[box type=’note’ fontsize=’16’] అడవి బాపిరాజు 125వ జన్మ సంవత్సరం సందర్భంగా శ్రీ నాగసూరి వేణుగోపాల్ వెలువరిస్తున్న ప్రత్యేక సంచిక కోసం రాసిన వ్యాసం. సంచిక పాఠకుల కోసం ఈ వ్యాసాన్ని అందిస్తున్నాం. [/box]
[dropcap]అ[/dropcap]డవి బాపిరాజు అత్యంత రమణీయమైన రచనలను సృజించాడన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సాహిత్యంలో చారిత్రక కాల్పనిక రచనలు, historical fiction అనే భవంతికి ఒక ప్రధాన స్తంభం అడవి బాపిరాజు. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి మరో రెండు స్తంభాలు. మిగతా రచయితలంతా నాలుగవ స్తంభం. ఈ ముగ్గురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే, ఈ ముగ్గురూ మూడు విభిన్నమైన Historical Fiction రచన పద్ధతులకు ప్రాతినిధ్యం వహించినవారు. భావితరాల రచయితలకు మార్గదర్శనం చేసినవారు.
చారిత్రక కాల్పనిక రచన : ఆరంభం
గతాన్ని గురించిన స్మృతిలేని జాతికి భవిష్యత్తు లేదు. ఏ జాతి అయినా తన చరిత్రకు యజమాని కావాలి కానీ బానిస కావద్దు. దేశంలో స్వాతంత్ర భావన వీచికలు బలంగా వీస్తున్నప్పుడు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సాహిత్య సృజన ఒక శక్తివంతమైన ఆయుధంలా అంది వచ్చింది. బంకించంద్ర ‘వందేమాతరం’ స్వతంత్ర పోరాటంలో జాతిని చైతన్యవంతం చేయటంలోనే కాదు స్వతంత్రేచ్ఛ ప్రకటనకు ప్రతీకలా ఎదిగింది. తెలుగులో సాహిత్య సృజన ఊపందుకున్నప్పటి నుంచీ ప్రాచీన వైభవాన్ని వివరిస్తూ, భారతీయుల పౌరుషాన్ని రగిలిస్తున్న కావ్యాలు రావటం ఆరంభమయింది. దేశభక్తి, స్వాతంత్ర్యానురక్తి, రసానురక్తి, సామాజిక సాహిత్యస్పృహ, ప్రక్రియా వికాస స్ఫూర్తి వంటి అంశాలు తెలుగు సాహిత్య సృజనను వికసింపచేశాయి. ఆరంభంలో సాహిత్య సృజన ప్రధానంగా కావ్యరూపంలో ప్రకటితమయింది. దాదాపుగా 1905 నుండి 1935 వరకు ఖండకావ్య ప్రక్రియలో వెలువడిన రచనలు ఆ తరువాత చారిత్రక కావ్య రచనా చైతన్యంగా పరిణామం చెందాయి.
‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు’ అన్న గ్రంథంలో డా. సి. నారాయణరెడ్డి ’ఆధునికాంధ్ర కవిత్వంలో దేశభక్తి రెండు పాయలుగా ప్రవహించింది. ఒకటి భారత జాతీయాభిమాన సంబంధి. రెండవది ఆంధ్రాభిమాన సంబంధి’ అని వ్యాఖ్యానించారు. తెలుగు రచనలు వచన రూపం దిద్దుకొన్నప్పుడు జాతీయభావన, ఆంధ్రభిమాన సంబంధ రచనలు విశ్వనాధవారు సృజించారు. వీరి దృష్టి ప్రధానంగా చరిత్ర రచనలో విదేశీయులు చేసిన అవకతవకలను సరిదిద్ది భారతీయుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయటం వేపు కేంద్రీకృతమయింది. నోరి నరసింహశాస్త్రి గారి దృష్టి తెలుగువారి సాహిత్య సృజన స్వరూపాన్ని చారిత్రక పరిణామాలననుసరిస్తూ వివరించటంపై కేంద్రీకృతమైంది. ఇందులో భాగంగా తెలుగు ప్రాంతాల జీవన పరిస్థితులు, సాంస్కృతిక వైభవాన్ని వారు తమ రచనలలో ప్రదర్శించారు. మిగతా రచయితలు చరిత్ర పరిణామాలను, రాజకీయ కుట్రలను వివరిస్తూ ఆంధ్రదేశ చరిత్రను వివరించాలని ఆంధ్రుల పౌరుషాన్ని, దర్నిరీక్ష తేజస్సును ప్రదర్శించాలని ప్రయత్నించారు. భోగరాజు నారాయణమూర్తి గారి ‘ఆంధ్రరాష్ట్రము’తో సహా పలు ఇలాంటి రచనలు ఇందుకు నిదర్శనాలు. వీరందరికీ భిన్నంగా అడవి బాపిరాజు గారు తెలుగువారి సాంస్కృతిక ఔన్నత్యాన్ని, సామరస్యతను సౌమనస్యాన్ని రసమయ (శృంగార) రొమాంటిక్ చారిత్రక రచనల ద్వారా ప్రదర్శించటంపై దృష్టి పెట్టారు. ఎలాగైతే విశ్వనాథ రచనలో ‘ఆత్మగౌరవం’ , నోరి నరసింహశాస్త్రి, రచనల్లో ‘సాంస్కృతిక ఔన్నత్యం’ కేంద్రబిందువులో అలాగే అడవి బాపిరాజు రచనలలో ‘రొమాన్స్’ కేంద్రబిందువు. ఇది ఆయన సాంఘిక రచనలలోనూ కనిపిస్తుంది. రచన సాంఘికమైనా, చారిత్రకమైనా ఆయన దృష్టి భౌతిక స్థాయిలో ఆరంభమై ఆధ్యాత్మిక స్థాయి వరకూ వ్యాప్తమవుతుంది. కళాదృష్టి ప్రధానంగా ద్యోతకమవుతుంది. ఇది వారి రచనలను ఇతరుల రచనలనుంచి ప్రత్యేకంగా నిలుపుతాయి.
అడవి బాపిరాజు రచనల్లో ‘తెలంగాణ’:
ఒకప్పుడు తెలుగు ప్రాంతాలన్నీ ఒకటిగానే ఉండేవి. ఆనాడు తెలుగు ప్రాంతాల విస్తృతి అద్భుతం. దీన్ని అడవిబాపిరాజు తన కథ ‘వడగళ్ళు’లో పతంజలి శాస్త్రి అనే పాత్ర ద్వారా ‘పతంజలి శాస్త్రి అఖండాంధ్ర స్వప్నము’ అని వర్ణిస్తాడు. ‘పతంజలి శాస్త్రికి ఆంధ్రభూమి అన్నా, ఆంధ్రత్వమన్నా ఆకాశమంటే అభిమానం. చదువుకున్నన్నాళ్ళూ ఆంధ్రదేశం మీద పాటలు రాస్తూ తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాలూ, సిరికంచా చందా, బస్తరూ అన్నీ కలిపి అఖండాంధ్ర మహా సామ్రాజ్యము స్థాపితమై, ఆ రాష్ట్రానికి ముఖ్యపట్టణము హైదరాబాదు కావాలని అతని కోరిక” అంటాడు. అంటే ఆకాలంలో ప్రధానంగా తెలుగు ప్రాంతాలన్నీ ‘ఆంధ్రరాష్ట్రం’ అన్న భావన ఉండేదని అనుకోవచ్చు. కానీ అనేక పరిస్థితుల వల్ల నేటి ‘తెలంగాణ’ భావనను ‘ఆంధ్ర’ భావనను, అడవి బాపిరాజు నాటి భావనను, ఆ రచనలలో ప్రదర్శితమైన భావనలూ నడుమ తేడాను మనం గుర్తించాల్సి ఉంటుంది.
తెలంగాణా ప్రాంతాలు:
ప్రస్తుతం తెలంగాణ 33 జిల్లాల సమాహారం. ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున చత్తీస్‍ఘర్, పశ్చిమాన కర్ణాటక, ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్‍లు సరిహద్దులుగా కలది తెలంగాణ. అయితే చారిత్రకంగా చూస్తే ఈ ప్రాంతం తెలంగాణ అని చెప్పటం కష్టం. చారిత్రకంగా తెలంగాణ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబులు, నిజామ్ వంటి వారు పాలించారు. 1823 ప్రాంతంలో కోస్తాంధ్ర, రాయలసీమలను ‘నిజామ్’ ఈస్టిండియా కంపెనీకి ధారాదత్తం చేశాడు. అంటే మనం నిజాం పాలనలో ఉన్న ప్రాంతాలనూ తెలంగాణాలా పరిగణిస్తే కోస్తాంధ్ర, రాయలసీమలనూ తెలంగాణగా భావించాల్సి ఉంటుంది. ఒకప్పటి కాకతీయుల పాలిత ప్రాంతాలను తెలంణగా పరిగణించాలంటే ఇటు పిఠాపురం, అటు రాయచూరు, గండికోట, కంచి, దివిసీమ, వంటి ప్రాంతాలనూ తెలంగాణాలో భాగంగా భావించాల్సి ఉంటుంది. కాకతీయుల కాలంలో ‘మోటుపల్లి’ ప్రధాన రవాణా కేంద్రం.
డా. మలయశ్రీ ‘తెలంగాణ ప్రాంత ప్రాచీన చారిత్రా విశేషాలు’ అన్న వ్యాసంలో ‘13వ శతాబ్ది తర్వాత ఓరుగల్లు కాకతి సామ్రాజ్యానంతరం (1323) ముస్లింల (ఢిల్లీ తురుష్కుల) కాలం నుంచే ఈ తెలంగాణ మాట వ్యవహారంలో ఉంది. అప్పుడు తెలుగు ఆంధ్రప్రాంతమే కాక తమిళనాడు మధురైదాకా తెలంగాణమనే వారు. గోలకొండ కుతుబ్ షాహీల కాలంలో ‘తెలంగాణ అంటే కొస్తాంధ్ర కూడా’ అంటారు.
‘తెలంగాణ’ను ఇంత విస్తృతంగా భావిస్తే అడవి బాపిరాజు చారిత్రక రచనలు ‘అడవి శాంతిశ్రీ’, హిమబిందు, అంశుమతి వంటి రచనలన్నీ ‘తెలంగాణ’కు సంబంధించిన రచనలుగానే భావించాల్సి ఉంటుంది. అప్పుడు ‘ఓ గోదావరీ! ఓ కృష్ణవేణీ! మీరు వీరస్రవిణులు. సంస్కార ప్రియులైన ఆ అమర సంతతులు మీ తీరాల అనేక నగరాలు నిర్మించారు’ అంటూ ‘అడవి శాంతిశ్రీ’ లోని ఉపక్రమణిక తెలంగాణ గురించి అవుతుంది. ‘అసురుల అన్నదమ్ములైన ఆర్యులలో విభేదాలు పొడమి, ఆంధ్రులనే వారు విడిపోయి మెట్టదారిని వింధ్యను దాటి ఉత్తర కళింగం, అక్కడి నుంచి గోదావరీ తీరం చేరుకొన్నారు. ఆంధ్రులలో కొందరు తెలుగునదీ తీరాన ఆగిపోయినారు. కొందరు కన్నాబెన్నా (కృష్ణానది) తీరానికి వచ్చి…’ ఈ వర్ణన ప్రధానంగా తెలంగాణ గురించే అనుకోవాల్సి ఉంటుంది. ఇక ఆయన రచనల్లో పిఠాపురం నుంచి పైఠాను వరకూ సాగిన వర్ణనలన్నీ తెలంగాణకు సంబంధించిన వర్ణనలుగానే భావించాల్సి ఉంటుంది. కానీ ఒకప్పటి భావనకు ఇప్పటి నిజానికి నడుమ అనేక చారిత్రక సంఘటనలు నిలిచి ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకుని, సమకాలీన సమాజంలో ‘తెలంగాణ’ అంటే నెలకొని ఉన్న భావనలనే ప్రమాణంగా తీసుకోవాల్సివుంటుంది.
అడవిబాపిరాజు రచనల్లో తెలంగాణా:
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే త్రిలింగాల వల్ల ఈ నడుమ ప్రాంతానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చిందంటారు. ఒకటి రాయలసీమలో, రెండవది తెలంగాణలో, మూడవది ఆంధ్ర ప్రాంతంలో ఉండటం ప్రాచీన కాలంలో తెలుగు ప్రాంతాల నడుమ అభేద ప్రతిపత్తి అని సూచిస్తుంది. జయధీర తిరుమల రావు గారి ప్రకారం ‘తెలంగాణ’ అన్నపదం గోండు భాషనుంచి వచ్చింది. 2000 సంవత్సరాల నాటి పదం. త్రిలింగ, తెలింగ, తెలంగాణ అయిందని ఒక వాదం. డా. ఈమని శివనాగరెడ్డి రాసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర శాఖ సెమినార్ సంచికలో వ్యాసం ప్రకారం ఫిరోజ్‍షా బహ్మనీ ’తెర్లాపూర్ శాసనం’లో ’తెలంగాణపురం’లో పేరుంది. శాతవాహనులు, వారి పూర్వులు కోటిలింగాల ప్రాంతంలో వారు. కానీ ప్రతిష్ఠానపురానికి వచ్చిన పేరు ఈ ప్రాంతానికి రాలేదు. అలాగే వేములవాడ చాళుక్యులకూ అంత గుర్తింపు రాలేదు. కాబట్టి అడవి బాపిరాజు రచనల్లో ప్రాచీన తెలంగాణ ప్రాంతాల వర్ణనలు వెతకటం కన్నా ’ఆధునిక తెలంగాణ’ ప్రాంతాల వర్ణనలు వెతకటం శ్రేయస్కరం. అది వ్యాసం పరిధినీ, నిడివినీ తగ్గిస్తుంది కూడా.
అడవి బాపిరాజు రచనలలో ఆధునిక తెలంగాణ ప్రాంతాలుగా పరిగణనకు గురవుతున్న ప్రాంతాలు అధికంగా ఆయన చారిత్రక నవల ‘గోనగన్నారెడ్డి’ లోనూ కథలు ‘నేల’, ‘వడగళ్ళు’ ‘బండరాళ్ళు’ లోనూ కనిపిస్తాయి. అడవి బాపిరాజు ‘మీజాన్’ పత్రిక సంపాదకుడిగా హైదరాబాదులో నివసించడం వల్ల ఆయన కథలలో హైదరాబాదు , పరిసర ప్రాంతాలు అధికంగా ప్రదర్శితమయ్యాయి. ఈ సమయంలో ఆయన తెలంగాణా ప్రాంత ప్రజల మనస్తత్వాలను, జీవన విధానాన్ని, వారి కష్టాల స్వరూపాన్ని ఆకళింపు చేసుకున్నారు. అవగాహన చేసుకున్నారు. స్వభావరీత్యా రొమాంటిక్ కావటంతో ఈ కష్టాలు, కడగండ్లు, ధీరోదాత్తత, పోరాట పటిమలు, రాజకీయాలాటలలో పావులైకూడా తమవ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న వీరోచిత గాధల ప్రదర్శనలను రొమాంటిక్ సాగరంలో ముంచెత్తి రమణీయమైన కథలుగా మలచాడు. ఆయన కథలు చదివినవారు ఆయన గురించి తెలియకపోతే ఆయన తెలంగాణావాడే అని పొరబడటంలో ఆశ్చర్యంలేదు.
గోనగన్నారెడ్డిలో తెలంగాణ:
అడవి బాపిరాజు ‘గోనగన్నారెడ్డి’ రచనలో చారిత్రక అంశాల కోసం ప్రధానంగా మల్లంపల్లి, పరబ్రహ్మశాస్త్రి వంటి వారి పరిశోధనలు, ఆకాలంలో వెలుగుచూసిన శాసనాలపై ఆధారపడ్డారు. ఈ నవలలో ప్రధానంగా కోట వర్ణన, కట్టడాల వర్ణనలు అద్భుతంగా ఉంటాయి.
‘ఓరుగల్లులో ఎనిమిది లక్షల పౌరులు సుఖంగా కాపురం చేసే మహానగరం’ అంటూ చరిత్ర పరిశోధకులు కనుగొన్న అంశాలకు కాస్త కల్పన జోడించి రమ్యంగా వర్ణనను సాగిస్తాడు అడవి బాపిరాజు. చారిత్రక నవలల్లో చారిత్రక సత్యనిబద్ధత మొదటి లక్షణం. అయినా కాల్పనికత, ఊహాకల్పన అన్నవి తప్పనిసరి. ఇవి లేకపోతే అది చరిత్ర పాఠ్యపుస్తకంలా రసవిహీనంగా, నిర్జీవంగా తయారవుతుంది. వాస్తవంగా నిరూపితమైన చరిత్రకు ప్రాణం పోసి కళ్ళముందు నిలిపేలా సాగితేనే అది Historical fiction రచన అవుతుంది. దీనిలో కల్పిత పాత్రలను, కథను రసమయం చేసేందుకు సృజించిన సంఘటనలను అబద్ధాలు, అవాస్తవికతలుగా ఎవరయినా భావించి కొట్టిపారేస్తే వారికి హిస్టారికల్ ఫిక్షన్ అంటే ఏమిటో తెలియదని భావించవచ్చు.
అన్నాంబిక ఓరుగల్లును తొలిసారి చూడటాన్ని వర్ణిస్తూ కోటలు, మందిరాలు, సౌధాలు వంటివాటిని వర్ణిస్తూ, ‘నగర బాహ్యంలో ఉన్న వాడలలోకి పొలాల నుండి రైతులు తిరిగి వస్తున్నారు. చిన్న పూరిళ్ళు చిన్న చిన్న ఇళ్ళు, మేడలు ఆ మహారాజా పథానికి ఈవలావల వాడలలో ఉన్నాయి. నేత శాలల ముందు నూలు వడుగులు చేస్తున్నారు. సన్నని నూలును ముతక నూలును భామలు కండెలకు చుట్టుతున్నారు’ అంటూ ఒక చైతన్యవంతమైన దృశ్యాన్ని కళ్ళముందు నిలుపుతాడు అడవి బాపిరాజు.
ఓరుగల్లును యుద్ధానికి సిద్ధం చేయించిన వర్ణన ఊహ అనిపించదు. రచయిత ఆ కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షి అన్నట్టుంటుంది. ‘ఓరుగల్లు వెలివాడలకు, మైలసంతకు చుట్టు గంపకోట కట్టించింది. నగరం చుట్టు ఉన్న కోటగోడల ఇనుమిక్కిలిగా బలిష్టమొనర్చింది. రాచకోట బాగుచేయించింది. అగ్నిబాణాలు ఆర్పడం నేర్పించింది. అగ్నిబాణాల నుండి కాపాడే తోలుకూర్పాసాలు లక్షలు సిద్ధం చేయించింది.’
ఇక అడవుల గురించి వర్ణిస్తూ ‘ఓరుగల్లుకు ముప్పదిగవ్యూతుల దూరంలో గోదావరి తీరారణ్యాలున్నవి. గోదావరి తీరానివి గంభీరమైన అడవులు. కృష్ణాతీరాన అందమైన అడవులు’ అంటాడు. ఆ తరువాత అరణ్యాలలోని నేలలు చెట్లు, వాటి జాతులు, రకాలు ఆకుల రకాలు ఒకటేమిటి ఒక బోటనిస్టు వర్ణించినట్టు అడవిని వర్ణిస్తాడు. అడవిబాపిరాజు నిజంగా కాకతీయ కాలానికి వెళ్ళి చూసినట్టు అడవులను వర్ణిస్తాడు. రాణి వైభవాన్ని వర్ణిస్తాడు. ఇదే హిస్టారికల్ ఫిక్షన్ అంటే. వున్న ఆధారాలననుసరించి, తార్కికంగా ఊహను జోడించి, ఆ ఊహకు సృజనాత్మకత ద్వారా ప్రాణంపోసి గతించిన కాలాన్ని కళ్ళముందు సజీవంగా నిలపటమే కాదు, చరిత్రలో ఇలాగే జరిగివుంటుందన్న నమ్మకాన్ని పాఠకులలో కలిగించాలి. వారి ఊహల విహంగానికి రెక్కలనివ్వాలి. అది అడవిబాపిరాజు రచనల్లో పుష్కలంగా వుంటుంది.
బాపిరాజు కథల్లో తెలంగాణా:
‘గోనగన్నారెడ్డి’లో కనిపించే తెలంగాణం చారిత్రక తెలంగాణం. నిజానికి ఊహతో కాల్పనిక రంగులద్దిన తెలంగాణా. కానీ అడవి బాపిరాజు కథలలో ప్రదర్శితమైన తెలంగాణా ఆయన దగ్గరగా చూసిన తెలంగాణ. ఇది ఆయన వర్ణనల్లో, వివరణల్లో స్పష్టంగా తెలుస్తుంది. ‘నాగేటిచాలు’ కథలో అడవి బాపిరాజు తెలంగాణ యువకుడు యాదగిరి రెడ్డిని వర్ణిస్తాడు. కానీ ఆయన వర్ణించేది అఖండాంధ్రకు చెందిన యువకుడిని.
‘తెలుగు నేలల పండిన మామిడికాయ, ఆంధ్రభూముల వెలసిన కోహినూరు వజ్రం అతని చుబుకము. తెలుగు సముద్రపు కెరటాలు, పెళ్ళీడున తీసుకొని వచ్చి సమర్పించిన శంఖమే అతని కంఠం. అతని బాహువులు కృష్ణా, గోదావరి నదులు. అతని అంసలు మహేంద్ర నల్లమల పర్వతాలు. విశాలాంధ్ర భూమి అతని ఛాతి,మెత్తని కోరతలపాగా, మొలను పైకెగదోసి కట్టిన పంచకట్టు. ఆ యముడు యాదగిరి రెడ్డి.’
ఇదీ రైతు యాదగిరి రెడ్డి వర్ణన. ఆ కాలంలో ప్రత్యేక భావనలు ఇంకా పొడసూపలేదు. ‘ఆ వీరుని ఉత్సాహం వరహగిరి నుంచి యాదగిరి చుట్టు కదిరి వరకూ ప్రత్యక్షమై వేంచేసిన నరసింహదేవర హృదయం’ అన్న వర్ణనలో అడవి బాపిరాజు హృదయం స్పష్టమవుతుంది. యాదగిరి రెడ్డిని సమస్త తెలుగువారికి ప్రతీకగా నిలుపుతున్నాడని తెలుస్తుంది. అందుకే ‘నువ్వు తెలగా వీరుడవు’ అని అన్నా ఆయన ఉద్దేశం తెలుగు వీరుడనే అన్నది స్పష్టం.
యాదగిరి రెడ్డి భార్యపేరు బతుకమ్మ ‘బతుకమ్మ తెలుగునాటి బంగారు దేవత’ ఇక్కడ అడవి బాపిరాజు తెలంగాణ రైతు గురించి చేసిన వ్యాఖ్యాలు గమనార్హం. ‘తెలంగాణపు రైతును యెప్పుడూ యెవరో బాధిస్తూనే ఉన్నారు. అతడు తన బ్రతుకు రాజరికం చేసుకున్న రోజులు కాకతీయులతోనే వెళ్ళిపోయాయి. తురక ప్రభువులకు వంగి సలాములు చేసినా ఆనాటి యాదగిరి రెడ్డి ముక్కుపుటాలు విస్ఫారితం కావడం మానలేదు’ అని వర్ణిస్తూ యాదగిరి రెడ్డిని తెలంగాణ రైతుకు ప్రతీకగా, అతని స్ఫూర్తిని ఎట్టి పరిస్థితులకూ లొంగని తెలంగాణ రైతు స్పూర్తిగా నిలుపుతాడు అడవిబాపిరాజు.
‘శాతవాహనుల నాడు, చాళుక్యుల కాలంలో, కాకతీయుల దినాల్లో తెలుగునాడు పొలాల్లో ఏర్చి కూర్చుకున్న శరీర బలమూ, మనోబలము కరిగి కరిగి, తరిగి, తరిగి మరిగి మరిగి నాశనమైనా మధ్య వున్నా చాలైనా, చెక్కుచెదరకుండా నిలిచి ఉండటం చేత తనవంటి యాదగిరి రెడ్లు, తన భార్యవంటి బతుకమ్మలు యీనాటి విముక్తిలో సగర్వంగా నిలబడగల్గారు’ అని వ్యాఖ్యానిస్తాడు రచయిత. తనకు విముక్తి లభిస్తోందని యాదగిరి రెడ్డి ఆలోచిస్తుంటే అతని భార్య గర్భంలో మరో యాదగిరి రెడ్డి పెరుగుతున్నాడని అందమైన భవిష్యత్తును సూచిస్తూ ‘దూరాన యాదగిరి కొండపైన లక్ష్మీ నరసింహ స్వామి ‘ఓయి తెలుగువీరుడా, బహుపరాక్’ అని సింహగర్జన చేస్తున్నాడ’ని ‘నాగేటి చాలు’ కథను ఆశాభావంతో ముగిస్తాడు.
నేల:
‘నరసన్న పాపాయి’ కథలో ‘రుద్రేశ్వరం దేవాలయం’ కథకు ప్రధానకేంద్రం. ఇది తెలుగు ప్రాంతాలలో ఏ ప్రాంతానికి చెందిన కథ అయినా కావచ్చు. ‘జగ్గన్నగంటలు’ కథ ‘కొండపల్లి’ ప్రాంతానికి చెందినది. ఆధునిక తెలంగాణ పరిధి ప్రకారం ఇది విజయవాడకు దగ్గరగా ఉన్న ఆంధ్రప్రాంతం.
‘నేల’ కథలో సుబ్బన్న ‘హైదరాబాదు వీధుల్లో పెరిగాడు, హైదారాబాదు హోటళ్ళలో బల్లలు కడిగాడు. ‘చాలు’ అందించాడు. హైదరాబాదు రిక్షాలు లాగాడు. హైదరాబాదులో పేపర్లు ఇంటింటికి పంచాడు. ఈ కథలో మనకు అడవి బాపిరాజు దగ్గరగా చూసిన హైదరాబాదు, హైదరాబాదులో మనుషుల జీవన విధానం, వ్యక్తిత్వాలు, ప్రవర్తనలు తెలుస్తాయి.
‘నేల’ కథలో సుబ్బన్న బాధను హైదరాబాదులోని పలు ప్రాంతాల సహాయంతో వర్ణిస్తాడు. ’గోలుకొండ పోయేదారిలో పొలంలో నీ హృదయంపైన పండుకొని మా సుబ్బన్న వెక్కివెక్కి ఏడ్చిన సంగతి నీకు జ్ఞాపకం లేదూ! నీ మనస్సులో నిర్మలంగా ప్రత్యక్షం అయ్యే ఉస్మాన్ సాగరులోనా నీ సుబ్బన్న చచ్చిపోదామని దిగాడు?’
‘సుబ్బన్నకు ఉరూదూ తెలుగు, తెలుగు ఉరుదూ, తెలుగు కన్నడం, కన్నడం ఉరుదూ, ఉరూదూ కన్నడం, మహారాష్ట్ర కన్నడం, కన్నడ మహారాష్ట్రం, మహారాష్ట్ర ఉరుదూ, తెలుగుమహారాష్ట్రం, మహారాష్ట్ర తెలుగు, తెలుగు కన్నడ ఉరుదూ, ఉరుదు తెలుగు కన్నడం, తెలుగు కన్నడ ఉరుదు వగైరా వగైరా అన్ని భాషలు వచ్చు’ అనటంతో ఆ కాలంలో సర్వనదుల సంగమం లాంటి Hyderabad cosmopolitan nature అర్థమవుతుంది.
‘వడగళ్లు’ కథలో పతంజలి శాస్త్రి సుల్తాన్ బజారులో స్థిరపడతాడు. ‘హైదరాబాదుపై రాజకీయ వడగళ్ళ వాన కురవని పూర్వమే పంజాబులో, సింధులో నాశన దేవత బీభత్స తాండవం సలిపినది. నేడు హైదరాబాదుకు శాంతి రాగానే పంజాబు నుంచి, సింధు నుంచి కాందిశీకులై వచ్చినవారు కొంతమంది హైదరాబాదులో నివశించాడనికై భారతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని వర్ణిస్తాడు. అంతకుముందే కన్నడ, మహారాష్ట్రీయులతో సహవాసం, నిజాం పాలన అన్నీ కలిసి ‘నెల’ కథలో కన్నడ, ఉరుదూ, మహారాష్ట్ర, తెలుగు అంటూ వ్యంగ్యంగా చెప్పటానికి కారణం. భాషల పేర్లతో పలుభాషల సమ్మిశ్రితమైన హైదరాబాదు లక్షణాన్ని అడవి బాపిరాజు చూపించాడు.
బండరాళ్ళు:
‘బండరాళ్ళు’ కథలో ‘భోనగిరి రెడ్డి’ కమ్యూనిస్టు కాదు, కాంగ్రెసువాది కాదు. అతడు తెలంగాణా వీరుడు. అతడు ‘ఈనాటికి మా ఆవేదన ఈ రజకారు యుద్ధంగా పరిణమించి, తల్లీ ఈ చేతికొక ఖడ్గాన్ని ప్రసాదించు’ అని వేడుకుంటాడు. ‘నేడు తెలుగుజాతి నశించడమో, నిజమైన స్వాతంత్ర్య పథంలో విహరించడమో!’ అని అనుకొంటాడు. పోలీసు చర్యకన్నాముందు, అటు రజాకార్లు, ఇటు కమ్యూనిస్టులు, ఇంకోవైపు కాంగ్రెస్ వారి నడుమ నలుగుతూ స్వాతంత్రంకోసం ప్రాణాలొడ్డేందుకు సిద్ధమయిన సామాన్య తెలంగాణా ప్రజ గుండెఘొష ఇది.
ఈ కథలో అడవిబాపిరాజు రజకార్లు, కమ్యూనిస్టుల సాయుధ హింసాత్మక పోరాటాల వల్ల గాయపడిన తెలంగాణ హృదయానికైన గాయాన్ని ప్రదర్శిస్తాడు. ‘తెలంగాణ వీరుడా! బోనగిరి రెడ్డీ! నీ కళ్ళయెదుట నీ చెల్లెలికి మానభంగమైనది. ఆమె నూతిలో పడి చచ్చిపోయినది. నీ భార్య మానభంగం కాకుండా తన హృదయరక్తం జిమ్ముకుని చిమ్మగా పొడుచుకుని నేలవాలింది.
నీకు దేశం వదలి తక్కిన ఆంధ్ర సీమలకు పారిపోవడం ఇష్టం లేకపోయింది. నీ గ్రామం తగులబడిపోయినా, నీ పంటలు మంటగలిసినా, నీవాళ్ళ బ్రతుకులు కూలిపోయినా, అటు గాంధీజీ మాటో, ఇటు నీ నాయకుల గర్జనో, ధైర్యసాహసాలై ఈ అడవుల్లో, ఈ బండరాళ్ళ మధ్య ఈ ఎండిపోయిన సెలయేళ్ళ ఇసుకలలో నింపుకొన్నవి.
రజకార్లను ఎదిరించినావో, రాక్షసులను హతమార్చినావో, సహాధర్మచారిణిని పోగొట్టుకున్న ఒంటి సింహానివై పొదలలో, గుట్టలలో కదలాడుతూ విదిలించిన కేసరిలా నడిరేయిని విరోధి శిబిరాలు దద్దరిల్లేట్టు గర్జనచేస్తూ నిలుచుండినావు’ అంటూ ఆ కాలంలో ఛిన్నాభిన్నమై, అత్యాచారాలకు గురైకూడా ధైర్యంగా నిలచి పోరాడిన తెలంగాణ శౌర్య ప్రదీప్తిని వర్ణిస్తాడు అడవిబాపిరాజు. ఈనాడు కొందరు అడవిబాపిరాజు వలసవాది అని వ్యాఖ్యానించవచ్చు. కానీ, తెలంగాణా స్వస్థలంగావున్న రచయితలకేమాత్రం తీసిపోనివిధంగా తెలంగాణా గుండెచప్పుడును, మనసుమాటను అడవిబాపిరాజు ప్రదర్శించాడు. మనసున్న మనుషుల మనస్సుల నడుమ ఎలాంటి అడ్డుగోడలుండవని తన రచనలద్వారా నిరూపించాడు మన”సు”రాజు అడవి బాపిరాజు.
తెలంగాణాలో పోలీసు ఏక్షన్ జరిగిన తరువాత వ్యక్తుల స్థితినీ వర్ణించాడు అడవి బాపిరాజు .
‘ఓ బోనగిరి రెడ్డీ ఇటు కమ్యూనిస్టులు నీవు ఎరుగని ఊహించలేని నాశనపూరితమైన దౌర్జన్యాన్ని రేకెత్తించి తెలుగునాడును దగ్దపటలం చేస్తారేమోనన్న భయమూ ఆవరించింది.
అటు కాంగ్రెసు బురఖా ధరించుకొన్న దొంగలు, దోపిడీగాండ్రను, దేశముఖులు, కౌలుదార్లు ఈ నలుగురూ పూజ్యుడైన బాపూజీ పవిత్ర సత్యవ్రతాన్ని హింసను ఎరజేసి తెలుగునాటి ప్రజల బ్రతుకులను ఎడారి మారిచేస్తారేమోనన్న అనుమానము కలిగింది’ ఇంత నిష్పక్షపాతంగా, ఎలాంటి రంగుటద్దాలు లేకుండా తెలంగాణా స్థితిని అడవిబాపిరాజు వర్ణించాడు.
‘నీ ఆస్తి తెలంగాణాకు పాత గొంగళి. నీ పాస్తి అడవులలోని సీతాఫలపు పళ్ళు’ అని బోనగిరి రెడ్డి స్థితిని వర్ణిస్తాడు అడవి బాపిరాజు.
వరంగలు బజారులో అతనికి ఓ ఒంటరి తెలుగునాటి స్త్రీ పరిచయం అవుతుంది. ‘నేనెవర్నని చెప్పను అయ్యా? నేనెవర్నో! నాకు యాదుండేది? నా మగణ్ణి చంపినారు నన్ను చెరిచినారు. బాదినారు. నేను పెయి తెలియక పడిపోయి, కండ్లు తెరిచేసరికి మావూరు మండిపోబట్టింది. నేను చావక మిగిలినా నా వూరు నాకు యాదిలేదు ఏదో తెరచాటు. ఈ వూరూ ఆ వూరూ బిచ్చమడిగి, ఈ కాయతిని ఆ నీరు త్రాగి ఈడను వచ్చినా. నీ బాంచను కాలు మొక్కుతా!’ ‘నువ్వెవరు?’ ప్రశ్నకు సమాధానం ఇది.
ఆమె బోనగిరి రెడ్డి వివాహం చేసుకుంటారు. వారి జీవితంలో నూతనయుగం ప్రవేశించిందనటాన్ని సూచిస్తూ ’రెండు వందల సంవత్సరాల నాటి కాలము వెనుక వేసుకొని నూత్న సౌందర్యము అలంకరించుకొన్న ఓ తెలుగునాటి స్త్రీ ఎండిపోయిన నీ దేహ సౌష్టవ సౌందర్యము నూతనార్ద్రత సముపార్జించుకొని నీ కాలి ముందర సెలయేరు కొత్త నీటి ప్రవాహాల నిండి నీ తెలుగునాడు ఇటు తూర్పు తీరము అటు మంజీర తీరాలు దాటి నీ తెలుగురెడ్డి బ్రతుకుని పాలసముద్రము చేస్తుందా?’
తెలంగాణ చరిత్ర, జీవితము, వంటి విషయాలపై ఎంతో లోతైన అవగాహన, ఆలోచన, అనుభూతి ఉన్న రచయిత మాత్రమే ఇలాంటి వర్ణన చేయగలడు. తెలంగాణ ప్రజలు అనుభవించిన అత్యాచారాలు, కార్చిచ్చు పాలైన వారి జీవితాలు ఆ బూడిద నుంచి మళ్ళీ చిగురించటాన్ని అడవి బాపిరాజు ఏ స్థానిక తెలంగాణా రచయితకు తీసిపోనివిధంగా తన రచనలలో చూపించాడు. సరిహద్దులు మనుషుల నడుమ గీతలు గీయగలవేమో కానీ మనసుల స్పందనల స్వరూపానికి ఎలాంటి ఎల్లలులేవని అడవిబాపిరాజు కథలలో ప్రదర్శితమయిన తెలంగాణా స్వరూపం నిరూపిస్తుంది.
వడగళ్ళు’:
‘వడగళ్ళు’ కథ పూర్తిగా తెలంగాణ కథ. నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యానంతరం వరకు తెలంగాణ జీవితంలో వచ్చిన మార్పులను పతంజలి శాస్త్రి జీవితం ద్వారా రచయిత ప్రదర్శించిన తీరు పరమాద్భుతం.
పతంజలి శాస్త్రి జీవితమంతా వడగళ్ళ వానే. పతంజలి శాస్త్రికి విరోధులే లేరు. అమాయక సగటు తెలంగాణ ప్రజకు అతడు ప్రతీక. తనని హింసించిన రజకార్లను సైతం అతడు ద్వేషించడు. వరంగల్లులో చదువుకుంటుంటే, తండ్రి చనిపోవటంతో ‘జనగామ’ వచ్చి చేరతాడు. ‘ఆంధ్రమహాసభ’లో చేరతాడు అది చీలికలవుతుంది. గాంధీ పూజా నిరతుడు కాబట్టి కోటి ఆంధ్ర మహాసభలలో చేరతాడు. రాష్ట్రకాంగ్రెసు సత్యాగ్రహం ఆరంభమైతే కుటుంబాన్ని వదలి సత్యాగ్రహంలో చేరతాడు. మళ్ళీ కాంగ్రెసులో వేరు వేరు పక్షాలు ఏర్పడతాయి. పొలం కౌలుకి ఇచ్చి సుల్తాన్ బజారు చేరతాడు. చిన్నవ్యాపారం ఆరంభిస్తాడు. పాన్‍బీడా షాపు పెడతాడు. కాంగ్రెసులో చీలికలు, ముఠాలను చూస్తాడు. హైదరాబాదు వచ్చిన కాందిశీయులను కలుస్తాడు. వారికి సహాయం చేస్తాడు. ఇలా సాగుతుంది కథ. స్వాతంత్ర్యంతర తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాదును అడవి బాపిరాజు ఎంతో ఆప్యాయంగా, అతి దగ్గరగా, సజీవంగా చూపుతాడు. .
అయితే పలు కారణాల వల్ల, కథలను చూసే దృష్టి సంకుచితం, హ్రస్వం అవటం వల్ల , మౌలికంగా, అధ్యయనం, పరిశోధనలు తగ్గటం వల్ల అడవి బాపిరాజు ప్రదర్శించిన ‘తెలంగాణ’ విస్మృతిలో పడింది. పరిశీలించి చూస్తే అతని నవలల్లో ద్యోతకమయ్యే దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయల భక్తి, ధార్మిక అనురక్తి, జీవన విధానం పట్ల సానుభూతి అవగాహనలు అతని కథల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అత్యంత ఆనందాన్నీ, అవగాహననూ కలుగ చేస్తాయి. దేశభక్తి భావనలు కలుగచేస్తూ, సామాన్యులలోని అసామాన్య శక్తి స్వరూపాన్ని ప్రదర్శిస్తాయి.
ఈ వ్యాసం సంపూర్ణము, సమగ్రము ఏమాత్రం కాదు. అందుబాటులో వున్న అడవి బాపిరాజు సాహిత్యంలోంచి ‘తెలంగాణ’ ప్రస్తావనను మాత్రమే ఎత్తి చూపిస్తుందీ వ్యాసం. నిజానికి అడవి బాపిరాజు సాహిత్యం గురించి, రచనశైలి గురించి, ఆలోచనలు, తాత్త్వికతల వంటి విషయాల గురించి ఎంతో లోతుగా పరిశీలనలు, అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది. అందుకు ఈ వ్యాసం నాందీ ప్రస్తావన కాగలదన్న ఆశతో, అడవి బాపిరాజు రచనల్లో స్పృశించని అనేకానేక అంశాలున్నయన్న స్పృహ కలిగించే ఉద్దేశ్యంతో విహంగ వీక్షణం లాంటి ఈ వ్యాసరచన సాహసం సాధ్యం అయింది.