Site icon Sanchika

ఆరు కథలు – కొన్ని జీవితాలు-6

[కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు అపార్థాలకి కారణమవుతాయి. ఆత్మీయులనుకున్న వారిలో కలతలు రేపుతాయి. కొందరికి సరైనదనిపించినది మరికొందరికి ఆమోదం కాకపోవచ్చు. కొందరికి సహేతుకమనిపించినది కొందరికి బరితెగింపులా అనిపించవచ్చు. చిన్న వయసులో జరిగితే ఏమాత్రం ఆక్షేపణ చెప్పని ఘటన మలివయసులో జరిగితే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. సంఘం, కుటుంబ సభ్యులు, బంధువులు నానా రకాల మాటలు అంటారు. మరి ఆసరా అవసరమైనప్పుడు తోడు నిలవని వారి మాటలకు విలువివ్వాలా, లేక అంతరాత్మ ప్రబోధాన్ని గౌరవించాలా – ఇలా కొన్ని కుటుంబాలలో చెలరేగిన ఉద్విగ్నతలను ఆరు కథలుగా అందిస్తున్నారు శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి. ఇది ఆరవ కథ. ఒకటవ కథ లింక్. రెండవ కథ లింక్. మూడవ కథ లింక్. నాల్గవ కథ లింక్. ఐదవ కథ లింక్.]

శాపగ్రస్తురాలు

[dropcap]ఉ[/dropcap]దయం ఆరుగంటలవుతోంది. బాలభానుడు తన నును లేత కిరణాలను పుడమి వేపు వదలడానికి సంసిద్ధుడవుతున్నాడు. ప్రకృతి మనోహరంగా ఉంది. అసలే వసంతకాలం. లేలేత చిగుళ్ళు తమపై ఆ బాల భానుడి నును లేత కిరణాలు పడగానే తళతళ మెరుస్తున్నాయి. మామిడి లేత చిగుళ్ళు కోసం వచ్చిన కోయిలల కుహుకుహూలతో వీనుల విందు చేస్తున్నాయి. బాల్కనీలో కూర్చుని ప్రకృతిని ఆవలోకిస్తున్న నాలో మాత్రం ఆనందం లేదు. ఆ ఆహ్లదకరమైన ప్రకృతి కూడా నాలో అసహనం పెంచుతోంది. నాకు నా మీదే అసహనం. నా జీవితం మీద అసహనం. సమాజం మీద అసహనం.

మన జీవితం వడ్డించిన విస్తరాకు కాదు. వెంటనే ఆహార పదార్ధలని వెంటనే భుజించడానికి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరి బతుకుల్లో కూడా శాంతీ సౌఖ్యం లేదు. ఏదో ఒక అశాంతి ఏదో ఆపద వాటిల్లతుంది అన్న ఆలోచన. అయితే అంతిమ విజయం సహనం ఉన్నవారికే లభిస్తుంది.

నిన్నటి రోజున రవితో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో గంభీర వాతావరణం. వాళ్ళ అమ్మగారు సుమిత్ర – కొడుకు అన్న మాటలకి కలత చెంది ఉంటారు. ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాగా ఏడ్చి ఉంటుంది ఆవిడ. చాలా మనస్తాపానికి గురయింది. ఆవిడ వాలకం చూస్తే తిండి కూడా తినలేదనిపిస్తోంది.

తల్లి తీరు చూసి చాలా బాధపడిపోయాడు. పశ్చాత్తాపపడ్డాడు. కళ్ళలో నుండి కన్నీరు రావడమే తరువాయి. రవికి తల్లిని బ్రతిమాలుతున్నడు రవి. ఆవిడ ముఖం ప్రక్కకి తిప్పుకుంది. అప్పుడు నాకు ఆ సమయంలో కలగజేసుకుని వారిద్దరి మధ్య రాజీ కుదరించే పరిస్థితి వచ్చింది.

“అమ్మా! నా పేరు శారద. మీ అబ్బాయి పని చేస్తున్న కాలేజీలోనే నేను పని చేస్తున్నాను. రవి నాకు తమ్ముడిలాంటి వాడు. ఏ విషయమైనా నాకు చెప్పి నా సలహాలు తీసుకుంటాడు. తన కష్టనష్టాలు, భావోద్వేగాలు పంచుకుంటాడు. రవి నాకు జరిగినది చెప్పాడు, బాధ పడుతూ.

అయితే మీ అబ్బాయి చాలా మంచివాడు. ముత్యం లాంటివాడు. అయితే లోకుల మాటలకి అతనిలో ఏ చెడు ఆలోచన లేకపోయినా, భావోద్రేకానికి లోనయి మీకు మనస్తాపం కలిగించే మాటలు అన్నాడు. పట్టించుకోవద్దు” అన్నాను.

“ఎలా ఊరుకోమంటావు అమ్మాయ్! ఇన్నాళ్ళ నా పెంపకంలో పెరిగిన వాడికి నా గురించి, ఆ సుధాకర్ గారి గురించి తెలియదా? వాడు అలా నన్ను తప్పుగా మాట్లాడేడు అంటే నా పెంపకంలోనే లోపం. వాటికి సహన గుణాన్ని నేను నేర్పలేదు. అదే ఉంటే ఇలా లోకులు అన్న మాటలకి భావోద్వేగానికి లోనయ్యే వాడు కాదు” కళ్ళు తుడుచుకుంటూ అన్నారావిడ.

ఆవిడ్ని ఓదార్చి, తల్లీ కొడుకుల మధ్య రాజీకుదిర్చి ఆవిడ చేత తిండి తినిపించి ఇంటికి వచ్చాను నేను. సుమిత్ర గారు  తీసుకున్న నిర్ణయం సరియైనదే అనిపించింది నాకు. ఆవిడ స్థిర నిర్ణయానికి జోహార్లు. అటువంటి స్థిర నిర్ణయం నేను తీసుకోలేకపోబట్టి జీవితంలో ఆనందాన్ని, మరి కొన్నింటిని కోల్పోయి మ్రోడుబారిన జీవచ్చవంలా జీవితం గడుపుతున్నాను నేను.

క్రొవొత్తి తాను కాలిపోతూ, కరిగిపోతూ బాధ అనుభవిస్తూ అది వెలుతురుని పరిసరాలకి పరచి ఇచ్చినట్టు నా కుటుంబుం సభ్యుల జీవితల్లో వెలుగులు నింపేసరికి నా జీవితం చీకటి మయింది. దానికి కారణం నేను. నాకు జరగుతున్న అన్యాయాన్ని ఖండిచలేకపోవడం. కుటుంబ సభ్యుల్లో స్వార్థం పేరుకుపోవడం.

ఈ మధ్య తరగతి కుటుంబాల్లో కుటంబంలో పెద్ద కూతురికి, పెద్ద కొడుక్కి కుటుంబ బాధ్యతలు నెత్తిన పడతాయి. అందులోను పెద్ద కూతురు సంపాదనపరురాలు. కాకపోతే పరవాలేదు కాని అదే సంపాదనాపరురాలయితే ఎక్కడలేని బాధ్యతలు వచ్చి పడ్తాయి.

ఆ పెద్దకూతురికి కూడా ఆశలు, అభిలాషలు, కోరికలు ఉంటాయి. ఆమె కూడా మనిషే అన్న విషయం మరిచిపోతారు. తన తరవాత వారికి చదువు సంధ్యలు  చెప్పించి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇంటి పెద్ద కూతురుగా బాధ్యత నెరవేర్చాలి అని చూస్తారు ఇంటి పెద్దలు. అంతే కాని ఆమెని ఓ ఇంటిదాన్ని చేయాలి పెళ్ళి చేసి – అనే ఆలోచన వాళ్ళకుండదు.

“శారదా! మా అన్నయ్య ఎంత అప్‌సెట్ అయ్యాడో తెలుసా? నిన్ను ఇష్టపడ్డాడు. ప్రేమ పెంచుకున్నాడు. పెళ్ళాడితే నిన్నే పెళ్ళాడాలని అనుకున్నాడు. నేను కూడా ఎంత సంతోషించానో తెలుసా? స్నేహం బంధుత్వంగా మారబోతుందంటే చాలా ఆనందం వేసింది.”

“నాకు కూడా మీ అన్నయ్య అంటే ఇష్టమే. ఇష్టమయినా, పెళ్ళి చేసుకునే యోగ్యత నాకు లేదు. ఏం చేస్తాం. వదిలెయ్. మన పూరాణాల్లో చూసావు కదా! రాధకి కృష్టుడంటే చాలా ప్రేమ. అభిమానం. కృష్టుడుకి కూడా రాధంటే అంతే. అయితే వాళ్ళు దంపతులయ్యారా? ప్రేమికులుగా మిగిలి పోయారు. వారి ప్రేమలో ఆశ్లీలత లేదు. వారిది పవిత్ర ప్రేమ. అందుకే రాధాకృష్ణులు ఆదర్శ ప్రేమమూర్తులుగా మిగిలిపోయారు. ఇప్పుడు ఈ కలికాలం రాధాకృష్ణుల పరిస్థితి కూడా అంతే” చిన్నగా నవ్వుతూ అన్నాను.

“నీ నవ్వు చూస్తే చికాకేస్తోంది. ఇలా నిన్ను సమర్థించుకుంటున్నావు. నీ సహనానికి కూడా ఓ హద్దు ఉండాలి. మా అన్నయ్య సంగతి అలా ఉంచు, రేపు ఏ పెళ్ళి కొడుకయినా నిన్ను పెళ్ళి చేసుకోడానికి ప్రయత్నిస్తే వారి ప్రవర్తన ఇలాగే ఉంటుంది.”

సరళ చెప్పింది నిజమే. అయితే పెద్దవాళ్ళని ఎదిరించ లేకపోతున్నాను. అది నా బలహీనత అనవచ్చు. మరేదైనా అవచ్చు. ఒక్కక్కొసారి నన్ను మా ఇంట్లో ‘శారద మా ఇంటికి పెద్ద కూతురు కాదు కొడుకు కన్నా ఎక్కవ. తన తోబుట్టువుల భవిష్యత్తు బాగుపడాలి తరువాదే ఏదైనా అంటుంది’ అని అమ్మ నన్ను అందరి దగ్గర పొగిడే వాటిలో నిజం లేకపోయినా, పిచ్చిదాన్ని పొంగిపోతాను. అదే నా బలహీనత. ఇలా ప్రతీ దానికి మోహమాటపడుతే ముందు ముందు ఎన్నో పోగొట్టుకుంటాము అని తెలుసుకోలేకపోతున్నాను.

అలా ఉండబట్టే ఆ వయస్సులో ఎన్నో ఆనందకరమైనవి విలువైనవి అన్నీ పోగొట్టుకున్నాను. అలా పోగొట్టుకున్న వాటిలో కృష్ణమూర్తి ప్రేమ, అతని ఇల్లాలుగా అయే అవకాశం. సరళ అన్నట్టు ఎన్ని సంబంధాలు వచ్చినా నా ప్రమేయం లేకుండా, నన్ను అడక్కుండానే అన్నిటిని తిరస్కరించారు నా కుటుంబ పెద్దలు. ఒక్కక్క పర్యాయం – నేను ఉద్యోగస్థురాల్ని కాకుండా ఉంటే అంతకు తగ్గ బొంత అని ఎవర్నో ఒకడ్ని తీసుకవచ్చి నాకు పెళ్ళి చేసి ఉండేవారేమో!

నా విషయంలోనూ అదే అయింది. అందరూ మీ పెద్దమ్మాయికి పెళ్ళి చెయ్యరా అన అడిగితే ‘మా అమ్మాయి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళకి పెళ్ళళ్ళు చేసి యోగ్యులుగా వారిని తీర్చిదిద్దితే కాని పెళ్ళి చేసుకోనంది’ అని చిన్న అబద్దంతో సరిపెట్టారు. నా జీవితంలో ఏ అచ్చట ముచ్చటా లేకుండా ఇంటి బాధ్యతలు మోసి మోసి అలసిపోయి జుత్తు పండిపోయి ముదర కన్యగా మిగిలిపోయాను.

సుధాకర్ గారికి నాకూ ఏం తేడా లేదు. తన కుటుంబ బాధ్యతలు తీర్చి తీర్చి పెళ్ళి లేకుండా ముదర బ్రహ్మచారిగా మిగిలి పోతే నేను ముదర కన్యగా మగిలిపోయాను. అయితే నా కన్నా అతని నయం. ఇంత లేటు వయస్సులోనేనా అతనూ సుమిత్రగారు తీసుకున్ననిర్ణయం వల్ల వారి జీవితం చక్కబడబోతున్నట్లే.

అయితే నా జీవితమో!.. ప్చ్! అలా అవదు. అవలేదు. ఆ కోరికలు, సరదాలు, మచ్చట్లు ఎప్పుడో ఎండమావే అయ్యాయి. ఇక నాకు పెళ్ళేంటి? ఆలా అని ఈ లేటు వయస్సులో ఎవర్నో పెళ్ళి చేసుకుని ఉండాలన్న కోరిక కూడా నాకు లేదు. ఆ కోరికలు ఏనాడో చచ్చిపోయాయి.

అందరి వయస్సులో ఉన్న ఆడపిల్లలు మాదిరిగా నేను కూడా నా స్నేహితురాలు సరళ అన్నయ్య ఆకర్షణలో పడ్డాను. అతడ్ని ప్రేమించావా అని అడిగితే అవుననే సమాధానం చెప్తాను. సరళ అన్నయ్య కృష్ణమూర్తికి కూడా నేను నచ్చాను. అతన వచ్చి నా పెద్దవాళ్ళను అడుగుతే మా అమ్మాయి తన తమ్ముళ్ళు చెల్లెళ్ళ బాధ్యతలు తీర్చుతే కాని పెళ్ళి చేసుకోనంది అని కృష్ణమూర్తితో చెప్పారు. అతను ఎంత నిరాశ చెందాడో? ఇది అబద్దం, నేను అతడ్ని పెళ్ళి చేసుకుంటాను అని గట్టిగా అరచి పెద్ద వాళ్ళకి చెబ్దామనుకున్నాను. అలా చేయలేకపోయాను. అది ఒక విధంగా నా బలహీనతే.

సరళ నాకు క్లాసు పీకింది. చీవాట్లు పెట్టంది.  “శారదా! నీవు తెలుసుకోలేకపోతున్నావు. కాని మీ వాళ్ళది స్వార్థమే. అంత స్వార్థపు మనుష్యుల్ని నేను ఎక్కడా చూడలేదు. నీ సహనానికి కూడా ఓ హద్దు ఉండాలి. సహనం వద్దు అనను. అది మనల్ని అందలం ఎక్కిస్తుంది. అది లేకపోతే మనం గమ్యం వరకు చేరుకోలేము. కాలం ఎన్నో పరీక్షలు పెడ్తుంది. భరించే సహనం మనలో ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన సహనాన్ని పరీక్షిస్తారు. ప్రతి దానికి ఓపికతో మన పనులతో సమాధానం ఇవ్వాలి. సహనం ఎంత ఉపయోగించుకుంటే అది మన ఎదుగుదలకి వరంగా మారుతుంది.  సహనం కోల్పోతే అది శాపంగా మారుతుంది. అయితే నీకు ఎందుకు చెప్తున్నానంటే సహనం ఉండాలని ప్రతీదీ మౌనంగా సహించక్కరలేదు. భరించక్కర లేదు. అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడాలి.” ఉపన్యాసధోరణిలో అంది సరళ.

మౌనంగా వింటున్నాను ఆమె హితబోధను. ఆమె మాటల్లో నిజం ఉన్నప్పుడు ఏం మాట్లాడాగలను?

ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చాను. ఆహ్లదమైన ఆ ఉదయకాలంలో క్రమేపి జీవితంలాగే మార్పు చోటు చేసుకుంటోంది. క్రమేపి నునులేత ఎండ ముదురుతోంది. మొక్కలు మీద పువ్వుల మీద పడ్డ ముంచు బిందువులు తళుక్కు మెరుస్తున్నాయి.

ఇప్పుడు తెగ ఆలోచిస్తూ గతాన్ని తలుచుకుంటూ ఉంటే వొరిగేది ఏదీ లేదు. జీవితంలో జరగవల్సిన అనర్థం జరిగిపోయింది. పూర్వ జీవితం తిరిగిరాదు. నా పూర్వ జీవితం తిరిగి వచ్చినా నాకు బాధే తప్ప శాంతి ఉండవు. నా కష్టార్జితంతో ఉన్నత స్థాయికి చేరుకున్న నా తోబుట్టువులు చక్కగా జీవితాలు గడుపుతున్నారు.

కొడుకులు.. కొడుకులు అని వెంపర్లాడిన మా తల్లిదండ్రుల చివరి రోజులు కూడా నా దగ్గరే జరిగాయి. ఏ ఒక్క కొడుకు కాని కూతుర్లు కాని తమ సేవలు వారికి అందిచడానికి రాలేదు. ఇదే నేటి లోకం తీరు.

ఓ సామెత ఉందిలే. ఆనాడు ఎవడో ఒడ్డుకు చేరేవరకు ఓడ మల్లయ్య,. నీటి ప్రవాహం నుండి బయట పడిన తరువాత బోడి మల్లయ్య అని అన్నాడుట. నా పరిస్థితి అంతే. ఆ నాడు నన్ను పొగిడిన వాళ్ళు మా అక్క ఇంద్రుడు చంద్రుడు అన్నవాళ్ళు ఈ రోజు వచ్చినా మొక్కుబడిగా వచ్చి వెళ్తారు. మాటలే కరువన్నట్లు ముక్తసరిగా మాట్లాడుతారు. నేటి లోకం తీరే అంత.

ఆ కృష్ణమూర్తి పెళ్ళి చేసుకుని సుఖమైన సంసారం జీవితం పిల్లాపాపల్తో గడుపుతున్నాడు. ఈ విషయం సరళ ద్వారానే నాకు తెలిసింది. “మా అన్నయ్యతో నీకు పెళ్ళి అయి ఉంటే నీ జీవితం మరోలా ఉండేది” అంది.

ఏం చేయగలం మనం. నిమిత్తమాత్రులం. ఎవరికి ఎంత వ్రాసి పెట్టి ఉందో ఆ భగవంతుడే మనం పుట్టినప్పుడే వ్రాసిపెడ్తాడుట. ఇదీ మెట్ట వేదాంతం. వెనకటికి ఎవడో అందని ద్రాక్ష పులుపు అన్నాడుట. నేను కూడా అలాగే అనుకుని సరిపుచ్చుకోవాలి. రోజులు గడిపేయాలి. జరగవల్సినది జరుగుతూనే ఉంటుంది. ఏదీ మన చేతులో లేదు. విధి ఆడిస్తే ఆలా ఆడ్డమే మనపని అని అనుకున్నాను.

ఆ మధ్య మా మమయ్య కొడుకు నాకు ఫోను చేశాడు., భార్య చనిపోయింది. పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు. ఆడతోడు లేదు. నీకు ఇష్టమయితే నిన్ను పెళ్ళి చేసుకుంటాను – అని అతని మాటల సారంశం.

‘ఈ వయస్సులో నాకు పెళ్ళేంటి బావ. ఆ పెళ్ళి అనే మాటకి నేను ఏనాడో పుల్ స్టాప్ పెట్టాను. ఈ వయస్సులో రామా కృష్ణా అనుకుంటూ రోజులు గడిపేయడమే’ అని కుక్కకాటుకి చెప్పుదెబ్బలా జవాబిచ్చాను.

లోకం తీరు గురించి ఆలోచిస్తున్నాను. భర్త చనిపోయినా ఆడది తన పిల్లల్ని ఏదో విధంగా సాకుతుంది. కాని మగాడి విషయంలో అలా జరగడం లేదే. భార్య చనిపోయి ముడు నెలలు కాకుండానే రెండో పెళ్ళకి వెంపర్లాడుతున్నారు. ఇంట్లో వండి పెట్టడానికి, పిల్లల్ని చూసుకోడానికి,. దానితోపాటు లైంగికానందానికి కూడా ఆడతోడు ఉండాలి. మనిషిలో ఎంత స్వార్థం పేరుకుపోయింది?

జీవిత చరమాంకంలో మనిషికి అది మగ అవచ్చు ఆడ అవచ్చు తోడు ఉండాలి. అది జీవిత భాగస్వామి అవచ్చు. పిల్లలు అవచ్చు. నాకు ఆ రెండూ లేవు. దురదృష్టవంతురాల్ని.

రవి తల్లి మంచి నిర్ణయం తీసుకుంది. సుధాకర్ గారిని పెళ్ళి చేసుకోవడం. తన జీవితం లోకి ఆహ్వానించడం. లేకపోతే రేపు రవికి పెళ్ళి అయి వచ్చిన అమ్మాయి ఆవిడ్ని సరిగా చూసుకుంటుందని గ్యారంటీ ఏంటి?  ఆ ఆలోచనా అభద్రతా భావమే ఆమె ఈ నిర్ణయానికి రావడానికి కారణం అయింది. ఆవిడ ఆలోచనా సరియైనదే నేటి సమాజం తీరు తెన్నులు చూస్తు ఉంటే ఎంత మంది అత్తమామల్ని తల్లిదండ్రుల్ని సాకుతున్నారు? నడి రోడ్డు మీద వదుల్తున్నారు. వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. రవి మంచి వాడవచ్చు. రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నేడు.

“అమ్మా అలా కూకున్నారు. అంట్లు తోమాలి నేను. అంట్లు వెయ్యండి” పని మనిషి మాటలు విని అక్కడ నుండి లేచాను నేను! నేటి సమాజంలో నేను శాపగ్రస్తురాలిని అనుకున్నాను.

(సమాప్తం)

Exit mobile version