Site icon Sanchika

‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-3

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 5 – తొలిసారి మా ఊరు చూడడం…

[dropcap]ఈ[/dropcap] మధ్యకాలంలో నాన్నగారు రిటైర్ అయ్యారు. మొదటిసారిగా నాన్నగారి స్వగ్రామం గోవిందాపురం వెళ్ళాం. గోవిందాపురంలో ఉన్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ ఊరు ఎంతో అందమైంది. దూరదూరంగా విసిరేసినట్లుగా ఇండ్లుండేవి. జమీందారుల లేదా “బాబు గార్ల” ఆజమాయిషిలో ఉన్న గ్రామం. వ్యవసాయదారులు జాస్తి. ఎక్కడ చూసినా, ఎంత దూరం పోయినా పనస చెట్లు, మామిడి తోపులే ఉండేవి. మా నాన్నగారి గ్రామానికి మమ్మల్ని తీసుకొని పోవడానికి “స్టేడియం” దగ్గర ఎద్దుల బండి సిద్ధంగా ఉంది. ఎడ్ల బండిలో మా ప్రయాణం ఎంతో ఉల్లాసంగా సాగింది. ఆ కచ్చా రోడ్డు మీద పోతుంటే బండి కుదుపులకు నేను, తమ్ముడు చందన్, చెల్లెలు మాల పరవశించిపోయి అరిచేవారం. ఎంతకూ తరగని ప్రయాణం. ఈ అనుభవం సరి కొత్తది. అపూర్వమైంది. గోవిందాపురంలోని ఇళ్లన్నీ మట్టి మిద్దెలు. ఉన్నత స్థాయి జమీందారుల ఇండ్లు కూడా మట్టివే. కాంపౌండ్ వాల్ నుంచి లోపలికి పోగానే ఒకవైపు పశువుల కొట్టాలు కనిపించేవి! మాకు గ్రామీణ జీవితంతో ఏమాత్రం పరిచయం లేదు. అరకొరగానే తెలుసు.

ఆశ్చర్యం గొలిపే అనేక విషయాలు ఉన్నాయి. గ్రామీణ జీవితం గురించిన అనుభవం చాలా స్వల్పం. స్థానిక రైతులు బియ్యప్పిండితో చేసిన పెద్దపెద్ద రొట్టెలు, మామిడి పళ్ళు తెచ్చి పెట్టారు. ఈ రైతులను పాలేర్లు/కౌలుదారులు అంటారు. భూస్వాముల తరఫున వీరు వ్యవసాయం చేసి, పంటలు పండించి దానికి కొంత పైకం లేదా పంటను వారికి ఇస్తారు. కొందరు మహిళలు వాళ్ళ ఇంట్లో స్వయంగా తయారు చేసిన రకరకాల పిండివంటలు తేవడం గుర్తుంది. వారు బియ్యప్పిండి, బెల్లం కలిపి చేసిన రొట్టెలు తెచ్చిపెట్టారు.

నేను, తమ్ముడు, చెల్లెలు తనివితీరా ప్రేమతో తిన్నాం. మేము అంతదాకా జోర్హాట్‌లో తిన్న రొట్టెల కన్నా పూర్తి భిన్నమైన రుచితో ఉన్నాయి. కల్లాకపటం ఎరుగని ఆ గ్రామీణ మహిళలు ప్రేమాభిమానాలతో, ముఖాలు వెలిగిపోతూ మాకు ఇవ్వడంలోనున్న మాధుర్యం ఆ రొట్టెల్లో కలిసింది. తేనెకన్నా తీయనైన పనస పండ్లను రైతుల భార్యలు తెచ్చేవారు. వారిని మేము ఆప్యాయంగా “ఆంటీ” అని పిలిచేవారం. ఆ పనస పండ్లను ఎండబెట్టి, గింజలు తీసి తర్వాత కూరగాయలు కలిపి ఎంతో రుచిగా మా పిన్ని( ఫిషిమా) వండడం ఇప్పటికీ గుర్తుంది.

గోవిందాపురంలో మరిచిపోలేని మరో ఆనందకరమైన సన్నివేశం. మా చిన్నాన్న మమ్మల్ని గంగానది తీరానికి తీసుకొని వెళ్లి బెస్తవారు చేపలు పట్టడాన్ని చూపెట్టాడు. జాలర్లు విసిరిన వలలో చేపలు పడుతుండడం, పగటిపూట సూర్యకాంతి వాటి మీద పడి, వెండి తీగల్లా మెరిసిపోతుండడం చూసాం. అదెంత మనోహరమైన అపురూపమైన దృశ్యమో! చిన్నాన్న ఆ తాజా చేపల్ని తీసుకొచ్చి చిన్నమ్మకిచ్చేవాడు చిన్నమ్మ జీలకర్ర, ధనియాలు, అల్లం మొదలైన మసాలా దినుసులు వేసి వండేది. (ధనియాలు, జీలకర్ర, అల్లం ఇలాంటి భారతీయ మసాలాలు ఆరోగ్యకారకాలు. భారతదేశం అంతటా వాడుతారు).

రైతుల భార్యలు ఉదయం, సాయంత్రం మా ఇంటి ముందు గుమిగూడేవారు. మమ్మల్ని వారు వింతగా, నఖశిఖపర్యంతం పరీక్షగా చూసేవారు. వారిలో చాలామంది స్త్రీలకు వారి ఒడిలోని పిల్లలు తల్లిరొమ్ము చీకుతూ మాకు కనిపించారు. వారి యాస బాసలో గుసగుసగా మాట్లాడుకునేవారు. అది మా గురించే అని తెలుస్తుంది. కానీ ఏమనుకున్నారో మాత్రం అర్థం అయ్యేది కాదు. వారి సంభాషణ అంతా మా రూపురేఖలమీద, మేము వేసుకున్న బట్టల మీద అన్నది మాత్రం వాస్తవం. ఊర్లో ఉన్న కాలంలో కొంతమంది బాలికలు నాకు మంచి స్నేహితులయ్యారు. అందులో షిప్రా అనే అమ్మాయి మరీ దగ్గర అయింది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. గోవిందాపురం స్కూల్లోనే చదువుతుంది.

సిగ్గుతో, ఓరగా చూసేది. అది ఎందుకో నేను వ్యాఖ్యానించలేను. నేను కూడా అర్థం లేని చిరునవ్వు నవ్వేదాన్ని (ఇద్దరికీ మాట్లాడాలనే ఉంది. కానీ ఎవరో ఒకరు ముందు మొదలు పెట్టాలి.). ఎంతసేపు అని నేనే మాటలు కలిపాను. ఆమె పేరు, స్కూల్ పేరు, ఇష్టాలు- మామూలు మాటలే మాట్లాడాను. ఆమెలోని మొహమాటం మాయమైంది. త్వరగా మా ఇద్దరికీ స్నేహం కుదిరింది. షిప్రా నాకు రాకుమారుల కథలు, దయ్యాల కథలు ఎన్నో చెప్పింది. ఒక యువకుడు ఒక దయ్యాన్ని చూసి భయపడిపోయి మతిస్థిమితం కోల్పోయిన కథను గొప్పగా వర్ణించి చెప్పింది. అదేగాక ఏదో పనిమీద బయటకు వెళ్లిన ఒక నవయువకుడు వెదురుతోపుల గుండా ఇంటికి వస్తున్నప్పుడు తెల్లని దుస్తులు దాల్చిన ఒక ఆడ దయ్యం అతని కేసి ప్రశ్నార్థకంగా చూసి పగలబడి నవ్విందట. ఆ యువకుడి సంగతేమో కానీ నేను మాత్రం చాలా భయపడిపోయాను. ఎన్నో రోజులు నిద్ర పట్టలేదు. ఆఖరికి బాత్రూంకి పోవాలన్న ఎవరో ఒకరిని తోడు తీసుకొని పోవాల్సి వచ్చేది.

షిప్రా చెప్పిన ఇంకొక కథ. కాశీ కాక (మా పాలేరు) పెళ్లి చేసుకుని భార్యని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఈమె రెండో భార్య. మొదటి భార్య ప్రసవ సమయంలో చనిపోయింది. ఆమె అంత అందగత్తె ఊరు మొత్తం మీద మరొకరు లేదని చెప్తారు. ఇంకా అల్లికల్లోనూ, వంట చేయడంలోనూ ఆమె నేర్పరి అని చెప్పారు. ఆమె ఆవుపేడతో పిడకలు బాగా తయారుచేసేది. ఈ పిడకలను పశ్చిమబెంగాల్‌లో ఇంధనంగా విరివిగా వాడతారు. గోవిందాపురంలో ఉన్నన్ని రోజులు సరికొత్త అనుభవాలనే పొందాం. గ్రామీణ నగర జీవితాల మధ్య తేడాలు గుర్తించగలిగాం. అధునాతన ప్రపంచానికి గ్రామీణ ప్రాంతాలు సుదూరమైనవే కావచ్చు. కానీ గ్రామీణులు వారి వారసత్వాన్ని ఘనంగా చెప్పుకోగలరు. నగర జీవితంలోని కొన్ని సౌకర్యాలు వారికి ఉండకపోవచ్చు. వారి చిరునవ్వులలోని స్వచ్ఛత, వారి శ్రమశీలాన్ని వెలకట్టలేం. నిస్సందేహంగా ఎలాంటి మోసకారితనం లేనివి, ఉత్తమోత్తమమైనవి వారి జీవితాలు.

అధ్యాయం 6 – మా మేనత్త రాధారాణి

గోవిందాపురంలో ఉన్నరోజుల్లో మా మేనత్త (నాన్నగారి చిన్నచెల్లెలు) రాధారాణి ప్రభావం నా మీదెంతో ఉంది. ఒక బాలికగా, ఆ తర్వాత ఒక మహిళగా నేను రూపుదాల్చడంలో ఆమె పాత్ర అనంతమైంది. మా మేనత్త రాధారాణి ఓ మోస్తరు మనిషి అయినా అందమైనది. నడుం దాకా వేలాడే నల్లటి జడను చూస్తే ఎవరికైనా అసూయ గొలుపుతుంది. ఆమె వెలిగిపోయే కళ్ళల్లో ఎప్పుడూ ఏదో ఆవేదన. ఆమె అందమైన పెదవులు, పలువరుస ఆకర్షణీయం. ఇవన్నీ చూసిన వారు ఎవరైనా రాధారాణి అత్తను అందగత్తె అనే భావిస్తారు. మేం ఎడ్ల బండి దిగగానే అత్త మా కోసమే ఎదురుచూస్తూ నిలబడింది అని గమనించాం. ఆమె స్వాగతం చెప్పడాని కన్నా మమ్మల్ని పరీక్షించడానికే నిలబడింది అని అనిపించింది. పెదవులు బిగబట్టి, కళ్ళు చిట్లించుకొని మా అందరిని తదేకంగా చూసింది. ఆ తర్వాత అంది – మా నాన్నగారి పోలికలైనా ఏవీ రాలేదని. మాల, నేను ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల లాగా ఉన్నామంది. మా అమ్మను ఎగాదిగా చూసింది. అస్సాం మనిషి కావడమే ఆమెకు బోధపడని సంగతిగా భావించింది. మా అమ్మ పెళ్ళయ్యాక తొలిసారిగా ముగ్గురు ఎదుగుతున్న పిల్లలతో కలిసి గోవిందాపురం వచ్చింది.

మా కాక (నాన్నగారి తమ్ముడు) తొలిసారిగా మమ్మల్ని పరిచయం చేసుకున్నాడు. ఆయన్ను చూసి మేం దిగ్భ్రాంతి చెందాం. ముందుకు పొడుచుకొచ్చిన దవడ ఎముకలు, చిన్న చేతులు, కాళ్లు, పెద్ద పెద్ద పండ్లు, మరుగుజ్జు మనిషి మా దిక్కు చూసి సిగ్గుతో నవ్వాడు. ఆయనకున్న పొట్టి ఆకారం పట్ల ఆయనకి ఎంతో దిగులు. పూర్వజన్మ పాపం కొద్దీ భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు అన్నాడు విచారంగా.

అది మే నెల. సూర్యుడు తన వేడినంత మా మీద గుమ్మరిస్తున్నాడు. ఇంచుమించు మా శరీరాలు కమిలిపోతున్నా యనవచ్చు. మేము ఆ వేడిని ఏమాత్రం భరించలేకపోయాం. స్నానాలు ముగించుకున్నాం. ఇంట్లోనే తయారు చేసిన రొట్టెలు (మెత్తటిపిండి, బెల్లంపాకం కలిపి తయారు చేసినవి.) అమృతం లాగా అనిపించాయి. అందులోనా ఆకలితో ఉన్నాం కూడ. మా పిన్ని టీ ఇచ్చింది. తినుబండారాలు పెట్టింది. పిన్ని ఎంతో చిన్నది. చిన్నాన్నకు పిన్నికి వయసులో చాలా తేడా ఉంది. ఆమె చాలా నిరుపేద బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చింది. వారి జాతకాలు కలిశాయట. అందువల్ల పెళ్లి చేశారు. ఆ రోజుల్లో జాతకాలు కలవడం అనేది ప్రధానమైన అంశం. మా పిన్నిని కాస్త వర్ణించాలి. చిన్నాన్న మరీ మరుగుజ్జు అయితే పిన్ని మరీ పొడగరి. ముఖంలో కళా కాంతులు లేని మనిషి. ఆమె మా ఇంటి గౌరవ మర్యాదలకు, స్థాయికి ఏమాత్రం తగనిదని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాం.

రాధారాణి అత్తను మా నాన్న “రాధు” అని పిలిచేవాడు. ఆమె నడివయస్కురాలు. ఆమె అంటే అందరికీ హడల్. భయం. కోపం. ఆమె ఎప్పుడు ఆడవాళ్ళల్లో తప్పులు పట్టేది. ఆమె అన్నం వడ్డించే దృశ్యం మాత్రం మనసులో కనిపిస్తుంది. పిన్ని కంచం నిండా అన్నం పెట్టి, దానిమీద ఒకటి రెండు కూరలు వేసేది. పనసపొట్టు కూర, చేపలు ఏదైనా ప్రత్యేకమైన దినాల్లో మధ్యాహ్నం పూట వడ్డించేవారు. పిన్ని బాగా తిండిపోతు. ఎంత తిన్నప్పటికీ బరువు ఏ మాత్రం పెరగదు. తినేటప్పుడు తిండి మీద ఏ ఆసక్తి లేనట్టు కనిపిస్తుంది. కానీ, బాగా లాగిస్తుంది. అత్త ప్రేమతో ఇంకాస్త పెట్టుకో అని అంటుంది. అన్నం పెట్టుకుంటేనే ఆమె సంతోషపడుతుంది. లేకుంటే చీకాకు పడుతుంది.

చిన్నాన్నకు ఇద్దరు కొడుకులు – గణేష్, దినేష్. చాల చిన్న పిల్లలు. ఇద్దరికీ వారసత్వంగా మరుగుజ్జుతనం వచ్చింది. గణేష్ నెమ్మదస్థుడు. మంచి నడవడి కలవాడు. కానీ దినేష్ ఎప్పుడు తల్లికొంగు పట్టుకుని ఏడుస్తూ పీలగొంతుతో మారాం చేస్తూ తిరిగేవాడు. వారు దినంలో ఎక్కువ భాగం దిగంబరంగా ఉండడం ఆశ్చర్యంగా కనిపించేది. పిన్ని చేసే పనుల్లో ఎక్కువగా ఆమెలో ఉన్న అల్పత్వం, లేకితనం గోచరించేవి. రాధారాణి అత్త ఎప్పుడూ దీన్ని వేలెత్తి చూపేది. మాకు సాయంకాలం ఏమైనా తినడానికి చాలానే పెట్టేవారు. దానికి పిన్ని ముఖం ముడుచుకునేది. అలా పెట్టడం ఆమెకు ఇష్టం లేదని మాకు స్పష్టంగా తెలిసేది. ఆమె ఏవో పిచ్చి మాటలు మాట్లాడి ఆత్మీయ వాతావరణాన్ని చెడగొట్టేది.

రాధారాణి అత్త పెళ్లయి ఒక సంపన్నమైన జమీందారు కుటుంబానికి వెళ్లింది. మామ (రాధారాణిభర్త) ఆ పెద్ద ఎస్టేటు కంతా ఏకైక వారసుడు. మా అత్త మంచి అందగత్తె. అట్లాగే మాటకారి. మాటకు మాట వెంటనే వ్యంగ్యంగా, చలాకిగా అనేసేది. ఆమె మాటకారితనానికి జనం భయపడేవారు. 12 ఏళ్ల చిన్న వయసులో ఆమెకు పెళ్లి అయింది. ఆ మరుసటి సంవత్సరమే, పెళ్లంటే ఏమిటో కూడా తెలియకుండానే, “యుక్త వయసు” అనేది రాకుండానే భర్త చనిపోయాడు. ఏదో అంతుపట్టని రోగంతో పోరాడి, పోరాడి చనిపోయాడు- అని తెలిసింది.

బ్రాహ్మణ కుటుంబాల్లో ఆ రోజుల్లో వైధవ్యం విధిగా పాటింపబడేది. దయనీయమైన వితంతు జీవితాన్ని ఆ చిన్నవయసులో అత్త గడపాల్సి వచ్చింది. భర్త అకాలమరణంతో తిరిగి పుట్టింటికి వచ్చింది. పండుముదుసలి వయసులో చనిపోయేదాకా గోవిందాపురంలోనే ఉండిపోయింది.

ఆ రోజుల్లో వితంతువుల స్థితి మరీ దయనీయం, గర్హనీయం. బ్రాహ్మణ వితంతువులు పాటించే ఆచారాలన్నీ ఆమె పాటించేది. పెద్దల కనుసన్నల్లోంచి తప్పించుకోలేకపోయేది. చిన్నపిల్ల “యుక్తవయస్సు” కూడా రాని ముక్కు పచ్చలారని చిన్నపిల్ల అమానుషమైన, అర్థం, పరమార్థం లేని సాంఘిక ఆచార సంప్రదాయాలకు, సామాజిక దురన్యాయానికి బలి అయిపోయింది.

రాధారాణి అత్త వితంతువయ్యాక మానాన్నగారోసారి ఒక వింత సంఘటనను వర్ణించాడు. నానమ్మ తన దురదృష్టం వల్లే తన కూతురికీ గతి పట్టిందని భావించింది. ఆ బాధతో ఆరోగ్యం కోల్పోయి మంచం ఎక్కింది. పట్టుమని పిడికెడు మెతుకులు కూడా సరిగా తినకుండా బయటకు విసిరేసేది. నానాటికి ఆమె స్థితి దిగజారిపోయి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. రాధారాణి తన ప్రమేయమేమీ లేకుండానే తన జీవిత సర్వస్వాన్ని కోల్పోయింది. మరీ పసితనంలోనే ముసలి వితంతువు లాగా ఉండాల్సిన ఖర్మ పట్టింది. ఆ రోజుల్లో బ్రాహ్మణ వితంతువుల గతి ఇలా ఉండేది. ఒంటిపూట భోజనం- తరువాత ఏవో పండ్లు, కప్పు పాలతో రోజంతా సరిపుచ్చుకోవాల్సిందే. మధ్యాహ్నం పూట మాత్రమే వరి అన్నం తినాలట. రాత్రిపూట తింటే పాపం అని భావించేవారు.

ఒకసారి నానమ్మ ఆచారానికి విరుద్ధం కాకుండా, రాధారాణికి తోడ్పడే విధంగా ఒక విచిత్రమైన ఉపాయం ఆలోచించింది. దానివల్ల రాధారాణికి కాస్త మేలయింది. నానమ్మ కన్న కడుపు – బిడ్డ కోసం ఎంతైనా ఆరాటపడడం సహజం. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే అన్నం తినాలని చెప్పాను కదా!

పనసకర్రలతో చేసిన కుర్చీలో కూర్చొని ఆ రోజుల్లో భోజనం చేసేవారు. ఆ కుర్చీని “పిరి” అంటారు. బెంగాల్, ఒరిస్సా, అస్సాంలలోని గ్రామీణ ప్రాంతాలలో దీన్ని నేటికీ ఉపయోగిస్తారు. ఆమె కోసమే ప్రత్యేకంగా పెద్ద పిరి కుర్చీ మధ్యాహ్నం భోజనానంతరం, నిద్ర కూడా పోవడానికి అనువుగా తయారు చేయించింది. భోజనానికి కూర్చొని రెండు మెతుకులు తిని లేచినా చాలు, ఒకసారి భోజనం అయిపోయినట్లే. మళ్ళీ కూర్చుంటే రెండోసారి తిన్నట్లే. వితంతువుకు రెండోసారి భోజనం నిషిద్ధం. అందువల్ల నానమ్మ అత్తకు ఆ కుర్చీలో భోజనం పెట్టేది, ఆమె తిని అందులోనే లేవకుండా నిద్రపోయేది. కనుక రెండవసారి నానమ్మ భోజనం పెట్టేది. ఆమె తినేది. అంటే లేవలేదు కనుక ఒకసారి తిన్నట్లే లెక్క. ఇలాంటి పిచ్చి నమ్మకాలు, హాస్యాస్పద ఆచారాలు ఆ రోజుల్లో విపరీతంగా ఉండేవి. ఇటువంటి అహేతుక, అమానుష ఆచారాల పదఘట్టనల కింద పడి ఇంకా సరిగ్గా విచ్చుకోని పూలు ఎన్ని నలిగి ఛిద్రమయ్యాయో! మా అత్త మాత్రం దానికి మినహాయింపు ఏమీ కాదు. ఆమె ఆశలు, కోరికలు, కలలు అన్నీ భర్తతో పాటే ఆ చితిలో కాలి మసి అయి మాడిపోయాయి. ఇది అప్పటి సామాజిక దురన్యాయం. ఆ రోజుల్లో వితంతువులు పెండ్లిపనుల్లో, ఇతర పూజాది కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. భర్తలు చనిపోయారు కనుక వారిని దురదృష్టవంతులుగా, పాపులుగా(అమంగళకారులుగా) పరిగణించేవారు.

ఈ దుర్మార్గభావజాల ప్రభావం అత్త మీద బాగా ప్రసరించింది. దాంతో ఆమెలో ఒక రకమైన నిర్లిప్తత, అసంతృప్తి పెరిగి క్రమంగా తనకు తానే దూరంగా జరిగిపోయేలా చేసింది. ముందే మాటకు మాట అనే మనిషి, మరింత కటువుగా మాట్లాడేది. అన్ని విషయాల నుండి తను తాను ఏమీ పట్టనిదానిగా తయారుచేసుకుంది. తనకు తాను ఒక మానసిక ప్రపంచాన్ని నిర్మించుకుంది. అందులోనే కూరుకుపోయి సమాజానికి దూరంగా జరిగిపోయింది. మా మరుగుజ్జు కాక (నాన్న తమ్ముడు)కు ఆమెకు వయస్సులో పెద్ద తేడా లేకపోవడంతో సమవయస్కులు కావడం వల్ల కాస్త మనసు విప్పి మాట్లాడేది. ఆయన కూడా ఏవో తమాషా జోకులు చెప్పి నవ్వించేవాడు.

రాధారాణి అత్త నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. నాకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండి మార్గదర్శనం చేసింది.

నాన్నగారు మా చదువుల నిమిత్తం జాంగిపూర్‌లో ఒక ఇల్లు తీసుకున్నారు. జాంగిపూర్ ముషీరాబాద్ జిల్లా బెర్హంపూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాంగిపూర్ కాలేజీలోనే నేను మానవీయ శాస్త్రాల విభాగంలో చేరాను. మా అమ్మకు బాగా లేదని ఆమె మంచానికే పరిమితమైందని చెప్పాను కదా! ఆమెను జాంగిపూరుకు తీసుకొని రావడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఆమె అవసరాలన్నీ తీరుస్తూ, ఆమె బాగోగులు చూసే బాధ్యత నా మీదనే పడింది. దీంతో నేను కాలేజీకి సరిగా వెళ్లకపోయే దాన్ని. అయినా మా అధ్యాపకులు మాత్రం ఎంతో దయతో చెప్పిన పాఠాల సారాంశాలు ఇచ్చేవారు. క్లుప్తంగా తిరిగి చెప్పేవారు. ఇంత దయా, ఇంత సహకారం ఈ రోజుల్లో చాలా కొద్ది మందిలో ఉంటుందనవచ్చునేమో!

ఈ మధ్యకాలంలోనే పెద్దక్క మంజు (నాన్నగారి మొదటిభార్య కూతురు) పెళ్లయింది. బావగారు అన్ని విధాల మర్యాదస్థులు. గొప్ప విలువలతో, సంప్రదాయబద్ధ జీవనం గడిపిన వారు. ఆయన అధ్యాపకులు.

ఒక సంఘటన చెప్పుకుందాం. ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాం. మా వంటింట్లో మాంసాహార శాకాహారాలకు వేరువేరు విభాగాలు ఉండేవి. రెంటిని కలపక పోయేవారు. మా అత్త రాధారాణి శాకాహార విభాగంలో ఉంటే, మేమంతా మరోవైపు ఉన్నాం. మాకు మేలు రకం చేపలు అయితే అత్తకు రుచికరమైన శాకాహార వంటకాలు. బెంగాలీవారి వారి ఇండ్లలో ఆదివారం మధ్యాహ్నం పూట భోజనం కాస్త నాలుగు రకాల కూరలతో, విశేష వంటకాలతో ఉంటుంది. భోజనం చేస్తుంటే ఒక చేపముల్లు అకస్మాత్తుగా నా గొంతులో గుచ్చుకుంది. సెకండ్లలో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నేను బిగ్గరగా ఏడుస్తున్నాను. తింటున్న చెల్లెలు తమ్ముడు అందరూ భోజనం మానేసి నాకేసి చూడ సాగారు. రాధారాణి అత్త మాత్రం తన ప్రత్యేక ఆసనం (పనసకర్ర కుర్చీ) నుంచి అమాంతం లేచి వచ్చి నన్ను పొదివి పట్టుకుంది. ఏం చేస్తుందో అని చూసేలోపునే ఆమె తన చూపుడు వేలు నా గొంతులోకి పెట్టి చేపముల్లు లాగేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అలా చేపముల్లు లాగేసి నా ప్రాణాలు కాపాడింది మా అత్త. ఆమె తన ప్రయత్నం ఫలించిందన్న సంతోషంతో ముఖం వెలిగిపోతూ నాకేసి చూసింది. అయినా నేనేడుస్తూనే ఉన్నాను. మళ్ళీ తిందామంటే ఆ పనసకుర్చీలో కొంత తిని నాకోసం లేచి వచ్చింది కదా! మళ్ళీ రెండవసారి భోజనం చేయడం ఆచారవిరుద్ధం. నేను ఎంతో బాధపడ్డాను. ఆమె నన్ను ఎంతో అభిమానించింది. నేను మౌనంగా ఆమె ఒడిలో వాలిపోయాను. అక్షరాలా పునర్జన్మ లాంటి ఈ సంఘటన నా మనసు నుండి ఎప్పటికీ చెరిగిపోదు.

భర్త దీపక్ కుమార్ గారితో శ్రీమతి కావేరి చటోపాధ్యాయ

మా రాధారాణి అత్త పవిత్ర గంగానదిలో మునకలేస్తూ నన్ను లెక్కపెట్టమని చెప్పేది. ఆమె బట్టలు ఉన్న బకెట్ పట్టుకుని పైన ఎండ మాడ్చేస్తున్నా ఆమె కోసం అలాగే నిలబడి లెక్కించే దాన్ని. నేను ఆమె ఎన్నిసార్లు గంగలో మునకలేసిందో లెక్కించిన దానికన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువే చేసి ఉంటుంది. ఆమె దుఃఖాలు, భయసంకోచాలన్నీ తొలగిపోయి ఉంటాయని భావిస్తాను.

అత్తమ్మా! నీవు ఇప్పుడు ఎక్కడున్నావో! నాకు తెలియని ఏ దివ్యలోకాల్లో ఉన్నావో, కానీ నీ పట్ల నా ప్రేమ, గౌరవాభిమానాలు ఎప్పటికీ చెక్కుచెదరకుండా స్థిరంగా ఉంటాయి.

మహిళా సాధికారతతో ఇప్పుడు పరిస్థితులన్నీ విప్లవాత్మకంగా మారిపోయాయి. ఇది ఎంతో శుభ పరిణామం. స్త్రీల పట్ల సాంఘిక దురన్యాయం ఒకప్పుడు ప్రధాన అంశమైంది అయినా ఇప్పటికీ తీవ్రంగా అణచివేతకు హింసకాండకు గురవుతూనే ఉన్నారు. పురుషాధిక్యధోరణితో స్త్రీల పట్ల వివక్షను, చిన్నచూపును ప్రదర్శిస్తూనే ఉన్నారు. స్త్రీలపై అత్యాచారాలు ఇప్పటికీ భయానకంగానే కొనసాగుతూనే ఉన్నాయి. నగర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అంతటా స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ఇది ఎంతో గర్హించదగింది. శోచనీయమైంది. ఈ సమస్య నిర్మొహమాటంగా, ధైర్యంగా చర్చించదగింది. ఇవన్నీ పోవాలంటే స్త్రీలకు విద్యా హక్కు, సరైన దృక్పథాన్ని ఎంచుకునే హక్కు, అంతరాత్మను మేల్కొల్పుకొనే హక్కు ఉండాలి.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

Exit mobile version