ఆత్మీయం

55
2

[dropcap]నె[/dropcap]లరోజులు లాక్ డౌన్ అనగానే రాము గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఎందుకంటే ఏ రోజు సంపాదన ఆరోజు సంపాదిస్తేనే ఇంట్లో జరుగు బాటయ్యేది. జట్టు కూలీ అతను. తలపట్టుకుని కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు.

అప్పడెప్పుడో ఓ చిన్న టీవీ కొన్నాడు, వార్తలన్నా వినొచ్చని ఇన్‌స్టాల్‌మెంట్‌లో…

ఏం చెప్తారోనని టీ.వి ఆన్ చేశాడు. కరోనా కరోనా కరోనా. దీని గురించే చెబుతున్నారు. అది కంటికి కనిపిస్తే నరికి పారేసేవాడు ముక్కలు ముక్కలుగా అనుకున్నాడు లోపల కసిగా. అమ్మో దాని నీడే పడొద్దంటే మళ్లీ నరకడమూనా, అని ఆలోచనలో పడ్డాడు…

ఈ కాలంలో అందరూ హాయిగా తమ కుటుంబాలతో కలిసి మెలసి ఉండండి అని చెబుతుంటే చేతిలో తినడానికి గతి లేక పోతే ఇంక ప్రేమతో ఏముంటాము అనుకున్నాడు బాధగా. అందులో రాజీ అంటే ఈ మధ్య కాలంలో బాగా కోపంగా ఉంది రాముకు.

రాజీ చాలా అందంగా ఉంటుంది. ఏమీ మేకప్ చేయకుండానే రాణిలా ఉంటుంది. ఇంక బాగా తయారయ్యిందంటే మహారాణే… అందుకే అనుమానం. వారికి ఒక్కతే పాప అందంగా లిల్లీ అని పేరు పెట్టారు. ఇద్దరి అందచందాలతో యువరాణిలా ఉంటుంది లిల్లీ. మూడు సంవత్సరాల ముద్దు గుమ్మ.

ఈమధ్య ఎవరో అన్నారు రాముతో – “నువ్వు పనిలో కెళ్ళాక మీ ఆవిడ పాపను తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ నీవొచ్చే సమయానికి వస్తుంది” అని. ఆ అనుమానాన్ని మనసులోనే పెట్టి పోషిస్తున్నాడు కానీ పెదవంచులు దాటి బయటకు రానీవడం లేదు రాజీ అంటే చచ్చేంత ఇష్టం కాబట్టి.

ఆలోచిస్తూనే ఓ కునుకు తీశాడు. లేచి రాజీ వైపు చూశాడు మనిషి అదోరకం కలవరంగా ఉంది.

మనసులో మాట రామూ తో ఎలా చెప్పేది. ఈమధ్య అసలే కోపంగా ఉంటున్నాడు. అంతలో పాప లేచి ఏడుపు మొదలెట్టింది ‘నాన్నా బయటికి తీసికెళ్ళి ఏమైనా కొని పెట్టమని’. కోపం చిరాకుగా మారింది రాముకు గట్టిగా కసిరేసాడు. లిల్లీ ఏడుపు తారస్థాయిలో అందుకుంది.

ఈ లోగా రాజీ వచ్చి విషయం అర్థం అయి పాపను ఊర్కోబెట్టి పడుకున్నాక,

మెల్లగా రాము దగ్గర కొచ్చి “చాన్నాళ్ల నుండీ నీతో ఒక మాట చెప్పా లనుకుంటున్నానయ్యా”.

ఉత్కంఠగా వింటున్నాడు. “నువ్వు పనిలో కెళ్ళాక నేను కూడా ఒక చోట పనికి కుదిరానయ్యా.”

ఆ మాట వింటూనే చివుక్కున తల పైకెత్తాడు కోపంగా .

“అట్టా సూడమాకయ్యా. నే చెప్పేది పూర్తిగా విని నీకిష్టమైతేనే లేకపోతే నువ్వు సెప్పినట్టే వింటా” అని చెప్పటం మెదలెట్టింది.

“నేను పని చెయ్యడం నీకు ఇష్టం లేదు, కానీ మనకు ఆడపిల్ల. ఆడపిల్ల అన్నాక ఏవో ఒక అవసరాలుంటాయి. నీ పని చూస్తే నువ్వు పనిలోకెళితేనే మన ఐదువేళ్ళు లోని కెళతాయి. లేకపోతే ఆరోజు పస్తే మనకి. అందుకే రంగారావు గారి భార్యకు బెడ్ రెస్ట్ మంచం దిగొద్దన్నారని నన్ను సహాయం కోసం అడిగారు కాదనలేక పోయా, ఎదుటి మనిషికి సహాయం చెయ్యడంలో పుణ్యమే కానీ పాపం లేదని భావించా జీతం 5 వేలు ఇస్తామన్నారు, ఇదిగోనయ్యా నెల జీతం నిన్నే ఇచ్చారు” అంది డబ్బులు తెచ్చి రాము చేతిలో పెడుతూ.

ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. రాజీ చేసిన దాంట్లో తప్పేమి లేదు. ముందు అనుమానం తెర తొలగి పోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో రాజీ చేసిన మంచి పని తన కుటుంబాన్ని రక్షించింది. ఎన్ని రోజులు తను రాజీని కష్టపెడతాడు. ఈ కరోనా ఎప్పటికి ముగుస్తుందో తనకు పని ఎప్పటికి దొరుకుతుందో అని బాధగా నిట్టూరుస్తుంటే…

“లేవయ్యా ఇంకా ఎంత సేపని పడుకుంటావు. పెద్దయ్యకు స్నానానికి నీళ్లు కావాలంట లే” అని రాజీ గొంతు వినగానే రాము కంగారుగా లేచాడు. చుట్టూ పరికించి చూశాడు, పూరి గుడిసె స్థానంలో మేడ ఉంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోగానే గతమంతా కనుల ముందు కదలాడింది.

***

ఆ రోజే రంగారావు గారి కొడుకు కోడలు వచ్చి “మేము అమెరికా వెళుతున్నాము. ఓ 5 నెలలలో తిరిగి వస్తాము. ఈ నెల రోజుల నుండీ నిన్ను గమనిస్తున్నాము. రాజీ అమ్మను నీవు కంటికి రెప్పలా చూసుకున్నావు. మేము తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. నీ కంటే నమ్మకస్తులైన వారు మాకు దొరకరు. ఈ రోజే మీరిద్దరూ పాపను తీసుకుని మాఇంటికి వచ్చేయండి. రాము నీపని రోజూ ఉండేది కాదు. నీకా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మా ఇంట్లో మీకోసం రెండు గదులున్నాయి, అవి వాడుకోండి. పాపను మంచి స్కూల్‌లో వేస్తాము, మేమే చదివిస్తాము. మా అమ్మా నాన్నలను మీ పిల్లలుగా చూసుకోండి” అంటూ కంట నీరు పెడుతుంటే స్వతహాగా సున్నిత మనస్కుడవటంతో వెంటనే ఒప్పుకోవటం రాజీతో మకాం మార్చటం, వాళ్ళు చెప్పినట్లే పాపను మంచి స్కూల్‌లో వేయటం, రంగారావు గారిని, వారి భార్యను కంటికి రెప్పలా చూసుకోవటం, అన్నీ ఖర్చులు వారివే పిల్ల చదువుకు బెంగలేదు, ఫీజులు కట్టఖ్ఖర లేదు.

కానీ వారందించే ప్రేమకు నెలకు పదివేలు అలా బ్యాంకులో పాప పేరు మీద వేసుకుంటున్నారు. ఇక్కడ చేరబట్టీ తన పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది, రాజీ చేసిన మంచి పనికి తన అహం చూపిస్తే ఈ కరోనా కాలంలో తమ పరిస్థితి ఊహిస్తేనే భయం వేస్తుంది.

అప్పుడప్పుడు గతం ఇలా కలలుగా వచ్చి కలత పెడుతున్నాయి, అనుకుంటూ రంగారావు గారికి స్నానానికి నీళ్లు తోడటానికి లేచాడు …

ఇంకెప్పుడూ ఆ కల రాకుండా ఉండాలని కరోనా పీడ త్వరగా తొలగాలని దేవునికి మనసారా కోరుకుంటూ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here