Site icon Sanchika

అభిరుచి

[dropcap]శ్రీ[/dropcap]వారు సాయంత్రం ఆఫీసునుండి రాగానే ఓచేత్తో టీ కప్పు, మరోచేత్తో మా స్నేహితురాలు సుచరిత వాళ్ల కూతురి ఓణీల వేడుకంటూ ఇచ్చి వెళ్లిన ఆహ్వానపత్రికను ఇచ్చాను.

“ఏమిటి?” అంటూ అందుకుని చూస్తుంటే చెప్పాను

“వాళ్ళు భార్యాభర్తలిద్దరూ వచ్చి మరీమరీ రమ్మని చెప్పి ఇచ్చారు” అని.

“అబ్బో! ఆహ్వానపత్రిక చాలా రిచ్‌గా ఉందే!” అన్నారు తిరిగేసి చూస్తూ.

“ఆయన గెజిటెడ్ ఆఫీసర్ కదా! మొదటి నుంచి కాస్త కలిగిన వాళ్ళు. అందులోనూ వాళ్ళు చేసేది మొదటి శుభకార్యం. హై లెవెల్లోనే ఉంటుంది” అన్నాను.

కార్డు పక్కనపెట్టి, టీ తాగసాగారు

“ఏమండీ వెళ్దామా..” గోముగా అడిగాను, వద్దనేస్తారేమో అనే భయంతో.

మౌనంగా తాగుతూనే ఉన్నారు

మళ్ళీ నేనే అన్నాను

“ఎవరికైనా మనంవెళ్తేనే కదా, రేపు మన ఇంట్లో జరిగేవాటికి అందరూ వచ్చేది?” అని.

చివరికి ఎలాగైతేనేం ఇద్దరం వెళ్దామని ఒప్పుకున్నారు.

***

“పాపకు ఇవ్వటానికి ఏమైనా గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుందికదా?” అన్నాను బయలుదేరి వెళ్లేప్పుడు.

“ఓ 500 పాప చేతిలో పెడితేపోలా!” అన్నారు

“బావుండదండీ.. కాస్త హై లెవెల్ వాళ్ళుకదా.. కనీసం వెయ్యి రూపాయలు ఐనా పెట్టి పాపకు పనికొచ్చేదేదైనా గిఫ్ట్ తీసుకుందాం” అన్నాను

“సరే! అలాగే తీసుకుందాం” అని అనడంతో ఓ గిఫ్ట్ తీసుకుని అందంగా ప్యాక్ చేయించి తీసుకు వెళ్ళాం.

***

మేము వెళ్లేసరికి ఫంక్షన్ హాల్‌లో కుర్చీలు చాలావరకు నిండిపోయినాయ్. నా ఫ్రెండ్ సుచరిత వేదికపై నుంచి చూసి చెయ్యూపి, నవ్వింది పలకరింపుగా.

హాలు అలంకరణను, వచ్చిన వారిని కలియచూస్తూ సుచరిత వాళ్ళ స్టేటస్‌ని అంచనా వేస్తున్నారు మావారు.

ఓ ప్రక్క మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ జన సందోహంలో మేమూ కలిసి వరుసలో వేదిక పైకి వెళ్లి పాపకు అక్షతలు వేశాము.

పాప ప్రక్కనే నిలబడిన సుచరిత, ఆమె భర్త మమ్మల్ని కూడా తమతో పాటు ఫోటోల్లో, వీడియోల్లో కూడా బంధించాక, భోజనం చేసి వెళ్ళమని చెప్పారు.

తలూపి క్రిందకు దిగామిద్దరం.

వేదికకు దిగువన ఒక ప్రక్కగా ముందు బల్ల వెనక మూడు కుర్చీల్లో ముగ్గురు యువతీ యువకులు ఆసీనులై ఉన్నారు.

ఒకరు గిఫ్టులు మరొకరు మనీ పెట్టిన కవర్స్ తీసుకుంటుంటే, మూడవ వ్యక్తి ఇచ్చినవారి పేర్లు రాస్తున్నారు. వారిలోనే ఒకరు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు.

ఇవతలకు రాగానే మా వారు “ఏంటి గివ్ మనీ ఆర్ గిఫ్ట్, టేక్ రిటర్న్ గిఫ్టా?” అనడిగారు నవ్వుతూ.

నేను “ష్..!” అన్నాను చుట్టూచూసి.

అక్కడినుండి ప్రక్కనే ఉన్న పెద్ద హాల్లో భోజనాలు జరుగుతున్నాయ్, ఇద్దరం అటు నడిచాం.

కూర్చుని భోజనం చేస్తున్న వారిది పూర్తి కాకమునుపే వాళ్ళ కుర్చీని పట్టుకుని రెట్టింపు మంది నిలబడి ఉంటున్నారు.

‘ఎప్పుడు తిని లేస్తారా’ అని నించున్నవాళ్ళు ఎదురు చూస్తుంటే, వాళ్ళ ముందు తీరిగ్గా తృప్తిగా తినలేక కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.

మ్యూజికల్ చైర్స్ గేమ్ లాగా కూర్చున్న వాళ్ళు లేస్తుండగానే కుర్చీ దొరకబుచ్చుకోవటానికి నిలబడిన వాళ్ళు తొందర కంగారు పడటం చూసి సిగ్గుగా అనిపించింది.

అందరూ ఆధునికులే!

“బిడియపడి ఆగితే, ఆఖరి పంక్తి వరకు అంతే సంగతులు!” అన్నారు మావారు.

అసలే వేళ దాటుతోంది, ఈయన ఆకలికి ఆగలేరు, పైగా షుగర్ ఉంది.

“పోనీ మీరు కుర్చీలో కూర్చోండి, నేనువెళ్లి ప్లేట్లో పెట్టించుకు వస్తాను, నేను తర్వాత తింటాను” అన్నాను.

“నువ్వా? వద్దులేఆగు, నువ్వేం పెట్టించుకొస్తావో నాకు తెలుసులే!” అన్నారు నవ్వుతూ.

(కాదు, వెక్కిరింపుగా).

ఆ వెక్కిరింపుకు ఒక నేపథ్యం ఉంది లెండి, అదేమంటే..

***

మా ఇంటికి దగ్గరలోనే ఒక బంగారునగల షాప్ యజమాని కుటుంబం ఉంది.

వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. పెద్దఫంక్షన్ హాల్లో రాత్రిపూట రిసెప్షన్ ఏర్పాటు చేసి, పిలిస్తే వెళ్ళాము.

వేదిక అలంకరణ నుండి వడ్డించే పదార్థాలు వరకు చాలా గ్రాండ్‌గా చేశారు. ఎన్నో ఎన్నెన్నో రకాల స్వీట్స్ కేక్స్, కూల్ డ్రింక్స్, టిఫిన్స్, భోజనం పదార్థాలు, ఐస్ క్రీమ్స్ ఎవరికి ఏవి కావాలో వారు వెళ్లి ఎంత కావాలో అంత పెట్టించుకుని తినడం.

కొంతమంది ప్రతిదీ పెట్టించుకుని, టేస్ట్ చేసి బిన్లో పడేయడం, మళ్లీ మరోచోట మరొకటి పెట్టించుకోవటం చేస్తున్నారు.

“చూడండి, ఏదీ సరిగా తినకుండా ఎలా వేస్ట్ చేస్తూ పారేస్తున్నారో..” అన్నాను బాధగా మావారితో.

“పెద్దగా అనకు, తగువులొస్తాయ్” అన్నారాయన.

మావారు ఓ ప్లేట్ తీసుకుని రెండు మూడు రకాల బిర్యానీలు వాటికి తగ్గ కుర్మాలు వేయించుకునీ, థమ్సప్ బాటిల్ కూడా తెచ్చుకున్నారు.

ఆయన మంచి భోజనప్రియులు. ఎంతగా అంటే, మంచి భోజనం అంటే ఎంత దూరమైనా వెళ్తారు. అది గనక బాగా లేకపోతే.. అందుకు వెచ్చించిన సొమ్మును, సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నిరోజులైనా గొణుగుతూ ఉంటారు.. గుర్తు చేసుకొని మరీ.

నన్నూ పెట్టించుకోమన్నారు.

“మీరిక్కడ కూర్చుని తింటూ ఉండండి. నేనిటు ప్రక్కకు వెళ్లి, క్రొత్త పదార్థాలు ఏమైనా ఉంటే చూసి తెచ్చుకుంటాను” అంటూ వెళ్లాను.

ఒకచోట నేతి ఘుమఘుమలు ముక్కుపుటాలను తాకి, జిహ్వను తట్టి లేపాయ్. అటుగా నడిచాను.

పేద్ద గుండిగలో నుండి వేడివేడి పొగలు నేతి సువాసనలు ఎగజిమ్ముతున్నాయ్! లోపల ఉన్న పదార్థం ఆ రంగురంగుల దీపాల కాంతిలో నేను స్పష్టంగా గుర్తించలేకపోయినా, తినాలనే కాంక్షతో ప్లేట్ తీసుకుని పెట్టించుకున్నాను.

నోట్లో ఊరుతున్న లాలాజలాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్లి, మావారి పక్కనే కూర్చున్నాను.

ముక్కులు ఎగబీల్చి “అబ్బ ఏంటది! ఘుమాయించేస్తోంది!” అడిగారు.

“చూద్దాం!” అంటూ చేత్తో కాస్త పైకితీసి, నోట్లో పెట్టుకోబోతూ సరిగ్గా చూద్దును కదా..

అప్పటికే గ్రహించేసిన మా వారు పెద్దపెట్టున నవ్వసాగారు.. నాకూ నవ్వాగలేదు. ఇంతకీ అదేంటంటే..

వేడివేడి అన్నంలో ముద్దపప్పు కొత్తావకాయా, తాజా నెయ్యి పోసి కలిపిన అన్నంముద్ద!

“అరుదుగా లభించే ఇన్నిరకాల పదార్థాలు వదిలిపెట్టి పప్పావకాయ అన్నం తెచ్చుకున్నావా చింతకాయ పచ్చడీ!?” అంటూ వెక్కిరించారు నన్ను.

“దీనిరుచి మీకేం తెలుసులే..” బింకంగా అన్నాను నేను.

అప్పటినుంచి నా రుచులన్నీ ఆయనకు రోటీన్ రుచిగా మారాయి.

***

“ఏయ్ సీతా! అక్కడ కుర్చీలు ఖాళీ అయ్యాయి పదా కూర్చుందాం”

మావారి మాటతో అటు నడిచి రెండు కుర్చీలు దొరకబుచ్చుకొని కూలబడ్డాం.

విస్తర్లు వేశారు, వాటర్ బాటిల్స్ పెట్టారు. స్వీట్ వచ్చింది హల్వాకొద్ది కొద్దిగా ఒక్కో స్పూన్ చొప్పున వడ్డిస్తూ వెళ్తున్నారు. వేసిన స్వీట్‌ని నడిపి వేలుతోనే పైకితీసి, నాలుకకు రాసుకుంటూ.. నవ్వుతూ నాతో అన్నారు

“నాలాగే వచ్చిన వాళ్ళందరికీ షుగర్ ఉందేమో, స్వీటు విస్తరికి రాసి వెళుతున్నారు” అని.

నేను కళ్ళతో ప్రక్కవాళ్ళని చూపిస్తూ “ష్..” అన్నాను.

మాటలోనే మసాలా వడలొచ్చాయి.

“భలే ముద్దొస్తుంది కదూ.. రూపాయి బిళ్లంత ఉండీ!” అన్నారు మళ్లీ. “అబ్బా..” గుసగుసగా హెచ్చరించా.

వరుసనే పదార్థాలు వడ్డిస్తూ వెళ్తున్నారు.

“మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయన పేరు ప్రసాదా?” అడిగారు.

“కాదు, వైకుంఠరావు” అన్నాను

విస్తరిలో గుప్పెడు కూడా లేని బిర్యానీని చూపిస్తూ.. “ప్రసాదంలాగా వడ్డిస్తుంటే.. ఓ వారం వీళ్ళింట్లో ఉంటే వైకుంఠమే వెళ్లొచ్చు”

నేను జవాబు ఇవ్వకుండా తినసాగాను.

“ఇదిగోచూడు.. రెండు బెండకాయ ముక్కలు ఒక జీడిపప్పుబద్దా, మష్రూమ్ కర్రీలో ఒక ముక్క దాన్నంటిన గుజ్జు.. అరే! ఏదీ అన్నంలో కలుపు కోవడానికి చాలడంలేదు.. ఛ!”

“ప్చ్.. మెల్లగా, ప్రక్కవాళ్ళింటారు”

“వినేదేంటి? వాళ్ళుమాత్రం చూడటం లేదా?”

“అయ్యో..”

“అయ్యోలేదు కుయ్యోలేదు. ఉప్పు సరిపోయిందో లేదో చూడడానికి వేసినట్లుంది. ఎట్లా తినేడవడం”

“రామచంద్రా..”

“మళ్లీ ఆయన్నెందుకు పిలుస్తావ్? మనం తింటానికే లేదిక్కడ” చిరాగ్గా అంటున్నారాయన. అంతలో సాంబార్ బకెట్ తెచ్చారు.

“పొయ్యండయ్యా.. పొయ్యండి, ఐ డ్రాప్స్ పిల్లర్ ఉందా, ఇంక్ పిల్లర్‌తో పోస్తారా?”

ఈయనేదో జోక్ చేశారనుకుని నవ్వుతూ గరిటెడు పోసి వెళ్ళారు.

అటుఇటు కూర్చున్నవాళ్లు తలతిప్పి చూశారు. నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది.

నాకు తెలుసు ఈయన్ని తిండి దగ్గర సమాధానపరచలేమని.

కానీ.. సుచరిత వాళ్ళ స్థితిని బట్టి మరీ ఇంత పొదుపుగా ఉంటాయని అనుకోలేక పోయాను.

సాంబార్ అన్నంలో నంజుకోవటానికి అప్పడాలు వడియాలకు మారుగా వేయించిన గొట్టం ముక్కలు (పిల్లలు గోల్డ్ ఫింగర్స్ అంటారు) వేశారు.

“సీతా! మన బుజ్జిగాడు ఉంగరాల్లా వేళ్ళకు తగిలించుకుని, సరదా తీరాక తింటాడు చూడు? అవి ఇవి.. ఈ మూడు గొట్టం ముక్కలు ఓ పంటి కిందకుకూడా రావుగాని.. మనమూ ఉంగరాల్లా పెట్టేసుకుందాం!”

ఆయన మాటల్లో అసంతృప్తి, కళ్ళల్లో కడుపు నిండని ఆకలి ఉంది.

పక్కవాళ్ళు వింటున్నారేమోననీ, మా గుసగుసలకు ఏమనుకుంటారోననీ.. నాకు పీకులాటగా ఉంది.

“హమ్మయ్య! పెరుగు బకెట్ వస్తుంది. దానిలో చెంచా వేసి ఉంటారు. కావాలంటే చూడు?” అన్నారు.

అంతలోనే కిళ్ళీలు పెట్టివెళ్లారు.

“తిన్నది అరగటానికి వేసుకుంటారు కిళ్లీలు.. ఆకలి కడుపున ఎవడైనా వేసుకుంటాడా?”

నేను నెమ్మదిగా ఆయన వైపు బతిమాలుతున్నట్లుగా చూశాను.

***

ఎట్లయితేనేం.. బయటపడ్డాం. నాకు తెలుసు, ఇంక దారిపొడుగునా మావారి చిరచిరలను, చిటపటలను భరిస్తూనే ఉండాలని.

“ఎంతో ఆడంబరాన్ని చూపి, కిలోల బంగారునగలు దిగేసుకుని పబ్లిసిటీ ఇచ్చుకోవడం కాదు.. పిలిస్తే వచ్చిన వాళ్లకి కడుపునిండుగా కమ్మని భోజనం పెట్టి పంపాలనే ఇంగితం ఉండాలి.”

“………………”

“నీకు తెల్సా? సంపదకు, విద్యకు కీర్తికి తృప్తి, అంతూ ఉండదు. ఒక్క భోజనం మాత్రమే కడుపు నిండాక చాలు అనిపించేది”

“ఈ భోజనం భజనేంటండీ బాబూ..”

“ఛ! వచ్చి తప్పుచేసాం, రాకుండా ఉండాల్సింది. శ్రమకు శ్రమ, ఖర్చుకు ఖర్చూ.. ఆకలికి ఆకలి!”

నాలో సహనం చచ్చిపోయింది

“నాకు తెలియక అడుగుతాను.. శుభకార్యాలకు వెళ్ళేది కేవలం తిండి కోసమేనా? మొహం వాచినట్టు మాట్లాడుతుంటారు.. ఛండాలంగా!” అన్నాను.

“ఏంటీ.. ఛండాలంగానా? భోజనం గూర్చి తక్కువగా, తేలిగ్గా మాట్లాడకు. ఔను! నేను వెళ్లేది మంచి తిండి కోసమే! భోజనానికి పిల్చి, బడాయి చూపుకుంటూ అర్ధాకలితో పంపడం ఏంటి? లోన నకనకలాడుతున్నా.. పైకి నాజూకు మాటలు నాకు చేతకాదు”

“రామ రామ!”

“‘విందు భోజనం’ అంటే నిజంగానే నేనాశపడతాను. రోజూ రకరకాల వంటలతో అందరితో కల్సి నవ్వుతూ పేలుతూ సరదాగా కమ్మగా తినడం సాధ్యం కాదు కాబట్టి. కాకపోతే.. పెళ్లిళ్లలో.. వేటిలో ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియకా? ఎగేసుకుంటూ వెళ్ళేది?”

“ఆత్మీయులుగా ఆశీర్వదించడానికి”

“అబ్బో.. అబ్బోసి! ఆశీస్సుల బలం ఎంతో చాలా దృష్టాంతాలు చూశా”

అసలే అర్ధాకలితో ఆవేశంగా ఉన్న ఆయన మాటల ధాటికి ఎదురుచెప్పే ధైర్యం, వినే ఓపిక నాలో సన్నగిల్లింది

మౌనంగా ఆయనను అనుసరిస్తూ, వెనుకనే నడుస్తున్న నేను ఆయనతో పాటు ఒకచోట లోపలికి వెళ్ళబోతూ తలెత్తి బోర్డ్ వైపు చూశాను..

‘హోటల్ అభిరుచి!’

Exit mobile version