ఆచార్యునికి ఆదరణే కరువాయెనా

0
1

[box type=’note’ fontsize=’16’] ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా యువ రచయిత మంగుదొడ్డి రవికుమార్ అందిస్తున్న ప్రత్యేక రచన “ఆచార్యునికి ఆదరణే కరువాయెనా”. [/box]

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని వేదాలలో లిఖించబడి వుంది. తల్లిదండ్రుల తర్వాత ఈ సృష్టిలో ప్రముఖ స్థానం గురువునకు ప్రసాదించడం జరిగింది. ప్రతీ వ్యక్తికి తల్లిదండ్రులు జన్మను ప్రసాదిస్తే ఆ జన్మ సఫలం అయి సన్మార్గపు జాడలో నడవటానికి తన శక్తినంతా ధారపోసి, ఒక మహాయజ్ఞం తలపెట్టి దానికి ఏ అపాయం కలగకుండా జ్ఞానజ్యోతిని వెలిగించాలనే సంకల్పంతో ప్రతిక్షణం ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ, అకుంఠిత దీక్షపూని త్యాగగుణమునందు తరువులకు సైతం ధీటైన జవాబివ్వగల అఖండ జాతి రత్నము వంటి వాడు గురువు.

ఆనాడు ఆచార్యులన్నారు, ఓనాడు పంతులన్నారు, మరోనాడు మాష్టారన్నారు, మరుక్షణం గురువన్నారు, నేడు ఉపాధ్యాయులంటున్నారు. మరి ఏ తరంలో ఎలా సంబోధించినా తన వృత్తిధర్మం మాత్రం సృష్టిలో సకలోత్తమమైమనది. గురువృత్తిని సమాజంలో అత్యంత బాధ్యతాయుత వృత్తిగానూ, భావి భారత రూపకల్పనలో నిర్మాతగానూ భావించడమైనది. కేవలం విద్య నేర్పేవాడే గురువు అని మనం ఎన్నటికీ భావించరాదు. మనకు తెలియని విషయాన్ని తెలియపరిచే ప్రతి వ్యక్తి గురుతుల్యులన్నమాట మరువరాదు సుమా! అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జ్ఞానసౌధమునకు నిర్మించే సూక్ష్మ సోపానం వంటిదే! ఈ సృష్టిలోనికి ప్రవేశింపజేసిన తల్లి మనకు ఆది దైవము.ఆది గురువుతో సమానం.తన త్యాగానురాగాలతో తనివితీర మైమరిపింపజేసే  ఆ మాతృమూర్తి సాన్నిధ్యంలో అనుక్షణం మొదటగా పలికే ముద్దుముద్దు అయిన తడబడు పలుకులనే మాటలు జేసి,తన కలల యాత్రకు శ్రీకారం చుడుతుంది. మహాకవి శ్రీశ్రీ పలికిన “కాదేదీ కవితకనర్హం”అన్న తరహాలోనే “కారెవరూ గురువనకనర్హం” అన్నది యథార్థమని తెలియుచున్నది. ఇది జగమెరిగిన సత్యం.

“గురువు లేని విద్య గుడ్డివిద్య” అన్నది లోకులెరిగిన మాట. మన పురాణేతిహాసాలలో గురువునకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరిగింది. ఏలయనగా మహాభారత గాథలో విలువిద్యలో వికసించిన ఏకలవ్యునికి అస్త్రశస్త్ర విద్యలేవీ బోధించరాదని, తిరస్కరించడంతో ఏకకలవ్యుడు పట్టు వదలని విక్రమార్కుడిలా భగీరథ ప్రయత్నం చేసి, గురుభక్తి తప్పక తథ్యమని తెలిసి, గురువైన ద్రోణాచార్యుని ప్రతిమను ఆధారంగా పూని, సకలశాస్త్రాలనూ, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళాది లోకాలలో సాటిరాని, మేటిలేని, ధీటైన శిష్యునిగా చిరస్మరణీయమైన స్థానాన్ని పొందారు. ఇందుమూలముగా గురువృక్షపు నీడలేని విద్యను మనం ఏనాడూ ఆశించరాదు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన గురువునకు ఆనాటి సమాజం ఎనలేని భక్తిశ్రద్ధలతో, ఆత్మీయ అనురాగాలతో, అనుక్షణం అపారమైన భక్తివిశ్వాసాలతో గౌరవించడం తరతరాలుగా సంక్రమిస్తున్న సనాతన సాంప్రదాయము.

కానీ నేటి దశాబ్దంలో రోజులు మారాయి. సమాజంలో అత్యంత గౌరవవృత్తిలో కొనసాగే ఉపాధ్యాయ వృత్తికి నేడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గురువుల పట్ల శిష్యుల వైఖరి వృత్తికే సిగ్గుచేటుగా మారుతోంది. అనంతవిజ్ఙాన వీధుల్లో విహరింపజేయు గురువును నేడు చిన్నచూపు చూస్తున్నారు. జ్ఙానాన్ని ప్రసాదించే కిరణానికి కీడు తలపెడుతున్నారు. గురువుజాడలో కొనసాగిన విద్యార్థులు విశ్వమంత ఎత్తు ఎదిగి వినమ్రతను గాలికొదిలి, సర్వ ఉపాధ్యాయుల స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వాలు రోజుకోమాట పూటకోబాటలో నడుస్తున్నాయి. గురువు వద్దకు శిష్యులన్న ప్రాచీన మహర్షుల మాటను మట్టి కరిపించి, శిష్యుల గృహానికే గురువన్న మాటను మూటకడుతున్నారు. విధాత స్వరూపులను విలాసవస్తువుగా చూస్తున్నారు. ఇది నేటి గురువృత్తికే కళంకముగా మారుతోంది. సమాజంలో ఏ మంచి జరగాలన్నా అది తల్లిదండ్రుల నుండే ఆరంభమవడం శుభసూచకం. ఆనందదాయకం. కావున ప్రతి తల్లిదండ్రి తమ బంగారుబిడ్డల విజయాన్ని చూసి చిరునవ్వు చిందించుట కంటే ముందే ఆ విజయమే తన ధర్మమని, తనివి తీర తన్మయము పొందువాడు ఉపాధ్యాయుడన్న వాస్తవమును గుర్తుంచుకోవాలి.

ఇందుమూలముగా భావితరం బంగారుమయం కావాలని, సన్మార్గపు స్వర్గమునకు మార్గము గురువని తలచి, విద్యార్థుల మదిలో విశ్వమంత ప్రేమను నింపిన మానవతామూర్తి, జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానమూర్తి.. బహుముఖ ప్రజ్ఙాశాలి, గొప్పతత్త్వవేత్త, గ్రంథకర్త, మహా మేధావి అయిన డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా భారతదేశము ప్రాచీన వైభవముతో అలరారాలని, అహర్నిశలు శ్రమిస్తున్న -“ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులందరికీ  ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here