అదా.. సంగతీ!

0
2

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘అదా.. సంగతీ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. కథా కాలం- సెల్‌ఫోన్లు రాక మునుపుది.]

[dropcap]“సు[/dropcap]శీ! టిఫిన్‌ రెడీనా? క్యాంపుకి టైమైంది!” ఆనందరావు భార్య నుద్దేశించి కేక పెట్టాడు. నలభై ఐదేళ్ళ అతను, నల్లగా, పొడవుగా, వత్తయిన క్రాఫుతో లుంగీ బనియన్లో ఉన్నాడు. అతను ఓ బ్యాంక్‌ ఫీల్డాఫీసర్‌.

“ఆఁ.. అన్నీ టేబుల్‌ పైనే వున్నాయ్‌! పెట్టుకొని తినండీ!” సదరు సుశీల వంటగది నుండి విసురుగా అంది నలభై ఏళ్ళ ఆమె తెల్లగా, సన్నగా, నాజూగ్గా వుంది.

“అమ్మా! లంచ్‌ ప్యాక్‌ అయిందా! కాలేజీకు టైమైంది.. వెళ్ళాలి!” వాళ్ళ ఏకైక కుమార్తె విమల బ్రేక్‌ఫాస్ట్‌ ముగించి, టీషర్ట్‌.. ప్యాంట్‌లో హై హీల్స్‌ టక.. టకలతో హాల్లోకొచ్చి తచ్చాడసాగింది. పుస్తకాల సంచి భుజానికి వ్రేలాడుతుంది. ఆమె వయస్సు ఇరవై ఏళ్ళు. బి.ఏ. చివరి సంవత్సరం చదువుతుంది. తల్లి పోలికన చూడ చక్కగుంది.

“ఆఁ.. ఆఁ.. ఇప్పుడే రెడీ చేశానే తల్లీ! ఇంద.. తీసుకో! అయినా.. నాకు తెలియకడుగుతాను.. తెల్లవారంగనే మీ అయ్యా కూతుళ్ళకు టైం గోల తప్ప.. యింకోటి లేదటే!” హాల్లోకొచ్చిన సుశీల ఎదురుగా వున్న యిద్దర్నీ కసిరింది.

“అదేం లేదులేమ్మా! అయినా.. నీ అదిలింపులు రోజూ వుండేవేగా!” విమల తల్లి చేతిలోని లంచ్‌ బాక్స్‌ విసురుగా తీసుకొని బయటకు నడిచింది.

ఇక ఆనందరావు పదే పదే గోడ గడియారం వైపు చూస్తూ ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ ముగించి, అదే వేగంతో బట్టలు మార్చుకున్నాడు. రాబిన్‌ బ్లూలో వున్న అవి తెల్లగా మెరిసిపోతున్నాయి.

“బై! బై.. సుశీ!” ఆ పై ఆనందరావు భార్యకు వీడ్కోలు చెప్పి టూ వీలర్‌పై రంగారం ఊరివైపు దూసుకుపోయాడు.

“అబ్బా! వాన వెలిసింది! ఇద్దరూ యిద్దరే.. టైం పిచ్చోళ్లు!” సుశీల హాయిగా నిట్టూర్చి మిగిలిన పనుల్లో నిమగ్నమైంది.

***

ఆనందరావు ఉదయం పదకొండుకు రంగారం గ్రామ పంచాయితీ ఆఫీస్‌కు చేరాడు. అక్కడ పదిమంది రైతుల లోన్‌ ఫారాలు పరిశీలించాల్సి వుంది.

నమస్కారాల పర్వమయ్యాక అతను “అర్జీదారులందరూ రెడీనా? అసలే మనకున్న టైం బహు తక్కువ! చేయాల్సిన పని చాలా వుంది!” అని అక్కడున్న వారిని ప్రశ్నించి కలయ చూశాడు.

“ఆఁ! లడీ సాలూ! కాకపోతే ఒక లైతు వూలికెల్లాడు! వాడికీ కబులెట్టా!” ఆ ఊరి సర్పంచ్‌ వినయంగున్నాడు. అతను ‘ర’ నోట తిరక్క ‘ల’ అంటుంటాడు. ఇక వీ.ఆర్‌.ఓ, గ్రామ నౌకరు గురవయ్య సిద్ధంగున్నారు.

“సరే! మిగిలినవారి అర్జీలు చూద్దాం.. పదండీ!” ఆనందరావు అందర్ని తీసుకొని పొలాలకు నడిచాడు.

అక్కడ గురవయ్య ప్రతి విషయంలో తలదూరుస్తూ అందరికంటే గొప్ప హుషారుగున్నాడు. మిగిలిన వారూ తమ తమ వంతు సమాచారమందిస్తూ తనిఖీకు సహకరించారు. అలా లంచ్‌కు ముందు ఆరు, ఆ తరువాత మూడు దరఖాస్తులకు సంబంధించిన పొలాలు చూసి, వివరాలు సేకరించి అందరు ఆఫీసుకు చేరుకున్నారు.

“ఒకే ఒకటీ.. తనిఖీకి మిగిలింది! రైతుంటే.. అదీ. అయిద్దీ!” ఆనందరావు ఒకటొకటిగా అర్జీలు పరిశీలించి టైం కై చేయి చూసుకున్నాడు. కాని అక్కడ వాచ్‌ లేదు. ఉదయం హడావిడ్లో అది పెట్టుకోలేదని గుర్తొచ్చింది. దాంతో “టై మెంత?” అంటూ కలయ చూశాడు.

“నాది.. రిపేర్‌ కిచ్చానండీ..” వీ.ఆర్‌.ఓ నసిగాడు. “నాకలవాటు లేదు.. సాలూ!” సర్పంచ్‌ నవ్వాడు. “నాకసలు లేదు బాబయ్యా!” గురవయ్య వినయంగన్నాడు.

“ఏంటండీ? ఆఫీస్‌లో ఓ వాల్‌ క్లాక్‌ లేదు! ఎవరి చేతులకు వాచీలు లేవు! మరి టైమెలా తెలుస్తుంది?” ఆనందరావు అందర్నీ నిలదీశాడు.

“అదే.. పెట్టించాలనుకుంటున్నాం సాలూ!” సర్పంచ్‌ సమయానుకూలంగా సమాధానమిచ్చాడు.

కాసేపటికి ఆనందరావు ఆవరణలోకి చూస్తూ “పొద్దు లేనట్లుందయ్యా! మిగిలిన అర్జీ యివ్వాళ చూడలేమేమో!” అంటూ సందేహం వెలిబుచ్చాడు.

“అట్టాగనమాకయ్యా! శానా పొద్దుంది! మాపటేల మబ్బేసి సీకటిగా వుందంతే!” గురవయ్య టంకమేశాడు.

“గులివిగాడు.. తెలివిగల్లోడే!” సర్పంచ్‌ లోలోనే నవ్వుకున్నాడు.

“సరేగాని.. రైతేడయ్యా?” ఆనందరావు ఫైల్‌ సర్దుకొని లేచాడు.

“ఏలా?..లాలే? ఆడి కోసం ఎల్లినోడేడ.. సచ్చాడ్లా?” సర్పంచ్‌ లొల్లి చేశాడు.

ఈలోగా బయటున్న రైతు లోనికొచ్చి “సమస్తే సార్‌!” అన్నాడు.

ఆపై అందరు పొలానికి బయల్దేరి వెళ్ళారు. అక్కడ మసక వెలుగులో మొత్తం ఎండిపోయి కనిపిస్తోంది.

“ఇందులో.. ఏం పండిద్దయ్యా? ఈ భూమికి లోన్‌ యివ్వలేమేమో!” ఆనందరావు చేను నలువైపులకు చూస్తూ పెదవి విరిచాడు.

“పోయినేడు పుట్టిన్నర పండించా సారూ! ఆ సంగతి అయ్యగ్గూడా తెలుసు!” రైతు కళ్ళతోనే సర్పంచ్‌ సహాయం కోరాడు.

“పైకట్టుంది గాని.. నేల బో సాలమైంది! లైతూ కట్ట పడ్తాడు.. ఎట్టాగో సూడు.. సాలూ!” సర్పంచ్‌ సిఫారస్‌ చేసాడు. అందుకు వత్తాసుగా వి.ఆర్‌.ఓ “అవునండీ!” అన్నాడు.

“కూత్తంత సేలోకి దిగు సామా.. దాని సేవేందో తెలుత్తాది!” గురవయ్య బ్రతిమిలాట అందర్నీ మించి గొప్పగుంది.

“చూద్దాం.. నడు!” ఆనందరావు సైగ చేశాడు.

“అయ్యయ్యో.. పెద్దోల్లు! తమరు ముందు దిగండి!” గురవయ్య వినయంగా ప్రక్కకు తప్పుకున్నాడు.

అంతే! హోదా ప్రదర్శిస్తూ ఆనందరావు అడుగేయటం, కాలు కస్సుమని పిక్క దాక దిగ బడటం, పేంటుకు బురద అంటటం, దాంతో అతను ఒరిగి గట్టుపై చేతులు పెట్టటం “గుడ్‌.. గాడ్‌!” అని అరవటం వెంట వెంటనే జరిగాయి.

“ఓరి నా సామే! పుర్రు గట్టి పడ్లేదు గదయ్యా! దెబ్బగాని తగిలిందా?” గురవయ్య భయంగా ఆనందరావు కాలు లాగి, ఫ్యాంటు కంటిన మట్టి తుడవ సాగాడు.

“గులివిగా! ఉత్త పున్నేనికి సాలును పడేత్తివి గదులా! అయినా.. గెనంపై నుంటే.. నేల సాలం తెలియదేందిలా.. తొక్కలో లాద్దాంతం గాకుంటే!” సర్పంచ్‌ ‘ల’కారాన్ని ఆటాడి వదిలాడు.

“నిజంగా వాడో ఫూలండీ!” అదే అదనుగా వీ.ఆర్‌.ఓ నోరు చేసుకున్నాడు.

“పూలో.. కాయో గాని.. నన్ను బురదలో దింపేదాక ఆగలేదు గదండీ!” ఆనందరావు వంకరగా ముఖంపెట్టి ప్యాంటుకంటిన మట్టిని చూసుకోసాగాడు.

“తప్పయింది సారూ! చెమించు!” గురవయ్య దండం పెట్టాడు.

“ఎలగబెట్టింది సాలు! ఎల్లి.. బోలు పంపెయ్‌! అయ్యగాలు కడుక్కుంటాలు!” సర్పంచ్‌ గురవయ్యను ఉరిమాడు.

నిముషాల్లో పంపునీళ్ళతో ఆనందరావు ప్యాంటు మట్టి వదిలింది. ఆపై ఆయన అందరితో ఆఫీస్‌కు చేరాడు.

అక్కడ చివరి అర్జీపై రిమార్కులు వ్రాసుకున్న ఆనందరావు పూర్తిగా దస్త్రం కట్టేసి సర్పంచ్‌, వీ.ఆర్‌.ఓ లనుద్దేశించి “చూశారా! టైం తెలియక.. మనం గురవయ్య మాట విని పొద్దుపోయి పొలానికెళ్ళి భంగపడ్డాం! అదే గోడకొక గడియారమున్నా, చేతులకు వాచ్‌లు వున్నా.., ఈ సమస్య వచ్చేది కాదు. సో.. దటీజ్‌ ది ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ టైం పీస్‌!” అంటూ ఓ చిన్నపాటి ఉపన్యాసం దంచాడు.

“ఈడ గోడకు గడియాలముంటే.. ఆడ బురదలో పడడా! ఈ తిక్కోడి మాటిని ఈ పిచ్చోడు చేలోకి దూక్కపోతే.. సలిపోయేది కాదా! ఏందో.. మడుసులు సిత్లంగా మాట్లాడుతాలు!” మనస్సు తర్కిస్తుంటే సర్పంచ్‌ పైకి “అవ్‌ సాలూ! లేపే గడియాలం పెడ్తాం! అలిజీలన్ని కాస్త సూస్కోండీ! నమత్తే!” అని నసిగాడు.

“ఈయన లా లల తో చస్తున్నాం!” మనస్సులోనే నవ్వుకున్న ఆనందరావు అందరికి బై బై చెప్పి అక్కడ్నించి కదిలాడు.

***

ఈసారి క్యాంపు పోతవరం..

అర్జీల తనిఖీలయ్యాక మధ్యాహ్న భోజనాలు ఏర్పాటయ్యాయి. వేడన్నం, గోంగూర పచ్చడి, చింత చిగురు పప్పు, నెయ్యి, కోడి వేపుడు, మిరియాల రసం, గడ్డ పెరుగులతో విందు పసందుగుంది.

పీకల దాక లాగిన ఆనందరావు ఒళ్ళు విరిచి ఆవలించాడు.

“పిచ్చయ్యా! ఆఫీసు గెట్టు రూంలో మంచమేసి పక్కెయ్యి! ఆయ్యగారు కాసేపు నడుం వాలుత్తారు!” సర్పంచ్‌ గాయిదతనికి హుకుం జారీ చేశాడు.

అలాగే ఏర్పాట్లు జరిగాయి. “సాయంత్రం నాలుక్కు లే..పం..డీ! ఆఁ!” పక్కపై చేరిన ఆనందరావు నిద్రలోకి జారుకున్నాడు.

“పిచ్చయ్యా! వల్లు దగ్గరెట్టుకొని అయ్యగార్ని సూస్కో! ఆయన్ను నాలుక్కు లేపు! తర్వాత తాగేదానికి నీళ్ళియ్యి! మా యింటి నుంచి కాఫీ తెచ్చియ్యి!” జాగ్రత్తలు ఏకరువు పెట్టిన సర్పంచ్‌ ఆఫీస్‌ ప్రక్కనే వున్న తన ఇంటికెళ్ళాడు.

ముఫ్పై ఏళ్ళ పిచ్చయ్య పొట్టిగా, పీలగా, చెదిరిన క్రాఫుతో పంచె, చొక్కాల్లో వున్నాడు. అతను వరండాలో బెంచ్‌పై కూర్చొని కునికిపాట్లు పడ్తున్నాడు.

అప్పటికే “గుర్ర్‌..గుర్ర్‌!” అనే ఆనందరావు గురక అదర సాగింది. ఈలోగా పిచ్చయ్య ఆలోచన గాలికి ఊగే గెస్ట్‌ రూం తలుపు వైపుకు మళ్ళింది. “ఓర్నాయనో! ఇది సేసే శబదం.. ఆయన గార్ని లేపిద్దేమో!” అని భయపడ్డ.. అతను లేచి తలుపు మూసి బయట గడియపెట్టి తిరిగి బెంచ్‌పై చేరాడు. దాంతో శబ్దమాగింది. అది తిరిగి రాదనే భరోసా కూడా దొరికింది. ఆపై “పీడా వదిలింది!” అనుకొని ఆవలించిన పిచ్చయ్య ఒళ్ళు విరుచుకున్నాడు.

“గుడ్‌.. గాడ్‌..! టైం నాలుగున్నరైంది!” నిద్ర లేచి వాచ్‌ చూసుకున్న ఆనందరావు హడావిడిగా తలుపు తెరవబోయాడు.

ఊఁ!..హుఁ!.. కుదర్లేదు. గట్టిగా లాగాడు. అయినా రాలేదు.

‘గడేసి నట్టుంది!’ అనుకుంటూ తలుపు పై టక్‌..టక్‌ మని కొట్టాడు. కాని పని జరగలేదు. ఆపై అతను తలుపుపై చేసిన దబ్‌..దబ్‌! మన్న ఏక మోదుడూ.. ఫలితాన్నివ్వలేదు. దాంతో “ఏయ్‌..పిచ్చయ్య! తలుపు తియ్‌! తలుపు తియ్‌!” అంటూ కోపంతో ఊగిపోసాగాడు. చెమట్లు కారుతున్నాయి. శ్వాస వేగం పెరిగింది.

ఆ అలజడికి ప్రక్కింట్లో పరుపుపై తొంగోని సొంగ కారుస్తున్న సర్పంచ్‌ ఒక్కుదుటున మేలుకొని ఆఫీస్‌కు పరుగెత్తాడు.

అక్కడి దృశ్యం అతని మతి పోగొట్టింది.

పిచ్చయ్య బెంచ్‌పై శేష పాన్పునున్నాడు. గురక మ్రోగిపోతుంది. గది నుండి వినిపించే ఆనందరావు అరుపులు అతన్నేమాత్రం తాకేలా లేవు. ఆఫీసర్‌ పిడిగుద్దుల తాకిడి తట్టుకోలేని పాత తలుపు ఊడి క్రింద పడేలాగుంది. పరిస్థితినిట్టే పసిగట్టిన సర్పంచ్‌ కోపంతో పిచ్చయ్య వీపుపై చరిచి, వేగంగా వెళ్ళి తలుపు గడియ తీశాడు. ఉలిక్కిపడి గాఢ నిద్ర నుండి లేచిన పిచ్చయ్య చేతులు నలుపుకుంటూ భయం.. భయంగా దిక్కులు చూడసాగాడు.

“ఏయ్‌.. ఫూల్‌! నీకేమన్నా.. పొగరా? అయినా ఆఫీసర్ని గదిలో పెట్టి గడియ వేయటానికి నీకెన్ని గుండెలు!” ఉగ్రుడై బయటికొచ్చిన ఆనందరావు పిచ్చయ్యపై విరుచుక పడ్డాడు.

“తలుపెందుకేసి.. చచ్చావయ్యా?” అప్పుడే అక్కడకు చేరిన వీ.ఆర్‌.ఓ సంగతి తెలుసుకొని పిచ్చయ్యను అరిచాడు.

“మరి.. మరి.. గాలికూగుతుంటే.. అయ్యగారికి నిద్దర సె..డి..ద్ద..ని!” పిచ్చయ్య నసిగాడు.

“అయినా.. తన్నుక చస్తోంటే.. తలుపు తెరవవే?” ఆనందరావు గద్దించాడు.

“అదే.. తప్పయిందయ్యా! గడెట్టి కూకున్నాక కునుకొచ్చి వల్లు.. మ..రి..సా!” పిచ్చయ్య తలొంచుకున్నాడు.

“ఏడ్చావులే.. ఎల్లి.. అయ్యగారికి కాఫీ తీసుకురా!” సర్పంచ్‌ సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆఫీసర్‌కి వత్తాసిచ్చాడు. అదే అదునుగా పిచ్చయ్య అక్కడ్నించి జారుకున్నాడు.

క్రమంగా చల్లబడ్డ ఆనందరావు “సర్పంచ్‌ గారూ! జరిగిన దాంట్లో పొరపాటెక్కడో తెలిసిందా? మీ ఆఫీస్‌లో అలారమ్‌ పీస్‌ ఒకటి లేకనే యిదంతా జరిగింది! అదే వుంటే మీ మొద్దు పిచ్చయ్య పొరపాటున కునుకేసినా.. నాలుక్కు రింగవ్వగానే లేచి గెడ తీసేసేవాడే! అప్పుడు ఈ హైరానా అంతా జరిగుండేది కాదు!” అని చిద్విలాసంగా అన్నాడు.

‘ఆ దున్నకు అలారమొక లెక్కా! ఈ తిక్కస్వామి పిచ్చి ఆలోచన గాకపోతే!’ మనస్సు గొణుకుతుంటే సర్పంచ్‌ పైకి “అలాగే.. అలారం గడియారమొకటి తప్పక కొంటాం సార్‌.. దయచేసి అరిజీలన్ని పాస్‌ చేసి పున్నెం కట్టుకొండీ!” అని ప్రాధేయపడ్డాడు.

“అలాగే!” హామీ యివ్వబడింది.

ఈలోగా పిచ్చయ్య తెచ్చిన వేడి వేడి కాఫీ సేవించిన ఆనందరావు అతన్ని క్షమించి ఇంటి దారి పట్టాడు.

***

అలా ఆనందరావు రోజువారి పనుల్లో దొర్లే పొరపాట్లకు ఏదో.. ఒక కోణంలో కాలాన్ని కొలిచే సాధనాలే కారణంగా చేసి చెప్పే హాబీ చేసుకున్నాడు.

***

ఈలోగా ఆనందరావు కుమార్తె విమల బి.ఏ విజయవంతంగా తప్పింది. దాంతో లాభం లేదని తలచిన ఆయన, ఆమెకు పెళ్ళి నిశ్చయించాడు.

ఒక శుభవేళ వివాహ వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. చుట్టపక్కాలు, బ్యాంక్‌ సిబ్బంది, సర్పంచులు, వీ.ఆర్‌.ఓ.లు, పల్లె జనాలు వెల్లువయ్యారు. వేదికపై ముద్దుల కూతుర్ని, మురిపాల అల్లుడ్ని చూసి ఆనందరావు, సుశీలలు ఆనందంగా తబ్బిబ్బయ్యారు.

“ఏం జనమయ్యా.. బావా! నేల.. ఈనినట్లున్నారు! వాళ్ళ చేతుల్లో గిఫ్ట్‌ ప్యాక్‌లు మెరుస్తున్నాయి. బహుశ.. అవన్నీ కాస్ట్లీ ఐటమ్స్‌ అయి వుండొచ్చు! ఏమైనా పలుకుబడంటే నీదే! అదృష్టమంటే నా మేనకోడల్దే!” బావమరిది మాటలు ఆనందరావుకు గొప్ప కిక్కిచ్చాయి. దెబ్బతో విందు మెనూలో మరికొన్ని రుచికరమైన వంటకాలు చేర్చి మిగులు ఖర్చుకూ సై అన్నాడతను.

పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. ఇక మజా మజాగా సాగిన భోజనాలు మెల్లగా సాయంత్రం నాలుగు గంటలకు ముగిశాయి. అగలా సగలా మిగిలిన పదార్థాలు భిక్షగాళ్ళకు పంచారు. మొత్తానికి జనం ఆనందరావు ఆతిథ్యంలో ఓలలాడారు.

రాత్రి భోజనాలయ్యాక ఇంటి వారితో పాటు ముఖ్యమైన బంధువులు, వియ్యాలవారు పెళ్ళిలో వచ్చిన కానుకలు చూడటానికి తీరిగ్గా హాల్లో గుమికూడి సుఖాశీనులయ్యారు.

పెళ్ళికూతురు విమల మొదటి ప్యాక్‌ విప్పింది. అది గోడ గడియారం. పెద్ద అప్పచ్చి లాగుంది. బొటన వ్రేళ్ళంతున్న ముళ్ళు లయబద్ధంగా తిరుగుతూ కనిపించాయి.

“బాగుంది!” అన్నారందరు.

పెళ్ళికుమారుడు రెండో ప్యాక్‌ విప్పాడు. పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువగా వున్న లంబూ వాల్‌క్లాకది. పెండ్యులం ఊడిపోయుంది.

“భలే!” అన్నారు జనం.

మూడోది సుశీల విప్పింది. రెక్టాంగ్యులర్‌ వాల్‌క్లాక్‌ గోల్డ్‌ రిమ్‌..తో అందం గుంది. అంకెల స్థానంలో గీతలున్నాయి.

“ఓహో!” అన్నారు ప్రేక్షకులు.

ఇక స్వయాన ఆనందరావే పూనుకొని నాల్గోది విప్పాడు. స్క్వేర్‌ క్లాక్‌ స్టీల్‌ రిమ్‌తో, వెంట్రుక వాసి ముళ్ళతో వింతగుంది.

“ఆహాఁ!” అందరు గుడ్లప్పగించి చూశారు.

“ఇదేదో బరువు గుంది! మంచి కాస్ట్లీ ఐటమై వుంటుంది బావా!” అన్న బావమరిది ఐదో ప్యాక్‌ విప్పాడు. పెద్ద తాబేల్లాంటి వాల్‌క్లాక్‌ “టంగ్‌.. టంగ్‌!” మంది.

“ఓర్నాయనో! ఇదీ అదేగా!” జనాలు నోళ్ళెళ్ళబెట్టారు.

“ఇదన్నా వేరుగుండాలి” మనస్సులో కోరుకున్న ఆనందరావు మరో అవకాశం తీసుకున్నాడు. ప్యాక్‌ కాగితాలు కుప్పబడ్డాయి. అందరు ఆత్రంగా చూస్తున్నారు. కాసేపటికి వస్తువు బయట పడింది. అది పారాబోలిక్‌ అలారమ్‌ పీస్‌ నేరేడుకాయ రంగులో మెరుస్తుంది.

“చూడ చక్కగుంది!” యావత్‌ ప్రేక్షకులు మ్రాన్పడి చూస్తున్నారు.

“తలో చేయేసి.. మిగిలినవన్నీ చూడండీ!” జావగారిన ఆనందరావు హోల్‌సేల్‌ అభ్యర్థన చేసాడు.

వెంటనే ప్రారంభమైన పని చక చకా ముగిసింది.

ఆశ్చర్యం! ఒకటి.. రెండు తప్ప అన్నీ కాలం కొలిచే యంత్రాలే. కాకుంటే.. కొన్ని గోడలకు తగిలించేవైతే, కొన్ని టేబుల్‌ పై పెట్టేవి! కొన్ని.. “క్లిక్‌..క్లిక్‌!” మంటుంటే, కొన్ని “చుక్‌..చుక్‌!” మంటున్నాయి. మరికొన్ని పతాక స్థాయిన “ట్రింగ్‌!.. ట్రింగ్‌.. ట్రింగ్‌!” మని అలారమ్‌ కొట్టాయి.

“ఓరి దేవుడో.. ఇదేం కర్మ!” ఆనందరావు ఖిన్నుడయ్యాడు.

“బావ పలుకుబడి యిదా!” బామ్మర్ది పక పక లాడాడు. వియ్యాలవారు ఇక ఇక లాడారు.

“ఎందుకిట్లయింది? ఎందుకు?..ఎందుకు?” ఆనందరావు కొద్ది కొద్దిగా మొదలుపెట్టి మొత్తం జుట్టు పీక్కో సాగాడు.

“లేదులే బావా! ఏదో.. కో-ఇన్సిడెంట్‌గా అలా జరిగుంటుంది!.. దానికెందుకంత హైరానా పడ్తావ్‌?” నవ్వటమాపి బామ్మర్ది ఓదార్చాడు.

“కాదోయ్‌! ఎక్కడో.. ఏదో జరిగింది! నన్ను నవ్వుల పాల్జేయాలని కుట్ర చేసారు! ఎవరు.. చెప్మా?..చెప్మా?” ఆనందరావు గింజుడాగలేదు.

ఇక సంగతి అర్థంగాక అందరు చోద్యమ చూడసాగారు.

అప్పుడు సుశీల “అంతక్కర్లేదులెండీ శ్రీవారూ! కారణం.. నే చెప్తా వినండీ! తమరు ఇంట్లో జరిగే ప్రతి దానికి టైం.. టైం.. అని అంటుంటారుగా! అలాగే అస్తమానం బైటా.. వాగుంటారు! దాంతో.. జనం ఈ టైం పిచ్చోడికి గడియారాలిస్తే పోద్దిలే.. అనుకోనుంటారు! దాని ఫలితమే.. ఇది!” అని సహేతుకంగా వివరించి కలయ జూసింది.

“ఆఁ! అదా.. సంగతీ!” అందరితో పాటు ఆనందరావు నోరు తెరిచాడు. ఆపై అతనెప్పుడు శ్రుతిమించి టైం.. పాట పాడ్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here