఈ మార్పు నాకు బాధగా ఉంది.
(మరో కథ వచ్చే వారం)