Site icon Sanchika

అభిమానం

[dropcap]సా[/dropcap]యంత్రం 5 అవతా వుండాది. ఆఫీసులో టేబుల్ మీంది ఫైళ్లన్నీ బీరువాలో పెట్టి ఇంటికి ఎలబారేదానికి రెడీ అవుతాన్నా. తిరప్తి దేవస్థానంలో ఉజ్జోగం అంటే అందరూ తేలికగా మాట్లాడతారు. ఎక్కువ గలాటేస్తే తిని తిరిగే దేవస్తానం అని మొగం మీదే అంటా ఉంటారు. నిజానికి ఈడ ఎంత కష్టింగా వుంటాదో మాకే తెలస్తాది. మా సెక్షన్లో అందరితో పాటే నేను ఇంటికి ఎలబారినా. మా ఇంటికొచ్చే దోవలో కొర్లకుంట కాడ కత్తులు సానబెట్టే ఆయన కనిపించినాడు. కట్టెలు కొట్టే ఒక మోస్తరు కత్తిని సానబెడ్తా వుండాడు. దాన్ని చూసినాంక నాకు మా ఇంట్లో మూలన మూలుగుతున్న కత్తెర గుర్తొచ్చినాది. అది అప్పుడప్పుడు నా గెడ్డం మీదికి దుంకి ఎంట్రుకలు కట్ చేసేదానికి మల్లుకుంటాది. గెడ్డం షేవింగ్ చేద్దామంటే నాకు స్కిన్ ఎలర్జీ. చిన్ని చిన్ని గుల్లలు గెడ్డం కాడ భలే కుశాల చేస్తింటాయ్. ఆ అదుట్నే నేను మంగిలి కత్తిరి కొనుక్కుని నా గెడ్డం నేనే కటింగ్ చేసుకునేదానికి మల్లుకున్నా.

ఈ సానబెట్టే ఆయన్ను చూసినాంక నా కత్తెర గుర్తొచ్చినాది. బండి బయటపెట్టి ఇంటి గడప తొక్కి తొక్కంగాన్లే, మాయమ్మ “రేయ్, మీ బామర్దోళ్లు రాత్రికి ఇంటికొస్తారంట, రేపు దర్శినానికి ఎలబారతారంట. నీకు ఫోన్ చేసి చెప్పినారంట కదా. కొండమీంద ఆ పనులేవో మర్సిపోకుండా చూడమని ఇంటి ల్యాండ్ ఫోన్‌కి జేసినాడు. నీ సెల్ సిచ్చాఫ్ అంట కదా” గుక్కతిప్పుకోకుండా చెప్పింది. తిరుమల కొండకని వారంలో ఏదో ఓ రోజు ఈ తంటా వుంటానే వుండిద్ది. వాళ్లకి మూతికి, కాలికి చేసేదానికి మాది మాకు పడ్తుంది.

ఇంట్లో మూల్న పడేసిన కత్తిర తీసుకుని, రేపు దర్శినానికి ఎవడి కాళ్లు పెట్టాలా అని ఆలోచించుకుంటా ఎగబడి సానబెట్టే ఆయన కల్లా నడుచుకుంటా పోతి. ఆడ అప్పిటికే ఒక బురమీసాలీయాన కత్తిని సానబెడ్తా వున్నాడు. సానబెట్టే ఆయన, సాయిబు మాదిరే వుండాడు. ఎందుకంటే పొడుగాటి తెల్లటి గడ్డముండాది. ముక్కాళ్ల పంచె కట్టినాడు. నెత్తిన తెల్లటి టోపి లేకపోయా. అదే నన్ను అనుమాన పెడా వుండాది. సాయిబ్బా, దూదేకుల సాయిబ్బా అని.

బుర్రమీసాలాయన తన బియ్యపంగడి ముందర్నే సాన బెట్టించుకుంటున్నాడు. ఇంతలో ఒక ముస్లీమాయన వచ్చాడు.

పక్కన మసీదుండాది. అక్కడ ముస్లింలు ఎక్కువ. “ఏంబా ఇంటికాడికి వస్తవా, రెండు కత్తులుండాయ్, సానబెట్టాల” ఆర్డరేసినాడు.

“ఈడికే రా” పెడసరంగా జవాబిచ్చినాడు.

“ఈడ్నే వుంటావా, ఎలబారతావా” గట్టిగా అడిగాడు. సానాయన మాట్లాడల.

అడిగినాయన నా వైపు చూసినాడు. నేను ఠక్కున నా చూపును సాన చక్రం తిరగతాంటే దాని వైపు తిప్పినా. అవమానం జరిగినట్టు ఆయన పూడ్సినాడు. నాకు సానబెట్టే ఆయన్ని చూస్తాంటే కొంచెం సర్రుమనే. మీసాలాయన కత్తి సానబెట్టడం అయినాంక, తలెత్తి నా ముఖం మీందికి చూసినాడు. అప్పటిదాంక తలెత్తిండ్ల..

నా కత్తిరిని చేతిలోంకి తీసికొని “ఇది మంగలి కత్తిరి, గట్టిది. ఇరవై రూపాయలవతాది” అన్నాడు.

“కత్తిరే, వంద రూపాయలు, అంత చెప్తాండావే” అన్నా.

కత్తిరి నా చేతికిచ్చి, ఒక కాలితే తొక్కే సైకిల్ చక్రాన్ని భుజం మీదికి ఎత్తుకుని ఎలబారేదానికి చూసినాడు.

“సరిలే, చేసియ్” ముసులోడి యవ్వారం బానే వుండాది, మనసులో కసిగా అనుకున్నా.

కత్తిని వాటంగా పట్టుకుని మళ్లీ సాయిబు పనిలో మునిగిపోయినాడు. అతని పని చూస్తాంటే బిడ్డకి తల్లి ప్రేమగా పాలిస్తూ లోకాన్ని మర్చిపోయినట్టుండాది. బియ్యం అంగిట్లో మీసాలాయన ఎవర్తోనో గట్టిగా మాట్లాడ్డా వుండాడు. “య్యో, 25 కేజీలు, ఎనిమిదొందలు, తినేదానికి తీసుకుపోతాండవ్. ఈడ బేరాలుండవ్” కొననీకి వచ్చినాయనతో అంటున్నాడు. కొనేదానికి వచ్చినాయన “ఏన్నా, నెలకింద ఇదే బియ్యం ఏడొందలకే ఇచ్చినావ్ కదా, ఈ పాటికే ధర పెంచితే ఎట్టా కొనాల” నిష్టూరమాడినాడు. “నో, నేనేమన్నా పెంచినానా, యాడైనా ఇదే రేటు, కావల్సొస్తే, ఇచారించుకో, ఇదే రేటుకి ఎవడన్నా ఇస్తే , ఆడే తీసుకోనా” కొంచెం మెత్తబడి, బేరం కాడ గట్టిగున్నాడు.

కొనేటాయన, నసుగుతూనే ఒక మూట తీసుకుని, దుడ్లిచ్చి, బండ్లో పెట్టుకుని పూడ్సినాడు.

మీసాలాయన సానబెట్టినాయనికి దుడ్లుచ్చే దానికి మా దగ్గరకి వచ్చినాడు.

“మణుసులు భలే రాటు తేలినారబ్బా, రూల్స్ భలే మాట్లాడాండారు” ఎకసెక్కంగా అంటా వుండాడు.

మీసాలాయన నా వైపు చూస్తూ, “యో, ఈన సాన భలే పెత్తాడు, ఇంతకు మునుపు ఒకాయనొచ్చినాడు. మొగానికి పౌడరేసినట్టు, మెత్తగా కెలికి ఇస్తాడు. ఇంటికెలబారక ముందే అది మొదైపోతాది, గొంతు కోసినా తెగదు” సాయిబ్బును మెచ్చుకుంటూ అన్నాడు.

సాయిబు నా కత్తిని కొత్త పెళ్లికొడుకు మాదిరి జేసి నాకిచ్చినాడు. కత్తి నాకిచ్చే టప్పుడు దాన్ని మురిపెంగా చేత్తో తడిమిచ్చినాడు.

జేబులోంచి ఇరవై రూపాయలు తీసి ఆయనికిచ్చినా.

మీసాలాయన సాయిబుకు దుడ్డిస్తూ “ఇదో సాయిబు, దీన్ని నమ్ముకుని బతకతాండావ్, కాబట్టి నా కత్తికి రవ్వంత సేపే సానబెట్టినా, పది రూపాయలిస్తాండా” గొప్పగా అంటూ ఇవ్వబోయాడు.

“నా, నేను ముందే సెప్పినా, ముప్పై రూపాయలవతాదని, కాని నీవు గీకి గీకి ఇరవై రూపాయలు జేసినావ్, న్నాయంగా ఇవ్వన్నా” సాయిబు సూటిగా అన్నాడు.

మీసాలాయన మొఖం చిట్లిస్తా “యో, న్నాయం గురించి నా దగ్గర చెప్పమాక. దాన్ని అటుకి, ఇటుకి నాల్గుసార్లు గీకి అంత దుడ్డడగితే, దుడ్డేమన్నా చెట్లకి కాస్తాండాయా” అన్నాడు.

“నా, గలాటా వద్దు, నేనడిగింది ఇవ్వు, లేదంటే వదిలేయ్” సాయిబు సానబెట్టే సైకిల్ చక్రాన్ని భుజం మీదికి ఏసుకొని మరో మాటలేకుండా ఎలబారినాడు.

మీసాలాయన నా వైపు చూస్తూ “చూడబ్బా, ముసలోడుకి ఒళ్లంతా కొవ్వుండాది. దీంట్లో వచ్చే దుడ్లతోనే ఆయన కుటుంబం బతకాల, కాని వారానికి రెండుసార్లు కూడా దాన్ని భుజానేసుకోడు. పోనీలే పాపమని ఏదన్నా సానబెట్టేదానికి ఇస్తే, భలే పెగ్గి జూపిస్తాడు, ఈ నాయాల్ని ఎవ్వడూ బాగుచేయలేడు” నా వైపు చూస్తూ ఎకసెక్కంగా అన్నాడు.

“ఏ నాయాల్ని” కడుపులో సెగ తగల్తాంటే మాట ఇడిసినా.

మీసాలాయన నన్ను గుర్రుగా చూస్తా, అంగిట్లోకి పూడ్సినాడు.

Exit mobile version