Site icon Sanchika

ఆషాఢ గోరింట – శ్రావణ జల్లులు

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘ఆషాఢ గోరింట – శ్రావణ జల్లులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సూ[/dropcap]ర్యోదయాన్నే పల్లె మేల్కొంటుంది. పట్టణం రాత్రి ఆలస్యంగా చేసి ఎన్నో పనులు, బిజీ అంటూ కొంచెం ఆలస్యంగా మేల్కొంటుంది. అసలు పట్టణం నిద్ర ఎక్కడ పోతుంది? విందులు, వినోదాలు, సభలు, సమావేశాలు ఎలా? రాత్రి అంతా వేరే పనులుతో మనుష్యులు డ్యూటీ మారుతారు సూర్య చంద్రులు మాదిరి. కానీ పట్నం ఎప్పుడు మేల్కొనే ఉంటుంది.

జ్యేష్ఠ త్రయోదశి నాడు అసలు బస్సులు, రైళ్ళు రద్దీ ఎక్కువ. ఆషాఢ మాసం పెళ్లికూతుళ్ళతో, వారి తల్లి తండ్రులతో బిజీ. ఆషాఢ పట్టి పట్టుకెళ్ళి ఇచ్చి పిల్లని కూడా పెట్టుకుని తెచ్చుకుంటారు. పిల్లాడి తల్లి తండ్రి అప్పచెల్లెళ్ళు అందరికీ శ్రావణ మాసం నోముకి రమ్మని ముందే చెప్పి, ఆ తర్వాత శ్రావణం రాగానే నోము విషయం ఫోన్ చేస్తారు. అల్లుడు మొదటి మంగళ వారం పుజకే అత్త మామతో వస్తారు. తరాలు మారినా ఈ నోము మాత్రం ఏ దేశంలో ఉన్నా చేస్తారు. వరలక్ష్మి కటాక్షం, మంగళ గౌరీ సౌభాగ్యం ఆడపిల్లకి ఉండాలని తల్లి తండ్రి ఆకాంక్ష. తమ కొడుకు ఆయుష్షు కోసం కోడలి చేత ఈ నోము నోపిస్తారు అత్తమామలు. ఇప్పుడు తెలివి తేటలు ఎక్కువ అయ్యి మేము డబ్బు ఇస్తాం మీకు నచ్చింది కొనుక్కోండి అంటున్నారు. కానీ పూర్వం అయితే బంగారు రూపు, ఒక నగ, పట్టు చీర, వెండి పూజ సామగ్రి తెచ్చి వేడుకగా పూజ చేసేవారు. ఇప్పుడు ఏదో సరి అన్నట్లు చేసేస్తున్నారు. ఎవరికీ ఖాళీ లేదు.

అందరికీ సాఫ్టువేర్ ఉద్యోగాలు హార్డ్ వేరే మనస్తత్వాలు ఉంటున్నాయి. అందరూ విద్యావంతులే. అందర్నీ గారు అంటూ సంబోధించాలి. పూర్వం మాదిరి ఏమండీ అనకూడదు. మిసెస్ విరజ రామ్ గారు అంటూ

పేర్లు భర్త పేరుతో సహా పిలవాలి. చనువుగా ఉండకూడదు, పిలవ కూడదు. ఎవరి లిమిట్స్‌లో వారు ఉండాలి. ఎవరి డబ్బు సంపాదన వారిది. ఎవరి టివి వారిది. ఎవరి వాటర్ ఫిల్టర్ వారిది. ఎవరి ఏసీ వారిది. ఎవరి లాప్‍టాప్ వారిది. ఎవరి పద్ధతి వారిది. ఒక ఇంట్లో ఉంటారు, ఎవరి గదుల్లో వారు హాస్టల్ లైఫ్ మాదిరి ఉంటారు. భోజనానికీ అందరూ వస్తారు, కావాల్సినవి వారికి నచ్చితే తింటారు. లేదంటే పప్పు పెరుగు ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి సాంబారు నిత్యం ఉంటాయి. అవి తిని వెళ్లిపోతారు. ఇలా వండారు అలా వండారు అన్న పద్ధతి ఉండదు. అటువంటి కుటుంబంలోకి శాంతమ్మ రెండో కూతుర్ని పెళ్లి చేసింది. మొన్ననే జ్యేష్ఠమాసంలో చేసి పంపారు.

అత్తగారు “మీ అమ్మాయి చెంచా కూడా తేవద్దు. మాకు ఎవరివి వారికి ఉన్నాయి” అని చెప్పింది. సరే డబ్బు కొంత బ్యాంక్‌లో వేసి చెక్ ఇచ్చారు. వాళ్ళకి డబ్బు లోటు లేదు. ఎవరి నుంచి, అందులో కోడలి నుంచి అసలు ఆశించలేదు. పిల్ల బావుంది చాలు, పద్ధతైన కుటుంబంలో పిల్ల చాలు అన్నారు. పెళ్లి కూడా ఏమీ ధూమ్ ధామ్‌గా అవసరం లేదు. సింపుల్‌గా ఉండాలి. రెండు కుటుంబాల కలయిక కోసం లాంఛనాలు అవి ఇవి అని అవతలి వాళ్ళను గాబరా పెట్టడం ఇష్టం లేదు, సంతోషంగా అందరూ కలిసి ఆనందంగా బ్రతకడానికి వెర్రి వెర్రి పనులు, కోరికలు, అహంకారాలు అలగడాలు ఉండకూడదు అన్నది మా పద్ధతి అన్నారు. అది అందరికీ కూడా నచ్చింది.

శాంతమ్మ, సదానంద శాస్త్రి ఇద్దరు కూడా ఆనందపడి పిల్ల పెళ్లి చేశారు. పెద్ద పిల్లని సదానందం అక్క కొడుక్కి చేశారు. వాళ్ళు వీళ్ళు ఎలాగూ కలిసే ఉంటారు. కానీ మేనత్త అయినా సరే పెళ్లి ముచ్చట్లు అంటూ అన్ని సంప్రదాయాలు పాటించి పొలంలో కలిసే పొలం రెండు ఎకరాలు ఇమ్మని పుచ్చుకున్నది. సరే ఎప్పుడైనా పిల్లలకి ఇవ్వాలి, అది ఇప్పుడే ఇస్తే సరి అని చెప్పి అన్ని అక్కకి నచ్చినట్లు ఇచ్చి పిల్లని చేశాడు. అల్లుడు బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెద్ద పిల్ల పేరు పద్మ ప్రియ. దానికి ఇద్దరు పిల్లలు. విన్ను చిన్ను అని ముద్దుగా పిలుస్తారు. కొడుకు వినయ్, కూతురు చిత్రశ్రీ. ఇంకా ఆ సంబందం వెనక్కి తిరిగి చూడనక్కరలేదు. ఇంక రెండో కూతురు శ్రీజను ఇప్పుడు ఆషాఢ మాసంలో పుట్టింటికి తీసుకు వచ్చారు.

***

శాంతమ్మకి పల్లెలో పెద్ద పెరడు ఉన్నది. సీజనల్ పువ్వుల మొక్కలు తెప్పించి కుండీలలో వేస్తుంది. బంతి నారు దొడ్డి అంతా చల్లిస్తుంది. గోడ వారగా గోరింట మొక్కలు వేయించింది. ఆషాఢం వచ్చిందంటే మహా బిజీ అని చెప్పాలి. చాలా మంది ఆడపిల్లలు శాంతమ్మ ఇంటికి వచ్చి గోరింటాకు పట్టుకు వెడతారు. ఇప్పుడు పల్లెల్లో కూడా గోరింటాకు అమ్ముతున్నారు. చెట్టు లెక్కన అమ్మేస్తారు. నెల అంతా నాలుగు సార్లు దుచుకుని పట్టుకు వెళ్లి పట్నంలో అమ్ముతారు. చెట్టుకు ఐదు వందలు వస్తాయి. కానీ శాంతమ్మ ఉచితంగా ఇస్తుంది. చెట్లు చక్కగా పెరిగేలా నీళ్ళు పోయించి వేసవిలో కూడా బాగా పెంచింది.

వేసవిలో సెలవలకి వచ్చిన పిల్లలు గోరింటాకు పెట్టుకునేవారు. అలా చక్కగా ఎండాకాలం కూడా ఆడపిల్లలు, కొందరు మగ పిల్లలు గోరింటాకు పెట్టుకున్నారు. అయితే కొందరు మగ పిల్లలు పెట్టుకున్న సరే మరి కొందరు పిరికితనం వస్తుంది వద్దురా అంటారు. కొందరు అన్నదమ్ములు ఉంటే చూపుడువేలికి మాత్రం గోరింటాకు పెట్టుకోరు అంటారు.

శాంతమ్మ పేరుకి తగ్గట్టుగానే శాంతంగా ఉంటుంది. సదానంద శాస్త్రి ఎప్పుడు చిద్విలాసంగానే ఉంటారు. చిరాకు కోపం ఉండదు. వాళ్ళు వాళ్ళ పేరుని సార్థకం చేసుకున్నారు.

కాలేజీ ఆడపిల్లలు స్కూల్ పిల్లలు కలిసి ఆదివారం వచ్చింటే మహా సందడి. నేరేడు పళ్ళు, బొబ్బాస పండు ముక్కలు పెట్టేది. ఇంకా జామచెట్టు విసిరి చెట్టు కూడా రాల్చి కోసుకుని పట్టుకెళ్ళేవారు. పూర్వకాలంలో పరికిణి కండువాలు ఉండేవి. ఇప్పుడు చున్నీలు షో కండువాలు వాడుతున్నారు.

శాంతమ్మ అందరికీ పాత పేపర్లు ఇచ్చేది. కొందరు ధర్మకోల్ సంచులు తెచ్చుకునేవారు. మొత్తానికి గోరింట సందడితో ఇల్లు కళకళలాడేది. ఎంతైనా ఇంటికి ఆడపిల్లలు ఎంతో అందం, ఆనందం. శ్రీమహాలక్ష్మీ రూపాలు అనేది.

శాంతమ్మకి ఒక కొడుకు శ్రీమాన్. అతను బెంగుళూరులో ఇంజినీర్. ఇప్పుడు అంతా ఇంజినీరింగే చదువుతున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. వాడికి ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళ కోసం రుబ్బిన గోరింటాకు కొరియర్‍లో పంపుతుంది. కోన్‍లు దొరికిన సరే ఆ ఇంటి ఆడపిల్లలు, అందుకని ఇంటి గోరింటాకు పంపుతుంది.

ఏమిటో అమ్మ చాదస్తం అంటాడు శ్రీమాన్. నువ్వు ఇప్పుడు రావు అందుకని స్పీడ్ కొరియర్‌లో పంపుతాను అంటుంది శాంతమ్మ. కోడలికి గోరింటాకు పెడుతూ వీడియో చేసి పంపుతారు. ఆధునిక విజ్ఞానం వచ్చాక దగ్గర లేకపోయిన వీడియో ద్వారా అన్ని చక్కగా చూపించవచ్చును.

ఆషాఢంలో కూడా కోయిల కూస్తూనే ఉన్నది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కాలాలలో ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. గోరింటాకు కోసం వచ్చిన పిల్లలు కోయిలలతో సమంగా కూస్తున్నారు. దానికి రిప్లై గా పిల్లలు అంతా సంగీత సందడిగా కూస్తు ఉంటారు. ప్రకృతి అందాలు అవే కదా, ఆస్వాదించాలి.

శాంతమ్మ ఆలోచనలు బెంగుళూర్ లోని మనవల పైకి వెళ్ళాయి.

శ్రీజ ఉయ్యాల ఊగుతూ అమ్మ పెట్టిన ఆవకాయ, కొబ్బరి వేసిన ఉడుకు రొట్టెలో వేసుకుని తింటోంది. అంతలో బాగా తెలిసిన పిల్లలు లోపలికి వచ్చి “అక్కా, అక్కా” అంటూ చుట్టూ చేరారు. మిగిలిన వాళ్ళు వెళ్లిపోయారు.

శ్రీజ ఆ పిల్లలకి ఉడుకు రొట్టె ముక్కల్లో నెయ్యి ఆవకాయ చేర్చిన ముక్కలు కొబ్బరి లౌజు బిళ్ళలు చేతిలో పెట్టి తినమన్నది. పిల్లలు ఇష్టంగా ఆనందంగా తిన్నారు.

కొడుకు కోడలు ఆ ఇంటికి ఎప్పుడు అతిథులు మాత్రమే. వారి పనులు, పిల్లల చదువులు అంటారు. పట్టుమని పది రోజులు ఉండరు. రెండు రోజులు ఉండి పుట్టింటికి వెళ్లి పోతుంది. పిల్లలు కూడా తల్లి వెంట వెళ్లిపోతారు. కొడుకు రెండు రోజులు ఉండి ఊరగాయలు అవీ ప్యాక్ చేయించుకుని వెళ్లిపోతాడు. వేసవిలో రెండు రోజులు సంక్రాంతికి మూడు రోజులు ఉంటారు. అది బొమ్మల పేరంటం అయిపోగానే వెళ్లి పోతారు.

కోడలు మంచిదే కానీ కోడలి తల్లి అక్కాచెల్లెళ్ళు మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంటారు. కోడలిని అత్తవారితో కలవనివ్వరు. కారణం వాళ్ళు మొదటి నుంచి బెంగుళూర్ లోనే పుట్టి పెరిగారు. ఆ అమ్మాయి శ్రీమాన్‍తో పాటు ఉద్యోగం చేసేది. శ్రీమాన్ ఒక్కడే కొడుకు, ఆస్తి అంతస్తు ఉన్నాయని పెళ్లి చేశారు. ఎలాగూ బెంగుళూర్ లోనే ఉంటాడు కదా అనే ధైర్యంతో పెళ్ళి చేశారు. వాళ్ళు నలుగురు ఆడపిల్లలు. ఈ మధ్య కొందరు ఆడపడుచులు పెట్టే బాధలు పడలేక ఆడపిల్లలు లేని సంబంధాలు చూసుకుంటున్నారు.

ఒక పిల్ల ఆడపడుచుల బాధలు పడుతోంది. అందుకు ఇంకో పిల్లకి ఇద్దరు కొడుకులు ఉన్న సంబంధం చేశారు. అక్కడ అత్తగారు గడ్డుది. ఇంకా ఇలా ఆలోచిస్తే పెళ్లి కాదు కనుక, శ్రీమాన్ ఎలాగూ బెంగుళూర్ లోనే ఉంటాడు అన్న ధీమాతో పెళ్ళి చేశారు.

టచ్ మీ నాట్, తూ తూ తుమ్మెంటు ఆటల మాదిరి కోడలు వస్తుంది. కానీ “అత్తయ్యా అంతా మీ ఇష్టం” అని నవ్వుకుని ఊరుకుంటుంది. “మీరు ఏది ఇచ్చినా మహా ప్రసాదంగా మేము తింటాము” అంటుంది. వంకలు పెట్టకుండా అందినవి అన్ని పట్టుకు వెడుతోంది. పోనీలే ఈ మాత్రం మంచితనం ఉన్నది అనుకున్నది శాంతమ్మ.

ఎప్పుడైనా పిల్లాడిని చూడాలి అంటే వీడియో కాల్‌లో చూస్తుంది. కొడుకు కోడలు పరాయి వాళ్ళుగానే ఉంటారు, ఈ పెళ్లితో కొడుకు దూరం అయినట్టే. కానీ వాడి ఇల్లు పిల్లలు వాడికి వచ్చాయి, అంతే చాలు అనుకుంటుంది.

సదానందం మాత్రం పిల్లలు ఎదిగారు, స్నేహితుల్లా చూడాలి అంటాడు. మగవాళ్ళు సరిపెట్టుకున్నట్లుగా ఆడవాళ్ళు సరిపెట్టుకోరు అంటాడు.

అవును నిజమే వారి కుటుంబంలో కలతలు లేకుండా ఉంటే చాలు. ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చాలా కష్టంగా ఉన్నది. మూడో ఆడపిల్లా అనుకుని వాడిని కూడా అత్తంటి వైపు పంపేసాను అని సరిపెట్టుకున్నారు..

“చదువుకున్న కోడలు కొడుకుతో సమంగా కంటే ఎక్కువే సంపాదిస్తోంది కనుక ఆ పిల్లని ఏమీ అనుకోవద్దు, మనవాడికి మంచి పెళ్ళాం వచ్చింది” అన్నాడు సదానందం.

కొన్ని కుటుంబాల్లో కోడల్ని అధికారంతో చూస్తారు. అలా ఉండు, ఇలా ఉండు అంటారు. కాని శాంతమ్మ అలా చూడదు. కోడలు అంటే ప్రేమ. మనుమలు అంటే పిచ్చి ప్రేమ. వంశం కావాలి రా, మూడోసారి చూడు అంటే శ్రీమాన్ ఒప్పుకోలేదు. కానీ అంతా భార్య ఇష్టం, అత్తవారి ఇష్టం అన్నాడు. “మూడో కాన్పు అంటే వాళ్ళు పొయ్యరు, నువ్వు పొయ్యాలి. అంతా మనమే చూసుకోవాలి. అప్పుడు ఆడపిల్ల అయితే ఏం చేస్తావు? నువ్వు బెంగుళూర్ వచ్చి ఉండలేవు. నా భార్య సౌమ్య ఇక్కడికి రాదు. ఇంక ఆ విషయం వదిలేయ్యి” అన్నాడు శ్రీమాన్. “ఆడపిల్లలు మగపిల్లలు తేడా మాకు లేదు” అన్నాడు. ఇంక ఆ విషయం అక్కడితో ఆగిపోయింది.

“మేము నలుగురు అక్క చెల్లెళ్లము కదా. మా అమ్మ పోలిక. మళ్లీ మగ పిల్లాడు పుడతాడో లేదో” అని సౌమ్య అన్నది. ఇంకా ఆమె మాటకి అంతా సరే అన్నారు. అంతా కంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు.

‘పెద్దకూతురు మాత్రం చిన్న ఫోన్ కాల్ చేసినా వస్తుంది. ఇంకా రెండో కూతురు సెటిల్ అయితే అంతే చాలు’ అనుకుంది శాంతమ్మ. అక్కడ గోరింటాకు కోసం వచ్చిన ఆడపిల్లల్ని చూసి ‘వీళ్ళు ఎదిగాక చదువులు పెళ్ళిళ్ళు’ అనుకొని ఒక నిట్టూర్పు విడిచింది.

‘ఏమిటో గ్రామంలో పిల్లల కోసం ఇంత ఆలోచనా?’ అనుకున్నది. తను దేశోద్ధారకురాలా ఏమిటి?. ఎవరి తల్లి తండ్రి వారు చూసుకుంటారు.

నాతి చరామి అని పెళ్లి చేసుకుంటారు కానీ అది పెళ్లి మంత్రం మాత్రమే జీవితంలో అంతా కూడా పరిశీలిస్తే తారుమారు తక్కర మారు అన్న మాటలు చెప్పే కుటుంబాలు చాలా ఉన్నాయి.

ఎప్పుడైనా స్కూల్ వదిలే సమయానికి గుమ్మంలో ఉంటే తల్లులు బ్యాగ్‍లు క్యారేజ్‍లు పట్టుకుని వాళ్ళని కేకలు వేస్తూ తీసుకు వెడతారు. ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి స్పెషల్ క్లాసులే. “జాగ్రత్తగా ఉండు రేపు అత్తవారింట తల్లిని తిడతారే, బుద్ధిగా ఉండు” అంటూ ఒక తల్లి పిల్లని ఇంటికి తీసుకు వెడుతోంది.

‘హూ ఏమిటో ఈ ఆడపిల్లల జీవితం’ అనుకుంది శాంతమ్మ.  ఏదైన నచ్చ చెపితే కోపం వచ్చి విరోధం వస్తుంది. భర్తకి తెలిస్తే కోప్పడతాడు. ఆలోచిస్తూ లోపలికి వచ్చింది. ఆ పిల్ల తల్లి వెనక్కి వచ్చి, “శాంతమ్మ గారు మాకు రేపు గోరింటాకు కావాలి. మా చెల్లెలి పెళ్ళి, మా పిల్లని తోడి పెళ్ళికూతురు చేస్తారు” అంటూ చెప్పి వెళ్ళింది. ఇందుకే ఇప్పటి నుంచి కూతురుకి క్లాస్ చెపుతోంది.

***

శ్రీజ పెళ్లి చాలా చిత్రంగా కుదిరింది. ప్రక్క ఊళ్ళో ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెడితే అక్కడ శ్రీజకి కాబోయే మామగారు వచ్చారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. న్యూమరాలజీలో దిట్ట. ఇట్టే లెక్కలు వేసి అన్నీ చెపుతారు రమణ రావు గారు. రా రా గారు అంటారు.

అలా మాటల్లో పరిచయం అయ్యి ఆయనకి ఇద్దరు కూతుళ్లు పెళ్లికి ఉన్నారు, కొడుకు పెద్ద కంపెనీ సి.యి.ఓ అని చెప్పారు. “ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళకి నచ్చవు అనే కంటే మా ఆవిడ వంకలు పెడుతుంది” అన్నారు.

“అదేమిటి జాతకం ప్రకారం కాదా?” అన్నాడు సదానందం.

“అయినా ఆవిడ ఎక్కువ మంది జనం ఇంట్లో ఉండకూడదు అంటుంది. డిసిప్లిన్ ఎక్కువ. ఒక పెళ్లి కొడుకు నల్లగా లావుగా ఉన్నాడు. అతనికి ఉద్యోగం లేని తమ్ముడు, పెళ్లి కాని చెల్లెలు ఉన్నారు. అందుకని నా కూతురు ఇంతమందికి వండి వార్చి పెట్టలేదు. అది ఉద్యోగం చేసి వచ్చి ఇల్లు చూడాలి అంటే కుదరదు అని ఆ సంబంధం వద్దు అంది. ఇలాగే ప్రతి సంబంధానికి వంక పెడుతుంది” అని నవ్వాడు.

“మా పిల్ల పెళ్లికి ఉంది. ఇక్కడికి వచ్చింది చూపిస్తాను” అంటూ “శ్రీజా” అని పిలిచాడు సదానందం. సన్నగా జాజిమొగ్గలా ఉన్న పిల్ల నవ్వుకుంటూ వచ్చింది.

“ఈయన గొప్ప న్యూమరాలజిస్ట్” అని చెప్పాడు. నమస్కారం పెట్టింది

“పిల్ల బాగుంది. సంప్రదాయంగా ఉంది” అన్నాడయన.

శ్రీజ పట్టుచీర వంగ పండు రంగుది కట్టింది. ఎర్ర జాకెట్ ధరించింది. కెంపుల సెట్టు పెట్టుకున్నది. ఎఱ్ఱ రాళ్ళ గాజులు వేసుకుంది. కెంపులు బుట్టలు, ఉంగరం, కెంపుల హరం వేసుకున్నది.

“పిల్ల చాలా బాగుంది. మీ పోలికే. నవ్వుతూ ఉన్నది. ఉద్యోగం చేయిస్తున్నారా?” అన్నాడు

“లేదండీ. నేను చెయ్యనివ్వను. పెళ్లి చేస్తాము. మంచి సంబంధం చూడండి” అన్నాడు సదానందం.

“అలాగే” అని, “నీ కిష్టమైన సంఖ్య చెప్పు, నీకు ఇష్టమైన రంగు చెప్పు. నీకు ఇష్టమైన పువ్వు చెప్పు. నీకు ఇష్టమైన చదువు చెప్పు” అని శ్రీజని అడిగారు.

అన్ని విని లెక్కలు వేసి “మీ అమ్మాయికి ఈ జ్యేష్ఠంలో పెళ్లి అవుతుంది. ఏరి కోరి వచ్చి చేసుకు వెడతారు” అన్నారాయన.

“అహ, అంత అదృష్టమా?” అన్నాడు సదానందం.

“అవును. అయితే కొంత కాలం ఆ పిల్ల అడ్జస్ట్ కాలేదు. తరువాత అంతా బాగానే ఉంటుంది.”

“అయ్యో అలాగా” అన్నాడు సదానందం. శ్రీజ మౌనంగా ఉన్నది.

పెళ్లి భోజనాలు దగ్గర అక్కడ అంతా కలసి మెలసి కూర్చుని తిన్నారు. మంచి మిత్రులు అయ్యారు. “నేను మీకు సంబంధం చెపుతాను” అంటూ ఏవో వివరాలు రాసి ఇచ్చాడాయన.

సదానందం ఇంటికి వచ్చి శాంతమ్మకు చెప్పాడు.

“పిల్లల పెళ్లి చెయ్యాలి అంటే భయంగా ఉన్నది. పెద్ద పిల్లతో ఎన్నో గందరగోళాలు పడ్డాము. మేనత్తే అయినా అన్ని హంగామాలు చేసింది” అంది శాంతమ్మ.

“పర్వాలేదు. నేను మంచి రోజు చూసి ఫోన్ చేస్తాను” అన్నాడు సదానందం.

సరే ఫోన్ చేశాడు. అవతలి నుంచి ఆడ గొంతు వినిపించింది “మా ఆయన వస్తారు లైన్‍లో ఉండండి” అన్నది.

ఐదు నిముషాలలో “హలో” అని వినిపించింది. అది వాళ్ళ అబ్బాయి గొంతు అని తెలిసింది.

“మీ నాన్నగారు ఉన్నారా?”

“ఆయన పూజలో ఉన్నారు. అప్పుడే అవదు. అందుకని మా అమ్మ నాకు ఇచ్చింది, ఏమి కావాలి చెప్పండి” అన్నాడు

“పెళ్ళికొడుకు విషయం చెప్పేరు. పేరు నవీన్. అంటే మీరేనా?”

“ఆ నేనే సర్. నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి చేయందే ఎలా అని అమ్మ అంటుంది. అన్ని ఆవిడ చూసుకుంటుంది. నాన్న లెక్కలు చెపుతారు” అని నవ్వాడు.

“ఆహా అలాగా” అని, తన వివరాలు చెప్పి, “మీ పెద్ద వాళ్ళకి చెప్పండి” అన్నాడు సదానందం.

“సరే అలాగే నాన్నగారు తరువాత మాట్లాడుతారు” అని ఫోన్ పెట్టేసాడు నవీన్.

రెండు రోజులకే సదానందంకి ఫోన్ వచ్చింది – “మేము మీ ఇంటికి పెళ్లి చూపులకి వస్తున్నాము” అన్నారు.

‘ఇదేమిటి? ఏమీ ప్రిపరేషన్ లేకుండా వస్తున్నారు’ అనుకుని “సరే రండి” అన్నారు. పెళ్లివారికి అన్ని అరేంజ్‌మెంట్స్ చేశారు. దగ్గర ఊరే కనుక రెండు గంటల ప్రయాణంలో వచ్చి వెడతారు. కొబ్బరి బొండాలు, బాదం పాలు, జీడిపప్పు పకోడిలు, సమోసా, స్వీట్ కార్న్, అప్పాలు, మైసూర్ పాక్ రెడీ చేసారు.

సరే, పెళ్లివారు అన్న సమయానికి వచ్చారు. రాగానే కాళ్ళు కడుక్కుని వచ్చారు. ఆడపిల్లలు చాలా ఆధునికంగా ఉన్నారు. భార్య కూడా చాలా ఫ్యాషన్‌గా ఉన్నది. పెళ్లి కొడుకు నవీన్‌తో పాటు ఒక పెద్దాయన వచ్చారు. ఆయన పెళ్లి కొడుకు వరుసకి బావగారు అవుతాడు. ఇంతకీ తండ్రి ఆఖరున దిగారు. ఆయన ఎవరు అనుకున్నారు, మన న్యూమరాలజీ రా రా గారు.

“అరె మీరూ వచ్చారు సంతోషం” అన్నాడు సదానందం.

“అరె భలేవారే. నేను రాకుండా పెళ్లి ఎలా అవుతుంది? ఆ రోజు మీ పిల్లని చూసి మురిసి ముక్కలు అయ్యాను. ఎలాగైనా నా భార్యను కొడుకును ఒప్పించి ఇలాంటి బంగారు బొమ్మను కోడల్ని చేసుకోవాలి అనుకున్నా. ఆధునిక పద్ధతులు ఉన్న అమ్మాయిలు మాకు వద్దు అనుకున్నాను. అదే చెప్పాను, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అన్నది తెలియదు. ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి మహా కష్టంగా ఉన్నది. అందుకే బావగారు నేను ముందడుగు వేసి నేనే చెప్పా, బయలుదేరాం” అన్నారు రా రా గారు.

“ఏరి కోరి వచ్చారు, సంతోషం” అంటూ లోపలికి వెళ్ళిన వెంటనే కొబ్బరి బోండాలు ఇప్పించారు సదానందం. అంతా ఆనందంగా తాగారు.

పూర్వ కాలం మండువా ఇల్లు. పెద్ద హలు లేపాక్షి ఉయ్యాల. అందులో రాజస్థానీ అద్దాల దిళ్ళు. మహా రాజా దిళ్ళు వేసి గంటలు గాలికి ఊగుతూ ఎంతో బాగున్నాయి. పాత కాలం గంగాళాలలో మొక్కలు పెట్టీ కార్నర్స్‌లో ఉన్నాయి. ‘ఇల్లు బాగుంది’ అనుకున్నారు పెళ్ళివారు.

“సోఫాలు అన్ని బాగా అమర్చారు” అన్నారు రా రా గారు.

“అబ్బే లేదండీ, రోజు మా ఇల్లు ఇంతే” అన్నాడు సదానందం.

టిఫిన్స్ పెట్టారు. “చాలా బాగున్నాయి” అన్నారు వాళ్లు.

“మా ఆవిడ శాంతి, పిల్లా ఇద్దరు చేశారు” చెప్పాడు సదానందం.

“అయితే మా కోడలి వంట అప్పుడే రుచి చూసామన్న మాట” అన్నారు వాళ్లు.

పిల్ల వచ్చింది. చూశారు. పిల్లాడు కొంచెం చామన ఛాయ. పిల్ల ముందు తేలిపోయాడు. తల్లి కలుగ చేసుకుని “మగ పిల్లాడు, ఎండ కొండ చదువులు ఉద్యోగం సరిపోతుంది. సమయానికి భోజనం చెయ్యడం కుదరదు. స్కూల్ మాస్టారు, క్లర్క్‌లు అయితే బాక్స్‌లు పట్టుకెళ్ళి లంచ్ చేస్తారు. వీడికి అలా కుదరదు” అంటూ సాగదీసింది. టి.వి సీరియల్ డైలాగ్స్ మాదిరి చెప్పింది.

పిల్లాడికి నచ్చితే పిల్ల ఇష్టం ఏముంది? వంక పెట్టడానికి లేదు. ఉద్యోగం బాగుంది, జీతం బాగుంది. ఇద్దరు చెల్లెళ్ళు, అత్తగారు గారు కూడా కొంచెం మాటకారులే. పెళ్లి కాకుండానే వరుసలు కలిపి ఫోన్ నంబర్స్ ఇచ్చేశారు.

ఇంట్లోనే అప్పుడే మెసేజ్‍లు కూడా పెట్టేశారు. “ఇప్పుడంతా స్పీడ్ యుగంలో ఉన్నాము” అన్నారు.

“కట్నం లాంఛనాలు తీసుకోవడం మాకు ఇష్టం లేదు. పెళ్లి ఖర్చులు కూడా ఎక్కువ పాష్‍గా వద్దు. పెళ్లి సింపుల్‌గా చేద్దాం. మేము రిసెప్షన్ ఘనంగా చేస్తాము. అక్కడ అందర్నీ పిలవాలి. నా స్టాఫ్, అబ్బాయి స్టాఫ్ మా పిల్లల ఫ్రెండ్స్ అంతా వస్తారు. అది మా ఖర్చు. ఇక్కడ కూడా మనం ఖర్చు సగం సగం చేసుకుందాము. ఒక్కళ్ళు భరించవద్దు” అంటూ కలుపుగోరుతనంగా ఉన్నారు.

“నేను చేయిస్తాను, అన్ని నా చేతిలో ఉన్నాయి. ఈవెంట్స్ వాళ్ళు వస్తారు” అంటూ గబ గబా లెక్కలు వేసి ఫోన్ చేసేశారు.

“పిల్లని ఒక మాట అడుగుతారా?” అన్నారు వాళ్లు.

“మా పిల్లకి మేము ఎంత చెపితే అంత. అన్ని రకాల మాటలు ఉండవు” అని శాంతమ్మ సదానందం అన్నారు. ఫోన్ లోనే పెద్ద పిల్లకి చెప్పారు.

ముహూర్తం పెట్టి, శుభలేఖ ఫోన్‍లో పంపి, అందర్నీ ఫోన్‍లోనే పిలిచేశారు. టైం ఎక్కువ లేదు.

వారం రోజుల్లో పెళ్లి అయిపోయింది. పిల్లని అత్తవారింటికి పంపారు. అన్ని సుఖాలు ఉన్నాయి. అయితే ఆ యింట్లో మాటామంతి లేవు. ఎవరి గోల వాళ్ళదే. అత్తగారు మాత్రం ఏదో ఒకటి ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూనే ఉంటుంది. మామగారు లెక్కలు వేస్తూ వచ్చిన వాళ్ళకి సమాధానం చెపుతారు.

ఓ పద్దెమిది రోజులు ఉన్నది శ్రీజ. ఈలోగా ఆషాడం వచ్చింది, పిల్లని తెచ్చుకున్నారు శాంతమ్మ దంపతులు.

ఆషాఢ పట్టి కింద బ్రేస్‍లెట్, ఉంగరం, గొలుసు, చెవి రింగ్ పెట్టమన్నారు. సరే అని పట్టుకెళ్ళి ఇచ్చారు. “మీరు శ్రావణ మాసం మంగళ గౌరీ వ్రతానికి, శ్రీ వరలక్ష్మీ వ్రతానికి రావాలి. దగ్గర ఉండి పూజ చేయించాలి” అని చెప్పారు సదానందం, భార్య శాంతమ్మ.

“అబ్బే అన్నయ్య గారు, వదిన గారు. మా పిల్లలవి పెద్ద ఉద్యోగాలు. రారు. మేము పెద్ద వాళ్ళం. మేము రాలేము. కారు ఉన్నా సరే రాలేము. కనుక నేను చీర, రూపు ఇస్తాను. నోము మీ పద్ధతిలో చేయించండి” శ్రీజ అత్తగారు అన్నది.

“అదేమిటి ఇన్నాళ్ళకి కొడుకు పెళ్లి అయ్యింది. ఓసారి వచ్చి దీవించండి” అంటే, “అబ్బెబ్బే కుదరదు” అనేసింది. రా రా గారి నుంచి ఏమి ఉలుకు పలుకు లేదు.

“హి హి హి హి అంతా మా బెటర్ హాఫ్ ఇష్టం అండి” అన్నారు.

“పిల్లాడిని పంపండి. ఆడపిల్లలు వస్తే బాగుంటుంది”

“అబ్బే వాడు మగాడు. వాళ్ళు పెళ్లి కానీ పిల్లలు. ఇప్పటికే చాలా ఫీల్ అవుతున్నారు వదిన గారిని చూసి. వాళ్ళు రారు” అందావిడ. “వాళ్ళకి లేని అదృష్టం మీ కూతురుకి పట్టింది, కాదు కాదు నా మొగుడు తెలివిగా పెళ్లి చేశారు. ఇప్పుడు వీళ్ళకి పెళ్లి అవద్దా?” అంది చేతులు మూతులు తిప్పుతూ. ఆవిడలో బాగా ఈర్ష్య కనిపించింది.

అరె అడిగారు కదా, ఇంటికి వచ్చి అని – పిల్లనిచ్చి పెళ్ళి చేశారు. కానీ అప్పటి మనుష్యులు వేరు, ఇప్పటి మనస్తత్వం వేరు అని తేలిపోయింది. ఇంకా చేసేది ఏముంది?

ఆషాడం పేరుతో పిల్ల ఇంటికి వచ్చింది. ‘మనం పెంచిన విధానం వేరు, అక్కడి మనస్తత్వం వేరు’ అనుకున్నారు.

ఆరోజు రాత్రి గోరింటాకు రుబ్బి శాంతమ్మ కూతురు చేతులకి పాదాలకి పారాణి పెట్టింది.

ఆ పల్లె నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పిల్లలు వచ్చి ‘మీ ఇంటి గోరింటాకు పెట్టీ పెళ్లి చేస్తే పిల్లలతో సుఖంగా ఉంటారు’ అని చెప్పి గోరింటాకు కోసుకు వెడతారు. అది వాళ్ళ నమ్మకము కదా.

టివి చూస్తూ గోరింటాకు పెట్టుకుని అమ్మ చేతి ముద్దలు తిన్నది. ప్రతి సీరియల్‍లో కూడా ఆడదాన్ని మిక్సీలో వేసి ఆడినట్లు బాధలు పెడుతున్న స్త్రీ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. వీటి ఆధారంగా రూపొందించిన చిత్రాలు, సీరియల్స్ వల్ల మనుష్యులలో మార్పు రాదు. కానీ మరింత పెంకిగా మనుష్యులు అందునా ఆడవారు మారుతూ ఉన్నారు.

“అమ్మా ఆడదాని జీవితం ఇంతేనా?” అన్నది శ్రీజ.

“లేదమ్మా స్త్రీ కష్టాలు తట్టుకోగలదు. అందుకే ఆమెకు అలా పెట్టి కథ నడుపుతున్నారు. ఆనాటి కాలంలో ‘అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా పంచకన్యా స్మరేన్నిత్యం సర్వపాతక నాశనం’ అని చెపుతారు.” అంది శాంతమ్మ.

“అవన్నీ ఆ కాలంలో అమ్మా, ఇప్పుడు ఎలా?”

“అల్లుడు నవీన్ ఏమంటారు?”

“వాళ్ళ అమ్మ కూచి. ఏమీ మాట్లాడడు. అంతా యాంత్రిక జీవితం అమ్మా” అంది శ్రీజ.

“సరే పడుక్కో. చాలా ఆలస్యం అయింది. పడుకుంటే నేను ఉదయాన్నే లేవాలి”

అలాగే గోరింటాకు కొంచెం ఎండింది. పుట్టిల్లు కనుక ఆ మంచం పైనే పడుక్కుని నిద్ర లోకి జారింది శ్రీజ.

***

తెల్లవారినట్లుగా కాఫీ డికాక్షన్ వాసన కమ్మగా ముక్కు పుటాల్ని తాకింది. గబగబా లేచి అరచేతులు చూసుకున్నది శ్రీజ. కొంత రాలిపోయింది దుప్పటి నిండా పడింది. లేచి చేతులు కడుక్కుని కాళ్ళు కడుక్కుని ముఖం కడిగి వచ్చి దుప్పటి దులిపింది.

అమ్మ దగ్గరికి వెళ్లి చేతులు చూపించింది.

“ఎంత ఎర్రగా పండింది? అహ మీ ఆయనకి నువ్వు అంటే ఎంతో ఇష్టం” అంది శాంతమ్మ.

“నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు” అని మూతి ముడిచింది శ్రీజ.

ఆషాఢం వెళ్ళింది. శ్రావణం మేఘాలు ఆకాశమంత కమ్ముకున్నాయి.

అయినా సరే శ్రోజతో నోము పట్టించి మంగళ గౌరీ వ్రతం చేయించింది శాంతమ్మ. మొదటి ఏడాది ఐదుగురు కనుక బాగానే వచ్చారు పేరంటాళ్ళు. వర్షం వస్తున్నా సరే పిలిచిన, తెలిసిన వాళ్ళు అంతా కలిపి నలబై మంది అయ్యారు.

ఇంక పూర్ణిమ ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయించారు. అత్తవారు ఎవరు రాలేదు. అన్ని శాంతమ్మ చూసుకున్నది. హరం చేయించి తండ్రి పూజ చేయించారు. పెద్ద పిల్ల వచ్చింది. వీడియో చేసి అత్తవారింటికి పంపారు

అహ ఓహో అన్నారు.

పచ్చని పసుపుతో గోరింటాకు పాదాలు చేతులకి, ఎర్రగా పండిన గోరింట రాణి రంగు ఆకు పచ్చ అంచు పట్టుచీర, హరం ఎంతో మెరుస్తోంది. వెండి చెంబుపై లక్ష్మీ కలశం అలంకరణ, మొగలి పూల అలంకరణ, మరువం చామంతి దండలు, మధ్యలో కనకాంబరం గులాబీ పూలు – ఎంతో బాగుంది అమ్మవారు.

మంగళ హారతి ఇస్తూ అక్కా చెల్లి కలిపి ‘క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికినీ నీరజాలయకును నీరాజనం’ అంటూ రాగయుక్తంగా పాడారు. వీడియో చాలా బాగా వచ్చింది. కెమెరామాన్ వేరే పిలిచి బాగా చేయించారు.

“మీకు శ్రావణం చివర అమావాస్య పొలాల అమావాస్య పూజ ఉందా? మాకు ఆనవాయితీ ఉన్నది. పూజ చెయ్యవచ్చా?” అని శాంతమ్మ వియ్యపురాలిని ఫోన్‍లో అడిగింది.

దానికి సమాధానంగా చిన్న అడబడుచు “మా అమ్మ ఎప్పుడూ చెయ్యలేదు. మీరు చేయించడం కుదరదు” అంది.

అప్పుడు వియ్యపురాలు, “ఎలాగ వదిన గారు, మేము సిటీస్‍లో ఉన్నాము. అందుకు. కంద మొక్క దొరకక ఆయన శ్రద్ధ చెయ్యలేదు. ఇది పిల్లల కోసం, వంశ అభివృద్ధి కోసం చేసే పూజ కనుక పోలేరమ్మ పూజ చేసి బూరెలు, గారెలు నైవేద్యం పెట్టించి వీడియో పంపండి” అన్నది.

అత్తగారు తెలివైనది. “అంతే కాదు వదిన గారు, మీరు పట్టేన నోములు కూడా మా కోడలి చేత పట్టించి చేయించండి. అక్కడ వంట వాళ్ళు, పేరంటం చెయ్యడానికి ముత్హైదువులు దొరుకుతారు” అన్నది. “అవన్నీ నా కొడుకు మంచికే కదా” అన్నది.

హమ్మయ్య పర్మిషన్ వచ్చిందని శాంతమ్మ పిల్ల చేత నోములు నోపించి ఉద్యాపన చేయించింది.

పట్టిన నెలలో ఉద్యాపన చేస్తే పుట్టు భోగి అవుతారని శాస్త్రం ఉన్నది, శ్రీజ ఎలాగ జమీందారు కుటుంబం లోనిదే కదా.

శ్రీజ ఫొటోస్, వీడియో చూసి ఆడపడుచులు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కానీ అత్తగారికి సుఖం ఉండదు, ఆందోళన తగ్గదు. అందుకే కొన్ని సబంధాలు వెతికారు. ఆశ్వీజంలో ఒక పిల్లకి, ఉగాది తరువాత కొత్త సంవత్సరంలో వైశాఖ మాసంలో మరో పిల్లకి పెళ్లి చేశారు మన న్యూమరాలజీ రా రా గారు.

శ్రీజకి ఇప్పుడు అత్త పోరు, ఆడబడుచుల పోరు లేదు. కోడలికి బాధ్యతలు అప్పచెప్పి మనశ్శాంతిగా విశ్రాంతి తీసుకుంటూ ఫోన్‌లో కబుర్లు చెపుతూ కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారు అత్తమామలు.

శాంతమ్మ ‘కూతురికి ఇప్పటికి సుఖం వచ్చింది’ అని సంతోషించింది. సదానందం ఎప్పుడు చిదానందమే!

శాంతి శుభము!

Exit mobile version