Site icon Sanchika

అడవికాచిన వెన్నెల

[dropcap]ఆ[/dropcap]కాశం కమలాపండుని
పడమటి రాకాసి పట్టిమింగేసిన
మలి సంధ్యా సమయానికి
అడవి కొంగుచాటున
దాక్కున్న ఆ సరస్సు పైకి
చీకటి తన నల్లటి ముసుగును
వలలా విసిరి వంటి నిండా కప్పేసింది

అనంతమైన ఆ పైకప్పుని
మెల్లమెల్లగా సద్దుచేయకుండా
అంచులదాకా అలుముకుంది
వెండి వెలుగుల జాతర

నింగి నుండి ఎప్పుడు జారిందో
నేలపైని సరస్సులోకి ఎలా చేరిందో
అలలు అలలలుగా
వెలుగుల్ని ప్రవహిస్తోంది
నీటి అద్దంపై ప్రతిఫలిస్తోన్న
పచ్చపువ్వులాంటి పండు వెన్నెల

చుక్కేసుకున్నాడేమో
చూడచక్కని చంద్రుడు
చుక్కలన్నింటినీ వెంటబెట్టుకుని
చడీచప్పుడులేకుండా
చక్కగా దూకేసాడు సరస్సులోకి
సరిగంగ స్నానాలకో
మరి సరసాల సరాగాలకో

తేలియాడుతున్న ఆకులపై వాలి
పగలంతా వలపుల తలపుల
గుసగుసలుపోతూ
సిగ్గులమొగ్గలైన కలువకన్నెలన్నీ
సరస్సును జేరిన చంద్రుని
సరసన జేరి
సయ్యాటకు మేం సిద్ధమంటూ
సిగ్గువిడిచి తమ
వలువరేకులు విచ్చుకుంటున్నాయి
పువ్వులుగా నవ్వుకుంటున్నాయి

ఎంత అందమో ఈ సుందరదృశ్యం?
అయితేనేం…
అది అడవిని కాచిన వెన్నెలేగా!
అవును, అది అడవికాచిన వెన్నెలేగా!!

Exit mobile version