‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-7

1
2

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 11 – బాగ్ చంద్ జైన్, బాబూన్& సొనాలి

[dropcap]వి[/dropcap]వేకానంద విద్యానికేతన్‌లో నాతో పాటు అధ్యాపకునిగా పని చేసిన బాగ్ చంద్ జైన్ నాకెప్పుడూ జ్ఞాపకం వస్తుంటారు. బాగ్ చంద్ జీ ఒక అమాయక చక్రవర్తి. రాజస్థాన్ నుండి వచ్చాడు. బాగా అంతర్ముఖుడు. మౌనస్వామి. ఆయన అంతకు ఆయనే పలకరిస్తాడేమోనని చాలాసార్లు అనుకున్నాను. ఇక ఉండబట్టలేక నేనే ఓ మధ్యాహ్నంపూట మాట కలిపాను. చర్చ అంతా హోమియో వైద్య విధానం- లాభాలు- వివిధ మానసిక వ్యాధుల మీద నడిచింది. బాగ్ చంద్ హోమియో డాక్టర్‌గా జాంగిపూర్‌లో ప్రసిద్ధి పొందాడు. నేను ఆయనను హోమియోపతి గురించి మరిన్ని ప్రశ్నలు వేశాను. వాటికాయన ఎంతో ఆసక్తిగా సమాధానం ఇచ్చాడు. హోమియోపతి మందులు విభిన్న రోగాలను ఎంత ఆశ్చర్యకరంగా తగ్గిస్తాయో ఆయన చెప్పిన తీరుకు నేను బాగా ముగ్ధురాలినయ్యాను. ఆనాటి నుంచి రెండేళ్ల క్రితం గుండెపోటుతో ఆయన చనిపోయేదాకా మా అనుబంధం కొనసాగింది. బెంగాలీ మాతృభాష కాకున్నా, అయిన వారిలాగా నేర్పుగా మాట్లాడేవాడు. ఆయన పూర్వీకులు రాజస్థాన్ నుంచి ముర్షీదాబాదు జిల్లాకు వలస వచ్చారు. ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలుపెట్టి అచిరకాలంలోనే పుంజుకున్నారు.

బాగ్ చంద్ జీ తరచూ వారి ఇంటికి నన్ను తీసుకొనివెళ్ళి ఘుమఘుమలాడే మామిడికాయ ఆవ, అప్పడాలు పెట్టేవాడు. వాటిని నేను ఎంతో హాయిగా తినేదాన్ని. అవి మసాలాలతో, ఎంత ఘాటుగా, కారంగా ఉన్నా ఎంతో రుచిగా కూడా ఉండేవి. మామధ్య ఒక గమ్మత్తయిన, అనిర్వచనీయమైన బంధుత్వం ఏర్పడింది. ఆయన చెప్పే తాత్విక సిద్ధాంతాలకు, వాటి సమన్వయాలకు నేను ఆకర్షితురాలినయ్యాను. అవి చాలా సార్లు నా స్థాయికి అందేవి కావని నేను అంగీకరిస్తున్నాను. జటిలమైన తాత్వికాంశాలను సరళ సుందరంగా మధ్యలో ఆపకుండా చెప్తూనే పోతుండేవాడు. నేనెంతో కుతూహలంగా వినేదాన్ని. నేను మధ్యలో ఇంటికి వెళ్లడానికి గొణుక్కుంటూ అనుమతి అడిగేదాన్ని. నేను అలా వెళ్తానంటే ఆయన కళ్ళల్లో ఏదో బాధ కనిపించేది. నన్ను ‘పిచ్చి పిల్ల’ కింద జమ కట్టి సంబోధించేవాడు. అన్నట్టుగా ఒక కొంటె నవ్వు కూడా నవ్వేవాడు. ఆయన మహా పిసినారిగా పేరు పొందిన వాళ్ళ చిన్నమ్మను ఎంతో కష్టంగా ఒప్పించి మామిడికాయ ఆవను, వారి అమ్మ దగ్గరనుంచి నోరూరించే లడ్డూలను తీసుకొచ్చేవాడు. అతనికి నేను ఒక స్నేహితురాలినీ కాదు. ప్రియురాలిని అసలే కాదు, అయినా నా సాన్నిహిత్యం అతనికి ఎంతో ఆనందదాయకంగా ఉండేదని తరచూ అనేవాడు. నిజానికి నా మీద ఎన్నో పాటలను రాశాడు. నన్ను తన నీడగా అభివర్ణించేవాడు. ప్రతి సాయంకాలం మా ఇంట్లో బాగ్ చంద్ స్వీయ కవితాగానం చేసేవాడు. మా నాన్నగారు ఆరాంకుర్చీలో కూర్చుని వింటూ ఆనందించేవాడు. ఆయన కవితాబీజాలు మా ఇంట్లోనే మా నాన్నగారు సమక్షంలోనే పడ్డాయని చెప్పవచ్చు. అవి ఫలించి మంచి కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అచిరకాలంలోనే ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితమైత్రి ఏర్పడింది. ఆయన చెల్లెళ్ళు నాకెంతో ప్రీతిపాత్రులు, అభిమానులయ్యారు. ఆయన తల్లిదండ్రులు నిరాడంబరులు. ఉదాత్తంగా ప్రవర్తించేవారు. ఆ సాయంకాలం నేనెప్పుడూ మర్చిపోలేను. నా పెళ్లి నిశ్చయమైందన్న వార్త విని బాగ్ చంద్ నా దగ్గరకు వచ్చాడు.

నా ఊహ, ఆలోచన వాస్తవమని నేననుకోవడం లేదు. కానీ ఆయన కళ్ళల్లో ఆ సాయంకాలం ఏదో దైన్యం గూడు కట్టుకొన్నట్లు అనిపించింది. నా భుజాలు తట్టి నిశ్శబ్దంగా ‘జాగ్రత్త’ అని చెప్పాడు. నేను ఇంకా నా కాబోయే భర్త పట్ల, నా కుటుంబ సభ్యుల పట్ల మంచిగా మసులుకోమని చెప్తాడు – అని అనుకున్నాను. అయినా ఒకసారి కలకత్తా వెళుతూ బారక్‌పూర్ లోని మా ఇంటికి వచ్చాడు. బాగ్ చంద్ ఓ రాజస్థానీ అమ్మాయిని పెళ్ళాడాడు. ఆయన కంటి వెలుగు లాంటి అందమైన కూతుర్ని ఇచ్చి ఆమె అకాల మరణం పొందింది. ఈయనే తల్లి, తండ్రి తానే అయి ఆ పసికూనను పోషించాడు. మమ్మల్ని చూడడానికి ఎప్పుడు వచ్చినా ఒక కవితల కట్ట తీసుకొని వచ్చేవాడు. అట్లాగే మామిడికాయ పచ్చడి తేవడం కూడ మరిచిపోకపోయేది.

రెండేళ్ల క్రితం నేను బెరహంపూర్ వెళ్ళినప్పుడు బాగ్ చంద్ జీ అకాల మరణం పొందాడని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. నేను గట్టిగా ఏడ్చేశాను. ఆయన బారక్‌పూర్ వచ్చినప్పుడు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అది మామూలు విషయమే అయినా వాదోపవాదాలకు దారితీసింది. ఏమైందో నేటికీ నాకు తెలియదు కానీ నేను అకస్మాత్తుగా ఒళ్ళు ఎరుగనంత కోపంతో తిట్టాను. నన్ను నేను నిభాయించుకోలేకపోయాను. బాగ్ చంద్ హడావిడిగా వెళ్ళిపోయాడు. నాలో పశ్చాత్తాపం కలిగింది. అనవసరంగా కాస్త తొందరపడ్డాననిపించింది. ఆయన పాదాలను తాకి క్షమాపణలు వేడుకోవాలనుకొన్నాను. కానీ ఆయన మరణంతో విధి నాకా అవకాశం ఇవ్వలేదు. అది నాకు ఎప్పటికీ తీరని లోటు.

మా శ్రీవారి చివరి ఉద్యోగ స్థానం కిర్కి (పూణే జిల్లా, మహారాష్ట్ర). ఆయన రిటైర్మెంట్‌కు ముందే మమ్మల్ని ఇప్పుడున్న ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారు. ఆయన సెలవు మీద వచ్చినప్పుడు ఇద్దరం అద్దె ఇంటి వేటలో పడేవారం. అది భయంకరమైన ఎండాకాలం. ఏప్రిల్ నెల. చందన్ పుకారా ప్రాంతంలో చచ్చేంతగా అద్దెఇండ్లను వెతికాం.

అకస్మాత్తుగా ఓ మోస్తరు ఎత్తు ఉన్న ఒక మనిషి మా ముందు నిలిచి రెండు మూడు గంటల నుండి మమ్మల్ని గమనిస్తున్నట్లు చెప్పాడు. మా సమస్య అతనికి చెప్పుకున్నాం. మా ఇంటికి వచ్చి ఒక గ్లాసు మంచినీరు తాగి పోండి అని మొహమాటపడుతూ అడిగాడు. మేం తిరస్కరించలేదు. బాబూన్ (ఆయన పేరు) తాను ముందు నడుస్తూ, ఒక పాత ఇంటికి తీసుకొని పోయాడు. అక్కడ తన అందమైన భార్య సోనాలిని పరిచయం చేశాడు. ఆమె చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతించింది. ఆరోజు మధ్యాహ్నం వారికోసం వండుకున్న మామూలు పప్పు, అన్నం మాకు పెట్టడానికి చాలా సంకోచపడుతున్నట్లు సోనాలి భర్తతో చెప్తుంటే నా చెవిలో పడింది. కానీ బాబూన్ బుజ్జగించాడు. సోనాలి సాధారణ గృహిణి. కానీ, ఆకాశం కన్నా ఎత్తయిన హృదయంతో మాకు భోజనం వడ్డించింది. అంత గొప్ప భోజనం నేను ఏనాడు తినలేదనిపించింది. విపరీతమైన ఆకలితో నకనకలాడిపోతున్నాం. వారి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయినా బాబూన్ సోనాలిల పిల్లలు తోట, సుభో వారి వారి తరగతుల్లో వారే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులవుతున్నారు. బాబూన్‌కు వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం కష్టమని సోనాలి తండ్రి కొంత ఆర్థిక సాయం చేస్తాడు. ఆ కుటుంబం గొప్ప సాంస్కృతిక ఔన్నత్యం కలిగింది. కానీ దుర్భర దారిద్రం కూడా తోడైంది. సోనాలి ఎంతో చక్కగా పెరిగింది. ఆమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా బాబూన్‌తో ప్రేమలో పడింది. పుట్టింటికి కాస్త అపఖ్యాతి తెచ్చింది. భర్త బొటాబొటి సంపాదనతో ఇంటిని ఒద్దికగా గడుపుకొంటుంది. ఇద్దరు చిన్నపిల్లలు లైటు, ఫ్యాను లేని ఆ చిన్న ఇంట్లో చదువుకోవడం చూసి నాకు చాలా బాధ అనిపించింది. వారి ఇంటికి ఎలాగైనా విద్యుత్ సౌకర్యం కలగజేయాలనీ, లేదా మరేదైనా చేయాలని అనిపించింది.

సోదరులతో రచయిత్రి భర్త దీపక్ కుమార్ (ఎర్ర కుర్తా ధరించిన వ్యక్తి)

ఆ రోజుల్లో నా ముగ్గురు పిల్లలతో నేనొక్కదాన్నే, మా వారు పంపించే అరకొర డబ్బులతోనే సంసారం ఎలాగో గడుపుతున్నాను. నేను ధైర్యాన్ని కూడా కట్టుకొని నా పెన్షన్ పైకమంతా సోనాలికి ఇచ్చాను. నేను కూడబెట్టుకున్న చిన్నపాటి మొత్తాన్ని కూడా అందించాను. సోనాలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కృతజ్ఞతలు వెల్లడించడం నాకు సరికొత్త అనుభవం. గతంలో నేనెప్పుడూ చూడలేదు. సోనాలి కంపిస్తున్న పెదవులతో ఒక లిప్తపాటు నాకేసి తదేకంగా చూసింది. నేను ఆ కుటుంబానికి ఎన్నో రకాలుగా ఋణపడిఉన్నాను. మావారెక్కడో ఉద్యోగ రీత్యా కిర్కి (మహారాష్ట్ర)లో ఉంటున్న రోజుల్లో నా కొడుకు అమర్త్య బాగా జబ్బుపడ్డాడు. అప్పుడు బాబూన్ అన్ని రకాలుగా నాకు సాయంగా నిలిచాడు. అమర్త్య ఆరోగ్యం కుదురుకున్నాక కూడా, ఎప్పుడు కలిసినా తనకే జబ్బు వచ్చి తగ్గిందన్నంతగా అన్నంతగా ముందు పిల్లవాడు ఎట్లున్నాడని అడుగుతాడు. చందన్ పుకార ప్రాంతంలో మేము మరో ఇంటికి మారాల్సి వచ్చినప్పుడు కూడా బాబూన్ చాలా శ్రమ తీసుకున్నాడు. బాబూన్ సోనాలిలు ఏ రకమైన రక్తసంబంధం ఉన్నవారు కాకపోయినా సన్నిహిత బంధువులన్నంతగా మాతో కలిసి పోయారు. ఆపద సమయాల్లో ఇలాంటి ఆత్మీయ సంబంధాలే మాకు బాగా సాయపడ్డాయి. వారి ప్రేమానుబంధాలే కలకాలం నిలిచిపోయాయి. తోట, సుభో వారి వారి చదువుల్లో ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకున్నారు. తోట ఈ రోజు ఒక ప్రముఖ మహిళా విద్యాలయానికి ప్రధాన ఆచార్యులు. సుభో చార్టెడ్ అకౌంటెంట్‌గా ప్రసిద్ధి పొందాడు.

అధ్యాయం 12 – మరచిపోలేని ప్రయాణాలు

మా వారితో కలిసి నేను చేసిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన ఎంతోఆనందోద్వేగాలతో కూడింది. సాహసోపేతమైందిగా చెప్పుకోవచ్చు నా ప్రయాణం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సరిహద్దుల్లో బాలక్పాంగ్ నుంచి ప్రారంభమైంది. అడ్డదిడ్డంగా ఉంటూ నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలలో మా వాహనం సాగిపోతుంది. రెండువైపులా ప్రకృతి సౌందర్యం మంత్రముగ్ధులను చేస్తుంది.

దట్టమైన పచ్చని అరణ్యాలు చూపు తిప్పుకోలేనంతగా మా హృదయాలను కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రయాణాల పూర్తి వివరాల జోలికి పోవడం లేదు. ఈ ప్రయాణంలో నాకు సంభవించిన ఒక సంఘటన మాత్రం పేర్కొనక తప్పదు. మిలిటరీ వాహనం వెంట్రుకవాసి మలుపుల్లో తీసుకెళ్తుంటే నా గుండె దడదడ లాడడం మొదలుపెట్టింది. కిందికి చూస్తే ఒక భయంకరమైన రాక్షసుడు మనల్ని మింగడానికి నిలుచున్నాడు అన్నట్లుగా ఉంది.

ఒక మలుపులో పూర్తిగా దారి కనిపించనంతగా మంచు కప్పేసింది. ఎటు చూసినా మంచే. జోంగా (కారు లాంటి తేలికైన మా మిలిటరీ వాహనం) లోనే ఉండి నా భర్త నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ మంచు వల్ల ఆయన నాకు కనబడడం లేదు. నేను కూడా ఆయనకు కనబడడం లేదు. మొత్తానికి ఇది ఒక వింత అనుభవం. కేవలం ఆ జోంగా (మిలట్రీ వాహనం) జాగ్రత్తగా ముందుకు వెళుతుందన్న స్పృహ మాత్రమే ఉంది తప్ప బయట ప్రపంచమంతా ఏదీ కనబడకుండా దట్టమైన పొగ మంచుతో కప్పేయబడింది. చాలా దూరం పోయాక మామూలు ప్రాంతానికి వచ్చాం. అప్పుడు ‘హమ్మయ్య’ అని ఒక నిట్టూర్పు విడిచాను. సూర్యకాంతి మా వాహనంలో పడి స్పష్టంగా నా చుట్టూ ఉన్నదంతా కనిపిస్తుంది. కింద ప్రవహిస్తున్న నది వెండి రంగు రిబ్బన్ లాగా కనిపిస్తుంది. ఆ నది చైనాలో పుట్టిందని తెలిసింది.

మేం గమ్యస్థానానికి చేరుకున్నాం. ఒక గంటపాటు వాన తుంపర పడింది. విపరీతంగా చలి పెట్టింది. భోజనశాల(Mess) కు వెళ్లి వేడి వేడి ‘టీ’ రెండు కప్పులు పట్టిస్తే గాని తిరిగి మామూలు మనుషులం కాలేదు. మొత్తం వాతావరణం అంతా ఆహ్లాదకరంగా, ఉల్లాసభరితంగా ఉంది. ఆ వాన తుంపరలో మావారితో పాటు నేను కలిసి కాసేపు ఆనందించాం. పూర్తిగా తడిసి నవ్వుకుంటూ లోపలికి వచ్చాం. మనమేం చిన్నపిల్లలమా అని కించపడాల్సిన అవసరమేమీ లేదు. ఎవరి ఆనందం వారిదే. ఎప్పటి ఆనందం అప్పటిదే. ఆ రాత్రి నేను ఆ చల్లని వర్షాన్ని, వేడి వేడి భోజనాన్ని సమానంగా ఆస్వాదించాను.

తవాంగు లోయను దర్శించడం నా స్మృతిపథంలో ఎప్పుడూ నిలిచిపోయే అంశం. అక్కడి మనోహరమైన మైదానాలు, ముచ్చటైన ప్రకృతి సౌందర్యం చూసి తిరిగి వచ్చాక కూడా చాలా రోజుల వరకు నన్ను వెంటాడింది. అక్కడి బౌద్ధవిహారాలు చూడదగినవి. అక్కడినుండి ఇంటికి బయలుదేరేముందు మరొక్కసారి అయినా వచ్చి చూసి పోవాలని ఒట్టు పెట్టుకున్నాను. దురదృష్టవశాత్తు నేను ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఇంతవరకు నాకు మళ్ళీ చూసే అవకాశం రానేలేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ యాత్ర మళ్ళీ చేస్తానన్న విశ్వాసం నాకుంది.

నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ మెదిలేదీ, చెప్పుకోవాల్సిందీ మా లక్నో బిరాకేరి యాత్ర. దానిలో మాకు ఒక భయానకమైన అనుభవం కలిగింది. మేముండే బారక్‌పూర్ నుండి హౌరా దాకా స్థానిక రైల్లో వెళ్ళాం. ఆ బోగి అంతా చాలా కొద్దిమంది ప్రయాణికులతో, ఇంచుమించు ఖాళీగానే ఉండడంతో మాకు సంతోషం వేసింది. ఆ కొద్దిమందిలో కొత్తగా పెళ్లయిన ఒక జంట కనిపించింది. వారు కేరళ నుంచి వస్తున్నారట. ఆమె వేసుకున్న బంగారు నగలను బట్టి నూతన వధువు అని ఊహించాను. ఆమె మెడలో మంగళసూత్రం, చేతికి గాజులు, వేళ్ళకు ఉంగరాలు ఉన్నాయి.

నల్లని కుర్తా, పైజామాలు ధరించిన ముగ్గురు యువకులు రైలు తలుపు దగ్గరే నిలుచుండి వారిలో వారు ఏదో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రైలు నగరం పొలిమేరలో ఉన్న ఒక స్టేషన్ దగ్గరకు వచ్చింది. దట్టమైన చీకటి వ్యాపించడం మూలాన బయట ఏమీ కనిపించడం లేదు. ఆ ముగ్గురు యువకులు మా దగ్గర వచ్చి “తొందరగా తీయండి. మీ దగ్గర ఏమున్నా తీసిచ్చేయండి” అంటూ కత్తులు చూపించారు. అనూహ్యంగా ఇలా పరిణమించేసరికి ఏం చేయాలో తోచక దిగ్భ్రాంతికి గురి అయ్యాం. వారు ఏదో మాతో పాటే ప్రయాణం చేస్తున్న యువకులు అనుకున్నాం. కానీ, బందిపోట్లు అనుకోలేదు. మావారు తన చేతి గడియారాన్నీ, పాకెట్‌లో ఉన్న డబ్బును ఇచ్చారు. నేను బంగారు లాగా కనిపించే రోల్డ్ గోల్డ్ నెక్లెస్ ధరించి ఉన్నాను. వారు అది ఇవ్వమని అడిగారు. అరవడానికి ప్రయత్నిస్తూ మాట పెకలక ఒక సెకండులో వారికి నా రోల్డ్ గోల్డ్ నెక్లెస్ ఇచ్చేశాను. ఆ క్షణంలో నాకెలా తోచిందో కానీ నేను ఒకపని చేశాను. మా ప్రయాణానికి కావలసిన డబ్బులన్నీ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను నా ఒళ్ళోంచి తీసి, వారు గమనించకుండా సీటు కిందికి తోసేశాను. ఆ విధంగా నా డబ్బులు బందిపోట్ల పాలు కాకుండా రక్షింపబడ్డాయి. ఆ దొంగలు మమ్మల్ని దాటి నూతన వధూవరుల దగ్గరకు వెళ్లారు. ఆ అమ్మాయి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దొంగలు ఆమె భర్తపై దాడి చేసి కత్తితో గాయపరిచారు. భార్యను రక్షించుకోవడం కోసం ఆ భర్త వారితో జరిపిన పెనుగులాటతో చేతికి బలంగా గాయమై రక్తం ధారగా కారడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వెంటనే తన మీదున్న దుపట్టా చింపి మణికట్టుపై రక్తం రాకుండా గట్టిగా కట్టు కట్టింది. కొంతమంది ప్రయాణికులు ధైర్యంతో ఎదిరించడంతో పర్సు మాత్రం లాక్కుని దొంగలు పారిపోయారు.

కొల్‍కతా ప్రెస్ క్లబ్‍లో ఇంటర్వ్యూ సందర్భంగా జ్ఞాపికతో రచయిత్రి

రైలు వేగం పుంజుకుంది. ఆ యువకుడు కూర్చున్న ప్రాంతంలో రక్తం మరకలు అట్టలు కట్టాయి. హౌరా స్టేషన్‌లో దిగాం. మా వారు పరిగెత్తుకు వెళ్లి రైల్వే పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి ఆ యువకుడిని హాస్పిటలుకు తీసుకెళ్లారు. ఒళ్ళు గగుర్పొడిచే అనుభవం. దేవుని దయ వల్ల మా ప్రాణాలు నిలిచాయి. లేకపోతే ఏమయ్యేదో! అకస్మాత్తుగా నాకు మరో భయం పట్టుకుంది. అది నా మనసు మీద ప్రభావం చూపింది. ఆ బందిపోట్లు నేను వేసుకున్నది అసలు బంగారం కాక నకిలీది, రోల్డ్ గోల్డ్ ది అని గుర్తిస్తే? నేను వారిని మోసం చేశానని భావిస్తే? వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారేమో అని పరిపరి విధాల ఆలోచనలు భయాలు కమ్ముకొన్నాయి. కానీ అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఏదీ కాలేదు.

మేం హౌరా స్టేషన్లో ‘హిమగిరి ఎక్స్‌ప్రెస్’ ఎక్కి మా ప్రయాణం ప్రారంభించాం. నా కొడుకు సుప్రతిం వాడి స్వభావాన్ని అనుసరించి నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ శ్రేయ మాత్రం బాగా భయపడిపోయింది. ఆ సంఘటన గురించి తప్ప వేరే ఏమీ మాట్లాడేది కాదు. అర్థరాత్రి అకస్మాత్తుగా లేచి “అమ్మా! దొంగలు, దొంగలు వస్తున్నారు. మనల్ని చంపేస్తారు” అని కలవరించేది. నేను, మా వారు “లేరమ్మా! వారెప్పుడో వెళ్ళిపోయారు. మనం ఎన్నో మైళ్ళు దూరంగా వచ్చేసాం. ఇక భయం ఏమీ లేదు” అని సముదాయించేవారం. మేం లక్నో చేరాం. మా వారి సహోద్యోగి రాంసింగ్ వారి కుటుంబం మాకు సాదరంగా స్వాగతం చెప్పింది. నిజానికి, లక్నోలో రామ్ సింగ్, వారింటికి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తేనే వచ్చాం. ఇప్పుడు నన్ను అమితంగా ఆకట్టుకొన్న అరణ్యంలోని మా యాత్రా విశేషాలను తనివి తీరా వర్ణిస్తాను

మాకు ఆతిథ్యమిస్తున్న రాంసింగ్, ఆయన సన్నిహిత మిత్రుడు, బిరాకేరిలో పాఠశాల వ్యవస్థాపకులు నజీబ్ సింగ్ లతో పాటు మేం ఒక సాయంకాలం బిరాకేరి బయలుదేరాం. ప్రకాశిస్తున్న నక్షత్రాలతో, చిరుగాలితో ఆ రాత్రి వాతావరణం అంతా మనోహరంగా ఉంది. ఏదో పిచ్చాపాటి మాట్లాడడానికి ఉపక్రమించాం. ఛలోక్తులు, సినిమా ముచ్చట్లు, పరాచకాలతో ప్రయాణం ఉల్లాసకరంగా సాగుతోంది. నజీబ్ సింగ్ ఎక్కువగా పంజాబీ లోనే మాట్లాడుతాడు. రాంసింగ్ కూడా అంతే.

ప్రయాణం సాగుతూ అరణ్య ప్రాంతాల్లోకి ప్రవేశించాం. రాత్రి రెండు గంటలయింది. ఆ నిశ్శబ్ద నిశీధిలోని విపిన సౌందర్యాన్ని సమగ్రంగా వర్ణించాలంటే ఎంత రాటుతేలిన కవి యైనా పదాలు వెతుక్కోవాల్సిందే. ఆశ్చర్యపరిచే అద్భుత సౌందర్యరాశి అరణ్యం. కీటకాల రొద, పక్షుల కూతలు, గమ్మత్తైన, వింతైన వాతావరణం అలుముకుంది. నజీబ్ సింగ్ తాను నెలకొల్పిన పాఠశాల గురించి చెప్పసాగాడు. తరచుగా ఇంగ్లాండ్ వెళ్ళిన సంగతి, బోధన – సాంకేతిక వనరులలోని సరికొత్త మార్పులు, ఆవిష్కరణలు తనను ఉత్తేజపరిచిన వైనం, వాటిని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నించిన తీరు వివరించాడు.

 మా మాటల నడుమ, ఆకస్మాత్తుగా, సరిగ్గా నడిరోడ్డు మీద ఒక జింక నిలుచున్నట్లు గమనించాం. దాంతో దాన్ని దాటుకొని ముందుకు వెళ్లలేకపోయాం. సింగ్ కారు వేగాన్ని పూర్తిగా తగ్గించి ఆపాడు. దాని కండ్లు ఎంతో అందంగా మెరుస్తూ ఆకర్షిస్తున్నాయి. మేం కన్నార్పకుండా ఆసక్తిగా చూడసాగాం. అది కొంతసేపు ఉండి మెల్లగా అడవిలోకి జారుకొంది. మరుక్షణం దుప్పుల (మగ జింకలు) గుంపొకటి రోడ్డు మీదకి వచ్చింది. వాటిని మంత్రముగ్ధులమై చూస్తూ సర్వం మర్చిపోయాం. వాటి నుంచి మా చూపులను పక్కకు తిప్పుకోలేకపోయాం. ఒక గంట తరువాత అవి అడవిలోకి వెళ్లిపోయాయి. రోడ్డుపక్కనే ఉన్న గడ్డిదారిలో ఓ మోస్తరు పొడవున్న కొండచిలువ పడుకొని ఉండడం చూశాం. బహుశా మా వాసన పసిగట్టిందేమో! దట్టమైన గడ్డిలో అది మెలికలు తిరుగుతూ మెల్లగా పాకుతూ ముందుకు సాగిపోయింది. అయితే చిరుతపులులు, పులుల లాంటివి మేం చూడలేకపోయాం. కానీ ఓ పాటి ఎత్తున్న ఏనుగులను మాత్రం చూశాం.

భగవంతుడు ఎంతో మక్కువపడి అరణ్యసౌందర్యంలో ఒకానొక మనోజ్ఞతను, ఒకానొక నిశ్శబ్దాన్ని నిక్షిప్తం చేశాడు. నవ్వుతూ, తుళ్ళుతూ, ఉల్లాసంగా ప్లాస్కులోంచి వేడివేడి టీ సేవిస్తూ అరణ్యమధ్యంలో మేం చేసిన ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేనిది. అలా రెండుగంటల గడిపి ఉదయం నాలుగు గంటల వేళకు ఒక చిన్న టీ కొట్టు దగ్గరికి చేరుకున్నాం. అక్కడ పొద్దున్నే టీ, బిస్కెట్లు తీసుకున్నాం.

నజీబ్ సింగ్ భార్య నూటికి నూరు పాళ్ళు ‘పంజాబీ’ మహిళ. లావుగా బొద్దుగా కనిపిస్తుంది. ఎలాంటి పని అయినా అంకితమైపోయి కష్టపడి పని చేస్తుంది. మాకు ఉదయం టిఫిన్ కోసం ఆమె చేసిన ‘పన్నీర్ పరోటా’లను ఎప్పుడూ మర్చిపోలేం. ఆమె మామీద కురిపించిన ప్రేమాభిమానాలకు తడిసి ముద్దయిపోయాం. మేం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండడానికి ఆమె ఎంతో శ్రద్ధ తీసుకొంది.

నజీబ్ సింగ్ పెట్టిన పాఠశాలను దర్శించడం ఒక మధుర స్మృతి. మేం అన్ని తరగతులకు వెళ్లి విద్యార్థులను కలిశాం. బోర్డు పరీక్షలు రాసే పదవ తరగతి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు వేశాం. వారు ఎంతో సంతృప్తికరంగా సమాధానాలిచ్చారు. అధ్యాపకులు బాగా బోధిస్తున్నారని అర్థమైంది. ఆ పాఠశాల చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశంసనీయంగా ఉంది. పాఠశాలలో పెంచుతున్న పూల తోట పాఠశాల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.

నజీబ్ సింగ్ స్వగ్రామానికి వెళ్లి వారి తల్లిదండ్రులను చూశాం. వారెంతో వయోవృద్ధులు. పూర్తి గ్రామీణ పంజాబీయాసలో మమ్మల్ని పలకరించడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. వారొక నులకమంచంపై కూర్చున్నారు. సంప్రదాయబద్ధమైన సిక్కుల సహజ వేషధారణలో ఉన్నారు. బెల్టు, కృపాణం ధరించారు. స్థూలకాయం వల్ల అతని వయస్సును అంచనా వేయలేకపోయాం. 80 ఏళ్లకు కాస్త అటూ ఇటూ ఉండవచ్చు. నజీబ్ సింగ్ తల్లి ఒకప్పటి బాలీవుడ్ నటీమణి ఆషా ఫరేఖ్ లా ఉంటుంది. ఆ ఇంటి కోడళ్ళు మాకు ‘లస్సీ’ ముందు ఇచ్చి, తరువాత ‘గాజర్ హల్వా’ పెట్టారు. మేమానందంగా సేవించాం. వారు చాలా మితభాషులని అర్థమైంది. నజీబ్ సింగ్ వరి, గోధుమ పండించే పెద్ద భూస్వామి. మమ్మల్ని గ్రామమంతా తిప్పాడు. మా పట్ల గ్రామస్థులెంతో గౌరవ మర్యాదలను ప్రదర్శించారు.

ఈ లక్నో బారాకేరి ప్రయాణం రెండు విధాలుగా నాకు ఎప్పుడూ మర్చిపోలేనిది. ప్రయాణం మొదట్లోనే హౌరా రైల్‌లో జరిగిన బందిపోటు వ్యవహారం, అందులోంచి ప్రాణాలతో బయటపడటం ఒకటి. కాగా నజీబ్ సింగ్ గ్రామంలో అర్ధరాత్రి అడవిలో గడపడం మరో మరుపురాని అంశం.

2019 సెప్టెంబర్‌లో అనుకోకుండా మరో సాహస యాత్ర చేశాం. నా రెండవ కొడుకు సుప్రతిం తానుండే భవాని పట్టణానికి అకస్మాత్తుగా రమ్మన్నాడు. ఒరిస్సాలోని కలహండి జిల్లా ముఖ్య పట్టణం భవాని పట్టణం. భారతీయ నావికా దళానికి చెందిన ‘చీఫ్ పెట్టి ఆఫీసర్’గా సుప్రతిం అప్పుడక్కడ నియమితుడయ్యాడు. ఒక బుధవారం రాత్రి పది తర్వాత భోజనం ముగించుకుని మేం బయలుదేరాం. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ‘మేం’ అంటే మా వారు, నేను, నా కూతురు శ్రేయ, దాని బిడ్డ ఆరు నెలల బంగారు తల్లి గుంగూన్. బారక్‌పూర్ నుండి భవాని పట్నం చాలా దూరం. దాదాపు 22 గంటలు. రెండు రాత్రిళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం. ఇంత దూరం ఒక్కసారిగా నేనెప్పుడూ ప్రయాణం చేయలేదు. అయినా ఎలాంటి ఆయాసం లేకుండా ఉత్సాహంగా సాగింది. మేం హాయిగా, సుఖంగా కారులో కూర్చున్నాం. రాజహంస లాగ మా కారు దూసుకొని పోతుంది. పార్థసారథి ముఖర్జీ అనే మా బంధువు కారు నడుపుతున్నాడు. ఆ సెప్టెంబర్ (భాద్రపదం) రాత్రి మేఘాలు లేకుండా నింగి నిర్మలంగా ఉంది. మిలమిల మెరిసే తారకా కుసుమాలతో ఆకాశకాంత సింగారించుకుంది. మా ప్రయాణం చాలా మనోల్లాసకరంగా సాగుతుంది.

ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా మా శ్రేయ కూతురు, ఆరునెల్ల పిల్ల, తన వయసుకు మించిన పెద్దదానిలా చక్కగా ఏమాత్రం అల్లరి చేయకుండా, విసిగించకుండా ఉంది. మేం మాట్లాడుకొంటుంటే మధ్య మధ్యలో అది కళ్ళు తిప్పుతూ, చేతులూపుతూ కిలకిల నవ్వుతుంది. దానికి ఏం అర్థమైందో కానీ, మాకు మాత్రం ఎందుకు నవ్వుతుందో అర్థం కాక జుట్టు పీక్కొనేవాళ్ళం. అది ఒక అభం, శుభం తెలియని చిన్నారి దేవత. మా సుదీర్ఘ ప్రయాణంలో కలుగుతున్న విసుగును, వేసటను మా మనవరాలు తన చిరుదరహాసంతో పోగొడుతుందనిపించింది. మేమెప్పుడు బెంగుళూరు వెళ్ళినా, నా బిడ్డ శ్రేయతో ఆనాటి ప్రయాణంలో ఈ పిల్ల అందరిలాగా ఏడుస్తూ, విసిగిస్తూ చంపుక తినలేదని సంతోషంగా గుర్తు చేసుకుంటాం.

ఒరిస్సాలోని ఆ ప్రాంతం అంతా ప్రకృతిరామణీయకానికి పెట్టింది పేరు. దట్టమైన సతత హరితారణ్యాలు కనువిందు చేస్తూ మా ముందున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని మనసారా జుర్రుకుంటున్నాను. అనిర్వచనీయమైన ఆ సౌందర్యాతిశయానికి నా పంచేంద్రియాలు పరవశంతో మూగబోతున్నాయి.

కారు ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపునకు లోనైంది. చేతికి అందేంత దూరంలో పర్వతాలు వచ్చాయి. నేను వాటిని తాకాను. అవి దట్టమైన పొగమంచుచేత పూర్తిగా కప్పివేయబడి, మరేవో విలక్షణమైన దృశ్యాల్లా కనిపిస్తున్నాయి. నాకు అంతా వింతగా తోచసాగింది. నేను ఏదో పారవశ్యంలో, మైకంలో మునిగిపోయాను. ప్రతిదీ నాకు భ్రమలాగే తోస్తుంది. మేం భూమిమీదే ఉన్నామా లేక వేరే గ్రహం మీద దిగామా అన్నట్లుగా ఉంది.

మనుషులు అలికిడి ఏమాత్రం లేని ప్రదేశం అయినా ఎంతో రమణీయంగా ఉంది. మేం దట్టమైన కీకారణ్యాల్లోకి ప్రవేశించాం. లోలోపల ‘బతుకు జీవుడా’ అని గుండె కొట్టుకుంటుంది. వణుకు, గగుర్పాటుకు లోనవుతున్నాం. గాఢమైన ఆకుపచ్చ తివాచి పరిచినట్లుగా ఉన్న ఆ పరిసరాలను ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి కన్నార్పకుండా చూశాం. అది ఒక అంతులేని హరిత వృక్ష సముద్రం. నాకో అంశం గుర్తుంది. ఒక దశలో నేను ముఖర్జీని కారు ఆపితే పిండార బోసినట్లున్న వెన్నెలను ఒక ఫోటో తీసుకుంటానని అర్థించాను. కానీ ముఖర్జీ ఆ దట్టమైన అడవుల్లోంచి జంతువులేవైనా వచ్చి దాడి చేసే ప్రమాదముందని కాబోలు ఆపడానికి అంగీకరించలేదు.

అపూర్వమైన వెండి వెన్నెల కాంతిని చంద్రుడు కురిపిస్తున్న దృశ్యం. దానికి తోడు మిడతల దండు ఇంకా ఇతరమైన మనకు తెలియని కీటకాల వింత వింత సవ్వడులొకవైపు, అతి భయంకర నిశ్శబ్దం మరోవైపు నా మనసులో గూడు కట్టుకొని పోయింది. ఆ వెన్నెలనాటి రాత్రి అడవులు చంద్రుని వెన్నెలలో తడిసి ముద్దవుతూ పరవశిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కవితాత్మక వాక్యం అసలే కాదు!.

మేము ఏనుగుల అభయారణ్యం సమీపించాం. దాని గుండా పోతున్నాం. అడవి ఏనుగులు మామీద దాడి చేస్తే ఎలా రా భగవంతుడా అనుకున్నాం. పరిస్థితి అలాగే ఉంది. క్షణాలు యుగాల్లా గడిచిపోతున్నాయి. రోడ్డు భయంకరంగా ఉంది. ఏమీ బాగాలేదు. ముఖర్జీ ఎంతో జాగ్రత్తగా వేగంగా కారును ముందుకు నడిపిస్తున్నాడు. మార్గమధ్యంలో స్థానిక అడవి మనుషులు తాగిన మైకంలో పెడబొబ్బలతో, అరుపులతో, నవ్వులతో ఆ ప్రాంతంలోని నిశ్శబ్ద వాతావరణం చెదిరిపోతుంది.

దాదాపు అర్ధరాత్రి ఒకటిన్నర అయింది. మా కారు మరో అడవి ప్రాంతం దగ్గర ఆగింది. ఒక గురక పెట్టి నిద్రపోతున్న ఒక ‘చౌకీదార్’ను కలిశాం. నిద్ర భంగమయ్యేసరికి దిగ్గున లేచి మేం ఎవరమో, ఎందుకు వచ్చామో విచారించాడు. ముఖర్జీ క్లుప్తంగా మా పరిస్థితి వివరించాడు. ఎక్కడైనా మరుగుదొడ్లు (Toilet rooms) ఉన్నాయా అని అడిగాడు. ఇక్కడి నుండి రెండు మైళ్ళు పోతే ఉంటాయని అతను చెప్పాడు. చిన్న చిన్న గుడిసెలు, సిమెంటు రేకులతో ఉన్న చిన్నపాటి ఇండ్లు కనిపించాయి. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాం. మేం విస్తారమైన, భయంకరమైన అరణ్య ప్రాంతం దాటుకొని మళ్ళీ మనుషుల మధ్యకు వచ్చాం. ఒక చిన్న టీ కొట్టులో టీ తాగాం. ఆ టీ ముందు అమృతం కూడా దిగదుడుపే. వేరే మాటలే లేవు.

మా తిరుగుప్రయాణం చాలా హాయిగా, సుఖంగా కొనసాగింది. తోవలో ఉన్న కాశీ పూలు (తెల్లగా, తేలికగా ఉండేవి) ఎంతో ఆకట్టుకున్నాయి. పశ్చిమబెంగాల్లో ప్రధాన ఉత్సవమైన దుర్గాపూజలో ఈ పూలు వినియోగిస్తారు. ఇవి ప్రకాశమానంగా ఉంటాయి. పరిమళభరితంగానూ ఉంటాయి. ఒక వితంతు పూట కూళ్ళమ్మ నడుపుతున్న చిన్న హోటల్లో మధ్యాహ్న భోజనం చేశాం. చికెన్ కర్రీ, అన్నం తిన్నాం. సాదాసీదా భోజనమే అయినా ఎంతో రుచికరంగా ఉంది.

ఎన్నో జ్ఞాపకాల దొంతర్లతో ఇల్లు చేరాం. అడవిలో గడిపిన క్షణాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివి.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here