భావస్థిరాణి జననాంతర సౌహృదాని – ‘అభిజ్ఞ’ నవలా విశ్లేషణ

11
2

[box type=’note’ fontsize=’16’] డా. నందమూరి లక్ష్మీపార్వతి రచించిన ‘అభిజ్ఞ’ అనే నవలని విశ్లేషిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. [/box]

[dropcap]డా. [/dropcap]నందమూరి లక్ష్మీపార్వతి రచించిన ‘అభిజ్ఞ’ చారిత్రక నవల విశేషాంశాలను పరిశీలించే ముందు – ‘కాళిదాస జ్ఞానరత్న పురస్కారం’, ‘కాళిదాసు సంస్కృత విశ్వవిద్యాలయం, రాంటెక్ వారి రాష్ట్రీయ పురస్కారం’ పొందిన పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అమూల్యాభిప్రాయాన్ని తెలుసుకోవడం ఆవశ్యకం –

“నందమూరి లక్ష్మీపార్వతి సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలలో సమానమైన ప్రజ్ఞా పాటవాలు గల ప్రఖ్యాత రచయిత్రి. అనేకమైన ప్రకృతి వర్ణనలతో, భావోద్రేక భరితాలైన సంవాదాలతో (డైలాగ్స్‌తో) ఎన్నో ఐతిహాసికాంశ నిర్దేశాలతో, అడుగడుగునా భారతీయ సంస్కృతి సంసూచన లతో రచించిన ఈ నవల మొదటి నుండి చివరి వరకు పాఠక కౌతుకోత్తేజకంగా అత్యద్భుతంగా నడిచింది. అధికారిక భాషలో చెప్పాలంటే దీనిలో ప్రధానంగా వీర రసమూ, దాని అంగాలుగా శృంగార, అద్భుతాలూ చక్కగా నిర్వహించబడ్డాయి. తాను సాధించ దలచిన కార్యం సాధించటంలో రాజకుమారి చూపిన అకుంఠితమైన ఉత్సాహం వీర రసత్వ స్థితికి చేరి, కాళిదాసులో కూడా సంక్రమించి, పాండిత్య పరంగా పరిణితి చెందింది. ‘అభిజ్ఞ’ అను పేరుతో రచించిన కాళిదాస చరిత్ర పూర్తిగా రచయిత్రి ప్రతిభా నిర్మితమైనది”.. అంటారాయన.

విద్యావతి తన ధీశక్తితో పామరుడైన ‘కాళిగాడి’ని మహా పండితుడైన ‘కాళిదాసు’గా మార్చిన చారిత్రక కథనాన్ని డాక్టర్ లక్ష్మీ పార్వతి గారు తన పాండిత్య ప్రతిభతో మరిన్ని హృద్యమైన సంఘటనలను జోడించి ‘అభిజ్ఞ’ అనే అద్భుతమైన నవలగా మలచారు. తనను కామించి భంగపడ్డ రాజగురువు, తన కొడుక్కి చేసుకొని తద్వారా మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని మహామంత్రి ఆడిన ఆటను తన శేముషీ విభవంతో ముక్కచెక్కలు చేసింది విద్యావతి. చదువు రాని ఒక గొర్రెల కాపరిని విద్వాంసుడని మభ్య పెట్టి ఆమెకు కట్టబెడితే, భర్త మూర్ఖత్వాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించింది విద్యావతి. జరిగిన అన్యాయాన్ని గుర్తించి వలవలా వగచింది. కానీ ధైర్యాన్ని కూడగట్టుకుని జగన్మాతను శరణు వేడింది. ఆ తల్లి దయ వల్ల “మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం….” అనగలిగిన కాళిదాసు తనలోని ఈ మార్పుకు, పునర్జన్మకు కారణభూతురాలైన భార్యలో తల్లినే చూశాడు. మౌనంగా దేశాంతర గతుడైనాడు. తర్వాత అతడు ధారా నగరంలో భోజరాజు ఆస్థానానికి చేరటం, ఋతుసంహారం, మేఘసందేశం కావ్యాలు రచించడం జరిగింది.

ఈ కథలో డా. లక్ష్మీ పార్వతి విద్యావతిని ఒక అద్భుతమైన ‘ధీర’వనితగా చిత్రించారు.

కష్టాలకు కుంగిపోకుండా, రాజకీయపుటెత్తులను గుర్తించి తిప్పికొట్టటం, దేశాలు పట్టి తిరుగుతున్న భర్తను రహస్యంగా అనుసరించమని చారులను ఆదేశించటం, చివరిలో తానే స్వయంగా పురుష వేషధారియై అతన్ని కంటికి రెప్పలా కాచుకోవటం, చిన్నచిన్న ప్రమాదాలను నుండి కాపాడటం… ఆమె లోని మనోధైర్యానికి నిదర్శనం. మెల్లగా గిరిజాదేవిగా పరిచయం చేసుకుంది. రతీదేవిలా ప్రణయ రాగాన్నాలపించింది. వలచి వలపించుకొంది. కుమారసంభవ కావ్యరచనకు అతనికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. నవల ముగింపు మాత్రం రచయిత్రి స్వకపోల కల్పితం.

వ్యాస ప్రోక్తమైన శాకుంతల కథను కాళిదాసు మనోజ్ఞమైన నాటకంగా మలచి మెప్పించిన ఆ ‘అభిజ్ఞానశాకుంతలమ్’ ఆధారంగా ఈ నవలలో ‘అభిజ్ఞ’ (గుర్తు) అని ఒక నాటక సన్నివేశాన్ని ఉత్కంఠ భరితంగా కల్పించారామె. తనకు పరిచయమైన మిత్రుడే తను ప్రేమించిన గిరిజాదేవి అనీ, ఆమే తాను పెళ్లాడిన విద్యావతి అనీ కాళిదాసు గ్రహించేలా ఆ సన్నివేశాల రూపకల్పన చేశారు రచయిత్రి.

నాటక ప్రదర్శన పూర్తయిన తర్వాత ధర్మసేనుడు వేదికపైకి వచ్చి తమ జీవితాలతో విధి ఎలా ఆడుకుందో తెలియజేశాడు. వేదికకు ఒక మూలగా విద్యావతి నిలబడి ఉంది. ప్రేక్షకులు ఆశ్చర్యంగా చూస్తున్నారు, వింటున్నారు. ప్రేక్షకులతో పాటు విభ్రమం నుండి కోలుకోని కాళిదాసుని “ఇంతకీ ఇప్పుడేం చేస్తావ్” అని కొంటెగా అడిగారెవరో.

“చెప్పేదేముంది. దేవతగా ఆమెను ఆరాధిస్తాను. ప్రేయసిగా ఈమెను ప్రేమ వనంలో విహరింప చేస్తాను. అప్పుడు ఇద్దరికీ న్యాయం జరిగినట్లేగా. నా కోసం ఎన్నో బాధలు భరించి నన్ను అనుసరించే ప్రేయసిగా అవతారమెత్తి, నాచే వలపించుకున్న స్త్రీమూర్తిని ఎలా మన్నించాలో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఉత్తమ స్త్రీ జాతికి సంబంధించిన మంచి పదాలేవి వున్నా అవన్నీ ఆమెకే వర్తిస్తాయి” అన్నాడు కాళిదాసు.

నవల ఆద్యంతం నాయిక ధీరత్వంతో పాటు దుఃఖం, ఆవేదన, ఆక్రోశం, కన్నీరు, రాజకీయ కుట్రలో బలి పశువు అయిన స్త్రీ అంతర్మథనం, రాజకీయ చట్రం నుండి బయటకు రాలేని స్త్రీ అంతః సంఘర్షణ, భర్త ప్రేమ కోసం తపించే భారతీయ స్త్రీ అంతరంగం, జీవితాన్ని కోల్పోతున్నానేమోనన్న ఆందోళన, భర్త ప్రేమను పొందగలనా అన్న అనుమానం, పొందిన క్షణంలో ఎగిసిపడే ఆనందం, అప్పుడప్పుడు నిస్సహాయంగా వేదాంత ధోరణి, వైరాగ్య చింతన, ప్రశాంతతతో కూడిన నిశ్చింత కోసం ఆరాటం…. ఒక స్త్రీ అంతరంగంలో ఇన్ని భావ వైరుధ్యాన్ని చిత్రించటం ఈ రచయిత్రికి మాత్రమే సాధ్యమేమో! కొన్ని ప్రత్యేకమైన భావ ప్రకటనలు చూస్తే ‘విద్యావతి’లో ‘లక్ష్మీపార్వతి’ లీలగా గోచరిస్తారు. తీవ్రమైన భావ సంచలనాల వర్ణనలు చూసి అవాక్కవుతాం. మనసు మూగబోతుంది.

నవల మధ్య మధ్యలో సందర్భానుసారం కాళిదాసు శ్లోకాలు ఉటంకించడం, కొన్ని చాటువుల్ని ప్రస్తావించటం, ముఖ్యంగా ప్రకృతి వర్ణనలు రమణీయంగా చిత్రించటంలో రచయిత్రి యొక్క ‘భాషా ప్రావీణ్యత’ ప్రకటిత మవుతోంది. పదాలు, వాక్యాలు అలవోకగా ధారగా, ఏకధాటిగా ప్రవహించి పోతూ పాఠకుల్ని తమ అలలపై తేలియాడ జేస్తాయి.

తానేం తప్పు చేయకపోయినా తన సౌందర్యం వల్ల రాజ గురువుకి, షోడశ కళాప్రపూర్ణయై అఖండమైన తెలివితేటల కలిగి వుండడం వల్ల మహామంత్రికి కంటకింపుగా మారింది తను. మూర్ఖుడైన భర్తను జగన్మాత దర్శనానికి తీసుకొని వెళితే, అదృష్టవశాత్తు అతనికి కవిత్వం పొంగిపొర్లడం, ఆ మత్తులో భ్రమలో భార్యని తల్లిగా భావించి వెళ్ళిపోవటం…. ఇదంతా తన ప్రయత్నం లేకుండా విధి తనతో ఆడుకున్న చిత్రమైన ఆట.

తన ప్రేమను పండించు కోవడానికి రెండు జన్మలెత్తిన భాగ్యశాలి – భర్తను చేరుకోవడానికి సతీదేవిగా దగ్ధమై పార్వతిగా జన్మించి అతనిని చేరుకొన్న ధన్యచరిత – ఆ జగన్మాత. విద్యావతి కూడా గిరిజాదేవిగా మరో జన్మ ఎత్తి తన ప్రణయాన్ని పండించుకుని, భర్తను సొంతం చేసుకుంది. అయితే…. పైకి సమర్థురాలిగా, రాజనీతిజ్ఞురాలిగా కనిపించినా..‌‌. మానసికంగా ఆమెలోని స్త్రీత్వం భర్త సాన్నిహిత్యాన్నే కోరుకుంది. లోలోపల మథనపడింది. తర్కించుకొంది.

“కాసేపు ఆనందం. అంతలోనే దుఃఖం. క్షణంలో రంగులు మార్చుకునే ఈ భావ వైవిధ్యాల చట్రాల్లో పడి మనసు అనుక్షణం నలిగిపోతూనే ఉంటుంది. క్షణం చస్తూ బ్రతుకుతూ తనదైన జీవితాన్ని దాని మూల స్వరూపాన్ని సహజత్వాన్ని విడిచి ఎక్కడో దూరంగా అడవిలో విసిరివేయబడట్టు మనకు మనం కాకుండా ఎందుకు జీవిస్తున్నామో ఒక్క క్షణమైనా ఆలోచిస్తామా! ఆలోచించం. అది అడ్డు పడుతూనే ఉంది. మూలప్రకృతిని భౌతిక విషయాలు ఎంతగా లొంగదీసాయంటే ‘నాది’ అని చెప్పుకునే వస్తువు నాకు లేనంతగా, ఒక అస్వతంత్ర జీవనాన్ని తయారుచేశాయి. కొలువులో పని చేసే ఉద్యోగిలా వంగి వంగి తలవంచి బ్రతుకును ఈడుస్తున్నారే తప్ప ధైర్యంగా ‘నా సామ్రాజ్యాన్ని నేను జయించాలి’ అని ఆలోచించ లేనంతగా మనం బానిసలం అయిపోయాము. మనసును లోపలికి కాక బయట ప్రపంచంతో అనుసంధానం చేసుకొని దాని అనుచరులైన ఇంద్రియాశ్వాల మీద స్వారీ జరుగుతున్నంత కాలం మనం స్వేచ్ఛను సాధించలేం. ఈ ప్రకృతికి ఎవరూ అతీతులు కారనిపిస్తుంది”.

ఎంత చదివినా ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, విద్యావతి ‘ప్రేమ’ అనే పాశానికి బంధింపబడి దుఃఖిస్తున్నది. అతని కడగంటి చూపుల కోసం రాజ్యాన్ని, సుఖాల్ని వదులుకొని వచ్చింది. ఎన్నో కష్టాలు పడుతున్నది. అంతే. మానవ సంబంధాలు అంత త్వరగా తెగేవి కావు కదా! ‘జననాంతర సౌహృదాణి’ అనే మాట ఎంత వాస్తవం!

ఒకసారి కాళిదాసు గిరిజా దేవితో “దేవి! ఎటువంటి పరిస్థితులు వచ్చినా నన్ను వదిలి పెట్టనని ఈ వెన్నెల సాక్షిగా ప్రమాణం చేయి” అంటాడు. “మీరే ఆ ప్రమాణం చేయవలసి ఉంటుంది” అంటుందామె. ఎందుకు అని అతడు సందేహంగా అడగగా “పురుషులు చపలచిత్తులు. తుమ్మెద లాంటి వారు కదా. మీకు మరే పుష్పమైన తటస్థ పడితే నన్ను మరిచిపోతారు” అనే సరికి, అతడు “నా దృష్టిలో స్త్రీ పురుషుల కలయిక నదీ సాగరసంగమం లాంటిది. ఉన్నతమైన గిరిశిఖరాల నుండి దూకి, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎత్తుపల్లాలను అధిగమించి, చివరకు తన సాగరస్వామిలో ఆత్మార్పణ చేసుకునే నదిలా… ఆమె కోసమే ఎదురు చూసి ఆనందంగా తన హృదయపు లోతులలో లీనం చేసుకొనే సాగరుడిలా వారి కలయిక ఉండాలి. వారి శృంగారం ఉదాత్తంగా, పరమ పవిత్రంగా ఉండాలి. అదే ప్రేమంటే” అంటాడు. కలకాలం సత్యమై నిలిచే మాట పలికారు రచయిత్రి. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం’ అన్నట్లు – అంతటి స్వారస్యముంటేనే ఈ రచన లోని శక్తి ఏమిటో అర్థం అవుతుంది.

‘ఉపమా కాళిదాసస్య’ అన్నది ఆర్యోక్తి. కానీ ‘అభిజ్ఞ’ నవలను ఎన్ని ఉపమలతో రచయిత్రి అలంకరించారో! ఆమె ఊహా శబలతకు నిదర్శనాలు —

“ఆమె బుగ్గల ఎరుపు చూసి ఈ సంధ్య బాధతో ముఖాన్ని నల్ల పరుచుకుంది.”..

“సంపూర్ణంగా ఉదయించిన చంద్రుడు కాళిదాసు వర్ణన కోసం అన్నట్లు తన బింబాన్ని వాళ్ళ ముందు ఉన్న నీళ్ళలో ప్రతిబింబింప చేస్తూ, ఆ మహా కవి తనను ఎప్పుడూ వర్ణిస్తాడో అని ఎదురు చూస్తున్నాడట. ఆమె పక్కున నవ్వింది. ఆ ప్రాంతమంతా గుప్పిళ్ళ కొద్దీ మల్లెలు విరజిమ్మినట్లయింది. తనను పొగుడుతాడు అని ఆశతో చూస్తున్న జాబిల్లి కెరటాలలో కదిలి కదిలి ఏడుస్తున్నాడు.”

నిజంగానే అప్పుడు అక్కడ సన్నగా చినుకులు పడ్డాయి ఆకాశము నుండి. ఈ వర్ణన చదవగానే అక్కడ ఆగిపోతాం. కళ్ళముందు అందమైన దృశ్యచిత్రం కదలాడుతుంది.

చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు ముందుమాటలో “శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు స్త్రీల తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రజాకోర్టులో వాదించారు” అన్నారు.

అవును. నవల పూర్తిగా చదివిన తర్వాత పాఠకులు రచయిత్రి “వాదించి, గెలిచారు” అని అనుకోక మానరు.

***

అభిజ్ఞ (నవల)
రచన: శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి
పేజీలు: 200
వెల: ₹ 150
ప్రచురణ: ఋషి ప్రచురణలు
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు
33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట,
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ 520004

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here