[కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు అపార్థాలకి కారణమవుతాయి. ఆత్మీయులనుకున్న వారిలో కలతలు రేపుతాయి. కొందరికి సరైనదనిపించినది మరికొందరికి ఆమోదం కాకపోవచ్చు. కొందరికి సహేతుకమనిపించినది కొందరికి బరితెగింపులా అనిపించవచ్చు. చిన్న వయసులో జరిగితే ఏమాత్రం ఆక్షేపణ చెప్పని ఘటన మలివయసులో జరిగితే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. సంఘం, కుటుంబ సభ్యులు, బంధువులు నానా రకాల మాటలు అంటారు. మరి ఆసరా అవసరమైనప్పుడు తోడు నిలవని వారి మాటలకు విలువివ్వాలా, లేక అంతరాత్మ ప్రబోధాన్ని గౌరవించాలా – ఇలా కొన్ని కుటుంబాలలో చెలరేగిన ఉద్విగ్నతలను ఆరు కథలుగా అందిస్తున్నారు శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి. ఇది ఐదవ కథ. ఒకటవ కథ లింక్. రెండవ కథ లింక్. మూడవ కథ లింక్. నాల్గవ కథ లింక్.]
స్థిర నిర్ణయం
[dropcap]ర[/dropcap]వి కాలేజీకి వచ్చాడు. అతనిలో అసహనం. ఏదో తెలియని అలజడి, అసంతృప్తి. మనస్సు నిలకడగా లేదు. ఈ రోజు తను తల్లి మీద అసహనం వ్యక్తం చేసాడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె పై నిందలు వేసినా ఆమె చలించలేదు కాని తను అన్న మాటలకి ఆమె చలించిపోయింది. కళ్ళలో కన్నీటి తెర వస్తున్న దుఃఖాన్ని పళ్ళ చాటున దిగమ్రింగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నించింది.
తన తల్లి ఇలాంటి ఆలాంటి వాటికి చలించే మనిషి కాదు. అలాంటిది ఆమె అలా చలించిందంటే ఆమె ఎంత భావోద్వేగానికి గురి అయిందో? ఆమె స్వభావం తనకి తెలుసు. “జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు సమస్యలు ఎదురైనా, చలించకుండా నేడు కంటే రేపు బాగుటుందని అని ఆశావాద దృక్పథం అలవర్చుకోవాలి” తన తల్లి తనతో అనేది.
అలాంటి ఆమె కంట్లోనే కన్నీరు వచ్చిందంటే ఎంత భావోద్వేగానికి లోనయిందో? మన కంట్లో నీరు రానంత వరకూ మనం బాగున్నట్టే. కంట్లో నీరు వచ్చిందంటే మనం మన చుట్టూ ఉండే వాళ్ళ వల్ల మనకి మనస్తాపం కలిగించేది ఏదో జరిగింది అని అర్థం.
జీవితంలో అమ్మ నాన్నల ఆప్యాయతా అనురాగాలు పిల్లలకి బాల్యంలో లభిస్తాయి. తనకి ఊహ రానప్పుడే నాన్న చనిపోవడం వలన నాన్న ఆప్యాయతానురాగాలు చవి చూడకపోయినా అమ్మ దగ్గర అవి తనకి పుష్కలంగా లభించాయి. మా అమ్మే కాదు ప్రతీ అమ్మ తన పిల్లల యడల అలాగే ప్రవర్తిస్తుంది.
ఎందుకంటే అమ్మ సృష్టిలో విలువైన వ్యక్తి. సహనానికి మారు పేరు. పిల్లలకి నిజమైన మార్గదర్శి. వేదనలోనూ ఆనందాన్ని వెతుక్కుంటుంది. తన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పర్యాయం కఠినంగా వ్యవహరించినా ఆ తరువాత తల్లడిల్లిపోతుంది. ఆమె మనస్సు అంత సున్నితం. ఆమె చల్లని ఒడిలో మొదలైన తొలి అడుగులో తడబాటును బతుకు బాటలో పొరపాట్లను సరిదిద్దే సమర్థురాలు అమ్మ. తన పిల్లల్ని మంచి మార్గంలో నడిపేందుకు తహతహలాడుతుంది. ఆమె త్యాగం. కుటుంబం పట్ల చూపే నిబద్ధత వల్ల పిల్లల జీవితాలు ఆనందమయంగా సాగుతాయి. పిల్లల మనస్సును చదివే శక్తి ఆమెకుంది. కుటుంబ అస్తవ్యస్త పరిస్థితుల్ని చక్కదిద్దుతుంది.
ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా అమ్మతో ఉన్న అనుబంధం గొప్పది. కుటుంబ అవసరాలను తీర్చిదిద్దడంలో ప్రదాన పాత్ర వహిస్తుంది అమ్మ. తన కుటుంబం అంటే ఆమెకి ప్రాణం. ఆమెది అలసిపోని మనస్సు. ఆమె పాడిన లాలిపాటల్లోని మమతకు కరిగిపోయి నిద్రలోకి జారుకుంటారు చిన్నపిల్లలు. ఆమె కుటుంబ సభ్యల ఆలనా పాలనా చూసుకోడానికి తహతహలాడుతుంది.
ఇన్ని విషయాలు అమ్మ గురించి చెప్పినది శారదా మేడం. ఆవిడ చెప్పినవి నిజమే. తను తన తల్లిని నిశితంగా పరిశీలించిన తరువాత నిజమే అని అనిపించాయి. తండ్రి కూడా గొప్ప వాడే పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. కాని తండ్రి ఆప్యాయాతనురాగాలు పొందలేని దురదృష్టవంతుడు తను.
రవి ఇలా ఆలోచనా ప్రపంచంలో తేలుతున్న సమయంలోనే శారదా మేడమ్ వచ్చింది. ఆమె తెలుగు భాష భోధిస్తుంది. నాలుగు పదుల వయస్సులో ఉన్న ఆమెకి రవి తన తమ్ముడిలా ఆగుపిస్తాడు. తనకి ఏ తోబుట్టవులు లేని కారణం చేత ఆమెను అక్కలా భావిస్తాడు రవి. తన కటుంబ విషయాలు ఆమెకు చెప్తాడు. తన తల్లి పడ్తున్న కష్టాలు వివరిస్తాడు. తన కుటూంబానికి సుధాకర్ అంకుల్ ఎలా ఆదుకున్నారో వివరిస్తాడు. అందుకే శారదా మేడమ్‌కి రవి కుటుంబ విషయాలు అన్ని తెలుసు.
ఎవరో వచ్చినట్టు అలికిడి వినగానే ఆలోచనా ప్రపంచం నుండి బయట పడ్డాడు రవి. ఎదురుగా శారదా మేడమ్. “రవి నీకు ఏంటయింది? క్లాసుకు కూడా వెళ్ళకుండా అంత గంభీరమైన ఆలోచనల్లో మునిగితేలుతున్నావు?ఆర్ యూ ఓకే!” అంది ఆవిడ. ఏమీ లేదు అన్నట్టు తలూపాడు రవి.
ఆవిడికి నమ్మకం కలగలేదు. కష్టాలు, నష్టాలు, అన్నీ తనకి చెప్పుకుని స్వాంతన పొందే రవి ఈ రోజు తన మనస్సులో బాధ తనలోనే దాచుకుని గిరిగీసుకుని కూర్చున్నేడేంటి? ఏదో జరిగింది. తరచి తరచి అడిగి మరింత బాధకి గురి చెయ్యకూడదు. కొద్ది సేపయిన తరువాత తనే చెప్తాడు అనకుంది శారదా మేడమ్. అందుకే ఆమె మౌనం వహించి పరిక్ష పేపర్లు దిద్దుకుంటోంది.
రవి లేచి మంచి నీళ్ళు త్రాగాడు. అతని మనస్సు నిలకడగా లేదు. ఒక వేపు బాధ – మరో వేపు పశ్చాతాపం. తడిసిన వస్త్రంలా అతని మనస్సు బాధతో బరువెక్కింది. తన బాధ ఎవరితో నైనా చెప్పాలి. హృదయం తేలికపరుచుకోవాలి. ఇవే అతని ఆలోచన్లు.
“మీతో ఓ మాట చెప్పాలి అక్కా!” అన్నాడు శారదా మేడమ్‌ని మొదట్లో రవి. శారదామేడమ్ అని పిలిచేవాడు. ఆ తరువాత వారి ఇద్దరి మధ్యా ఉన్న దూరం తరిగి ఏదో తెలియని బంధం పెరిగడం వల్ల ఆవిడను అక్కాని పిలుస్తున్నాడు. అవిడ కూడా పోగొట్టుకున్న తమ్ముడ్ని రవిలో చూస్తోంది.
“చెప్పు రవి. నీ వాటం చూస్తే ఏదో చరిగిందిని అనుకున్నాను. అన్నీ నాతో చెప్పుకునే నీవు ఇప్పుడు కూడా నీవే చెప్తావని నిన్ను రెట్టించలేదు” అంది శారదా మేడమ్. జరిగిన సంఘటన చెప్పాడు రవి. అలా చెప్తున్న సమయంలో అతని గొంతుక దుఃఖంతో బొంగురుపోయింది. కన్నీరు కళ్ళలో నుండి పైకుబుకుతోంది. అలా వచ్చిన కన్నీళ్ళను చేతి రుమాలుతో తుడుచుకున్నాడు. అలా ఏడవనీ మనస్సులో బాధంతా దుఃఖ రూపంలో బయటకు వచ్చి మనస్సు తేలిక పడ్తుంది అని అనుకున్న శారదా మేడమ్ అతడ్ని ఓదార్చడానికి ప్రయత్నించలేదు. ఆమె గంభీరంగా ఆలోచిస్తోంది.
“అక్కా!” పిలిచాడు రవి. తల పైకెత్తి చూసింది ఆమె.
“నేను చాలా తప్పు చేశాను.” అతని వదనంలో పశ్చాత్తాపం అగుపడుతోంది.
“తప్పా, తప్పున్నరా? చాలా పెద్ద తప్పు చేశావు. పురుషాధిక్యత నిండిన నేటి సమాజంలో ‘నేనూ ఓ మగవాడ్ని’ అని అనిపించుకున్నావు. సుధాకర్ గారు, మీ అమ్మ మధ్య లేని సంబంధాన్ని అంటగడ్తూ దానికి సహజీవనం, అక్రమసంబంధం అని ముద్ర వేసినా ఆవిడ చలించలేదు. ఇరుగు పొరుగు వారి మాటల్ని సమాజాన్ని ఆవిడ పట్టించుకోలేదు. కాని ఈ రోజు ఏఁటయింది?
ఆవిడ గురించి నీకు తెలుసు. ఆ కుటుంబం సభ్యుడివి నీవు. ఇంట్లో జరిగిన గతం, వర్తమానం అన్నీ తెలిసి కూడా ఇలా తొందరబాటుతో అమ్మ మనస్సు నొప్పించడం, ఆమెని ఆత్మక్షోభకి గురి చేయడం నాకు నచ్చలేదయ్యా!
ప్రపంచీకరణ అనే వ్యాధితో పరుగుతీస్తున్న మనిషి దేనినైనా చూసే నేర్పును కోల్పోతున్నాడు. కొంత మంది నేర్పును ఒంటబట్టించుకుంటే కొంత మంది వెనకబడుతూ అజ్ఞానులుగా మిగిలి పోతున్నారు. దేనినైనా నిశితంగా పరిశీలించాలి. అప్పుడే నోరు విప్పి మాట్లాడాలి అని అంటున్నాను.
సమాజంలో ఆడది ఎంత ఎత్తుకి ఎదిగినా.ఎంత జ్ఞానానవంతురాలయినా, తను అబలను కాదు సబలను ఎలిగెత్తి అరుస్తున్నా ఎంత మంది సబలలమని నిరూపించుకోగలుగుతున్నారు? మన కుటుంబ వ్యవస్థలో కొన్ని కుటుంబాల్లో మగపిల్లవాడికి ఉన్న విలువ స్వేచ్ఛ ఆడపిల్లకి లభించడం లేదు” శారదామేడం ఆపింది చెప్పడం. ఆవిడ రవి ముఖ కవలికలు నిశితంగా పరిశీలిస్తోంది.
“మరో విషయం. ఆ సుధాకర్ గారికి ఓ కుటుంబం ఉంది. మీ కుటుంబానికి తన సహాయ సహకారాలు అందిస్తే ఇంద్రుడు చంద్రుడు, స్నేహితుడి కుటుంబాన్ని తన కుటుంబంలా చూసుకుంటున్నాడు అని పొగిడేవారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతను పెళ్ళి కాని వాడిగా మిగిలిపోయాడు. ఆ పెళ్ళి కాకపోవడం వల్లనే కదా అతనికీ మీ అమ్మగారికి మధ్య సంబంధం అంటగట్టి వారికి మనస్తాపం కలిగించారు ఇరుగు పొరుగు వారు.
అక్కడికి అతను కొంచం ముందుడగు వేసి ‘అందరి నోళ్ళు మూయించాలంటే మనిద్దరం పెళ్ళి చేసుకోవాలని అతను మీ అమ్మ దగ్గర ప్రస్తావన తీసుకువచ్చాడని, నీ జీవితం బాల్యంలోనే ఒడిదుడుకులకి లోనవుతుందని ఆమె ఆ ప్రస్తావన తిరస్కరిందని ఓ పర్యాయం మీ అమ్మ నీకు చెప్పింద’ని నీవు నాతో చెప్పావు.
ఆ సమయంలో ఆమె వయస్సులో ఉంది, కొన్నాళ్ళ దాంపత్య సుఖాన్ని అనుభవించింది. భర్త చనిపోయిన తరువాత ఆవిడ కూడా ఉప్పూకారం తిన్న మనిషిగా. లైంగికానందం శారీరక సుఖం పొందాలన్న తలంపుగల మనిషి అయినా లోకులు ఎన్ని మాటలు అంటున్నా ఆ నిందలు భరిస్తూ జీవితం గడిపిందే కాని తన లైంగికానందం కోసం సుధాకర్ గారిని పెళ్ళి చేసుకోలేదు. అదీ ఎందుకు? నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే.
ఇప్పుడయినా ఆవిడ ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారో తెలుసా? సమాజంలో కొన్ని వికృత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. నేటి పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. కొందరయితే నడిరోడ్డు మీద వదిలి వేస్తున్నారు. మరి కొంత మంది భార్య చనిపోయిన భర్తని, పురుగును చూస్తున్నట్టు చూస్తున్నారు. భర్తని పోగొట్టుకున్న ఆడదాన్ని కూడా అలాగే చూస్తున్నారు నేటి కొన్ని కుటుంబాల్లో పిల్లలు.
ఇప్పుడయినా మీ అమ్మగారు తను చెప్పినట్లు లైంగికానందం కోసమో, శారీరక సుఖం కోసం పెళ్ళి చోసుకోబోటం లేదు. ముందు ముందు అభద్రతా భావానికి లోనవచ్చు. భద్రత కరువు అవచ్చు అని ఆవిడ అనుకుని ఉండొచ్చు. ఆవిడ్ని తప్పు పట్టలేము. నేడు సమాజిక పరిస్థితులు అలా ఉన్నాయి. లేకపోతే ఈ వయస్సులో ఆవిడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారు?
మనం కూడా ఆవిడ మనోభావాల్ని గౌరవించాలి. ఆలోచించాలి. నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆమెలో మానసిక స్థైర్యాన్ని నిలపాలి. నాణానికి ఒక వేపే చూడ్డం కాదు, సుధాకర్ గారి వేపు కూడా ఆలోచించాలి. అతను జీవితంలో సుఖపడింది ఏం లేదు. ఆర్థిక సమస్యలు అతని జీవితాన్ని కుదిపేసాయి. మీ తండ్రిగా కొద్దిగా చేయూత ఈయడం వల్ల ఆ సమస్యల నుండి బయట పడినా పెళ్ళి చేసుకునే వయస్సు దాటి పోవడం వలన ఏ ఆడపిల్ల అతడ్ని పెళ్ళి చేసుకోడానికి ముందుకు రాలేదు. అందుకే పెళ్ళి కాని ప్రసాదులా మిగిలిపోయాడు.
మీ నాన్నగారు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నందుకు ఋణం తీర్చుకోడానికి మీ కుటుంబ బాధ్యతల్ని తన నెత్తి మీద వేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది నిజం కూడా.
నేడు సమాజంలో విష సంస్కృతికి మగపిల్లలు బలి పశువులుగా మిగిలిపోతున్నారు. ఇది అక్షర సత్యం. మా పిన్ని మనవడు పెళ్ళి అయి సంవత్సరం అవకుండానే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ‘నీ తల్లిదండ్రులు రాకూడదు. నా వాళ్ళే రాకపోకలు సాగించాలి’ అన్న అమ్మాయి భావాల్ని వ్యతిరేకించడం వల్లనే ఆ విడాకులు. అంతటితో ఉరుకున్నారా? భరణం క్రింద అరకోటి, కోటి వరకు డిమాండ్ చేస్తున్నారు. అలా కూడా డబ్బు సంపాదించాలన్నదే అమ్మాయి తరుపు వాళ్ళ ఆశ.
మరో కేసులో మా అన్నయ్య మనవడు పరిస్థితి మరో విధంగా ఉంది. అమ్మాయి పెళ్ళి చేసుకుని పెళ్ళయి పట్టున పది నెలలు అవకుండానే అమ్మాయి అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అత్తవారింటికి రాదు. విడాకులు ఈయదు. పాపం మా అన్నయ్య మనవడు బలిపశువుగా మిగిలిపోయాడు. వీటికి ముఖ్యకారరణం తల్లిదండ్రుల పెంపకం. అల్లారు ముద్దు. డబ్బు మీద ఉన్న వాళ్ళకి ఉన్న మోజు.
అందుకే మగ పిల్లాడు గల వాళ్ళ దగ్గర విడాకులు తీసుకున్న వెంటనే లక్షలు లక్షలు డిమాండ్ చేస్తున్నారు.
ఆ ఆడపిల్ల తల్లిదండ్రులకి మగ సంతతి లేకపోవడం వలన కూతురి నుండి డబ్బు రాపట్టాలనే చూస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్య్రం ఉంది. మగ పిల్లలకేనా ఉద్యోగాలు రావటం లేదు కాని ప్రతి ఆడ పిల్లలకి నాలుగంకెల్లో జీతాలు. ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి, నేను కాదను. ఈ ఆర్థిక స్వాతంత్య్రమే కొంతమంది ఆడపిల్లల జీవితాల్ని పక్కదారి పట్టిస్తోంది.
ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే మీ అమ్మలో అభద్రతా భావం ఉంది. రేపొద్దున్న నీకు పెళ్ళయి నీకొచ్చిన అమ్మాయికీ మీ అమ్మకో పొసగకపోతే అప్పుడు మీ గతేంటి? ఎందుకంటే కీడెంచి మేలు ఎంచమన్నారు మన పెద్దలు.
ఇవన్నీ ఆలోచించే మీ అమ్మగారు తగిన జోడిని ఎంచుకున్నారు. ఆవిడ నిర్ణయాన్ని మనం స్వాగతించాలే కాని వ్యతిరేకించకూడదు. ఆవిడ్ని ఆవిడ భావాల్ని గౌరవించాలి” అంటూ ముగించింది శారదా మేడమ్ ఉపన్యాసం.
ఆవిడ వేవు విప్పారిన నయనాల్తో చూస్తున్నాడు రవి. ఎన్ని విషయాలు ఈ రోజు తెలుసుకోగలిగాడు. తన తప్పు తనకి తెలిసి వచ్చింది. అమ్మ కోరిక నెరవేర్చాలి. ఆమె భావాల్ని గౌరవించాలి. క్షమాపణ కోరాలి – తన ప్రవర్తనకి ఇలా సాగిపోతున్నాయి రవి ఆలోచన్లు.
“రవి! ఏంటి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నీవు చేయవల్సింది ఆలోచన్లు కాదు. చేతలు. మీ అమ్మని సుధాకర్ గార్ని దంపతుల్ని చేయడం. నేను కూడా మీ ఇంటికి వస్తాను. పద” అంది శారదా మేడమ్.
రవి మనస్సు దూది పింజలా తేలిక పడింది. అతనిలో ఓ స్థిర నిర్ణయం. అదే తన చేతుల మీద అమ్మని సుధాకర్ అంకుల్ ఒకటిగా చేయడం. రవి, శారద మేడమ్ కాలేజీ అవగానే రవి ఇంటికి బయలుదేరారు.
(మరో కథ వచ్చే వారం)