కాజాల్లాంటి బాజాలు-12: అదండీ సంగతీ…

6
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ప[/dropcap]గలు పదకొండుగంటలకి పనులు పూర్తి చేసుకుని ముందరి గదిలోకొచ్చి కూర్చుని “హమ్మయ్యా” అనుకుంటూ టీవీ పెట్టడం ఆలస్యం… ఏ చానల్ చూసినా వంటలే వంటలు. అప్పటిదాకా ఆ వంటింట్లోనే వేళ్ళాడిపోయినందుకేమో భలే చిరాకనిపించింది. ఇలాంటప్పుడే నేను మా వదినకి ఫోన్ చేస్తాను. ఎంచక్క మాట్లాడి నన్ను నవ్విస్తుంది. అందుకే ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో అదే మోగింది. తీరా చూస్తే వదినే… నాకెంత ఆనందమనిపించిందో… “నీకే చేద్దామనుకుంటున్నాను వదినా… నువ్వే చేసేవు, ఏంటి సంగతీ…” అన్నాను.

“రేపు నీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉందా!” అనడిగింది. ఈ వదిన ఎప్పుడూ ఇంతే. సూటిగా విషయంలోకి వచ్చేస్తుంది. “లేదు, ఎందుకూ!” అన్నాను.

“రేపు పనైపోగానే మా ఇంటి కొస్తావా, చెగోడీలు చేసుకుందాం” అంది కూల్‌గా. నేను పక్కలో బాంబు పడ్దట్టు ఉలిక్కిపడ్దాను. అసలు వంటిల్లు తాళం పెట్టేసి తాళంచెవి పడేసుకుంటే బాగుంటుందనే కె. రామలక్ష్మిగారి అవిడియా ఎప్పుడు అమలు చేద్దామా అనుకుంటుంటే మళ్ళీ చెగోడీలంటూందీ వదిన అనుకుంటూ, “చెగోడీలా…” అన్నాను నీరసంగా… “ఔను” అంది నిశ్చయంగా వదిన అవతల్నించి. అయినా నాకు వదిన సంగతి తెల్సు, ఇలాంటి గంటలు గంటలు పట్టే వంటలంటే భలే కోపం తనకి. జంతికలూ, చెగోడీలూ ఆఖరికి బొబ్బట్లు కూడా స్వగృహాలో కొనేస్తూంటుంది. అలాంటి వదినకి ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందా అనుకుంటుంటే మళ్ళీ వదినే అంది. “మీ అన్నయ్యకి పాపం ఆ బజార్లో కొన్నవి పట్టల్లేదు స్వర్ణా… ఏ నూనెతో చేసేరో ఏమో మొన్న ఆ జంతికలు తిన్నాక ఎలర్జీలాగా వచ్చేసింది. చాలా బాధపడ్దారు. అందుకే ఇంట్లోనే చెయ్యాలనుకున్నాను.”

“అయితే చేసుకో… మధ్యలో నేనెందుకూ…” అన్నాను తప్పించుకుందుకు.

“అదికాదు స్వర్ణా… నువ్వే ఆలోచించు. ఇలాంటి పత్తిపనులు ఒక్కళ్ళూ కూర్చుని సతీ సక్కుబాయిలా చెగోడీలు వత్తుకునీ, తీరుబడిగా వేయించుకుంటూ కూర్చుంటే ఎంత బోర్‌గా ఉంటుందీ. అదే ఇద్దరు కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ ఒకరు చెగోడీలు ఒత్తుతుంటే, ఇంకోరు వేయిస్తుంటే అటు కాలక్షేపమూ అయిపోతుంది, ఇటు చెగోడీల పనీ అయిపోతుంది. ఇద్దరం కల్సి చెసుకుంటాం కనక సగం నీకూ, సగం నాకూ. ”

ఈ డీల్ నాకెందుకో నచ్చలేదు. “నే రాలేను వదినా…” అంటూ ఏదో సాకు చెప్పబోతుంటే “ఇంకేం మాట్లాడకు. నువ్వొస్తున్నావంతే. అసలు మనిద్దరం తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్లైందీ! ఎప్పుడూ ఏదో హడావిడే. కనీసం ఈ వంకనైనా వచ్చేవంటే చక్కహా కబుర్లు చెప్పుకుని, చెగోడీలు చేసుకుని సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. ఎలాగైనా మనింట్లో చేసుకున్న చెగోడీల రుచి స్వగృహాలో వస్తుందా! అవి తిని మా అన్నయ్యగారు నిన్నెంత మెచ్చుకుంటారో…” అంటూ ఆర్డర్ వేసేసి ఫోన్ పెట్టేసింది. తప్పుతుందా… మళ్ళీ నేను ఏదైనా అవసరముండి రమ్మంటే వదిన రావాలి కదా!

మర్నాడు పదకొండు గంటలకల్లా అన్నయ్యింటికి వెళ్ళిపోయేను. నన్ను చూడగానే “కాస్త కాఫీ తాగి మొదలెడదామా!” అంది. “ఇప్పుడేకదా భోంచేసేం. ఒంటిగంటకి తాగుదాంలే…” అన్నాను. ఇద్దరం సరాసరి వంటింట్లోకి వెళ్ళిపోయేం. అప్పటికే వదిన చేగోడీలపిండి ఉడకబెట్టి రెడీగా ఉంచింది. ఇలాంటివాటికి సెపరేట్‌గా కొన్న సింగిల్ స్టౌ విడిగా ఓ పక్కకి పెట్టి వెలిగించి, చెగోడీలు వేయించడానికి నూనె మూకుడు పెట్టింది. ఇద్దరం రెండు పీటలు వేసుకుని స్థిమితంగా కూర్చున్నాం. పిండిగిన్నెలోంచి పిండి తీసి కాస్త నాకిచ్చి, కాస్త తను తీసుకుంది. తీరుబడిగా కాళ్ళు చాపుకుని కూర్చుని ఇద్దరం చెగోడీలు చెయ్యడం మొదలెట్టేం.

“ఎన్నాళ్లయింది స్వర్ణా ఇలా కూర్చుని పిండివంటలు చేసుకునీ. అందుకే ఇదివరకు రోజుల్లో నలుగురు కలిపి చేసుకునేవారు. ఆడుతూ పాడుతూ అయిపోయేది పని..” అంటూ “ఇంతకీ మీ పిన్నత్తగారమ్మాయి కాపరానికి వెళ్ళిందా!” అనడిగింది.

“లేదొదినా. వాళ్ళేమో డబల్ కాట్ ఇచ్చి పంపించమన్నారుట. వీళ్ళకింకా డబ్బు సమకూడలేదు పాపం…”

“హూ, అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటివాళ్ళున్నారంటే ఆశ్చర్యవే. మొన్న మా పిన్నిగారబ్బాయి పెళ్ళైందా… సూట్ కేస్ చేత్తో పట్టుకుని వచ్చేసిందా అమ్మాయి హోటల్ కొచ్చినట్టు. పాపం మా పిన్ని ఏవైనా అందా. అయినా ఆ కుర్రాడైనా చెప్పాలి కదా!”

నూనె కాగింది. పొగలొస్తోంది. వదిన చెగోడీలు వేయించడం మొదలెట్టింది. నేను ఇంకో పక్క వత్తుతున్నాను. వాయికి ఎనిమిదివరకూ వేగుతున్నాయి. దానికి తగ్గట్టు రెడీ చేసి అందించాలి కదా! మొదటి వాయి తీసింది. “ఉఫ్… ఉఫ్…” మని ఊదుతూ ఓ ముక్క విరిచి సగం నా చేతిలో పెట్టి, సగం తను నోట్లో వేసుకుంది “ఉప్పు చూడు” అంటూ… చూసేను. నూనె బాగా కాగిపోయిందేమో చెగోడీలు లోపల పచ్చిగా ఉండి పైన మాడిపోయేయి. ఇద్దరికీ ఆ సంగతి తెల్సిపోయింది. వెంటనే మంట తగ్గించి ఇంకో వాయి వేసింది. మాడిపోయిన చెగోడీలు ఇద్దరికీ చెరిసగం పంచేసింది. “ఇవెవరూ తినరు. ఓ పక్క పెట్టి పడేసే బదులు నోట్లో పడేసుకుందాం. కడుపులో పడుంటాయి.” అంది. అలాక్కానిచ్చేం.

రెండో వాయి సరిగ్గా వేగింది. “ఇప్పుడు ఉప్పు చూడు…” అంది. చూసేను. “ఇంకొంచెం వెయ్యాలేమో…” అన్నాను అనుమానంగా. వదిన కూడా చూసింది. వెంటనే పిండిలో నేను ఒత్తిన చెగోడీలు కూడా మళ్ళీ కలిపేసి మరింత ఉప్పు కలిపేసింది. ఉప్పు తక్కువైన చెగోడీలు ఎవరు తింటారనుకుంటూ ఆ మిగిలినవాటిని నేనూ, వదినా కడుపులో పడేసుకున్నాం.

మరో వాయి వేగింది. తియ్యగానే మళ్ళీ, “ఈసారి చూడు, సరిగ్గా ఉందా.” అంది. చూసేను. అబ్బా… ఉప్పెక్కువైపోయింది. కలిపిన పిండిలో ఇంకొంచెం బియ్యంపిండి కలిపేసింది. ఉప్పెక్కువైన చెగోడీలు ఎవరు తింటారూ… అందుకని వాటిని కూడా మేవే కడుపులో పడేసుకున్నాం.

మరో వాయి తీసింది. ఈ సారి ఉప్పు సరిగ్గా సరిపోయింది. అదే చెపితే “ఏదీ చూడనీ…” అంటూ వదిన కూడా రుచి చూసింది. “ఒక్కటి చూస్తే సరిగ్గా తెలీట్లేదు. ఈ రెండూ కూడా నోట్లో పడేసుకో. కరెక్ట్‌గా తెలుస్తుంది” అంటూ రెండు నా చేతిలో పెట్టి ఇంకో రెండు వదిన కూడా నోట్లో పడేసుకుంది. అప్పటికి ఇద్దరికీ ఉప్పు సరిపోయినట్టు ఖచ్చితంగా తెలిసింది.

హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ చెగోడీలు ఒత్తడం మొదలు పెడుతుంటే హఠాత్తుగా “ఆగాగు..” అంది వదిన చెయ్యి అడ్డు పెట్టేస్తూ. పక్కన పెట్టిన ఇంకో చిన్న గిన్నెలోంచి నానబెట్టిన సెనగపప్పు తీసింది. “ఇలా పప్పులు పైన అద్ది చేస్తే మీ అన్నయ్య కిష్టం. అందుకే నానబెట్టేను. ఇవి అద్ది ఒత్తు చెగోడీలు…” అంది. అలాగే ఆ వాయీ వేగింది. “ఏదీ, పప్పులు సరిగ్గా వేగేయా చూడు…” అంటూ నా చేతిలో రెండు పెట్టింది. పచ్చిగా అనిపించింది. “ఇంకో వేపు రావాలి వదినా “ అన్నాను. మరో వాయి వేసి, వేగని వాటిని మళ్ళీ ఎవరు తింటారంటూ మా ఇద్దరికీ కడుపులో పడేసింది వదిన. ఈసారి వాయిలోవన్నీ ఎక్కువ వేగిపోయేయి. అవి మటుకు ఎవరు తింటారని అవీ కడుపులో పడేసుకున్నాం ఇద్దరం.

ఆఖరికి పిండిలో ఉప్పు సరిగ్గా సరిపోయి, మంట సమంగా ఉండి, పప్పులవీ మాడిపోకుండా చెగోడీలు వేగసాగేయి. హమ్మయ్యా అనుకుంటూ ఇద్దరం కబుర్లలో పడ్డాం.

“మీ బావగారమ్మాయి పెళ్ళి కుదిరిందా” అడిగింది వదిన. “ఏంటో వదినా పాపం… ఎక్కడా జాతకాలే కుదరటం లేదుట. అయినా ఆ అమ్మాయి నెలకి లక్షరూపాయిలు సంపాదిస్తోందిట. అంతకన్నా ఎక్కువవాడు కావాలంటే కష్టవే మరి.”

“ఏమో స్వర్ణా, ఇదివరకులా కదు. ఇప్పుడు ఆడపిల్లలే కండిషన్లు పెడుతున్నారుట…”

“మీ తమ్ముడు ఇల్లు పూర్తయిందా వదినా…” అనడిగేను. “ఏదీ. ఇంకా లేదు. ఎన్ని లక్షలూ సరిపోవట్లేదు. ఈ మాఘంలో గృహప్రవేశ మనుకున్నాడు. ఎక్కడా పడేలా లేదు. అవునూ, వెంకట్రావు గారమ్మాయి పెళ్ళికి మగపెళ్ళివారు వెండిబిందె లడిగేర్ట కదా!” అన్న వదిన మాటలకి, “అవునొదినా, అవెంత బరువుండాలో కూడా చెప్పేరు.”

“మొన్న నాచారంలో ఎవరింట్లోనో దొంగలు పడి బీరువాలో ఉన్న పదిలక్షలూ పట్టుకుపోయేర్ట… అయినా అన్ని లక్షలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా!”

“దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న హోల్‌సేల్ బట్టలకొట్లో మొన్న మా చుట్టాలు పెళ్ళిబట్టలు కొన్నారా! ఒక్కటి కూడా బాగు లేదనుకో. చీరైతే కండువా వేసుకున్నట్టుంది. మరింక పంచైతే లుంగీలాగే కట్టుకోవాలంతే”

“అదేమరి. డిస్కౌంటో అంటూ అలాంటి షాపుల కెగబడితే అలాకాక ఇంకెలాగుంటాయీ.”

“మొన్న నల్లీస్‌లో మా ఎదురింటావిడ పట్టుచీర కొనుక్కున్నారూ… ఎంత బాగుందో. బట్ట బంగారవే అనుకో…”

“మొన్న టీవీలో వచ్చిన సినిమా చూసేవా…. ఛా ఛా.. సినిమాలంటే విరక్తి వచ్చేస్తోంది.”

“సావిత్రి సినిమా ఎంతబాగుందీ… నాకైతే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసేయనుకో…”

“అంతే… ఈ మగాళ్లంతా అంతే… పాపం అమాయకురాలు…”

“అప్పుడే మార్కెట్లోకి మావిడికాయలు వచ్చేస్తున్నాయ్. నిన్న మెంతిబద్దలు వేసేనా… అబ్బ పుల్లరొడ్లనుకో…”

నేనూ, వదినా కబుర్లు చెప్పుకుంటూ, చెగోడీలు ఒత్తుకుంటూ, వేయించుకుంటూ, సరిగా వేగేయో లేదోనని రుచి చూసుకుంటూ, పాడైనవి మళ్ళీ ఎవరికి పెడతామని వాటిని కడుపులో పడేసుకుంటూ మొత్తానికి వదిన కలిపిన పిండిని పూర్తి చేసేం. ఇద్దరం ఈ లోకంలో కొచ్చి ఎన్ని డబ్బాల చెగోడీ లయ్యేయా అని చూస్తే హాశ్చర్యం.. ప్లేట్లో పదిమటుకే కనిపించేయి. అంటే గిన్నెడుపిండి చెగోడీలూ ఇద్దరం తినేసేమా అనుకుంటూ ఒకరి మొహం ఒకళ్ళం చూసుకున్నాం. ముందు పాపం వదినే తేరుకుంది. ఆ మిగిలిన పదింటిలోనూ న్యాయంగా అయిదు చెగోడీలు నా చేతిలో పెట్టేసి, “తినై..” అంది, తను మిగిలిన అయిదూ తినేస్తూ..

“అయ్యో, మరి అన్నయ్యకో..” అన్న నా మాటలకి “ఈ పదీ ఎవరి ముక్కులో పెడతాం. మీ అన్నయ్య వచ్చే టైమ్‌కి కాస్త పెళ్ళివారి ఉప్మా కలియబెడతాలే…” అంటూ అవి కూడా కడుపులోనే పడేయించింది మా వదిన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here