[డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి ‘అభిశప్త’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
[dropcap]“స[/dropcap]హితస్యభావం సాహిత్యం” అంటారు. ఆనందంతో పాటు మానవతకు అద్దం పట్టి తోటివారి పట్ల సహృదయత, సహకారమును పెంపొందిపచేసేదే నిజమైన సాహిత్యం.
సారస్వతకళానిధి డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మిగారు ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రాచార్యులుగా పనిచేశారు.
సహజంగానే సహృదయశీలి అయిన ఆమె పదవీ విరమణానంతరం బాలల సంరక్షణ సభ్యురాలిగా నియమితులై, త్రికరణశుధ్ధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
వారి కలం నుండి జాలువారిన ‘అభిశప్త’ అను ఈ కథాసంపుటిలో మొత్తం 22 కథలున్నాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క వ్యథాభరిత జీవితం నుండీ పుట్టినది. ఇందులోని పాత్రలన్నీ అభిశప్తలే. ఇందలి కథలలో కొన్ని విశాలాంధ్ర, తెలుగుతేజములలో ప్రచురింపబడ్డాయి. నిజానికి ఇవి కథలు కావు చదివి మరచి పోవటానికి. నిజ జీవితంలో మన చుట్టూ తిరుగాడే మనుషుల వ్యథలే ఇందులో కనిపిస్తాయి. కదిలిపోయే మనసుంటే కనీసం కొందరి నయినా ఆదుకోవచ్చన్నది రచయిత్రి ప్రధాన ఉద్దేశము.
సామాన్యంగా కథలలో వుండే కల్పనలు ఇందులో కనిపించవు. బలహీన, నిస్సహాయమైన స్త్రీల సమస్యలను చర్చించి సమాజంలో ధైర్యంగా నిలబడటానికి చదువు యొక్క ఆవశ్యకతను వివరించి చెప్పారు రచయిత్రి.
మొదటి కథ పేరే రచయిత్రి సంకలనానికి పెట్టడం జరిగింది.
అందమైన తన జీవితాన్ని ఆటవస్తువుగా చేసి మందులు లేని ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటానికి కారణమైన వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిధ్ధపడిన శిరీష నిజంగా అభిశప్తే. మనసన్నవాడని స్నేహం చేస్తే తన స్నేహితులతోకలిసి జీవితాన్ని నాశనం చేస్తే కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి చదువుకుని తనకు అన్యాయం చేసినవాళ్ళకు శిక్షపడేలా చేసిన లావణ్యలా ధైర్యంగా వుండాలన్న సందేశం కనిపిస్తుంది.
వ్యామోహంతో దారితప్పి బిడ్డనుకని వదిలేసిన ఆధునిక కుంతి రాములమ్మకూతురు.కన్నబిడ్డ మరొకరి సంరక్షణలో పెరుగుతీన్నాడని తెలసుకుని తన బ్రతుకు చక్కదిద్దుకోవటానికి చదువే దిక్సూచిగా భావించి,
చేసిన తప్పుదిద్దుకుని జీవితంలో ఎదగాలనే బోధనే ఋణానుబంధం కథ.
చదువుకోవాలనుకున్న సరళకు తలిదండ్రులు 15వ ఏట పెళ్ళి చెయ్యబోతే తోటివారి సాయంతో బాలల సంక్షేమం వారికి తెలియపరచి పరిస్థితులను ఎదుర్కోవటం లక్ష్యం కథాంశం. మబ్బులు విడిచిన సూర్యుడులో సూర్య మెకానిక్ పని వదిలి వెళ్ళటాన్ని చదువు అనే తేజస్సుతో కాంతివంతంగా వెలుగులీను సూర్యునితో పోల్చటం మనస్సును కదిలిస్తుంది.
పుష్కరాలలో తప్పిపోయిన కొడకు కోసం తలిదండ్రులు పడే ఆరాటం, వారికోసం కొడుకుపడే తపన 20 ఏళ్ళ తరువాత మళ్ళీ అదే పుష్కరాలలో ఒకరిని ఒకరు కలుసుకోగలగటం లోని ఉద్వేగాన్ని, బాధను, ఆనందాన్ని అమ్మ దొరికింది అన్న కథలో అద్భుతంగా చూపారు రచయిత్రి. మూలాలను మరిచి పోకుండా తోటివారికి సహాయం చేయటంలోగల సంతృప్తిని కుమార్తెకు వివరించటంలో మనిషి ఎప్పుడూ తానెక్కిన మొదటి మెట్టును మరిచి పోరాదన్నదే ప్రస్థానం కథాంశం.
తల్లిదండ్రులిద్దరు ఎయిడ్స్‌తో చనిపోతే సంక్షేమపాఠశాలలో చదువుకుని తనతోటి స్నేహితురాలిని వివాహం చేసుకుని జీవితాల్లో వసంతం నింపుకున్నకథ మనసును కదిలిస్తుంది.
ఈ విధంగా ఈ సంకలనంలోని కథలన్నింటిలో రచయిత్రికి కల సామాజిక దృక్పథం, మానవీయత ద్యోతకమవుతున్నది. కథలంటే కాలక్షేపం కొసం కాక ఆలోచింపచేసేటట్లుగా వున్నాయి. మనిషికి మానవత్వం ముఖ్యమని బోధిస్తాయి. బాలికల సంక్షేమశాఖలో వున్న రచయిత్రి వారి సాదకబాధకాలను ప్రత్యక్షంగా చూచి వివరించారు.
పాఠకుల మనస్సులను కదిలించే విధంగా ఆలోచనాత్మంగా కథలను రచించిన రచయిత్రి కృషి బహుధా ప్రశంసనీయము. వారికి కృషికి ధన్యవాదములు.
***
అభిశప్త (కథాసంపుటి)
రచన: డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
పేజీలు: 138
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://logilitelugubooks.com/book/abhisapta-dr-veluvoli-nagarajyalakshmi