అభిషేకం

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి స్మృతిలో లేఖిని సంస్థ నిర్వహించిన కథల పోటీలలో ప్రత్యేక బహుమతి ₹1,000/- గెలుచుకున్న కథ ఇది. రచన శ్రీమతి కే వాసవదత్త రమణ. [/box]

[dropcap]”అ[/dropcap]ద్భుతం స్వాతి. మీ నాట్యం చూడటం నిజంగా నా అదృష్టం” గ్రీన్ రూమ్‌లో మేకప్ సరి చేసుకుంటున్న నన్ను దమయంతిగారు గారు గట్టిగా చుట్టేసుకుంటూ అభినందించారు.

“థాంక్స్” అంటూ చిరునవ్వు నవ్వాను.

“స్వాతి గారు, సభ అనంతరం మీకు సన్మాన కార్యక్రమం ఉంది. మీరు వేదిక మీదకు త్వరగా వచ్చేయండి. దమయంతి గారు చెన్నై నుంచి ఇక్కడి సెటిల్ అవ్వడానికి వచ్చారు. మొట్టమొదట మీ ప్రదర్శనతోటే అవిడ శ్రీకారం చుట్టారు” ఆవిడ వెనకాలే వస్తూ, సంస్థ అధ్యక్షులు క్రిష్టమూర్తిగారు అన్నారు.

“స్వాతి గారి నాట్యం అమోఘం. అద్భుతం” అంటూ స్టేజి మీదున్న వక్తలందరు ప్రశంసిస్తున్నా, నా కళ్ళు మటుకు నా ప్రియమైన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ‘శ్రీహర్ష’ ఇవాళ కూడా లోపలికి రాలేదా? మా పెళ్ళయిన ఈ ఏడాదిలో నేను ఎన్నో ప్రదర్శనలులిచ్చాను. కారులో తీసుకువచ్చి సభ దగ్గర దింపి వెళ్లిపోతాడు కానీ లోపలి రాడు.

“పెళ్ళికి ముందే, మనం ఈ విషయం మీద అవగాహనకి వచ్చాం కదా. మళ్లీ ఎందుకు ఈ విషయాన్ని సాగదీసి, అనవసరంగా నీ మూడ్ పాడు చేసుకుంటావు” అంటాడతను. చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టపడి నేర్చుకున్నాను. ఇటు హర్ష!! అటు నృత్యం!! ఎటు వైపు తేల్చుకోలేక నాలో నేను రగిలిపోతున్నాను. ప్రేక్షకులు చప్పట్లతో ఈ లోకానికి తిరిగి వచ్చాను.

సభానంతరం శాలువా, సన్మాన పత్రం, పూల దండ నా కారులో పెట్టిస్తూ “ఈవాళ చాల ఆనందంగా ఉందమ్మా” అన్నారు దమయంతిగారు. అన్యమనస్కంగా తలూపి, అందరి దగ్గరి నుంచి వీడ్కోలు తీసుకున్నాను.

కాలింగ్ బెల్ కొట్టగానే ఎదురుగా తెల్లటి బట్టలతో శ్రీహర్ష నవ్వుతూ స్వాగతం పలికాడు.

“పెద్ద సన్మానం” అందామనుకున్నాను. మౌనంగా బెడ్ రూంలోకి వెళ్లాను. ఎదురుగా మా పెళ్లి ఫోటో కనిపించింది, హఠాత్తుగా నాలో కోపం పూర్తిగా చల్లారిపోయింది. నా కళ్ళ ముందు శ్రీహర్షతో పరిచయం, ప్రేమ, పెళ్ళి అన్నీ రీలులాగ తిరిగాయి.

***

“స్వాతి, మా అన్నయ్య శ్రీ హర్ష” నన్ను పరిచయం చేస్తూ అంది లత.

“నమస్తే” అన్నాను.

“లత చెప్పింది కరెక్టే. మిమ్మల్ని చూడగానే తెలుగు అమ్మాయి అనే అనుకుంటారు” నా వంక చూస్తూ అన్నాడతను.

“మా నాన్నగారు పుట్టి పెరిగిందంతా ఇక్కడి ప్రాంతమే. మా అమ్మగారిది చెన్నై. అందుకే మాకన్నీ ఇక్కడ తెలుగు అలవాట్లే వచ్చాయి.”

“ఇంత స్వచ్చంగా తెలుగు మాట్లాడటం చూస్తుంటే, మీరు తెలుగు వాళ్ళు కాదంటే మటుకు ఎవ్వరూ నమ్ముతారు?” గట్టిగా నవ్వాడతను.

చూడటానికి సన్నగా పొడవుగా, కొద్దిగా చామనఛాయగా ఉన్న అతని నవ్వు ఓ పెద్ద ఆకర్షణగా అనిపించింది. అంత స్వచ్ఛంగా, అందంగా మగవాళ్ళు నవ్వడం చూడటం ఇదే తొలిసారి. ఆడవాళ్ల నవ్వు మీద కావ్యాలు చాల ఉన్నాయి. ఏ కవులైనా అతని నవ్వు చూస్తే, ఇక మగవాళ్ల మీద కావ్యాలు రాస్తారేమో?

“అన్నయ్యా చెప్పానుగా, తను మంచి డాన్సరు కూడా” అంది లత.

నా వంక మరింత అభినందనగా చూస్తాడనుకున్నాను. కానీ కొద్దిగా చిరాగ్గా, అనీజీగా కదిలాడు. హఠాత్తుగా ఎందుకనో మా అమ్మ గుర్తుకు వచ్చింది. మా అమ్మకి నేను నాట్యం నేర్చుకోవటం అసలు ఇష్టం ఉండేది కాదు. “కావాలంటే సంగీతం నేర్చుకో, కానీ నువ్వు అలా పదిమంది ముందు తైతక్కలాడటం ఏంటి?” అనేది. మా ఇంట్లో చిన్నప్పటినుంచీ నాకన్నీ ఆంక్షలే పెట్టేది. నాన్న మటుకు, ప్రతి మనిషి మానసిక వికాసానికి ఏదో ఒక కళలో పరిచయం ఉండాలని నమ్మేవాడు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్. అందుకే అన్ని రకాల కళల మీద నాకు అభిరుచి కలిగించాడు. చివరికి, నా మనస్సు డాన్సు వైపుకే మొగ్గింది. మా ఇంట్లో అద్దెకుండే ఆవిడ దగ్గర మొదలైన నా నాట్య ప్రస్థానం, స్టేజి ప్రదర్శనలు దాకా వెళ్ళడం వెనుక నాన్న కృషీ, త్యాగాలు చాలా ఉన్నాయి.

మర్నాడు కలిసినప్పుడు, “వచ్చే ఏడాది మా బావతో నా పెళ్లి, పెళ్లవగానే నాన్నని కూడా నాతోనే దుబాయికి తీసుకెళ్లిపోతాను. అమ్మ కూడా మాతో లేదు కదా. అన్నయకి, నాన్నకి అసలు పడదు” అంది లత. ఇన్నాళ్ల మా స్నేహంలో తను ఎప్పుడు తన ఇంటి విషయాలు నాతో చెప్పుకోలేదు. అందుకే తన వంక ఆశర్యంగా చూసాను.

“మా చిన్నతనంలోనే నాన్నని వదిలేసి, మా అమ్మ తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అందుకని అన్నయ్యకి అమ్మ మీద చాల కోపం. వాడి బాధనంతా రకరకాలుగా ప్రదర్శిస్తాడు. వయస్సు పెరిగే కొద్ది మా నాన్న మా అమ్మని అర్థం చేసుకున్నాడు. కానీ వాడే….” లత గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

నా మనస్సు ఎందుకో కలుక్కుమంది. ఓదార్పుగా తన భుజం మీద చేయి వేసాను.

“స్వాతి, మా అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోవడాన్ని అన్నయ్య ఇన్నేళ్లయినా జీర్ణించుకోలేపోతున్నాడు. ఆడవాళ్ళ స్వేచ్ఛ మీద కోపాన్ని రకాలుగా వ్యక్తం చేస్తాడు, ఒక్కోసారి ఆధునిక భావాలు కలిగిన వాడిలా కనిపిస్తాడు. కానీ ఒక్కోసారి సంకుచిత భావాల్ని ప్రదర్శిస్తాడు. టీవిలో ఏదైనా ప్రేమ సన్నివేశం వచ్చిందనుకో, వెంటనే కట్టేస్తాడు. అంత ప్రేమ తనకు ఏ రూపంలోనూ దక్కలేదని తనలో తాను తెగ బాధ పడిపోతాడు. సినిమాలో, టీవీలలో, బయటైనా ఆడవాళ్ళూ పొట్టి డ్రెస్సులు వేసుకుంటే కోపం, మన ఇంట్లో ఆడవాళ్ళని గౌరవంగా చూసుకుంటూ బయట ఇలా చూపిస్తుంటే ఎవరు స్పందించరే అని ఆవేశపడిపోతాడు.”

హఠాత్తుగా నా కళ్ళ ముందు మబ్బు తెరలు తొలగి పోయాయి. పాపం అతన్ని కుసంస్కారిగా భావించి అపార్థం చేసుకున్నాను. ప్రతి మనిషిని తన కుటుంబ నేపథ్యం ప్రభావితం చేస్తుంది. అందుకు నేనే కాదు అతను కూడా మినహాయింపు కాదు కదా. శ్రీహర్ష మీద నాకు చాలా జాలేసింది. పాపం తనలో తాను పెద్ద యుద్ధమే చేసుకుంటున్నాడు. శ్రీహర్షతో స్నేహం పెరుగుతూ ఇళ్లకు రాకపోకల వరకు వచ్చింది.

***

హఠాత్తుగా ఓ రోజు “స్వాతీ, లత పెళ్లి అయి వెళ్లి పోయింది. రెండేళ్ళ మన స్నేహం, మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కల్పించింది. ఆ ధైర్యంతోనే ఐ యామ్ ప్రపోజింగ్. ఐ లవ్ యు స్వాతీ” అన్నాడు శ్రీహర్ష.

నా మనసులో మాట అతని అందమైన చిరునవ్వు వెనక మురిపాల మాటల రూపంలో మెరిసినందుకు ఆనందంలో పులకరించి పోయాను. అంగీకారంగా తల ఊపుతూ “ఇంత లేటుగానా. మీ టూ హర్షా” కొద్దిగా సిగ్గుపడుతూ అన్నాను.

“కాని, మనిద్దరి మధ్యా ఒక అడ్డు ఉంది” ఆగాడతను. అతని వంక ఆలోచనగా చూసాను.

“మనం జీవితాంతం ఈ అందమైన బంధాన్ని నిలుపుకోవాలంటే, నువ్వు డాన్స్‌ని వదలుకోవాలి” నా ముఖంలోని భావాల్ని లోతుగా పరిశీలిస్తూ స్థిరంగా అన్నాడు.

ఆనందం ఆవిరైంది. నా గుండె ముక్కలైంది. కన్నీటిని అదిమి పెట్టుకుంటూ, “డాన్సు నా ఊపిరి. దయ చేసి నన్ను, నా ఆత్మని ప్రేమ, పెళ్ళి పేరుతో విడదీయకు హర్షా” అన్నాను.

“ఇదేనా నీ నిర్ణయం?” దెబ్బ తిన్నట్టుగా చూస్తూ అడిగాడు.

“డాన్సుతో కానీ, ప్రదర్శనల వల్ల కానీ నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. భర్తగా నీ మర్యాదకు ఎలాంటి భంగం కలిగించను” అని అతన్ని ఎంతగానో ప్రాధేయపడ్డాను. కానీ ఒప్పించలేకపోయాను. శ్రీహర్ష మొండి పట్టుదల పట్టేసాడు. అంతే మళ్ళీ అతను నాకు కలవలేదు. గుర్గావ్‌లో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడని తెలిసింది. అతని జ్ఞాపకాలతో బతుకు భారంగా నడుస్తోంది. ఇంట్లో వాళ్ళకి నా ప్రేమ విషయం తెలిసి, గొడవ మొదలైంది.

“అతనొక గతం. వదిలేయి స్వాతి. నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను” నాన్న అన్నాడు.

“లేదు నాన్నా, నేనెవరిని పెళ్లి చేసుకోలేను. ఆతను లేకపోతే శూన్యం అయిపోయినట్టుంది” ఆవేదనగా అన్నాను.

“అంతా నీకు నచ్చినట్లుగా జరగదు” అమ్మ రౌద్రంగా అంది.

అమ్మని చేత్తో వారిస్తూ, “ఇలాగ ఎన్నాళ్ళని ఒంటరిగా బతుకుతావు తల్లీ?” నాన్న అన్నాడు. సమాధానం చెప్పలేక గట్టిగా ఏడ్చేసాను.

“దాన్ని అడిగేదేమిటి” అమ్మ మొండిగా సంబంధాలు చూడటం మొదలు పెట్టింది. ఓ రోజు నాకు పెళ్ళి చూపులు జరుగుతుండగా, హర్ష హడావిడిగా లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే నా కళ్ళలో వేల మెరుపులు మెరిసాయి. ఆ వెంటనే కన్నీళ్లు వరదలా తన్నుకు వచ్చాయి.

నా చేయి పట్టుకుని, “స్వాతి, నేను నీతో ఒక్కసారి మాటాడాలి“ గంభీరంగా అన్నాడు. అమ్మ, నాన్న అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. మనిషి కొద్దిగా చిక్కాడు. గెడ్డం పెంచాడు. బాగా నలిగిపోయి ఉన్నాడు. “నాకు ఏం చెప్పాలో తెలియదు. కాని ఒక్కటే నాకు అర్థమవుతోంది. నువ్వు నాకు కావాలి. అంతే. నేను అన్నిటికి ఒప్పుకుంటున్నాను. మనం పెళ్లి చేసుకుందాం” నా కళ్ళలోకి చూస్తూ అన్నాడు.

పెళ్ళి చూపుల తంతు రసాభాసాగా ముగిసింది.

“ఏంటి, నా కూతురి భవిష్యత్తుతో ఇలా అటలాడుకుంటున్నావ్? దాన్ని ప్రేమించానంటావు, ఆశలు రేపీ వెంటనే పారిపోతావు? ఇది మీ ఇద్దరి జీవితం మాత్రమే అని అనుకుంటున్నావు. కానీ ఇది రెండు కుటుంబాలకు సంబంధించిందని మరిచిపోతున్నావు. ముందే నువ్వు ఇంత బాధ పెడుతున్నావు, పెళ్ళాయ్యాక ఇంకెన్ని బాధలు పెడతావో? నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. అన్నింటికి ఓ దండం. నా కూతుర్ని వదిలేవయ్యా, వెళ్ళు” నాన్న అతని మీద నిప్పులు చెరిగాడు. కాని హర్ష నా చెయ్యి వదల్లేదు.

“ఇక వదలనండి, తనని ఎప్పటికి వదులుకోలేను. తాను నా ప్రాణం. అది అర్థం కావడానికి నాకు సమయం పట్టింది. నా జీవితం చేజారిపోకుండా ఉండాలని ఇంత దూరం పరిగెత్తుకు వచ్చాను. నన్ను నమ్మండి. మీ స్వాతి ఇక నుంచి ‘మీది కాదు’ నాది” ఆవేశంగా అన్నాడు.

అతని చేతిలో నా చేయి బిగిసింది. నా ప్రాణం అతనిలో కలసి చాలా కాలమైందన్న నిజం నాకు కూడా తెలిసి వచ్చింది. అతను వదిలినా, ఇక నేను అతని చేయిని వదలదలుచుకోలేదు.

మా పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. శ్రీహర్ష నాన్న కూడా రాలేదు. మా వాళ్లు రాలేదు. మాది చాలా ఆదర్శ దాంపత్యం అనుకుంటున్నాను కానీ మా ఇద్దరి మధ్యా అడ్డుగోడలా ఇవాల్టికీ నా నాట్యం ఇంకా నిలిచి ఉందని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను.

***

“ఏంటీ, ఇంకా స్నానం చేయలేదా?” హర్ష నా భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు.

గతాన్ని వదలి అతని కళ్ళలోకి లోతుగా చూసాను.

“ఇప్పుడేం మాట్లాడకు. ప్లీజ్, ఆకలి దంచేస్తుంది. ఇవాళ వంట బ్రహ్మాండంగా కుదిరింది. స్నానం చేసిరా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం” అంటూ సున్నితంగా నన్ను బాత్రూమ్‌లోకి నెట్టాడు. స్నానం చేయగానే అలసట తగ్గినట్లనిపించింది. నైటీ వేసుకుందామని బీరువా వైపు వెళుతుంటే మంచం మీద తెల్లచీర, జాకెట్టు, లంగా, రెండుమూరల మల్లెపూలు పెట్టి ఉన్నాయి.

“ఒకరి మనసు ఒకరు తెలుసుకొని మసిలితే జీవితమే నందనవనం కదా” చీర కట్టుకుంటుంటే ఎందుకో మనస్సుకి హాయిగా అనిపించింది.

కాని నా గుండెలోతుల్లో అట్టడుగున చిన్న అసంతృప్తి సవ్వడి. ఎంత అణగదొక్కినా మళ్లీ లేస్తోంది.

“ఏమిటా ఆలోచన” అంటూ కొనరి కొసరి అన్నం తినిపించాడు. అన్ని సర్దుకొని మంచం మీదకు చేరాం. అపురూపంగా నన్ను నా గుండెల్లో దాచుకున్నాడు. అంతవరకు గుండెల్లోని దుఃఖం అతని సాన్నిహిత్యంలో కన్నీళ్ళ రూపంలో బయట పడింది.

“ఏయ్ పిచ్చి, ఏమిటా ఏడువు?” అతని గొంతులో గిల్టీ ఫీలింగ్ తెలుస్తూనే ఉంది. నా ముఖాన్ని తన అర చేతుల్లోకి తీసుకొని నా కళ్ళలోకి చూస్తు, “నాకు తెలుసు, నీ బాధకు నేనేగా కారణం” అంటూ ఇంకా ఏదో చెబుదామనుకొని ప్రయత్నించి, అతను మళ్లీ మౌనం వహించాడు.

“నువ్వు రావని తెలుసు. కానీ గ్రూప్‌లో ఉన్న ఇతర డాన్సర్స్‌ని వాళ్ళ భర్తలు దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తూ ఉంటే, నేనెంతో కోల్పోయినట్లుగా బాధ వేస్తోంది. ప్రతి ప్రోగ్రాంకి, నేను ఒంటరిగానే వెళుతున్నాను. స్టేజి ఎక్కిన ప్రతిసారి నీ కోసం ఆశగా వెతుకుతాను. నీ రాక కోసం ఆఖరి నిమిషం వరకు నా కళ్ళు గాలిస్తూనే ఉంటాయి. కానీ నువ్వు రావు!” బేలగా అన్నాను.

“స్వాతి, ఏడవకు, నేను నీకేం లోటు చేసాను? చెప్పు, ఈ ఒక్క విషయంలో నువ్వు క్షమించలేవా? ఇది అహం అనుకో, ఏదైనా అనుకో. పదిమంది ముందు నువ్వు స్టేజి మీద డాన్స్ చేయడం చూడలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో.”

అతను నా కళ్ళకు “సారీ మమ్మీ” అంటున్న చిన్నపిల్లాడిలా అనిపించాడు.

ఇక తెగేవరకు నేను కూడా లాగదలుచుకోలేదు. శ్రీహర్ష అన్ని విషయాల్లో ఫరఫెక్ట్. కాని మనిషి దేవుడు కాదు కదా – నా మనస్సు గెలుచుకోవటం కోసం, తన అహాన్ని జయించడానికి అతను చేసే ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది. కాని ఎప్పటికి విజయం సాధిస్తాడో? నెమ్మదిగా నాలోని అసంతృప్తిని జోగొడుతూ, అతను మెడ చుట్టూ ప్రేమగా చేతులు వేసాను.

రోజులు గడుస్తున్నాయి. ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాను. కానీ శ్రీహర్ష రాడు. అతని దృక్పథంలో మార్పు ఏమి లేదు, “స్వాతీ, నీ అభిరుచి, నీ ఇష్టం.” అంటాడు. కానీ ఆ మాటల్లో నిండుదనం ఉండదు. మానేస్తే మంచిదన్న ధ్వని ఉందనిపిస్తుంది. అలా అని అతని ప్రేమలో ఏ లోటు లేదు. అందుకే, నేనే నిశ్చయించుకొన్నాను. ముందు నుంచి ఒప్పుకున్న రెండు ప్రోగ్రామ్లు చేసేసి నాట్యానికి పుల్ స్టాప్ పెట్టదామని. శ్రీహర్ష మారాలని, నా కోసం దిగిరావాలని కాదు కానీ నాకే ఈ జీవితం మీద విసుగుపుడుతోంది. ఇద్దరి మధ్య దాగుడుమూతలతో, రోజురోజుకి మా మధ్య అగాధాలు తెలియకుండా పెరిగిపోతున్నాయని నాకే అన్పిస్తోంది. అదే విషయాన్ని దమయంతిగారితో పంచుకున్నాను. నా నిర్ణయాన్ని విని ఆవిడ చాల బాధపడ్డారు.

***

“హర్షా, ఈవాళ ప్రోగ్రాంకి కొంచం తొందరగా వెళ్ళాలి. అన్నట్టు మర్చిపోయాను, ఒక చిన్న హెల్ప్ చేయాలి. రాధిక అని మా డాన్సర్, తనని మన కారులో పికప్ చేసుకోవాలి. మమ్మల్ని ఆడిటోరియం దగ్గర దింపేసి, ఆ తరువాత శ్రీవారు వెళ్లిపోవచ్చు” కొంటెగా అన్నాను.

“సరే అలాగే, కానీ ఏంటో విషయం, ఈవాళ పొద్దున్నుంచీ చాలా హుషారుగా; మన పెళ్లైన కొత్తల్లో ఉన్నట్టుగా ఉన్నావు” నవ్వుతూ అన్నాడు.

అతని బుగ్గ మీద వేలితో సుతారంగా రాసి, “సస్పెన్సు మై డియర్, యీ రోజు పోగ్రాం అయాక చెబుతాను” నవ్వుతూ అన్నాను.

అతని కళ్ళలో మెరుపులు మెరిసాయి. కారు రాధిక ఇంటి ముందు ఆగింది.

“హర్షా, నాతో ఇంట్లోకి రా. తనని పరిచయం చేస్తాను. రాధిక చాల మంచి అమ్మాయి” అంటూ, ఆమె ఇంటి తలుపు కొట్టబోతున్న నేను నా పేరు లోపలి నుంచి వినిపించి ఒక్క క్షణం ఆగాను. నేను ఎందుకు ఆగానో తెలియక, రావాలా వద్ద అన్నట్టుగా హర్ష నా వంక ఆశ్యరంగా చూసాడు.

“స్వాతి నిజంగా అదృష్టవంతురాలు. ఆమె కెరీర్ సంబంధించిన ఏ విషయంలోను తలదూర్చని మంచి భర్త దొరికాడు. అదే నేను ఉన్నాను, ఎందుకు? నా తల రాత ఇలా తగలపడింది?” రాధిక గొంతు దు:ఖంగా వినపడుతోంది.

వెటకారంగా నవ్వుతున్న ఆమె భర్త హరి గొంతు వినిపించింది.

“పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగే హర్షా నీకు ఆదర్శం. కాని, నేనంత చవటను కాను. వాడి ప్రేమకి తల ఒగ్గి, ఎన్ని మంచి అవకాశాలొచ్చినా స్వాతి ఇంకా స్టేజి మీద తప్పితే బయట ఎక్కడ ప్రదర్శనలు ఒప్పుకోవడం లేదు. బహుశా అందుకే తనని ఆలా గాలికి వదిలేసి ఉంటాడు, ఎంతో కష్టపడి తిరిగి అందరి కాళ్లు పట్టుకుని సినిమాల్లో, ఆడియో వేడుకల్లో అన్నిట్లో నిన్ను ప్రవేశపెట్టి నిన్నొక డాన్స్ స్టార్‌ని చేశాను.  బంగారు బాతును వదిలేసే మూర్ఖుడిని అనుకుంటున్నావా ఏంటి?” హరి కర్కశంగా అంటున్నాడు.

నేను షాక్ కొట్టినదాన్లా, శిలలా నిలబడిపోయాను. వేదికల  మీద రాధిక శాలువాను సరిజేస్తూ, ప్రేమగా ఆమె పక్కనే నిలబడే హరి రూపం నా కళ్ళ ముందు కదలాడింది. అందరి ముందు హరి ఎంత బాగా నటిస్తున్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది.

“ఏంటి అసలు మాట దాటవేస్తున్నావు, మొన్నీ ప్రోగ్రాముకిచ్చిన డబ్బు ఇంకా నా చేతికి ఇవ్వలేదు. మీ వాళ్ళకి చేరేస్తున్నావా ఏంటి? అందుకే ఇవాళ ప్రోగ్రాం‌కి నేనే తీసుకువెళ్తాను. నడు తయారవ్వు. ఈ మధ్యన నీకు పొగరు ఎక్కువయింది” గద్దిస్తున్న హరి గొంతు వినలేక గబా గబా వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చాను.

శ్రీహర్షకి విషయం అర్థం అయి, నా వంక ఆలోచనగా చూస్తూ కారును ముందుకు దూకించాడు. కారుతో పాటు నా ఆలోచనలు వేగంగా పరుగెడుతున్నాయి

“నిజంగా నేనెంత భ్రమలో ఉన్నాను. రాధికని చూసి నేనెంతో అసూయపడ్డాను. హర్షని ఎన్నో మాటలన్నాను. అతను నాకు విలువనివ్వట్లేదనని, నా డాన్సు పోగ్రామ్లకు రావడం లేదని ఎంత విసుక్కున్నాను. ఛీ… ఛీ… నేనెంత మూర్ఖురాలిని. పశ్చాతాపంతో నా గుండె బరువెక్కింది. హఠాత్తుగా నాన్న గుర్తుకువచ్చాడు.

ఓసారి హర్ష గురించి పరుషంగా మాట్లాడితే, “తప్పమ్మా, శ్రీహర్ష చాలా ఉత్తముడు. నీ పెళ్లికి ముందు అతని మీద నాకు కూడా చాలా అపోహలు ఉండేవి. కాని తరువాతి అర్థమైంది. అతను పుట్టి పెరిగిన వాతావరణంలోని అభద్రతా భావాన్ని అతను ఎంత ప్రయత్నించినా జయించలేక పోతున్నాడు. అంతే కానీ అతను నీ పట్ల చూపించే ప్రేమలో ఎటువంటి లోటు లేదు. స్వాతీ, మగాడు ఆడదాన్ని ఆకాశంలోకి ఎత్తకపోయినా ఫరవాలేదు, కాని పాతాళానికి తొక్కకుండా ఉన్నవాడే నిజమైన మొగుడు” నాన్న చెప్పిన మాటలు నా చెవిలో గింగురుమంటున్నాయి.

ఇప్పటి వరకు నా కళ్ళ ముందు ఉన్న అన్ని మబ్బులు విడిపోయాయి. నాట్యం మానేయాలన్నా నా నిర్ణయం పట్ల నాకున్న కొద్దిపాటి అసంతృప్తి, హరి ప్రవర్తనతో మటుమాయం అయ్యిపోయింది. హరి ప్రవర్తన నా అదృష్టాన్ని ఎత్తి మరీ చూపించింది. ఎప్పటిలాగే శ్రీహర్ష కారును తీసుకువచ్చి ఆడిటోరియం ముందు ఆపాడు. ప్రతీసారిలాగే “వస్తావా” అని అడగకుండానే మౌనంగా కారు దిగిపోయాను.

***

“ఇదే నా చివరి నృత్య ప్రదర్శన. ఇప్పటికే హర్ష చిన్నప్పటి నుంచి చాల సంఘర్షణ అనుభవించాడు. ప్రేమ కోసం అల్లాడాడు. నా తోడు అతనికి ఉపశమనాన్ని ఇవ్వాలి కానీ అగ్నికీలాన్ని కాదు” అలంకరణ చేసుకుంటూ బలంగా అనుకున్నాను.

తెర తొలగింది. సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా కదులుతూ సమ్మోహనంగా చిరునవ్వు చిందిస్తూ, దోసిట్లో పూలరేకులు పట్టుకొని సభకు నమస్కరిద్దామని ముందుకు వచ్చాను.

ఎదురుగా శ్రీ హర్ష ముందు వరుసలో కూర్చుని ఉన్నాడు. నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. తొలిసారిగా నా మనస్సు పురి విప్పిన నెమలే అయ్యింది. పూలరేకులు అభిషేకించి అంబరం అంటిన ఆనందంతో నృత్యం ఆరంభించాను. ఆదొక అనిర్వచనీయమైన అనుభూతి. సభికులు మంత్రముగ్ధులయిపోయారు. నాట్యం ముగిసింది.

“మీ అత్యుత్తమమైన ప్రదర్శనలలో ఇదొకటి” అభినందించారు దమయంతిగారు. శ్రీ హర్ష వంక చూసాను. కార్యక్రమం ముగిసాక శ్రీహర్ష చెయ్యి పట్టుకొని కారెక్కుతుంటే నాకెంతో గర్వంగా అనిపించింది. అతనేం మాటలాడలేదు కానీ అతనిలో ఏదో సంఘర్షణ చెలరేగుతోంది. అంత వరకే అర్థమైంది.

“నాకు ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ కలుగుతోంది. నువ్వు వచ్చి నా ప్రదర్శన చూసావు హర్ష. అది చాలు. చుట్టూ అందరి అభినందనల కన్నా, ఆత్మీయుల అభినందనలు కోట్ల కన్నా విలువ కదా. థాంక్స్, నా సంతోషాన్ని నేను మాటల్లోకి అనువదించలేను” అతని చేయి పట్టుకొని ఉద్వేగంగా అన్నాను.

“స్వాతీ, మన చుట్టూ మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. మనం దాని ఎలా స్వీకరిస్తే లోకం ఆలా కనపడుతున్నది అన్నది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. ప్రపంచం నుంచి నన్ను నేను చాలా దూరంగా విసిరేసుకున్నాను” అతని కళ్ళలో లీలగా చెమ్మ కనిపించింది.

“ఏంటిది, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు. ఏమైంది హర్షా?” అతని కళ్ళకి చూస్తూ అనునయంగా అన్నాను.

ఒక నిమిషం తర్వాత, “స్వాతీ దమయంతిగారు మా అమ్మ” అన్నాడు గంభీరంగా. నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. “నిజమా” అన్నాను.

అవిడ పదే పదే నా పట్ల చూపించే ఆప్యాయత స్ఫురణకు వచ్చింది. అతని వంక చూస్తూ ఉండపోయాను.

“స్వాతీ, నిన్ను దింపి వెళ్లిపోవడానికి కారు వెనక్కి తిప్పుకుంటుంటే ఎదురు వచ్చి, “హర్షా, నీతో ఒక్కసారి మాట్లాడాలి” అంది. అమ్మని చూడగానే షాక్ కొట్టినట్టుగా అనిపించింది. నా జీవితమంతా కళ్ళ ముందు తిరిగింది. నేను కలిసి ఎన్నో ఏళ్ళ అయ్యింది.

“హర్షా, మీ నాన్నా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, భావాలు సరిపడక ఇద్దరం విడిపోయాం. కానీ కొంచం సంయమనం నేను పాటించి ఉంటే, కొంచెం విశాలంగా మీ నాన్న అలోచించి ఉంటే మన అందరి జీవితాలూ మరోలా ఉండేవి. మా ప్రయాణంలో ఇద్దరం చాలా నష్టపోయాము. హర్షా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు మంచి భార్య దొరికింది. స్వాతి చాల మంచి అమ్మయి. నాకులా కాకుండా నీ ప్రేమకోసం తనలోని కళని చంపుకోవడానికి స్వాతి సిద్ధపడింది. అలాంటి భార్య నీకు దొరికినందుకు నాకు చాల ఆనందంగా ఉంది. కానీ జీవితాంతం ఆ అసంతృప్తి తనని వెంటాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తగా నీకుంది. మీ నాన్న, నేను పడ్డ సంఘర్షణలు మీ జీవితాల్లోకి తొంగి చూడకూడదు” గద్గద స్వరంతో అంది. నేను మౌనంగా అమ్మ వంక చూస్తూ ఉండిపోయాను.

“నిన్ను అమ్మలా పెంచి ఉంటే శాసించగలిగేదాన్నేమో కానీ దూరం నుంచి ఓ ఆప్తురాలిగా మంచి జీవితాన్ని గడపాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను” అంది కన్నీళ్లతో.

“ఇంతలో నీ నాట్యం మొదలవుతున్నదని ప్రకటన వినిపించింది. కనుమరుగవుతున్న అమ్మ రూపాన్ని చూసుకుంటూ, ఆమె వెనకాలే నడచి వచ్చి హల్లో అలాగే కూర్చుండిపోయాను.

స్వాతీ, మీ ఇంట్లో పరిస్థితి వేరు. మీ అమ్మ కొంత మారింది. మీ నాన్న కొంచం సర్దుకు పోయాడు. ఆ సర్దుబాటు వల్లే, పెళ్ళిలో వాళ్ళ మధ్య జీలకర్ర, బెల్లం పెట్టేముందు కట్టిన అడ్డు తెర మళ్లీ ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో కనిపించలేదు. కానీ మా ఇంట్లో అలా కాదు. నా చిన్నప్పటి నుంచి నిత్యం సంఘర్షణే. చివరికి అది మా అమ్మ, నాన్న విడిపోయేవరకు వచ్చింది. ఆలా నా జీవితం నడవకూడదనుకున్నాను. కానీ నా మొండితనం వల్ల నేనేమి కోల్పోయానో అర్థం అయ్యినదీ. అమ్మ మాటలవల్ల నీ ముందు నేను ఓడిపోయానని ఆలస్యంగానైనా తెలుసుకున్నాను. అందుకే ఆ అడ్డుతెరని తలవంచి నేనే తొలగించాను. మళ్ళీ మన మధ్య ఎప్పటికి కనిపించదని హామీ ఇస్తున్నాను” అన్నాడు.

“వద్దు, అంత పెద్ద మాటలొద్దు. మనం ఏడడుగులు కలసి నడచిన భార్యాభర్తలం. నువ్వు ఓడిపోతే నేను ఎలా గెలుస్తాను?” చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాను.

“స్వాతీ, ఓహ్, ప్రేక్షకుల స్పందన అపూర్వం. అందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. నిశ్శబ్ద తరంగాల్లా నీ నాట్యం చూస్తూ, తమని తాము మైమరచి పోయారు. అద్భుతమైన నీ నాట్యాన్ని చూసాకా, నేను ఇన్నాళ్ళు ఎంత మూర్ఖంగా గిరి గీసుకొని ఉన్నానో, నిన్నెంత బాధ పెట్టానో కూడా నాకర్థమైంది.”

అతని కళ్ళలోంచి కురుస్తున్న ప్రేమాభిషేకంలో తడిసి ముద్దైపోయాను.

“అవన్నీ వదిలేయి. నా వృత్తి, నా నాట్యం అంటూ నేనే నిన్ను చాలా విసిగించాను, నన్ను క్షమించు. ఇదే నా ఆఖరి ప్రదర్శన” అన్నాను.

“వద్దు, వద్దు నా కోసం నువ్విటువంటి నిర్ణయాలు తీసుకోకు.”

“నీ కోసం కాదు మహానుభావా. నా కోసమే. పోనీ, అలా కాదనుకుంటే మనకు పుట్టబోయే బేబీ కోసం విరామం అనుకో” అన్నాను గలగల నవ్వుతూ.

“నిజం, పొద్దున చెబుతానన్న గుడ్ న్యూస్ ఇదేనా?” అతని కళ్ళలో మెరుపులు మెరిసాయి.

“వెయిట్ అండ్ సీ” అతని భుజం మీద నిశ్చింతగా తల వాల్చాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here