[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి సింహాద్రి నాగ శిరీష పంపిన హాస్య కథ “అచ్చిబాబు పెళ్ళి” సావిత్రి లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్న అచ్చిబాబు పరిస్థితి ఏమయిందో వివరిస్తున్నారు రచయిత్రి. [/box]
[dropcap]ఆ[/dropcap]వేళ అచ్చిబాబు చాలా విషాదంలో మునిగిపోయి ఉన్నాడు. నిర్వేదంతో నీరసించిపోయి ఉన్నాడు. పిచ్చిపట్టినవాడిలా జుట్టు పీక్కుంటున్నాడు. ఆర్ట్ ఫిల్మ్ హీరోలా అకాశంలోకి చూస్తూ అదే పనిగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. రాత్రి నుండి ఇదే పరిస్థితి. ఇదంతా చూస్తున్న అచ్చిబాబు తల్లికి, చెల్లికి చెప్పలేనంత భయం పట్టుకుంది. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అదృష్టలక్ష్మి పిచ్చిలక్ష్మి రూపంలో తమ ఇంట్లో కుడికాలు మోపబోతోందని సంతోషించేలోపే ఇంతపెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందని ఊహించలేదు. అసలు అచ్చిబాబుకు వచ్చిన కష్టం ఏంటో తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళితీరవలసిందే.
తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అచ్చిబాబూ ఇది అచ్చిబాబు కుటుంబం. అన్న పెళ్ళి చేసుకొని ముంబైలో స్థిరపడ్డాడు. పెళ్ళయింది మొదలు నెలకొకసారి ఫోను, సంవత్సరానికొకసారి కలవటం. ఈ ఫాస్టుయుగం పుణ్యమా అని ‘హలో బాగున్నావా’ అంటే ‘బాగున్నావా అనేటటువంటి పలకరింపులు మాత్రమే మిగిలాయి. తండ్రి మరణం తర్వాత తల్లిని, చెల్లిని చూడాల్సిన బాధ్యత అచ్చిబాబుపై పడింది. ఎప్పుడూ తల్లి కొంగుపట్టుకు చంటిపిల్లాడిలా తిరిగే అచ్చిబాబు, ఇంత బాధ్యత ఒక్కసారిగా నెత్తిపైకి ఎత్తుకోగలనా అని చాలా భయపడిపోయాడు. లోపల భయపడుతున్నా, పైకిమాత్రం లేని గాంభీర్యం తెచ్చుకొని తండ్రి ఉద్యోగంలో చేరాడు. అచ్చిబాబు చెల్లి తన కాళ్ళపై తాను నిలబడాలని, చదువు పూర్తయీ అవగానే చక్కటి ఉద్యోగం సంపాదించుకుంది. కూతురి పెళ్ళి ఘనంగా చెయ్యాలని అచ్చిబాబు తండ్రి ఎన్నో కలలు కనేవాడు. కానీ ఆ శుభకార్యం చూడకుండానే స్వర్గస్థులు కావటంతో ఇంటిల్లిపాదిలోనూ ఏదో నైరాశ్యం చుట్టుముట్టింది. అచ్చిబాబు మాత్రం మంచి సంబంధం చూసి ఎలాగైనా చెల్లెలి పెళ్ళిచేయాలని, తండ్రి కల నిజం చేయాలని గట్టిపట్టుదల చూపినా, అతని చెల్లి మాత్రం ససేమిరా అని మొరాయించింది.
‘సరే…. ఎలాగూ చెల్లికి పెద్ద వయసేం ముదరలేదు. మరో రెండుమూడేళ్ళు ఆగవచ్చులే. నా భయమంతా నీగురించేరా అచ్చీ… వయస్సు ముప్పై దాటినా నాకొంగు వదిలిపెట్టవు. పెళ్ళి చేసుకుంటేనైనా నీ ధోరణిలో మార్పువస్తుందేమోనని నా ఆశ. ఇప్పటికే ముదురు బెండకాయలా తయారైపోయావు. ముందు నీపెళ్ళి చూడాలనుందిరా’ అంటూ కంటతడిపెట్టుకుంది తల్లి. అమె మాట కాదనలేక అప్పటికి ‘సరే’ అన్నాడు. కానీ మనసులో మాత్రం తను కావాలనుకునే అందం,గుణగణాలు గల పిల్ల దొరుకుతుందా అని ఆలోచనలో పడ్డాడు అచ్చిబాబు.
అప్పుడు అచ్చిబాబు వయస్సు 16. తండ్రిగారి పుణ్యమా అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసే మంచి అలవాటు అలవడింది. కాలేజీలో స్నేహితులతో ఎంత చెత్త సినిమాలు చూడటానికి తిరిగినా, ఇంటికొచ్చాక మాత్రం తండ్రిగారితో కలిసి తీరిక సమయాల్లో పాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూస్తుండేవాడు. మల్లీశ్వరి, బాటసారి – అచ్చిబాబు ఎక్కువగా ఇష్టపడే సినిమాలు. ఎన్నిసార్లు చూశాడో లెక్కలేదు. డైలాగులతో సహా బట్టీపట్టాడు. భానుమతి అంటే ఇక చెప్పనక్కరలేదు. అంతటి అందగత్తె గానీ, అంత గొప్పనటిగానీ, బహుముఖ ప్రజ్ఞాశాలికానీ ఈ భూప్రపంచంలోనే లేరని అచ్చిబాబు అభిప్రాయం. ఒకసారి ఏదో పరధ్యానంగా ఛానల్స్ తిప్పుతున్న అతడి దృష్టి ఓ పాత సినిమాపై పడింది. ఆ సినిమా టైటిల్ దేవత. సావిత్రి, ఎన్టీఆర్ నాయికానాయకులు. ఆత్రంగా చూడటం మొదలుపెట్టాడు. “ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి..’ పాట వస్తోంది. అచ్చిబాబులో ఏదో కదలిక. ఆహా! భార్య అంటే ఇలా ఉండాలి. సావిత్రి ఈ పాటలో ఎంత ఒదిగిపోయింది. అందానికి అందం. గుణానికి గుణం. తను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ‘ఆలయాన వెలసిన……” పాటలో సావిత్రిలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు. అన్న పెళ్ళి జరుగుతున్నంతసేపూ….. తనే ఇంటికి పెద్దకొడుకులా ఎందుకు పుట్టలేదా అని ఏ వందసార్లో తనను తాను తిట్టుకొని ఉంటాడు. ఆ ఛాన్స్ అన్నయ్య కొట్టేసినా… ‘ఆలయాన వెలసిన..’ పాటలో సావిత్రిలాంటి మహాఇల్లాలిని మాత్రం తన కుటుంబానికి తానే ఇవ్వాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. ఇప్పుడిక పెళ్ళిప్రస్తావన రాగానే కొంచెం తొట్రుపాటుకు గురయ్యాడు. ఎందుకంటే అచ్చిబాబు తన 16వ యేట నుంచి ఎదురు పడిన ప్రతి అమ్మాయిలో ‘ఆలయాన వెలసిన…’ పాటలో సావిత్రిని వెతుకుతూనే ఉన్నాడు. భంగపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అచ్చిబాబుకు 34 ఏళ్ళు. ఇన్నేళ్ళ నుంచి వెతికినా కనబడని తన కలలరాణి కనబడుతుందా? అసలు ఆమె పుట్టిందో, లేదో? ఒకవేళ పుట్టినా ఆమెను ఎలా కలవటం? ఏదేమైనా పెళ్ళంటూ చేసుకుంటే సావిత్రిలాంటి అమ్మాయినే చేసుకోవాలని ప్రతిజ్ఞ పూనాడు. అనుకున్నదే తడవుగా చుట్టుపక్కల అన్ని మ్యారేజిబ్యూరోలలో అతని వివరాలన్నీ నమోదై పోయాయి.
కొంతకాలం ఎడాపెడా సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కానీ తన ‘అలయాన వెలసిన…’ సావిత్రి మాత్రం దొరకలేదు. ఒకసారి ఇలాగే మ్యారేజిబ్యూరో వాళ్ళు సరిగ్గా తాను కోరిన లక్షణాలున్న సంబంధమని చెప్తే, ఆశగావెళ్ళిన అచ్చిబాబుకు అక్కడ కూడా నిరాశే మిగిలింది. ఆ అమ్మాయి అచ్చు సావిత్రిలానే ఉంది. కానీ ‘దేవత’ సినిమాలో సావిత్రిలా కాదు. ‘నాదీ ఆడజన్మే సినిమాలో సావిత్రిలా కారుమేఘంలా ఉంది పిల్ల. తను కోరుకున్న సావిత్రి పోలికలైతే ఉన్నాయి. అమ్మాయి చాలా మెతకగా కూడా కనిపిస్తోంది. పెద్దల పట్ల గౌరవం, భక్తిప్రపత్తులు కూడా మెండుగానే కనిపించాయి. పోనీ సర్దుకుపోదామా అని కాస్త మెత్తబడ్డాడు కానీ… చూస్తూ చూస్తూ మరీ యింత నల్లటిపిల్లనా అని మూలిగింది అతని మనసు. దాంతో ఆ సంబంధానికి కూడా ఎర్రజెండానే చూపించాడు. ఇలా వచ్చిన ప్రతి సంబంధానికీ ఏదో ఒక వంక పెట్టటం అచ్చిబాబుకు అలవాటైపోయింది. అమ్మాయి బొద్దుగా లేదనో, ఉమ్మడికుటుంబంలో అమ్మాయి కాదనో, లేదంటే చాలా ఫాస్టుగా ఉందనో పెదవి విరిచేవాడు. ఇంకోసారి సాక్షాత్తూ సంగీతసరస్వతినే ఎదురుగా నిలబెడితే… ఆ అమ్మాయి కచేరీలు పూర్తిగా మానేయాలని, అచ్చు సినిమాలో లాగా…. కేవలం తన కోసమే పాడాలని షరతుపెట్టాడు. నీకో దండం, ఈ పెళ్లికో దండం అంటూ ఈసారి పెళ్ళికూతురే ఎదురుదండం పెట్టేసింది.
‘ఇలాగైతే కష్టంరా బాబూ! నీతోపాటు నీ చెల్లెల్ని కూడా ముదరబెట్టేస్తున్నావు. నీకిదేమైనా న్యాయమా?’ అంటూ ఆక్రోశం వెళ్ళగక్కింది అచ్చిబాబు తల్లి.
ఆరునూరైనా… నూరురైనా…. నా ఆలయాన వెలసిన… సావిత్రి లాంటి పిల్లనే చేసుకుంటా. ఆమె కోసం ఎన్ని జన్మలైనా ఎదురుచూస్తా. దొరికిందా సరి. లేదంటారా…… జీవితాంతం ఘోటక బ్రహ్మచారిగానే మిగిలిపోతా. తల్లి సేవకే ఈ జీవితం అంకితంచేస్తా. ఇక చెల్లి విషయం అంటారా.. ముందు చెల్లి పెళ్ళిచేసేస్తే పోలా..’ అన్నాడు అచ్చిబాబు పెద్ద పరిష్కారం సూచించినట్లు ఫోజుపెడుతూ…..
ఆ మాటలు విన్న అచ్చిబాబు చెల్లి “ఏం…. నీవొక్కడివే గొప్ప త్యాగశీలిని అనుకుంటున్నావా? నిన్ను ఒక్కడినే బ్రహ్మచారిలా వదిలేసి.. తల్లిసేవ కూడా నీకే వదిలేసి.. నాస్వార్థం నేను చూసుకుపోయేదానిలా కనిపిస్తున్నానా. నీ పెళ్ళి తర్వాతే నా పెళ్ళి” అంటూ అంతెత్తున లేచింది.
అన్నాచెల్లెళ్ల ధోరణికి, ‘ఇదెక్కడి మాతృభక్తిరా బాబూ ‘అని విస్తుపోయి చూడటం తల్లి వంతైంది.
ఇలాగైతే లాభంలేదని, సరాసరి మ్యారేజిబ్యూరోకి వెళ్ళి, తానే అమ్మాయిల ఫొటోలను పరిశీలించటం మొదలుపెట్టాడు అచ్చిబాబు. అలా చూస్తున్న అతని దృష్టి ఓ ఫొటోలోని అమ్మాయిపై పడింది. “అరే! సాక్షాత్తూ నేను కోరుకున్నట్లుగా ఉంది అమ్మాయి” అనుకున్నాడు. అమె వివరాలు ఆరా తీయటం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా అచ్చిబాబుకు ఎదురుదెబ్బే తగిలింది. విషయం ఏమిటంటే అచ్చిబాబు వివరాలు ఆ అమ్మాయికి పంపటం, ఆ అమ్మాయి కాదు పొమ్మనటం కూడా జరిగిపోయింది. అది తెలుసుకున్న అచ్చిబాబుకు రోషం పొడుచుకొచ్చింది.
‘ఏం… నాలో ఏం లోపముందట’ అన్నాడు వెటకారంగా.
‘ఆ అమ్మాయి కూడా ఎన్.టి.ఆర్ లాంటి అబ్బాయి కోసమే వెతుకుతోందట. మీరు కూడా అలాగే ఉన్నారట. కాకపోతే ఆమెకు కావలసింది సీనియర్ ఎన్.టి.ఆర్ కాదట. జూనియర్ ఎన్.టి.ఆర్ అట. నలభై యేళ్ళ ముసలాడికి, పైగా పైన అరెకరం ఖాళీగా కన్పిస్తున్న వాడి కోసం కాదని కచ్చితంగా చెప్పింది’ అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు మ్యారేజ్ బ్రోకర్.
అప్పటికి కానీ మన అచ్చిబాబుకు బల్బు వెలగలేదు. తన వయసు అక్షరాలా నలభై. వాడిపోయిన ముఖంతో ఇంటికెళ్ళి అద్దంలో తలదూర్చాడు. కొట్టొచ్చినట్టు కనబడుతున్న తెల్లవెంట్రుకలు ఓవైపు, కుర్చీలు, బెంచీలతో నిండుగా ఉన్నా, మనిషే కాదు… కనీసం ఈగలు, దోమలు కూడా లేక మూసేసిన పాత స్టేడియంలా… బోసిగా కనిపించీ కనిపించనట్లు ఉన్న బట్టతల అచ్చిబాబును వెక్కిరించసాగాయి. తనలో తానే తెగమదనపడిపోయాడు అచ్చిబాబు. తనకు ఇక పెళ్ళే కాదేమో??? అందరు ఆడపిల్లలూ ఇలాగే వెక్కిరిస్తారేమో???? అవేశంలో బ్రహ్మచారిగా ఉండిపోతానని తల్లితో చెప్పిన మాటలకు, పైన తథాస్తు దేవతలు తథాస్తు అనేశారేమో??? అయ్యబాబోయ్! ఇలాంటి ఆలోచనలే ఇంతగా భయపెడ్తే, మరి వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో??? తోటి స్నేహితులంతా పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా పిల్లాపాపలతో కాపురాలు చేసుకుంటున్నారు. ఏ ఫంక్షన్‌కు అటెండయినా, అన్నీ జంటలే. తాను మాత్రం లింగులింగుమంటూ వెళ్లిరావలసివస్తోంది. అందుకే కదా! కావాలనే ఎక్కడికీ వెళ్ళకుండా, ఇల్లు-ఆఫీసుకే పరిమితమైంది. మ్యారేజ్ బ్యూరో వారు కూడా చేతులెత్తేయడంతో గజగజా వణికిపోయాడు అచ్చిబాబు.
తాను పెళ్ళిచేసుకుంటే కానీ చెల్లెలు పెళ్ళిచేసుకోదు. తానేమో సావిత్రి లాంటి అమ్మాయిని తప్ప చేసుకోడు. అలాంటి అమ్మాయి జన్మలో దొరకదని తేలిపోయింది. అందుకే అచ్చిబాబు గుండె రాయి చేసుకొని… ‘తనకు కాబోయే భార్య సావిత్రిలా లేకున్నా, కనీసం సూర్యకాంతంలా ఉన్నా ఫర్వాలేదు… కాదు కాదు అసలు పిల్ల దొరికితే చాలు. అపై భగవదేచ్ఛ’ అని అభిప్రాయాన్ని కూడా సడలించుకున్నాడు. అచ్చిబాబులో ఈ మార్పుకు అతని తల్లి, చెల్లి పెళ్ళే జరిగిపోయినంతగా సంబరపడిపోయారు.
సరిగ్గా అచ్చిబాబు అభిప్రాయం సడలించిన ఓ వారానికి, తెలిసినవారెవరో ఒక సంబంధం ఉందని చెప్పటంతో…. ఓ మంచిరోజు చూసుకొని అమ్మాయిని చూడటానికి వెళ్ళారు అచ్చిబాబు, అతని తల్లి, చెల్లి, ఆపద్దర్మంగా తన అభిప్రాయాన్ని మార్చుకున్న అచ్చిబాబు దీనవదనంతో తలవంచుకు కూర్చున్నాడు. ఇంతలో అమ్మాయి రానే వచ్చింది. యశ్ చోప్రా సినిమాలో లాగా, ఎటుచూసినా జనాలే తప్ప మరేమీ కనబడకపోవటంతో అచ్చిబాబు తల్లి, చెల్లి ఎక్కడ సంబంధం ఖాయమవుతుందోనని మొదట కాస్త భయపడినా… జనమంటేనే హడలెత్తిపోయే అచ్చిబాబును చూసి ఇదేమీ జరిగే పని కాదులే అని ఊపిరితీసుకున్నారు. దించిన తల ఎత్తకుండా కూర్చున్న అచ్చిబాబు ఇరువర్గాల ప్రోద్బలంతో తలెత్తి చూడటం, ఉన్నపళాన సంబంధం ఖాయం చేసేసుకోవటం రెప్పపాటులో జరిగిపోయాయి. పెళ్ళిరోజు దగ్గరపడుతోంది. అందరికీ శుభలేఖల పంపకం కూడా జరిగిపోయింది. అచ్చిబాబు బంధువర్గంలోనూ, స్నేహితుల్లోనూ అతని పెళ్ళివార్త పెద్ద కలకలమే రేపింది. అచ్చిబాబును కదిలించగల్గిన ఆ అమ్మాయిని చూడాలని తహతహలాడుతూ, పెళ్ళిరోజు కోసం ఎదురుచూడసాగారంతా. కానీ అచ్చిబాబు ఇంట్లో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. పెళ్ళిచూపులకు వెళ్ళివచ్చింది మొదలు అచ్చిబాబు తల్లి, చెల్లీ… అమ్మాయి ఫొటో చూసిన అన్నావదినలు… ఈ పెళ్ళి ఆలోచన మానుకోమని శతవిధాలా నచ్చిజెప్పిచూశారు. అచ్చిబాబు ససేమిరా ఒప్పుకోకపోగా, కుదరక కుదరక మంచి సంబంధం కుదిరితే, తన సంతోషాన్ని భంగంచేయాలని చూస్తున్నారని అందరి మీదా విరుచుకుపడ్డాడు. మౌనం వహించి కూర్చోవటం తప్ప ఏమీచేయలేకపోయారు కుటుంబసభ్యులు.
ముహూర్తం దగ్గరపడుతోంది. ఇక రెండురోజుల్లో పెళ్ళి అనగా పిడుగులాంటి వార్త ఒకటి అచ్చిబాబును అతలాకుతలంచేసింది. అదేమిటంటే పెళ్ళికూతురి దూరపుబంధువు ఒకాయన బక్కెట్ తన్నేశాడు. అమ్మాయి కుటుంబానికి అంటు కాబట్టి పెళ్ళి వాయిదా. ఈ వార్త వినగానే మూర్ఛవచ్చినంత పనైంది అచ్చిబాబుకు. కుదరక కుదరక పెళ్ళి కుదిరితే ఈ చావు గోలేంటో అర్థం కాలేదతనికి. కొంపదీసి అమ్మాయికి నేను నచ్చలేదేమో… ముందు వాయిదా అని ఆ తర్వాత వద్దంటారేమో… లేదంటే ఇలాంటి అపశకునాలు నాకే ఎందుకు ఎదురౌతున్నాయన్న సందేహం కూడా కలక్కపోలేదు. అదే ఈవేళ అచ్చిబాబులో కలిగిన నిర్వేదానికి, విషాదానికి గల కారణం.
అచ్చిబాబు ఆవేదనకు కదిలిపోయిన అతని కుటుంబం, తీవ్రంగా చర్చించి, అమ్మాయి తరపు వారితో మరింతగా చర్చించి, తర్జనభర్జనలుపడి మొత్తానికి పెళ్ళి జరిపించారు. ఇంత తంతు జరిగినా ఆ అమ్మాయిలో అచ్చిబాబును కదిలించిన అంశం ఏమిటనేది అటు స్నేహితులకు, ఇటు బంధువర్గానికి, చివరికి అచ్చిబాబు కుటుంబానికి కూడా ఏ కోశానా అర్థం కాలేదు. మొత్తానికి కొత్తకోడలు అత్తగారింట్లో కుడికాలు మోపింది. నల్లని చలువరాతి మేనిఛాయతో, ఎన్నో లంకణాలు చేసి తేరుకొని కొద్దిగా శక్తి పుంజుకున్నట్లు కనిపించే ఎముకల గూడులాంటి దేహంతో, మొత్తంమీద ఓ జానెడు పొడవున్న జుట్టును బారెడుపొడవు అని భ్రమింపజేసేలా పొడవాటి సవరంతో, సంక్రాంతి పర్వదినాన గంగిరెద్దు అలంకరణను తలపించేలా తలనిండా పూలమాలలతో, సాధారణ మానవమాత్రుని చక్షువులు చూడ సాహసించని తళుకుబెళుకుల మెరుపులతో మిరుమిట్లు గొలిపే పట్టుకొని పట్టుచీర ధరించి నడచివస్తున్న కొత్తపెళ్ళికూతురు… కొందరి కళ్ళకు దసరా వేషధారణ ధరించిన పడుచుగానూ, మరికొందరికి ఎవరో గ్రహాంతరవాసి… అనుకోని అసందర్భ పర్యటన చేస్తున్నట్లుగానూ, ఇంకొందరికి జంధ్యాల చలనచిత్ర హాస్యనటిగానూ, ఏదేమైనా అచ్చిబాబు కంటికి మాత్రం సాక్షాత్తూ దివి నుంచి భువికి కేవలం తన కోసమే ఇన్నాళ్ళ నిరీక్షణను మన్నించి, ఇప్పటికి కరుణించి దిగివచ్చిన అప్సరకాంతగానూ, ఇలా చేసుకున్నవారికి చేసుకున్నంత అనేలా వారివారి అదృష్టాన్ని బట్టి తన దర్శన విశేషాలను చూపుతోంది. ఇంతకూ అమె పేరు పిచ్చిలక్ష్మి.
పిచ్చిలక్ష్మి జన్మవృత్తాంతం ఒకసారి పరిశీలిస్తే, పిచ్చిలక్ష్మి తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు, తర్వాత ముగ్గురు మగపిల్లలు, కొసమెరుపు ఈ పిచ్చిలక్ష్మి. ఆమె అసలు పేరు లక్ష్మి. ఈమె పుట్టిన వేళావిశేషం తల్లికి మతిచలించింది. తర్వాత కొన్నేళ్ళకు తల్లికైతే పిచ్చికుదిరింది కానీ ఆ ‘పిచ్చి’ పిల్లకు అంటుకుంది. అలా అంటుకున్న ‘పిచ్చి’ పేరును మాత్రం వదులుతుందా? లక్ష్మి కాస్తా పిచ్చిలక్ష్మిగా స్థిరపడిపోయింది. పిల్లకు పిచ్చికుదిరిన కొంత కాలానికి తల్లి స్వర్గస్థురాలయింది. అంతకుముందు ‘లక్ష్మి’ అనేవారు అంతా. తల్లి మరణంతో మరీ ముద్దుగా పిలుచుకున్నారో… లేక మరే ఇతర కారణాలున్నాయో బయట ప్రపంచానికి తెలియదు కానీ… ‘పిచ్చి’లక్ష్మి అనే పేరు తిష్టవేసి మరీ కూర్చుంది. ఓరకంగా పిచ్చిలక్ష్మికి పేరుకు తగ్గట్టుగానే… పూర్తిగా కాదుకానీ కొంచెం పిచ్చి…. అంటే మామూలు జనాల వాడుక భాషలో ‘తిక్క’ ఉంది. సో పిచ్చిలక్ష్మి ఓ మోస్తరుగా అటు రూపంలోనూ, ఇటు గుణంలోనూ సార్థకనామధేయురాలన్నమాట. మొత్తానికి అత్తగారింట్లో పిచ్చిలక్ష్మి పాదం మోపింది. కొద్దిరోజులకే ఇంటి వాతావరణంలో భయానకమైన మార్పులు ప్రస్ఫుటంగా కనబడసాగాయి. ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారు. కానీ నెలతిరక్కుండానే, ‘రాముడు మంచి బాలుడు’ అనేలా బుద్దిగా ఉండే అచ్చిబాబు వేషధారణ మొదలు తినే తిండి, మాటతీరు ఇలా ఒకటేమిటి, అతని జీవనవిధానంలోనే పిచ్చిలక్ష్మి ‘పిచ్చి’ ముద్ర వేసింది. ఇవన్నీ చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న అచ్చిబాబు తల్లీ చెల్లీ… ‘వినాశకాలే విపరీతబుద్దే అని సరిపెట్టుకున్నారు. ఒకసారి పిచ్చాపాటి మాట్లాడేందుకు చుట్టుపక్కల అమ్మలక్కలు ఇంటికి వచ్చారు. అచ్చిబాబు తిన్న ఎంగిలి పళ్ళెంలోనే పిచ్చి అన్నం వడ్డించుకోవటం చూసి, ‘ఇదేం విడ్డూరమమ్మా నీ కోడలు బొత్తిగా పాతకాలం మనిషిలా ఉందే’ అన్నారు బుగ్గలునొక్కుకుంటూ.
దానికి గయ్యిమని లేచి, ‘నేనేం మీలా చదువూ సంధ్యా లేని మొద్దును కాను. ఎంతో అభ్యుదయ భావాలున్నదాన్ని. అసలు కుదరక ఊరుకున్నా కానీ.. జీను ప్యాంటులో పెళ్ళి చేసుకునేదాన్ని కాదూ’ అంది పిచ్చి మూతిని ముప్పైఆరు వంకర్లు తిప్పుతూ. అది మొదలు జనాలు ఇంటికి రావటం కూడా మానేశారు.
ఇదంతా తలుపు పక్కనే నిలుచుని వింటున్న అచ్చిబాబు సిగ్గులమొగ్గయ్యాడు. భార్య వంక ఆరాధనగా చూశాడు. అది మొదలు అతనికి ‘పిచ్చి’ తోడిదే లోకం అయింది. కానీ పిచ్చి మాత్రం చీటికీ మాటికీ అత్తతోనూ, ఆడపడుచుతోనూ కొట్లాటకు దిగేది. నోటికి ఎంత మాటవస్తే అంత మాట కొరడాతో ఝుళిపించేది. అటు తల్లికి, ఇటు పెళ్ళానికి సర్దిచెప్పలేక వెక్కివెక్కి ఏడ్చేవాడు అచ్చిబాబు. దేవదాసులా గడ్డం పెంచి, కరువు బాధితుడిలా చిక్కిశల్యమైపోయాడు. తల్లికొంగు విడువనివాడు ఇప్పుడు పెళ్ళాం కొంగు వీడి క్షణమైనా గడపలేని స్థితికొచ్చాడు. కోడలి పిచ్చి చేష్టల గురించి తల్లి నోరువిప్పటం ఆలస్యం, తన పెళ్ళాన్ని తెగ బాధలు పెట్టేస్తున్నారని మదనపడిపోయేవాడు. బంగారంలాంటి పిల్లని తానే ఈ నరకకూపంలోకి లాగేశానా అని యమయాతన పడేవాడు. పిచ్చిలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిన వేళావిశేషం ఏమిటోగానీ, అచ్చిబాబే కాదు అతని తల్లి, చెల్లి కూడా మూగవారైపోయారు. గుండెలో పుట్టిన భావాలన్నీ గొంతుదాటి బయటకు అక్షరరూపం నోచుకోకుండానే కడుపులోనే సమాధి అయిపోవటం ఆ ఇంటి ఆనవాయితీగా మారింది. పిచ్చిలక్ష్మికి అటు అందం, ఇటు గుణం లేకున్నా క్వశ్చన్ బ్యాంకుల పుణ్యమా అని, పాత క్వశ్చన్ పేపర్లు బట్టీకొట్టటం అనే విద్య ఉంది. దాంతో ఎడాపెడా నాలుగు పెద్దపెద్ద డిగ్రీలైతే సంపాదించుకుంది. తెలిసినవారిని కాకాకొట్టి, బాగానే కాసులు రాలే లెక్చెరర్ ఉద్యోగంలో చేరింది. ఈమె మాకొద్దు బాబోయ్ అంటూ విద్యార్థులంతా మూకుమ్మడిగా ప్రిన్సిపల్ వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఎంత తెలిసినవారైతే మాత్రం చూస్తూచూస్తూ ఏ కోశానా ఉద్యోగానికి కావలసిన కనీస జ్ఞానం కూడా లేకపోవటంతో, ఇక భరించటం మావల్ల కాదు మహాప్రభో అంటూ కాంట్రాక్టు కూడా చించేసి ఎదురు రొక్కం ఇచ్చి మరీ ఆమెను వదిలించుకున్నారు.
అన్నింటినీ మించి పిచ్చిలక్ష్మిలో ఓ గొప్ప విశేషం ఉంది. అదే ఆమె డ్రెస్సింగు సెన్సు. ‘పిచ్చి’కి ఫ్యాషనంటే ప్రాణం. ఎట్ ద సేమ్ టైం సంప్రదాయశైలి అంటే కూడా ప్రాణం. అందుకే రెండింటిలో ఏ ఒక్క దానికి కూడా అన్యాయం జరగకూడదని జీన్సు వేసుకున్నప్పుడు పట్టీలు, మెట్టెలూ… స్కర్టు వేసుకున్నప్పుడు తలలో పూలు, ముఖానికి పసుపు, కుంకుమా… అన్నింటిలోనూ కామన్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకటుందండోయ్… అదేమిటంటే…. తన పతి భక్తి నలుగురికీ చాటాలని, ఆర్డర్ ఇచ్చి మరీ అట్టువేసే గరిట సైజులో ఉండే మంగళసూత్రాలు చేయించుకుంది. వాటిని మాత్రం అందరికీ కన్పించేలా ఎల్లవేళలా ధరించటం. ఏదేమైనా ఇవి మాత్రం చాలా ముఖ్యం. ఈరకంగా రోజుకో తీరులో తయారవటం, చుట్టుపక్కల జనాన్ని హడలగొట్టటం ‘పిచ్చి’కున్న పిచ్చి సరదా. పైగా ‘పిచ్చి’లో మెచ్చుకోదగ్గ గొప్ప క్వాలిఫికేషన్ ఆమెలోని ఆప్టిమిజమ్. జనాలు ఏ ఉద్దేశంతో తనవైపు చూసినా తన ఫ్యాషన్ కాన్షస్‌నెస్‌ను గుర్తించి చూస్తున్నారని, ఇంకాస్త కాన్ఫిడెంటుగా ఆ లుక్కును ప్రొజెక్టుచేయటం. ఇంట్లో అంట్లు తోమటానికి వచ్చిన అప్పలమ్మ దగ్గర నుంచి ఆంగ్ల ప్రొఫెసర్ల వరకు ఎవరితోనైనా తన ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి, వాళ్లను నోటమాట రానీయకుండా కొన్ని క్షణాలు నిలబెట్టగలగటం పిచ్చిలక్ష్మి ఆంగ్లభాషా ప్రావీణ్యానికి మచ్చుతునక.
వన్ ఫైన్ మార్నింగ్.. అచ్చిబాబు ఇంటి ప్రాంగణంలో ఓ పెద్ద కోలాహలం జరిగింది. ఎన్నడూ మనిషున్న ఆనవాలు కూడా లేనంతగా గుట్టుగా ఉన్న ఇంటిలోంచి కేకలు, అరుపులు వినబడటంతో సహజంగానే ఆసక్తితో చుట్టుపక్కల వాళ్ళంతా బయటకొచ్చి చూస్తే ఏముంది? పిచ్చిలక్ష్మి పిచ్చి ఆవేశంతో ‘మిమ్మల్ని కోర్టుకీడుస్తా…. నడిరోడ్డుపై నిలబెడతా….’ అని రంకెలేస్తూ, పూనకం వచ్చినదానిలా ఊగిపోతూ…. వీధిలో పరుగులాంటి నడకతో పోతోంది. అమె వీధిదాటే వరకూ చూస్తూ నిలబడ్డారంతా. సాయంత్రానికల్లా అచ్చిబాబు ఓ మినీ లారీతో రావటం, పెళ్లికి వచ్చిన సామాన్లు సర్దుకుపోవటం జరిగిపోయింది. అచ్చిబాబు ఆ వీధిలో అమ్మలక్కల హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇంతకీ పిచ్చిలక్ష్మి అత్తను కోర్టుకీడ్చే కారణం చెప్పలేదు కదూ…. ఒంట్లో నలతగా ఉంది. కాసిని ఓ నీళ్ళుపెట్టివ్వమని అత్త అడగటమే…. వారం రోజులు గడిచినా అసలు జరిగిన తప్పేంటో అర్ధంగాక అయోమయంలోనే ఉన్నారంతా. అచ్చిబాబు మాత్రం బుద్ధిగా తల్లి చేయి పట్టుకు స్కూలుకెళ్ళే పిల్లాడిలా, పెళ్లాం వెనుకే కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు. ఇంత జరిగినా అచ్చిబాబుకు పిచ్చిలక్ష్మిలో అంతగా నచ్చిందేమిటీ అనేది మాత్రం సస్పెన్స్.
ఏదేమైనా కాలం ఆగదుగా. ఊహించని దెబ్బతో విలవిల్లాడిన అచ్చిబాబు తల్లీ చెల్లీ మొదట్లో చాలా కుంగిపోయినా నెమ్మదినెమ్మదిగా కోలుకొని మామూలు మనుషులయ్యారు. అచ్చిబాబు చెల్లికి వచ్చే జీతం, తల్లికి వచ్చే పెన్షన్తో కాలక్షేపం చెయ్యసాగారు. అచ్చిబాబు తల్లికి మాత్రం కూతురి పెళ్ళి పెద్ద సమస్య అయింది. తల్లిని వదలి పెళ్ళిచేసుకుపోయే ప్రశ్నేలేదని భీష్మించుకు కూర్చుంది అచ్చిబాబు చెల్లి. ఏదో అలా యాంత్రికంగా కాలం వెళ్ళదీస్తున్నారిద్దరూ.
ఇలా ఉండగా ఓ రోజు ఉరుముల్లేని మెరుపులా ఇంటికి ఊడిపడ్డాడు అచ్చిబాబు. తల్లిని పట్టుకుని ఆపకుండా వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడవసాగాడు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయారు అతని తల్లి చెల్లీ. ఏమైందో చెప్పమంటే అటు విషయమూ చెప్పడు. ఇటు ఏడుపూ ఆపడు. అడగ్గా అడగ్గా ఎప్పటికో తెప్పరిల్లి, మీరిద్దరూ కలసి నాకు అన్యాయం చేశారు. ఓ పిచ్చిదాన్ని తెచ్చి నాకంటగట్టారంటూ మళ్ళీ ఏడవటం ప్రారంభించాడు.
ఇదంతా కాదురా అచ్చీ! ఇంతలా ఏడ్చేంత కష్టం నీకేమొచ్చింది. నీ ఇష్టాన్ని కాదని మేమెప్పుడైనా అడ్డుకున్నామా? సంవత్సరం తిరక్కుండా వేరు కాపురం పెట్టుకున్నా మేము బాధపడ్డామేగానీ నీకు ఎదురు చెప్పలేదు. ముందా ఏడుపాపి జరిగిందేమిటో చెప్పి పుణ్యం కట్టుకోమంటూ అనునయించింది తల్లి.
తల్లి కొంగుతో కళ్ళు తుడుచుకుని, ఓ చిన్న నిట్టూర్పు విడిచి, కథ చెప్పనారంభించాడు అచ్చిబాబు.
అక్కల ప్రోద్బలంతో నానాయాగీ చేసి, భర్తతో కలిసి వేరుకాపురం పెట్టింది పిచ్చి. అచ్చిబాబు సంసారం కొంతకాలం బాగానే వర్ధిల్లింది. పిచ్చిలక్ష్మికి కీ ఇచ్చి వదిలిన అక్కలు, ఆ తర్వాత ఎలాంటి జోక్యమూ చేసుకోలేదు. ఇక అచ్చిబాబు అన్నావదినల పరిస్థితి సరేసరి. పత్తిగా ఒంటరి జంట పక్షులైపోయారు ఇద్దరూ. దాంతో ఉక్రోషం పట్టలేక క్రమంగా పిచ్చి తన విశ్వరూపం ప్రదర్శించనారంభించింది. అచ్చిబాబుకు ఆఫీసు పనితో పాటు, ఇటు వంటావార్పూ, బట్టలూ అన్ని పనుల భారమూ పడింది. నా భార్యే కదా అని మొదట్లో సరిపెట్టుకున్నాడు. కానీ చీటికీమాటికీ చిరాకులు, పరాకులు. చివరికి బెడ్రూంలోకి అడుగుపెట్టాలన్నా, ఆమె వస్తువులు ముట్టుకోవాలన్నా పర్మిషన్ కావాలి. కుక్కకన్నా అధ్వాన్నమయింది అచ్చిబాబు పరిస్థితి. ఇంటి చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లైతే పెట్టింది. కానీ అమె సంపాదించిన రూపాయి కూడా బయటకు తియ్యదు. ఇంటిఖర్చులే కాక ఆమె ఖర్చులకు కూడా అతని సంపాదనే వాడాలి. ఓసారి ఎక్కడో చక్కటి సౌకర్యవంతమైన ఇల్లు బేరానికొచ్చిందని తెలిసింది. అంత డబ్బు అచ్చిబాబు చేతిలో లేదు. ఇల్లు కొని తీరాల్సిందేనని పిచ్చిలక్ష్మి పట్టుబట్టింది. లోను తీసుకున్నా ఇంకా కొంత డబ్బు కావాలి. ఇన్నాళ్ళూ పిచ్చిలక్ష్మి ఎకౌంటులో జమైన రొక్కం వాడుదామంటే… ససేమిరా అందామె. నా డబ్బు ఖర్చుపెట్టే సమస్యే లేదు. తల తాకట్టు పెట్టయినా నువ్వే ఏర్పాటుచేసుకొమ్మని పుల్లవిరిచినట్లు చెప్పేసింది. నీ డబ్బు నా డబూ ఏంటి? మన డబ్బు అంటే కాదు పొమ్మంటుంది. పెళ్ళాన్ని సుఖపెట్టలేనప్పుడు నీ ముఖానాకి పెళ్ళెందుకంటుంది. ఇక ఆ ఇల్లుకొనే తాహతు తనకులేదని అచ్చిబాబు చేతులెత్తేయటం, ఆ ఇల్లు వేరొకరు కొనుక్కోవటం కూడా జరిగిపోయాయి. దాంతో పూర్తిగా అచ్చిబాబును చవట కింద జమకట్టేసింది పిచ్చి. ఇంకో అడుగు ముందుకేసి ‘నా మొగుడు చవటదద్దమ్మ. ఏదీ చేతకాదు. తొందరపడి ఇట్టాంటి మనిషిని కట్టుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను’ వంటి మాటలు అచ్చిబాబును ఎదురుగా పెట్టుకుని కూడా అందరికీ చెప్పేయటం మొదలుపెట్టింది. అచ్చిబాబులో ఓపిక సన్నగిల్లిపోయింది. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు, ఒకప్పుడు పిచ్చిలక్ష్మి చేతులూ మూతులూ అష్టవంకర్లు తిప్పుతూ మాట్లాడితే ఎంతో అందంగా కనబడేది. కానీ ఆ తిప్పుళ్ళు చూస్తుంటే ఇప్పుడు కడుపులో తిప్పుతోంది అచ్చిబాబుకు. పిచ్చిలక్ష్మి మీద అచ్చిబాబుకు ఉన్న ప్రేమ నెమ్మదిగా భయంగానూ, ఆ తర్వాత బాధగానూ, చివరికి అసహ్యంగానూ పరిణమించటానికి ఆట్టే సమయం పట్టలేదు.
సరిగ్గా అప్పుడే అచ్చిబాబుకు తల్లి, చెల్లి జ్ఞాపకం వచ్చారు. తను చేసిన తప్పేంటో తెలిసివచ్చింది. ఇంత వయసొచ్చినా చంటిపిల్లాడిలా గోరుముద్దలు తినిపిస్తూ గుండెల్లో దాచుకున్న తల్లికి, ప్రాణంపెట్టే చెల్లికి తాను చేసిన అన్యాయం గుర్తొచ్చి, ఎంతో కుమిలిపోయాడు. ఇదంతా తాను పెళ్లి చేసుకోవటం వల్లే వచ్చిందని తనను తాను తిట్టుకున్నాడు. సావిత్రి వంటి భార్య కావాలనుకుంటే… శూర్పణఖ దొరికిందని పిచ్చిలక్ష్మిని తిట్టుకున్నాడు. తల్లి ఒళ్ళో తలపెట్టుకు ఏడవాలనిపించింది. కానీ పాపం ఏ ముఖంతో వెళ్లాడు. పిచ్చిలక్ష్మితో అనరానిమాటలు అనిపించుకుని కూడా కిక్కురుమనకుండా ఉన్నప్పుడే పూర్తిగా సిగ్గుమాలిన వాడిలా మిగిలాను. అలాంటిది జన్మనిచ్చిన తల్లిని క్షమాపణ అడిగితే తన పాపానికి పరిహారం దొరుకుతుందని బయలుదేరాడు అచ్చిబాబు. ఇదీ కథ.
కథంతా విన్న అచ్చిబాబు తల్లికి ఏడుపాగలేదు. అపురూపంగా కళ్లల్లో పెట్టుకు పెంచుకున్న కొడుకు ఇన్ని కష్టాలుపడ్డాడా అనుకొని తల్లడిల్లిపోయింది.
ఇంతలో అచ్చిబాబు చెల్లికి ఓ చిన్న సందేహం వచ్చింది.
‘ఒరే అన్నయ్యా! నన్ను ఎప్పటి నుంచో ఓ సందేహం పీడిస్తోంది. ఎన్నో సంబంధాలనూ, ఎంతో అందమైన అమ్మాయిలనూ చూశాం. ఏ ఒక్కరూ నీకు నచ్చలేదు. కానీ వదినలో నిన్ను అంతలా కదిలించిన విషయం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థంకాలేదు. నీకు అభ్యంతరం లేకపోతే కాస్త నా సందేహ నివృత్తి చేయరా’ అడిగింది బెరుగ్గా.
ఆ ప్రశ్న వినగానే తెగ సిగ్గుపడిపోయాడు అచ్చిబాబు. మెలికలు తిరుగుతూ భద్రంగా తన వాలెట్లో దాచుకున్న ఫొటో చూపించాడు.
ఏమీ అర్థంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అతని తల్లి చెల్లీ.
‘నేనడిగిందేమిటి? నువ్వు చూపిస్తున్నదేమిటి? చెప్పటం ఇష్టంలేకపోతే చెప్పకు… అంతేకానీ…’ కోపంగా అంది చెల్లి.
అదేంటే… అలా మాట్లాడుతావు. చెప్పడమేంటీ ఇంత స్పష్టంగా చూపిస్తుంటేనూ…’ అన్నాడు అచ్చిబాబు బిక్కచచ్చిపోయి.
‘అది అడిగిన దాంట్లో తప్పేముందిరా. నీ పెళ్ళాం ఎందుకు నచ్చింది అని అడుగుతుంటే సావిత్రి ఫొటో చూపిస్తావేం’ అంది తల్లి.
అప్పుడుగానీ అచ్చిబాబుకు అర్థంకాలేదు. తను సావిత్రి ఫొటో చూపిస్తున్నానని. మెల్లగా దాని క్రింద నుంచి మరో ఫొటో బయటకు లాగాడు. సిగ్గుపడుతూ చూపించాడు. అచ్చు సావిత్రి కూర్చున్న భంగిమలోనే… అలాగే చాపపై పిచ్చి కూర్చుని ఉంది.
“అంటే… అచ్చీ….” అంటూ అనుమానంగా చూసింది తల్లి.
‘అవునమ్మా! ఈ కాలంలో సావిత్రి లాంటి అమ్మాయి దొరకదని అర్థమయింది. అందుకే సరిగ్గా ఆమె కూర్చున్న భంగిమ కనపడగానే, అదే చాలనుకుని, పిల్ల ముఖం కూడా చూడకుండా సంబంధం ఖాయం చేసుకున్నాను’ నిట్టూర్చాడు అచ్చిబాబు.