[శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ఆత్మకథ ‘Peeping Through my Window’ ని ‘ఆటుపోట్ల కావేరి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు, డా. వెలుదండ నిత్యానంద రావు. Dr. Veludanda Nithyananda Rao’s translation of Mrs. Kaberi Chattopadhyay’s autobiography ‘Peeping Through my Window’ in Telugu. Special thanks to Partha Pratim Roy, chief coordinator, Virasat Art Publication, Kolkata.]
అధ్యాయం 13 – క్యాన్సర్‌తో నా యుద్ధం – రెండవ భాగం
[dropcap]డా[/dropcap]క్టర్ భట్టాచార్యగారి ప్రవర్తన, వ్యవహారసరళి, పెద్దరికం, సౌమ్యం ఎంతో ప్రశంసనీయం. ఆయన తెలివితేటలు, ఆర్ద్రత మూర్తీభవించినవారు. ఆయన ఒక్కొక్క రోగిని పలకరిస్తూ, మాట్లాడుతూ కారిడార్లో వస్తుంటేనే ఎంతో సంతోషం వేసేది. “రోజంతా ఎలా గడుపుతున్నారు? ఏం చేస్తున్నారు?” అని మమ్మల్ని ఎంతో స్నేహంగా అడిగేవారు. డాక్టర్‌గా ఆయన మామూలు డ్యూటీ చేస్తున్నట్లుగానే ఉంటూ తరచుగా మా పిల్లల గురించి, వారి చదువుల గురించి, మా హాబీల గురించి అడిగి ఒక ఆత్మీయత పెరిగేలా వ్యవహరించేవారు.
నా చికిత్స 2007లో ముగిసింది. చికిత్సకోసం నేను హాస్పిటల్‌కు బస్సులోనే వెళ్లేదాన్ని. ఏప్రిల్, మే నెలల్లో, వేసవికాలంలో ఉక్కబోస్తున్న సమయంలో కూడా ‘విగ్గు’ ధరించేదాన్ని. ప్రయాణికుల రద్దీతో కూడిన నా బస్సు ప్రయాణం నాకు ఒక శిక్ష. కొన్నిసార్లు నా విగ్గు తీసిపారేద్దాం అనిపించేది. ఒకసారి బస్సులో హాస్పిటలుకు పోతూ ఉంటే ఒక ప్రయాణికురాలు ఇంత అందంగా ఉండి మగరాయుడిలా వెంట్రుకలు కత్తిరించుకున్నదని వ్యాఖ్యానించింది. అది విన్న నాకు ఒక చిరునవ్వు నవ్వడం తప్ప మరో మార్గం లేకపోయింది. నా జుట్టు, కట్టు, బొట్టు మొత్తం మీద నా ఉనికి వారికి విపరీతంగా తోచి ఉంటుంది. నా జుట్టు రాలిపోవడం నాకెంతో బాధాకరమైంది. వెంట్రుకలు రాలిపోకూడదని ఎన్నోసార్లు మనసులో ప్రార్థించాను. ఆశ్చర్యం! మొత్తం బట్టతల వచ్చినా మధ్యలోమాత్రం ఒక బన్(bun) లో ముడి వేసిన వెంట్రుకలు లాగా కొన్ని ఉండిపోయాయి. కానీ అది ఎంతో అసహ్యంగా అనిపించింది. పైగా ఏదో దుర్వాసన రావడం కూడా మొదలు పెట్టింది. ఏ స్త్రీ కూడా బట్టనెత్తిని భరించలేదు. నిండైన కురులను ఒక పెద్ద ఆస్తి లాగా తలపోస్తుంది. ఒక మధ్యాహ్నం పూట భోజనానంతరం మా శ్రీవారిని అభ్యర్థించాను. వారు నా నెత్తి మీద మిగిలిన ఆ బన్ లాంటి వెంట్రుకలను మొత్తం శుభ్రంగా కత్తిరించేశారు. జుట్టంతా పూర్తిగా పోయాక నా కొత్త ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకున్నాను. ఆశ్చర్యమనిపించినా నాకొత్త రూపం నాకెంతో ప్రీతిపాత్రమైంది. నా ముఖం అమాయకపు బాలిక ముఖం లాగా ఉంది. రేడియేషన్ చికిత్స తర్వాత నా ముఖకవళికలన్నీ పూర్తిగా మారిపోయాయి. నా కొత్త ముఖం నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది.
ఈ మధ్యలో నేను పూర్తిగా బలహీనురాలినయ్యాను. నా ముఖం, చర్మం అంతా రక్తహీనతతో పాలిపోయింది. నా చేతి గోళ్లు, కాలిగోళ్ళు నల్లగా రంగు మారిపోయాయి. తినే అన్నం చేదుగా, విషంగా ఉండి అ రుచిగా ఉంటుందని ఇంతకు ముందే చెప్పాను. కానీ నేను దేనినీ తప్పని విమర్శించడం లేదు. తప్పు పట్టడం లేదు. నేను రాత్రంతా గాఢంగా నిద్రపోయేదాన్ని. కేవలం ఉషోదయకాలంలో మహమ్మదీయులు నమాజ్ చేస్తున్న ఆజాన్ శబ్దానికి లేచే దాన్ని. టాయిలెట్ కి వెళ్లి వచ్చేదాన్ని. నాకు తెలుసు నాకు వేడివేడి టీ ఇవ్వడానికి ఇంకో గంట అయినా సమయం పడుతుంది. దాంతో నా శరీరం, మనసు పునరుత్తేజం పొందుతాయి. ఒక పెద్ద సైజు మగ్గులో టీ తాగుతాను.
నాతోపాటు పనిచేసిన ఉపాధ్యాయులు వచ్చి ఆప్యాయంగా ధైర్యం చెప్పేవారు. నా విద్యార్థులు నేను త్వరగా కోలుకోవాలని అందమైన కొటేషన్లతో గ్రీటింగ్ కార్డ్స్ పంపేవారు. ఆ చిన్నారివిద్యార్థి దేవతలతో నా మనసు పెన వేసుకొని పోయేది.
స్నానం చేసే ముందు కొన్ని తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయాలని డాక్టర్ గారు చెప్పారు. ఈ ఎక్సర్‌సైజుల వల్ల నా ఎడమ చేయి ముందుకు, వెనుకకు సులభంగా తిప్పడానికి వీలయ్యింది.
జీవితం ముందుకు సాగిపోతుంది. నా కొత్త జీవన విధానానికి నేను క్రమక్రమంగా అలవాటు పడుతున్నాను. రోజువారి విధులను చేసుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా పుష్టి చేకూర్చే అలవాట్లను, జీవన విధానాన్ని అలవర్చుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ నడుమ మానవ సహజమైన రకరకాల వింత ధోరణులను ఎదుర్కోవలసి వచ్చింది కూడా. శర్మ గారి భార్య కుతూహలం పట్టలేక నెత్తి మీద పేలు (Lice) ఎక్కువయ్యాయని గుండు చేయించుకున్నావా అని చాలా మొరటుగా అడిగింది. నేను విగ్గు కొసకు ఉన్న నల్ల దారాన్ని లాగి ఆమెకు నా బట్టతల చూపించాను. ఆమె సిగ్గు పడినట్లనిపించినా ఆమె కళ్ళల్లో మాత్రం కొంటెతనమే కనిపించింది. క్యాన్సర్ ఫలితంగా జుట్టు రాలిపోతుందనీ, అదేమీ తప్పు కాదని చిన్న పిల్లలకు సైతం తెలుసు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అవి నన్ను కొంతకాలం బాధపెట్టాయి. కానీ, నా ఆత్మ శక్తిని ఏమాత్రం తగ్గించలేకపోయాయి.
నా పుట్టుకతో వచ్చిన హాస్యప్రవృత్తిని నేను ఎప్పటికీ పోగొట్టుకోలేదు. “నాకే ఎందుకు? నేనే ఎందుకిన్ని కష్టాలు భరించాలి?” అన్న ప్రశ్నలు నన్ను ఆందోళనకు గురి చేసేవి. అయినా, వాటికన్నా చిత్ర విచిత్రమైన అనిర్వచనీయమైన అనుభవాలను పంచుకోవలసి ఉంది. వాటి మీద దృష్టి పెట్టాలి. అమ్మవారు, లలితా పరాభట్టారిక, దుర్గాదేవి నన్ను మొదటి నుండి నేటిదాకా ఆశీర్వదిస్తూ నా వెంబడే ఉందన్న సంగతి మీకు ఇంతకు ముందే చెప్పాను. నా ఈ అస్వస్థత కాలంలో ఆమె నా పక్కనే బాసటగా నిలిచింది. కీమోథెరఫీ జరుగుతున్న కాలంలో దాన్ని అధిగమించడానికి ఆ లోకాతీతశక్తి నాకెలా సాయపడిందో చెప్పాలని ఉంది. అమ్మవారి కరుణాకటాక్షం ఒక సాంత్వనం, మార్మికత, అత్యంత శక్తిమంతమని, అది పూలలోని తావి లాగా సర్వత్రా వ్యాపించిందనిపించింది. మొత్తం మీద నాకే తెలియని ఒక వింత అనుభూతిని నాలో రగిలించింది. నా ప్రస్తుత పరిస్థితి కన్నా విభిన్నమైన మరొక దివ్యమైన మైకంలో, పారవశ్యంలో ఉన్నాను. దుఃఖాలు కానీ, రోగాలు కానీ లేని ఒక మధురానుభూతిలో నా మనస్సు ఓలలాడుతుంది. విషాదం, వేదన, విచారం అనే వాటి జాడ కూడా లేని ఒకానొక దివ్యమైన, మనోహరమైన లోకంలో నివసిస్తున్నానని తరచూ భావించుకునేదాన్ని. అలాంటి “అంతా మంచిదే” అని అనుకునే అనుభవం కూడా ఒక రకమైన అనుభవమే. నా అస్వస్థతవేళ రకరకాల భావోద్వేగాలు మనసులో చెలరేగేవి. అవన్నీ ఒక సుడిగుండంలో కొట్టుకొని పోతున్నట్టుగా తలపింపజేసేవి.
ఆశావహ దృక్పథాన్ని మించిన శక్తిమంతమైన ఆయుధం మరొకటి లేదు. నా చికిత్స ముందుకు సాగుతున్న కొద్దీ, నా మనసు ఎదగడం ప్రారంభించింది. ప్రతికూల ఆలోచనలు కూడా క్రమంగా క్షీణించసాగాయి. ప్రతికూలపద ప్రయోగాలు, ప్రతికూల ఆలోచనలు ఏవి కూడా నా స్వప్నాలను, నా భావిజీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకొనే నా ప్రణాళికలను భగ్నం చేయలేకపోయాయి.
కీమోథెరపీకి, రేడియేషన్‌కు వెళ్ళే రోజుల్లో నేను రంగు రంగు చీరలను కట్టుకొని వెళ్లేదాన్ని. యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయిని ఎవరైనా ప్రశంసిస్తే ఎలా పొంగిపోతుందో అలా నన్ను ప్రశంసాత్మక దృక్కులతో చూస్తే అంత ఆనందించేదాన్ని. హాస్పిటల్‌కు బస్సులో వెళ్లడం ఎంతో ఆనందకరంగా ఉండేది. నేను తరచూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాటలను పాడుకుంటూ నన్ను నేను ఉల్లాసపరచుకొనేదాన్ని. రవీంద్రుని పాటల్లోని లోతు, గాంభీర్యం నన్ను నేను ధైర్యపరచుకునేందుకు ఇంధనంగా ఉపయోగపడేవి. మామూలు రోజుల్లో బస్సు ప్రయాణం అంటే ఎంతో చీకాకు. కానీ ఇప్పుడు అది ఒక ఉత్కంఠ భరితమైన, సాహసకృత్యంగా భావిస్తున్నాను. ఆ రోజుల్లో ఎలాంటి భయంకానీ, దుఃఖం కానీ మనసులో ఏమాత్రం లేవని ఘంటాపథంగా చెప్పగలను. పైగా పెను భారం అంతా నా మనసు నుండి తొలగిపోయి తేలికైంది. ఏదైనా వ్యాసంలో క్యాన్సర్ అన్న పదం కనిపిస్తే చాలు నేను వణికిపోయేదాన్ని. ఆ పేజిని త్వరగా తిప్పేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను క్యాన్సర్ గురించి నిర్భయంగా చర్చించగలుగుతున్నాను. ఇది నిజంగా సంతోషకరమైన పరిణామం. కొన్నేళ్లుగా నన్ను వెంటాడుతూ భయపెడుతున్న క్యాన్సర్ నుంచి విముక్తి పొందాలి. క్యాన్సర్ మీద పోరాటం మొదలుపెట్టాను. ఈ వ్యాధితో బాధపడుతున్న నా మిత్రులందరికీ చెప్పేదొకటే. మీ మనసులో ఉన్న భయాలన్నింటిని తుడిచి పెట్టండి. భయమే మన మనసుల్లో తిష్ఠ వేసుకునే పెద్ద భూతం.
రోగి ముందు కానీ, వారి బంధువులతో కానీ ‘క్యాన్సర్’ అని ఉచ్చరిస్తే చాలు ప్రపంచమే కూలిపోతుందన్నంతగా, ప్రళయం వచ్చేస్తుందన్నంతగా బాధపడి పోతారు. “కావేరీ! నీకు కొద్దిగా క్యాన్సర్ వచ్చినట్లుగా” ఉందని డాక్టర్ గారన్న మాటలు తొలిసారిగా నా చెవుల్లో పడినప్పుడు ఎందుకు పెద్దగా నేను క్రుంగిపోలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ మాట విన్న వెంటనే నా భర్త పిల్లల్ని చూసుకోవడానికి నేను ఇంకా జీవించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల నేను త్వరగా కోలుకోవాలి.- అన్న ఆలోచన వచ్చింది. సరిగ్గా ఏమంటారో తెలియదు కానీ, నేను ఒక శక్తిమంతమైన దృఢమైన అస్తిత్వకాంక్షతో ఉన్నాను.
మనసు నుంచి భయాన్ని తుడిచి పెట్టాలని ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పాను. ధైర్య సాహసాలతో ఎదుర్కోవడం ఒక్కటే మార్గం. సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మనస్సు అనేది అత్యంత శక్తిశాలిని. అది దేనినైనా లొంగ తీసుకోగలదు. దేనినైనా తన ఇష్టం వచ్చినట్లు ఆడించగలదు. జీవించడమే మన లక్ష్యం. ఏ రోగమైనా మనిషిని పూర్తిగా చంపలేదు. (భయము నిరాశ తోడైతే తప్ప). జీవితం అనేది విస్తారమైంది. వైవిధ్య భరితమైంది. కాకుంటే మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని సక్రమ పథంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక రోగం వచ్చిందంటే దానికి చికిత్స చేయించుకోవాలి తప్ప శారీరకంగా మానసికంగా సమస్తం కోల్పోయినట్లే, మరణమే శరణ్యమని భావించకూడదు. వైద్యశాస్త్రం విప్లవాత్మకంగా పురోగమించింది. ఎన్నెన్నో కొత్త కొత్త పరిష్కారాలను కనుగొంటున్నారు. మనకు ఒక్కటే కావలసింది పోరాట పటిమ. అదొక్కటి ఉంటే చాలు ఆత్మనూ, మనసునూ ఛిద్రం కాకుండా ఉంచుతుంది. మానసికమైన వ్యాయామాలతో మానసిక శక్తులను వృద్ధి చేసుకోవచ్చు. తద్వారా శారీరకంగా కూడా బలపడవచ్చు.
చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అనుకునేవారు కూడా జీవితంలో ఎన్నో తీర్లుగా బాధలు పడినవారే. కానీ, విశేషమేమంటే ఆ బాధలన్నీ వారిని మరింత కసిగా ఉన్నత స్థితిలోకి తీసుకొని పోవడానికీ, వారిలోని అనంతశక్తి విస్ఫోటనం కావడానికి దోహదం చేశాయి. ప్రతి దాన్ని సానుకూలంగా ఆలోచించగలిగిన మనసు ఓటమిని, భయాన్ని ఎరుగదు. విజయం అంచుల దాకా నడపడానికి ఏ మాత్రం సంశయించదు. అనూహ్యంగా నా శక్తి సామర్ధ్యాలు పునరుత్తేజం పొందాయి. ఈ రకమైన సానుకూల దృక్పథమే మనం పెంచుకోవలసింది.
సత్యసంధత, నిజాయితీలను పెంచుకోవడం వల్లనే మన మీద మనకు నమ్మకం, మన శక్తి సామర్ధ్యాల మీద విశ్వాసం పెరుగుతాయి. మన మనసుకు శక్తి సామర్థ్యాలను కలిగించేవి కేవలం సత్యసంధత, నిజాయితీలేనని పునరుద్ఘాటిస్తున్నాను. మనల్ని మనం నమ్ముకొంటూ మన మానసిక శక్తి సామర్ధ్యాలు మరింతగా పెరగాలని పరిపూర్ణమైన విశ్వాసంతో నిజాయితీగా ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థనలు ఫలిస్తాయి. “ఓ భగవంతుడా! నన్ను ఈ రోగం బారి నుండి త్వరగా కోలుకునేలా చెయ్” అని బాధల్లో ప్రార్థించడం సాధారణ అంశం. అచంచలమైన భక్తి విశ్వాసాలతో, సత్యసంధత, నిజాయితీలతో కూడిన ప్రార్థన అంతరంగంలోనూ, వెలుపలా చెలరేగే కల్లోల తుఫానును అరికడుతుంది. నిజాయితీగా మనం చేసే ప్రార్థన ఫలిస్తుందని నా అనుభవాలు రుజువు చేశాయి. అవును!. వాస్తవం చెప్తున్నాను.
మన దృక్పథాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచిపెట్టకూడదు. రోగానికి చికిత్స జరుగుతున్న సమయంలో ఎన్నో ప్రతికూల ఆలోచనలు, నిస్సహాయత, అయోమయ భావాలు, నిరాశానిస్పృహలు చెలరేగడం సహజం. కానీ, వాటన్నింటిని అధిగమించి తీరాలి. అందుకు తేజఃపూరితమైన సదాలోచనలతో మనస్సును ప్రకాశమానం చేసుకోవాలి. సంతోషకరమైన, ఆహ్లాదకరమైన జీవితానుభవాలను నెమరు వేసుకోవాలి. బలహీనమైన మనస్సు దయ్యాల కొంప. అదే నిరాశ స్పృహలనిలయం. అందుకు ప్రతిగా సానుకూల, ఆశావహ భావాలతో, సదాలోచనలతో, మన శక్తి సామర్థ్యాలతో ఎలాంటి ప్రతికూల అంశాలకు ప్రవేశం లేకుండా మనస్సులో దుర్భేద్యమైన గోడను నిర్మించుకోవాలి. మనలోకి ప్రతికూల భావా లేవీ ప్రవేశించి సతమతం చేయకుండా నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. ప్రతికూల ఆలోచనలు నూటికి నూరు శాతం లేకుండా చేసుకోలేకపోవచ్చు. కానీ, చేయాల్సిన ప్రయత్నం మాత్రం అదే.
నా మూడో కీమోథెరపీ తరువాత నేను చాలా బలహీనురాలిని కావడంతో నాలో కొద్దిపాటి ఆత్మన్యూనత ప్రవేశించినట్లు అనిపించింది. అన్నం సహించకపోవడంతో కొన్ని రోజులపాటు చాలా చికాకుతో ఉన్నాను. కానీ, ఇదంతా తాత్కాలికమే. అనూహ్యంగా నా శక్తి సామర్ధ్యాలు పునరుత్తేజం పొందాయి.
నేను జీవించి తీరాలన్న కాంక్షకు నా సానుకూలశక్తి మరింత ఆజ్యం పోసినట్లయింది. నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను. ఆరాధిస్తున్నాను. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించదలచుకున్నాను. నిజానికి ఇది కాదనే వారెవరు? నా బాల్యం నుంచి నేను చాలా చురుకైన దాన్ని. ఉల్లాసం, చిలిపిదనం, వాచాలత్వం అన్నీ నాలో కాస్త ఎక్కువే ఉండేవి.
“నాకే ఎందుకు రావాలి?” అనే ప్రశ్న; “ఎవరూ లేరు. ఒంటరి వాడనైపోయా”నన్న చింత; “ఇక ఈ రోగం నన్ను బలి తీసుకుంటుం”దన్న వేదన మిక్కుటమవుతుంది. కొన్నిసార్లు ఏదో కోల్పోయానన్న బాధ, పూర్తి ఏకాకితనం మనసంతా నిండిపోవడంతో పూర్తిగా క్రుంగిపోతారు. ఎవరు ఏ సలహా ఇచ్చినా పట్టించుకోరు. దేవుడు తన మీద దయ చూపలేదనీ, అన్యాయం చేశాడని ఏడుస్తూ దేవుని నిందిస్తుంటారు. ఇవన్నీ నిజాలే. కాదనలేని సున్నిత అంశాలే. పూర్వజన్మలో ఏదో పాపం చేశాను. అందుకే భగవంతుడు ఇలా శిక్షిస్తున్నాడు అన్న భావాలు మనసులో పెంచుకుంటారు. ఇవన్నీ అశాస్త్రీయమైన, ఆధారరహితమైన, అహేతుకమైన ఆలోచన విధానాల నుండి వచ్చేవే. “చెడ్డ” కాలం అనేది ఎవరికైనా, ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. మనం అనుకూలమైనా, ప్రతికూలమైనా- ఎలాంటి పరిస్థితినైనా అనుభవించాల్సిందే. ఎదుర్కోవాల్సిందే. అందుకు కావలసింది కల్మషం లేని శక్తి, ధైర్యం మాత్రమే. మహానుభావుడు, ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన శ్రీ రామకృష్ణ పరమహంస కూడా “క్యాన్సర్” పీడితుడే. ఆయన కూడా జీవితంలో కష్టాలనెదుర్కొన్నాడు. సుఖాలను అనుభవించాడు. ఆయన ఆలోచనారీతి, పరిణతి మనకన్నా గొప్పవే, అసాధారణమైనవే నన్నది వాస్తవమే. మనం కేవలం మామూలు మనుషులం. ఎప్పుడు, ఏం జరుగుతుందో ఏదీ ఊహించలేం. ఏది, ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిని నిందించడం లేదా తనను తాను నిందించుకోవడం, మన మనసును దయ్యాలకొంపగా మనమే మార్చుకున్నట్లు అవుతుంది.
రోగాల బారిన పడటం అనేది నేరమేమీ కాదు. శరీరం ఉన్నంతకాలం రోగాలు వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. వాటిని ధైర్యంగా, స్థిర సంకల్పంతో ఎదుర్కోవడమే మనం చేయవలసిన పని. తుఫాను వచ్చి మనలను ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. గందరగోళం పాలు చేయవచ్చు. కానీ కాసేపు అయ్యాక దానంతటకు అదే తగ్గిపోతుంది అన్న విషయం కూడా మరిచిపోకూడదు. ఆ సమయంలో మనం ప్రశాంతంగా మన ఇంటిని, మన పరిసరాలను జాగ్రత్తగా చూసుకుంటే సరి. అట్లాగే ఆరోగ్యం త్వరగా కుదుటపడడానికి తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు పాటించాలి. మందులు ఇంజక్షన్లు మాత్రమే కాక ఒక సానుకూల స్ఫూర్తిని కూడా పెంపొందించుకోవాలి. తక్కువ అవుతుందన్న ఆశతో, విశ్వాసంతో జీవించాలి కూడా. నా సొంత అనుభవమే చెప్తాను. ఇంత తీవ్రమైన క్యాన్సర్ బారిన పడిన నేను ఒక్కసారి కూడా “అయ్యో! నాకే ఎందుకు వచ్చింది” అని బెంబేలు పడలేదు. కీమోథెరఫీ మందు ఒక్కొక్క చుక్క నా నరంలోకి ఎక్కుతుంటే, అంతే వేగంగా కోలుకుంటున్న భావన కూడా పెంచుకున్నాను. ప్రతి సూర్యోదయం, ప్రతిరోజు నా విశ్వాసాన్ని పెంపొందించాయే తప్ప ఎక్కడ కుంగిపోలేదు. పైపెచ్చు నాలో ఉత్సాహం ఇనుమడించసాగింది. నాకు ఇంకా గుర్తుంది ఒక పెళ్ళికి వెళ్తున్నట్లుగా, ఒక ఉత్సవానికి వెళుతున్నట్లుగా మంచి అందమైన చీరలు, నగలు ధరించి సంతోషంగా హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. నా వస్త్రాలంకరణ చూసి, నా ఉత్సాహాన్ని చూసి అందరూ నన్ను ప్రశంసించేవారు. అప్పుడు ఎంత సంతోషం వేసేదో! ఇప్పటికి గుర్తుంది. నేను ఆసుపత్రికి చికిత్స కోసం పోతున్నానని ఏనాడూ భావించలేదు. నా తరువాత చేరిన కొత్త రోగులకు నా అనుభవాలు చెబుతూ వారిలో ఒక స్ఫూర్తినీ, చైతన్యాన్నీ కలిగించే దాన్ని. నేనూ పొందేదాన్ని. చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ క్యాన్సర్ వైద్యుడిని నేను ఇంటర్వ్యూ చేసిన సంగతి నాకు గుర్తుంది. నా అనారోగ్యకాలం గుర్తుంచుకోగలిగినది. అట్లాగే ఎంతో ఆహ్లాదకరమైందీ. ఈ క్యాన్సర్ రోగిగా నేను పొందిన అనుభవం ఇకముందు నన్నెప్పుడూ బాధించజాలదని నిర్భయంగా చెప్పాను. డాక్టర్లు నా ఆత్మశక్తిని గుర్తించి కరతాళ ధ్వనులు చేసి అభినందించారు. ఏమన్నా అనుకోండి. ఉన్నదున్నట్లుగా చెప్పాలంటే ఎప్పడూ దాపరికం లేదు. ఎక్కడా పశ్చాత్తాపం లేదు. ఎవరిపట్లా ఫిర్యాదులు లేవు. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే అంత సులువుగా ఎవరెస్ట్ ఎక్కారా? ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారు?. అలా లెక్కలేనన్ని ఆటంకాలకు గురయితేనే తప్ప విజయ శిఖరాన్ని వారు అధిరోహించలేరు. వారు ఏది అసాధ్యం కాదని ప్రపంచానికి నిరూపించారు.
దృఢ సంకల్పం, అచంచల దీక్ష, విజయకాంక్ష ఉన్న మానవుడు దేనినైనా సాధించగలడు. ధైర్యవంతుని నిఘంటువులో ‘అసాధ్యం’ అనే పదానికి చోటు లేదు. ప్రియమిత్రులారా! ఈ రోజుల్లో వైద్యరంగం క్యాన్సర్ చికిత్సలో ఎంతో విప్లవాత్మకమైన పురోగతిని సాధించింది. ఇమ్మ్యునోథెరఫీ, రోబోటిక్ సర్జరీ ఇంకా లేజర్ సర్జరీలను కనుగొన్నాక చికిత్స విధానం మరీ సులువైంది. నా ప్రియమిత్రులకు విన్నవించుకుంటున్నాను. సానుకూలమైన శక్తితో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోండి. దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవడంలో మానసిక శక్తి, పట్టుదలల ప్రాధాన్యమెంతో ఉంటుంది. కానీ అసాధ్యం, వైఫల్యం అనేది ఉండదు. ఇక నా సంగతి అంటారా? నేను ఎలాగైనా బతకగలనని నాకు తెలుసు. స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలిగించే నా నినాదాలు ఇవే.
నేను చేయగలను!.
నాకే సాధ్యం.!!
తప్పనిసరిగా నేనే చేస్తాను!!!.
ఉపసంహారం
ఒక్కసారి నా జీవిత ప్రస్థానాన్ని గమనిస్తే ఎన్నో ఒడిదుడుకులు, శుభాశుభాల అనుభవాలతో ఉత్తేజపూరితంగా సాగిందని చెప్పవచ్చు. ఒక కూతురిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా నా పాత్రను నేనెంత పరిపూర్ణంగా పోషించానో నాకు తెలియదు కానీ, నా కుటుంబ సభ్యుల విశ్వాసాన్ని మాత్రం పొందగలిగానని నిస్సంకోచంగా చెప్పగలను. ఎన్నెన్నో మధురస్మృతులు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మా నాన్న అనారోగ్య సమయంలో నేను వెళ్లి జాగ్రత్తగా చూసుకున్నానన్న కృతజ్ఞతాభావం ఆయన కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపించేది. నాకు ఇంకా గుర్తుంది అకస్మాత్తుగా నేను వెళ్ళి టీ కప్పు అందించినప్పుడు ఆయన ముఖం ఎంతగా వెలిగిపోయేదో! ఒక సందర్భంలో మా ప్రొఫెసర్ గారింట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆలస్యంగా ఇల్లు చేరాను. నాన్న గారితో తిట్లు తప్పవు అనుకున్నాను. మా నాన్నగారి మనస్తత్వాన్ని బాగా తెలిసిన ఆ ప్రొఫెసర్ ఒక పుస్తకాన్ని నాకిచ్చి నాన్నగారికి అందజేయమన్నారు. అదొక ఇంద్రజాలంలా పని చేసింది. వేడి వేడి టీ కప్పుతో పాటు, ఆ పుస్తకాన్ని అందజేశాను. నాన్నగారి ముఖంలోని చిరునవ్వు చూసి ఎంత ఊరట చెందానో! మా అమ్మమ్మ మా అమ్మను నా సంరక్షణకు వదిలేసిందని నేను ఇంతకుముందే చెప్పాను. ఒకరోజు Bedpan ను అమ్మ కిందకి సరిగా ఉంచడానికి కష్టపడుతున్నాను. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చివరకు నా ప్రయత్నం ఫలించింది. నా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అపారమైన అభిమానంతో నా తల్లిదండ్రులను, అత్తమామలను, ఆడపడుచులను, బావమరుదులను అందర్నీ గుర్తు చేసుకుంటున్నాను. వారంతా నా పట్ల ఎంతో ఆత్మీయంగా వ్యవహరించారు. నేను కూడా నా స్థాయిలో వారందరినీ గౌరవాదరాలతో చూశాను.
నా తమ్ముడు చందన్ 2014లో చనిపోయాడు. హతాశురాలినయ్యాను. ఊపిరితిత్తుల వ్యాధి (Fibrosis) కి గురయ్యాడు. కలకత్తాలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చాం. తన పుట్టినరోజు నాడు చేసే ‘భాయి పోట’ చేయమన్నాడు. సోదరి తన సోదరుని నొసట చందనపు తిలకం దిద్ది అతని అభివృద్ధికి ప్రార్థించడం, ఆరోజు తమ్ముని/అన్నను ఇష్టమైన వంటకాలతో ఆనందింపచేసే ఉత్సవాన్ని బెంగాల్లో ‘భాయి పోట’ అంటారు. అప్పుడు నేను, మా తోటి కోడలు రత్నతో కలిసి ఉంటున్నాను. రత్న మావారి తమ్ముడు స్వపన్ భార్య. ఆమె కూడా సోదరి వరుసే అవుతుంది. ఎంతో ఉల్లాసంగా తాను కూడా చందన్ నొసట తిలకం దిద్దడానికి ఉబలాటపడింది. ఆమె చందన్ కోసం ప్రత్యేకంగా వండుకొని తీసుకొచ్చింది. అతను ఎంతలా సంతోషపడ్డాడో! హాస్పిటల్‌లో జరిగిన ఆ చిన్నపాటి ఉత్సవానికే చందన్ తన సంతోషాన్ని ఆపుకోలేక చిన్నపిల్లవాడిలా ఎగిరి గంతేశాడు. చందన్ అంటే నాకెంత ప్రేమ. నాకన్నా ఒకటిన్నర సంవత్సరాలు చిన్న. నా చిన్ననాటి ఆటపాటలు, సంతోషాలన్నీ అతనితోనే గదా! ఎదురుగదిలోని రోగులు కూడా వచ్చి చేరారు. నేను, రత్న వారికి స్వీట్స్ పంచిపెట్టాం. వారు మహమ్మదీయులు కనుక తిలకం పెట్టడానికి వీలుపడలేదు. అయినా వారు కూడా ఎంతో సంతోషపడ్డారు.
చెల్లెలు మాల దుర్మరణం మాకందరికీ పెను విషాదం. దిగ్భ్రాంతికరం. ఇది అగ్ని ప్రమాదం. చీర అంటుకొని ఒళ్లంతా కాలిపోయి వారం రోజులు మృత్యువుతో పోరాడి అస్తమించింది. ఒక చలికాలం మధ్యాహ్నం ఇది సంభవించింది. ఈ సంఘటన మా జీవితాల్లో చాలాకాలం పాటు శూన్యాన్ని మిగిల్చి వెళ్లింది. మరణానికీ, దురదృష్టానికీ మనం ఎందుకు బలి అవుతాం? ఇలాంటి తాత్విక ప్రశ్నలు నన్ను బాగా వెంటాడేవి. నా నిత్యకృత్యాలైన వంట, ఇంటిశుభ్రత లాంటి పనుల్లో పడి వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించేదాన్ని. నేను మళ్ళీ మామూలు స్థితిలోకి రావడానికి చాలాకాలం పట్టింది.
నాన్నగారు 1992లో స్వర్గస్థులయ్యారు. అప్పుడు బారక్‌పూర్‌లో ఉన్నాను. కొంతకాలంగా నాన్నగారు అస్వస్థులుగా ఉన్నారు. ఒక నెలరోజులన్నా పుట్టింట్లో నాన్నగారి వద్ద ఉండడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒక మధ్యాహ్నంపూట నాకు అసాధారణమైన అనుభవం కలిగింది. నేను మధ్యాహ్న భోజనంలో చేపలు వండాను. మావారికీ, పిల్లలకు ఎంతో సంతోషం వేసింది. నేను తినడానికి కూర్చొని ఆ చేపను నా చేత్తో పట్టుకున్నాను. కానీ ఎన్నడూ లేని విధంగా అసహ్యం ఎందుకు దాని పట్ల కలిగిందో కానీ పక్కకు పారేశాను. ఒక గంట గడిచిందో లేదో జమాయిబాబు ఫోన్ చేసి మావారికి నాన్నగారు చనిపోయిన విషయం చెప్పారు.
నా హృదయం బద్దలైంది. ఇంత త్వరగా చనిపోతారని అనుకోలేదు. అరగంటలో సర్దుకొని రైల్లో బెర్హాంపూరు బయలుదేరాం. తెల్లని వస్త్రంలో నాన్నను చుట్టారు. గ్రీకుదేవత పోలికలతో ఉన్న ఆ ముఖం పూర్తిగా కృశించి, కుంచించుకపోయింది. కానీ ఆ ముక్కు మాత్రం అంతే అందంగా ఉంది. నాన్న గారు బహుముఖప్రజ్ఞాశాలి. దార్శనికుడు. వక్త, విద్వాంసుడు. నాపాఠశాల రోజులనుంచి నాకు ఆదర్శమూర్తి.
నా కుటుంబం నా ముగ్గురు పిల్లల పెళ్లిళ్లతో విస్తరించింది. బాధ్యతలు కూడా మూడింతలు పెరిగినా, మా ఇల్లు ఇద్దరు మనుమరాళ్ళతో, ఒక మనుమనితో సంతోషంతో కళకళలాడుతుంది. మా కోడళ్ళిద్దరు మంచి కుటుంబం నుండి వచ్చారు. పట్టువిడుపులతో, కలుపుగోలుగా, సంసారపక్షంగా ఉంటారు. నా సంతానమంతా పెళ్లిళ్లు చేసుకొని అనుకూలదాంపత్యంతో సుఖంగా ఉండడం భగవంతుడు నాకు ప్రసాదించిన గొప్పవరం. మేమంతా ఒక్కటే. ఎలాంటి చీకుచింతలు లేవు. ఎవరు ఎవరికీ పెట్టాల్సిన పనీలేదు. ఎవరు ఎవరినీ చూసుకోవాల్సిన పనీ లేదు. అమర్త్య, శ్రేయ ఇద్దరు బెంగుళూరులో స్థిరపడడంతో నేను మావారు బారక్‌పూర్ నుంచి బెంగుళూరుకు తరచుగా వెళుతుంటాం. అమర్త్య కూతురు అంటే నాకు ఎంతో ప్రేమ. అది వట్టి అమాయకురాలు. దానికి అందరూ కావాలి. అతి ప్రేమ. సుప్రతిం కొడుకు గోపాల్. నేను వాడిని ‘కిడ్డో బాబ’ అని ముద్దుగా పిలుచుకుంటాను. పోలికలన్నీ శ్రీకృష్ణుడివి. బాలకృష్ణుని అవతారం లాగా నా కంటికి కనిపిస్తాడు. అందరూ చక్కగా ఉన్నారు. శ్రేయ కూతురు గుంగున్‌కు చిన్నప్పటి నుంచి వినయం ఎక్కువ. ఒకచోట కాలు నిలువదు. తోటి పిల్లల్లాగా బొమ్మలతో ఆడుకోదు. అసాధారణమైన తెలివితేటలు దానికున్నాయి.
నా పాఠశాల దినాలు, కాలేజీ జీవితం చాలా ప్రీతిపాత్రంగా గుర్తు చేసుకుంటాను. చిన్న వయసులో అమ్మ అనారోగ్యం కారణంగా నా భుజస్కంధాల మీద పడ్డ కుటుంబ బాధ్యతలు ఒకవైపు; నా విద్యాభ్యాసం ఒకవైపు; రెంటినీ సరిపోల్చుకుంటూ ఆ రోజుల్లో నేను ఒంటిచేతిమీద ఎలా నిర్వహించగలిగానా అని గుర్తు చేసుకొంటూ ఉంటాను. కిరాణా షాపులో సామాను తెచ్చుకోవడం, కూరగాయలు తేవడం, అమ్మ అవసరాలు చూడడం, తమ్ముడినీ, చెల్లెలినీ చూసుకోవడం, నానమ్మ పోయాక, నాన్నకు కూడా నేనే తల్లినై బాధ్యతలు నిర్వహించడం – ఎప్పుడూ నా కళ్ళ ముందు కదలాడుతుంది ఒక చిన్న చిరునవ్వుతో ఆ బాధ్యతలను విజయవంతంగా మోశానన్న సంగతి తలుచుకొంటే నా కళ్ళు మెరుస్తాయి.
2019లో ముషీరాబాద్ రఘునాథ్ గంజి పాఠశాలలోని ప్రముఖ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అసిత్ కుమార్ మండల్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన క్రమశిక్షణకు, మంచితనానానికి పెట్టింది పేరు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా నా చిన్నప్పటి సహాధ్యాయులు శ్రీమతి అలోకనంద చక్రవర్తి, శ్రీమతి నందిని బారువాలను కలిశాను. వారితో నా చిన్ననాటి ముచ్చట్లు ఇష్టంతో చెప్పుకుంటాను.
నేను క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా డాక్టర్లతో పరీక్షలు చేయించుకుంటాను. ఇది మాత్రం కచ్చితంగా పాటించాలి. నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్‌గా డాక్టర్లకు చూపెట్టుకోవాలి. నేటికి పదునాలుగేళ్ళ గడిచాయి (2020 నాటికి). ఎన్నో భిన్నభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను నిరంతరం తలమునకలై, నా జీవితాన్ని సంతోషంగా చురుగ్గా గడుపుతూ ఉన్నాను. మొత్తం మీద ఒక మాటలో చెప్పాలంటే నాదొక ఆనందకరమైన జీవన ప్రస్థానం.
నా జీవితంలో ఎంతో సహాయ సహకారాలు అందించిన గొప్ప/మంచివారిని చూశాను. ఎంతో దయ దాక్షిణ్యాలు చూపి ప్రగతికి తోడ్పడిన వారిని చూశాను. అలాగే దుర్మార్గులను చూశాను. ఏ అనుభవం కూడా చిన్నది కాదు. అవమానకరమైనదీ కాదు. మామూలు సంఘటన సైతం ఏదో ఒకటి మనకు నేర్పుతుంది. అనుభవాల సమాహారమే జీవితం. అనుభవాలే నా జీవితాన్ని, నా గుణశీలాలను ఉదాత్తంగా మలిచి ఒక నిర్భయశీలిగా నన్ను తయారుచేశాయి. ఇప్పుడు నేను దేనినైనా ఎదుర్కోగలను.
నాకు మరికొంత ఆయుర్దాయాన్ని ప్రసాదించిన భగవంతుని అపారకరుణకు ముందుగా నా కృతజ్ఞతలు. నేను అన్ని రకాల సత్కర్మాచరణలకు, పదిమందికి మేలు చేసే పనులకు పునరంకితం కావాలని భావిస్తున్నాను. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఇంకా ఎంతో చేయవలసి ఉంది. మనకున్నది ఒకే జీవితం. ఈ జీవితకాలంలోనే సాధ్యమైనన్ని మంచి పనులు చేయాలి. మన ఈ ప్రపంచం పరస్పర విశ్వాసం, ప్రేమ సౌభాత్రాల స్వర్గధామం కావడానికి మనవంతు మనం కృషి చేద్దాం. ప్రముఖ అమెరికా కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ఆంతర్యాన్ని మరోసారి మననం చేసుకుందాం. “మన కళ్ళముందే, మనం ఉన్నప్పుడే మరొక మంచి ప్రపంచాన్ని నిర్మించుకుందాం.”
(సమాప్తం)
శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ ప్రకృతి వనరులకు నిలయమైన సుందర రాష్ట్రం అస్సాంలో పుట్టిపెరిగారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి (బి.ఎ. ఆనర్స్) డిగ్రీ చేశారు. మేఘాలయ లోని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU) నుంచి బి.ఎడ్. చేశారు. రామకృష్ణ వివేకానంద మిషన్ లోనూ, బారక్‍పూర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తూ కథలూ, కవితలూ రాస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారు.
‘Peeping Through My Window’ (ఆత్మకథ)ను విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్, 2022లో ప్రచురించింది. ఈ ఆత్మకథలో కావేరి ప్రధానంగా తాను బ్రెస్ట్ కాన్సర్‍పై చేసిన పోరాటాన్ని తెలిపారు. ‘The Twilight Bells’ (తొలి కవితా సంపుటి) 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘The Bindupara Tales & The Four-Lettered Word Love’ (కథాసంపుటి) డిసెంబరు 2022లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైంది. ‘Apparitions from the other World’ (అతీత అనుభవాల తొమ్మిది కథలు) పుస్తకాన్ని 2023లో పెన్‌ప్రింట్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది.
కావేరీ చటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ లోని బారక్‍పూర్‍లో నివసిస్తున్నారు.