Site icon Sanchika

అదనపు మైలు

[dropcap]నే[/dropcap]ను బెంగళూరులో ఒక బ్యాంకు బ్రాంచ్ హెడ్‌గా పని చేసుతున్న రోజులవి.

ఒక రోజు సాయంత్రం, మా రీజినల్ మేనేజర్ నన్ను తన ఆఫీస్‌కి పిలిచి, “రేపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి మీటింగ్ వుంది మన ఆఫీస్‌లో. ఆ మీటింగ్ కోసం మీరు రిపోర్ట్స్ తయారుచేసుకుని రెడీగా మీటింగ్‌కి హాజరు అవ్వాలి” అని హుకుం చేసాడు.

తప్పుతుందా, భుక్తి  కోసం తల తాకట్టు పెట్టుకున్నాక.

మీటింగ్ పేరుతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర బ్రౌని పాయింట్స్ కొట్టేసి, ప్రొమోషన్‌కి దారి సుగమనం చేసుకుందామని ఆయన తపన కాబోలు. ఆర్ఎమ్‌ని కలిసి తిరిగి ఆఫీస్‌కి వచ్చేసరికి సాయంత్రం ఆరు దాటింది. స్టాఫ్ అందరూ  వెళ్లిపోయారు. నేను ఒక్కడినే ఆఫీసులో కూచుని, మీటింగ్‌కి రిపోర్ట్స్ తయారుచేసే పనిలో పడ్డాను.

అప్పుడే ఒక వయసు పైన పడిన ఒకావిడ బ్యాంకు లోకి అడుగు పెట్టింది.

“బ్యాంకు ఇవల్టికి మూసేసారమ్మా!, రేపు రండి” గేట్ దగ్గర వున్న అటెండర్ ఆవిడని వారించడం నాకు వినపడింది.

అయితే, ఆవిడ అటెండర్‌తో ఏమి మాట్లాడిందో తెలీదు, ఆవిడని నా కేబిన్ వైపు వెళ్ళమని చెయ్యి చూపించాడు.

ముక్కు మీదకి జారిపోతున్న నా కళ్ళజోడుని, కాస్త పైకి తోసుకుని ఆవిడని లోపలకి రమ్మన్నట్టుగా సైగ  చేశాను. ఆవిడ నెమ్మదిగా డోర్ తెరుచుకుని, నా ఎదురుగా కుర్చీలో కూచుంది. నేను చేస్తున్న పని అయ్యినంతవరకు చాల ఓర్పుగా  కూర్చుని వుంది. ఫైల్స్ అన్ని పక్కన పెట్టి  ఆవిడని తెరిపార చూసాను ‘డెబ్భై ఏళ్ళు దాటి వుండాయి ఆవిడకి’ అనుకున్నా మనసులో.

“చెప్పండి! ఏం పని మీద వచ్చారు?” అని సాదరంగా అడిగాను.

నా మాట తీరుకి, ఆవిడ మొహం  తేట పడింది.

“బాబూ! వయసులో చిన్నవాడివి…. నువ్వు అని అంటున్నా, ఏమి అనుకోకు, తల్లి లాంటి దాన్ని” అందావిడ చిరునవ్వుతో.

“పరవాలేదండి! నేనేమి అనుకోను, చెప్పండి” అన్నాను మర్యాదగా.

“మీ బ్యాంకులో నాకు నా భర్తకి కలిసి ఒక జాయింటు అకౌంటు వుంది బాబూ! అయన పోయారు, ఆయన పేరు మీద కొన్ని డివిడెండ్ వారెంట్లు వచ్చాయి. వాటిని మా జాయింట్ అకౌంట్లో జమ చేయ్యాలి” అని తాను వచ్చిన పని చెప్పింది.

ఆవిడ చేతిలో డివిడెండ్ వారెంట్లు తీసుకుని చూస్తే అవి అన్నీ డేట్ అయిపోయినవి.

“ఏమండీ! ఇవన్నీ డేట్ అయిపోయినవి, అది కాకుండా మీ భర్త లేరు కనక జాయింట్ అకౌంట్‌లో జమ చెయ్యడం వీలవ్వదండి” అంటూ నా సమస్య చెప్పుకున్నా.

“అలా అంటే ఎలా నాయన? మీ బ్యాంకు రూల్స్‌ని కొంచం సడలించు బాబు, పుణ్యం ఉంటుంది, నీ ఋణం ఉంచుకోను” అని ఆవిడ నన్ను ఒప్పించడానికి తాపత్రయపడింది. ఆవిడ మాటలు నన్ను కదిపాయి. ఆవిడ సమస్యని పరిష్కారించాలంటే బ్యాంకు రూల్స్ వంచాలి.

“మీ భర్త లేరు అంటున్నారు, జాయింట్ అకౌంట్ కొనసాగించకూడదు, ఈ వారెంట్లు చూస్తే ఇద్దరు పేరు మీద వున్నాయి. సరేనండి, ఏదో చేద్దాం. మొదట ఈ డివిడెండ్ వారెంట్స్ వాలిడేట్ చేయించుకుని రండి. మీ పిల్లల ఉన్నారుగా. పనులన్నీ చూసుకోవడానికి” అని చెప్పి ఆవిడని పంపింద్దామనుకున్నా.

ఆవిడ ఇంకా మాట్లాడడం ముగించలేదు. “మా పిల్లలు వున్నారు కానీ, వాళ్ళు వాళ్ళ వృత్తిలో బిజీగా వుంటారు! వాళ్ళకి నేను ఏమి చెప్పినా పట్టవు, నువ్వే ఈ పని చేసి పెట్టు” అంది బతిమాలుతూ.

నాకు ఆవిడ మీద  జాలి వేసింది.

సంభాషణ కొనసాగిస్తూనే ఉంది ఆవిడ.

ఆవిడకి లాల్‌బాగ్‍లో ఒక పెద్ద దాబా ఇల్లు ఉందిట, ఆర్థికంగా బాగానే వున్న కుటుంబమేనట, ఇతరత్రా ఏ సమస్యలు లేవుట.

“ఈ డివిడెండ్లు మా అయన కష్టార్జితం, వాటిని వృథాగా పడేస్తే, పరలోకంలో వున్న అయన మనసు ఉసూరుమంటుందని నా బాధ. వుంటాను బాబు” అని చెప్పి ఆవిడ నిష్క్రమించింది.

డివిడెండ్ వారెంట్స్ అన్ని ఆయా కంపెనీలకి పంపి వాలిడేట్ చేయించా. వాటిని ఆవిడ కిచ్చి జాయింట్ ఖాతాలో జమ చెయ్యడానికి సరే అన్నా. ఇంకా ఏ బ్యాక్ మేనేజర్ ఈ పని చేసి, రూల్స్ తొక్కిపెట్టి, డివిడెండ్ వారెంట్లు జమ  చేయనిచ్చేవుండేవారు కాదు. ఆవిడ మీద నాకు కలిగిన సద్భావమే, నా చేత ఇంత సాయాన్ని చేయించింది.. ఆలా చేసినందుకు, నాకు తృప్తి  కలిగింది.

“చాలా సంతోషం బాబూ! అయన కష్టార్జితం వృథాగా పోలేదన్న తృప్తి మిగిలింది నాకు. చాలా మంచివాడివి నాయనా! నా ఆయుష్షు కూడా పోసుకుని, నిండు నూరేళ్లు జీవించు” అంటూ ఆవిడ ఆశీర్వచనాలు మదిలో మెదిలి  చాలా ఆనందాన్ని కలిగించింది.

ఆవిడ భర్త కష్టార్జితం ఎవరు దోచుకోలేదు, ఆవిడకే దక్కింది, బ్యాంకు నియమాలని కొంచం ఉల్లంఘించాననే భావన కూడా దూరమయ్యింది.

ఆ విధంగా ఆవిడ అకౌంట్, డివిడెండ్ వారెంట్స్‌తో వచ్చి పడిన డబ్బుతో కళకళలాడింది.

***

ఆలా కొన్ని రోజులు ఆవిడ బ్యాంకుకి రాలేదు, నేను కూడా ఆవిడ గురించి మర్చిపోయా. అయితే ఒక రోజు సాయంత్రం మళ్ళీ బ్యాంకుకి వచ్చింది. నా కేబిన్‌లో ఈసారి చిరునవ్వు నవ్వుతూ, కళ్ళు పెద్దవి చేసుకుని వచ్చి కుర్చీలో కూచుని, నేను పలకరించేవరకు మౌనంగా ఉంది. నెమ్మదిగా నా వైపు వంగి, తన మరణానంతరం తన కళ్ళను దానం చేయాలనీ అనుకుంటున్నట్లుగా మెల్లగా గుసగుసగా చెప్పింది.

ఆమె  పేరు, చిరునామాని ప్రభుత్వ ఆసుపత్రిలో రిజిస్టర్ చేయించుకోడానికి నా సహాయం కోరింది. నేత్రదానం చెయ్యడానికి వివరాలన్నీ నేను సేకరించి, ఆవిడ ఇంటికి వెళ్లి ఇచ్చాను. ఆవిడే తరవాత ఆసుపత్రికి వెళ్లి తన కళ్ళు దానం చేసుకోడానికి రిజిస్టర్ చేయించుకుంది. ఆవిడ చిరునామా వివరాలు అన్ని నమోదు చేసిన ఎప్పుడు మెడలో ధరించవలిసిన బ్యాడ్జి, ఆసుపత్రి వారు ఇచ్చినది, నాకు చూపించింది. ఆవిడ పట్టుదలకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిడ సంతకం చేసిన రెండు ఖాళీ చెక్కులు నా దగ్గర వుంచమని, (సేఫ్ కస్టడీ) ఆవిడ ప్రాధేయపడింది, నేను వారిస్తుంటే.

***

కొన్ని నెలల తర్వాత, ప్రభత్వ హాస్పిటల్ నుంచి సమాచారం అందింది, నేత్రదానం చేసిన వృద్దురాలు చనిపొయినట్లుగా. ఆవిడ డైరీలో రాసుకున్నట్లుగా, ఆవిడ ఖాతాలో ఉన్న ధనంతో పేద అంధ బాలికల కోసం వినియోగించవలిసినదిగా ఆవిడ చివరి కోరిక ప్రకారం, నిధిని ఏర్పాటు చేసి, ఆవిడ కొడుకులకు అప్పజెప్పాను.

***

ఒక్కోసారి, సదుద్దేశాలను నెరవేర్చడానికి, నియమాలు సడలించి, ఇతర సేవా సహకారాలు అందించడానికి ‘అదనపు మైలు’ నడవాలి.

Exit mobile version