Site icon Sanchika

ఆవిడ – ఆయన

[box type=’note’ fontsize=’16’] పద్మావతి మనస్సు ఆవేదనలో పడి కొట్టుకుంటోంది. కారు, పార్కింగ్ దాటి మెయిన్ గేట్ దాటబోతుండగా ఆ చీకట్లో ఎవడో వచ్చి డ్రైవింగ్ సీట్లో ఉన్న సూర్యారావుకు ఏదో అందించాడు. అదేంటో తెలుసుకోవాలంటే గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు కథ “ఆవిడ – ఆయన” చదవండి. [/box]

[dropcap]ఆ [/dropcap]సాయంత్రం పెందుర్తి దగ్గరున్న ‘ది నాటింగ్ హౌస్’ గార్టెన్‌లో ఆ పెళ్ళి తాలూకు సంగీత్ కార్యక్రమం జరగబోతోంది. గార్డెన్ మధ్యలో పెద్ద అధునాతన భవనం ఉంది. దాంట్లోనే ఆ మర్నాడు రాత్రికి పెళ్ళి.

ఈ భవనం చుట్టూ ఉన్న చాలా విశాలమైన లాన్ లోనే ఆనాటి సంగీత్ ఏర్పాటయ్యి ఉంది. ఆ ప్రదేశమంతా మల్లె, బంతి పూల దండలతో పందిరి అల్లబడి ఉంది. అక్కడ వెయ్యబడ్డ కుర్చీలు, సోఫాలకు… ఎదురుగా వేదిక ఒకదానిని ఏర్పాటు చేశారు. అది కూడా చాలా ఖరీదుగా అలంకరించబడి ఉంది. హోం థియేటర్ తాలూకు తెర కూడా ఒకటి అక్కడ ఏర్పాటయ్యింది. లాన్ లోకి ప్రవేశించగానే అతిథులకు అందుబాటులో ఉండేటట్లు రకరకాల స్వీట్లు, హాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం స్థలమంతా ఫ్లడ్‌లైట్ల కాంతిలో పట్టపగలులాగా వెలిగిపోతోంది.

ఈ కుర్చీలకు వెనకాల దూరంగా మసక చీకటిలో మద్యం సీసాలు, విదేశీ సిగరెట్లు, ఐసుబాక్సులు ఉన్నాయి. ఒక మినీ ఫ్రిజ్‌లో సోడాలు సర్దుతూ చురుకైన కుర్రాళ్ళు అక్కడ కదులుతున్నారు. అక్కడ ‘హెవెన్’ అని చిన్న బోర్డు ఒకటి ఆ టేబుల్‌కు వేలాడుతోంది.

క్లారినెట్లు, డ్రమ్ములు, కీబోర్డులు, ఒక యువతీ యువకుల గాయకుల జంట – వీటితో ఒక వాద్య బృందం ఈ ‘హెవెన్’ టేబుల్‌కు దూరంగా సిద్ధంగా ఉంది.

పెళ్ళికొడుకు ఇన్‌కమ్‍ టాక్స్ ఆఫీసర్ కొడుకు. వాళ్ళది విజయవాడ. పెళ్ళికూతురు విశాఖపట్నంలో చిన్న కార్ల షోరూం యజమాని కూతురు.

8.00 గంటలకు రిసెప్షన్ మొదలు. ఐతే 7.30 గంటలకే అతిథులు రావడం మొదలుపెట్టారు. చాలా మంది ఖరీదైన మనుషులే. వధూవరుల తల్లిదండ్రులు లాన్ గేట్లో నుంచొని అతిధులను ఆహ్వానిస్తున్నారు. పాత పరిచయాలను పైకి తవ్వుకుంటూ వారిలో వారికి కూడా పరిచయాలు ఏర్పరుస్తున్నారు.

ఇంతలో, సింగిల్ షోల్డర్ జాకెట్, అతి పల్చని హాండ్ వర్క్ షిఫాన్ చీరల్లో భార్య, సఫారీ సూట్లో మామూలుగా ఉన్న ఆమె భర్త వచ్చారు.

పెళ్ళికొడుకు తండ్రి, వాళ్ళని అక్కడ ఉన్న అతిథులకు పరిచయం చేశాడు: “మా బావమరిది సూర్యారావు, అతని భార్య పద్మావతీనండి. ఈయన విజయవాడలో బ్యాంకు మేనేజర్” అన్నాడు.

వాళ్ళిద్దరూ ముందుకు సాగుతూ ఉండగా వెనకాలనుంచి ఎవరో “మాధురీ దీక్షిత్ అనుకున్నానురా” అనడం వినబడి పద్మావతి వెనక్కి తిరిగి చూసింది. ఆమె మొహంలో గర్వ రేఖ తొణికిసలాడింది. ఆ దంపతులు ముందుకు వచ్చి రెండో వరుస సోఫాల్లో కూర్చున్నారు.

వాద్య బృందం లవ్ సాంగ్స్ వాయించడం మొదలయ్యింది. ఎవరో యువకుడు స్టేజీ మీదకు వచ్చి “హియర్ కమ్ ది హీరో అండ్ ది హీరోయిన్” అన్నాడు. అందరూ అటువైపు చూసారు. హాండ్‌వర్క్ షేర్వాణీలో పెళ్ళికొడుకు, మెరిసిపోయే దుస్తుల్లో పెళ్ళికూతురు వస్తున్నారు.

పద్మావతి చటుక్కున లేచి వెళ్ళింది. ఆ పెళ్ళికూతురు చెయ్యి పట్టుకుని స్టేజి మీదకు ఆమె నడిచింది. స్టేజి పైనుంచి వాళ్ళమీద పూల వర్షం కురిసింది. అందరూ చప్పట్లు కొట్టారు. కెమెరాలు క్లిక్కుమన్నాయి. స్టేజిమీదే ఉన్న సోఫాలో వధూవరులు కూర్చున్నారు. పద్మావతి అక్కడే వేళ్ళాడసాగింది. వధూవరుల తల్లిదండ్రులు స్టేజిమీదకొచ్చారు. ఇందాకటి యువకుడు మైకులో వాళ్ళని అతిధులకు పరిచయం చేసాడు. చేస్తూ, చేస్తూ “మీరెవ్వరు” అన్నట్లు పద్మావతి వైపు చూసాడు. పద్మావతి చటుక్కున స్టేజి దిగి కిందికి వచ్చింది. భర్త పక్కకు వచ్చి కుర్చుంది.

“ఇప్పడు వధూవరుల పరిచయం” అన్నాడు ఆ అనౌన్సరు. వధూవరులిద్దరూ స్టేజి దిగివచ్చి క్రింద మొదటి వరసలో సోఫాలో కూర్చున్నారు. వెంటనే తెర కిందనుంచి సూర్యబింబము, కిరణాలు పైకి తెరమీదకి ప్రసరించాయి. తెరమీద వరుడు బాల్యం నుంచి పెద్దయ్యేదాక తియ్యబడిన ఫోటోలు వరుసగా దర్శనమిచ్చాయి. ఆ తరువాత తెర కిందనుంచి పద్మం ఆకారంలో కిరణాలు ప్రసరించాయి. వధువు బాల్యంనుంచి తియ్యబడిన ఫోటోలు వరుసగా వచ్చాయి.

అతిథుల్లోంచి యువతీ యువకుల జంటలు స్టేజి మీదకు రావడం, బ్యాండు పాటకు అనుగుణంగా నాట్యంచేయడం మొదలయ్యింది.

కూర్చుని ఉన్న ఆడవాళ్ళలో నడివయసు వాళ్ళు ముగ్గురు ‘హెవెన్’ దగ్గరకు వెళ్ళి గ్లాసుల్లో విస్కీ తెచ్చుకుని కూర్చుని కొద్ది కొద్దిగా చప్పరిస్తున్నారు.

అరగంట తరువాత వధూవరులు స్టేజి ఎక్కారు. వాళ్ళని చూసి బ్యాండులో హుషారు వచ్చింది. కొత్తపాట మొదలైంది..

ఇష్ లిబే జిష్
ఐ లవ్ యూ
యా లుబ్ లుబా
ఐ లవ్ యూ
ఇష్క్ హసిన్
ఐ లవ్ యూ
ఇష్క్ హై నె
ఐ లవ్ యూ
నువ్వుంటే ప్రేమ నాకు
ఐ లవ్ యూ
ప్రీతిం కరోమి తుభ్యం
ఐ లవ్ యూ
నాను నిన్ను ప్రీతిస్తిని
ఐ లవ్ యూ
వటాషి ఎయ్ షిమాస్యు అనేటా
ఐ లవ్ యూ….

ఇట్లా గాయనీ గాయకులు ఇవే వాక్యాలు మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు. జిష్, హ, తుభ్యం అన్నప్పుడు ఆ గాయని, తన గొంతులో… ఏకాంతంలో వచ్చే రతికూజితం ధ్వనిని (మూలుగు) జీరగా పలికిస్తోంది. వధూవరులిద్దరూ దగ్గర కొస్తున్నారు. విడిపోతున్నారు. చేతులు కాళ్ళు విసిరేస్తున్నారు. చటుక్కున కౌగిలించుకుంటున్నారు. వీపులు ఆనించుకొని పక్కవాటుగా ముద్దు పెట్టుకుంటున్నారు. పదినిమిషాలైంది. క్రమంగా వాతావరణం వేడెక్కింది. కుర్చీలోంచి కుర్రకారు స్టేజీ ప్రక్కకు వచ్చి చప్పట్లు కొట్టడం మొదలైంది.

విస్కీ తాగుతున్న ఒక మహిళ ఆ గ్లాసుతోనే వచ్చి ఆ కుర్రవాళ్ళతో కలిసి స్టెప్పులేయ్యడం మొదలు పెట్టింది. పద్మావతి చటుక్కున లేచింది.

భర్త సూర్యారావు “ఎక్కడికి?” అన్నాడు.

పద్మావతి “హెవెన్!” అంది.

“వద్దు, కూర్చో.”

“ఏం అందరాడాళ్ళు తాగుతున్నారు, నేను కూడా కొద్దిగా సిప్ చేస్తే నష్టమేమిటి?”

“అందరూ తాగట్లేదు. చాలా మందికి ఆ వాసన పడదు. ఈ తాగే ఆడవాళ్ళు ఆర్మీ ఆఫీసర్ల భార్యలు. వీళ్ళకు ఇళ్ళల్లో అలవాటు ఉందేమో, మనకి ఏ అలవాటు లేదు. మన సామాన్యులం. కూర్చో.”

పద్మావతి మొఖం ఎర్రబడింది, “ఎక్కడకు వచ్చినా ఇదే గోల. నలుగురిలాగా డ్రస్సులొద్దు. నలుగురిలాగా తిరగవద్దు. అసలు నలుగురిలో నవ్వవద్దు… ఇవే కండీషన్లు! స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. చీ, చీ… నేను వెళతాను.”

“నీ ఇష్టం!”

పద్మావతి చటుక్కున లేచి “హెవెన్’ దగ్గరకు వెళ్ళింది.

ఆ చుట్టూ తిరుగుతూన్న ఇద్దరు ముగ్గురు మొగాళ్ళు మెల్లిగా ఆమె వైపు వెళ్ళడం, ఆమెతో మాటలు కలపడం చూసాడు సూర్యారావు.

పావుగంట గడిచింది..

వధూవరులు దిగిన తరువాత స్టేజి మీదకి అతిథుల జంటలు వచ్చి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు.

బ్యాండు గాయనీ, గాయకుల్లో హుషారు ఇంకా పెరిగింది. ‘అ అంటే అమలాపురం’, “లే లే లే నా రాజా’, ‘ధూమ్ ధూమ్’ అంటూ పాటలు చెరిగిపారేస్తున్నారు. ఇంకో ముగ్గుర్ని తమ పార్టీలో కలుపుకున్న ఆ విస్కీ మహిళలు కూడా తమ భర్తలతో వచ్చి డ్యాన్సర్లలో కలిసారు. ఇంక కౌగిలింతలే కౌగిలింతలు! ఒక దశలో, స్టేజిమీద ఏ భర్తని ఏ భార్య ముద్దపెట్టుకుంటోందో సూర్యారావుకు అర్థం కాలేదు!

ఇంకో అరగంట గడిచింది. సూర్యారావు వెనక్కి చూశాడు. పద్మావతి తన చుట్టూ నలుగురైదుగురు కుర్రాళ్ళను వేసుకుని కువకువలాడుతూ చేతులో విస్కీ గ్లాసుతో అటు ఇటు తిరుగుతోంది. ఆ కుర్రాళ్ళు కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నట్లు సూర్యారావుకు అనిపించింది. చటుక్కున కుర్చీలోంచి లేవబోయి, ఆగిపోయాడు. తన జేబులోంచి సెల్‌ఫోన్‌లోనే మాట్లాడాడు.

స్టేజి మీద ఎవరిదో కవిత్వం నడుస్తోంది:

థింక్ ఆఫ్ హెలెన్ ఆఫ్ ట్రాయ్
లవ్ లైక్ క్లియోపాత్ర టు ఎంజాయ్
ఆర్ కన్సిడర్ లవ్లీ మేడం జాయ్
అండ్ ఫ్లోట్ ఆన్ ప్లెజర్స్ బాయ్

సూర్యారావు మనస్సు కలుక్కుమంది. చరిత్రలో ఆ క్లియోపాత్రా, రాకుమారి మేడం జాయ్‌లు పచ్చి వ్యభిచారిణులు. వధూవరులకు చెప్పవలసింది వాళ్ళ గురించా? అసలిదంతా ఏమిటి, సంస్కారమేనా, భారతీయమేనా? ఇది ఇండియానా, అమెరికానా?

పంచకట్టుతో ఒక పెద్ద మనిషి వచ్చి పద్య రత్నాలు చదవబోయాడు. కుర్రాళ్ళలోనుంచి చప్పట్లు లేచాయి. ఆయన మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు!

స్టేజిమీదకి వధూవరుల తల్లిదండ్రులొచ్చి ఆంధ్రా అబ్బాయికీ, బెంగాలీ అమ్మాయికి పెళ్ళి ఎలా కుదిరిందో పరవశంతో వివరిస్తున్నారు.

హఠాత్తుగా పద్మావతి వచ్చింది. “ఏమండీ, ఇట్రండి!” అంది.

సూర్యారావు “ఏమిటి!” అన్నాడు.

“రండి. ఆ కుర్రాళ్ళ తీరు ఏం బాగుండలేదు… ఒకడేమో ‘మీ రెండో భుజంమీద కర్చీఫ్ కప్పనా మేడం’ అంటాడు. ఈలోపు ఇంకొకడు నా భుజం మీదనుంచి చెయ్యి పోనిచ్చి విస్కీ గ్లాసు అందుకుంటాడు. ఈ లోపల వెనకాలనుంచి ఎవడో ‘అవి ఒరిజినల్సేనా? ట్యూబ్సా?’ అంటాడు. ఛీ, ఛీ, సంస్కారంలేని మనుషులు!”

 సూర్యారావు తాపీగా అన్నారు. “ఏముంది ఇందులో! నలుగురితో కలిసి ఎంజాయ్ చేయడమేగా!”

ముక్కు ఎగబీలుస్తూ పద్మావతి అంది “అదిగాదండీ… అసలు… ఎక్కడి నుంచో ఊడిపడ్డ ఆ ఎర్రగళ్ళ చొక్కావాడు చూసారా… వస్తూనే నన్ను వెనకనుంచి ముద్దు పెట్టుకోబోయాడు”.

“అంతే కదా, అరిగిందా, తరిగిందా!”

కోపంగా అంది పద్మావతి, “ఛత్… అసలు, అది కాదు… ఇంకో రెండో వాడు… ఆ నల్లవాడు ఉన్నాడే… ఏడీ, వాడు.. వాడు ఠక్కున సెల్‌ఫోన్‌తో ఫోటో తీసాడు, మనవాళ్ళందరికీ దాన్ని వాడు ఫార్వర్డ్ చేస్తే నా పరిస్థితి ఏంటి! నెట్లో పెడితే నా బతుకేంటి? నా పరువు ఏంటి?”

సూర్యారావు తాపీగా అన్నాడు. “ఫోటో తీసాడా, హార్నీ! పద పదా!”

ఇద్దరూ వెళ్ళారు. ఆ చుట్టూ వెతికారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళూ కనబడలేదు. పద్మావతికి ఇష్టం లేకపోయినా ఇద్దరూ ఎట్లాగో ఆ బిల్డింగులోకి వెళ్ళి భోజనం అయిందనిపించారు. టైము పది దాటింది.

ఇద్దరూ వచ్చి తమ కారెక్కారు. పద్మావతి మనస్సు ఆవేదనలో పడి కొట్టుకుంటోంది. కారు, పార్కింగ్ దాటి మెయిన్ గేట్ దాటబోతుండగా ఆ చీకట్లో ఎవడో వచ్చి డ్రైవింగ్ సీట్లో ఉన్న సూర్యారావుకు ఏదో అందించాడు.

***

ఇంట్లో నిద్రకు ఉపక్రమిస్తున్న పద్మావతికి ఆలోచనలు వస్తున్నాయి: ‘ఆ ఎర్రగళ్ళ చొక్కావాడిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది… ఆ, ఐదేళ్ళ క్రిందట తాము విశాఖపట్నంలో పనిచేసినపుడు తమ బ్యాంకులో అటెండరుగా వచ్చి చేరిన అప్పారావు కాదూ!… ఇందాకన చీకట్లో కారు దగ్గరకు వచ్చింది కూడా వీడేగా!… వీడిచ్చిందేమిటి?’

పద్మావతి చివాలున లేచి వెళ్ళి భర్త ప్యాంటు జేబు తడిమింది. సెల్‌ఫోన్!… ఇందాకన నల్లటి కుర్రాడు ఫోటో కోసం వాడిన కాషాయ రంగు కేసు సెల్‌ఫోన్!

తన పరువు మీద శ్రద్ధ ఉన్న తనకా, తన భర్తకా? ఆమె ఆలోచనలో పడిపోయింది.

Exit mobile version