[box type=’note’ fontsize=’16’] “ఫేస్ బూక్ డాటా లీక్స్ అనీ, ఆధార్ వివరాల లీకనీ, సైబర్ క్రైం అనీ, ఇంకా ఇలాంటి సాంకేతిక విషయాలగురించి చాలా విస్తారంగా, సరళంగా, simplisticగా కూడా చూపిస్తుంది” సినిమా అని వివరిస్తున్నారు పరేష్ ఎన్. దోషి “అభిమన్యుడు” సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]”అ[/dropcap]భిమన్యుడు” వొక తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగు. దర్శకుడు పి ఎస్ మిత్రన్. కాబట్టి తమిళ వాసనలు, సెంటిమెంట్లు అన్నీ వుంటాయి. అవన్ని పక్కనపెట్టి చూస్తే ఇప్పటి కాలంలో జరుగుతున్న సాంకేతిక మోసాల గురించి కొంత అవగాహన సామాన్యుడికి కలుగుతుంది.
మోసాలు అనాది కాలం నుంచీ సాగుతున్నాయి. వ్యాపార లావా దేవీలలో, సామాజిక అనుబంధాలలో, అప్పటి పరిస్థితులను బట్టి మోసపుచ్చే నేర్పులు పుట్టుకొస్తాయి. దానికి మూలం వ్యక్తుల అమాయకత్వం, గుడ్డిగా నమ్మడం (gullibility), అప్రమత్తంగా లేకపోవడం వగైరా. యేదో జోకు వుండనే వుందిగా, నిన్ను నమ్మినవాడినే మోసం చేస్తావా అంటే నమ్మకపోతే మోసం యెలా చేయగలను అని జవాబు వస్తుంది. మనం ఇప్పుడున్నది సాంకేతిక ప్రపంచం లో. సామాన్యుడికి సాంకేతికతను రోజువారీ జీవితంలో వాడుకోవడం తెలుసు, కాని దాని పని తీరు అవీ లోతుగా తెలీవు. బ్యాంకులు, ప్రభుత్వమూ వివిధ సంస్థలు అన్ని ప్రచారమాధ్యమాల నుంచీ “మీ గురించిన వివరాలను గుప్తంగా వుంచుకోండి, యెవరినీ నమ్మి ఇవ్వకండి” అని నిరంతరం చెబుతున్నా, చేతులు కాల్చుకునేవాళ్ళు అలా కాల్చుకుంటూనే వున్నారు. దోచుకునేవారు సంఖ్యలో పెరుగుతూ వున్నారు. దీని వెనుక ఆర్థిక, సామాజిక కారణాలూ వుంటాయి.
ఇక ఈ సినెమాకు సంబంధించి మాట్లాడుకోవాల్సింది కేవలం కథా వస్తువే. నటన వొక్క అర్జున్‌ది తప్ప మరెవరిదీ చెప్పుకోతగ్గదిగా లేదు. ఢిల్లీ గణేష్ నటన యెప్పట్లానే వుంది. సాంకేతికంగా కూడా పెద్దగా మాట్లాడుకోవడానికి యేమీ లేదు. ఈ సినెమా ప్రాసంగికత యెక్కడుందీ అంటే ఇప్పుడు మనం ఫేస్ బూక్ డాటా లీక్స్ అనీ, ఆధార్ వివరాల లీకనీ, సైబర్ క్రైం అనీ, ఇంకా ఇలాంటి సాంకేతిక విషయాలగురించి వింటూ వున్నాము కదా. వాటిని ఇది చాలా విస్తారంగా, సరళంగా, simplisticగా కూడా చూపిస్తుంది. అది సరిపోతుంది అని నా అభిప్రాయం.
ఇప్పుడు ముఖ్య విషయం. ఈ చిత్రం గురించి మాట్లాడుకునేటప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి? ఆర్థర్ హేలీ నవలలు, క్రిస్టఫొర్ నోలాన్ చిత్రాలూ దృష్టిలో పెట్టుకుంటే ఇది యే మాత్రం నచ్చదు. వాటిని చదివి, చూసి అర్థం చేసుకోవడానికి కాస్త యెక్కువ తెలివి, పరిశ్రమా అవసరం. కాని ఈ చిత్రానికి target audience అతి సామాన్యులు అనుకుంటే ఇది సమంజసంగానే వుంది. చేరాల్సిన విషయం వారికి చేరుతుంది. ఆ ప్రయోజనం నెరవేరినట్టే.
అయితే దీన్నే ఇంకాస్త బాగా తీసి వుండ వచ్చు. కాస్త రీసర్చ్ చేస్తే కొన్ని పొరపాట్లు చేయకుండా వుండవచ్చు. ముఖ్యంగా ఇది బ్యాంకింగ్ రంగం, ఐటీ రంగాలకు చెందినది. మొదటిది సామాన్యుడికి చాలా దశాబ్దాలనుంచీ పరిచయం వుంది. రెండోదే కొత్త. ఆ రెండవదాని రాకడ మొదటి దాని స్వరూపాన్ని కూడా గుర్తు పట్టలేనంతగా మార్చేసింది. అయినా మూల విషయంలో మార్పు లేదు. ఆ బ్రోకరు సాయంతో దొంగ పత్రాలు, లోన్లు, ఆ సమాచారం మోసగాళ్ళకు అందచేయడం ఇవన్నీ చాలా క్రూడ్‌గా చూపించాడు. లక్షల లోన్లు ఇచ్చే బ్యాంక్ ఆ వ్యాపార స్థలాన్ని తనిఖీ చేయకపోవడమనేది జరుగుతుందా? జరిగినా అది యెన్నాళ్ళు దాగుతుంది? కర్ణ ఖాతా నుంచి డబ్బు పోవడం, అతని తండ్రి మొదటిసారి ATM వాడినతర్వాత జరుగుతుంది. ఆ యంత్రాలలో స్కిమ్మర్లు అమర్చి కార్డు సమాచారం దొంగలిస్తారు. అది వివరించలేదు. అదీ కాక ఇంకా చాలా రకాలుగా సమాచారం దొంగలించబడుతుంది, వాటిని ఇంకాస్త వివరంగా చూపించే పని. ఉపయోగపడేది. ఇప్పుడు ఇదివరకులా కాకుండా 2 ఫేక్టర్ అథరైజేషన్ కూడా వచ్చింది. ఖాతాదారుని సొమ్ము పోతే బ్యాంకుల్లో కూడా చర్య తీసుకుంటారు, ఇందులో చూపించినట్లు మొహం చాటేయరు. మరీ నేలబారుగా కాకుండా చక్కగా విషయ సేకరణ చేసి తీసి వుండాల్సింది. ఇక రెండో అంశానికొస్తే అర్జున్ అన్న వొక పేద్ద (పెద్ద కాదు పేద్ద) విలన్‌ను చూపించి, అతని చేత stylised acting చేయించి కథను ఆసక్తికరంగా చేశాడే కాని, వాస్తవానికి స్థాయీ భేదాలతో మోసగాళ్ళు కోకొల్లలు. మోసగించే దారులూ అంతే. ఇంటికి తాళం వేసుకున్నట్టే వ్యక్తిగత సమాచారాన్ని కూడా అంతే అప్రమత్తంగా పెట్టుకోవడం తప్పనిసరి అయిన రోజులు. సాంకేతిక వివరాలు చెబితే కష్టమవుతుందేమో గాని సరళంగా చూపించవచ్చు.
ఇక కర్ణ గురించి. వొక ఆర్మీ మేజర్‌గా వుంటూ విదేశీ అమ్మాయిలను వేడుకుని, వాళ్ళ సాయంతో ఈ దేశపు అవినీతి గాలులను తప్పించుకుంటూ విదేశాలలో స్థిరపడటం లాంటి కామెడీ కూడా వుంది మొదట్లో.
ఇప్పుడు మనకొస్తున్న చిత్రాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రం నయమే అనిపించింది నాకు. తాము High brow cinebuffs అనుకునేవాళ్ళు మానేసి అందరూ చూడొచ్చు.