Site icon Sanchika

ఆస్తిలో వాటా

[కన్నడంలో శైలజ సురేష్ రచించిన ‘పాలు’ అనే కథని అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]“వ[/dropcap]చ్చావా సులోచనా, రామ్మా. హసన్ నుండి ఎన్ని గంటలకు వదిలావు? మొదటి బస్‍కే వచ్చి వుండొచ్చు కదా..” అనూరాధ మరదల్ని స్వాగతించినపుడు, ఆమెది కృతక చిరునగవని అనిపించింది సులోచనకు. ‘అబ్బా! అదెంత చక్కగా నటిస్తున్నదో! లోపల కడుపు మండుతూ ఉన్నా, పైకి మాత్రం నవ్వు. కానివ్వు. ఇప్పుడు, నేను నయంగానే ఉండాలి. ఊరకే మొరటుగా మాట్లాడి వచ్చిన పని పాడు గాకుండా చూసుకోవాలి’ అనుకుంటూ, ముఖమంతా నవ్వు చేసుకుని, చేతిలోని ప్లాస్టిక్ బ్యాగ్‍ని వదిన చేతికిచ్చి, “తీసుకో వదినా, హసన్ లేత వంకాయలంటే అన్నయ్యకు చాలా ఇష్టం. దాంతో పాటే ఆనపకాయ తెచ్చాను. ఉదయం పది గంటల బస్సుకే బయల్దేరా. అబ్బో! అదేం రష్ వదినా, మైసూర్ చేరేసరికి చాలయిపోయిందనుకో” అంది.

“ఓహో! పసందైన వంట ఈ రోజు. ఆనపకాయ, వంకాయల కాంబినేషన్, దానికి తోడు గసగసాల పాయసం. సులోచనా! ఎప్పుడొచ్చావే? లెటర్ అందిందా? బావగారు రాలేదా?” అంటూ తువ్వాలు తోటి తలను తుడుచుకుంటూ వచ్చాడు మూర్తి. చెల్లెల్ని పలకరించాడు.

“ఔన్రా అన్నయ్యా – నీ లెటర్ అందగానే, ఇటు వచ్చేశా. మీ బావగారికి ఆఫీసులో హెవీ వర్క్ అట – రానన్నారు. ఇది మన వ్యవహారం కదూ – దీన్ని ముగించుకుని సాయంత్రం బయల్దేరుతాను. అక్కడ మీ బావగారికి, అల్లుడికి కష్టం కదూ.”

తను వచ్చిన విషయాన్ని నయంగా బయటపెట్టింది సులోచన. చెల్లెలు ఇంగితం మూర్తికి అర్థం కాకపోలేదు. “కానీ లేవే – అలాగే వెళుదువు గాని – మధ్యాహ్నం పెదనాన్న, మామయ్య వస్తున్నారు. వాళ్ళకీ కబురు పంపాను. వాళ్ళ సమక్షంలో తీర్మానం చేస్తే సరి. దీన్నుంచి, అన్నా-చెల్లెళ్ళ సంబంధానికి కీడు రాదనే నా ఆశ. ముందు టిఫిన్ కానిద్దాం పద.”

అన్నయ్య వరస తనకి అర్థమయ్యింది. హుఁ, వీడు చాపక్రింద దూరితే తాను ముగ్గు క్రింద దూరే రకం అనే విషయం తెలీదు వీడికి. రాన్నివ్వు – పెదనాన్న, మామయ్య కూడా రానీ.. మామయ్యకు వీడంటే ఇష్టం. అయితే పెదనాన్నకి నేనంటే ఇష్టం.

ఇంతకీ తాను ఈ ఇంటి ఆడపడుచుని కాదా. బంగారం ఎంత వుంది, వెండి ఎంత వుంది, దేవుడింట్లో వుండే వెండి దీపపు స్తంభాలు సుమారు పదివేలు, వెండి విగ్రహాలు, హారతి పళ్ళెం, చెంబు, కలశం కావల్సినవన్నీ వున్నాయి. అవన్నీ చేరి ఓ యాభై వేల దాకా వుంటాయి. అమ్మ నగలు ఓ లక్షకు పైగానే ఖరీదు చేస్తాయి. నగలంటే అదెంత ప్రేమో అమ్మకి. పెళ్ళిలో తనకి నగలు చేయించి తన కర్తవ్యం ముగించుకుంది. రాళ్ళ నెక్లెస్ కావాలని తానెంతగానే మారాం చేసింది.

ఇప్పుడు అప్పుడంటూనే అమ్మ దాటవేస్తూ, నాన్నగారికి బ్లడ్ కాన్సర్ కన్పించాకా, దాని విషయమే మర్చిపోయింది. నాన్నగారు కోలుకుంటున్నారనగా ఆమె మరణించింది. ఆ తర్వాత నాన్నగారూ వదిలి వెళ్ళిపోయారు. తనకు ఈ ఇంటి పైన ఏ హక్కూ లేదా? ఆస్తి కంతటికీ ఈ మూర్తి ఒక్కడే హక్కుదారుడా? అమ్మ నగలవి అమ్మేసి తన పెళ్ళానికి వేరే నగలు చేయించాడో ఏమో?

అలా ఆలోచిస్తూనే కాళ్ళు ముఖం కడుక్కొచ్చి డైనింగ్ టేబుల్ వద్దకు చేరింది. వదిన చేతి నుంచి ఉప్మా ప్లేటు అందుకున్నప్పుడు, “దానికి నెయ్యి వడ్డించవే! అది లేకుండా దానికి ఉప్మా దిగదు” అని మూర్తి అనప్పుడు సులోచన మనసు కరిగింది – అన్నయ్య తన బాల్యాన్ని మరిచిపోలేదు. ఎంత బాగా గుర్తుంచుకొన్నాడు.

కాఫీ గుటకలు వేస్తూ అన్నాడు మూర్తి – “ఇలా అంటున్నానని అన్యథా భావించబోక. నాన్నగారి తద్దినం రోజున, ఆస్తి గురించి ఎందుకు మాట్లాడావు? అదీ అత్తయ్య వద్ద. ఆమె అందరికీ టాం టాం వేసింది, తెల్సా? ‘సులోచన ఆస్తిలో వాటా అడుగుతుందట, ఇవ్వకపోతే కోర్టు కెళుతుందట!’ అని అందరితోటి చెప్పుకుంటూ పోతున్నది తెల్సా. నీవు నేరుగా నన్నే అడిగి వుండచ్చుగా. మీ వదిన మనసు ఎంత నొచ్చుకుందో తెల్సా?”

మృదువైన సులోచన మనసు, అన్నయ్య అన్న ఈ మాటల వల్ల బిరుసయ్యింది. “ఎవరెవరికో, కష్టంగా ఉంటుందని నేను నా హక్కును వదులుకోవటానికి సిద్ధంగా లేనన్నయ్యా. నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా నీవొక్కడిదే కాదు. పొలం, ఇల్లు నాకేమీ అక్కరలేదు. అయితే సైటు, వెండి, బంగారం – వీటిల్లో నాకు వాటా కానే కావాలి” ఆవేశంతో సులోచన అలా మాట్లాడినప్పుడు, మూర్తి తగ్గు స్వరంలో, “ఆస్తిలో వాటా అడిగేటట్లయితే..” అంటూ ఆపాడు.

“అయితే..”
“నీవూ కొన్ని బాధ్యతలు మోయవలసి వస్తుంది.”

లోలోనే నవ్వుకుంది సులోచన. ఇంకేం బాధ్యతలుండటానికి సాధ్యం? నాన్నగారు నడుపుతూ వుండిన బట్టల షాపు నుండి కావల్సినంత ఆదాయం వస్తూండేది. అయితే ఈ వ్యాపారంలో పోటీ ఎక్కువవటం వల్ల లాభాలు తగ్గిపోయాయి. అయినా ఏమంత కష్టంగా లేదు. ఇద్దరూ పిల్లలూ హైస్కూలు చదువుతున్నారు. వాళ్ల బాధ్యత వాడిదే కదా! తాను సుఖంగా సంసారం చేస్తున్న ఇంటి యజమానురాలే. మొగుడి సంపాదన సంసారానికి సరిపోతున్నాదాయె. ఒక్కడే కొడుకు. ఇప్పుడిప్పుడే అప్పు చేసి ఓ ఇల్లు కట్టుకున్నారాయె. నాన్నగారి ఆస్తి తనకు ఆవశ్యకత లేదు. అయితే, నాన్నగారి ఆస్తిలో వాటాను ఎందుకు వదులుకోవాలి? సైటు దక్కితే దాన్ని అమ్మేసి – ఇంటి కోసం చేసిన అప్పును తీర్చివేయవచ్చు. అమ్మగారి నగలపైన హక్కును తానెందుకు పోగొట్టుకోవాలి? అయితే తన భర్త సుదర్శన్‍కి ఈ వ్యవహారం నచ్చటం లేదు. ‘ఇప్పుడు మనకేం తక్కువైందని – మన మానాన మనం ఉంటే సరిపోదా – నీ కెందుకీ లేనిపోని గొడవ..’ అనే ఆయనగారి ఆలోచన. “ఇంకోసారి ఆలోచించు” అని అన్నాడాయన ఇక్కడికొచ్చేముందు.

ఆయన అలా అంటాడని తాను అంత సులభంగా వదిలిపెడితే – ఈ మూర్తి ఆస్తినంతా అనుభవించి సుఖంగా ఉంటాడు. అందుకే, తండ్రిగారి శ్రాద్ధం రోజునే వదినగారి చెవిన పడాలనే అత్తయ్య ముందు వెళ్ళబోసుకుంది.

“ఎప్పుడొచ్చావమ్మా! మీ ఆయన రాలేదా?” అప్పుడే వచ్చిన మామయ్య మాటలని విని లేచి వెళ్ళి కాళ్ళకు నమస్కరించింది. “ఎలాగున్నారు మామయ్యా.. నేనీ ఉదయమే వచ్చా.. వారు రాలేదు మామయ్యా” అంది.

“ఓహోహో! ఏంట్రా యిది.. ఆనపకాయ పులుసు వాసన వస్తూంది..” అంటూ పెదనాన్నగారు లోనికొచ్చారు. “ఎప్పుడొచ్చావే సులోచనా” అంటూ ఆమె తల నిమిరారు. పెదన్నాన్నను చూడగానే నాన్నగారిని చూచినంత ఆనందం. “బావున్నారా పెదనాన్నా” అని నమస్కరించింది.

మూర్తిని ఉద్దేశించి, “అదేంటో విషయం త్వరగా ప్రారంభించరా మూర్తీ. ఇక్కడే భోంచేసి వెళతాను,” అని అన్నారు పెదనాన్న నవ్వుతూ. బెడ్ రూమ్ నుండి ఓ గంధపు పెట్టెను తెచ్చి డైనింగ్ టేబుల్ పైన ఉంచుతూ, “పెదనాన్నా! ఇవన్నీ మా అమ్మగారి నగలు. తన అవసాన కాలం సమీపించినా, వీటిని ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇకపోతే దేవుడింట్లో ఉండే పాత్రలన్నీ తరతరాల నుండి వచ్చినవి. వాటిని తీయడానికి నాకిష్టం లేదు. వాటికి బదులుగా నగదు ఇవ్వగలను. సులోచనకు చెప్పండి, ‘ఆస్తిలో వాటా కావాలనుకునేవాళ్ళు, బాధ్యతలనీ పంచుకోవాలి’ అని.”

నవ్వింది సులోచన. “సరే పెదనాన్న.. ఆ బాధ్యతలేమిటో చెప్పమనండి. నేను కూడా వాటా పంచుకుంటాను.”

అనూరాధ తన పని ముగించుకొని వచ్చి అందరికీ కాఫీ ఇచ్చింది. మూర్తి గంధపు పెట్టెను తెరిచినపుడు, సులోచన కళ్ళు మిలమిలలాడాయి. నగలన్నింటినీ బయటకి తీసి, చెల్లెలి వైపు తిరిగి అన్నాడు, “అమ్మగారి నగలెన్ని వుండేవి అనే విషయం నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. ఈరోజే నేనీ పెట్టెను తెరిచింది. నీకేవేవి కావాలో తీసుకో. మిగిలినవి మీ వదినకివ్వు.”

వేటిని తీసుకోవాలో తెలీలేదు సులోచనకు. ఆ నగలన్నీ తనవే అయితే! అయితే అది దురాశే అవుతుంది.. ఏవి తీసుకోవాలే అని సందిగ్ధతలో పెదనాన్న వైపు చూడగా, “సులోచనా, ఆ తెల్ల ముత్యాల సరం నీకు ఒప్పుతుంది. దాన్నే తీస్కో” అన్నారు. వజ్రపు కమ్మలు, తెల్ల ముత్యాల నెక్లెస్, రెండు బంగారు గాజులు, ఉంగరాన్ని పక్కకు పెట్టింది. అవన్నీ కావాలని ఎంతో కాలంగా ఆశ.

“వెండి పాత్రలకి బదులుగా 15 వేలు నగదు ఇస్తాను” అన్ని అన్నాడు మూర్తి. తలాడించింది సంతోషంగా. వీటి మీద ఆశ వద్దని సుదర్శన్ సలహా. పదేండ్లు చాకిరీ చేసినా ఈ పాటి నగలను చేయించుకోలేదు. అంత సులభం కాదని మనసులోనే లెక్కలు వేసింది సులోచన.

“సరే.. బంగారం.. వెండి, వీటి పంపకం ఏదో అవుతుంది. సైటు, పొలాలు వీటి విషయం..” అన్నాడు అప్పటివరకూ మౌనంగా వున్న మామయ్య. ఆయన మాటలు విని తలెత్తి అన్న వైపు చూసి, “చూడన్నయ్యా! సైటు నాకేం వద్దు.. దాని బదులుగా కాష్ ఇచ్చివేయి. ఆ సైట్‍లో మేం ఇల్లు కట్టుకునే దెప్పుడు? కాపురం ఉండేదెప్పుడు?” అంది సులోచన.

మూర్తి చెల్లెల్ని కొంచెం దురుసుగా చూసి, నిట్టూర్చి లోనికెళ్ళాడు. సులోచనకి ఒళ్ళు మండింది మూర్తి చూసిన చూపుకి. ‘నగదు ఇవ్వమంటే ఎంత కోపం వీడికి – వాటా అడగనని హాయిగా వున్నాడినాళ్ళు. కోర్టు గీర్టు అనేసరికి దారి కొచ్చాడు. వాడి సంపాదనలో భాగమడిగానా నేను’ అనుకుంది.

మూర్తి ఫైలునొకదాన్ని చేతపట్టుకొని వచ్చి టేబుల్‍పై పెట్టి – ఒక్కొక్క పేపర్నే తీస్తూ అన్నాడు – “చూడు, ఇది నాన్నను మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినప్పుడు అయిన బిల్లు. ఆ తర్వాత ఇది బెంగుళూర్ కిద్వాయ్ హాస్పటల్‍ది. ఇది రేడియేషన్ థెరపీ బిల్లు. ఇక ఇది బాంబే ఆస్పత్రి బిల్లు. ఆ తర్వాత మూడు నాలుగేళ్ళ మెడికల్ బిల్స్; మందులు, ఇంజెక్షన్స్ బిల్లులు ఇక్కడున్నాయి. ఇంకొన్ని బిల్స్ పోగొట్టుకు పోయాయి. ఉన్న వాటినే ఇక్కడుంచాను. సరిగా చూడు అన్నింటినీ.”

ఆశ్చర్యంతో చూసింది చెల్లెలు అన్న వైపు.

“ఏంటి ఇదంతా, సైట్ పత్రాలు, పొలం పత్రాలు తెస్తావనుకుంటే ఆస్పత్రి బిల్లుల్ని చూపిస్తున్నావు – ఏ కొద్దిగానైనా నాకర్థం కావటం లేదు. ఏంటి ఇదంతా పెదనాన్నా?” అంది.

ఆశ్చర్యంతో అన్నాడు పెదనాన్న, “ఏంట్రా ఇదంతా నాకూ అర్థం కావడం లేదు” అని.

కృష్ణమూర్తి అన్నాడు సీరియస్‍గా –

“నాన్నకు బ్లడ్ కాన్సర్ అని తెల్సినప్పట్నుంచి చికిత్సకని 16 లక్షలు ఖర్చు చేశాను పెదనాన్న. నాన్నను పిల్చుకుని ఊరూరు తిరగటం వల్ల క్లాత్ షాప్ పట్ల శ్రద్ధ తగ్గింది. పనివాళ్ళకు అప్పజెప్పటం వల్ల పది లక్షలు నష్టం. పైగా నాన్నని పరామర్శించడానికి వచ్చేవాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. వచ్చిన వాళ్లందరికీ ఉపచారాలు చేసీ చేసీ అనూ చిక్కి సగమయ్యింది. గోరు చుట్టపై రోకటి పోటన్నట్టు అమ్మకూ ఆరోగ్యం దెబ్బ తినడం వల్ల ఖర్చులకు తోడు ఇంకో ఖర్చు చేరింది. పెదనాన్నా! ఎక్కడ్నుంచి తేను డబ్బు? పొలం అమ్మేశా.. సైటూ అమ్మేశా.. చాలకపోయింది. నగలని అమ్మివేయటానికి అమ్మ ససేమిరా అంది. అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తిలో వాటా అడుగుతుంది నా చెల్లెలు అని నే కలగన్నానా? అమ్మానాన్నలని పరామర్శించడానికి ఆరు నెలలకి ఒకసారి వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయే దీనికి నా ఇంటి కష్టాల పరిజ్ఞానం ఎలా వుంటుంది? లేదు పెదనాన్నా; ఈ ఇంటి సుఖాన్నే పంచుకుందే తప్ప కష్టాలను పంచుకోలేదు. అందుకే మొదటే చెప్పాను.. ఆస్తిలో వాటా కావాలంటే బాధ్యతల్లోనూ వాటా పంచుకోవాలని..”

“అదేంటో చెప్పరా.. అది కూడా తప్పకుండా పంచుకోటానికి ఒప్పుకుంటుంది.”

“నాన్నగారి ఆస్తిలో వాటా అడగటానికి హక్కు కలిగిన దానికి, నాన్నగారి చికిత్స కోసం చేసిన అప్పు తీర్చడానికి కూడా వాటా ఉండగలదని తెలియజేయండి నా చెల్లెలికి. సుమారు 10 లక్షలు అప్పు చేశాను. అన్నింటికీ లెక్కలున్నాయి నా దగ్గర. ఆన్నీ వ్రాసి యుంచాను. పూర్తి అప్పునంతటినీ తానే తీర్చాలని నేను అనటం లేదు. ఆడబిడ్డకని ¼ భాగం ఆస్తిని ఎప్పుడో తీసుకొంది. ¾ భాగం తీసుకొన్న నేను చేసిన అప్పులన్నింటినీ తీరుస్తాను. మిగిలిన రెండు లక్షల యాభై వేల అప్పును తీర్చే బాధ్యత తనది..”

మూర్తి ఇంకనూ ఏదో చెబుతూనే ఉన్నా, సులోచన దిగ్భ్రాంతితో అలాగే కూర్చుండిపోయింది. మిలమిలా మెరుస్తూ తన ముందున్న నగలు తన్ను చూసి పకపకా నవ్వినట్లయ్యింది.

కన్నడ మూలం: శైలజ సురేష్

అనువాదం: కల్లూరు జానకిరామరావు

Exit mobile version