[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘ఆత్మ బంధువు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“హ[/dropcap]లో, సుధా ఎలా వున్నావు. నేను జయపూర్ నుండి బయల్దేరేను. యాత్రలన్నీ బాగా సాగేయి. ఇప్పుడు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వున్నాను” అన్నాడు నారాయణ మూర్తి.
“అలాగా, సంతోషం. నాలుగు రోజుల నుండి ఏమీ సమాచారం లేదు. ఉత్తరాదిన విశేష వర్షాలు అని చూసి, వానల్లో ఎక్కడైనా చిక్కుపడి పోయేరా అని కంగారు పడుతున్నాను. మంచి మాట చెప్పేరు.” అంది సుధ.
“అవును సుధా. నెట్వర్క్ కవరేజ్ దెబ్బతింది కూడా. ఆ టైముకు లక్కీగా ఈ సైడ్‌కు వచ్చేసేను. మొదట కలకత్తా, వారణాసి, ప్రయాగ అయ్యేయి. ఇక ఇండోరు, ఉజ్జయిని మహా కాళేశ్వర్‌ను చూసేను. రాజస్థాన్ చేరుకున్నాను.”
“జయపూర్ సిటీ ఎంత బాగుందో తెలుసా. నేటికీ మన దేశంలో చూడతగిన ప్రదేశాల లిస్ట్‌లో వుంది. ఇప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువ”. అన్నాడు మూర్తి.
“అవునూ జయపూర్‌లో మా మేనత్త అనసూయమ్మ కూతురు హేమలత ఉంది కదా. ఫోన్ నెంబర్ ఎప్పుడో నోట్ చేసుకున్నాను. వాళ్లింటికి వెళ్లేను. అత్తయ్య ఇక్కడే వుంది – నీకో సర్ప్రైజ్ – నాతో పాటు ఆమెను తీసుకొస్తున్నాను.”
“వెల్‌కమ్. రండి రండి. మీరు వచ్చేసరికి తినడానికి ఏమైనా సిద్ధం చేస్తాను. పళ్లు మజ్జిగ కూడా ఉంచుతాను. పెద్దావిడ కదా.” అంది సుధ. కాస్సేపు విశేషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసేడు మూర్తి. ఎదురుకుండా బెర్త్ మీద అనసూయత్తయ్య పడుకుని వుంది. ఆదమరచి నిద్రపోతున్నది. ఎంత అందంగా వుండేది! చూసి చాలా ఏళ్లైపోయింది. కానీ ఆ చక్కని చిరునవ్వు, ఆప్యాయత, వచ్చిన వారిని నోరారా పలుకరించి మాట్లాడడము – అన్నీ బాగా గుర్తు. అత్త ఇంటికి వెళ్తే ఎంత హాయిగా ఉండేదో – ఆమే అక్కడ ప్రధానమైన ఆకర్షణ. చిటికెలో టిఫిన్ తయారు చేసి, వేడి వేడి కాఫీ ఇచ్చేది. రుచికరమైన, శుభ్రమైన భోజనం పెట్టేది. వెళ్లనిచ్చేది కాదు తినకుండా. రమణారావు మామయ్య గారు కూడా నవ్వుతూ పలకరించేవారు.
ఇప్పుడు – ఆమె బక్కచిక్కి పోయింది. ‘ముఖంలో నైరాశ్యం. కళావిహీనమైన కళ్లు, పోషణ లేని శరీరం. ఎన్ని ముడతలు! ఆ అరచేతులు – అవి ఆకురాళ్లా?! జుట్టు బాగా ఊడిపోయింది. ఇక ఆ బట్టలు! ఎంత దయనీయంగా కటిక పేదలు కూడా కట్టని స్థితి. చీరకు ఎన్ని అతుకులు. వెలిసిపోయింది. రవిక కూడా అంతే. కాళ్ల జోళ్లు మరీ హీనం. ఏనాడు కొన్నవో ఏమో. హవాయి జోళ్లు – మురికి కూపాలు. పాపం.’ అనుకుని కంట తడి పెట్టుకున్నాడు మూర్తి.
ఆలోచిస్తూంటే నిద్ర పట్టలేదు. తన నిర్ణయంతో సుధ ఏకీభవిస్తుందా, సహజంగా విశాల హృదయం కలది. బంధువుల పట్ల అనురాగం వున్న మనిషే.
***
నారాయణమూర్తి హనుమకొండలో సెటిల్ అయ్యేడు. తల్లిదండ్రులకు తనతో పాటు మరో కొడుకు, తనకు అన్న గోపీనాథ్. ఆ రోజుల్లోనే దుబాయ్ వెళ్లి స్థిరపడ్డాడు. పాలిటెక్నిక్ చదివేడు. ప్లంబింగ్ పనుల్లో నిపుణత్వం సంపాదించేడు. అక్కడ బాగా రాణిస్తున్నాడు. ఇప్పుడొక పెద్ద కంపెనీలో ఒక లెవెల్‌లో సలహాదారుగా ఉన్నాడు.
నాన్న పదేళ్ల నాడు ఇల్లు వదిలి వెళ్లేడు. మతి స్థిమితం తగ్గింది. ‘అల్జిమేర్స్’ అన్నారు వైద్యులు. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నా ఓ రోజు ఎవరూ చూడనప్పుడు సడన్‌గా గేటు తీసుకొని వెళ్లి పోయేడు. – అంతే – తిరిగి రాలేదు. విషయం కానుకొని ఊరంతా గాలించేడు. బంధువులను సంప్రదించేడు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చేడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది.
ఇంతకుముందు రెండేళ్ల క్రితం అమ్మ మరణించింది. బహుశా ఆ బెంగతోనే నాన్న కోలుకోలేదు. అలా మూర్తికి ‘తనవాళ్లు’ అనేవారెవరూ లేరు. భార్య సుధ, తానూ – అంతే.
నారాయణమూర్తి పదో తరగతి అవగానే ఓ హార్డ్‌వేర్ షాప్‌లో పనిలో చేరేడు. నిజాయితీ, ఓర్పు, ప్రపంచ జ్ఞానం వుంటే వ్యాపారం చేయడం కష్టం కాదు. సరకు రాక పోక అకౌంట్లు, బిల్లులు చూసే బాధ్యత అప్పగించేడు యజమాని. అతని పిల్లలు ఈ వ్యాపారంలో పెద్ద మక్కువ చూపించలేదు. బాగా చదువుకుని మంచి వుద్యోగాల్లోకి వెళ్లేరు. అలా ఆ పెద్దాయన గతించేక ఆ షాపు యజమాని అయ్యేడు మూర్తి.
మూర్తి సుధ దంపతులకు వివాహమైన కొత్తలో బాబు పుట్టేడు. రెండవ యేట తీవ్రమైన అనారోగ్యం చేసి మరణించేడు. సుధకు రెండు మూడు సార్లు అబార్షన్లు అయ్యేయి. ఇక పిల్లలు కలుగరని తేల్చేసేరు డాక్టర్లు.
అనసూయత్త తన తండ్రి కన్న పదేళ్లు చిన్నది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. రమణారావు మామయ్య ఓ కో ఆపరేటివ్ బ్యాంకులో గుమాస్తాగా చేరేడు. సర్వీస్ చివరిలో ఆఫీసరు అయ్యేడు. అరకొర జీతాలు – ఆడ పిల్లలు – పెళ్లిళ్లు పురుళ్లు, ఆనవాయితీ రూపేణా ఖర్చులు – ఈ బాధ్యతలతో ఆస్తులేమీ లేవు. చివరకు మామయ్యకు సొంత ఇల్లు కూడా లేదు. ఖమ్మం లోనే జీవితమంతా గడిచింది.
అత్త పెద్ద కూతురు కాంతం తమిళనాడు మదురైలో వుంది. రెండో అమ్మాయి హేమలత. జయపూర్‌లో వుంది. ఈమె భర్త రమేష్ ఓ టూరిస్టు ఆఫీసులో పని చేస్తున్నాడు. పర్యాటకులకు సౌకర్యాలు – వసతి, వాహనాలు, దర్శనీయ స్థలాలు, వానికి టిక్కెట్లు ఇవన్నీ ఆ ఆఫీసు వారి విధులు. పని ఒత్తిడి ఎక్కువే. వేసవే కాదు, అన్ని కాలాల్లోనూ – ముఖ్యంగా సెలవు దినాలలో బాగా పని. రమేష్ బాగానే సంపాదిస్తున్నాడు.
రమణారావు మామయ్య మరణించేక హేమలత వాళ్ల అమ్మతో “నువ్వు ఒక్క దానివీ ఖమ్మంలో ఏం చేస్తావు. నాతోరా” అన్నది. అలా అనసూయత్త జయపూర్‌కు చేరుకుంది.
హేమలత ఇల్లు వూరికి కొంచెం దూరం అయినా ఇండిపెండెంట్‌గా వుంది. మంచి ఖాళీ స్థలం వుంది. మొదట కూరగాయలు అవీ పండించింది, లత. కానీ దక్షిణాదిలో వున్న అనుకూల వాతావరణం, నేలసారం ఇక్కడ వుండదు కదా. పెద్దగా లాభం లేకపోయింది.
తల్లిని తీసుకుని వెళ్లేక లత మనస్సులో చాలా ఆలోచనలు పథకాలు కలిగేయి. ‘ఓపిక గానే వుంది కదా, మంచి హస్తవాసి కలది. భోజనం లోకి ఆధరవులు రుచికరంగా చేస్తుంది. కూరగాయలతో రక రకాల వంటకాలు, పచ్చళ్లూ, నిలువ పచ్చళ్లూ తయారీలో ఆమెకు ఆమే సాటి. ఇంకా అనేక రకాల మసాలా పొడులు – కూరలు, సాంబారు, చారు, టిఫిన్స్ లోకి – అందరూ తృప్తిగా తినే లాగ చేస్తుంది.
ఆమె టిఫిన్స్ విషయంలో స్పెషలిస్ట్. ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా, పులావు, వడలు – అన్నీ చేస్తుంది. లత అనుకుంది. “ఈమెను ఇంటికి తెచ్చి పెట్టుకున్నాను కదా – నాకేమిటి ప్రయోజనం – ఓ క్యాటరింగ్ సెంటర్ ప్రారంభిస్తాను. ఇంటి ఆవరణ విశాలమయినది. అక్కడ ఒక షెడ్ వేయిస్తే అన్ని పనులూ కానివ్వచ్చు. అదృష్టం బాగుంటే ఇదో లాభసాటి వ్యాపారం అవుతుంది. ఏడాదికోసారి ఆంధ్రా వెళ్లాలంటే వేల రూపాయలు అవుతున్నాయి. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ల చదువులు ఎక్కడో – లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పైగా ఇక్కడి జనాలకు ఆంధ్ర వంటకాలు, టిఫిన్‌లూ ఎంతో ఇష్టం కూడానూ’ – అనుకుంది. రాత్రి రమేష్‌తో తన ప్లాన్ చెప్పింది.
“మీ అమ్మ గారిది పెద్ద వయస్సు – అంత భారం ఆమె మీద వెయ్యడం మంచిదా. పని ఒత్తిడి తట్టుకో గలదా” అన్నాడు.
“మీరు మరీనూ – అరవై ఎనిమిదే కదా ముసిలి వాళ్లు కాదండీ – రోజులు మారేయి. ఎనభై ఏళ్ల వాళ్లు కూడా చురుగ్గా తిరుగుతున్నారు. మీరు ‘ఊ’ అనండి. పెరటిలో ఓ షెడ్ వేయించండి. పెట్టుబడికి కొంచెం సాయం చేయండి. నెమ్మదిగా బ్యాంకు లోన్ తీసుకుంటాను. మిగతావన్నీ నేను చూసుకుంటాను. దేవుడు చల్లగా చూస్తే మనకు ఇదొక పెద్ద వ్యాపారం అయిపోతుంది” అన్నది హేమలత. రమేష్ సరే అన్నాడు. అనక తప్పని స్థితి మరి.
లత తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. వరంగల్ లో తనకొక స్నేహితురాలు ఉంది. ఆమెను సంప్రదించి, ఇడ్లీ దోశెల కోసం మినుగులు, ఇడ్లీ రవ్వ, పచ్చళ్లు, పొడులకు కావలసిన దినుసులు, నిల్వ పచ్చళ్లకు కాయలు, నూనెలు, మిర్చి పొడి వంటివి ఆమె అక్కడ ఖరీదు చేసి రవాణా సర్వీసులో వేయించే ఏర్పాట్లు చేసింది.
అమ్మను రంగం లోనికి దింపింది. తెల్లవారకుండా నాలుగు గంటలకు లేవాలి. పప్పు కడిగి గ్రైండర్లలో వెయ్యాలి. కూరగాయలు తరుగుట, పూరీలకు చపాతీలకు పిండి కలుపుట, రక రకాల చెట్నీల తయారీ జరగాలి. లత అక్కడ నిలబడి అజమాయిషీ చేస్తుంది. ఓ గంట తరువాత ఒక పనిమనిషి వస్తుంది. మిగతా అన్నీ అనసూయే. రుచికరమైన తినుబండారాలు అందరికి నచ్చేయి. డిమాండ్ పెరిగింది. ప్రతీ రోజూ తీసుకొని వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. కొందరైతే మేము ఉద్యోగస్తులము, వేళలు కుదురుటలేదు, పిల్లలకు స్కూలుకు క్యారేజీ, మాకు ఆఫీసులకు మీల్స్ పంపించే ఏర్పాటు చేయించండి అని రిక్వెస్ట్ పెట్టేరు.
లతకు ఇదో గొప్ప అవకాశం. టిఫిన్ సెక్షన్ పూర్తి అవుతూ ఉండగానే గంట వ్యవధిలో భోజనాలకు ఏర్పాట్లు మొదలవ్వాలి. అనసూయకు మాత్రం ఊపిరి తీసుకునే వ్యవధి దొరుకుట లేదు. పని భారం అయింది. తిండి సౌకర్యం లేదు. అందరికీ పంపగా మిగిలినవి, చల్లారినవి, ఏవో ఒకటి పెట్టి తినమనేది లత. అరకొరగా కాఫీ లేదా టీ ఇచ్చేది. పైగా “త్వరగా కానివ్వాలమ్మా – గంట సేపు కూర్చుని తినడానికి టైం చాలదు. క్యారేజీలు సర్ది ఒంటిగంట లోపు అందించకపోతే మాట పడాలి” అని హెచ్చరించేది లత.
ఈ లోగా లత స్కూటర్ కొంది. ఒక అసిస్టెంటును పెట్టుకొంది. కస్టమర్లకు అందించి వచ్చేసరికి మధ్యాన్నం రెండు దాటేది. మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటె సాయంత్రం ఎవరో ఒకరు వచ్చి కొనేవారు. నెలలు గడుస్తున్నాయి. అనసూయ తల్లి పాత్ర నుండి వంట మనిషి స్థాయికి పరిమితమయ్యింది. ఆరోగ్యం దెబ్బ తింది. దగ్గు, ఆయాసము, పోషణ లోపము, విశ్రాంతి లేకపోవడము వలన నీరసము. తరచు జ్వరం వస్తోంది. ఏవో మాత్రలు ఇచ్చి “మరేమి ఫరవాలేదు. ఇవి వేసుకో తగ్గిపోతుంది” అనేది లత. మాత్రల ప్రభావం వల్ల ఇంకొంచెం ఆకలి, ఆవేదన కలిగేవి అనసూయకు.
ఆప్యాయంగా అమ్మా అని పిలవడం కూడా మానేసింది. ఆమె మంచి చీరాలన్నీ తను కట్టేసుకునేది. “వంట చేసేటప్పుడు నూనె మరకలు, కూరగాయల డాగులు పడతాయి” అంటూ తన పాత చీరలు ఆమెకి ఇచ్చింది. అనసూయ కళ్లు మసకబారి, చూపు సరిగా ఆనడం లేదు. కళ్లు తరచు ఎర్ర పడటమూ, నీళ్లు కారటం. కంటి వైద్యుని వద్దకు కాకుండా ఆమెను “కళ్లు పరీక్ష చేసి తగిన కళ్లజోడు అమర్చబడును” అన్న షాపుకు తీసికెళ్లి, పరీక్షలు చేయించి ఒక చవకబారు ఫ్రేమ్‌లో బరువైన అద్దాలున్న కళ్లజోడు తీసుకుంది. దీని వల్ల ఆమెకు ముక్కు మీద, చెవుల పైభాగంలోనూ నెప్పి, మంట వస్తున్నాయి.
ఇలా అనసూయ బ్రతుకు భారమైపోతోంది. ఎవరితో చెప్పుకుంటుంది? కంచే చేను మేస్తే?! కన్న కూతురే ఇలా ప్రవర్తిస్తే? దారేది దేవుడా? “భగవంతుడా ఈ హీనమైన బ్రతుకు నాకు వద్దు. త్వరగా మరణాన్ని ప్రసాదించు” అంటూ రాత్రుళ్లు వెక్కి వెక్కి ఏడిచేది.
ఆ సమయంలో వచ్చేడు తన మేనల్లుడు నారాయణమూర్తి. అత్తను చూసి నిర్ఘాంతపోయేడు. లతతో ఏమీ అనలేదు. లౌక్యము తెలిసినవాడు కదా! మర్నాడు రమేష్‌తో కలిసి నగరంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి వచ్చేడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ‘ఆహా జీవితాలు ఎలా తారుమారు అవుతున్నాయి’ అనుకున్నాడు. మర్నాడు ఉదయం హేమలత “బావా నేనూ నా స్నేహితులమూ ముందుగానే వేసుకున్న ప్రోగ్రాం ఇది. అందరం కలిసి బయటకు వెళతాము. ఏమీ అనుకోకు. తిరిగి వచ్చేసరికి ఐదు దాటుతుంది. అమ్మ పనులు అవ్వగానే మీ ఇద్దరూ భోజనం చెయ్యండి” అన్నది.
ఆమె వెళ్లేక మూర్తి అత్తను చూసి “ఏమిటమ్మా ఇది? అసలేమి జరిగింది తల్లీ” అన్నాడు. కన్నీళ్లతో కంఠం వణికి పోతోంది. మేనల్లుడి చేతులు పట్టుకొని ఆమె భోరున ఏడ్చింది. జరిగిన విషయాలు చెప్పింది, “ఇలా మూడేళ్ల బట్టీ నా బ్రతుకు హీనమయింది” అన్నది.
మూర్తి మనస్సు అల్లకల్లోలమైంది. ‘మనిషి స్వార్థానికి హద్దులు లేవు కదా. బానిసత్వపు సంకెళ్లు ఈ దేశానికే కాదు మనుషుల నరనరాల్లోనూ ఇంకా ఉన్నాయి. అవకాశం దొరికితే లోకువ చేసి సవారీ లాగడం, సిగ్గు విడిచి చేస్తున్నారు’ అని బాధ పడ్డాడు. తక్షణ కర్తవ్యం ఏమిటి? ఎలాగైనా ఈమెను రక్షించాలి అనుకున్నాడు.
“అత్తయ్యా! నే చెప్పేది శ్రద్ధగా విను. లత రాత్రి వచ్చేక నెమ్మదిగా నేను మాట్లాడుతాను. నా ఆఖరి మజిలీ ద్వారక. అక్కడ శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని, ఆమెను నాతో తీసికెళ్లమని అడిగింది – రెండు రోజుల్లో అత్తను ఇక్కడ దింపేస్తాను. నేను హనుమకొండకు పోతాను” అని చెప్తాను.
“కానీ అత్తయ్యా – జరిగేది వేరు. రేపు ప్రొద్దుటే బస్సు ఎక్కి మనము అహ్మదాబాద్ చేరుకుంటాము. రాత్రికి నవజీవన్ ఎక్కుతాము. హనుమకొండకు వెళ్తాము. నువ్వు మా ఇంట్లో మా ఇద్దరికీ పెద్ద దిక్కుగా వుందువు గాని. నా మాట విను.” అన్నాడు మూర్తి.
అనసూయ ఆలోచించింది. ‘ముందు ఈ చెరసాల నుండి విముక్తి పొంది మన ఊళ్లు చేరితే అదే పది వేలు. మూర్తి మంచివాడే – సుధ కూడా నెమ్మదస్తురాలు. ఒకవేళ నేను అక్కడ వుండటం ఆమెకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిస్తాను. ఎలాగైనా బ్రతకొచ్చు. ఖమ్మంలోని తమ ఇంటి ఓనర్ నరసయ్య మేష్టారు మంచి వ్యక్తి. వారి సాయంతో అక్కడే ఓ వృద్ధాశ్రమములో చేరి జీవితం గడుపుతాను’ అనుకుంది. “సరే నాయినా నీ ఇష్ట ప్రకారం చెయ్యి – దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అంది.
***
మర్నాడు ఉదయం మెలుకువ వచ్చింది. ఇద్దరూ టిఫిన్ చేసేరు. తన సామాన్లు ఏవీ? ఒక చేతి సంచీ. అందులో రెండు చీరలు, ఒక తువ్వాలు. ఎప్పుడో కవర్లో పెట్టి జాగ్రత్తగా దాచుకున్న ఓ వెయ్యి రూపాయలు. ‘ఎంత ఆస్తో’ అనుకుంది. చాలా కాలానికి విశ్రాంతి దొరికింది. ఒకటే నిద్ర. రైలు హనుమకొండ చేరింది. ఇల్లు చేరేరు. “రండి పిన్నీ” అని సుధ ఆప్యాయంగా చేయి పట్టుకొని లోపలి తీసుకొని వెళ్లింది. స్నానం చేసి భోజనం అయ్యేక తనకిచ్చిన మంచం మీద మళ్లీ పడుకుంది అనసూయ.
మర్నాడు పొద్దుట “పిన్నీ పళ్లు తోముకునే సామగ్రి ఇక్కడ పెట్టెను” అంది. వేడి కాఫీ ఇచ్చింది. అది ఆమెకు అమృతంలా తోచింది. “పిన్నీ – మీ మేనల్లుడు విషయాలన్నీ చెప్పేరు. భగవంతుని లీలలు మనకు తెలియవు. మేమిద్దరమే కాలం వెళ్లదీస్తున్నాం. మీ రాకతో మన కుటుంబ సంఖ్య మూడుకు చేరింది. మీ మేనల్లుడు మీకు కొడుకు అనుకోండి. ఇక నుంచి మీరే మాకు పెద్ద దిక్కు” అంది సుధ. “కొన్నాళ్లు మీకు విశ్రాంతి కావాలి. తర్వాత ఏదైనా చేద్దామంటే ఆలోచించుకుందాం లెండి” అంది.
అనసూయ ఆమె రెండు చేతులూ పట్టుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొంది. “తల్లీ పేరుకు తగినట్లు నీవు నిజంగా సుధవే అమ్మా, ఈ అభాగ్యురాలిపై కరుణ చూపేవు” అని కౌగలించుకుని ఏడిచింది.
“తప్పు పిన్నీ – కరుణ కాదు, కర్తవ్యం – ఒకరికి ఒకరం – ఇదే బలం” అంది సుధ.
ఓ నెల ఇట్టే గడిచింది. హేమలత నుండి ఫోన్ వచ్చిందని, “అత్తయ్యకు ఆరోగ్యం బాగోక కళ్లు తిరిగి పడింది, నేను హనుమకొండ తీసికొని వెళ్లేను. ఆరోగ్యం కుదుట పడనీ అమ్మా” అని మూర్తి చెప్పినట్లు తెలిసింది అనసూయకు.
సుధతో కలిసి సందడిగా తిరుగుతూ పెరటిలో కూరగాయలు పండిస్తూ, చిన్న పనులు సాయం చేస్తూ, ఇరుగు పొరుగు వారితో అల్లుకు పోయిన అనసూయమ్మ ముఖం మీద మళ్లీ చిరునవ్వు కనపడింది. ఓ రోజు మూర్తి, సుధలను పిలిచి “నే చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఒంటరి జీవితాలు చాలా కష్టం. మీకు ఎంతో వయస్సు లేదు. ముందు చూపు అవసరము. కుటుంబములో ఒకరికి ఒకరు అండదండలు కావాలి. ఒక బాబును పెంచుకోండి. పదేళ్ల లోపు పిల్లవాడు. బంధు వర్గంలో గాని తెలిసిన వారి ద్వారా గానీ, పేద అనాథలు ఉంటారేమో సంప్రదించండి. మనం ముగ్గురం వాణ్ని బాగా పెంచుదాము. ఇంట్లో పిల్లవాడు తిరుగుతూంటే ఆనందం. ఇప్పుడు నాకు నువ్వు దిక్కు నాయనా. రేపు మరి మీకు? మరో యువకుని అండదండలు అవసరం”.
దంపతులిద్దరూ మౌనంగా విన్నారు. ఆ సాయంత్రం ఆమెతో “నీ సలహా బాగుందత్తయ్యా! అలాగే ప్రయత్నం చేస్తాము” అన్నాడు మూర్తి. దూరపు బంధువుల ద్వారా ఒక గ్రామంలో ఒక పూజారి భార్య మరణించగా పిల్లలను పెంచలేని పరిస్థితి, దానికి తోడు దుర్భర దరిద్రం భరించలేక తన కొడుకులలో ఒకడిని మూర్తికి ఇవ్వడానికి అంగీకరించేడు. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చిన రోజున సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాస ప్రసాద్ అని వాడికి పేరు పెట్టేరు.
అనసూయ ఉదయం వాడిని లేపి, కాలకృత్యాలు మొదలగునవి అయ్యేక బడికి దింపుతుంది. దేవునికి ప్రార్థన పద్యాలు నేర్పింది. నీతి కథలూ, హాస్య కథలూ చెప్పి నవ్విస్తుంది. సాయంత్రం సుధ పాఠాలు చదివించి, హోమ్ వర్క్ చేయిస్తుంది. కాలం సరదాగా గడుస్తోంది.
కొన్నాళ్లకు అనసూయ పెద్ద కూతురు కాంతం వచ్చింది. “నాతో రా అమ్మా” అంది.
“తల్లీ నాకు తమిళం రాదు. అక్కడ మళ్లీ అన్నీ కొత్త. ఇరుగూ పొరుగు ఎవరితోనూ కాలక్షేపం అవదు కదా. మూర్తి సుధ నన్ను బాగానే చూస్తున్నారు. ఇలా బతుకు సాగనీ” అంది.
ఒక సంవత్సరం గడిచి పోయింది. హేమలత జాడే లేదు!!!