‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-8

2
2

[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]

అధ్యాయం 13 – క్యాన్సర్‌తో నా యుద్ధం – మొదటి భాగం

[dropcap]2[/dropcap]006 సెప్టెంబర్. అంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం నా ఎడమస్తనం కింద క్యాన్సర్ పుండు బయటపడింది. ఒక మరుపురాని నూతన ప్రయాణానికి నాంది పలికింది. నేను ఇప్పుడు సరికొత్త మనిషిని. నేను పడ్డ బాధలను, క్యాన్సర్‌పై చేసిన పోరాటాన్ని ఈ అధ్యాయంలో అక్షరం పొల్లు పోకుండా వివరిస్తాను. నేను నాకేమాత్రం తెలియని మరొక కొత్త ప్రపంచంలోకి విసిరివేయబడ్డాను. ప్రతి చిన్న అనుభవం సైతం సాధారణ జీవితాని కన్నా భిన్నమైంది. కొత్త కావేరి జన్మించింది. లేదా కావేరి పునర్జన్మ ఎత్తిందంటాను.

నేను ఆ సమయంలో బారక్‌పూర్ లోని సైనిక పాఠశాలలో పనిచేస్తున్న సంగతి ఇంతకుముందే ప్రస్తావించాను. చలికాలంలో సైతం చల్లనీళ్ళతోనే స్నానం చేసే అలవాటున్న నాకు చలిపెట్టడం మొదలైంది. ఇది అసహజంగాను, చిత్రంగాను అనిపించింది. దగ్గు, చలి కొన్ని రోజులుగా వెంటాడాయి. తరచూ జ్వరం రావడం కూడా తోడయ్యేది.

ఒకనాటి సాయంకాలం నా అస్వస్థత కారణంగా మంచంపై పడుకున్నాను. నా ఎదను కాస్త నూనెతో మర్దన చేస్తే హాయిగా ఉంటుందని నా బిడ్డకు చెప్పాను. నా కూతురు శ్రేయ ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకొని నా ఎదభాగమంతా బాగా మర్దన చేయడం మొదలుపెట్టింది. నాకెంతో ఉపశమనంగా అనిపించి, మెల్లగా నేను నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో ఏదో అలికిడికి మెలుకువ వచ్చింది. శ్రేయ ఒక సంగతి చెప్పింది. ఎడమ వక్షస్థలం కింద రాయిలాగా గట్టిగా చేతికి తగిలినట్లుగా, అది నూనె రాస్తుంటే ఒకవైపు నుంచి మరోవైపునకు దొర్లుతున్నట్లు చెప్పింది. ఆ మాటలు వింటూనే మళ్లీ నిద్రపోయాను. అయినా శ్రేయ మాటలు నా అంతశ్చేతనలో మారుమోగుతూనే ఉన్నాయి. మరురోజు ఉదయం లేస్తూనే నా రెండు చేతులతో ఎడమస్తనాన్ని వేళ్ళతో అదుముకుంటూ పరీక్షించుకున్నాను. నిజమే! గోలీకాయంత ఉండ నా చేతికి తగిలింది. ఈ ఉండ ప్రస్తుతానికి నన్ను ఏమీ బాధించకపోయినా భవిష్యత్తులో ఏదో జరుగుతుందన్న భావన నా మనసులో వెంటనే మెదిలింది. క్యాన్సర్‌కు సంబంధించిన రకరకాల వ్యాసాలు చదవడంతో నా అవగాహన పెరిగింది. నా భర్తతోసహా మా ఇంట్లో ఎవరితోనూ చర్చించకుండా చెన్నయిలోని అపోలో వైద్యశాలకు వెళ్లి వైద్యులను సంప్రదించాలని నిర్ణయించుకున్నాను. భయం గొలిపే పరిస్థితే అయినా నిర్భయంగా ఆసుపత్రికి పోయాను.

అలా నా నూతన ప్రయాణం మొదలైంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు 2006 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఆకాశం రంగు షిఫాన్ చీర కట్టుకొని పాఠశాలకు వెళ్లాను. సహఅధ్యాపకులెంతో మెచ్చుకున్నారు. ఆ రోజు ఎంతో ఉల్లాసకరమైంది. మాటలతో చెప్పలేనిది. నేను పాఠశాలలోకి ప్రవేశించగానే కింది తరగతుల చిన్నారి బాలబాలికలు నా వద్దకు పరిగెత్తుకొని వచ్చి, సొంతంగా వారు తయారు చేసిన పూలగుచ్ఛాలను, గ్రీటింగ్ కార్డులను నాకు బహూకరించారు. నేను ఎంతో ప్రేమతో, సంతోషంతో వాటిని స్వీకరించాను. కాస్త పై తరగతుల విద్యార్థులు కూడా అందమైన స్ఫూర్తిమంతమైన వాక్యాలతో కూడిన గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి తమ గౌరవాభిమానాలను చాటుకొన్నారు.

ఆ రోజు విద్యార్థులే అధ్యాపకులై బోధించిన రోజు. వారు నిర్వహించిన రకరకాల కార్యక్రమాలు ఎంతో ముగ్ధులను చేశాయి. అధ్యాపకులకు ఆ రోజు వారే బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ వంటకాల మాధుర్యాన్ని గురించి మాటల్లో చెప్పలేం. నిజంగా ఆ రోజెంతో గొప్పరోజు. నేను మీతో ఓ వింతైన అనుభూతిని పంచుకోదలచుకున్నాను. నేను ఇప్పటిదాకా గడిపిన నా సాధారణ జీవితానికి వీడుకోలు పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. నాకే తెలియని మరో వినూతన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి నాకు నేను సంసిద్ధమవుతున్నట్లుగా అనిపించింది.

 అది దసరా నవరాత్రుల పండుగ వేళ. ఐదవ రోజు పంచమి నాడు అమ్మవారు, దుర్గామాత భూమి మీదకు దిగి వస్తుందని బెంగాలీవారు విశ్వసిస్తారు. మా కాలనీలో టెంట్ వేసి దుర్గాప్రతిమను నెలకొల్పారు. నేను, మా శ్రీవారు, మా శ్రేయ వెళ్ళి అమ్మ వారికి ఘనంగా పూజలు చేయించాం. దేదీప్యమానంగా వెలుగుతున్న అమ్మవారి నేత్రాలను తదేకదీక్షతో చూశాను. ఆ నేత్రాల్లోంచి నుంచి ఒక మహత్తర శక్తి, అపార ప్రేమ, పరిపూర్ణ ఆశీస్సులు నా మీద వర్షిస్తున్నట్లుగా ఒక దివ్యానుభవం కలిగింది. పూజ తరువాత అక్కడి నుంచి గంగానదీతీరానికి వెళ్లి కాసేపు బోటులో విహరించాం. ఆకస్మికంగా ఈ క్షణంలోనే నాకు ఏదైనా అయితే దుర్గామాత నన్ను వెంటనే రక్షించగలదని బలంగా తోచింది. అమ్మవారి అంతులేని కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా నామీద ఉన్నాయన్న బలమైన విశ్వాసమే ఈ అసాధారణ భావనకు మూలం.

మేం చెన్నై(మద్రాస్) చేరాం. చెన్నై రైల్వే స్టేషన్ చుట్టూ మంగళ సూత్రాలు, ముక్కు పుడకలు ధరించిన గ్రామీణ మహిళలు పూలు, పూలదండలు, సువాసన గలిగిన అగరవత్తులు అమ్మడం ఇప్పటికీ మాకు గుర్తుంది. సరాసరి ఒక లాడ్జికి వెళ్ళిపోయాం. అక్కడ స్నానపానాదులు పూర్తిచేసుకుని ఒక దోసె తిన్నాం. ఆ దోసె, చట్నీ ఎంతో రుచిగా ఉన్నాయి. ఆ తరువాత అపోలో హాస్పిటల్‌కు చేరుకున్నాం. రిసెప్షన్ కౌంటర్లో ఒక అస్సామీ యువకుడు కనిపించాడు. అతనితో మేము వచ్చిన పని చెప్పాం‌. ఆయన ఎంతో విచారంగా అయ్యో! డాక్టర్లు చాలామంది దసరా పండుగ అని సెలవులో ఉన్నారన్నాడు. కాసేపు ఆలోచించి ప్రముఖవైద్యులు డాక్టర్ ఉమాకృష్ణమూర్తిగారిని కలవమని సూచించాడు. వెంటనే దుర్గామాత మరో పేరే ఉమ కదా అని నా మదిలో మెదిలింది. ఎంత యాదృచ్ఛికం?! అంతా అమ్మవారే నడుపుతుందన్న బలమైన నమ్మకం మొదలైంది.

మేం డాక్టర్ చెప్పిన రోజున వెళ్లి కలిశాం. డాక్టర్ ఉమాకృష్ణమూర్తి పట్ల నాకు ఏదో చిత్రమైన ఇష్టం ఏర్పడింది. ఆమె హావభావాలు, మర్యాద, రోగుల మీద ఉండే కరుణ నన్నాకట్టుకున్నాయి. ఆమె నన్ను పరిశీలించి కొన్ని పరీక్షలు చేయించాలని చెప్పింది. ఆరోజే ఆమె చెప్పిన పరీక్షలన్నీ చేయించుకున్నాం. ఆ తరువాత నా పెద్ద కుమారుడు అమర్త్య పనిచేస్తున్న బెంగుళూరుకు వెళ్ళాం. వాడికి అప్పుడే అక్కడ ఉద్యోగం వచ్చింది. కాలం భారంగా గడుస్తుంది. నాలో ఏ సమస్య ఉందో, దాని స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి బెంగుళూరు నుండి పొద్దున్నే రైలులో చెన్నయి (మద్రాస్) బయలుదేరాం. నా రిపోర్టు తీసుకొని డాక్టర్ను కలవాలి. కిటికీ పక్కనే నా సీటు. మనసు పరిపరి విధాలా పోతుంది. ఆకస్మికంగా నా కళ్ళముందు ఒక వినీలాకాశం. దట్టమైన ఆకుపచ్చని రంగు చెట్లు ప్రత్యక్షమయ్యాయి. ఎంత దివ్యదృశ్యం అది. ఒక ఆవేశం పెల్లుబికింది. ఈ భూమి మీద నాకింకా నూకలున్నాయన్న బలమైన విశ్వాసం ఏర్పడింది. భగవంతుడు నా మొర తప్పక ఆలకిస్తాడు. నా ప్రార్థనలు ఫలిస్తాయి. నా పట్ల, నా అస్తిత్వం పట్ల ఒక సాంత్వనం చేకూరుతున్నట్లు అనిపించింది. భగవంతుడు నాలోనే ఉన్నాడన్న భావం మొదలైంది. డాక్టర్‌ను కలిశాం. ఆమె ఎంతో ప్రశాంతంగా “కావేరీ! నీకు కొంచెం క్యాన్సర్ ఉన్నట్లు అనిపిస్తుంది.” అంటూ డాక్టర్ ఆ రిపోర్టుల్ని పరిశీలించి నా ఎడమ వక్షస్థలంలో క్యాన్సర్ పుండు తలెత్తినట్లు నిర్ధారించింది.

భూమి మీద పుట్టిన ప్రతిపురుగు, పుట్ర బ్రతకాలని ఆశపడుతుంది. ఆఖరికి అతి చిన్నచీమ సైతం చనిపోయేదశలో కూడా మరింత ఎదగాలనే కోరుకుంటుంది. జీవితం అనేది అతి విలువైనది. అదే అంతిమ సత్యం (లౌకిక జీవిత విషయంలో – వేదాంతార్థంలో కాదు). నేను ఆ క్షణంలో ఒక సుడిగుండంలో చిక్కుకున్నట్లు అనిపించింది. మరోక్షణం కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నాలో నేనే ఒక ధైర్యాన్ని చిక్కబట్టుకున్నాను. నా వాళ్లంతా నాకు ధైర్యవచనాలను పలికారు. నేను అన్నిరకాలుగా చక్కగా ఉన్నానన్న సంకేతాన్ని ఇస్తూ చిరునవ్వుతో డాక్టర్ గదిలోంచి బయటకు వచ్చాను. నేను తిరిగి బలం పుంజుకొని విజేతగా నిలబడాలన్నదే నా ప్రథమ కర్తవ్యం.

ఆపరేషన్‌కు ముందు నన్ను పరిశీలనలో ఉంచారు. రకరకాల ఇంజక్షన్లు ఒకదాని తరువాత మరొకటి ఇచ్చారు. ఆ రాత్రి వారు చేయబోయే ఆపరేషన్‌కు నన్ను అన్ని విధాల సంసిద్ధం చేశారు. నాలో వచ్చే మార్పులన్నింటినీ వివరించి భయపడవద్దని ధైర్యం చెప్పారు. అదెంత విషాదమయినా, నేను స్వీకరించడానికి సిద్ధపడ్డాను. ఆపరేషన్‌కు దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. నాకు మత్తుమందు ఇచ్చే అతను (Anesthetist) మత్తు మందిస్తూనే, నూనె పదార్థాలు, వక్కపొడి, కాఫీ, టీలు అధికంగా సేవిస్తారా? అని ప్రశ్నించాడు. నేను కాస్త టీ ఎక్కువసార్లు తాగుతా తప్ప మిగతా వేవీ లేవు- అని ఏదో తప్పు చేసిన దానిలాగా జవాబు ఇచ్చాను. దాంతో అక్కడున్న మరో డాక్టర్ అది పెద్ద తప్పేం కాదంటూ వేరే విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంజక్షన్ ప్రభావంతో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలిసి తెలియని స్థితిలోకి మెల్లగా మత్తులోకి జారుకున్నాను. అలాంటి స్థితిలో సైతం అమ్మవారు దుర్గ, ప్రాణదాత్రి, ఆదిపరాశక్తి స్వయంగా తానే ఆపరేషన్ చేసి నన్ను రక్షించగలదని దృఢంగా విశ్వసించాను.

ఆపరేషన్ పూర్తయ్యాక నా వార్డులోకి పంపించారు. ఇంకా మత్తు ప్రభావం దిగకపోవడంతో ఎలాంటి బాధ కనిపించడం లేదు. మా వారంతా ఒకరి వెనుక ఒకరు వచ్చి చూసి పోతున్నారు. అప్పుడే ఆపరేషన్ పూర్తయి అరగంట గడిచిందో లేదో ఒక బంధువుతో అరగంట సేపు మాట్లాడడం గుర్తుంది. అది చూసి డాక్టర్లు ఎక్కువగా మాట్లాడవద్దన్నారు. నేను ఆ రోజు హిందూ పేపర్ చదివాను. యాదృచ్ఛికంగా ఆనాటి హిందూ పేపర్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన ఒక వ్యాసం వచ్చింది. దానికి నా స్థితికి ఎన్నో పోలికలు కనిపించాయి. నెమ్మదిగా నాలో ఆందోళన తొలిగి ఒక ప్రశాంత మనస్థితి ఏర్పడసాగింది. సర్వశక్తిమయి అయిన అమ్మవారి అనుగ్రహంతో అంతా సవ్యంగానే సాగుతుందన్న విశ్వాసం పెరగసాగింది. మధ్య మధ్యలో మా డాక్టర్ ఉమాకృష్ణమూర్తిగారు చూడడానికి వచ్చినప్పుడల్లా చెప్పే ఉత్తేజకరమైన మాటలు నాలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేవి. ఆపరేషన్ కుట్లు తొలగించాక, డాక్టర్ గారు నాలాంటి మరో 15, 20 మందిని కలిపి వారి వారి అనుభవాలను, బాధలను ఇతరులతో పంచుకోవడానికి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అలా మనసు విప్పి పరస్పరం అనుభవాలు, సలహాలు పంచుకోవడానికీ, ధైర్యం చెప్పుకోవడానికీ, క్యాన్సర్ గురించి మరెన్నో సంగతులు తెలుసుకోవడానికీ ఈ సమావేశం ఎంతో ఉపకరించింది.

72 ఏళ్ల ఒక సంఘసేవికతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె ఏమాత్రం విశ్రాంతి లేకుండా ప్రతిక్షణం సంఘసేవలో జీవితాన్ని గడిపినట్లుగా సోదాహరణంగా తనను తాను పరిచయం చేసుకొంది. క్యాన్సర్ మహమ్మారిని పారదోలడంలో మహిళలందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. అక్కడ ఉన్న మేమంతా క్యాన్సర్ పీడితులమే. క్యాన్సర్ మీద యుద్ధం చేస్తున్నవారిమే. గొంతు క్యాన్సర్‌తో శాశ్వతంగా పాటకు దూరమైపోయిన ఒక సంగీత విద్వాంసురాలు కూడా మాలో ఉన్నారు. ఆమెలోని అంతులేని ఆత్మవిశ్వాసం మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఒకటి రెండు సంవత్సరాల్లో తిరిగి ఆమె సంగీత కచేరీలు నిర్వహించగలనన్న నమ్మకాన్ని వ్యక్తీకరించారు. అబ్బ! ఎంత ఆత్మవిశ్వాసం!! వారి ముందు నేనింకా చికిత్స కూడా ప్రారంభం కాని కొత్తగా చేరిన రోగిని. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి నా వద్ద బలమైన ఆయుధాలు ఉన్నాయనిపించింది. అవి – ధైర్యం, నిర్భయత్వం.

ఐదు రోజుల తరువాత నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. బెంగుళూరులో ఉన్న నా కుమారుడు అమర్త్య దగ్గరికి వచ్చాను. అమర్త్య ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతనితో పాటు సుందరం, ఆల్విన్, కపిల్ అనే ముగ్గురు మిత్రులు కూడా ఉంటున్నారు. ఆ రోజులు నా జీవితంలో ఉత్తమంగా గడిచిన రోజులుగా భావిస్తాను. ఆ ముగ్గురు కూడా ఎంతో మంచివారు. నాకు ఎంతో సహకారాన్ని అందించారు. బాగా అభిమానించారు. నాకు ఇలా అయింది ఏమిటని అమర్త్య చాలా వాపోయాడు. రాత్రి షిఫ్ట్‌లో ఉద్యోగం చేసుకుంటూనే ప్రతిరోజు పొద్దున్నే నన్ను చూడడానికి రైల్లో చెన్నై వచ్చేవాడు. బాగా అలసిపోయిన, దిగాలుపడి పోయిన వాడి ముఖం ఇప్పటికీ నా కళ్ళల్లో కదలాడుతుంది. తల్లిదండ్రుల పట్ల వాడికున్న ప్రేమాభిమానాలు ఎనలేనివి. నా అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంతగా నా పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరాడు. జీతం కూడా తక్కువే. నా ఆపరేషన్ ఖర్చులకోసం వాడి రూంమేట్ (Roommate) సుందరం దగ్గర అప్పు కూడా చేశాడు. నా చికిత్సకైన ఖర్చంతా అమర్త్యనే భరించాడు. తల్లిదండ్రుల అనారోగ్యానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకంజ వేయకపోవడం సంతానం సహజ స్వభావమే కదా! ఇటీవల జరిగిన నా కంటి ఆపరేషన్ ఖర్చు కూడా అంతా అమర్త్యనే భరించి బెంగుళూరు హాస్పిటల్లో చేయించాడు.

సుప్రతిం చిన్నప్పటినుంచీ నెమ్మదస్థుడు. తన పని ఏదో తాను అన్నట్లుగా ఉంటాడు. ఏ పనికి పూనుకున్నా బాధ్యతతో ఇష్టపూర్తిగా చేస్తాడు. మంచి భావుకుడు. కార్యసాధకుడు. ఎంతటి క్లిష్ట పరిస్థితినయినా సునాయాసంగా ఎదురుకోగలడు. భారతీయ నౌకాదళంలో పనిచేస్తూ ఇంటికి దూరంగా ఉన్నాడు. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా పరిగెత్తుకొని వచ్చి చూసి వెళ్ళేవాడు. ఇక నా కూతురు శ్రేయ ఆ రోజుల్లో ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకొని ఉండేది. అది పూర్తిగా అమాయకురాలు. దాని ప్రపంచమంతా తల్లిదండ్రుల చుట్టే. నాకోసం ఎంతో బాధపడింది. మగపిల్లవాడి లాగా ఎన్నో పనులు చేసింది. ఇక మా శ్రీవారు నా జీవిత సౌధానికి మూల స్తంభం. “ఏం బాధపడకు. కావేరీ! అంతా సవ్యంగానే సాగుతుంది” (Don’t worry, Kaberi, everything will be alright.) అని ఆయన అనే మాటలు నాకు ఎంతో బలాన్ని, శక్తిని ఇచ్చాయి. కటిక చీకటి కమ్ముకున్న నా జీవితంలో కాంతిరేఖ లాంటిది ఆయన ఆశావాహ దృక్పథం. ఆపరేషన్ జరిగిన వారం రోజుల తర్వాతి సంఘటన నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అమర్త్యతోపాటు ఉన్న ముగ్గురు మిత్రులకు, మాకు అందరికీ మటన్ కర్రీ చేశాను. మొదట వారంతా నామీద ప్రేమతో వంట దగ్గరికి రావద్దని నన్ను వారించారు. కానీ, నేను వారికి సర్ది చెప్పాక అంగీకరించారు. అంత ప్రేమాభిమానాలతో, ఉత్సాహంతో నేను గతంలో వంట చేయలేదనిపించింది. వారంతా తన్మయత్వంతో, ముక్తకంఠంతో మటన్ కర్రీ ఎంతో రుచిగా ఉందని ఇంతవరకు ఇంత బాగా ఎవరూ చేయలేదని నన్ను ప్రశంసించారు. నిజానిజాల సంగతీ కాదు. నాకు వంట రాదనీ కాదు. వారు నన్ను సంతోషంగా ఉంచడానికి ఎంతలా తాపత్రయపడ్డారో చెప్పడమే నాకు ముఖ్యం.

ఇంకో సంఘటన మీకు చెప్పాలని ఉబలాటపడుతున్నాను. అప్పుడే షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా నటించిన ‘డాన్’ సినిమా మా ఇంటికి సమీపంలో ఉన్న సినిమా హాల్లో ఆడుతుంది. పిల్లలలందరూ దాన్ని చూడాలని నిర్ణయించుకున్నారు. నేను కూడా ఆ సినిమాకు వస్తానని చిన్న పిల్లలా మారం చేశాను. వారు ససేమిరా రావద్దన్నారు. “నన్నెప్పుడూ మంచానికి అతుక్కొని పోయిన రోగిగానే తప్ప మామూలు మనిషిలా చూడరా మీరు” అని కేకలేశాను. వారంతా ఒక్కసారిగా పెద్ద నవ్వు నవ్వి సినిమాకు రావడానికి అంగీకరించారు. గొప్ప సంస్కారం, మంచి మనసు ఉన్న యువకులు వారు. నన్ను ఎంతో ప్రేమతో జాగ్రత్తగా చూసుకున్నారు.

వారు నాకోసం ప్రత్యేకంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసేవారు. ఎప్పుడూ ఛలోక్తులు విసురుతూ, నవ్విస్తూ నన్ను సంతోష పెట్టాలని వారు చేసిన ప్రయత్నాలను తలుచుకున్నప్పుడల్లా నాకు ఇప్పటికీ ఆనందం కలుగుతుంది. ఇక అమర్త్య, వారి ముగ్గురు ప్రియమిత్రులతో వీడ్కోలు తీసుకొని తదుపరి చికిత్స నిమిత్తం కలకత్తాకు బయలుదేరాను. పాపం! వీడ్కోలు పలుకుతూ ఆ యువకులందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఇది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాల్లో ఒకటి.

***

కలకత్తాలో నా చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ గౌరీ శంకర్ భట్టాచార్య గారి హాస్పిటల్లో చేరాను. వారి దగ్గర మొత్తం ఎనిమిది సార్లు కీమోథెరపి (Chemotherapy), 30 సార్లు రేడియం చికిత్స చేయించుకున్నాను. దీనినంతా పర్యవేక్షించిన రేడియాలజిస్ట్ కళ్యాణ్ చటోపాధ్యాయ్ ధాకురియాలో ఏ.ఎం.ఆర్.ఐ హాస్పిటల్స్‌లో పనిచేస్తారు. తీవ్రమైన వేసవికాలంలో మే నెలలో బస్సులో, మేముండే బారక్‌పూరు నుంచి ధాకురియాకు వెళ్లే దాన్ని. ఆ ఎండ వేడిమికి నా శరీరం, మనస్సు బాగా అలసిపోయి చికిత్స పద్ధతిని గురించి చెప్పడానికి కూడా ఓపిక లేకపోయేది. చెన్నైలోనుంచి డాక్టర్ ఉమాకృష్ణమూర్తి గారి వద్ద చికిత్స చేయించుకొని, వారి సిఫారసుతో వచ్చిన దాన్ని కావడంతో డాక్టర్ భట్టాచార్య నన్ను ప్రత్యేకంగా చూసేవారు. వారు చెప్పే మాటలు నాకు ఎంతో ఉత్తేజాన్ని, శక్తిని ఇచ్చేవి. ఆయన మాటలకే నాకు సగం తక్కువ అయిపోయింద నిపించేది. ఆయన మాటల్లో అంత ఆకర్షణ, శక్తి ఉండేవి. కీమోథెరపీ చేయడం వల్ల తలెత్తే శారీరక, మానసిక ఇబ్బందులను గురించి వివరించారు. ఉండ లాగున్న క్యాన్సర్ పుండు వల్ల మీకేమైనా బాధ అనిపించిందా? ఎలా గుర్తించారు? అని డాక్టర్ అడిగారు. ఒకరోజు నేను పని చేసే పాఠశాలలో ఆరవ తరగతికి ఆంగ్లం బోధిస్తున్నాను. మధ్యలో నా చీరకొంగు సర్దుకుంటున్నప్పుడు నా వేళ్ళు నా ఎడమ వక్షస్థలానికి తగిలాయి. అప్పుడు ఈ గడ్డ లాంటిది చేతికి తగిలింది. ఏమిటిది అన్న అనుమానం కూడా వచ్చింది. ఎందుకో వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలనిపించింది- అంటూ మళ్ళీ కథంతా చెప్పుకొచ్చాను.

భట్టాచార్య లాంటి సమర్థులైన డాక్టర్ పర్యవేక్షణలో కీమోథెరపీ చేయించుకున్నది నిజమే. అయినా ఇప్పుడు నేను నా క్యాన్సర్ చికిత్స పరిణామాలు, అనుభవాలు, నా మానసికస్థితి గురించి ఒక రోగిగా దీర్ఘంగా వివరించాలన్న ఆసక్తితో ఉన్నాను. ఈ చికిత్స జరుగుతున్నంత కాలం ఒక్కసారి కూడా నేను బెంబేలు పడిపోవడం, ఇక ఏదో నా బతుకు ఇలా అయిపోయింది- అని బాధపడడం కానీ జరుగ లేదు. డాక్టర్ భట్టాచార్య కీమోథెరపీ వల్ల వరుసగా కలిగే పరిణామాలన్నీ వివరించే పట్టిక నొకదాన్ని నాకు ఇచ్చారు. తల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పల మీది వెంట్రుకలు రాలిపోవడం, గోళ్ళరంగు మారడం, ఆకస్మాత్తుగా వికారాలు, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతాయి. మొదట్లో ఈ మందులు సేవించడం పెద్ద హింస, అగ్ని పరీక్ష. కానీ ఈ రోగం నుండి విముక్తి పొందడమే మన గమ్యం కనుక అవన్నీ భరించక తప్పదు. డాక్టర్ భట్టాచార్య ఎంతో సానునయ వాక్యాలతో మందులు ఇస్తారు. ఆయన హస్తవాసి, మాట్లాడే తీరు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. కీమోథెరపీకి ముందు రోజు కూడా వాంతి రాకుండా మందులు ఇవ్వాలా అని అడిగారు.

నాకు మొత్తం ఎనిమిది సార్లు కీమోథెరపీ, 31 సార్లు రేడియోథెరపీ చికిత్సలు జరిగాయి. నా మొదటి కీమోథెరపీ చికిత్స ఎప్పటికీ మరువలేని అనుభవం. ఒక నర్స్ ట్రేలో కత్తెర, పత్తి, ఇంకా మరికొన్నింటితో వచ్చింది. నా కుడి చేయిని గట్టిగా పట్టుకొని, నరాన్ని దొరకపుచ్చుకుని ఇంట్రా వీనస్ ఇంజక్షన్ ఇచ్చింది. నా మోచేతి భాగం నుండి రక్తం ధారగా వచ్చింది. నాకు కప్పిన తెల్లని వస్త్రం రక్తసిక్తమై ఎర్రగ మారడాన్ని నిశ్శబ్దంగా గమనించాను. డాక్టర్ భట్టాచార్య పర్యవేక్షణలో నా మొదటిసారి కీమోథెరపి ఇంజక్షన్ ఇచ్చారు. ఒక్కొక్క మందు చుక్క నా నరంలోకి వెళుతుంటే నాకు నేను “బాగు కావాలి. దేవుడా! నాకు బాగు కావాలి దేవుడా” అని ప్రార్థించాను. నేను మా డాక్టరుకు, వారి సిబ్బందికి ఎంతో సహకరించానని డాక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. కీమోథెరపీ జరిగిన తర్వాత నేనొక్కదాన్నే నర్సు సహాయం లేకుండానే వాష్ రూం (Toilets) కు వెళ్ళి వచ్చాను. ఒక సందర్భంలో మాత్రం ఒక నర్స్ మరీ అక్కడా ఇక్కడా తిరగవద్దనీ, లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని సున్నితంగా చెప్పింది. ఈ సందర్భంగా ఒకటి గుర్తుకొస్తుంది.

ఒక ప్రొఫెసర్ గారి భార్యకు గర్భాశయ క్యాన్సర్ సోకింది. మా వార్డులోనే ఉంది. ఆమె అంతులేకుండా తన తలరాతను నిందిస్తూనే ఉంది. నేను ఆమె పక్కనే కూర్చుని ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ, ఆమె పిల్లలు చదువులు, హాబీలు, ఇష్టానిష్టాలు, బెంగాలీ వంటకాల, చిన్ననాటి ముచ్చట్ల గురించి సరదాగా రోజూ అడిగేదాన్ని. ఇలా మాట్లాడటం ద్వారా ఆమె ప్రవర్తన కాస్త మెరుగుపడింది. నా ఆనందానికి హద్దులు లేవు. ఆమె నన్ను చిరునవ్వుతో ప్రతి ఉదయం పలకరించేది. నాతో మాట్లాడడానికి ఎంతో ఇష్టపడేది.

మూడవ కీమోథెరపీ మాత్రం చాలా కష్టమైంది. విపరీతంగా జ్వరం, తలనొప్పి, వాంతులు మొదలైన రకరకాల వికారాలు చోటుచేసుకున్నాయి. చిన్న గ్లాసు నీళ్లు తాగినా సరే వాంతి చేసుకునే దాన్ని. కీమోథెరపీ జరిపినప్పుడల్లా నాకు మరో సమస్య ఎదురయ్యేది. ఆకలి లేకపోవడం, ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నా విషం లాగా చేదనిపించడం, ఇక విధిలేక ఏదో తిన్నట్లు చేయడం – అలా మూడో కీమోథెరపీ తరువాత వారం రోజులపాటు అవస్థ పడ్డాను.

అంతేకాక అర్థంపర్థం లేకుండా, అసంబద్ధంగా ఏదేదో మాట్లాడేదాన్ని. ఆ రోజుల్లో నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులంతా నేను ఇక చాలాకాలం బతకననే భావించారు. ఆ తీవ్రమైన మూడో కీమో తర్వాత మెల్లగా అన్నింటికి అలవాటు పడ్డాను. నేను కొన్ని అనుభవాలను పంచుకోదలచుకున్నాను. సిగ్గు, బిడియం, ఆత్మన్యూనతల నుండి క్రమంగా ఎదిగి వాటి స్థానంలో ధైర్యం, నమ్మకం, దేనినైనా జయించగలిగే విజయశీలం కలిగి ప్రపంచానికి “నేను విజయంతో తిరిగి వచ్చాను” అని ప్రకటించగలిగే స్థాయికి చేరుకున్నాను.

ఆసుపత్రిలో నా బెడ్ పై పడుకొని నాకు వేసే ఈ అద్భుతమైన ప్రతి మందుచుక్క నాకు పునఃప్రాణప్రతిష్ఠ చేయడానికి పైనుండి రాలుతున్న అమృత బిందువు లాగా భావన చేసుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కీమోథెరపీ జరుగుతున్న ఒక సందర్భంలో నేను దాన్ని గురించి కాక, మా అక్క కూతురు పెళ్లిలో నేను ధరించే చీర, దానికి సరిపోయే రవిక, సరిపోయే లిప్ స్టిక్‌ల గురించి ఆలోచించాను. ఐదవ కీమోథెరపీ తర్వాత మా కుటుంబం అంతా బెర్హాంపూర్ వెళ్ళింది. బెర్హాంపూర్ దగ్గరలో లేదు. కలకత్తాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అంత దూరం కారులో ప్రయాణం చేయడానికి అనువుగా మా వాళ్లు చాలా మెత్తటి దిండ్లు, కుషన్సు నేను సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. వారంతా నా పట్ల చూపుతున్న ప్రేమకు నా కన్నీళ్లను ఆపుకోవడం అసాధ్యమైంది. అది చాలా సుఖంగా సాగిన ప్రయాణం అంటే అతిశయోక్తి కాదు. అర్ధరాత్రి రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేయడం ఒక కలలాగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ అలా అర్ధరాత్రి పూట దాబాల్లో తినలేదు. ఇటువంటి చిన్న చిన్న అంశాలే మధురానుభూతులుగా జీవితాంతం గుర్తుండిపోతాయి. మరుసటిరోజు సాయంకాలానికి మేము బెర్హాంపూర్ చేరాం. ఆ పెద్ద ఇంటిలో అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. పెండ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మేం సంతోషంతో ఇంట్లోకి అడుగు పెట్టాం. పికుఅక్క నేను పెళ్ళికి రాగలనని ఏమాత్రం నమ్మలేదు. నన్ను చూసి వారి ఆనందానికి అవధులు లేవు. ప్రతి ఒక్కరు దగ్గరకు వచ్చి బిగ్గరగా పట్టుకొని తమ ఆనందాన్ని వ్యక్తీకరించారు. నేను అన్ని విధాలుగా సుఖంగా ఉన్నాను. కుటుంబ సభ్యులందరి లాగే పెండ్లి పనుల్లో చురుగ్గా పాల్గొనాలన్నదే నా అభీష్టం. రాత్రిపూట ఒక రగ్గు (దుప్పటి) పూర్తిగా కప్పుకొని, మంచం మీద చేరగిల కూర్చుని జమాయిబాబుపికు దంపతులతో, (మా అక్క బావలే. జమాయిబాబు తన తమ్ముడితో నా పెళ్ళి చేయించింది వారేగదా!) వారి కూతుళ్ళు మౌ, జాయ్ లతో హాయిగా, ఆనందంగా కబుర్లు చెప్పుకున్నాం. నాకు బాగా గుర్తుంది. వరుడు పెళ్లి విడిదికి వచ్చే సమయంలో ఎదుర్కోళ్ల సందర్భంగా, ఇంకా తదితర కార్యక్రమాల్లో నేనొక చక్కటి అందమైన చీర కట్టుకొని, నగలను అలంకరించుకొని చురుగ్గా పాల్గొన్నాను. ఎక్కడా నాకు ఎలాంటి ఇబ్బంది కానీ బాధ కానీ కలుగలేదు. పైగా నేను అమితానందాన్ని పొందాను. ప్రతివారు నా ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించిన వారే. బెర్హాంపూర్‌లో మరిచిపోలేని మధురానుభూతులతో బారక్‌పూర్ తిరిగి ప్రయాణం మొదలుపెట్టాను.

పద్ధతి ప్రకారంగా చేస్తున్న కీమోథెరపీ, రేడియో థెరఫీలు విజయవంతంగా పూర్తవుతున్నాయి. రేడియో థెరఫీ చేస్తున్న వేళ రేడియాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చటోపాధ్యాయ్ నేను ఆరోజు వేసుకున్న ఎర్రటి లిప్‌స్టిక్ గురించి అడిగారు. నా అలంకరణ కూడా నా శక్తి సామర్థ్యాలను ఉద్దీప్తం చేయడంలో తోడ్పడుతుందని జవాబిచ్చాను. ఆయన ప్రశంసాత్మంగా చిరునవ్వు నవ్వాడు. నా శరీరానికి మాత్రమే క్యాన్సర్ సోకింది కానీ, నా ఆత్మకు కాదు కదా! ఏదో రోగం వచ్చిందని దిగాలు ముఖంతో, మామూలు బట్టలతో ఉండాలన్నది నా సిద్ధాంతం కాదు. పాఠశాలకు పోతున్న రోజుల్లాగే నఖశిఖపర్యంతం చక్కగా సింగారించుకొనేదాన్ని. దాంతో ఒక సందర్భంలో నన్ను రోగిగా కాక రోగిని చూడ వచ్చిన ఒక బంధువుగా సెక్యూరిటీ వారు భ్రమపడి రేడియేషన్ రూమ్‌లో ఉండవద్దనీ, బయటకు వెళ్ళిపొమ్మన్నారు. నేను వారితో నేనే రోగినని వాదించి నా గుర్తింపు కార్డు చూపిస్తే కానీ నమ్మలేదు. ఆ తర్వాత వారు ఆశ్చర్యంతో అభినందించారు కూడా. కీమోథెరపీ సమయంలో కూడా నేను ఎవరి సహాయం లేకుండానే టాయిలెట్ (Toilets) కి వెళ్ళేదాన్ని. మన పనులు మనమే సొంతంగా చేసుకోవాలి. ఎవరిమీదనో ఆధారపడకూడదని ఆలోచించేదాన్ని. నేను పక్కనున్న ఇతర రోగుల వద్ద కూర్చోవడానికీ, వారితో మాట్లాడడానికీ ఏనాడూ సంశయించలేదు. నా వల్ల వారు స్ఫూర్తి పొందాలి.

(సశేషం)


శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.

‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.

కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here