[అభిమన్యుడి గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు.]
[dropcap]మ[/dropcap]హాభారతం అనేది భారత ఉపఖండానికి చెందిన సంస్కృత మహాకావ్యం. ఈ మహాకావ్యములో అభిమన్యుడి వృత్తాంతము వివరించబడింది. అభిమన్యుడు పాండవ మధ్యముడు అయిన, ద్రోణాచార్యుని ప్రియ శిష్యుడు అయిన అర్జునుడి కుమారుడు, తల్లి యదు వంశానికి చెందిన శ్రీకృష్ణుని సోదరి సుభద్ర. అంటే అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనల్లుడు. అభిమన్యుడిని మంచి అందగాడిగా వర్ణిస్తారు.
విశాలమైన భుజాలు, చురుకైన కళ్ళు మంచి గంభీరమైన స్వరంతో ముఖం పౌర్ణమి నాటి చంద్రునివలె ఉంటుంది అని వర్ణింపబడినది. అభిమన్యుని పుట్టుకకు, మరియు చాలా త్వరగా అంటే చిన్న వయస్సులోనే చనిపోవడానికి గల కారణం ఆదిపర్వంలోని సంభవ పర్వంలో వివరింపబడింది. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు అతిరథుడిగా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఆ విధంగా మహాభారతంలో ఒక గొప్ప యోధుడిగా వర్ణింపబడతాడు.
ఒకసారి ఇంద్ర సభలో సోముని (చంద్రుడు) కుమారుడైన వర్చ భూమి మీద అభిమన్యుడిగా అవతరించాలని నిర్ణయిస్తారు. వర్చ అష్టవసువులలో ఒకడు. కానీ సోముడికి తన కుమారుడిని పంపడం ఇష్టం ఉండదు. కానీ వీలైనంత త్వరగా మళ్లీ దేవలోకానికి వచ్చే షరతు మీద అంగీకరిస్తాడు. అందువల్లనే అభిమన్యుడు కురు వంశములో జన్మించి,16 ఏళ్లకే మరణిస్తాడు.
అభిమన్యుడి అసలు పేరు సౌభద్ర (సుభద్ర కుమారుడు). అభిమన్యుడు పుట్టినప్పుడు ధర్మరాజు బ్రాహ్మణులకు పదివేల గోవులు, బంగారు నాణేల రాశులు దానంగా ఇచ్చాడు. అలాగే శ్రీ కృష్ణుడు అభిమన్యుడు పుట్టినప్పుడు ప్రత్యేకమైన పూజలు జరిపించాడు. అభిమన్యుడు నాలుగు వేదాలను, ఆరు వేదాంగాలు నేర్చుకున్నాడు. తండ్రి దగ్గర విలు విద్య నేర్చుకున్నాడు.
అభిమన్యుడు పాండవులు 13 ఏళ్ళు అరణ్య, అజ్ఞాత వాసంలో ఉండటం వలన మేనమామల ఇంట్లో పెరిగాడు. అభిమన్యుడు యుద్ధ విద్యలను తన తండ్రి, మరియు మేనమామల దగ్గర నేర్చుకున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకుంటాడు. కానీ ఆ పద్మవ్యూహం నుండి బయటకు రావడం నేర్చుకోలేదు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చెపుతుండగా విని నేర్చుకున్నాడని అంటారు కానీ అది యథార్థం కాదు. పద్మవ్యూహాన్ని గురించి తెలిసినవారు ఇరువైపులా నలుగురు మాత్రమే ఉన్నారు. అభిమన్యుడి వివాహం విరాట పర్వంలో వివరింపబడింది..
పాండవులు అజ్ఞాతవాసంలో విరాట రాజు కొలువులో మారు వేషాలతో గడుపుతున్నప్పుడు అర్జునుడు ఊర్వశి శాపం వల్ల బృహన్నలగా ఉత్తరకు నాట్యం నేర్పే గురువుగా ఉంటాడు. అజ్ఞాతవాసము పూర్తి అయ్యాక విరాట రాజు అర్జునుడిని ఉత్తరను వివాహం చేసుకోవలసినదిగా అడుగుతాడు. కానీ అర్జునుడు ఉత్తర తన శిష్యురాలు, కూతురి లాంటిది అని చెప్పి అభిమన్యుడితో వివాహం జరిపిస్తాడు. ఈ వివాహం సందర్భంగా విరాట రాజు ఏడు వేల అశ్వాలను, అపారమైన ధన రాశులను బహుకరిస్తాడు.
అభిమన్యుడు కురుక్షేత్ర యుద్దానికి వెళ్లబోయే ముందు ఉత్తర గర్భవతి అవుతుంది. అభిమన్యుని మరణానంతరము పుట్టినవాడే పరీక్షిత్తు. అతను ధర్మరాజు తరువాత హస్తినాపురానికి రాజు అవుతాడు. పరీక్షిత్తు మహారాజు మహాభారతం మరియు భాగవత పురాణములో కొనియాడబడిన రాజు. మహాభారతంలో అభిమన్యుడికి ఉత్తర ఒక్కతే భార్య అని చెప్పినప్పటికీ కొన్ని జానపద కధనాలలో (మన మాయాబజార్ సినిమాలో లాగ) బలరాముని కూతురైన శశిరేఖ కూడా అభిమన్యుని భార్యగా చెపుతారు. ఈ కథనం ప్రకారం అభిమన్యుడు ద్వారకలో ఉన్నప్పుడు శశిరేఖను ప్రేమిస్తాడు. కానీ బలరాముడు తన శిష్యుడైన దుర్యోధనుని కుమారుడైన లక్షణ కుమారునికి శశిరేఖను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. భీముని కుమారుడైన ఘటోత్కచుని సహాయముతో అభిమన్యుడు శశిరేఖను వివాహమాడతాడు. కానీ ఈ కధ వ్యాసుని భారతంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు. బహుశా శశిరేఖా పరిణయం కవుల కల్పన అయి ఉండవచ్చు.
అభిమన్యుడు శత్రు సైన్యాలకు అరివీర భయంకరుడిగా ఉండేవాడు. చిన్నవాడు అయినప్పటికీ భీష్మునిచే అతిరథుడిగా గుర్తించబడతాడు. యుద్ధంలో అమోఘమైన పరాక్రమాన్ని చూపిస్తాడు. అభిమన్యుని పరాక్రమం ఉద్యోగ పర్వంలోను, భీష్మ పర్వములోను వివరింపబడింది. అభిమన్యుడిని భీష్ముడు రథ బలాలలో అగ్రగణ్యుడిగా గుర్తిస్తాడు. అభిమన్యుడి దగ్గర రౌద్ర అనే పేరు గల దైవదత్తమైన విల్లు ఉన్నది. ఈ విల్లును బలరాముడు అభిమన్యునికి ప్రసాదించాడు. అభిమన్యుడి దగ్గర ఆగ్నేయాస్త్రం వంటి శక్తివంతమైన శాస్త్రాలు ఉన్నాయి. అభిమన్యుడు విలువిద్య లోనే కాకుండా కత్తి యుద్ధంలో కూడా ప్రావీణ్యుడు. అభిమన్యునికి రిషభ, గాంధార, నిషధ, మధ్యమ, కైశిక వంటి కత్తి యుద్ధ నైపుణ్యాలు తెలుసు.
కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి పదకొండు రోజులు అంటే భీష్ముడు సర్వ సైన్యాధక్షుడు ఉండి యుద్ధము సాగించినప్పుడు అభిమన్యుడు మొదటిరోజు కోసల రాజైన బృహత్బలతో తలపడతాడు. అదే రోజున భీష్ముడితో కూడా తలపడి భీష్ముని రథంపై ఉన్న కేతనమును విరుస్తాడు. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారునితో కూడా యుద్ధం చేస్తాడు.
రెండవ రోజు అర్జునుడు ఏర్పాటు చేసిన అర్ధ చంద్ర వ్యూహంలో కీలక స్థానంలో ఉండి శల్యుడు, మగధ రాజైన జయత్సేనుడితో యుద్ధము చేసి అతని ఏనుగును సంహరిస్తాడు. భీమునికి సహాయముగా ఉండి కౌరవ వీరులైన లక్ష్మణ కుమారుడు, వికర్ణుడు, చిత్రసేనుడు వంటి వారిని ఓడిస్తాడు. పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుముడు ఏర్పాటు చేసిన శృంగాటక వ్యూహంలో కీలక స్థానంలో ఉండి కౌరవ పక్షాన ఉన్న అంభస్థ, అలంబుష వంటి వీరులను ఓడించి సుధీష్ణ, దుర్యోధన, బహబల వంటి యోధులతో తలపడతాడు. దుర్యోధనుని సైన్యాన్ని చంపటానికి అభిమన్యుడు క్షురప్ర, వత్సదంత, విపథ, నరచ,భల్లా, అంజలిక వంటి శస్త్రలను ప్రయోగిస్తాడు. అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేన లోని ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృతవర్మ వంటి ప్రముఖులను ఓడిస్తాడు. అంతే కాకుండా కర్ణుడితో తలపడి భీకర పోరాటం చేసి కర్ణుడి ఆరుగురు అనుచరులను హతమారుస్తాడు.
ద్రోణ పర్వములో అభిమన్యుడి వధ వివరింపబడింది. పదకొండవ రోజు యుద్ధం తరువాత భీష్ముడు అంపశయ్యపై ఒరిగినప్పుడు ద్రోణుడు సర్వసైన్యాధక్షుడిగా నియమింపబడ్డప్పుడు 12వ రోజు యుద్ధంలో పాండవుల దాడికి భయపడ్డ దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఎలాగైనా తనకు విజయం తెచ్చిపెట్టాలని అభ్యర్థిస్తాడు. 13వ రోజు అర్జునుడు లేని సమయం చూసి ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేస్తాడు. అర్జునుడు, శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు ఈ ముగ్గురు కాకుండా అభిమన్యుడికి మాత్రమే పద్మ వ్యూహము చేధించడం తెలుసు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటి అంటే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్నాడు అని కానీ అది తప్పు. అభిమన్యుడు బాల్యంలోనే తండ్రి దగ్గర ఆ విద్య నేర్చుకున్నాడు. పద్మ వ్యూహంతో పాటు అభిమన్యుడికి మకర వ్యూహం, కూర్మ వ్యూహం, గరుడ వ్యూహం వంటి ఇతర వ్యూహాలు కూడా తెలుసు. కానీ అభిమన్యుడికి పద్మవ్యూహం నుండి బయటకు రావడం తెలియదు. ధర్మరాజు అభిమన్యుడితో “మేము నలుగురం అండగా ఉంటాం కాబట్టి నీవు పద్మవ్యూహాన్ని ఛేదిస్తే మేము లోనికి ప్రవేశించి యుద్ధము చేయగలము” అని హామీ ఇస్తాడు.
అభిమానుడు తన రథసారథి సుమిత్రుడిని ద్రోణుడి వైపు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అప్పటికే పాండవులు వెనుక పడిపోతారు. కౌరవ సైన్యం అభిమన్యుడిపై దాడి చేస్తుంది. కానీ వారి రక్షణ వలయాన్ని చీల్చుకుంటూ పద్మవ్యూహం లోకి వెళతాడు. శత్రుసైన్యం లోని ప్రముఖులైన శల్యుని సోదరులను, దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుని, ఇంకా కొంతమంది కౌరవ వీరులను వధిస్తాడు. తన కుమారుడి మరణానికి ఆగ్రహించిన దుర్యోధనుడు ద్రోణాచార్యునికి ఎలాగైనా అభిమన్యుడిని సంహరించాలి అని ఆదేశిస్తాడు.
పాండవులను పద్మవ్యూహం మొదట్లో సైంధవుడు అడ్డగించి వారిని అభిమన్యునికి సహాయంగా వెళ్ళకుండా నిరోధిస్తాడు. ఒంటరి అయిన అభిమన్యుడిని కౌరవసేనలో ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వథామ, మరియు శకుని వంటి ఆరుగురు మహారథులు యుద్ధ నియమాలను అతిక్రమించి అభిమన్యుని రధాన్ని నాశనం చేసి నిరాయుధుడిగా చేసి అతనిపై దాడి చేస్తారు. అప్పటికీ అభిమన్యుడు తన రథ చక్రంతో కొంచెం సేపు యుద్ధం చేస్తాడు. చివరకు శక్తి సన్నగిల్లిన అభిమన్యుని తలపై దుశ్శాసనుడి కొడుకు గదతో కొట్టడం వలన చనిపోయాడు.
అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి (21,870 రథబలం, 21,870 గజబలం, 65,610 అశ్వబలం, మరియు 109,350 కాల్బలం (పదాతిదళం) కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1:1:3:5 నిష్పత్తిలో వుంటాయి) కౌరవ సైన్యాన్ని హతమారుస్తాడు.
ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని పర్వము ముగుస్తుంది.