Site icon Sanchika

ఆత్మ నివేదన

[dropcap]ఓ[/dropcap] ప్రభూ!
అంతటా ఉన్న నీకు నాలోనిదేదో తెలియనిది కాదు..
అయినా…
నాలోని నీకు నా వేదనంతా
ఓ సారి చెప్పుకోవాలనుంది!

పాత్రతెరుగలేని
జాడ్యమేదో
నన్నావరించింది,
అది అద్దంపై ధూళిలా లేదు
కొబ్బరిపెంకులా దిటవై కూర్చుంది!
అంటించుకోవద్దనుకున్నా..
అహాలు, మోహాలు
నన్ను మావిలా చుట్టుకొని
ఊపిరి సలపనివ్వడంలేదు
తలక్రిందులై తపిస్తున్నా,
ఎండమావి బంధాల వెంట
అలుపెరుగని పయనం చేస్తున్నా!
అహో.. అంటే ఆనందం
ఛీఁ అంటే చతికిలబడి పోవడం
వలలో మీనులా ఎగిరి పడి గిలలాడడం..,
ఎన్ని కాలాలు
దాటి ఉంటాను తండ్రీ!!
ఎన్ని సుడులలో పడి గిరికీలు కొట్టి ఉంటాను??
అండం నుంచి బ్రహ్మండం వరకు
కోటానుకోట్ల సార్లు
నన్ను నేను విభజించుకొని ఉంటాను!??
అయినా
లేఁమొగ్గలపై ఆశ చావదెందుకో??
పర్ణికలపై భ్రమ వీడనెందుకో??
కొత్త రూపాలపై ఇంకా మోహమే సుమా!
వినలేకున్నా అంతర్వాణిని
విముక్తం
కాలేకున్నాను ఆశల పంజరిని

Exit mobile version