[బాలబాలికల కోసం ‘అడవిలో ఆలోచనలు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
[dropcap]సిం[/dropcap]హపురి రాజావారు అజేయవర్మ సుపరిపాలన చేస్తూ ప్రజల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మంత్రుల సలహాలే కాక సింహపురి తూర్పున ఉన్న చిక్కటి హరిత వనంలో పర్ణశాల నిర్మించుకుని తపస్సు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే సుమంతు మహర్షి సలహాలు అడవికి వెళ్ళి తీసుకుని పాటించి మరింత మంచి పరిపాలన ప్రజలకు అందిస్తున్నాడు.
ఒకరోజు అజేయవర్మ మంత్రి ఈ విధంగా రాజుగారికి సలహా ఇస్తూ, “రాజా మనకు మంచి సలహా కావలసివచ్చినపుడు మహర్షి సుమంతుని కొరకు అడవికి వెళ్ళే బదులు ఆయననే మన రాజధానికి రప్పించి మంచి వసతి ఏర్పాటు చేసి ఇక్కడే మంచి సలహాలు తీసుకుంటే మనకు ప్రతిసారీ అడవికి పోయే శ్రమ తప్పుతుంది. ఆయనకు ఎంతో బాగుంటుంది ఆలోచించండి” అని చెప్పాడు.
“మంత్రీ మీరు చెప్పిన సలహా బాగుంది. రేపే ఇద్దరం వెళ్ళి మహర్షి వారికి మన ఆలోచన చెబుతాం” రాజు గారు చెప్పారు.
మంత్రి రాజుగారు ఇద్దరూ కలసి సుమంతుడిని కలసి, “మహానుభావా తమరు ఈ అడవిలో ఒంటరిగా ఉండి మాకు సలహాలు ఇస్తున్నారు. మీరు నగరానికి వస్తే మంచి వసతి ఏర్పాటు మంచి సాత్విక ఆహారం, సేవకులను ఏర్పాటు చేస్తాం. అక్కడ మీ ప్రవచనాలకు సకల ఏర్పాట్లు చేస్తాం, మీకు ఏ లోటు ఉండదు” అని చెప్పారు.
సుమంత మహర్షి చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు.
“అడవుల్లో మాబోటి వాళ్ళెందుకు ఉంటారో తెలుసా? అడవుల్లో చిక్కగా ఉన్న చెట్ల వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. తద్వారా మెదడుకు మంచి ప్రాణ వాయువు లభించి మంచి సృజనాత్మకమైన ఆలోచనలు వస్తాయి. అదిగాక పక్షుల కిలకిలలు ఆకుల గలగలలు మనస్సును ఆహ్లాదంగా ఉంచుతాయి. ఆకుల వాసన, పూల వాసన ఎంతో హాయిని ఇస్తాయి. దీని వలన మెదడు మరింత చురుగ్గా పనిచేసి మీకు ఉత్తమ సలహాలు ఇవ్వగలను. వీటన్నిటినీ మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఒక వారం రోజుల తరువాత మీ ఆస్థాన గాయకుణ్ణి తీసుకు వచ్చి అతను పాడే పాట ఇక్కడ ఈ ఆహ్లాద వాతావరణంలో వినండి. ఆస్థానంలో వినేదానికన్నా ఎంత శ్రావ్యంగా ఆ పాట వినబడుతుందో చూడండి” అని వివరించాడు సుమంత మహర్షి.
“మా ఆస్థాన గాయకుడితో రేపే వస్తాము” అని చెప్పి నమస్కారం పెట్టి కొన్ని పండ్లు ఇచ్చి వెళ్ళి పోయారు.
చెప్పిన విధంగా రెండో రోజు గాయకుడితో వచ్చారు రాజు మంత్రి. ఆ పర్ణశాల ముందర గాయకుడు ఆ పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో పాడుతుంటే రాజు మంత్రి శరీరాలు పులకించాయి. పాట ఆస్థానంలోకంటే ఎక్కవ శ్రావ్యంగా వినబడింది. రాజు సుమంతునికి నమస్కరించి “మీరు చెప్పింది నిజం మహర్షీ” అని ఆనందంగా చెప్పారు.
“ఇక్కడి పచ్చదనం, స్వచ్ఛమైన ప్రాణవాయువు మెదడును ఉత్తేజపరుస్తాయి. తద్వారా సృజనాత్మకత, మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే నగరాల్లో కూడా చెట్లు పెంచి పచ్చదనం నింపితే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, ఆలోచించండి” చెప్పాడు సుమంత మహర్షి.
“మీరు అడవిని గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మేము మీరు చెప్పిన సలహాలు ఖచ్ఛితంగా పాటించి మన రాజ్యాన్ని పచ్చని నందనవనంగా మారుస్తాము” అని నమస్కరించారు రాజు, మంత్రి.
“ఇదుగోండి ఈ మొక్కను కోటలో నాటండి” అని చెప్పి దేవదారు వృక్షం మొక్క ఇచ్చాడు.
“మహాప్రసాదం” అంటూ మొక్కను తీసుకుని ధన్యవాదాలు చెప్పి రాజధానికి బయలుదేరారు అజేయవర్మ, మంత్రి.