Site icon Sanchika

‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-6

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 9 – నా పెండ్లి – తదనంతర జీవితం (రెండవ భాగం)

[dropcap]నే[/dropcap]ను షిల్లాంగ్‌కు ఉత్తర ఈశాన్య పర్వత విశ్వవిద్యాలయంలో B.Ed చేయడానికి వెళ్ళాను. షిల్లాంగ్ మేఘాలయ రాజధాని. ఇది ‘తూర్పు స్కాట్లాండ్’ అని పోలిక చెప్తారు. భారతదేశంలో హిల్ స్టేషన్. చాలా గొప్ప ప్రాంతాల్లో ఒకటి. ఇది ఒక యాత్రాస్థలం. మేఘాలు పర్వతాల మీద వేలాడినట్టు ఉండడం చూడదగిన దృశ్యం. మేఘాలయ అనేది బాగా సరిపోయిన పేరు. ఈ ప్రజలు ఖాసీ తెగవారు. వారి జీవితం ఎంతో సాదాసీదా అయింది. నవ్వుతూ, తుళ్ళుతూ జీవితాన్ని గడుపుతారు. ఖాసీ తెగ స్త్రీలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఖాసీ స్త్రీలు ధరించే నగలు దుస్తులు ఎంతో విలక్షణమైనవి. ప్రత్యేకమైనవి.

నగరం దుమ్ముధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక క్షణం సూర్యోదయానికి సంతోషిస్తాం. ఆ వెంటనే వానకు తడిసిపోతాం. షిల్లాంగ్ శిఖరం అతి ఎత్తయిన ప్రాంతం. అది ఎక్కి చూస్తే నగరం మొత్తం మనోహరంగా కనిపిస్తుంది. ఎంతో ఆకర్షణీయమైన స్థలం. ఎత్తయిన సుళ్ళు తిరుగుతున్న జలపాతాలు, బిడన్ ఫాల్స్, ఎలిఫెంట్ ఫాల్స్, ప్రకృతి సౌందర్యాస్వాదకులకు సంతోషదాయకాలు. బారాపాని, మౌసిన్రం ప్రాంతాలు కూడా చాలా ప్రసిద్ధమే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గరిష్ఠ వర్షపాతం ఒకసారి మౌసిన్రంలో నమోదయింది.

షిల్లాంగ్‍లో జరిగిన ఓ కార్యక్రమంలో కావేరి గారు

నేను బి.ఇడి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలినయ్యాను. ఒక సంగతి పేర్కొనాలి. బి.ఇడి చేస్తున్నప్పుడు నేను నిండు గర్భవతిని. ఇది నిజంగా అగ్ని పరీక్ష లాంటిది. ఒకవైపు కడుపులో 8 నెలల పాపను పెట్టుకొని, మరోవైపు పుస్తకాలు చేత పట్టుకొని చదివితే ప్రథమశ్రేణి ఎవరికైనా వస్తుందా? కానీ అంత అసౌకర్యంగా ఉన్నా నాకు సుసాధ్యమే అయింది. ఆ సమయంలో డేవిడ్ కాపర్ ఫీల్డ్ పై చిన్న ప్రాజెక్టు చేయాల్సి రావడం చాలా కష్టమే అయింది. ఇంగ్లీషు, చరిత్ర నా ప్రత్యేక సబ్జెక్టులు.

షిల్లాంగ్ తర్వాత మా శ్రీవారికి పూణే (మహారాష్ట్ర)కు బదిలీ అయింది. అప్పుడు మా ఇంటి పనులన్నీ బూనీ చేసేది. నా ఇద్దరు కుమారుల సంగతి అంతా తానే చూసేది. నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు. నిజంగా బూనీ ఒక తల్లి లాగే సేవ చేసింది. నేను ఇంతకు ముందే చెప్పాను. నా పెద్దకొడుకు అమర్త్య మహా అల్లరి పిల్లవాడు. అదుపు చేయడానికి వీలు లేనంతగా తయారయ్యాడు. బూనిలో మాత్రం ఏ మహత్తుందో కానీ చక్కగా తీర్చిదిద్దింది. డేవిడ్ కాపర్ ఫీల్డ్ లోని ‘పెగ్గొట్టి’ పాత్రతో బూనిని పోల్చవచ్చు.

మా శ్రీవారికి ఉద్యోగ విరమణ దగ్గరకు వచ్చింది వారి చివరి ఉద్యోగస్థానం కిర్కి (మహారాష్ట్ర) పూణే సమీపంలోది. పిల్లల చదువుల కోసం బారక్‌పూర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మమ్మల్ని ఉంచాలని నిర్ణయించారు. తనకు రిటైర్ అయ్యేదాకా కిర్కీలోనే ఉండక తప్పదు. దాంతో బారక్‌పూర్ వచ్చాం. చార్లెస్ డికెన్స్ చెప్పిన ఒక ప్రసిద్ధమైన మాట మదిలో మెదులుతుంది. “నా జీవితాన్ని నా కొత్త పేరుతో మొదలు పెడ్తాను’’ (I begin my life in a new name) ఇప్పుడు తిరిగి కొత్త జీవితాన్ని బారక్‌పూరులో మొదలు పెట్టాలి. కొత్త పట్టణం, కొత్త జనం, ఒంటరిగా నేను, నా పిల్లలే.

మేం కొన్ని రోజులు శ్యామ్ నగర్ లోని మా పెద్ద ఆడపడుచు ఇంట్లో ఉన్నాం. ఆమె ఎంతో హుందాగా ప్రవర్తించే మనిషి. తొమ్మిది మంది సంతానం. ఆమె చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన దురదృష్టవంతురాలు. ధీరత్వంతో జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్నీ అనుభవించింది. దురుద్దేశాలతో, అనైతికదృష్టితో వేదించే ఆకతాయిలకు ఎంతో తెలివిగా బుద్ధి చెప్పింది. యుద్ధరంగంలో సైనికుని లాగా ఆమె జీవనరంగంలో అన్ని రకాలుగా పోరాడింది. ఆమెకు మావారు బాసటగా నిలిచారు. ఆర్థికంగా తోడ్పడ్డారు. సుఖదుఃఖాల్లో పాలుపంచుకొని ఉపశమనం పలికారు. మావారు మమ్మల్ని ఇక్కడ ఉంచి తిరిగి పూణే వెళ్లారు. కొన్ని రోజులకు మళ్లీ బారక్‌పూర్ వచ్చారు.

బారక్‌పూర్లో అద్దె ఇల్లు సంపాదించడంలో ఒక జంట మాకు బాగా తోడ్పడింది. ఆ జంట వారిద్దరి పిల్లలు తోట, సుభోల గురించి ప్రత్యేకించి తరువాత చెప్పుకొందాం. అనుకున్న రోజున బారక్‌పూర్ లో అద్దెఇంట్లో కాపురం పెట్టాం. అలా మొదలై ఆ ఇంట్లో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాం. మా పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు చేసుకోవడం పూర్తయ్యాక దొరికే ఖాళీ సమయాన్ని, పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం ద్వారా సార్ధకం చేయాలని నిర్ణయించుకున్నాను. ఓ రోజు ఒక విద్యార్థి బారక్‌పూర్ లోని వివేకానంద మిషన్ స్కూల్లో ఒక ఉద్యోగం ఉందన్న సంగతి చెప్పాడు. నేను దానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూలో నెగ్గాను. స్వామి నిత్యానంద మహారాజ్‌జీ నా బయోడేటా చూసి సంతృప్తి చెంది “నీకే క్లాసు లయితే బాగుంటుం”దని అడిగారు. వెంటనే తడుముకోకుండా “ఐదు నుంచి పది దాకా ఏవైనా పర్వాలేదు” అన్నాను. స్వామీజీ “మంచిది! బాగా చెబుతావు” అన్నారు.

బారక్‌పూర్‌లో రెండుచోట్ల ఈ పాఠశాల శాఖలు ఉండడంతో మొదట్లో కొంత కష్టమనిపించింది. ఉదయం చేసే ప్రార్థన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఉపనిషత్తుల నుండి సూక్తులు బెంగాలీలోకి అనువదించి చెప్పేవారు. అవి నా హృదయంలో గాఢంగా నాటుకొని భక్తిశ్రద్ధలను పెంచాయి. వారి ప్రార్థన ఒక మహత్తరమైన శక్తిని సృష్టించింది. ఒకానొక దివ్యత్వభావనలో జీవించేలా చేసింది. బెంగాలీ పాఠ్య ప్రణాళిక ఈ పాఠశాలలో అనుసరించేవారు. నూరుసార్లు వల్లె వేయించడం ఇక్కడి నవ్యత, ప్రత్యేకత. నైతిక బోధనలకెంతో ప్రాధాన్యమిచ్చేవారు. ఉదయం జరిగే ప్రార్థన సమావేశం సంస్కృత మంత్రోచ్చారణలతో ఒక పవిత్ర వాతావరణాన్ని కల్పించేది.

స్వామి నిత్యానంద మహారాజ్ జీ విద్వన్మూర్తి. అసాధారణ వక్త. అనాథల పట్ల దయా దాక్షిణ్యాలు, సానుభూతి, ప్రేమ కలవారు. వారిలోని ఈ కోణాన్ని రెండు మూడుసార్లు చూశాను. నేను ఆ పాఠశాలలో చేరిన కాలంలో నా పిల్లలను చూసుకోవడానికి మరో మనిషి తోడు లేదు. ఒక్కదాన్నే నా ఇంటిపనులు పూర్తి చేసుకోవాల్సి రావడంతో, నేను రెండు మూడు సార్లు పాఠశాలకు కాస్త ఆలస్యంగా పోయాను. ఈ సంగతి నిత్యానంద మహారాజ్ జీ చెవిలో పడింది. ఒకరోజు ఉదయం వారు తనను కలవమని వర్తమానం పంపారు. నేను భయపడుతూ వారి గదిలోకి వెళ్లాను. నామీద కోపంతో, ఎన్ని కేకలు వేస్తారో అని ఊహించుకుంటూ వెళ్లాను. కానీ వారు హాయిగా, ప్రసన్నవదనంతో ఉన్నారు. ఏమాత్రం కోపగించుకోకుండా “సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడం మంచి అధ్యాపకుల లక్షణం కదా!” అని బుజ్జగించి పంపించారు. వారి ఉదాత్త ప్రవర్తనకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అప్పటినుండి నేను ఇంట్లో ఎన్ని పనులున్నా వదిలేసి, సకాలంలో పాఠశాలకు చేరుకునేదాన్ని. ఇంకోసారి నేను మానసిక వికలాంగుడైన నా తమ్ముడు చందన్ కు ఏదైనా దారి చూపమని ప్రార్థించాను.

ఏదైనా వ్యాపకం కల్పిస్తే దానివల్ల వాడు యథాస్థితికి వస్తాడేమోనని ఆశ!. స్వామీజీ ఎంతో దయతో జయరాంబాటిలో ఉన్న మరోశాఖకు చందన్‌ను పంపించారు. జయరాంబాటి పూజ్య శారదామాత పుణ్య జన్మస్థలం. చందన్‌కు ఏదో చిన్న బాధ్యత అప్పగించారు కానీ వాడి మానసిక స్థితి దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

రామకృష్ణ మిషన్ పాఠశాలలో పనిచేయడం అనేది ఒకగొప్ప అనుభవం. దుర్గాపూజ వేళలో హాస్టల్ విద్యార్థినులు దుర్గామాత విగ్రహాన్ని భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ‘కుమారి పూజ’ ఒక ప్రత్యేక ఉత్సవం. అది నవరాత్రుల్లో అష్టమి నాడు చేసే పూజ. బాలికలంతా రంగురంగుల చీరలతో, నగలతో అలంకరించుకొని వస్తారు. వారిని అమ్మవారి ప్రతిరూపంగా భావన చేసి పూజిస్తారు. ఇంత పవిత్రభావంతో పూజ చేయడం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అమ్మవారికి నైవేద్యంగా ‘కిచిడీ’ని పెట్టడం ఆనాటి ప్రత్యేక ఆకర్షణ. ఆ కిచిడీ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ పంచుతారు.

నేనిక్కడ మూడేళ్లపాటు పనిచేశాను. నా కూతురు శ్రేయ స్కూల్‌కు పోవడం మొదలుపెట్టింది. సెలవుల్లో మావారు ఇంట్లో ఉన్నప్పుడు ఆయనే స్కూలుకు తీసుకొని వెళ్లేవారు. ఒకరోజు బారక్‌పూరు సైనిక పాఠశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుల అవసరం ఉందన్న సమాచారం తెలిపి, నా సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్దాం అన్నారు. అరగంటలో నేను తయారై సైనిక పాఠశాలకు వెళ్ళాను. అప్పటికే పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగార్థులతో నిండి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మేమంతా గదిలో కూర్చుని ఎదురు చూస్తున్నాం. ఎట్టకేలకు నాకు పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే ఒక అందమైన మహిళ, ఆమె చుట్టూ కొంతమంది సైనిక అధికారులు కూర్చుని ఉన్నారు. ఆమె పేరు రీటా దడ్వాల్, బ్రిగేడియర్ దడ్వాల్ సహధర్మచారిణి. ఆమె ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. మొదట మామూలు ప్రశ్నలతోనే ఇంటర్వ్యూ సాగింది. రామకృష్ణవివేకానంద మిషన్ ప్రత్యేకత ఏమిటని అడిగారు. నాకు తోచిందేదో ఒక వాక్యంలో చెప్పాను. అది ప్రిన్సిపాల్ హృదయాన్ని తాకింది. నేనే ఎన్నికైనట్లు తెలిసింది. ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులతో కలిసిమెలిసి ఉండడం, ఆత్మీయతను పంచుకోవడం, క్రమశిక్షణకు కట్టుబడి ఉండడం, నియమనిబంధనలు పాటించడం నా సైనిక పాఠశాల ఉద్యోగ జీవితకాలంలో పూర్తి అంకితభావంతో జరిగాయి. అధ్యాపకుడు- బోధనలమధ్య సమర్థవంతమైన సమన్వయస్వరూపమే ఈ పాఠశాల.

బారక్‍పూర్ స్కూలో విద్యార్థినీ విద్యార్థులతో కావేరి గారు

శ్రీమతి రీటా దడ్వాల్ గారు బదిలీ మీద వెళ్లినప్పుడు ఒక సన్నిహిత బంధువు ఎక్కడికో పోతున్నట్లు, మళ్లీ కలుస్తామో లేదో అన్నంత బాధ కలిగింది. ఆమె అన్నివిధాలా సమర్థురాలయిన అధ్యాపకురాలు. ఆమె హావభావాలు, వ్యవహార సరళి, ఒక పెద్ద కుటుంబంలోని సభ్యులను చూసే తీరుగా మమ్మల్ని చూసిన పద్ధతి అంతా నేటికీ జ్ఞాపకం ఉంది.

బారక్‍పూర్ స్కూలో విద్యార్థినీ విద్యార్థులతో కావేరి గారు

తరువాత వచ్చిన ప్రిన్సిపల్ గారితో నా సర్వీస్ పూర్తయ్యే దాకా నేను పనిచేశాను. మధ్యలో అతికొద్ది కాలం ఇంకో ప్రిన్సిపల్ వచ్చి వెళ్లారనుకోండి. శ్రీమతి వర్గీస్ చాలా స్ట్రిక్ట్. క్రమశిక్షణకు మారుపేరు. ప్రతిదాన్ని సైనిక నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆమె లక్ష్యం. ఆ పాఠశాల అభివృద్ధికి, ఉన్నత తరగతుల కోసం ఆమె ఎంతగానో దోహదం చేసింది. ప్రైమరీ పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల కోసం వేరువేరు భవనాల నిర్మాణానికి కృషిచేసింది. అధునాతన బోధన సామాగ్రి పరికరాలను అందుబాటులో ఉంచడానికి, ప్రయోగశాలల నిర్మాణానికి ఎంతో పాటుపడింది. ఆధునిక విద్యా పద్ధతులకు సంబంధించిన ప్రతిదాన్ని చేరువ చేయడానికి ఆమె శక్తి సామర్ధ్యాలు, వ్యక్తిత్వం ఎంతో ఉపయోగపడ్డాయి. నా అధ్యాపక జీవితంలో మేజర్ జనరల్ జు షాను ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడూ గుర్తొచ్చే విషయం.

ఈ మధ్యలో నా ఇద్దరు కొడుకులు చదువులు ముగించుకుని ఉద్యోగాల్లో చేరారు. నా కూతురు కూడా అన్నల అడుగుజాడల్లో సాగి ఉద్యోగంలో చేరింది. అనారోగ్యం కారణంగా నా ఉద్యోగాన్ని వదిలేశాను. సైనిక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఎడమరొమ్ములో క్యాన్సర్ ఉందన్న సంగతి బయటపడింది. దాని గురించి వివరంగా తరువాత చెప్తాను. అక్కడ అధ్యాపకత్వాన్ని వదిలేయడం నాకు చాలా బాధగానూ, ఒంటరితనంగానూ అనిపించింది. కానీ నా ఆరోగ్యపరిస్థితి నాకు ముఖ్యంకదా! అంతేకాదు, నా కుటుంబ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసే పని నా మీద ఉంది. ఐదేళ్ల కాలంలో నా ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి.

కావేరి గారి కుమార్తె శ్రేయ

శ్రేయ ఒక ఉత్తర్ ప్రదేశ్ అబ్బాయిని పెండ్లాడింది. మేం బెంగాలీ, హిందుస్తానీ పద్ధతుల్లో పెళ్లి చేశాం. అది నాలుగు రోజులు వివాహం. మా కోడళ్ళు మంచి కుటుంబాల నుండి వచ్చారు. ఆత్మీయంగా మెలుగుతారు. వివాహమంటే ప్రేమ, విశ్వాసం, పరస్పర అవగాహనలతో కుటుంబాల విస్తృతీకరణం అనుకుంటే నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలినే. భగవంతుని అనుగ్రహం నామీద పరిపూర్ణంగా ఉందని భావిస్తాను. మేమంతా ఒకే ఛత్రచాయల్లో ఉన్న పెద్ద కుటుంబం.

అధ్యాయం 10 – బెర్హాంపూర్ లో ఉన్న రోజుల్లో..

బెర్హాంపూరు (ముషీరాబాద్ జిల్లా పశ్చిమబెంగాల్) లో గడిపిన రోజులను తలచుకున్నప్పుడల్లా ఎన్నెన్నో మధురస్మృతులు మదిలో మెదులుతాయి. బారక్‌పూర్లో స్థిరపడ్డాక మెట్టినింటికి తరచూ వెళ్లేవారం. పికు అక్క భర్త, మా బావగారు జమాయిబాబు మహావిద్వాంసులు. ఆరడుగుల ఆజానుబాహువు. నిలువెల్లా ఆప్యాయత మూర్తీభవించిన మనిషి. తన తమ్ముడిని, ఇంత మంచి భర్తని ఇచ్చి మా పెళ్లి చేసిన వ్యక్తి. కనుక ప్రత్యేక గౌరవాభిమానాలు ఆయన మీద ఉండడం సహజం. అక్క చాలా మృదువుగా మాట్లాడుతుంది. కానీ జమాయి బాబు బావగారు మాత్రం అట్లా కాదు. గట్టిగా వాదిస్తారు. చాలా నిశితంగా పరిశీలిస్తూ ప్రభావవంతంగా ప్రసంగిస్తారు. ఆయన ఒక్కోసారి తీవ్రంగాను, పదాడంబరంతోను, మాట్లాడి సమ్మోహితులను చేస్తారు. ఆ మాటకారితనం పట్ల నాకు ఎంతో ఆకర్షణ. ఆయన ఉర్దూ భాషా ప్రియుడు. ఉర్దూ పట్ల, ముఖ్యంగా ఉర్దూ గజల్స్ పట్ల నాలో అభిరుచిని పెంచిన వ్యక్తి ఆయన. జమాయిబాబు లాగా నిస్వార్థబుద్ధితో, స్వచ్ఛమైన మనసుతో మమ్మల్ని అభిమానించిన వారు మరొకరిని చూడలేదు. వారు 2015లో స్వర్గస్థులయ్యారు.

వేసవి సెలవులు వస్తే చాలు మా పిల్లలు బెర్హాంపూర్‌కు వెళ్ళిపోయేవారు. వాళ్ళ పెద్దనాన్న జమాయిబాబు ప్రేమాభిమానాలే కాదు, వారి పిల్లలు మోయి, జోయిలతో కలిసిమెలిసి ఆడుకోవచ్చు అన్నది మా పిల్లల ఆశ. మా పిల్లల కొంటెపనులను మా ఆడపడుచులు కూడా ఎంతో ఓపిగ్గా భరించేవారు. అమర్త్య, సుప్రతిం, మోయి, పక్కింటి చిన్నవాడు జిమ్మీ నలుగురు కలిసి ఇల్లు పీకి పందిరేసేవారు. నానా అల్లరి చేసేవారు. పికుఅక్కకున్న ఓపిక చాలా గొప్పది. ఆమె తన చేతి సైగలతోనే, కళ్ళతోనే వారిని బెదిరించేది. తప్ప, ఎప్పుడూ పెద్దగా అరవడం కానీ, చేయి చేసుకోవడం కానీ చేయలేదు. ముగ్గురు పిల్లరౌడీలు (అమర్త్య, సుప్రతిం, మోయి) మగపిల్లలు. ఒక్కతే చెల్లెలు జోయి అందరి కన్నా చిన్నది. దాన్ని వారు కొట్టేవారు. అది బిగ్గరగా ఏడుస్తుంటే మేం పరుగెత్తేవారం. అది పరుగు పరుగున వచ్చి మమ్మల్ని చుట్టుకొని, అన్నలకు ముఖం కనిపించకుండా దాచుకొనేది. ఆ పెద్ద భవంతిలో మీద పిల్లల కోసం చిన్న చిన్న ఉత్సవాలు చేసేవారం. ఇరుగుపొరుగు బడుతలు కూడా వచ్చి, వారికి వచ్చిందేదో వారు ప్రదర్శించేవారు. సాయంత్రాలు అలా ఎంతో సంతోషంగా గడిచిపోయాయి.

పిల్లలకు ‘కిచిడీ’ (నెయ్యి, వంకాయలు, మసాలాలతో బియ్యం ఉడికించి చేసేది కిచిడి) చేసి పెట్టేవాళ్ళం. ఉల్లిగడ్డతో కూడిన వేడి వేడి ఆమ్లెట్లు పెట్టేవాళ్ళం. జీవితం ఎంతో ఆనందంగా గడిచింది. ఆ రోజుల్లో జరిపిన కొన్ని ప్రత్యేక ఉత్సవాలను పేర్కొంటాను. నేను పిల్లల పుట్టిన రోజుల గురించి కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, బెంగాలి కవి నస్రుల్ ఇస్లాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తుల జన్మదినాలను ఘనంగా చేసేవారం. ఇంటిలోని పెద్ద వరండాను రెండు భాగాలు చేసి ఒక భాగంలో అందరం కూర్చుని చూసి ఆనందించేవారం. ఇంకో భాగంలో ఆ పిల్లలు తమకు వచ్చి రాని ప్రదర్శనలన్నీ చేసేవారు. పికుఅక్క ఎప్పుడూ వంటింట్లోనే గంటలకొద్దీ బందీ. మధురమైన వంటకాలు, స్వీట్లు చేసేది. వెంటనే అక్క త్వరత్వరగా జరీ అంచు పట్టుచీర కట్టుకొని తయారయి వచ్చి మాతోపాటు కూర్చునేది. పిల్లలు పాటలు, పద్యాలు పాడేవారు. చిన్న చిన్న ఏకాంకికలు ప్రదర్శించేవారు. పిల్లల కార్యక్రమాలు అయిపోయాక అక్క అందరికీ వడ్డించేది. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆనందంగా తినేవారు. అలా సాయంకాలాలు ఎంతో ఆనందప్రదంగా గడిచేవి. జీవితాంతం ఉండిపోయే మధురస్మృతులివి.

బెర్హాంపూర్ వెళ్లినప్పుడల్లా నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా ‘హజార్ ద్వార్’ (సహస్ర ద్వారాల భవనం) చూడడం తప్పనిసరి. నవంబర్ డిసెంబర్ లో వచ్చే చలికాలం సెలవుల్లో వెళ్లేవారం. ‘మోతీజీల్’ కూడా పెద్ద ఆకర్షణ. చలికాలంలో మేము వనభోజనాల (పిక్నిక్) కు వెళ్లేవాళ్ళం. అది మంచి పిక్నిక్ స్థలం కూడా. ‘ఇమాంబార’ ‘కోశ్ భాగ్’ ‘కథ్ గోల’లు కూడా చలికాలంలో చూడదగిన ప్రదేశాలే. ఇమాంబార కోట చుట్టూ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండి వనభోజనాలకు చాలా అనువుగా ఉంటుంది. చలికాలంలో భారతదేశం నలుమూలల నుండి, ముఖ్యంగా పశ్చిమబెంగాల్ నుంచి ఈ చారిత్రక ప్రదేశాన్ని చూడడానికి అసంఖ్యాకంగా జనం వస్తారు.

బెర్హాంపూర్ నా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా ఉండిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మా బావగారు జమాయిబాబు పెద్దరికంలో మా మరుదుల, ఆడపడుచుల అందరి వివాహాలు ఇక్కడే జరిగాయి. నేనొక పెళ్లికూతురుగా చిన్న వయసులో అడుగుపెట్టింది ఈ ఇంట్లోనే. నన్ను అందరూ ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నది ఈ ఇంట్లోనే, ఈ బెర్హాంపూర్ లోనే.

జమాయిబాబు మా నాన్న గారి అడుగుజాడల్లో పయనించారు. ఎలాంటి ఉత్సవం జరిగినా భోజనం మాత్రం ‘మంచి’గా ఉండాలని మా నాన్నగారి లాగే భావించేవారు. ఇప్పటిలాగా చీటికి మాటికి క్యాటరింగ్ వారికి ఆర్డర్ ఇచ్చి తెప్పించడానికి అంగీకరించక పోయేవారు. ఒక ప్రధానమైన వంట మనిషి, అతని కింద ఇద్దరు సహాయకులను పెట్టి మా ఇంటిమిద్దె మీద వంట చేయించేవారు. వారు వండిన అద్భుత వంటకాల ఘుమఘుమలతో మా ముక్కుపుటాలు అదిరిపోయేవి. స్వీట్స్ కూడా సమర్థులైన వారితో చేయించేవారు.

మా అత్త మామ లిరువురు మంచి ఉన్నత కుటుంబాల నుండి వచ్చినవారు. మా మామగారు తన కాలంలో సుప్రసిద్ధుడైన పోలీసు ఇన్‌స్పెక్టర్. ఆయన ఎప్పుడూ ఉదయం నాలుగు గంటలకే లేచేవారు. స్నానాదికాలు పూర్తి చేసుకుని పూజ చేసుకునేవారు భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చదివేవారు. ఆయన దానధర్మాలకు, పరోపకారానికి పెట్టింది పేరు. ఆర్థికంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న కాలంలో కూడా మామగారు అలాగే ప్రవర్తించేవారు అని మా వారు చెప్తే విన్నాను. మా మామగారు మధ్యాహ్నం ఎవరు ఇంటికి వచ్చినా సరే, భోజనం చేయమనేవారు. అవసరం పడి ఎవరైనా ఇంటికి వస్తే లేదనేవాడు కాదు. పిల్లలకు ఇబ్బందులు తలెత్తుతాయన్నా, తనకు కష్టంగా ఉంటుందన్నా మౌనంగా బాధపడేవాడు కానీ వచ్చిన వారికి ఏదో ఒకటి ఇవ్వకుండా పంపించేవాడు కాదు. ఏ బిచ్చగాడు మా గుమ్మం తొక్కినా రిక్తహస్తాలతో బయటికి పోలేదు. ఒక అన్నమే కాదు, అవసరమైతే బట్టలు కూడా ఇచ్చేవాడు.

మా ఇంట్లో పెళ్లిళ్లలో మధ్యాహ్నం పూట పెట్టే విందు భోజనాలు ఇంకా నా ముందు కదలాడుతున్నాయి. అట్లాగే పెళ్లికూతురు అలంకరణ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా అలంకరించడానికి వృత్తినిపుణలు (beauticians) ఉండేవారు కారు. పెండ్లికి వచ్చిన బంధువులనో, ఇరుగుపొరుగు ఇండ్లలోని వారినో సహజసిద్ధంగా అలంకరించడం బాగా వస్తుందనుకున్న స్త్రీలను అడిగేవారు. వారు చేసేవారు. ఒక పెద్ద అద్దం ముందుకు అందరూ తోసుకొని వచ్చేవారు. అలా రాగలిగిన వారిని ముందుగా సింగారించేవారు. ఎన్నో గత స్మృతులు తోసుకొని వస్తున్నాయి. అవన్నీ చెప్తే నన్ను ఎగతాళి చేస్తారని విరమిస్తున్నాను.

మా అత్తగారు వెండి పాన్ డబ్బాలోంచి పాన్ (తాంబూలం) తయారు చేస్తుండడంలో సహాయపడడం అనేది మరో మధురస్మృతి. అలా శ్రద్ధాభక్తులతో ఆమెకు తోడ్పడితే ఒక్కోసారి నాకు కూడా తాంబూలం చుట్టి ఇచ్చేది. బెంగాల్లో మిస్టిపాన్ ఎక్కువ ప్రసిద్ధి. దాన్ని మామూలుగా సున్నం, తమలపాకు, యాలకులు, సోంపు గింజలు వాడి చేస్తారు. దీన్ని కూడా ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు.

ఓ కుటుంబ కార్యక్రమంలో కావేరి గారు

మా పెద్ద ఆడపడుచుకు (ఈమె గురించి ఇంతకుముందే చెప్పాను.) చిన్న వయస్సులోనే పెళ్ళయింది. ఆమె కలకత్తా సమీపంలోని శ్యామ్ నగర్‌లో ఉంటుంది. ఆమె కూడా మరణించింది. రెండవ ఆడపడుచు అర్చన చాలా బాధ్యత గలిగిన, కర్తవ్యనిష్ఠ కలిగిన మహిళ. నేను ఆ ఇంటికి కోడలిగా వెళ్లే దాకా ఆమె ఇంటి పనులన్నీ ఒక్కతే నెత్తిన వేసుకొని చేసేది. ఆమెకు పన్నెండేళ్ళప్పుడు మశూచి సోకింది. మా మామగారు ఆ పన్నెండేళ్ళ ఏళ్ల చిన్నారికి అన్నీ సేవలు చేసినట్లు చెప్పారు. అరటి ఆకులు మజ్జిగలో తడిపి వాటి మీద పడుకోపెట్టేవారట. దీనివల్ల వారికి ఉపశమనం కలుగుతుందట. అంత చిన్న వయసులోనే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకొంది. నేను చూసిన వారిలో ఆమె చాలా పవిత్రత మూర్తీభవించిన స్త్రీ అనిపించింది.

అంజన మూడవ ఆడపడుచు. ఆమె ఎప్పుడూ సంతోషంతో ఉండే మనిషి. వినోదం కోసం ఎన్నో దారులు తొక్కింది. తనకు సరిపోని మనుషులతో తరచూ ‘ప్రేమ’లో పడి తరువాత పశ్చాత్తాపపడేది. ఆమె చుట్టూ అలా ఎందరో స్నేహితులు ఆమె బాధలు పంచుకునేవారున్నారు. అయినా ఆమె చాలా శ్రమజీవి. ఆమెలో నిరంతరం బుద్ధికీ హృదయానికీ ఘర్షణ చెలరేగేది. ఇప్పుడు ఆమె మాతో పాటే ఉంటుంది. నా అనారోగ్య కాలంలో నన్ను చాలా జాగ్రత్తగా చూసింది. చందన మా చిన్న ఆడపడుచు. బాగా సిగ్గుపడడం ఆమె ప్రవృత్తి. ఆమె మేనల్లుళ్ళను, మేనకోడళ్లను పార్క్‌కు తీసుకొని వెళ్ళి ఆడించేది. తిరిగి వచ్చేటప్పుడు, ఆమె ట్యూషన్స్ చెప్పడం ద్వారా వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే బిస్కెట్లు, పిప్పరమెంట్లు కొనిచ్చి ఆనందించేది. దీంతో పిల్లలు కూడా ఎంతో సంతోషంతో “చిట్టిఅత్తా” “చిట్టిఅత్తా” అంటూ వెంబడి తిరిగేవారు.

మా మరుదులందరూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పండుగలకు, పబ్బాలకు మేమందరం కలిసే వారం. ముఖ్యంగా దుర్గాపూజ, సరస్వతీపూజ, లక్ష్మీపూజ లాంటివే కాక ఇతర కుటుంబ ఉత్సవాలకు కలిసేవారం. అలా అందరం కలుస్తుండడంతో పరస్పరం ఆత్మీయత, సాన్నిహిత్యం, మనమంతా ఒక్కటే అన్న భావన పెరగుతుందని నాకనిపించింది. తోబుట్టువులను దాయాదులు అంటారు. కానీ మా కుటుంబసభ్యుల్లో కోపతాపాలు, పగలు ప్రతీకారాలు, కించపరచుకోవడాలు ఏనాడు చూడలేదు. రాజకీయాల మీద, ఇతర కుటుంబ విషయాల మీద అప్పుడప్పుడు తీవ్రమైన చర్చలు జరిగినా, ప్రేమాభిమానాలకు మాత్రం విఘాతం కలగలేదు. వారంతా ఉద్యోగాల రీత్యా వేరువేరు చోట్లల్లో ఉన్నా ఒకే కుటుంబం. అది ఉమ్మడి కుటుంబం. మా అయిదవ మరిది స్వపన్ మూత్రపిండాల వ్యాధితో 2006లో అస్తమించారు.

చిన్నచిన్న వాటిల్లోనే సంతోషం, చిన్నచిన్న కోరికలు, ఆశల్లోనే అంతులేని ఆనందం బెర్హాంపూరులో నా సొంతమైంది.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

Exit mobile version