అడవిలో వరహాలు

0
3

[dropcap]సూ[/dropcap]ర్యుడు రాత్రి తాను పడుకున్న చోటు నుండి బయలుదేరి పరుగు పరుగున గూడెం వైపుకొస్తున్నాడు. ‘నాకేటి హద్దులు, నన్నెవరు ఆపేటోళ్ళు’ అన్నట్లు దూసుకుంటు అందరి ఇళ్ళలోకి తొంగిచూస్తున్నాడు. అవి అసలు పెద్ద ఇళ్ళేమీ కావు. కొన్ని మట్టి మిద్దెలు, మరికొన్ని పూరిగుడిసెలు. వేలిముద్రలేగాని చేతివ్రాత తెలియని అమాయకులు ఆ గూడెంలో వాళ్ళంతా. పట్టుమని యాభై ఇళ్ళుంటాయి ఆ తండాలో. ఇలాంటి ఊళ్ళను చూసినపుడు ‘ఒకప్పుడు రత్నాలు, మణులు రాశులుగా పోసి అమ్మిన స్వర్ణభూమి ఇదేనా?’ అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యాభై ఇళ్ళకి దూరంగా ఒక గిలకలేని మోటుబావి. ఊరివాళ్ళంతా పాతాళంలో ఉన్న తమ నీడలను చూసుకుంటూ నీళ్ళు తెచ్చుకోవలసిందే. ఇళ్ళ ముందు కోళ్ళు, మేకలు, గేదెలు, ఆవులు తమ స్వేచ్ఛా సామ్రాజ్యం ఇదే అన్నట్లు తిరుగుతూ ఉంటాయి. తండాని ఆనుకుని పెద్ద అడవి. అడవిలో దొరికే పూలు, పండ్లు, ఆకులు బస్తీలో అమ్మితేనే గూడెంవాళ్ళకు నాలుగు వేళ్ళు నోట్లోకెళ్ళేది. తండాని నాగరికతకు దూరంచేస్తూ కొంచెం దూరంలో కృష్ణ కాలువ. వరద వచ్చినపుడు కృష్ణ ప్రళయరూపం చూపిస్తూ తండాని మింగేద్దామని గుడిసెల దాకా వస్తుంది. కానీ గుడిసెలోని పేదరికాన్ని చూసి జాలిపడి వెనక్కి తగ్గుతుంది. వరదకు భయపడి ఊరకుక్కలు గుడిసెల క్రిందికి చేరతాయి. పాము గుడిసెలో దూరి మూల ఒత్తిగిల్లుతుంది.

ఎన్ని ఇబ్బందులు చవిచూసినా, గూడెం అన్నా, అడవి అన్నా ప్రాణం సాంబయ్యకు. ఒక్కగానొక్క కొడుకు వరహాలుని భుజంమీద ఎక్కించుకుని ఆవులు, గేదెలు తోలుకుని అడవికెళ్ళడం, వాటికి కడుపార గడ్డి తినిపించి, చీకటి పడేవేళకు ఇల్లు చేరడం, ఇదే సాంబయ్య జీవితం. “ఛీ… ఛీ…. మనదీ ఒక బతుకేనయ్యా? అడవిలో పులి ఎప్పుడు మీద పడుతుందో తెలీదు. ఏ పాము కాటేస్తుందో తెలీదు. కంచంలోకి కమ్మటికూర ఎరిగున్నామయ్యా ఎప్పుడైనా? కనీసం వరహాలునైనా బడికి పంపి చదివిద్దాం” అంటుంది సాంబయ్య భార్య రాములమ్మ. వరహాలు బాగా చదువుకుని పట్నంలో దొరలా బతకాలని రాములమ్మ కోరిక. “చదివి ఏం చెయ్యాలి? ఉజ్జోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా? బస్తీ మాత్రం పాపం ఎంతమందిని మోస్తుంది?” అంటుంటాడు సాంబయ్య.

వరహాలుకు గూడెంలోని మనుషులన్నా, అడవిలోని జంతువులన్నా వల్లమాలిన ప్రేమ. వాడు సాంబయ్యకు నీడలాంటోడు. మాలచ్చుమ్మ జాతర వచ్చిందంటే పట్నం నుండి చారల చొక్కా, లాగు తెచ్చి కొడుక్కి వేసి మురుసుకుంటాడు. ముందు వరహాలు ‘హోయ్… హోయ్’ అంటూ ఆవుదూడలను తరుముతుంటే, వెనుక అన్నం మూట తగిలించుకుని తను అనుసరించేవాడు. మిట్టమధ్యాహ్నం పిల్లకాలువలో దిగాలనిపిస్తుంది వరహాలుకు. వాడి మొలతాడుకు తాడు కట్టి, దాన్ని పట్టుకుని ఒడ్డున కూర్చుంటాడు సాంబయ్య. వరహాలు నీళ్ళను కొడుతుంటే ఆ నీళ్ళు చింది వాడి మొహం మీద పడుతుంటే, వాడి సంతోషంలో వెయ్యి వరహాలు కనబడేవి సాంబయ్యకు. వాడి కాళ్ళు నొప్పెడతాయని భుజంమీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు. వారానికొకసారి బస్తీకి వెళ్ళి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అమ్మి కావలసినవి కొనుక్కొచ్చేవాడు. బస్తీకి వెళ్తూ ముందు సైకిల్ మీద కొడుకుని కూర్చోబెట్టుకుని, వెనక కూరగాయల గంపలు కట్టుకుని వెళ్ళేవాడు. “నువ్వు వాడిని బాగుపడనీయవయ్యా! అడవిలో జంతువులా మనం బతికాం. వాడిని కూడ అట్టాగే తయారుచేస్తే నేనొప్పుకోను” అంటూ రాములమ్మ రోజూ ఇంట్లో సంతజేసేది. మేకపిల్లకు గడ్డికొసరి కొసరి తినిపించేవాళ్ళు. ఒక్కరోజు ఆవుదూడ నీళ్ళు సరిగా తాగకపోయినా విలవిల్లాడేవాళ్ళు తండ్రి, కొడుకు. అడవిలో ఆవులను మేతకు వదిలి పక్షుల కోసం గింజలు విసిరేవాడు. కాకులన్ని గుంపుగా వచ్చి కావు కావుమంటూ మరిన్ని కాకులను ఎలుగెత్తి పిలిచేవి. వరహాలు వేసే అన్నం మెతుకుల కోసం అతని చుట్టూ ప్రదిక్షణలు చేసేవి. అడవిలో కోసుకొచ్చిన పండ్లు కొన్ని కోతులకు పడేసి మిగిలినవి అమ్ముకుంటాడు సాంబయ్య.

గూడెంలో ఎవరికన్నా పాము కరచినా, జరమొచ్చినా సాంబయ్య ఆకుపసరుతో కషాయం ఇచ్చాడంటే తగ్గిపోవలసిందే. “సాంబయ్యన్నా! నా కూతురుకి నిన్నటినుండి ఒకటే జ్వరం. ఒక పాలొచ్చి చూసిపో సాంబయ్య అనో, సాంబయ్య ఆవుదూడకు పాముకరిచింది తొందరగా రా” అంటూ సాంబయ్యను ఓ డాక్టర్‍లా పిలుస్తుంటారు. “నా మొగుడేమన్నా డాక్టరా? మందు లేదు, మాకు లేదు వెళ్ళండెళ్ళండి” అని రాములమ్మ కసురుకుంటుంది. బస్తీకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాల్సిందే తప్ప బస్సులేమీ లేవు. దాంతో ఏ చిన్న సమస్య వచ్చినా అందరు సాంబయ్య దగ్గరకు పరుగెత్తుకొస్తారు. వరహాలుకు అడవి అంతా పరిచయం అయింది. “అడవిలో లోపలికి వెళ్ళబాకయ్య. అక్కడ కోసుదూరం లోపలికెళితే సంజీవయ్య కొండ ఉందట. అక్కడ రకరకాల చెట్లతోబాటు మొగలి పొదలు, సంపెంగ పొదలు ఉంటాయట. వాటిని చుట్టుకుని పెద్ద పెద్ద పాములు పడుకుని ఉంటాయట. అక్కడి చెట్ల ఆకులతో కషాయం తాగితే ఎటువంటి రోగమైనా ఇట్టే మాయమవుతుందని మా తాత చెప్పేవాడు. ఆంజనేయుడు లక్షణస్వామిని బతికించింది ఈ కొండమీది మూలికలతోనట. పొరపాటున కూడా అటువైపు వెళ్ళబాకు. ఆ పాములు చాలా ప్రమాదం” అని పదే పదే చెప్పేవాడు సాంబయ్య కొడుకుతో.

తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూసి మురిసిపోతూ, కాలం ఓ పదేళ్ళు దూసుకెళ్ళింది. “ఊళ్ళో పిల్లలందరికీ పెళ్ళిళ్ళవుతున్నాయ్. మనోడికెవరిస్తారయ్యా పిల్లని?” అన్నది రాములమ్మ. “ఎందుకియ్యరే? వాడికేం తక్కువ? ఎన్నలాంటి మనసు” అన్నాడు సాంబయ్య. “అవును మరి ఎందుకియ్యరు? నువ్వు, వాడు ఆఫీసర్లయ్యె” అంది ఎగతాళిగా రాములమ్మ. ఏ ఆకు కట్టు కడితే గాయం మానుతుందో, ఏ కషాయం తాగితే జరం నయమవుతుందో తండ్రి దగ్గర నేర్చుకున్నాడు వరహాలు. డిగ్రీలు చదివి, పరిశోధనలు చేసినా రాని జ్ఞానం ప్రకృతి నుండి నేర్చుకున్నాడు. తండ్రి, కొడుకులు కలిసి అడవిలో రకరకాల ఆకులు, కాయలు కోసుకొచ్చి, గూడెంలోని జంతువులకు, మనుషులకు నయం చేస్తున్నారు. సాంబయ్య బాధ్యత అంతా వరహాలుకు అప్పజెప్పి తాను తోడుగా వెళ్తుంటాడు.

ఓ రోజు సాంబయ్య, వరహాలు అడవికి బయలుదేరారు. ఇంతలో ప్రక్క బజార్లో ఉండే సుందరం పరుగెత్తుకొచ్చాడు. “నిన్న నువ్విచ్చిన ఆకుగోలీతో చంద్రమ్మ జరం తగ్గలేదు వరహాలు. ఒళ్ళు పెనంలా కాలిపోతుంది. ఏం చెయ్యాలో తోచట్లా? పక్కింటి గోపయ్యకు కూడా జరమట. మంచంలో ఒకటే మూలుగుడు. ఏం చేద్దాం సాంబయ్యన్నా?” అన్నాడు. “అయ్యో తగ్గలేదా? ఉండు” అని లోపలికెళ్ళి ఏవో పువ్వులు తెచ్చిచ్చాడు వరహాలు. “ఇవి కషాయం చేసి తాగించు. రేప్పొదుటికి తగ్గిపోతుంది. ఇది చాలా మంచి మందు. కొన్ని గోపయ్యకు కూడా ఇచ్చి తాగమను” అన్నాడు. “ఏం తగ్గుతుందో ఏమో, పట్నంలో కూడా అందరికీ ఒకటే జరాలంట. జనం ఇంట్లోంచి బయటకు రావట్లేదట. డాక్టర్లకు కూడా లొంగడం లేదట” అన్నాడు సుందరం. “ఇది వాడి చూడు మావా తగ్గుతుంది” అన్నాడు వరహాలు.

తండ్రి, కొడుకులిద్దరు అడవికి వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దునకు సాంబయ్య కూడా జ్వరమొచ్చింది. మూసిన కన్ను తెరవలేదు. వరహాలు తనకు తెలిసిన వైద్యం అంతా చేశాడు. ఊళ్ళో మిగిలినవాళ్ళకు కూడ తగ్గిన సూచనలు లేవు. పట్నం వెళ్ళాలన్నా కష్టమే. వెళ్ళినా ఏ డాక్టరు దగ్గరకెళ్ళాలి? ఎవరిని అడగాలి? పట్నవాసుల పరిస్థితి కూడ అలాగే ఉంది. తండ్రిని చూస్తుంటే వరహాలు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏనాడైనా జలుబు కూడా చేసి ఎరగదు. “దేవుడా! ఏదో దారి చూపించు” అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. గూడెంలో వాళ్ళందరికీ కాళ్ళు, చేతులు ఆడడం లేదు. అమ్మోరికి కోపం వచ్చిందని నైవేద్యాలు పెట్టారు. కొబ్బరికాయలు కొట్టారు. ఏమాత్రం ఫలితం లేదు. ఆ రోజు మామూలుగా ఆవులను మేతకు తోలుకెళ్ళాడు వరహాలు. చెట్టు క్రింద కూర్చున్నాడు. కళ్ళముందు మంచంలో మూలుగుతున్న నాన్న కనిపిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ఎలా… ఎలా? ఆలోచిస్తు కూర్చున్న వరహాలుకు చటుక్కున నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది.

అదే ‘సంజీవయ్య కొండలో ఆకులు అన్నీ మూలికలేనట, మా తాత చెప్పేవాడు’ అనడం చటుక్కున మెదిలింది వరహాలు మనసులో. ఆవులను అక్కడే వదిలేసి అడవి లోపలికి దారిపట్టాడు. క్రోసు దూరం పరుగెత్తుకుంటూ, రెక్కలుంటే ఎగరచ్చన్నంత ఆత్రంగా చేరుకున్నాడు. అది ఎక్కడుందో సరిగ్గా తెలీదు. మిట్టమధ్యాహ్నం వేడి సూటిగా మొహానికి కొడుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. పట్టించుకోలేదు వరహాలు. ఎలాగైనా నాన్నను గూడెం వాళ్ళను కాపాడాలి అనుకున్నాడు. కొంతదూరం పరుగెత్తాక కమ్మటి సంపెంగ పూలవాసన ముక్కుపుటాలకు సోకింది. ఆశ్చర్యం, ఆనందంతో అతనిలోని భయం మటుమాయమైంది. మరో పది అడుగులు వేశాడో లేదో అక్కడ రకరకాల రంగురంగుల మొక్కలు, చక్కటి సెలయేళ్ళు, వాటిలో వికసించిన తామరలు, నెమళ్ళు నాట్యమాడుతూ తిరుగుతున్నాయి. చెట్లన్నీ పండ్లతో, పూలతో నిండిపోయి ఇంద్రుడి స్వర్గం ఇదేనేమో అనిపించింది అతనికి. మొగలి, సంపెంగ పూవుల వాసనకు శరీరం మైకం కమ్ముతోంది. ఇదే నాన్న చెప్పిన సంజీవకొండ. ఆంజనేయుడు కొండ మొత్తం ఎత్తుకుపోయి లక్ష్మణస్వామిని కాపాడాడట. ఇక్కడ నాకు కావలసిన మూలిక దొరుకుతుంది అనుకుంటూ చుట్టూ గమనించాడు.

మొగలిపొదలో నల్లతాచు చుట్టలు చుట్టుకుని పడుకుని వుంది. దానికి కొంచెం పక్కగా ఓ చెట్టు ఆకులు పట్టుకుచ్చులా మెరుస్తూ, సూర్యకాంతితో కలిసి రంగు రంగులుగా మెరుస్తున్నాయి. బహుశా ఇవే లక్ష్మణస్వామిని కాపాడి ఉంటాయి అనుకున్నాడు. గబగబ ఆకులు కోసుకుని ఉత్తరీయంలో మూటగట్టుకున్నాడు. అవి మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉన్నట్లు గమనించాడు వరహాలు. వెంటనే బయలుదేరి ఇంటిదారి పట్టాడు. అడవిలోని జంతువులు, పక్షులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి ‘వరహాలు తమని పట్టించుకోకుండా ఎందుకలా వెళ్ళిపోతున్నాడ’ని. ఇంటికి చేరుకునేసరికి రాములమ్మ ఏడుస్తూ కూర్చుంది. “వరహాలు! మీ నాన్న పిలిస్తే పలకడం లేదయ్యా” అంది. “ఏం ఫర్వాలేదమ్మా నువ్వేడవకు” అంటూ ఆ ఆకులతో కషాయం చేసి తండ్రి చేత తాగించాడు. కొన్ని ఆకులు నూరి తలమీద పట్టీలా వేశాడు. “ఇంకేం ఫర్వాలేదమ్మా నాన్నకు తగ్గిపోతుంది” అన్నాడు. గూడెంలో మిగిలిన వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి గబగబా వైద్యం చేశాడు. ‘అందరినీ కాపాడమంటూ’ కనబడని దైవానికి మొక్కుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడే సాంబయ్యకు జ్వరం తగ్గి కళ్ళు తెరిచాడు. “అయ్యా వరహాలు! మీ నాన్న లేచాడయ్య, జరం తగ్గింది” అంటూ సంబరపడింది రాములమ్మ. “నాన్నా… నాన్నా… చూడు కళ్ళు తెరువు” అని పిలిచాడు తండ్రిని. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సాంబయ్య. జ్వరం తగ్గిన ఆనందం, తన కొడుకులో ఒక గొప్ప పరిశోధకుడిని చూసిన గర్వం సాంబయ్య ముఖంలో కలబోతగా కనిపించాయి.

ఇంతలో సుందరం గబగబ అక్కడికి వచ్చి “వరహాలూ! చంద్రమ్మకి, గోపయ్యకి జరం తగ్గింది. ఎంత ఆశ్చర్యంగా, ఓ అరగంటలో తగ్గిపోయింది. సాంబయ్యా! ఈరోజు నీ కొడుకు తెలివితేటలతో ఇంతమందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ విషయం బస్తీకి వెళ్ళి డాక్టర్లకు, ఆఫీసర్లకు చెప్పొస్తా” అన్నాడు సుందరం.

“నిజమే సుందరం! కానీ ఇదంతా నా గొప్పతనమేమీ కాదు. అడవిలో మనకు తెలియని కల్పవృక్షాలెన్నో ఉన్నాయి. అవన్నీ మనకు దైవప్రసాదాలు. ఈ మందు అందరికీ ఉపయోగపడితే అంతకన్నా కావలసిందేముంది” అన్నాడు వరహాలు. నవ్వుతూ తలూపాడు సాంబయ్య.

వెంటనే సుందరం బస్తీకి వెళ్ళి ఈ విషయాన్ని ఋజువుతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు. వెంటనే ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళి, ఇలాంటి ఔషధమొక్కలను ఇంటింటా పెంచాలనీ, వాటి ప్రాధాన్యతను, వరహాలు సాధించిన విజయాన్ని అందరికీ ప్రచారం చేసింది. ఇంతగొప్ప విషయాన్ని కనుగొన్నందుకు అతన్ని అభినందిస్తూ గొప్ప పారితోషికాన్ని ప్రకటించింది. ఏదన్నా పట్నంలో వ్యాపారం చేసుకోమని సూచించింది. కానీ ‘అడవులోని జంతువులను, పక్షులను వదిలి రాలేన’ని చెప్పేశాడు వరహాలు. ‘నా కొడుకు అడవికి రారాజు’ అన్న సాంబయ్య మాటలు గుర్తుచేసుకుంటూ కొడుకు గొప్పతనాన్ని కళ్ళారా చూసుకుంటూ మురిసిపోయింది రాములమ్మ. తాము కూడ వనసంరక్షణకు కృషిచేయాలని గూడెం వాళ్ళంతా నిర్ణయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here